అన్నింట అంతరాత్మ-41: మంచికే వాడమని మనవి.. ‘కత్తి’ని నేను!

5
3

[dropcap]జీ[/dropcap]వులలో నిర్జీవులలోని అంతరాత్మను దర్శించి ప్రదర్శించే జె. శ్యామల గారి ‘అన్నింట అంతరాత్మ’శీర్షికలో ఈ వారం కత్తి అంతరంగం తెలుసుకుందాం.

***

‘మొండి చాకులకు, కత్తెర్లకు, కత్తి పీటలకుసాన పెడతాం..’ వాకిట్లో అరుపు విని, చెప్పొద్దూ నాకు ఎంతో సంతోషం అనిపించింది. మా జాతి పేర్లను వినడం, అందునా మమ్మల్ని పనిమంతుల్ని చేస్తామనడం.. సంతోషకరం కదా. ఈ మధ్య బామ్మగారు.. ఈ కత్తిపీట మొండిదయింది.. తరగడం కష్టమైపోతోంది.. అని, నా మీద తెగ విసుక్కుంటోంది. నా మనసులో మాట టేబుల్ మీది చాకులు, షెల్ఫ్ లోని కత్తెర్లు కూడా విన్నట్లున్నాయి.. ‘మా పరిస్థితి కూడా అంత గొప్పగా ఏం లేదు’ అన్నాయి.

ఇంతలో బామ్మ ‘ప్రవీణా! సాన పెట్టే అతను వాకిలి ముందుకే వచ్చాడు. ఇంట్లో కత్తి పీటలు, చాకులు, కత్తెర్లకు సాన పెట్టించు. బజారుకు తీసుకెళ్లి పెట్టించడానికి మీకెట్లాగూ తీరదు’ అంది.

ప్రవీణ వెంటనే ‘నిజమే అత్తయ్యా.. అవన్నీ మోసుకు పోవడం ఇబ్బంది. ఇప్పుడే చేయిస్తాను, మీరు వాకిట్లోకి వెళ్లి అతణ్ని పిలవండి. నేను అన్నీ తీసుకువస్తాను’ అంది.

బామ్మగారు వాకిట్లోకి నడిచింది. ప్రవీణ మమ్మల్నందరిని తీసుకువెళ్ళింది. సాన పెట్టే అతను మా ఒక్కొక్కరికి సాన పెట్టడం మొదలుపెట్టాడు. మేము నిముషాల్లో పదునెక్కి, తళతళలాడాం. ఒకరినొకరం సంబరంగా చూసుకున్నాం. ‘ప్రవీణా! పైన షెల్ఫ్‌లో ఉన్న పెద్ద కత్తి పీట, మామిడికాయల కత్తి పీట కూడా తీసుకురా’ అంది బామ్మ.

‘అవన్నీ ఇప్పుడెందుకు. రోజూ వాడం కదా’ అంది ప్రవీణ.

‘నిన్ననే పక్కింటి పార్వతి బూడిద గుమ్మడికాయ ఇచ్చింది. వడియాలు పెట్టాలనుకున్నాను. పెద్ద కత్తి పీట ఉంటే కానీ పని సులువు కాదు. అలాగే వేసవి కూడా వచ్చేస్తోంది, ఆవకాయ పెట్టాలంటే మామిడికాయ కత్తిపీట కావాలి. లేదంటే ఆ మార్కెట్‌లో డబ్బులిచ్చి కాయ కొట్టించుకోవాల్సి వస్తుంది. వాళ్లు కాయలు చిన్న బకెట్ నీళ్లలో ఏదో కడిగామనిపించి, ముక్కలు చాలా వాటికి టెంక లేకుండా చెదిరిపోయెట్లు హడావిడిగా కొడతారు. ఇంట్లో కత్తిపీట ఉంచుకుని మనం ఎందుకు ఇబ్బంది పడాలి’ అంది బామ్మ.

దాంతో ప్రవీణ లోపలకు వెళ్లి మా పెద్దక్కలను కూడా తెచ్చింది. వాటిని చూసి మేం పలకరింపుగా నవ్వాం. అవి కూడా వెలుగును ఆస్వాదిస్తూ, మా వంక నవ్వుతూ చూశాయి.

