జగన్నాథ పండితరాయలు-7

3
3

[తెలుగు సాహిత్య ప్రపంచంలో చారిత్రిక కాల్పనిక కథా రచనకు ఎంతో చరిత్ర వుంది. ఆ రచనా సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ సంచిక అందిస్తోంది ప్రముఖ రచయిత విహారి రచించిన చారిత్రిక కాల్పనిక నవల ‘జగన్నాథ పండితరాయలు’.]

[శేషవీరేశ్వరుడు, జగన్నాథుడూ దుర్గాదేవి ఆలయానికి వెళ్తారు. దర్శనం, అర్చన పూర్తి చేసుకుని బయటికి వచ్చి ఓ ప్రక్కగా కూర్చున్నారు. అక్కడికి భట్టోజీ, ఆయన శిష్యులు వస్తారు. శేషవీరేశ్వరుడు లేచి నిలబడి భట్టోజికి నమస్కరించి, జగన్నాథుని పరిచయం చేస్తాడు. జగన్నాథుని ఎగాదిగా చూసి ‘అఁహాఁ’ అని దీర్ఘం తీసి వెళ్ళిపోతాడాయన. భట్టోజి గురించి వివరంగా జగన్నాథునికి చెప్తాడు. శేషవీరేశ్వరుడు. దర్శనం చేసుకుని బయటకి వచ్చిన భట్టోజి జగన్నాథుని హేళన చేస్తాడు. గురువుగారి హాస్యానికి శిష్యులు బెకబెలలాడుతారు. భట్టోజి వెటకారానికి ధీటుగా ఒక శ్లోకాన్ని చదువుతాడు జగన్నాథుడు. భట్టోజీ రుసరులాడుతూ వెళ్ళిపోతాడు. శేషవీరేశ్వరుడు, జగన్నాథుడూ ఇంటికి బయల్దేరుతారు. దారిలో ఎదురయిన నాగేశుడు భట్టోజి శిష్యులు తనతో అన్న ఎత్తిపొడుపు మాటలని వారికి చెప్తాడు. అప్పుడు జగన్నాథుడు దుర్గాదేవి ఆలయం వద్ద జరిగినది చెప్తాడు. జగన్నాథుడు హిందుస్థానీ సంగీత సాధన చేస్తాడు. వింటున్నవారు పరవశులవుతారు. అక్కడికి జగన్నాథుడికి ఈ మధ్యే పరిచయం అయిన వెంకటరామశాస్త్రి వస్తాడు. మాటల సందర్భంలో కామేశ్వరి గర్భం దాల్చిన విషయం ముంగండలో తెలియజేశారా అని అడుగుతాడాయన. ఎవరైనా వెడుతుంటే కబురు చేద్దామని అనుకుంటున్నాం అంటాడు జగన్నాథుడు. తన బావమరిది వచ్చేవారంలో వెళ్ళే అవకాశం ఉందని, అతని ద్వారా ఆ శుభవార్తని చేర్చవచ్చని అంటాడు శాస్త్రి. సంకట మోచన్ ఆలయంలో తులసీదాస్ రామచరిత్ మానస్ చదివి వినిపిస్తున్నారని అక్కడి వెళ్తారు. దశాశ్వమేథ్ ఘాట్‌కి ఒకింత ఈవల ఓ సాయంత్రం జరిగిన శాస్త్ర చర్చలో భట్టోజిని ఓడిస్తాడు జగన్నాథుడు. ఇక చదవండి.]

అధ్యాయం-9

[dropcap]మ[/dropcap]ధ్యాహ్నం భోజనాల తర్వాత – కొంత సమయం గడిచింది. ఆడవాళ్ళు వంటయిల్లు సర్దుకుని వచ్చేసరికి పొగడచెట్టు కింద అరుగుమీద కూర్చుని ఏదో చర్చించుకుంటున్నారు శేషవీరేశ్వరుడు, జగన్నాథుడు. వారికి దూరంగా నాగేశుడూ, శాస్త్రీ. మూగ ఎండకాస్తోంది. వాకిట్లో పూలమొక్కలు చిరుగాలికి సయ్యాటలాడుతున్నై. ఎండలేకపోవటంతో వాతావరణం అంతా ఆహ్లాదకరంగా ఉంది. మగవాళ్లకు కొద్దిదూరంలో జాజిపందిరి కింద కూర్చుని కబుర్లలో పడ్డారు – ఆడవాళ్లిద్దరూ. మాటల మధ్యలో

“స్మరోనామం నామం త్రిజగదభిరామం తవ పదం” అంటూ శ్లోకాన్ని గొంతెత్తి రాగయుక్తంగా పాడుతున్నది కామేశ్వరి.

