మార్పు మంచిదే!

2
3

[సంచిక 2022 దీపావళి పోటీకి అందిన కథ.]

[dropcap]“అ[/dropcap]పార్ట్‌మెంట్ మొత్తం ఫైవ్ ఫ్లోర్స్ సార్! ప్రతీ ఫ్లోర్‌కూ ఎయిట్ పోర్షన్స్.. అన్నీ ఈస్ట్, వెస్ట్ ఫేసింగ్స్. ప్రతీ ప్లాటూ థౌజండ్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్” అంటూ సూపర్‌వైజర్ నాకు వివరిస్తున్నాడు.

నేను అతను చెప్పిన మాటలు వింటూనే చుట్టూ చూశాను. అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్, జనరేటర్, కార్ పార్కింగ్ ఫెసిలిటీ బావుంది. ఎదురుగ్గా ప్లే గ్రౌండ్ ఉంది. పక్కనే సాయి బాబా గుడి. కనిపించేటంత దూరం లోనే సూపర్ స్పెషాలిటి హాస్పిటల్ ఉంది. ఇంకాస్త దూరం లోనే ఐమాక్స్ థియేటర్ ఉంది. ఈ ఏరియా నాకు బాగా అలవాటే.. ఆఫీస్‌కు మీటింగ్ లకు వస్తూ ఉంటాను కదా..!

“సర్!.. కేవలం ఫైవ్ పోర్షన్స్ మాత్రమే మిగిలాయి.. మీరు త్వరగా డెసిషన్ తీసుకుంటే మంచిది!” అన్నాడు నాతో సూపర్‌వైజర్.

“ఈస్ట్ ఫేసింగ్ ఒక్కటి కావాలి!” అన్నాను.

“కేవలం రెండంటే రెండే ఉన్నాయి సార్!.. అదీ థర్డ్ ఫ్లోర్‌లో మాత్రమే ఉన్నాయి.”

“అంటే? మిగతావన్నీ?” అడిగాను.

“అమ్ముడై పోయాయి సర్!.. అందుకే ఆలసించిన ఆశాభంగం!” అన్నాడు నవ్వుతూ. ఇతగాడికి మంచి మార్కెటింగ్ స్కిల్స్ ఉన్నాయనుకుంటూ

“ఓ.కే! నేను డెసిషన్ త్వరలోనే ఫోన్ చేసి చెబుతాను” అని ఇంటికి బయలుదేరాను.

కారులో ఇంటికి వస్తూ ఆలోచనలో పడ్డాను.

‘నాకిప్పుడు ఇల్లు అవసరమా? గవర్నమెంట్ హైస్కూల్లో గెజిటేడ్ హెడ్ మాస్టర్‌గా వర్క్ చేస్తున్నాను. మరో సంవత్సరంలో రిటైరవుతాను. నాకున్న ఒక్కగా నొక్క కొడుకు రఘు టీచర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. కోడలు సుమ కూడా టీచరే! రెండేళ్ల మనవడితో హాయిగా ఆడుకోవడం మాని మరో ఇంటికి మారి పోవాల్సిన అవసరం ఏమొచ్చింది?

మానవ సంబంధాలు, ఉమ్మడి కుటుంబ అనుబంధాలు ‘నేతి బీరకాయలో నేతి’ మాదిరిగా ఉన్న ఈరోజుల్లో పడుగు-పేకలా చక్కగా కలిసి పోతూన్న మా కుటుంబం వేరే కాపురానికి వెళ్లి పోవాలా? తప్పదా? తప్పుకాదా?’. ఇన్ని ఆలోచనలు ఒక్క సారిగా దండయాత్రకు వచ్చిన సైన్యంలా నా మనసును చుట్టుముడుతున్నాయి.

ఐదేళ్ల క్రితం నేను ఇక్కడికి దగ్గర లోనే మా పల్లెటూరులో కట్టిన విల్లా లాంటి అధునాతన భవంతి ఇన్నాళ్లు మాకెవ్వరికీ ఇరుకు కాలేదు.. గదులన్నీ విశాలమే.

‘మరి అందులో ఉండే మనుషుల మనసులు ఇరుకుగా మారుతున్నాయా?’