నిముషాల్లో అవి కూడా కొత్త శక్తితో మెరిసిపోయాయి. సాన పెట్టినతను ప్రవీణ ఇచ్చిన డబ్బుల్ని లెక్కపెట్టుకుంటున్నాడు. మేం, అతడి వంక కృతజ్ఞతా పూర్వక చూపులు చూశాం. కానీ అవి అతడికేం అర్థమవుతాయి? బామ్మ, ప్రవీణ మమ్మల్ని తీసుకెళ్లి డైనింగ్ టేబుల్‌పై ఉంచారు.

బామ్మగారు టీవీ పెట్టారు. ఏదో జానపద సినిమా. రాజకుమారుడు మాయా రూపంలో ఉన్న రాక్షసుడితో కత్తి యుద్ధం చేస్తున్నాడు. ‘కత్తి యుద్ధమంటే కాంతారావుదేనే. అందుకే కత్తి కాంతారావు అన్నారు’ అంది. బామ్మ మాటలకు ప్రవీణ నవ్వుతూ, ‘మహిళలు కూడా కత్తి యుద్ధాలు చేశారుగా, రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి తమ కరవాలాలతో శత్రువుల్ని మట్టి కరిపించారు’ అంది. బామ్మగారు ‘నువ్వు చెప్పిందీ నిజమే’ అంటుంటే ‘ఆహా! కరవాలం’ మా జాతి పెద్దలకున్న మరో పేరు వింటూ మురిసిపోయా. ఆ తర్వాత సినిమా సీన్ లో మాయా నర్తకి పాట మొదలయింది. రాజకుమారుడు ఆ నృత్యాన్ని ఆనందిస్తూనే అప్రమత్తతతో మధ్య మధ్యలో నడుము దగ్గర ఉన్న కత్తిని తాకుతున్నాడు. మా జాతి ప్రాముఖ్యత చూసి నాకు ముచ్చటేసింది.

ఆ పాట ఇద్దరికీ అంతగా రుచించలేదేమో ప్రవీణ రిమోట్‌తో నిశ్శబ్దం చేసింది. ఆ క్షణంలో ఆమెకో ఆలోచన వచ్చినట్లుంది. ‘దేవుడి దగ్గర ఆయుధంగా చక్రమే ఉంటుంది. అదే రాముడైతే బాణాలు.. కానీ కత్తి ఉండదేమో’ అంది.

బామ్మ ‘ఎందుకుండదూ, శ్రీమహావిష్ణువుకు ఒక చేతిలో ‘నందకం’ అనే ఖడ్గం ఉంటుంది. దాన్ని జ్ఞాన తత్వాత్మకంగా చెపుతారు. ఇంకో సంగతి, తిరుమలలో గురువారం రోజు ప్రాతః కాల పూజ అనంతరం అలంకరణ మారుస్తారు. స్వామివారికి వేట గౌను తొడిగి, ఆ పైన కత్తిని ముందుంచుతారు. ఈ కత్తిని ‘సూర్య కఠారి’ అంటారు’ వివరించింది. మా పెద్దల్ని దేవుడే ధరించాడని విని గర్వపడ్డా.

‘అత్తయ్యా! కాళికాదేవి కూడా ఒక చేతిలో ఖడ్గం ధరిస్తుందిగా, అంతేకాదు.. నాకు ఇంకో విషయం గుర్తుకొస్తోంది, మేం ఆ మధ్య శ్రీశైలం వెళ్లినపుడు అక్కడ ఛత్రపతి శివాజీ విగ్రహం చూశాం. ఆయన అక్కడ తపస్సు చేశారని, అమ్మవారు భ్రమరాంబిక ప్రత్యక్షమై ఖడ్గం ప్రసాదించిందనీ చెప్పారు’ అంది ప్రవీణ.

‘శివాజీ మహారాజ్‌కి తుల్జా భవాని కూడా ఖడ్గం ప్రసాదించిందని చరిత్ర చెపుతోంది’ అంది బామ్మ.

ఇంతలో బయటి నుంచి తాతగారు వచ్చారు. ‘మీ కవి మిత్రుడితో కబుర్లు అయినాయా’ అంది బామ్మ. ప్రవీణ అందించిన మంచినీళ్లు తాగుతూ ‘ఆ.. చాలా కాలానికి తృప్తిగా మాట్లాడుకున్నాం’ అంటూ ‘ఏమిటి చాకులు, కత్తిపీటలు, కత్తెర్లు ఇక్కడ చేరాయి.. సాన పెట్టించినట్లున్నారుగా’ అన్నాడు.

