[dropcap]అ[/dropcap]నువాద ప్రక్రియ అనేది కత్తి మీద సాము. మూల కథలోని జిగి, బిగి సడలనివ్వకుండా, ఆయా దేశాల నేటివిటీని పరిరక్షిస్తూ, సంభాషణలను కృతకంగా కాకుండా, మన తెలుగుతనం ఉట్టిపడేలా తీర్చిదిద్దుతూ, అనువాదకుడు ముందుకు సాగాలి. స్వేచ్ఛానువాదంలో ఇవన్నీ సాధ్యమవుతాయి.
కొల్లూరి సోమ శంకర్ ఈ విషయంలో చాలా వరకు పరిపూర్ణత సాధించారు. ప్రతి కథ మొదట్లో మూల కథ వివరాలు, అనువాద కథ వివరాలు ఇవ్వడం చక్కని విధానం. కథలన్నీ వివిధ ప్రముఖ పత్రికలలో, వెబ్‍సైట్‌లలో చోటు చేసుకున్నవే.
కొల్లూరి సొమ శంకర్ కేవలం అనువాద రచయితే కాదు, సొంతంగా కథలు అందంగా రాయగల దిట్ట. ‘దేవుడికి సాయం’ లాంటి ఆయన కథాసంపుటుల్లో ఈ విషయం తేటతెల్లమయింది.
‘ఏడు గంటల వార్తలు’లో కనిపించేది అచ్చమైన జీవితం అని, అనువాదానికి కథలను ఎంచుకోవడంలో రచయిత ఒక ఆలోచనతో, పద్ధతితో వ్యవహరించారని, ముందుమాట రాసిన దాసరి అమరేంద్ర గారు అనడం సముచితం.
ఏ దేశపు కథల్లో ఐనా కొన్ని విశ్వసత్యాలను ఆయా రచయితలు ఆవిష్కరిస్తారు. ‘Brevity is the soul of wit’ అని షేక్‍స్పియర్ మహాశయుడు వాక్రుచ్చినట్టు, కొల్లూరి ఈ కథల్లో ఆయనను స్ఫూర్తిగా తీసుకొన్నారనిపిస్తుంది. భార్యాభర్తల బంధాన్ని ‘విచారగ్రస్తుడు’ అనే కథ సున్నితంగా అక్షరీకరిస్తుంది. భర్త ఆలస్యంగా వచ్చినందుకు చిన్న అబద్ధం ఆడతాడు. భార్య దాన్ని నమ్ముతుంది. సోమ శంకర్ ఆ సందర్భంలో ఇలా రాశారు.
“భర్త సమాధానం సరైనదా కాదా అని ఆవిడ నిర్ధారించుకోలేదు. ఆ అవసరమే లేదావిడకు”.
“భర్తలో అపరాధభావం తలెత్తింది.”
“జరిగినదంతా ఉన్నదున్నట్టుగా చెప్పినా, ఆవిడ ఏమీ అనేవారు కాదు”.
అదీ mutual trust అంటే! తెలుగులో దీనిని కొల్లూరి అత్యంత సహజంగా చిత్రీకరించారు.
కొన్ని చోట్ల అనువాదం మక్కికి మక్కిగా ఉందేమో అనిపిస్తుంది. ఈ వాక్యం చూడండి.
“ఇంకా ఆలస్యం చేస్తే, ఆయన భార్య సగం పట్టణాన్ని అప్రమత్తం చేస్తారు.” ఇలాంటి వాక్య నిర్మాణాలు మన తెలుగులో ఉండవు. మరొక చోట “ఆయన కొట్టు కొద్దిపాటి జనంతో కిటకిటలాడింది” అన్న వాక్యంలో ‘కొద్దిపాటి’ అన్న పదం లేకుంటే, కిటకిటలాడడానికి సార్థకత చేకూరుతుంది.