నా భార్య అని కాదు కానీ అలివేణికి సర్దుకుపోయే గుణం ఎక్కువే. నాకు పెళ్ళైన కొత్తలో ఉద్యోగానికి ఇల్లు దూరంగా ఉందని స్కూలుకు దగ్గరలో వేరే కాపురానికి వెళ్ళమని మా అమ్మా,నాన్నలు నాతో అన్నా కూడా అలివేణి ఒప్పుకోలేదు. తల్లిదండ్రులను వదలి వెడితే కొడుకు జన్మకు సార్థకత రాదని నాతో అంది. అంత మంచి సుగుణవతి నా సహధర్మచారిణిగా రావడం నా అదృష్టమే.

నా తల్లిదండ్రులను, తన తల్లిదండ్రులుగా చూసింది. వాళ్ళున్నంత కాలమూ ఏ లోటు రాకుండా సపర్యలు చేసింది. అక్కడి వరకూ బాగానే వుంది. ఇప్పుడు అలివేణి స్థానం, నేను మాస్టారు నుండి హెడ్ మాస్టార్ అయినట్టు కోడలి నుండి అత్త పోస్ట్ లోకి మారింది. పోస్ట్ మారింది కానీ పని తాను చేసే పని మారలేదు. పెరిగింది కూడా. అప్పుడు మా అమ్మానాన్నలకు చేసిపెడితే ఇప్పుడు కొడుకు, కోడలకు చేస్తోంది. అప్పుడూ, ఇప్పుడూ కూడా తనదే బాధ, బాధ్యత అయింది.

ఇంట్లో పనంతా అలివేణి ఒక్కతే చేసుకోవడమే నాకు మింగుడు పడని అంశంగా మారింది. అదే ఇప్పుడు అపార్ట్‌మెంట్ కొనాలన్న నా నిర్ణయానికి బలాన్నిస్తోంది.

ఇల్లు రావడంతో ఆలోచనలకు, కారుకూ ఒక్కసారిగా బ్రేక్ వేశాను.

కొడుకూ, కోడలు కూడా అప్పుడే వచ్చినట్టున్నారు. ఫ్రెషప్ అయి హాల్లో సోఫాలో కూర్చుని డైలీ పేపర్‌ను చదివే పనిలో బిజీగా ఉన్నారు.

రఘుకు బాధ్యత లేదు. సుమకు పని చేసుకోవాలన్న ధ్యాస లేదు. ఫైవ్ స్టార్ హోటల్లో ఆర్డర్ ఇచ్చి వెయిట్ చేస్తున్న కష్టమర్స్‌లా సోఫాలో దర్జాగా కూర్చున్నారు.

“మనవడు పడుకున్నాడా?” అన్నాను నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ.. ఇద్దరి నుండీ సమాధానం రాలేదు.

మళ్ళీ అడిగాను. వినిపించుకోనట్టుగానే ఉంటూ పేపర్‌ను తిరగేస్తున్నారు.

పెద్దలన్న గౌరవం మాటను పక్కన పెట్టినా, అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వాలన్న ఇంగితజ్ఞానం లేదనిపించింది.

నా రాకను పసిగట్టిన అలివేణి వంటింట్లో నుండి ఆత్రంగా వచ్చింది. “హమ్మయ్య! మీరూ వచ్చేసారు.. త్వరగా ఫ్రెషప్ అయి రండి. రఘుకు ఇష్టం అని అల్లం పకోడి వేశాను.. వేడిగా ఉంటేనే మీరు తింటారుగా!” అంటూ నా చేతిలో ఉన్న బ్యాగ్ తీసుకుంది.

“మింటూ గాడేడి?” అలివేణిని అడిగాను.

“ఇప్పటివరకూ ఆడి ఆడి అలసిపోవడంతో నిద్రపోయాడు..” అంది అలివేణి.

‘మనవడు ఎలా ఉన్నాడో కోడలు పట్టించుకోలేదు. నాకు సమాధానం ఇవ్వలేదు!’ మనసులో అనుకున్నాను.

“అల్లం పకోడి నాకిష్టం లేదు.. నాకోసం వడలు వేయచ్చుగా?” అలివేణితో కొంచెం బెట్టుగా అంటూనే పకోడీ ప్లేటు చేతిలోకి తీసుకున్నాను.

“ఈసారి చేస్తాను లెండి”! నవ్వుతూ అంది.