‘అవును, మీరు చేయకపోతే. పనులు ఆగిపోతాయనుకున్నారా’ బామ్మగారు నిష్ఠూరంగా అంటుంటే, అదేమీ పట్టించుకోకుండా తాతగారు ‘వీటిని చూస్తుంటే వేములవాడ భీమకవి రాసిన పద్యం గుర్తుకొస్తోంది’ అంటూ ఆ పద్యం చదివాడు.

గరళపు ముద్ద లోహ; మవ గాఢ మహా శనికోట్లు సమ్మెటల్
హరు నయనాగ్ని కొల్మి; ఉరగాధిపు కోరలు పట్టకార్లు; ది
క్కరటి శిరంబు దాయి లయకారుడు కమ్మరి వైరి వీర సం
హరణ గుణాభిరాముడగు మైలమ భీముని ఖడ్గ సృష్టికిన్

‘పద్యం వింటే గొప్పగా ఉంది. అర్థమేమిటో’ అని నేను అనుకుంటుండగానే ‘అర్థం చెప్పండి మామయ్యా’ అంది ప్రవీణ.

‘ఇది మైలమ భీముడనే గొప్ప రాజు ఖడ్గం గురించి కవి చెప్పిన పద్యం. కత్తి తయారీకి కావలసినవి గట్టి లోహం, కొలిమి, పట్టకార్లు, ఇనుప దిమ్మ, సమ్మెట కదా. ఈ పద్యంలో కవి, శివుడే ఖడ్గాన్ని స్వయంగా తయారు చేశాడని చెప్పాడు. దీని తయారీకి వాడిన లోహం, గరళపు ముద్ద. కోట్లకొద్దీ పడే పిడుగులే సమ్మెట దెబ్బలు. హరుని మూడో కన్నే కొలిమి. హరుని మెడలోని పాముల రాజు వాసుకి కోరలే పట్టకార్లు. భూమి అష్టదిక్కులను ఎనిమిది దిగ్గజాలు మోస్తుంటాయని అంటారు. అందులో ఒక దిగ్గజం అంటే ఏనుగు తలే ఇక్కడ ఇనుపదిమ్మగా మారింది. ఎంత దివ్యమైన ఊహో’ చెప్పాడు తాతయ్య.

‘చాలా బాగుంది’ ప్రవీణ అంటుండగానే ఎప్పుడు వచ్చాడో ప్రతాప్ ‘బాగుంది నాన్నా.. అయితే శ్రీశ్రీ చేసిన ఖడ్గ సృష్టి విభిన్నమైనది. అందులో ఆయన ఏమన్నాడంటే’

‘అహింస ఒక ఆశయమే కాని
ఆయుధం ఎప్పుడూ కాదు
ఆశయం సాధించాలంటే
ఆయుధం అవసరమే మరి
ఆశయం ఉండడం మంచిదే కాని
అన్ని ఆశయాలు మంచివి కావు
ఆశయాలు సంఘర్షించే వేళ
ఆయుధం అలీనం కాదు..’ అంటూ
‘అందుకే సృష్టిస్తున్నాను
అధర్మ నిధనం చేసే ఈ ఖడ్గాన్ని
కలంతో సృష్టిస్తున్న ఖడ్గం ఇది
జనంతో నిర్మిస్తున్న స్వర్గం ఇది…
ఈ కత్తి
బూజు పట్టిన భావాలకి
పునర్జయం ఇవ్వడానికి కాదు
కుళ్లిపోతున్న సమాజ వృక్షాన్ని
సమూలఛ్చేదం చేయడానికి – అన్నాడు..’ ఆగాడు ప్రతాప్.

‘అవును. కలంతో సృష్టించే ఖడ్గం ఇంకా గొప్పది’ అన్నాడు తాతయ్య. నాకు వింతగా అనిపించింది.

ఇంతలో పిల్లలు బడి నుంచి వచ్చారు. ‘భలే ఉంది చాకు, నేను యాపిల్ కోసుకుంటా’ అన్నాడు పవన్. ‘వద్దొద్దు. నేను కోసి ఇస్తా.. ఇవాళే పదును పెట్టించాం.. చేయి కోసుకుంటావు’ అంది ప్రవీణ కంగారుగా.