కామేశ్వరిని మురిపెంగా చూస్తూ గానాన్ని ఆస్వాదిస్తోంది పర్వతవర్థని. కమ్మెచ్చున తీగలాగినట్లున్నది కామేశ్వరి స్వరం. ‘ఎంత మార్దవమో, ఎంత రసతరంగితమో’- అనుకున్నది మనసులో.

“యయాపాతం పాతం పద కమలయోః పర్వతచరో

హరో హా! రోషా உ ర్ద్రామను నయతి శైలేంద్ర తనయామ్॥”

శ్లోకం పూర్తయింది. చప్పట్లు కొడుతూ “మా కామేశ్వరి కంఠమే కంఠం. కోకిల లెందుకు పనికొస్తయ్..” అన్నది మెప్పుదలగా.

“నే నెప్పుడు పాట మొదలెట్టినా నీ ప్రశంసలే జంట నడక సాగిస్తయ్” అన్నది కామేశ్వరి. ఆ మాటల్లో ఆమె వినయమూ, సంతోషమూ, ఆత్మ ముగ్ధత్వమూ ముప్పిరిగొన్నై.

వీళ్ల సంభాషణంతా వింటున్నాడు జగన్నాథుడు. “బాగుంది – మీ సల్లాపం. కొంచెం మమ్మల్నీ మాట్లాడుకోనివ్వండి” అన్నాడు.

పొగడచెట్టుకు రెండడుగులు ఎడంగా ఎదురువైపు రాతి తిన్నె. దానిమీద వచ్చి కూర్చున్నారు శాస్త్రి, నాగేశభట్టూ. “త్వరగా ఆ శ్లోకం భావం చెప్పమ్మా. మా చర్చని కొనసాగించుకుంటాం” అన్నాడు శేషవీరేశ్వరులు. “అంతకంటే ముఖ్యంగా వేరే కార్యార్థులమై వెళ్లాల్సి వుంది” అన్నాడు జగన్నాథుడు.

క్షణం ఆలోచనతో భావస్ఫురణం చేసుకుని చెప్పింది కామేశ్వరి.

“మహేశ్వరుడంతటి జితేంద్రియుని కూడా పార్వతి సన్నిధిలో ఇంద్రియజితుణ్ణి చేసి, మన్మథుడు ఆ పర్వత రాజపుత్రి పాదాలమీద పడేశాడు. ఇంతటి సమ్మోహనశక్తి ఆ మదనునికి, మహాలక్ష్మి పాదారవింద సేవనం వలననే ప్రాప్తించింది”

“బాగుంది. జగన్నాథుని ‘లక్ష్మీలహరి’ స్థిరమైన, చిరమైన ప్రథితని సాధిస్తుంది.” అన్నాడు శేషవీరేశ్వరుడు. జగన్నాథుడు గురువందనం చేశాడు.

పర్వత వర్థనీ, కామేశ్వరీ వీరివైపు తిరిగి ప్రేక్షకత్వంతో శ్రోతలవుతూ మౌనంగా కూర్చున్నారు.

నాగేశభట్టు, “ ‘సుధాలహరి’లోని శ్లోకం చదువుతాను” అంటూ “త్రాతామీ உవార్త రక్షాః, ప్రతిదిన విహితాஉ నేక గీర్వాణ రక్షాః..” అనే మూడవ శ్లోకాన్ని పఠించాడు.

“బాగుంది.. బాగుంది” అన్నాడు శాస్త్రి.

శేషవీరేశ్వరుడు, “సూర్యకిరణ ప్రభావం వలన మానవుల దుష్టప్రవృత్తులు నశిస్తాయని, ‘దుర్వృత్తధ్వంసదక్షాః’ అనే ప్రత్యేక విశేషణం జగన్నాథుని ప్రకృతి శాస్త్ర పరిశీలన పాటవాన్నీ, వెల్లడి చేస్తున్నది” అని వివరణ ఇచ్చాడు.