అలివేణి నవ్వితే నాకు చాలా ఇష్టం. బదులుగా బెట్టు చేయకుండా పకోడీ తింటూంటే..

“నాన్నా! మీరెప్పుడు వచ్చారు?” అప్పుడు అడిగాడు రఘు.

కోడలు లేచి నిలబడింది.

కోడలిని కూర్చోమని సైగ చేస్తూనే.. “మీరు పేపర్లో పడినప్పుడే వచ్చాను” అన్నాను.

“అమ్మా! మంచినీళ్లు” ఒక వైపు నా మాట వింటూనే రఘు అరిచాడు.

రఘు అడిగిన తక్షణమే “ఆ! తెస్తున్నా!” అంటూ హడావిడిగా వంటింట్లోకి వెళ్తున్న అలివేణితో ‘నువ్వు తేనవసరం లేద’ని చెప్పి

“సుమా! నీ భర్తకు మంచినీళ్లు పట్టుకుని రా” ఆర్డర్ వేసినట్టుగా అన్నాను.

సుమ తప్పదనుకుంటూ నెమ్మదిగా కదిలింది.

ఆమె మొహంలో రూపురేఖలు మారడం నా దృష్టి దాటి పోలేదు.

“అలివేణీ! ఇలా వచ్చి కూర్చో!” అంటూ పిలిచాను.

సుమ గ్లాసుతో మంచి నీళ్ళు తెచ్చి రఘుకు అందించింది.

“ఒక్కసారి మీరందరితో మాట్లాడే పని పడింది. నేను చెప్పేది వినాలి!” అన్నాను. రఘు నా మాట వినగానే గుటకలు వేశాడు. నెమ్మదిగా తాగి నా కేసి విచిత్రంగా చూశాడు.

“స్టాఫ్ మీటింగా నాన్నా?” రఘు అడిగాడు జోక్ వేస్తున్నట్లుగా.

“ఒకరకంగా అంతే.. నేను చెప్పేది పూర్తిగా విన్న తర్వాతే మీ ప్రశ్నలు అడగండి. మాట మధ్యలో అడ్డు రావద్దు!” అంటూ చెప్పసాగాను.

ముగ్గురు ఆత్రంగా నాకేసి వినడానికి సిద్ధంగా ఉన్నట్టుగా నన్ను గమనించసాగారు.

“అమలాపురం గడియార స్తంభం దగ్గరలో కడుతున్న అపార్ట్‌మెంట్‌లో ఒక ప్లాట్ తీసుకోవాలని అనుకుంటున్నాను.”

నా మాట వినగానే “ఎందుకు? అవసరం ఏమొచ్చింది? మనిల్లు విశాలమే కదా?” అన్నాడు రఘు అసహనంగా.

“మాట మధ్యలో అడగడం వద్దన్నానుగా!” సీరియస్‌గా అన్నాను.

“సారీ! నాన్నా!” రఘు అపాలజీ ఇచ్చాడు.

“ఓకే!” అన్నాను.

అలివేణి నాకేసి సందేహంగా చూసింది.

“ఇది మీ నిర్ణయమా? లేక అత్తయ్యగారి అభిప్రాయమా?” కోడలు కూడా నవ్వుమోహం పెట్టుకుని అడగలేక అడిగింది.

“పూర్తిగా వినండి. టెన్షన్ ఎందుకు? మీ అత్తయ్యకు కూడా ఇప్పుడే తెలిసింది!” సుమతో అన్నాను.

రఘు ఆలోచనలో పడినట్లుగా మొహం పెడుతూ “ఎందుకు నాన్నా? ఉమ్మడి కుటుంబాలు కనుమరుగై పోయాయని, తండ్రీ కొడుకులు, కొడుకు పెళ్లవడంతోనే విడిపోతున్నారని, మనకు మాత్రం ఆ బాధ లేదన్న మీరే ఇలా అపార్ట్‌మెంట్ కొనాలనుకోవడం నాకు నచ్చలేదు!” చెప్పాడు. ఉండబట్టలేక అనేశాడు.

“నేను అపార్ట్‌మెంట్ కొంటున్నానన్నానే గానీ.. వేరే కాపురానికి అని అనలేదే.. నువ్వే నోరు జారావురా రఘు! నీకు ఆ ఆలోచన ఉందా?” బదులుగా చురక అంటిస్తూ అడిగాను వాడికేసి సీరియస్‌గా చూస్తూ..