‘అన్నిటినీ ఇక్కడ చూస్తుంటే భలే ఉంది. మనం సాలార్‌జంగ్ మ్యూజియంకు వెళ్లినపుడు ఆయుధాల హాలు చూశాం. అందులో నేపాల్ ఖడ్గాలు, బర్మా ఖడ్గాలు, జపాన్ సమురాయ్ కత్తులు చూశాం’ అంది పరిమళ. ‘అవును. డమాస్కస్‌లో తయారైన ఖడ్గాలు, డాగర్లు ఎన్నో ఉన్నాయి. జహంగీర్ చురకత్తి, నూర్జహాన్ పండ్లు కోసే కత్తి కూడా అక్కడ ఉన్నాయి. ఒకప్పుడు పర్షియన్ కమ్మరులు, తమ సొంత పరిశ్రమలలో మన దేశం కోరిన విధంగా కత్తులు తయారుచేసి, తమ సంస్థ ముద్రను వేసి మనకు అమ్మిన కత్తులు కూడా సాలార్‌జంగ్ మ్యూజియంలో చూడవచ్చు. ఇక కాకతీయుల కాలంలో, నిర్మల్‌లో తయారైన కత్తులు కూడా ప్రసిద్ధి కెక్కాయి. రాజుల కాలమే వేరు. వాటిలో ఎన్ని రకాలో, ఎన్ని పేర్లో.. కత్తి, ఖడ్గం, కరవాలం, ఛురిక , పిడి బాకు, ఖైజారు’ వివరించాడు ప్రతాప్.

‘ఇళ్లలో వాడే కత్తులలో కూడా ఎన్ని రకాలో! చెఫ్ కత్తి, చీజ్ కత్తి, మిన్సింగ్ కత్తి, బ్రెడ్ కత్తి, బోనింగ్ కత్తి, టొమాటో కత్తి, స్లైసింగ్ కత్తి, కార్వింగ్ కత్తి’ చెపుతూ, అందరికీ యాపిల్ పండ్లు కోసిచ్చింది ప్రవీణ.

‘నాకయితే కత్తిపీటే అలవాటు. దాదాపుగా పాత తరం వాళ్లందరు కూడా కత్తిపీటనే వాడతారు. ఇప్పటి వాళ్లంతా చాకులనే ఎక్కువగా వాడుతున్నారు’ అంది బామ్మ.

‘ప్రవీణా! కత్తులలో నువ్వు చెప్పినవే కాక.. మంగలి కత్తి, కోడి కత్తి వంటివి కూడా చాలానే ఉంటాయి’ యాపిల్ ముక్కలు తింటూ అన్నాడు తాతయ్య.

‘ఆపరేషన్లు చేసేటప్పుడు కూడా ప్రత్యేక కత్తులు, కత్తెర్లు వాడుతారు కదా’ అంది పరిమళ.

‘అవును. అందుకే తెలుగులో దాన్ని శస్త్ర చికిత్స అంటారు’ చెప్పింది బామ్మ.

‘ప్రయోగశాలలలో కూడా కత్తులు, కత్తెర్లు ఉంటాయికదా’ అన్నాడు పవన్.

‘అవునవును’ అన్నారంతా.

‘అబ్బో.. మా జాతి చాలా విస్తృతమైంది’ అనుకున్నాను నేను.

‘నాన్నా! సిక్కులు కత్తిని ధరిస్తారు కదూ’ అడిగాడు పవన్.

‘అవును. సిక్కులు ధరించే కృపాణాన్ని వారు ‘కిర్పాణ్’ అంటారు. సిక్కుల పదవ గురువు గురుగోవింద్ సింగ్ బోధించిన పంచ ‘క’ కారులలో ఐదవది కృపాణ ధారణ. ఆత్మ రక్షణ కోసం ఉద్దేశించింది. అంతేకాదు, అది వారి త్యాగాలకు, సాహసానికి, పోరాట తత్త్వానికి చిహ్నం’ చెప్పాడు ప్రతాప్. మళ్లీ మొదలెడుతూ ‘అసలు ఖల్సా పంత్ స్థాపన సందర్భంలో కూడా కత్తి పాత్ర చాలా ఉంది’ అన్నాడు. ‘కత్తి పాత్రా!’ అంతా ఆశ్చర్యపోయారు.

