[జోనరాజ విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన ద్వితీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
సమం శ్రీకోటయా దేవ్యా మూర్తయేవ జయశ్రియా।
తదోదయన దేవం తం కశ్మీరక్ష్మా మలభ్యయత్॥
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 224)
[dropcap]రిం[/dropcap]ఛనుడి అంత్యకాలం సమీపించింది. తనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వారిని, వారి వంశానికి చెందిన వారెవరూ లేకుండా నాశనం చేయటం వల్ల చిత్తశాంతి లభించింది రింఛనుడికి. కానీ యుద్ధంలో తలకు అయిన గాయం వల్ల కలిగే వేదన మాత్రం ఎన్ని ప్రయత్నాలు చేసినా పెరిగింది తప్ప, తగ్గలేదు. తనకు రోజులు దగ్గర పడ్డాయని రింఛనుడు గ్రహించాడు. ఎందరు తనపై ఎన్ని కుట్రలు పన్నినా, తనకు విధేయుడిగా నిలిచిన షాహమీరు పట్ల రింఛనుడి నమ్మకం కుదిరింది. అందువల్ల, తన తరువాత తన పిల్లవాడు హైదర్‍ను, భార్య కోటరాణిని సంరక్షించవలసిన బాధ్యతను షాహమీర్‍కు అప్పగించాడు రింఛనుడు. కోటరాణి ప్రేమ, షాహమీర్ సంరక్షణలో హైదర్ చక్కటి వ్యక్తిగా ఎదిగాడు. ఎలాగయితే వర్షపు నీరు సమృద్ధిగా లభిస్తూ, ఎండ వేడి నుంచి నీడ లభించిన వృక్షం ఎదుగుతుందో, అలా అందంగా ఎదిగాడు హైదర్.
ఇక్కడి నుంచి రింఛనుడి ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది. తన పేరు మీదనే ఓ నగరం నిర్మించాడు. ఆ నగరం చుట్టూ కందకం నిర్మింపజేశాడు. పుష్యమాసంలో మేఘాల నడుమ సూర్యుడు హఠాత్తుగా వెలిగేట్టు, రింఛనుడు కొన్ని నెలలు వెలిగాడు, అంటే చురుకుగా ఉన్నాడని అనుకోవచ్చు. చలికాలంలో, మంచు కురుస్తుండడం వల్ల రింఛనుడి తలపై గాయం వల్ల కలిగే వేదన తీవ్రమైంది. చల్లదనం వల్ల నరాల బలహీనత తీవ్రమైంది. ఎందరెందరి తలలనో శరీరాన్నుంచి వేరు చేసిన రింఛనుడి తల బాధ భరించరానిదయింది. పుష్యమాసం, శుక్లపక్షంలో పదకొండవ రోజున మరణమనే వైద్యుడు రింఛనుడికి వైద్యం చేసి బాధ నుండి విముక్తిని కలిగించాడు. రింఛనుడు మూడు సంవత్సరాల, ఒక నెల, పంథొమ్మిది రోజులు రాజ్యం చేశాడు. ప్రస్తుతం వాడుతున్న లెక్కల ప్రకారం రింఛనుడు క్రీ.శ. 1323వ సంవత్సరంలో మరణించాడు.
రింఛనుడు పాలించింది మూడేళ్ళ కాలమే అయినా రింఛనుడి పాలనా కాలంలో ఆరంభమయిన మార్పులు కశ్మీరు చరిత్రపై ప్రభావం చూపించాయి. కశ్మీరు చరిత్రలో తొలి మహమ్మదీయ పాలకుడిగా రింఛనుడు, సద్రుద్దీన్‌గా గుర్తింపు పొందాడు. రింఛనుడు మహమ్మదీయ మతం స్వీకరించటం విషయంలో సందేహం లేకున్నా ఎప్పుడు స్వీకరించాడన్న విషయం మాత్రం స్పష్టంగా లేదు. ఎందుకు స్వీకరించాడన్న విషయంలో కూడా, జోనరాజు ప్రదర్శించిన అంశాల ఆధారంగా ఊహించటం తప్ప నిర్ధారణగా ‘ఇదీ కారణం’ అని చెప్పలేము.
అయితే చరిత్ర రచయితలు మాత్రం రింఛనుడిని, షాహమీర్‌ను గొప్పవారిగా చూపించాలని తీవ్రమైన ప్రయత్నం చేశారు.