“ఎందుకండి? ఈ రోజు కొత్తగా మాట్లాడుతున్నారు?” అలివేణి భయపడుతూ అంది.

వీళ్ళ ఆరాటం చూస్తే నన్ను పూర్తిగా మాట్లాడనిచ్చేలా లేరు. తప్పదు మధ్యలోనే సమాధానాలు ఇవ్వాలనుకున్నాను.

“అవసరం వచ్చింది అలివేణి! అదీ నీ వల్లే!” అలివేణి కేసి చూస్తూ అన్నాను.

“మీ నిర్ణయానికి కారణం నేనా?” అలివేణి ఆశ్చర్యంగా అంది.

రఘు, సుమలు నాకేసి ఏమి చెబుతానా? అన్న ఆసక్తితో చూస్తున్నారు.

“అమ్మ ఏం తప్పు చేసింది?”రఘు అడిగాడు.

“అదే చెప్పబోతున్నాను. ఇక్కడ మీ ఇద్దరితో పాటు నేను కూడా ఉద్యోగం చేస్తున్నాను. మనకు వారంలో ఒక ఆదివారం అయినా ఉంటోంది. అలివేణికి వారమంతా పనే.. ఇరవై నాలుగ్గంటలూ ఆన్ డ్యూటీ లోనే.. నాతో పాటు మిమ్మల్ని, మనవడిని కూడా చూడాల్సి వస్తోంది. మోస్తున్నారు కదాని మోయలేని భారం వేస్తే.. ఎవరైనా చతికిలపడిపోతారు.. ఈ వయస్సులో భార్య అవసరం నాకు చాలా ఉంది. అవసాన దశకు త్వరలోనే చేరుకోబోతున్న నాకు ఆమె ఆరోగ్యం ముఖ్యం. ఎందుకంటే ఆమె ఆరోగ్యంగా ఉంటేనే నా అవసరాలను పట్టించు కోగలదు కాబట్టి.

మీకు వారం రోజులు సమయం ఇస్తున్నాను. ఈ వారం రోజుల్లో మీలో మార్పు కనబడాలి. ఇక్కడ మార్పు అనివార్యం. ప్రాథమిక అవసరం.

సుమా! నువ్వు వీలైనంతలో మీ అత్తగారికి చేదోడు, వాదోడుగా ఉండాలి. ఆదివారం మొత్తం వంట బాధ్యత నువ్వు చూసుకోవాలి.

రఘు!.. ఇంటికి అవసరం అయిన సరుకులు తేవడం వంటి పనులు నువ్వే చేయాలి. నేను చేయను. చేయలేను..

ఈ మార్పు రావాలి, ఎంత త్వరగా వస్తే అంతా మంచిది.. మీకు కష్టంగా అనిపిస్తే.. మేమిద్దరమూ వెళ్లిపోతాం. బలవంతం లేదు” అని చెప్పాను.

అలివేణి నాకేసి విచిత్రంగా చూస్తోంది. రఘు,సుమలు ఒకరిమోహాలు ఒకరు చూసుకుంటున్నారు.

“వారం రోజుల్లో మీ నిర్ణయం చెప్పాలి!” సీరియస్‌గా అన్నాను.

ఆలోచించుకోవడం కోసం వాళ్ళు గదిలోకి వెళ్లారు. నా వెనుకే అలివేణి గదిలోకి వచ్చింది.

ఇప్పుడు అలివేణి, నేను మాత్రమే ఉన్నాం.

అలివేణి ఇప్పుడు నోరు విప్పింది.

“వాళ్ళిద్దరిలో ఒక్కరోజులో మార్పు వస్తుందా?” అంది.

“అందుకేగా వారం రోజులు గడువిచ్చింది?” అంటూ అలివేణికి దగ్గరగా జరిగాను.

ఆమె కళ్ళ నుండి కన్నీళ్ళు నా చేతి మీద పడ్డాయి.

తడిబారిన కళ్ళను తుడుస్తూ.. “పిచ్చిదానా!.. నువ్వు నాలో సగం.. నీ బాధ నేను గమనించ లేదనుకున్నావా? ఇంటెడు చాకిరి చేస్తూ పంటికింద బాధను అదిమి పెట్టావు సరే.. కానీ కళ్ళను దాచలేవుగా.. నీ కళ్ళను చూసి నీ బాధను గమనించాను.. భర్తను భరించవచ్చు. కానీ బాధలను ఎంత వరకూ భరిస్తావ్?”

