[డాన్స్ ప్రోగ్రామ్ అయ్యాకా జయంతి ఇంటికి వస్తుంది శ్రీలక్ష్మి. జయంతి గురించి మాట్లాడుతుంది. రవిని పరిచయం చేసుకుంటుంది. అందరూ కలిసి భోజనం చేస్తారు. జయంతి సాయం లేకపోతే తాను ఈనాడు ఇలా ఉండేదాన్ని కాదని చెబుతుంది శ్రీ. జయంతి అడిగితే, కోదండపాణి గురించి చెబుతుంది. తాను నాట్య పాఠశాలలో టీచరుగా చేరడం, ఆపి సినీరంగంలో ఎలా ప్రవేశించినది చెబుతుంది. కోదండిపాణి నీకు గార్డియన్ అని అనుకుంటున్నారిక్కడ అని జయంతి అంటే, అందులో నిజం లేదని చెప్తుంది శ్రీ. ఇక చదవండి.]
[dropcap]“నీ[/dropcap]కు కోదండపాణికి ఉన్న సంబంధం?”
“నిర్మాతా, నటి.”
“మరి ఎలాగెలాగో అనుకుంటుంటారు.”
“అనుకోవడమేమిటి వ్రాస్తారు కూడా” అంది నవ్వుతూ.
“అమ్మ వాడికి keep అని చెప్పకున్నాడట rascal” అన్నాడావేశంగా జయంతి.
“ఈ మాట నా దాక చేరి వాని పెళ్లాం దగ్గర నిలదీసాను. చెంపలేసుకున్నాడు. ముక్కు నేలకు రాస్తానన్నాడు, అనలేదట. చేతులూ కాళ్లూ పట్టుకుని బ్రతిమాలాడు.” చెప్పాడు జయంతి.
“ఇది లోకానికి తెలీదు గదా?” అని, “చెడు గదా లోకానికి కావల్సింది” అని నవ్వింది. “ఎంత ఇదిగా ఉన్నా మేం ఇద్దరం ఆడవాళ్లం గదా ఉండేది. ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అలా అనుకోవడంలో ‘మనిషి’గా ఉన్నవాళ్లు ఉన్నారు.”
“అది సరే అమరజ్యోతి సినిమాలోని హీరోతో నీకు పెళ్లి అనీ?..”
“నీకు తెలీకుండా నా పెళ్లేంటి? Trash. రమణక్క ఆశయం కోసం నిలబడాలంటే అసలు నా బ్రతుక్కు పెళ్లి కుదరదు. ఈ సినిమాలూ కుదరవు. అందుకే ఏడాదికి ఒకటి రెండు మాత్రమే. చాలా మంచి కంపెనీలవే చేస్తున్నాను. నేను మొదట ఇప్పటికీ మనకు దొరుకుతున్న శాస్త్రమే గాక ఇంకా పూరాతన నృత్యరీతులేమిటి? వాటిని సేకరించి అందించ గలగాలి, వాటిని ఆంగికంగా సంగీత సాహిత్యాల పరంగా రూపకల్పన చేయాలి. అందుకు ఆహార్యాన్ని సమకూర్చాలి. వాటి ఔన్యత్యాన్ని, అందాలనీ, ప్రయోజనాన్నీ ప్రపంచానికి చూపాలి.
ఆ అందాలకి నువ్వు ఉన్న అందలాలనీ, సౌరభాన్నీ పవిత్రతనూ, మానవతనూ రక్షించే తపనను బయటకు తేవాలి. నా కోరిక అది. ఇందుకోసమే ఈ నా ప్రయత్నం.
ఇంతటి బాధ్యత ఉన్నప్పుడు ఇంకా ఈ సినిమాలెందుకు అన్న ప్రశ్న వస్తుంది. దానికి నా సమాధానం ఆర్థికంగా వెసులుబాటుతో కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి అంతే.
తెర వేలుపుగా వెలగాలనే ఆశా. ఆకాంక్ష నాకు లేదు. అందుకే నేనుగా ఇమడలేను కూడా. ఆ సినిమాలు తీసే వారు కూడా నా నాట్య శిక్షణకూ నా అధ్యయనానికి అడ్డు రాకుండా షెడ్యూలు వేసుకోగలిగిన వారుగా ఉండాలి. అలా అవకాశం ఉన్న వారితోనే చేస్తున్నాను. ఆ పరిధి దాటను. అమ్మతోనూ ఇదే చెప్పాను” అని ఆగింది.
జయంతికి శ్రీ నిర్ణయం పట్ల ఆసక్తితో పాటు గౌరవమూ పెరిగింది.