ఇంతలో రానే వచ్చాయి రెండు గుఱ్ఱపు బండ్లు, గుఱ్ఱాలు గిట్టల చప్పుడు చేసి ఆగి అక్కడక్కడే వల్గితం చేయసాగాయి. బండ్లు తోలే దృఢకాయులు బండ్లు దిగి వచ్చి వీరికి అభివాదం చేసి, పక్కకి నిలిచారు.

శేషవీరేశ్వరుడు లేచి జగన్నాథుని వైపు చూశాడు. అందరూ లేచారు.

ఈ కార్యక్రమం గురించి తెలిసిన పర్వతవర్థనీ, కామేశ్వరీ లోపలికి నడిచారు. శేషవీరేశ్వరుడూ, జగన్నాథుడూ కూడా ఇంట్లోకి వెళ్లి ప్రయాణానికి సిద్ధమై వచ్చారు.

కామేశ్వరి ఇచ్చిన మజ్జిగ తాగి అందరూ కాలు కదల్చారు. పర్వతవర్థని, కామేశ్వరీ వీధి వాకిలి దాకా వచ్చారు. కామేశ్వరి జగన్నాథుని కళ్లల్లోకి చూస్తూ. మౌనభాషలోనే ‘జాగ్రత్త’లు చెప్పింది.

బండ్లు బయల్దేరాయి. ఆడవాళ్ళిద్దరూ బండ్ల గమనాన్నీ, తమ వారి పయనాన్నీ నిలబడి చూస్తుండిపోయారు.

-ప్రయాణంలో జగన్నాథునికి క్రితం సంవత్సరం ‘జాతర’ రోజున జరిగిన ఘటనలన్నీ పూసగుచ్చినట్లుగా గుర్తుకొచ్చాయి.

***

ఆరోజు – మధ్యాహ్నం ఎండ నిప్పులు చెరుగుతోంది.

కాలభైరవాలయానికి కూతవేటు దూరంలో ఎటుచూసినా కోలాహలం.

అనేక రకాలుగా వీరంగాలు సాగుతున్నాయి. ఎవరు ఆడుతున్నారో, ఎవరు పాడుతున్నారో తెలియని గందరగోళంగా వుంది. సగం మంది మొహాల్లో సంతోషం, వీరరౌద్రరస ప్రతిఫలనం. పూనకంతో బహిరంగంగా, దైహికంగా ఊగిపోతున్నారు. ఒళ్ళంతా చెమటపట్టి ఆకారాలు చీదర చీదరగా కనిపిస్తున్నాయి.

ఈ వలయానికి మధ్యగా – కొద్దిసేపట్లో ముగియబోయే తమ బతుకుల గురించి తెలుసుకోలేని మూగజీవాలు – తింటున్న ఆకుల్ని నెమరేసుకుంటూ మెడలను ఆడించుకుంటున్నాయి. గొర్రెపిల్లలకీ, మేకపిల్లలకీ పూలదండలు, వేపమండలూ మెళ్లో కట్టి అలంకారాలు బాగానే చేశారు. మొహాలకు పసుపు పూసి కుంకుమబొట్లు పెట్టారు. ఆడవాళ్లు కొంతమంది చేతుల్లో వేపమండలు ఊపుతూ ఎగురుతున్నారు.

ఆవలి, ఈవలి చింతచెట్లు, వేపచెట్లు నింపాదిగా కొమ్మల్ని ఆడిస్తున్నాయి.

“తల్లీ పెద్దమ్మో, అమ్మో, పోలేరమ్మ, అయ్యా పోతరాజు దేవరా” జనం అరుస్తున్నారు.

వీరముష్టి కొంగవాలుకత్తి పుచ్చుకుని చిత్రవిచిత్ర భంగిమలతో అడుగులతో నేలను దున్నుతూ, కనుగ్రుడ్లు గోళాలతో నింగిని గద్దిస్తున్నాడు. అతని చిందులు చూసేవాళ్ల కళ్లకి విందు చేస్తున్నాయి.

