నిరాడంబరత

0
3

[dropcap]ఆ[/dropcap] రోజు సోషల్ టీచరుగారు చేప్పే పాఠం పూర్తయింది. తను చెప్పిన విషయాల మీద పిల్లల్ని ప్రశ్నలు వేశారు. వాళ్లూ సంతృప్తికరంగానే జవాబులు చెప్తున్నారు.

సరిత మాత్రం కాస్త పరధ్యానంగా వున్నది. ఆ అమ్మాయి వంక తేరపార చూశారు టీచరుగారు.

కుడిపాపిట తీసి బాగా కిందకు దువ్వింది. ఒకవైపున కనుబొమను కూడా కప్పేస్తున్నది జుట్టు. నడినెత్తిన పైకి ఉబ్బెత్తుగా వచ్చేటట్లుగా జుట్టును అమర్చి కదలకుండా పిన్నులు పెట్టింది. నుదిటిన చిన్న స్టిక్కరు బొట్టు కుడి చేతికి ఫ్రెండ్‌షిప్ బాండ్ తగిలించుకుని వున్నది. మిగతా అమ్మాయిలందరిలోకి వేరుగా కనపడుతున్నది. అలంకరణ పట్ల బాగా శ్రద్ధ పెడుతున్నదని అర్థమయింది. ఇలాగే వదిలేస్తే సరితను చూసి ఇంకొందరు తయారవుతారు అనుకున్నారు టీచరుగారు.

“చూడండి అమ్మాయిలూ ఎవరైనా మహిళా శాస్త్రవేత్తల పేర్లు చెప్పగలరా?” అనడిగారు.

“మేడమ్ క్యూరీ” అని చెప్పారు

“కరెక్టే. నేనీ రోజు మరొకరి గురించి చెప్తాను వినండి. మనం ఆడవాళ్ళం. అలంకరణ పట్ల మోజు వుంటుంది. కాని అది మితంగా వుండాలి. నిరాడంబరతలోనే, అసలైన అందం వుంటుంది. అందం వెంట పరుగులు తీస్తూ మన చదువులు, మన భవిష్యత్తును, నిర్లక్ష్యం చేయకూడదు.

నేను మీకీ రోజు భారతదేశంలోని మొట్టమొదటి మానవశాస్త్ర నిపుణురాలైన అయిన ఇరావతి కార్వే గురించి చెప్తాను. ఈమె 1905లో జన్మించారు. బర్మాలో ప్రవహించే ఒక నది పేరు ఈమెకు పెట్టారు. చిన్నప్పడు ఆమె పూనా లోని ఆడపిల్లల హుజూర్‌పాగా వసతి పాఠశాలలో చేరారు. ఆ తర్వాత ఫెర్గ్యూసన్ కళాశాలలో చదివారు. అక్కడే తత్వశాస్త్రంలో పట్టా పుచ్చుకున్నారు.

1928లో హి.హెచ్.డి చేయటానికి జర్మనీలోని విల్లెల్మ్ అనే మానవశాస్త్ర సంబంధమైన సంస్థకు వెళ్లారు. ఆమె అసాధారణమైన తెలివితేటలు కలిగిన స్త్రీ. ఆమె భర్త దినకర్ ధోండో కార్వే. ఇరావతి కార్వే శాస్త్రవేత్తగా భర్త తోడ్పాటు ఎంతగానో వుండేది. పునాలో స్కూటర్ నడిపిన మొదటి స్త్రీ ఆమె.

ఇరావతి ఎప్పుడూ అలంకరణ జోలికిపోలేదు. నుదుటిన బొట్టు కాని, మెడలో మంగళసూత్రం కాని వేసుకునేవారే కాదు. చిన్నప్పుడే పాఠశాలలో సంస్కృతం నేర్చుకున్నారు. మహాభారతాన్ని ఆసాంతం చదివారు. మహాభారతాన్ని కొత్త కోణంలో నుంచి చూసి తనదైన శైలిలో ‘యుగాంత్’ను రచించారు. 1967లో దీనికి మరాఠీ సాహిత్య అకాడెమీ పురస్కారం లభించింది.

జర్మనీ నుండి తిరిగి వచ్చిన తర్వాత ముంబయిలోని మహిళా విశ్వవిద్యాలయంలో రిజస్టార్‌గా ఇరావతి పని చేశారు. ఆ తర్వాత పూనాలోని డెక్కన్ కళాశాలలో సాంఘిక శాస్త్ర రీడర్‌గా జీవితాంతం అక్కడే పని చేశారు. మన భారతదేశంలో కుటుంబం బంధుత్వం, కులం, మతం, ప్రముఖ పాత్ర వహిస్తాయిని ఆమె గట్టి నమ్మకం. సమాజాన్ని మరింత బాగా అర్థం చేసుకోవటానికి పురావస్తు శాస్త్ర పరిశోధనలు చేసేవారు.

ఈమె ఇంగ్లీషు భాషలో వందకు పైగా పుస్తకాలు, పత్రాలు రచించారు. మరాఠీలో కూడా 8 పుస్తకాలు వ్రాశారు. ఈ పుస్తకాల ద్వారా తన భౌతిక మానవ శాస్త్రం, పురావస్తు శాస్త్ర పరిశోధనల గురించి వివరించారు. అన్నిటికన్నా ముఖ్యంగా నదుల మీద ఆనకట్టలు కట్టినప్పుడు భూమిని ఇళ్లనూ, కోల్పోయిన ప్రజల బాధల్ని గురించి ఎంతగానో వివరించారు.

శ్రీ కే.సి మల్హోత్ర. హెచ్.డి శంకలియ ఈమె శిష్యురాల్లో ప్రసిద్ధులు, పరిశోధనల కోసం, తిరిగేటప్పుడు భోజనానికీ, వసతికీ ఇబ్బంది పడేవారు. శలవు రోజుల్లో కూడా తన పిల్లలతో సహా పరిశోధనల కోసం తిరుగుతూ వుండేవారు. వర్తమాన కాలానికీ, గత కాలానికి వున్న సంబంధాన్ని ఆమె శాస్త్రబద్ధంగా తెలియజేశారు. మన సంస్కృతి పట్ల ఆమె మంచి అవగాహనతో వుండేవారు.  తన రచనల్లో స్త్రీ పాత్ర చిత్రణను చాలా సున్నతంగా చేశారు. పరిశోధనల్లో ఆమె, చేసిన కృషి తరువాతి వరికి మార్గదర్శకమైంది. ఇన్ని తెలివితేటలు కలిగి, అపారమైన మేధస్సును కలిగి వుండి కూడా తన జీవితంలో నిరాడంబరంగా, సాదా సీదా జీవితాన్ని గడిపారు. ఎప్పుడూ ఆడంబరాల వెంట పరుగులు తీయలేదు. మీరంతా కూడా అవసరమైన అలంకరణలకు ఎక్కువ ప్రాధాన్యమివ్వొద్దు. ఇరావతి కార్వే లాగా గొప్ప పేరు తెచ్చుకోవాలి. గొప్ప పరిశోధకులు గాను ఎదగాలి” అన్నారు.

ఇంతలో బెల్ మోగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here