అలివేణి నా ఒడిలో వాలుతూ

“వాళ్ళు వెళ్ళిపోయినా కూడా నేను భరించలేనండి.. మనవడు నా ప్రాణం!” అంది.

“నాకు మాత్రం ప్రాణం కాదా?.. మార్పు కావాలన్నా.. రావాలన్నా.. కొంత కాఠిన్యం తప్పదు. అయినా.. వాళ్లకు నీ అవసరం చాలా ఉంది.. డేకేర్‌లో బాబును వేసినా నీ అంత బాగా ప్రేమగా చూసుకోరు.. అందినప్పుడే జుట్టు పట్టుకోవాలి. అవసరం ఉన్నప్పుడే అభిప్రాయాలు చెప్పాలి.. రేపటి మార్పు కోసం ఎదురు చూద్దాం” అంటూ ధైర్యం చెప్పాను.

“కొడుకు, కోడలు మీరు చెప్పినట్టు వింటే.. అపార్ట్‌మెంట్ కొనరు కదా..?” అలివేణి అమాయకంగా నన్నడిగింది

“అప్పుడూ.. కొంటాను.”

“ఎందుకు? వాళ్లనుండి నన్ను దూరం చేయాలనా?” బాధగా అంది.

“లేదు”

“మరెందుకు?”

“ఆ అపార్ట్‌మెంట్ అద్దెకు ఇస్తాను.. ఆ డబ్బులు మనవడి పేరుతో బ్యాంక్‌లో దాస్తాను.. నా పేరు పెట్టుకున్న మనవడికి ఆ మాత్రం గిఫ్ట్ ఇవ్వక పోతే ఎలా?” నవ్వుతూ అన్నాను.

నా మనసు బాగా అర్థం చేసుకున్న అలివేణి ఇక మాట్లాడలేదు. నన్ను చూస్తూ ఉండి పోయింది.

***

ఆదివారం కదాని కొంచెం లేటుగా నిద్ర లేవాలనుకున్న నేను కిచెన్ గది నుండి చప్పుడు వినబడటoతో.. మంచం పై నుండి చప్పున లేచాను. ప్రక్కన అలివేణి ఇంకా నిద్రలోనే ఉంది.

‘మరి వంటింట్లో నుండి చప్పుడు ఎలా వస్తోంది?’ అనుకుంటూ లేచాను. వంటింటి కేసి నడిచాను. అక్కడ దృశ్యం చూసి ఆశ్చర్య పోయాను.

సుమ చిక్కని కాఫీ కలుపుతుంటే, రఘు కూరలు కట్టర్‌తో కట్ చేస్తున్నాడు.

‘నిజమేనా?’ అనుకుంటూ కళ్ళు నలుపు కుంటూ మళ్ళీ చూశాను.

కల కాదు.. నిజమే. కళ్ళ ముందు కొడుకు,కోడలు అలా ఉదయమే పని చేస్తూ కనబడేసరికి ఆనందంతో వంటింట్లోకి వెళ్ళాను.

నన్ను గమనించిన సుమ నన్ను చిరునవ్వుతో “శుభోదయం మామయ్య గారు!” అంటూ పలకరించింది.

“శుభోదయం సుమా! కాఫీ మీకా?”చమత్కరిస్తూ అడిగాను.

“కాదు! మనకు మామయ్య గారూ!” అంది అభిమానంగా చిరునవ్వుతో.

“రఘు! ఒక్కరోజులో ఇంత మార్పా?” కప్పుల్లో కాఫీని జాగ్రత్తగా పోస్తున్న వాడిని అలాగే చూస్తూ ఆశ్చర్యంగా అడిగాను.

వాడు నాకేసి ప్రేమగా చూస్తూ..

“మార్పు ఎప్పుడూ మంచిదే కదా నాన్నా!’ అన్నాడు రఘు.

ఆప్యాయంగా పలకరిస్తూ, బాధ్యతగా పనులు చేస్తున్న వారిని మెరుస్తున్న కళ్ళతో తృప్తిగా చూశాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here