అతని ఎదురుగా దున్నపోతు. దాని నాలుగు కాళ్లకూ తాళ్లు కట్టి దూరంగా నాలుగు పొట్టి గుంజలకు ముడివేశారు. కొమ్ములకు ఆముదంతో తడిపిన గుడ్డలు చుట్టి వుంచారు. వాటికి నిప్పు ముట్టించగానే అది ఆ బాధకు తట్టుకోలేక పిచ్చి పట్టిన దానిలా అటూ ఇటూ గుంజుకుంటూ అరుస్తుంది. డప్పులు జోరు జోరుగా మోగుతాయి. ఆ మోతలో దాని అరుపులు భీకరంగా వుంటాయి. ఆ హింసానందాన్ని అనుభవించటం – జనం అవిద్యకీ, అమాయకత్వానికి పరాకాష్ట!

ఆ ఆనందం ఎత్తులెక్కిన తర్వాత విచ్చలవిడిగా బూతులు తిట్టుకుంటారు. పాత కక్షలున్నవాళ్లు పనిలో పనిగా శత్రువుల మీద తిట్లతో కసి తీర్చుకుంటారు. ఆ సమయంలో ఎవర్ని ఎవరు తిట్టినా ఏం చేయకూడదు. అదో సామాజిక నియమం, నిబంధన.

తర్వాత దున్నపోతు నాలుగు కాళ్లనీ లాగి కట్టేసి, మెడకి ఉచ్చు బిగించి, గుడిరాతిమీద పెట్టి కదలకుండా పట్టుకుంటారు. ఇంక, ఎంత లావు దున్నయినా కుక్కిన పేనే. మెట్టు మీద ముట్టె. మెడ బండకివతల. వీరముష్టి ఒక్కవేటుతో దాని మెడ నరుకుతాడు. రక్తం చిమ్మించి విగ్రహం మీద పడేట్టు చేస్తాడు. అక్కడ నేలంతా నెత్తురుతో బురదతో చీదర చీదర అవుతుంది. మెడ నరకగానే దున్నపోతు నెత్తురును పాత్రలోకి పట్టి, గ్రామ దేవతలకు తాగిస్తారు. మొక్కులు తీర్చుకుంటూ వీరంగాలు వేస్తారు. ఆ రక్తంలో బియ్యం కలిపి, మూట కట్టుకుని, పొలిమేరలకు పోయి పొలి చల్లి వస్తాడు.

‘పొలి’ ఇరుగుపొరుగు వూళ్లనుంచీ ఏవిధమైన అంటురోగాలూ, ఉపద్రవాలూ రాకుండా కాపాడుతుందని జనం నమ్మకం. ఆ నమ్మకం ఆచారంగా మారింది. ఆచారం సంప్రదాయంగా స్థిరపడింది. ఇలాంటి సంప్రదాయాలే జనాల ఒళ్లూ, ఇళ్లూ గుల్ల చేస్తున్నాయి!

ఇప్పుడు దున్నపోతు కొమ్ములకి నిప్పు అంటించబోయే సమయం ఆసన్నమైంది.

అదిగో – సరిగ్గా అప్పుడే తాను బరిలోకి వెళ్లాడు – పక్కగా శంకరశాస్త్రీ, నాగేశభట్టూ, ఇంకా నలుగురు శిష్యులూ వున్నారు. కాశీ నుంచీ వచ్చిన తనకు జాతర చూస్తున్న వాళ్లల్లో ఒకరిద్దరు తెలిసినవారూ వున్నారు. గంగ ఒడ్డున హారతి సమయంలో కనిపించే వాళ్లు. చిరునవ్వు పరిచయాలు అవి.

తన దృష్టి తూర్పు పడమరల్లో ఎత్తయిన గద్దెలమీద తమ పరివారంతో కూర్చుని వున్న ఇద్దరు మహాయోధుల్లాంటి వ్యక్తుల మీద నిలిచింది. వారిద్దరూ సంపన్నులని చూడగానే తెలుస్తున్నది. వారు ఒకరికొకరు ప్రత్యర్థులు. ఆ గ్రామంలో చెలరేగిన హింసకూ, హత్యలకూ-ప్రేరణా, కారణం ఈ ఇద్దరు ప్రముఖులే అని జనం అందరికీ తెలుసు. జాతరకి వారిదే నాయకత్వం. ఇద్దరి అనుచరగణం సంఖ్యలో తక్కువేమీ లేదు.

తామంతా కుర్రకారువైపుకి నడిచారు.