నాకు కూడా అదేదో విని తీరాలనిపించింది. వెంటనే ప్రతాప్ ‘పదిహేడో శతాబ్ది చివరలో అప్పటి సమాజం నిర్వీర్యంగా తయారవడం గమనించి, ప్రజలలో ధైర్య, శౌర్యాలతో కూడిన చైతన్యాన్ని రగిలించడానికి బైశాఖి రోజున గురుగోవింద్ సింగ్, ఆనంద్‌పూర్ సాహిబ్ వద్ద ఒక సమావేశానికి పిలుపునిచ్చారు. దేశం నలుమూలల నుంచి ప్రజలు అక్కడికి చేరుకున్నారు. అప్పుడు ఆయన తన ఒరలోని కత్తిని దూసి, ‘తన జీవితాన్ని నాకివ్వడనికి ఎవరు సిద్ధంగా ఉన్నారు?’ అని అడిగారు. అంతా మౌనం, అక్కడ నిశబ్దం. అంతలో లాహోర్ నుంచి వచ్చిన దయారామ్ ముందుకు వచ్చాడు. గురు గోవింద్ సింగ్, అతడిని ఒక గుడారం లోకి తీసుకు వెళ్లి, కొద్ది సేపటి తర్వాత రక్తమోడుతున్న కత్తితో బయటకు వచ్చి, ‘తర్వాత ఎవరు సంసిద్ధంగా ఉన్నారు?’ అని ప్రశ్నించారు. అలా ఐదు సార్లు చేశారు. హస్తినాపూర్ నుండి ధరమ్ దాస్, పూరి నుండి హిమ్మత్ రాయ్, గుజరాత్ నుంచి మోహకమ్ చాంద్, కర్ణాటక నుంచి సాహిబ్ చాంద్ ముందుకు రావడం జరిగింది. అందరూ అవాక్కయ్యారు. అప్పుడు సిక్కు గురువు గుడారం తెరని పైకి ఎత్తారు. చూస్తే ఐదుగురు సజీవంగా నిలిచే ఉన్నారు. అది త్యాగ శోధన అని అందరికి అర్థమైంది. సిక్కు గురువు ఆ ఐదుగురిని సుధతో అభిషేకించి, ‘ఖల్సా (శుద్ధమైనది) ఇప్పుడు సిద్ధంగా ఉంది. వీరు అన్యాయాలను, నిరంకుశత్వాన్ని సహించరు, ప్రాణాలొడ్డడానికి వెనుకాడరు. వీరు ఇక నుంచి ‘పంచ్ ప్యారే’ అని ప్రకటించారు. అలా ఐదుగురితో స్థాపించిన ఖల్సా నేడు కోట్ల సంఖ్యకు చేరుకుంది. నాటినుంచి ఖల్సా దేశ రక్షణలో, దేశ గౌరవం కాపాడడంలో ప్రముఖ పాత్ర పోషిస్తోంది’ వివరించాడు. ‘ఔరా’ అనుకున్నాను నేను.

‘నాన్నా, మొన్న కథలు చెప్పే క్లాసులో కల్పన ఒక కథ చెప్పింది. అందులో ఒక పసిబిడ్డ గురించి ఇద్దరు మహిళలు నా బిడ్డంటే నా బిడ్డ అని గొడవ పడి, తీర్పు కోసం రాజు గారి దగ్గరకు వెళ్లారు. వాళ్ల మాటలు వింటే రాజుకు, వారిలో ఎవరు నిజమైన తల్లో చెప్పడం కష్టం అనిపించింది. అంతలో రాజుకు ఒక ఉపాయం తోచి, కత్తి అందుకుని బిడ్డను రెండు ముక్కలుగా నరికి ఇద్దరికీ ఇస్తాను అన్నాడు. వెంటనే ఆ ఇద్దరిలో ఒకామె ‘వద్దు వద్దు. బిడ్డను ఆమెకే ఇవ్వండి’ అంది. దాంతో అసలు తల్లి ఆమే అని గుర్తించి, ఆమెకు బిడ్డను అప్పగించి, రెండో ఆమెకు శిక్ష విధించాడు రాజు. అలా కత్తి, సమస్య పరిష్కారానికి ఉపయోగించింది’ చెప్పింది పరిమళ.