‘తన గమ్యం’ కథ అద్భుతమైనది. ఇలాంటి కథలను అనువదించడం రచయితకు పరీక్ష లాంటింది. ఆ పరీక్షలో మన సోమ శంకర్ వంద శాతం తెచ్చుకున్నారు. ఇది ఓ హెన్రీ మార్కు కథ ‘A twist in the tail’ దీనికి ప్రాణం. నిజార్ మిలిటరీ జవాన్‍కు చెప్పిన చివరి మాటలు మనలను ఆశ్చర్య చకితులను చేస్తాయి. అతని బూట్లలో జవాన్లు మూత్రం పోసి పైశాచికానందం పొందుతారు. అంతకు ముందే, వారికి తెచ్చిచ్చిన టీ లో అతడు అదే పని చేసి ఉంటాడు! ఇలా అంటాడు నిజార్ జవాన్‍తో –
“ఈ విద్వేషం సమసిపోనంత వరకు మన మధ్య శాంతి ఉండదు”.
శాంతికి అవరోధం విద్వేషమన్న విషయం చక్కగా అనువదీకృతమయింది.
‘సెన్సిటివిటీ ట్రెయినింగ్’ అనే కథ వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన మనోవైజ్ఞానిక కథ. దీనిని కొల్లూరి ఎంతో జాగ్రత్తగా నడిపారు. లేకపోతే అది వ్యాసమై కూర్చునేది. భర్త ‘మాంచి’ రొమాంటిక్ మూడ్‍లో ఇంటికి వస్తాడు. కానీ భార్య మూడ్ ఆఫ్ అయి ఉండడం గమనించి ‘నాకు ఈ పూట పస్తు తప్పద’ని అనుకుంటాడు. ఇక్కడ ‘మాంచి’, ‘పస్తు’ అనే అచ్చమైన తెలుగు పదాలువాడి అనువాదకుడు తెలుగు నేటివిటీని కాపాడాడు.
కేవలం పదాలను ఇంకో రకంగా మార్చడం ద్వారా ‘సెన్సిటివిటీ’ని సాధించలేమని ఈ కథ నిరూపిస్తుంది. ఉదాహరణకు ‘బట్టతల’ అనకూడదట. ‘హెయిర్ ఛాలెంజ్‌డ్’ అనాలట. సెన్సిటివిటీ ట్రైనింగ్‍లో శిక్షణ పొందేవారి కిచ్చే questionnaire ని ‘పిచ్చి ప్రశ్నావళి’ అంటారు కొల్లూరి. చక్కని పదబంధం ఇది.
సెన్సిటివిటీ శిక్షణ, మనుషులను “గిరి గీసిన, వేరు వేరు పరిధుల్లోని, అసంబద్ధమైన ‘వస్తువుల్లా’ మార్చేయకూడదు” అనే సందేశం ఈ కథలో ఉంది. అక్కడక్కడా హాస్యపు మెరుపులు కథలోని రీడబిలిటీని పెంచాయి.
“ఉపమా కాళిదాసస్య” అన్నారు. భావస్ఫోరకమైన పోలికలు కథలకు ఆక్సీజన్ వంటివి. ‘విద్వేషం’ అన్న కథలో చిత్తు కాగితాలు ఏరుకునే ఒక స్త్రీ ఆత్మగౌరవం చిత్రీకరించారు రచయిత. ఇక్కడ ‘రచయిత’ అంటే ‘అనువాద రచయిత’ అని అర్థం చేసుకోవాలి. ఇక్కడే కాదు, అన్ని చోట్లా. గాలికి చిత్తు కాగితాలు ఎగిరిపోయి, ఆమెకు జీవనోపాధి దొరకదు.
“గాలి విదేశీ వాతావరణం వైపు ఆకర్షించబడినట్లే..”
ఈ simile ని ఉపయోగించి, కొల్లూరి మనలను నిశ్చేష్టులను చేస్తారు. చెప్పేది చిత్తు కాగితాల గురించి. కాని దాన్ని ‘Intellectual exodus’ అంటే ‘మేధావుల వలస’ వరకు తీసుకెళ్ళారు. భావం మూల రచయితదే కావచ్చు. కాని అది చక్కగా మన తెలుగులో వెలిగింది. అడుక్కోవటానికి ఒక ఇంటి తలుపు తట్టిన ఆ స్త్రీ, కొడుకుకు పిడికెడు అన్నం పెట్టడానికి విధి లేక ఆ పని చేస్తుంది. ‘ఆకలి’ ఎంత ‘irresistible torture’ అనేది ఆ కొడుకు ద్వారా కొల్లూరి అద్భుతంగా ఆవిష్కరించారు. ఇంట్లోని యువతి కాబూలీలను కుక్కల కంటే హీనంగా పరిగణించి మాట్లాడుతూండడం వినిపించి, ఇంటామె రొట్టెలతో వచ్చేసరికి ఆమె తన కొడుకును తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. దటీజ్ సెల్ఫ్ రెస్పెక్ట్! అది ‘ఆకలి’ని కూడా జయించగలదు.