“ఈసారి మేము మీతో కలవొచ్చా” అంటూ ఒక యువకుని భుజం తట్టాడు. తాను. తమని చూసీ, ఈ ప్రశ్న విని నిశ్చేష్టులయినారు వాళ్లు. ఈ ప్రశ్నకి సమాధానం ఇవ్వటానికీ, తేరుకోవటానికీ కొన్ని క్షణాల సమయం పట్టింది వాళ్లకి. ఈ మాటల్ని వెనక వరుసలో వున్నవాళ్లు కూడా విన్నారు.

“అయ్యో! ఈ బాపనయ్యలు దున్న కొమ్ములకి నిప్పంటిస్తారంట” అని వాళ్ల భాషలో గట్టిగా అరిచారొకరు. వాళ్లు అర్థంచేసుకున్న తీరు ఆవిధంగా వుంది!

ఒక్కసారిగా సన్నివేశం మారింది. జాతర నాయకులు దృష్టి మరల్చారు. తూర్పువైపు నుంచీ వయస్సు మళ్లిన పెద్ద చకచకా వీళ్ల సమీపానికి వచ్చాడు. చేతిలో దుడ్డుకర్ర, తలపాగా, బుంగమీసాలు. మోకాళ్లపైకి ఎగగట్టిన పంచె, అరచొక్కా. ఆకారం చాలా గంభీరంగా వుంది. ఆయన వెనగ్గా పదిమంది దాకా వచ్చేశారు.

ఈ తతంగం చూసి పడమర వైపు నుంచీ మరో పెద్దమనిషి వీళ్లవైపు వచ్చాడు. భారీకాయం, స్ఫురద్రూపం, అంచులపంచె, గళ్ల అంగీ, తలపాగా, చేతిలో పొడుగాటి పొన్నుకర్ర.

“ఏందయ్యా. ఇది మీ యవ్వారం కాదు. ఆ చెట్టు కింద కూకుని వేడుక సూసుకోండి” అన్నాడు తూర్పు పెద్ద.

“మా బలరామ్ చెబుతుండేదే ఫత్తా ఇధర్” అన్నారెవరో ఉర్దూ కలిసిన భాషలో. వెంటనే పడమర పెద్ద వెనక వచ్చిన వారిలో ఒక వ్యక్తి “ఐసా కభీ నహీ హెూగా, హమారా సాబ్ బోల్‌నా” అన్నాడు.

“పరశురామ్, సహీ బాత్” అన్నారెవరో. తనకి పరిస్థితి అర్థమైంది. అటు బలరాముడు, ఇటు పరశురాముడు. ఇద్దరి వెనుకా వారి వారి సమూహాలు ఉన్నాయి. క్షణం ఆలోచించాడు తాను. చుట్టూ వున్న అందరి మొహాల్లోకి చూశాడు. సన్నగా నవ్వేడు. పెద్దాయన నుద్దేశించి, “బలరామ్ గారూ, పరశురామ్ గారూ, మేము కాశీవాసులం. అక్కడ శాస్త్రాలు చదువుకుంటున్నాం. మనం ఆ పక్కకి పోయి కూచుని నిదానంగా మాట్లాడుకుందాం” అన్నాడు.

“మీతో ఏందయ్యా మాట్లాడేది! అసలు జాతరలో మీ జోక్యమేమిటి? బాపనయ్య ఎవసాయంలా ఇందులోకి దిగకండి”. “మీ కెందుకీ యవ్వారం. అవతలికి పొండి. మా పనికి జాగవుతోంది” ఇద్దరి తాలూకు మనుషులూ అరిచే ధోరణిలో మాట్లాడ్తున్నారు.

“కాదు. కేవలం కొద్దిసేపే ముందు నేను చెప్పేది విని ఆ తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి” తన మాట వాళ్ల ముందు చెవిటివారి ముందు శంఖంలా అయింది. ఈ లోగా పరశురామ్ కంచుకంఠంతో, “ఏమిరా ఆలస్యం? కానీండి” అని అరిచాడు. ఇటు బలరామ్ కూడా “చలో.. చలో..’ అని తనవారిని అదిలించాడు.

అంతా అరుపులూ కేకలతో దూకుతూ, గెంతుతూ పరిగెత్తుతూ ఆవరణలోకి పోతూ విజృంభించారు. తాము నిస్సహాయంగా చూస్తూ నిలబడటం తప్ప ఏమీ చేయలేకపోయారు.