శ్రీ ఎంతో ఎత్తుగా ఎదిగి కనిపించింది. మనసారా అభినందించటమే గాక ఆశీర్వదించాడు. “నేనున్నాను గదానే పిచ్చీ, ఎప్పుడూ ఇబ్బంది పడకు” అని తల నిమిరి సంతకాలు చేసి ఉన్న బ్లాంక్ చెక్ బుక్‌ని చేతికిచ్చాడు.
ఆ రాత్రి జయంతికి చాలా ప్రశాంతంగా ఆహ్లాదంగా అనిపించింది.
మనస్సు దూదిపింజంలాగయింది. ఏవో లోకాలలో అన్నీ మరచి తిరుగాడాడు. తెల్లవారింది.
సూర్యోదయం తోటే శారద స్నానం చేసి రెండు రకాల టిఫెన్లు చేసి అన్న చెల్లెళ్లకు మేలుకొలుపు చెబుదామని గదిలోకి నడిచింది. ఇద్దరూ ఒక మంచం పైన బాసంబట్ట వేసుకొని ఎదురు బొదురుగా కూర్చుని మాటాడుకుంటూ కనిపించారు.
“నీకు బాగా నచ్చిన దర్శకుడు ఎవరు?” అని అడుగుతున్నాడు జయంతి.
“కృష్ణవంశీ” అని చెప్పింది.
“అయితే అతనితో నువ్వే సినిమా తీయొచ్చుకదా.”
“నేనా?” అని నవ్వి “మళ్లా అదో పెద్ద బాధ్యత. బోలెడు డబ్బుతో రిస్కు చేయడం. అయినా నీకు తెలియనిదేముంది. అంత డబ్బును ఎలా పూల్ చేయడం?” అంది.
“డబ్బు ఎలా ఎక్కడిది అనేది నీకెందుకురా? తీసే ఆలోచన ఉంటే చెప్పు” అన్నాడు.
“ఒక్క డబ్బే కాదన్నయ్యా. నేను మొదట కృష్ణవంశీని, ఇంకా కొందరినీ సంప్రదించాలి. నా పద్ధతి చెప్పాలి. బడ్జెట్టు విషయం అవగాహనకు రావాలి. మూడు వేల సంవత్సరాల నాటి ఆహార్యాన్ని సమకూర్చుకోవాలి. అందుకు సమర్థుడైన కళాకారుడు కావాలి. కథ పరంగా నా వేదనను బహిర్గతం చేసేందుకు ‘ఆమ్రపాలి’ లాంటి కథను తీసుకోవాలి.”
“ఇదిగో అనుమానాల్ని వదిలి రైటరును, దర్శకుడిని సంప్రదించి O.K. చేసుకో. నువ్వు ఎప్పుడు ‘సరే’నంటే అప్పుడు నేను పైసలుతో మనిషిని పంపుతాను.” అన్నాడు
శ్రీ జయంతిని ఆరాధన గానే గాక చిత్రంగా చూసింది.
ఇంకొంచం దగ్గరకు జరిగి “సినిమాలో డిస్ట్రిబ్యూటరు భాగస్వాములన్ని మనం బాగా వినియోగించుకోవడం వల్ల సినిమా రిలీజు అవడంలోను ఆడించడంలోనూ అతనికి శ్రద్ధ ఉంటుంది. మనంగా మొత్తం పెట్టి తీసినా చివరకు వాళ్లకు అప్పగించాల్సిందే.”
“మంచిది.” అన్నాడు జయంతి.
“ఇలా మాట పోగులతోనే కడుపు నింపుకుంటారా, ముఖాలు కడుగుతారా” అంది శారద.
“వస్తున్నామొదినా, మరీ ప్రొద్దుటే నిన్ను ఇబ్బంది పెట్టడ మెందుకనీ” అంటూ లేచింది శ్రీ.
శారద దగ్గరకు నడిచి “రోజూ ఇట్లాగే లేస్తావా?” అడిగింది నెమ్మదిగా నడుస్తూ.
శారద ప్రక్క దిగకుండా ఉన్న జయంతిని చూసి “మీకింకా టైం కాలేదా?” అంది.
“నేనెంతలో రడీ అవుతాను? అయినా శ్రీ, నువ్వు నాకిక్కడేదో పెత్తనం గట్రా ఉన్నాయని భ్రమపడేవు. అది పొరబాటని తెలియడానికి ఆట్టే టైం పట్టదు. పైగా గాలి పోయిన నన్ను చూస్తే ‘అరే వీడా మా జంయంతన్నయ్య’ అని బోలెడు జాలి ప్రదర్శించి, సానుభూతి చెప్పాల్సి వస్తుంది” అని శ్రీ దగ్గరికి పరుగున లేచి వచ్చి ఆపి, మరీ దగ్గరగా జరిగి “ఇక్కడ నన్ను శారదమ్మగారి మొగుడు అని మాత్రమే అనిపించుకుని కాలక్షేపం చేస్తునాను, నిజం” అన్నాడు.
ఇది విన్నశారద కోపంగా ఓ చూపు చూసి “లేచిన దగ్గర నుంచీ ఈయన ఆడే అబద్ధాలు నాకు కొత్త కాదు” అని నవ్వింది.
టిఫిను పూర్తి అయ్యాక ప్రయాణానికి సిద్ధమైంది శ్రీ.
బాధగా అనిపించింది శారదకు.
“ఇంకో రోజన్నా ఉండలేవా?” అడిగింది దగ్గరికి తీసుకొని.
నిజంగా శ్రీ కదిలిపోయింది ఆత్మీయతకు. కౌగలించుకొని “వదినా” అంటూ అట్లాగే ఉండిపోయింది.
జయంతి అటుగా వచ్చి వీర్ని చూసి “శ్రీ, శారద నాది ఇట్లా.. నాకు నచ్చవు, వచ్చేయ్” అన్నాడు.
నవ్వుకుంటూ అటు నడిచారిద్దరూ.
జయంతి శారద శ్రీని వెంట బెట్టుకొని వెళ్లి ఫ్లైట్ ఎక్కించారు. వస్తూనే రవిని ఇంటి దగ్గర దింపాడు. శివరాం కలిసాడు.
“ఎటు?” అని అడిగాడు శివరాం.
“అశోకాలో పని ఉంది.”
“పెంచలయ్య నళిని రెడ్డి కలిసి స్కూటర్ల ఫ్యాక్టరీ పెడుతున్నారు. ఫండ్స్ రైజ్ చేస్తున్నారు” అన్నాడు.
“ఎక్కడా?”
“ఘజియాబాద్‌లో. ప్లాన్ కూడా ఆమోదం పొందింది. మొదటి స్కూటర్ వచ్చే నవంబరుకు వస్తుందట. ఎకనామిక్స్ ఎడ్వజరీలో ఇంకా వివరాలున్నాయి. వెయ్యి రూపాయలతో బండి బుకింగ్ చేసుకోవచ్చునట.”
“పాత బండి పైన మెరుగైన టెక్నాలజీ. పెట్రోలు ఎక్కవ కిలోమీటరు రావడం, మామూలు రేటుతో బండి రావడం దానికి ప్లస్‌గా చెప్పుతున్నారు. కేవలం నెట్ బుకింగ్ ప్రారంభమైంది.”
“ఇది పెంచలయ్య ప్లాన్.”
“ అంటే.”
“మన జనానికి స్కూటర్ పైన వ్యామోహం ఉంది. ఇట్లాంటి టౌనులో కూడా వెయ్యి బుక్కువుతాయి. అంటే దేశం పైన రెండొందల కోట్లు. నా కమీషన్ లేకుండా తయారయ్యాయి. రాబోయే స్కూటర్‍కు అడ్వాన్స్ మీద వస్తుంది.”
“అంటే.”
“మమత ఉద్యోగ్ మొదలయ్యేంత కాలం ఆగాడు. అలాగే.”
“మరి డబ్బు.”
“ఎక్కడికి పోదు. అది రెట్టింపై పెంచలయ్యకు ఉపయోగపడ్తుంటుంది. అసలు సొమ్ము మనకు ఉంటూనే ఉంటుంది” అని నవ్వాడు లేస్తూ.
ఆలోచనలో పడ్డాడు శివరాం.
పార్వతి లేనట్లుంది. బయటకు రాలేదు.
జయంతి శారదను ఇంటి వద్ద దింపి వెనక్కు మళ్లాడు.
హోటలు దగ్గర కారు పార్క్ చేసి 255 నెంబరు గది ముందు కెళ్లి బజ్జర్ నొక్కాడు.
తలుపు తెరుచుకుంది నెమ్మదిగా. ఓ ‘నీగ్రో’ యువతి తలుపు సందులోంచి తల బయటకు వుంచి “ఎవరు కావాలి?” అనడగింది. చెప్పాడు.
“నాల్గో రోజున వస్తున్నాడు.”
“మంచిది” అని చెప్పి వెనక్కు మళ్లాడు. క్లబ్బు దగ్గర ఓ గంట ఆగి ఇంటికి చేరాడు.