‘ఉద్యోగం పోయింది’ కథ కూడా ఆణిముత్యమే. సోమ శంకర్ అనువాద ప్రతిభ, మనం ఒక డైరక్ట్ తెలుగు కథనే చదువుతున్నామన్న అనుభూతిని కలిగిస్తుంది. ‘ఉద్యోగం పోతే కాదు, ఆత్మస్థైర్యం పోగుట్టుకుంటే.. జీవితం సారహీనం అవుతుంద’ని నెరేటర్ గ్రహిస్తుంది.
‘రైల్లో కరాచీకి’ అన్న కథ ‘అపోహ’ మూలంగా వ్రాయబడింది. రైల్లో ఊచలు లేని కిటికీ వద్ద ఒక యువతి తన చిన్నబాబుతో కూర్చుని ఉంటుంది. ఎదుటి సీటులోని వ్యక్తి ఆమె వైపు అదే పనిగా చూస్తుంటాడు. అతడు తనను ‘ఆ’ దృష్టితో చుస్తున్నాడని ఆమె అనుకుంటూ కొంత embarrassment కు గురవుతూంటుంది. ‘యద్భావం తద్భవతి’ అన్నారు కదా. ఆయన ఉద్దేశం, ఆ చిన్న పిల్లవాడు ఊచలు లేని ఆ కిటికీలోంచి పడిపోతాడేమోనని ఆయన వ్యగ్రత. పిల్ల, అమ్మ అప్రమత్తంగా లేనప్పుడు కిటికీ మీదకి ఎక్కబోతుంటే, ఆయన గబుక్కున లేచి వాడిని పట్టుకుని తల్లికి అప్పగిస్తాడు. ఇక్కడ రచయిత (అదే, మన కొల్లూరి) ఇలా అంటారు
“ఎదుటి వ్యక్తి లోని భావాలను లేదా ఉద్దేశాలను మనం ఎన్నటికీ ఖచ్చితగా తెలుసుకోలేమనే వాస్తవం ఆ క్షణంలో నాకు చెంపపెట్టుగా తోచింది!”
Appearances are deceptive. ‘ధూర్తుడిలా అనిపించిన ఆ వ్యక్తి నిజానికి ఉత్తముడు.’ శభాష్ కొల్లూరీ!
నాకెప్పటి నుంచో ఒక భావన. అనువాద కథల్లోని మనుషుల పేర్లను, స్థలాల పేర్లను మన తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్చి రాస్తే, అనువాద సాహిత్యం మరింత కాంతులీనుతుందని. ఈ విషయం ‘విపుల’ సంపాదకులు రాశాను కూడా. కొల్లూరి ఈ దిశలో ఆలోచించి, సహజత్వాన్ని మరింతగా పరిమళింపజేయాలని ఆశీర్వదిస్తూ.
***
ఏడు గంటల వార్తలు
(మరికొన్ని విదేశీ కథలు)
కొల్లూరి సోమ శంకర్
పేజీలు: 114
వెల: ₹ 120
ప్రతులకు:
విశాలాంధ్ర బుక్ హౌజ్, విజయవాడ, ఇతర శాఖలు,
సాహితి ప్రచురణలు, #33-22-2, చంద్రం బిల్డింగ్స్, సి. ఆర్. రోడ్, చుట్టుగుంట, విజయవాడ – 520 004. ఫోన్: 0866-2436643
అమెజాన్ నుంచి తెప్పించుకోడానికి లింక్:
https://www.amazon.in/dp/B081VLKPQG/