జాతర ఊపందుకుంది. జరగబోయే దారుణాల్ని చూడలేక వెనుదిరిగారు. దారిలో నాగేశభట్టు కాబోలు అన్నాడు, “గురువుగారూ, మనం రంగంలోకి – జాతరకి కనీసం నెల రోజుల ముందు దిగాల్సింది అనిపిస్తోంది.” అని. ఆ సలహా తనకు జ్ఞానోదయాన్ని కలిగించింది.

***

ఇప్పుడు అదంతా మనసులో మెదిలి ‘తొల్లి – గతించె’ అని నవ్వు రాగా ప్రస్తుతంలోకి వచ్చి, తల విదిలించుకున్నాడు జగన్నాథుడు.

అవును. ఈ ఏడాది జాతర ఇంక నెలరోజులే వుంది. దానికేం చేయాలనేది ముందే నిర్ణయించుకుని సిద్ధపడుతున్నారు.

‘చూడాలి, పరిణామమెలా వుంటుందో’ అనుకున్నాడు. ఈనాటి ఈ సమావేశానికి అనంతపురం, రామాపురం గ్రామాల పెద్దలు కొలువుతీరే ప్రదేశం కూతవేటు దూరంలో కనిపిస్తోంది. బండ్లు వేగంగానే పోతున్నాయి.

వీరు సమావేశస్థలానికి చేరే సరికే అక్కడ ఇరుపక్షాల వారూ ఓహిరి సాహిరిగా అరుచుకుంటున్నారు.

చూశాడు జగన్నాథుడు.

ముందుగా బలరాముడు వచ్చి, “మా దొర మిమ్మల్ని రమ్మంటున్నాడు” అని ఆహ్వానించాడు.

దొరవైపు చూశాడు. ‘మహారాజో – మహారాజ ప్రతినిథో’ అన్నట్టు ఠీవిగా గద్దెమీద కూర్చుని వున్నాడు. చుట్టూ అంగరక్షకులు.

ఇంతలో ఈ వైపు నుంచీ పరశురాముడు వచ్చి “మా దొర మాట్లాడాలంట. రండి” అన్నాడు.

అటు చూస్తే గద్దెమీద ‘దొర’ తన ప్రాభవ గాంభీర్యాన్ని ఒలికిస్తూ మీనం దువ్వుకుంటున్నాడు.

నవ్వుకున్నాడు జగన్నాథుడు. ఓసారి శేషవీరేశ్వరుల వైపు చూసి, బలరాం, పరశురాములతో – “ఒక్క విన్నపం. ఏమీ అనుకోవద్దు. దొరలిద్దరి గద్దెల్నీ ఒక్క చోటికే పక్కపక్కగా తెప్పించండి” అంటూ చకచకా నడుచుకుంటూ దొరలిద్దరికీ సుమారు మధ్యప్రదేశానికి వెళ్లి నిలబడి గొంతెత్తి తన ప్రతిపాదనని పెద్దగా చెప్పాడు. బలరాం, పరశురామ్ వారి వారి దొరల దగ్గరికి వెళ్లి మాట్లాడారు.

క్షణాల తర్వాత ‘గద్దె’లు కదిలినై, సమఠీవితో ‘దొరలు’ వచ్చి ఆసీనులైనారు. శేషవీరేశ్వరులు జగన్నాథుని భుజం తట్టాడు – ప్రశంసాపూర్వకంగా. శాస్త్రీ, నాగేశుడూ సరేసరి. జగన్నాథుని వెనకే వుంటారు మరి. “అభ్యర్ధనని మన్నించి వచ్చినందుకు ధన్యవాదాలు. మనం ఇక్కడ సమావేశం కావాలనుకున్నది కలిసి చర్చించుకోవటానికి. భౌతిక సాన్నిహిత్యం కూడా దానికి దోహదం చేస్తుంది” అంటూ వాళ్లు అడిగిన ప్రతిప్రశ్నకూ వివరణలతో కూడిన సమాధానాలిచ్చాడు.

సంప్రదాయం, ఆచార వ్యవహారాలు!! ‘జంతుబలి’ గురించి పెద్ద వాద ప్రతివాదనలే జరిగాయి. సంఘ నియమాలూ, ప్రజల విశ్వాసాలూ అన్నీ చర్చలోకొచ్చినై.