శారద నిద్రలో ఉంది. ఆవిడ ప్రక్కలోనే నెమ్మదిగా జొరబడి ముద్దిచ్చాడు.
ఉలిక్కపడి లేచింది శారద. చాలా కోపంగా అసహనంగా చూసింది. జయంతి నవ్వుతూ కనిపించినా శారద మొఖంలో మార్పు రాలేదు.
అయినా శారద నడుమును చేత్తో బిగిస్తూ “నీ కిష్టమైతే ఇక్కడే రాత్రంతా ఉండాలని ఉందోయ్” అని చెవిలో గుసగుసలాడాడు.
“పగలు రాక్షసులు మాత్రమే కలసి పడుకుంటారని విన్నాను” అంది.
“అలాగా!” అన్నట్లు చూసి లేచాడు. తన రూంకు నడిచాడు. అయితే శారద వెంటనే వచ్చింది
ఆగి “ఏంటి” అన్నాడు, కోరిక పూర్తిగా మాయమవక.
“మీకు ఓపలేని కోరిక ఉంటే రండి” అంది ప్రక్క మీద కూర్చుంటూ.
“వద్ద శారదా నన్ను మనిషిగానే ఉండనియి” అన్నాడు. ఆ మాటలు అంటున్నప్పుడు అతగాని పెదవులు అందంగా మెలితిరిగినయి.
“మంచి నీళ్లివ్వనా?” అడిగింది. తల ఊపాడు.
తెచ్చి ఇచ్చింది. త్రాగాడు. వాలు కుర్చీలో కూర్చున్నాడు.
ఇంతలోనే “కాఫీ” అంది శారద.
“కాఫీనా?” అని శారదను చూసి కప్పు అందుకొని రెండు గుక్కల్లో త్రాగేసాడు.
“ఇవ్వాళ్ల నాకు మనస్సంత బావునట్లు లేదు. అలా తిరిగి వద్దామా” అంది.
చిత్రంగా చూసాడు ఆమెవైపు.
పెళ్లైన తరువాత మొదటిసారి అడిగింది. అలా తిరిగి వద్దమని. అదీ తన మనసు బాగోలేదని. అర్థం చేసుకొని “పద” అన్నాడు లేచి.
శారద ఇంట్లోకి వెళ్లింది. పదినిముషాల తరువాత ఇద్దరూ కారులో బయలుదేరారు.
కారులో ఎక్కాక “I am sorry Sarada” అన్నాడు.
“భార్యాభర్తల మధ్య సారీలూ, లారీలూ రాకూడదు.”
కారు సారంగపాణి దగ్గర ఆగింది. అక్కడ మళ్లా కాఫీ త్రాగాడు.
అక్కడ బయలుదేరేప్పుడు టైం చూసుకున్నాడు. సినిమా హాలు దగ్గర ఆపాడు.
టిక్కెట్లతో ఒకడు రెడీగా ఉన్నాడక్కడ. సినిమా చూసారు. వార్ పిక్చర్. బాగానే ఉంది. సినిమా వదిలాక సీదా ఇంటికే వచ్చారు. మాటా మంతీ చేస్తూనే భోం చేసారు.
తాంబూలాలూ సేవించారు. మాటలు మాడ్లాడుకుంటూనే నిద్రపోయారు. వారికది చాలా మధురమైన రాత్రి.
తెల్లవారు ఝాముననే లేచాడు. పక్కలో శారద లేదు. ఇంతలో ఫోను మోగింది.. సామంత్ రాత్రి నగరంలో కొచ్చాడని అర్థమైంది. స్నానం చేసి బయలుదేరాడు. కారు దగ్గరకి నడిచాడు. ఇంతదాకా కలవలేకపోవడంలోని ఆంతర్యం అర్థం కాలేదు.
తేల్చుకోంది బావుండదు అని కారు ఎక్కాడు.
సామంత్ అడ్డాలోకి వెళ్లి ఆగింది కారు. జయంతి దిగి నడిచాడు.
సామంత్ బయటకు వచ్చి వస్తున్న జయంతిని చూసి ఆశ్చర్యపోయి “ఇక్కడ దాకా నువ్వు” అంటూ దగ్గరకొచ్చాడు. ఆగాడు జయంతి.
“మూడన్నర పాళ్లు పని పూర్తి అయింది. ఇంకా రెండంటే రెండు రోజులు చాలు. నా మాట నిలబెట్టుకుంటాను. Sorry for the delay” అన్నాడు సామంత్ నవ్వు ముఖాన పులుముకొని వినయంగా.
(ఇంకా ఉంది)