న్యాయం చేయడంలో మా జాతి ఉపయోగపడినందుకు నాకు సంతోషం కలిగింది. అంతలో పవన్ అందుకుని ‘ఆమధ్య నెపోలియన్ చక్రవర్తి వాడిన కత్తిని ఇల్లినాయ్‌లో వేలం వేశారని చదివాను. అలాగే టిప్పు సుల్తాన్ వాడిన రత్న ఖచిత ఖడ్గాన్ని వేలం వేస్తే ఇరవై కోట్ల రూపాయలకు పైగా పలికిందట. ఆ ఖడ్గం పిడి, పులి తల ఆకారంలో ఉందని రాశారు’ చెప్పాడు.

‘చక్రవర్తులు, సుల్తానులు వాడినవంటే మాటలా మరి’ అంది బామ్మ.

ఆ వెంటనే ప్రతాప్ ‘నిజాం రాజరికానికి చెందిన పద్నాలుగో శతాబ్ది నాటి ఖడ్గం ఒకదాన్ని తిరిగి మన దేశానికి అప్పగించబోతున్నట్లు బ్రిటన్ లోని గ్లాస్గో మ్యూజియాలు నిర్వహించే గ్లాస్గో లైఫ్ సంస్థ ప్రకటించిందని వార్త చదివాను. ఆ ఉత్సవ ఖడ్గం ఇరవయ్యో శతాబ్దిలో ఒక బ్రిటిష్ జనరల్ ద్వారా బ్రిటన్ చేరిందట. అది నాగుపాము ఆకారంలో ఉండి, చక్కని చెక్కడంతో గొప్పగా ఉంటుందని రాశారు’ అన్నాడు.

‘ఉత్సవ కత్తి ఏమిటి’ అడిగాడు పవన్.

‘రాజులు రోజువారీగా ధరించేవి ఉత్సవ కత్తులు, వేటకు, యుద్ధానికి, ఇతరత్రా బయటా పర్యటించేటప్పుడు ధరించేవి పోరాట కత్తులు అంటారనుకుంటా’ అన్నాడు ప్రతాప్

ఈసారి ప్రవీణ మాట్లాడుతూ ‘కత్తుల ఆకారంలో ఉండే పూల గురించి తెలుసా మీకు?’ అడిగింది.

‘కత్తుల్లాంటి పూలా!’ అంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

నాకు కూడా గమ్మత్తుగా అనిపించింది.

‘అవును. క్రోకోస్మియా పూలు కత్తి ఆకారంలోనే ఉంటాయి. ఇవి ఎరుపు, పసుపు, నారింజ రంగుల్లో ఉంటాయి. ఈ మొక్కలు ఎండితే మంచి సుగంధాన్ని ఇస్తాయట’ చెప్పింది ప్రవీణ.

‘భలే పూలు’ అంది పరిమళ.

ఆ వెంటనే బామ్మ ‘రావణాసురుడి వద్ద ఓ ఖడ్గం, చాలా ప్రత్యేకమైంది ఉండేదట’ అంది.

‘ఏమిటో ఆ ప్రత్యేకత?’ తాతయ్య అన్నాడు.

‘రావణాసురుడి ఖడ్గం పేరు ‘చంద్రహాస’. ‘దానికి వెళ్లు, అతడిని వధించు’ అని ఆదేశమిస్తే చాలు, శత్రువు పధ్నాలుగు లోకాలలో ఎక్కడున్నా వెంటాడి, వధించి తిరిగి వస్తుంది. ఎలాటి లోహాలనైనా, మాయలు, మంత్రాలనైనా అది ఛేదిస్తుంది. ఆ గర్వంతోనే రావణుడు ఒకసారి నారదుడితో వాదనకు దిగి, చివరకు తన ఖడ్గంతో బెదిరిస్తాడు. అయినా నారదుడు తొణకడు. రావణుడు, చంద్రహాసను ప్రయోగిస్తాడు, కానీ అది రావణుడిని ఏమీ చేయలేకపోయింది. ఆ రహస్యమేమిటి అని అడుగుతాడు రావణుడు. విష్ణువుకు, మనల్ని మనం అర్పించుకుంటే ఏ శక్తీ మనల్ని ఏమీ చేయలేదని బదులిస్తాడు నారదుడు’ వివరించింది.

‘ఆదేశంతోనే పనిచేసే చంద్రహస మా జాతికే గర్వకారణం!’ అనుకున్నాను నేను.