“అయినా – జాతర జరపకపోతే అరిష్టాలు జరిగితే బాధ్యులు ఎవరు? ప్రజలు మమ్మల్ని శపిస్తారు. ఆగం చేస్తారు. చివరికి వారి ఉసురు మాకు తగలకుండా వుంటుందా?” అనేది కీలకమైన ప్రశ్న అయింది.

“నిరుడు జాతర జరిగింది. జంతుబలి ఇచ్చారు. జనమంతా ఆనందించారు. కదా!” క్షణం ఆగి, దొరలిద్దరి దగ్గరికీ వెళ్లాడు. “కానీ, ఆ తర్వాత మీ మనుషులు ఒకరినొకరు పాతకక్షలతో చావకొట్టుకుని కాళ్లూ చేతులూ పోగొట్టుకోలేదా? అది గ్రామానికి అరిష్టం కాదా. అంతకంటే..” అని ఒక్కసారిగా మౌనం వహించాడు.

అందరూ జగన్నాథుని వైపు ఉత్కంఠతో చూస్తున్నారు. తన పరిస్థితీ అలాగే వున్నదన్నట్లుగా అక్కడ గాలి కూడా స్తంభించింది.

అక్కడున్న వారంతా మొగాలు చూసుకుంటున్నారు.

జగన్నాథుడు గబగబా ఓ పక్కకి అడుగులు వేస్తూ వెళ్లి, జనం మధ్యలో నిలబడిన ఒక యువతిని చేయిపట్టి మధ్యకి తీసుకొచ్చి నిలిపాడు.

“చూడండి! ఈమె రమాదేవి. గ్రామ పొలిమేరల్లోనే వుంటారు వీళ్లు. పల్లెకారులు. అర్నెల్ల క్రితం ఈమెకు పెద్దమ్మవారు పోసింది. మీలో కొందరికి తెలుసు. కానీ, ఎవ్వరూ పట్టించుకోలేదు. ఏ విధమైన సహాయమూ చేయలేదు. భర్త మల్లేశమే ఎన్నో విధాల ఆమెకు సేవలు చేశాడు. ఆమెకు రోగం తిరుగుముఖం పట్టేసరికి, అతనికి అంటుకుని – తీవ్రమై, దురదృష్టవశాత్తూ చనిపోయాడు” ఆ మాటల్ని చాలా బిగ్గరగా అన్నాడు.

అతని మాటలు పూర్తయీ అవకుండానే ఆ యువతి దుఃఖాన్ని ఆపుకోలేక ఒక్క పెట్టున ఏడవసాగింది. జనమంతా చేష్టలుడిగి చూస్తూండిపోయారు. అంతా నిశ్శబ్ద వాతావరణమయింది. అందరి మనసుల్లోనూ అప్రకటిత ఆరాటం కలిగింది. ఇరుపక్షాల దొరలూ, వారి అనుచరులూ కూడా విచలితులైనట్లు వారి భంగిమలే తెలియజేస్తున్నాయి. ఆ యువతిని ప్రక్కనున్న పెద్దావిడ చప్పున పొదివిపట్టుకుని ఆమెను అనునయించసాగింది.

ఆ వాతావరణంలో నిశ్శబ్దంలో శబ్దమో, శబ్దంలో నిశ్శబ్దమో తెలియని సవ్వడి విననైంది.

“యాదృచ్ఛికంగా సారనాథ్ నుండీ మీ గ్రామం మీదుగా కాశీ వస్తున్న మా శిష్యుడు వచ్చి చెప్తే – ఇదుగో ఈ ఉపాధ్యాయుల వారూ, మేమూ వచ్చి వీళ్లను కాశీకి తీసికెళ్లి అక్కడి ప్రకృతి వైద్యాలయంలో చికిత్స చేయించాము. అయినా ఇప్పుడిలా విగతభర్తృకగా నిలబడింది. ఈమె మునుపటి సౌందర్యమూ వసివాడింది కదా!” నిదానంగా అందరినీ చూస్తూ మాటలాపేశాడు.

