[శాస్త్రీయ సంగీతంను పరిచయం చేస్తూ డా. సి. ఉమా ప్రసాద్ అందిస్తున్న ప్రత్యేక వ్యాసపరంపర..]
అధ్యాయం1 సంగీత మహత్మ్యము
[dropcap]సం[/dropcap]గీతమునకు పరమ శివుడు ప్రీతుడగుచున్నాడు. శ్రీకృష్ణుడు స్వయంగా వేణువును వాయించుచూ సకల లోకములకు తన్మయతను ప్రసాదించెను.
శ్రీ శారదాంబ తన విపంచీ వీణచే పార్వతిని అలరించి యుండుట విదితమే. నారద గురుస్వామి తన ‘మహతి’ అను వీణను వాయించుట విదితము. తుంబురుడు తన గానము చేత దేవతలను అలరించుట లోకవిదితము. పరమశివుడైన నటరాజు నాట్యమొనర్చుట ప్రసిద్ధమే. విష్ణుని వీణ (సారంగి), రుద్రుని వీణ – రుద్రవీణ గంధర్వుల గానమున ప్రసిద్ధులు.
శ్లో.
శిశుర్వేత్తి పశుర్వేత్తి। వేత్తి గానరసం ఫణిః॥
శిశువైన కుమారస్వామి, పశువైన నందీశ్వరుడు, పరమేశ్వరుని కంఠమున భూషణములైన సర్పములు పరమేశ్వరుని గానమున రమించుచున్నవి.
ఉయ్యాల యందు గల బాలబాలికలు, సంగీతమునకు ఆనందించుచున్నారు. కిరాతుని సంగీతమునకు అలరి పశుపక్ష్యాదులు మైమరిచి కిరాతుని వలలో చిక్కుకొని ప్రాణములను త్యజించుటకై సిద్ధమగుచున్నవి. సంగీతము మనశ్శాంతిని కల్గించును. యుద్ధ సమయమునందు సైనికులు సంగీతమునకు ధైర్య శౌర్యవంతులగుచున్నారు.
సంగీతము, భాష, ప్రాంతము, దేశము మొదలగు పరిమితులు లేక సకల జన ప్రియమైనది. సంగీతము మాటలు అక్కరలేని ప్రపంచ భాష.
సకల సాహిత్య భావార్థములకు అతీతమై ఆధ్యాత్మికమైనది సంగీతము.
మహాభక్తులు, మహా వాగ్గేయకారులైన పురంధర దాసు, భద్రాచల రామదాసు, తులసీదాసు, సూరదాసు, భక్త మీరాబాయి, తుకారాం, త్యాగరాజు, నారాయణ తీర్థులు, సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి, జయదేవుడు, దీక్షితార్, శ్యామశాస్త్రి మొదలగు మహా భక్త వాగ్గేయకారులు తమ భక్తి జ్ఞాన వైరాగ్య పూరిత గానముతో భగవంతుని ప్రసన్నుని చేసుకొని తరించి చరితార్థులగుట జగత్ప్రసిద్ధమే.
సంగీతం వలన ఆనందముతో గోవులు అధికంగా క్షీరములను ప్రసాదించుట, పంట చేలు అధికంగా దిగుబడి వచ్చుట శాస్త్రజ్ఞులు కనుగొని ఆచరణయందు ప్రయోగించుకున్నారు.
మానవుల మానసిక ఒత్తిడిని సంగీతము వలన సరిచేయ వచ్చునన్న విషయము ప్రయోగం వలన ధ్రువపడినది. తోడి రాగము కలవరపడుతున్న మనస్సుకు శాంతిని ప్రసాదించును. కల్యాణి రాగము మనోస్తబ్ధతను పోగొట్టి ఉత్సాహమును, చురుకుతనమును కల్గించును. శమన రాగము, సావేరి, దయా స్వభావము పెంపొందించును. మోహన, హంస ధ్వని ధైర్యమును, శౌర్యమును ఒసగును.
(ఇంకా ఉంది)