‘కొన్ని జానపద కళలలో కూడా కత్తిని ధరిస్తారు. కాటమరాజు కథలను గానం చేసేడప్పుడు ప్రధాన కథకుడికి ముగ్గురు వంతలుంటారు. వారిలో ఒకరు కత్తిని పడితే, మరొకరు వీరణాలు వాయించడం, ఇంకొకరు తాళం వేయడం చేస్తారు’ చెప్పాడు తాతయ్య.

భలే ఉంది.. అనుకున్నా నేను.

‘పట్టిసీమకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?’ ప్రవీణ అడిగింది.

‘చాకులు, కత్తులు, ఖడ్గాల మధ్యలో పట్టిసీమ ప్రస్తావన ఏమిటి?’ అన్నాడు ప్రతాప్.

‘తెలుసుకోవలసింది అదే మరి. దక్షయజ్ఞం కథ తెలుసుకదా. ఆ సందర్భంలో వీరభద్రుడు మహోగ్రుడై దక్షసంహారం చేసాడు. ఆ సందర్భంలో వీరభద్రుడు ఉపయోగించిన పొడవైన వంకీ కత్తిని పట్టసం అంటారు. దక్ష సంహారానంతరం ఆ పట్టసాన్ని గోదావరిలో కడగడం వల్ల ఆ ప్రాంతానికి పట్టసం అనే పేరు వచ్చి, క్రమంగా అదే పట్టిసీమగా మారింది’ వివరించింది ప్రవీణ.

అందరితో పాటు నేనూ ‘ఓహో’ అనుకుంటుండగా, స్నేహితులు పిలవడంతో పిల్లలిద్దరూ అక్కడినుంచి పరుగెత్తి వెళ్లారు.

అప్పుడు తాతయ్య ‘మీకు కత్తుల కొండ గురించి తెలుసా?’ అన్నాడు.

‘అదెక్కడ?’ అంది బామ్మ.

‘సారంగధరుడి కథ తెలుసుగా. చిత్రాంగి మాటలు విని రాజరాజనరేంద్రుడు, సారంగధరుడి కాళ్లు, చేతులు నరికేయమని ఆజ్ఞాపిస్తాడు. రాజభటులు, సారంగధరుడిని వెంటాడి ఒక కొండపై అతడిని పట్టుకుని కాళ్లు, చేతులు నరికేస్తారు. ఆ ప్రాంతమే కత్తుల కొండ, నెల్లూరు జిల్లాలో ఉంది’ చెప్పాడు తాతయ్య.

ఒక నిర్దోషిని శిక్షించడానికి మా జాతిని వాడుకోవడం నా మనసుకు చేదుగా అనిపించింది. విషాదం కావడం వల్ల కాబోలు అంతా మౌనంగా ఉండిపోయారు.

అంతలో ప్రతాప్ ‘అసిధారా వ్రతం అనే మాట తరచు వాడుతుంటాం. అది చాలా కష్టమనే ఊహ తప్ప అదేమిటో తెలియదు. ఈ మధ్యే దాని గురించి చదివా. భార్యాభర్తలు, బ్రహ్మచర్యం పాటించవలసిన తప్పనిసరి పరిస్థితులలో ఏక శయ్యపై నిద్రించినా ఇద్దరి మధ్య ఒక ఖడ్గాన్ని ఉంచేవారట. ఇద్దరిలో ఎవరు ఏమాత్రం కదిలినా ప్రమాదం కాబట్టి కదిలే సమస్యే ఉండదు. దాన్నే అసిధారా వ్రతం అన్నారట’ నవ్వుతూ చెప్పాడు. ‘రెండు మంచాల మీద పడుకోవచ్చు కదా, మధ్యలో కత్తుల గోలేంటో’ బామ్మ అంది. అంతా నవ్వుకున్నారు. నాక్కూడా తమాషాగా అనిపించింది.

‘అది సరేకానీ, వనితలు కత్తుల నృత్యం చేయడం గురించి తెలుసా మీకు?’ అడిగింది ప్రవీణ.

‘కత్తులతో నృత్యం.. అదీ ఆడవాళ్లు’ ఆశ్చర్యంగా అన్నాడు ప్రతాప్.

‘అవును, ప్రతి ఏటా దసరా పండుగ సందర్భంలో గుజరాత్‌లో అక్కడి రాజవంశ మహిళలు ఆయుధ పూజలో భాగంగా అమ్మవారికి నీరాజనంగా ఈ నృత్యం చేస్తారు. ఐదు రోజుల పాటు ఖడ్గాలతో, వివిధ విన్యాసాలు చేస్తూ నృత్యం చేస్తారు. ఈ సంప్రదాయ కళను ‘తల్వార్ రాస్’ అంటారు’ వివరించింది.