కొద్దిసేపటి తర్వాత శేషవీరేశ్వరుడు, “జగన్నాథుడు చెబుతున్నది మీకు అర్థమైందనే భావిస్తున్నాను. జంతుబలి ఇస్తే అరిష్టం రాకపోవటం, ఇవ్వకపోతే రావటం అనేవి లేవు. అది మన మూఢ విశ్వాసం. ఒక దురాచారం తరతరాలుగా సాగిపోతున్నది. ఈ ఏడాది ఆపండి. ఏం జరుగుతుందో చూద్దాం” అన్నాడు.

దొరల అనుచరులు ఒకేసారి “ఆ తర్వాత చూసేది ఏముంటుంది? అంతా దౌర్భాగ్యమే” కోపంగా అరిచారు. జగన్నాథుడు, “నేను ఒక ఉదాహరణ మాత్రమే చూపాను. అలా చాలామందికి జరిగిందన్న విషయం మీకందరికీ విదితమే. మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. నమ్మకాలు మనుషుల్ని మంచిమార్గంలో నడపాలి. ఆచారాలు సామూహికంగా మేలు చేయాలి. సంప్రదాయాలు మనిషికీ మనిషికీ మధ్య సంబంధ బాంధవ్యాల్ని మెరుగుపరచాలి. అమాయక ప్రాణుల్ని హింసించి, ఆ హింసానందాన్ని పొందదలచుకుంటే – మనుషులుగా మనం ఏ దిశకు వెళ్తున్నట్టు? ఆలోచించండి-” అన్నాడు.

“అవును. ఆయన చెప్పిందే బాగుంది. అట్లాగే చేద్దాం” పీలగా కొన్ని కంఠాలు అన్నాయి.

జగన్నాథుడు కొనసాగిస్తూ, “జాతర చేసుకుందాం. జంతు బలిని మానేద్దాం. ఏమంటారు?” రెట్టించి అడిగాడు.

దొరలిద్దరూ కళ్ళతోనే ప్రశ్నించుకుంటున్నారు. ఈలోగా ఇంకొందరు జనం “అవును. జంతుబలిని మానేద్దాం. జాతర చేసుకుందాం” – గట్టిగా అరుస్తూ ముందుకు వచ్చారు.

వాళ్లని చూసేసరికి తమ ప్రయత్నం వృథా కాదన్న ధైర్యం వచ్చింది. జగన్నాథుడికి. తనవాళ్లవైపు చూశాడు. వారి కళ్లల్లో కూడా అదే భావం ప్రస్పుటమైంది. అదే ధోరణిలో – “మనిషన్న తర్వాత జరా వ్యాధులు తప్పవు. ఆ తర్వాత అనివార్యమైన మృత్యువూ తప్పదు. ఎవరికి ఏ వ్యాధి సోకినా దానికి – జాతరనూ, జంతుబలినీ కారణంగా చెప్పలమా? అలా అయితే మన గ్రామాల్లో ఎవరూ ఎప్పుడూ రోగగ్రస్తుడు కాకుండా వుండాలి కదా! అలా లేరు కదా! జంతుబలిని ప్రతి ఏడాదీ యథారీతిని జరుపుకుంటున్నారు కదా! మరి రెండేళ్ల క్రితం అనావృష్టి ఎందుకు వచ్చింది? నీళ్లులేక, పంటలూ లేక ఎంత బాధపడ్డారు?”

“మనిషిని చంపినా, మరో ప్రాణిని హింసించినా – రెండూ ఒకటే. జ్ఞానం అనేది విద్యాలయాల్లో పాఠాల్లో చెప్పేది కాదు. అది మనందరిలోనూ నిక్షిప్తమై వుంది. ఇలాంటి సమయాల్లో దాన్ని మేల్కొల్పుకోవాలి మనం. ఆలోచించండి..”

“మేము మిమ్మల్ని – ఈ మూఢాచారాన్ని ఆపమని అడగాలనే వచ్చాము. మాకు తోచినవి చెప్పాము. ఆపైన మీ ఇష్టం. దొరలిద్దరూ సహృదయులు. మాకు తెలుసు – వారికి జనశ్రేయస్సే ముఖ్యమైనదని. ఒక్క అవకాశాన్ని ఇచ్చి చూసుకోండి. జంతుబలి లేకుండా జాతర జరుపుకోండి. సెలవు” అంటూ వెనక్కి కదిలాడు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here