“Rinchan was intensely interested in the welfare of the his Subjects. He spared none, ‘whether son, minister or friend’, who interfered with justice. His reign was a ‘golden age’. [The History of Muslim Rule in Kashmir by R. K. Parmu]
“Rinchan and Shahmir together with their followers came to the aid of the Kashmiris and did their bit in opposing the inscrutable and cruel invader’ అని ‘The Cultural and Political History of Kashmir’ అన్న పుస్తకంలో Bamzai రాశారు. మంగోలులు దుల్చా నాయకత్వాన కశ్మీరుపై దాడి చేసినప్పుడు రింఛనుడు, షాహమీర్ కశ్మీరు ప్రజలను ఆదుకున్నారని, వారిద్దరూ కశ్మీరు ప్రజలపై ప్రేమ కలవారని చరిత్ర పుస్తకాలలో రాశారు. కానీ జోనరాజు రాజతరంగిణి ప్రకారం, ఓ వైపు దుల్చా, మరో వైపు రింఛనుడు కశ్మీరీ ప్రజలను అడకత్తెరలో పోకచెక్కల్లా బాధించారు. కశ్మీరీ ప్రజలను బానిసల్లా అమ్మి రింఛనుడు ఐశ్వర్యవంతుడయ్యాడు. కాబట్టి దుల్చా దాడి నుండి కశ్మీరీ ప్రజలను రింఛనుడు కాపాడాడన్నది శుద్ధ అబద్ధం. ప్రజలను బానిసలుగా అమ్మి ఐశ్వర్యవంతుడయినట్టు ఆధారాలున్నాయి కానీ, ప్రజలను సంరక్షించినట్టు లేదు. కానీ రింఛనుడు, సద్రుద్దీన్ అవటంతో కశ్మీరు ప్రజలపై అతని అపారమైన కరుణను ప్రదర్శించాల్సిన అవసరం చరిత్ర రచయితలకు కలిగింది. ఫలితంగా రింఛనుడు, షాహమీర్‍లు కశ్మీరు ప్రజలను రక్షించారన్న ‘అబద్ధం’ జన్మించింది. పదిమందీ అదే అబద్ధాన్ని పదే పదే అంటుంటడంతో అది నిజమై కూర్చుంది. దాంతో నిజం చెప్పేవాడు అబద్ధాలకోరు అయ్యాడు. తరచి చూస్తే భారతదేశ చరిత్ర రచన మొత్తం ఇదే రీతిగా సాగిందని స్పష్టమవుతోంది.
ఇక రింఛనుడి పాలన ‘స్వర్ణయుగం’ అనటం కూడా రింఛనుడు కశ్మీరీ ప్రజలను రక్షించటం ఎంత నిజమో, అంత నిజం!
రింఛనుడు కశ్మీరీ ప్రజలకు యుద్ధాల నుండి విముక్తినిచ్చాడు. మళ్ళీ కశ్మీరంలో సంబరాలు ఆరంభమయ్యాయి అని రాసాడు. కానీ రింఛనుడి పాలన ఏ మాత్రం ప్రశాంతంగా లేదని, రింఛనుడికి వ్యతిరేకంగా తిరుగుబాట్లు జరుగుతూనే ఉన్నాయని జోనరాజు రాజతరంగిణి ద్వారా తెలుస్తుంది. లావణ్యులు వ్యతిరేకిస్తే వారి నడుమ చీలికలు తెచ్చి వారి బెడద నుంచి ఉపశమనం పొందాడు. లదాఖ్ లోని భౌట్టుల వ్యతిరేకత కనబడగానే, వారి నాయకుడిని చిన్న నేరానికి పొట్టకోయించి చంపాడు. ఫలితంగా తనపై తిరుగుబాటు చేసిన వారి నుంచి మాయోపాయాలతో ప్రాణాలు కాపాడుకొని, వారిని ఓడించి అతి క్రూరంగా వారిని చంపాడు. ఆ యుద్ధంలో తగిలిన గాయం ఫలితంగా మరణించాడు. చివరి దశలో రింఛనపురం కట్టించాడు. ఓ మసీదు బుల్‍బుల్ షాహ ప్రార్థనల కోసం రింఛనపురంలో కట్టించాడు. రింఛనపురం ప్రస్తుతం ‘బోడాగర్’ వద్ద ఓ మొహల్లాగా మిగిలి ఉంది. మొత్తం జీవితంలో రింఛనుడు కశ్మీరును పాలించింది కేవలం మూడేళ్ళు మాత్రమే. ఈ మూడేళ్ళలో కూడా కశ్మీరు ప్రజలు అతడిని మనస్ఫూర్తిగా రాజుగా స్వీకరించలేదు. రాజుగా ఆమోదం పొందేందుకు రాజవంశానికి చెందిన కోటరాణిని వివాహం చేసుకున్నాడు. శైవం స్వీకరించాలని ప్రయత్నించాడు. అంటే, రింఛనుడి పాలనలో మన చరిత్ర రచయితలు నమ్మించాలని ప్రయత్నిస్తున్నట్టు కశ్మీరులో శాంతి వెల్లివిరియలేదు. పాలనపై దృష్టి పెట్టేకన్నా తన సింహాసనం కాపాడుకుని ప్రజల ఆమోదం పొందేందుకు ప్రయత్నించటంలోనే రింఛనుడి సమయం గడిచిపోయింది. కాబట్టి రింఛనుడి పాలనను స్వర్ణయుగంగా భావించే వీలులేదు. జోనరాజు కూడా రింఛనుడి పాలనను స్వర్ణయుగం అనలేదు. యుద్ధాల నుంచి, అల్లకల్లోలం నుంచి ప్రజలకు శాంతినిచ్చాడు అన్నాడు. అతడి పాలన గురించి ఏమీ పస్తావించలేదు. అసలు సరిగ్గా పాలన వైపు దృష్టి పెట్టే సమయమే రింఛనుడికి దక్కలేదు. పలనాకాలాన్ని స్వర్ణయుగంగా పరిగణించేందుకు మూడేళ్ళు చాలా తక్కువ సమయం.
ఎలాంటి పరిస్థితిలో, రింఛనుడు ఇస్లాం ఎప్పుడు స్వీకరించి ఉంటాడన్న ప్రశ్న ఉదయిస్తుంది. పాలన ఆరంభ కాలంలో ఇస్లాం స్వీకరించి ఉంటే, జోనరాజు ఆ విషయం ప్రస్తావించి ఉండేవాడు. శైవం ఇవ్వమని దేవస్వామిని అభ్యర్థించడం, నిరాకరించటం ప్రస్తావించిన జోనరాజు ఇస్లాం స్వీకరించటం ప్రస్తావించక పోవటానికి కారణం బహుశా, రింఛనుడు బహిరంగంగా, పెద్ద సభ చేసి, ఇస్లాం స్వీకరించకపోవటం అయి ఉండవచ్చు. దేవస్వామి తిరస్కరించగానే వెంటనే రింఛనుడు ఇస్లాం స్వీకరించకపోయి ఉండవచ్చు. ఆ వెంటనే తిరుగుబాటు జరిగింది. రింఛనుడి తలపై గాయమయింది. నిరంతరం తనను వ్యతిరేకించి పోరాడుతున్న వారి నుంచి భద్రత కోసం బహుశా ‘రింఛనపురం’ నిర్మించి ఉండవచ్చు. అందుకే ‘రింఛనపురం’ చుట్టూ కందకం తవ్వించాడు.
పరిఖాచ్ఛలతో కీర్త్యా స్వపరాజయ జాయతా।
పరితో వలితం రాజా స్వనామాంకం పురంద్య ధాత్॥
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 215)
‘స్వపరాజయ’, ‘పరిఖాచ్ఛలతో కీర్త్యా’ వంటి పదాలు రింఛనుడు పరాజయం పొందాడని సూచిస్తాయి. తన పేరు మీద కట్టించిన నగరం చుట్టూ రింఛనుడు కట్టించిన కందకం ఎలా ఉందంటే, అతని పేరును ఆవరించిన పరాజయం వల్ల కలిగిన అపకీర్తిలా ఉందట!