‘భలే బాగుంది’ అంది బామ్మ.

నాక్కూడా నచ్చింది.

ఇంతలో పిల్లలిద్దరూ వచ్చారు. ‘బామ్మా! నీకు సామెతలు బాగా వచ్చు కదా, కత్తుల మీద సామె తలుంటే చెప్పు. రేపు ఆ శ్రీకాంత్, శ్రీనిధిలను ఎట్లాగైనా ఓడించాలి’ అన్నాడు పవన్.

‘దానికేం భాగ్యం, వినండి.. ‘కడివెడు గుమ్మడి కాయ అయినా కత్తి పీటకు లోకువే’ అని ఒక సామెత. అంటే ఆకారం ముఖ్యం కాదు, అది చేసే పని ముఖ్యం అని. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు, కందకు లేని దురద కత్తి పీటకు ఎందుకు?, తేనె పూసిన కత్తి, అడకత్తెరలో పోకచెక్క..’ బామ్మ ఇంకా చెప్పబోతుంటే

‘ఇప్పటికివి చాల్లే బామ్మా’ అన్నాడు పవన్.

‘అవునూ.. వడియాలు పెడతానన్నావు, కత్తిపీట పదునెక్కిందిగా, ఇంక ఆలస్యమెందుకు, ఆ గుమ్మడి కాయను కోయడం మొదలెట్టు’ అన్నాడు తాతయ్య.

‘అవును.. అబ్బో! టైమ్ కూడా చాలా అయింది. ఇంక పని మొదలెట్టాలి’ అంటూ లేచింది బామ్మ. మిగిలిన వారు కూడా అక్కడినుంచి కదిలారు.

నేను మాత్రం ఆలోచనలో ఉండిపోయాను. ‘మా జాతి నిత్యం మనిషికి సేవలందిస్తూనే ఉంది. మేం ఉండని వంటిల్లే ఉండదు. వంటిల్లు కాదు, బయట కూడా.. కొబ్బరి బొండాలు అమ్మే వారి వద్ద, మాంసం అమ్మే వారి వద్ద కత్తులు ఉండవలసిందే. వస్త్రాల దుకాణాలలో, స్టేషనరీ షాపుల్లో కత్తెర్లు తప్పనిసరి. అంతెందుకు పిల్లలు కూడా చిన్న కత్తెర్ల సాయంతోనే వివిధ కళాకృతులు తయారు చేస్తుంటారు. ఇదంతా నాణేనికి ఒక ముఖమైతే, రాజకీయ కక్షలతో, ఆస్తి వివాదాలలో, ప్రేమ వ్యవహారాలలో, ఇంట్లో భార్య పట్ల అనుమానంతో, మాదక ద్రవ్యాల మత్తులో నరరూప రాక్షసులు కొందరు హత్యలకు తెగబడి, అందుకు మమ్మల్ని వాడడం నాకెంతో బాధ కలిగిస్తుంది. టీవీలో ఇలాంటి వార్తల దృశ్యాలను చూసినప్పుడు ఆ నేరంలో మా పాత్ర ఉండడం భరించరాని బాధగా ఉంటుంది’ అనుకుంటుంటే, ఎదురుగా ఉన్న పెద్ద చాకు ‘నీ బాధ అర్థమైంది. ఆత్మ రక్షణకు, నేరం జరిగినప్పుడు రుజువులుగా మన జాతి సేవలు అందిస్తూనే ఉందిగా. మనల్ని ఉపయోగించడంలో మనిషి విజ్ఞతతో, విచక్షణతో మెలగాలి. మంచికి వాడితే మంచి, చెడుకు వాడితే చెడు. వంటింటి కత్తి అయినా వాడేటప్పుడు అజాగ్రత్తగా ఉంటే ప్రమాదమే మరి. మనిషి మన అంతరంగాన్ని అర్థం చేసుకోగలిగితే ఎంత బాగుండు’ అంటుండగా, బామ్మగారు వచ్చి నన్నందుకుంది.

బూడిద గుమ్మడిని చూసి నవ్వుతూ నేను

‘గుమ్మడీ! బి రెడీ’ అన్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here