సాధారణంగా పర్షియన్ రచయితలు చరిత్రను రచించినప్పుడు శత్రువుల విజయాలను ప్రస్తావించరు. తమ సుల్తానుల పరాజయాన్ని ప్రస్తావించరు. జోనరాజు కూడా అదే చేసి ఉండవచ్చు. లావణ్యుల వంటి వారితో జరిగిన పలు యుద్ధాలలో రింఛనుడు ఓడిపోయి ఉండవచ్చు. వారి దాడుల నుంచి తప్పించుకునేందుకు చుట్టూ కందకం త్రవ్విన సురక్షితమైన రింఛనపురం నిర్మించి ఉండవచ్చు. అందుకే అతని పేరును ఆవరించి ఉన్న అపకీర్తి, అతని పేరు మీద కట్టిన నగరం చుట్టూ ఉన్న కందకం లాంటిది అన్నాడు జోనరాజు. లేకపోతే, ‘స్వర్ణయుగం’ లాంటి పాలననిస్తూ, ప్రజలందరూ సంబరాలు చేసుకునే రీతిలో పాలిస్తున్న రింఛనుడికి ‘అపకీర్తి’ అన్న మాట రాకూడదు. ఓ వైపు తలకయిన మానని గాయం, మరోవైపు ఎడతెగని తిరుగుబాట్లు రింఛనుడిలో అభద్రతా భావాన్ని, అనిశ్చింత భావాన్ని తీవ్రం చేసి ఉండవచ్చు. ఈ సమయంలో అతను నమ్మదగినవాడు, అండగా నిలబడిన వాడు ‘షాహమీరు’ ఒక్కడే! తానేం చేసినా కశ్మీరీ ప్రజలు తనను గౌరవించరు, స్వీకరించరు అన్నది దేవస్వామి తిరస్కృతితో రింఛనుడికి స్పష్టం అయిపోయింది కాబట్టి అతనికి ఇస్లాం స్వీకరించటం తప్ప మరో గత్యంతరం లేని పరిస్థితి వచ్చింది. దీనికి తోడు షాహమీర్ రింఛనుడికి విధేయుడిగా ఉంటూ వచ్చాడు. ఎవరెంతగా రెచ్చగొట్టినా, రింఛనుడి పట్ల వ్యతిరేకత ప్రదర్శించలేదు. నమ్మిన బంటు అని నిరూపించుకున్నాడు. కాబట్టి, తలపై అయిన గాయం వల్ల రింఛనుడు బాధ పడుతుంటే, అతడికి ఉపశమనం కలిగించటం కోసం పలు రకాల వైద్యాలు వాడి చూసి ఉంటాడు. షాహమీర్ ప్రభావంతో ఇస్లాం వైద్యం వాడి ఉంటాడు. తాత్కాలికంగా ఉపశమనం లభించి ఉండవచ్చు. దాంతో షాహమీర్ ప్రోద్బలంతో ఇస్లాం స్వీకరించి ఉండవచ్చు. ఈ విషయానికి అంతగా ప్రచారం లభించి ఉండకపోవటం వల్ల, ఇందువల్ల మతం మారేడన్నది స్పష్టంగా తెలియకపోవటం వల్ల జోనరాజు రాజతరంగిణిలో ఇస్లాం స్వీకరించటం ప్రస్తావించకపోయి ఉండవచ్చు. రింఛనుడిని రింఛనుడు అన్నాడే తప్ప ‘సద్రుద్దీన్’ అని ఎక్కడా వాడలేదు. సురత్రాణ అన్న పదం ఆ కాలంలో సుల్తానులకు పర్యాయపదంగా వాడటం అలవాటయ్యింది. అందుకని రింఛనుడిని ‘సురత్రాణ’ అని ఉండవచ్చు. ‘కానీ సురత్రాణ అంటే బ్రాహ్మణులను రక్షించిన వాడు అన్న అర్థం వస్తుంది. అది సుల్తాన్‍ను సూచించదు’ అని వాదిస్తారు పలువురు చరిత్ర రచయితలు.
ఏది ఏమైనా రింఛనుడు, అనారోగ్యం అధికం అయిన తరువాతనే ఇస్లాం స్వీకరించి ఉండవచ్చన్న ఆలోచనకు, చివరి దశలో మారిన అతని ప్రవర్తన బలమిస్తుంది. రింఛనపురం నిర్మించటం వల్ల, ఆ నగరం నిర్మిస్తున్నప్పుడు అతడు మతం మారలేదన్న భావనకూ బలం కలిగిస్తుంది. ఎందుకంటే, ఇస్లాం స్వీకరించటంతో వ్యక్తి సంపూర్ణంగా గతంతో సంబంధం త్రెంచుకుంటాడు. నూతన జన్మ ఎత్తినట్లవుతుంది. పేరుతో సహా అన్నీ మారిపోతాయి. ముఖ్యంగా, ఇస్లామీయులు ఈ విషయంలో సంపూర్ణమైన పట్టుదలను ప్రదర్శిస్తారు. కాబట్టి, రింఛనుడు, సద్రుద్దీన్ అయిన తరువాత నగరం కట్టిస్తే దాన్ని రింఛనపురం అని మాత్రం ఎట్టి పరిస్థితులలో అనే వీలు లేదు. ఉన్న పేరునే మార్చే వారు మారిన పేరుతో కాక పాత పేరుతో నగరం నిర్మించటం అన్నది అనూహ్యం. కాబట్టి రింఛనపురం నిర్మించిన సమయంలో రింఛనుడు ఇస్లాం స్వీకరించలేదు. రింఛనపురం నిర్మించిన తరువాత అతనికి గాయం వల్ల బాధ తీవ్రమవటంతో ఉపశమనం కోసం ఇస్లాం స్వీకరించి ఉంటాడు. మసీదును నిర్మించాడు. ఈ మసీదును ‘బద్ మషీద్’ అంటే ‘పెద్ద మసీదు’ అంటారు. ఈ మసీద్ను బౌద్ధుల ఆరామాన్ని కూలగొట్టి, ఆ స్థానంలో నిర్మించాడు. రింఛనుడు బౌద్ధుడిగా జన్మించాడు. కానీ ఇస్లాం స్వీకరించటంతోటే అతడు చేసిన మొదటి పని బౌద్ధారామాన్ని కూలగొట్టి ఆ స్థానంలో ‘బడా మసీద్’ను నిర్మింపజేయటం. దాన్ని బట్టి రింఛనుడు తన జీవితకాలం చివరి దశలో ఇస్లాం స్వీకరించి ఉంటాడన్న ఊహకు బలం వస్తుంది. రింఛనుడు మసీదును తన జీవితం కొన్ని నెలల్లో అంతమౌతుందనగా నిర్మించాడు. ఈ మసీదుకు మరికాస్త దూరంలో ‘అలీ కదల్’ వద్ద మరో మసీదు నిర్మించి తన గురువు ‘బుల్‌బుల్ షాహ’ పేరు మీద ‘బుల్‍బుల్ షాహ లంగర్’ (అన్నదానం) ను ఏర్పాటు చేశాడు. దీన్ని ‘బుల్‍బుల్ లంగర్’ అంటారు. రింఛనుడు 6 అక్టోబరు 1320 నాడు రాజయ్యాడు. నవంబర్ 25, 1323 నాడు మరణించాడు. ‘లాహ్-బెన్-గ్యాల్బు-రింఛన్’గా జన్మించిన రింఛనుడు సుల్తాన్ సద్రుద్దీన్‍గా మరణించాడు.
సుల్తాన్ సద్రుద్దీన్‍గా మారిన రింఛనుడు మరణించే నాటికి హైదర్ ఇంకా బాలుడు. లెక్క ప్రకారం హైదర్ రాజు కావాలి. హైదర్ రాజుగా అయి ఉంటే, రింఛనుడు ఇస్లాం స్వీకరించటం వలన భారతీయులకు నష్టం వాటిల్లిందని అనుకునే వీలుంది. కానీ రింఛనుడి తరువాత మరో ఇస్లామీయుడు కశ్మీరు సుల్తాన్ కాలేదు.
‘హైదర్’ ఇంకా బాలుడు. కాబట్టి అతడిని సింహాసనంపై కూర్చోబెట్టటం అంత మంచిది కాదని షాహమీరు అనుకున్నాడు. స్వయంగా రాజ్యాధికారాన్ని స్వీకరించి రాజ్యాన్ని పాలించే శక్తి తనకు లేదని షాహమీర్ భావించాడు.
పుత్రం హైదర నామ్యాం బాల్యాదన భిషిక్తవాన్।
అతథా విధ శక్తిత్వా ద్రాజ్యం స్వేనాప్య సంవహాన్॥
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 221)
ఇకపై ‘షాహమీర్’ కశ్మీరు చరిత్రలో కీలకమైన పాత్ర పోషిస్తాడు. షాహమీర్‌కు వ్యతిరేకంగా కోటరాణి కశ్మీరు భవిష్యత్తు దిశను మార్చాలని ప్రయత్నించటం కనిపిస్తుంది. నిజానికి కోటరాణి సిద్ధపడితే, హైదర్‍ను సింహాసనం మీద కూర్చుండబెట్టి, అతడి పేరు మీద కశ్మీరును పాలించవచ్చు. గతంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. కశ్మీరు రాజును సంహరించిన శ్రీకృష్ణుడు బాలుడిని రాజుగా నిలిపి యశోవతికి రాజ్యం అప్పచెప్పటం నుంచి ఇలాంటి సంఘటనలు కశ్మీరంలో అనేకం జరిగాయి. కానీ కోటరాణి అందుకు ఇష్టపడలేదు. కోటరాణి ప్రవర్తనను పరిశీలిస్తే, ఇందుకు కారణం ఊహించే వీలు చిక్కుతుంది.
(ఇంకా ఉంది)