[box type=’note’ fontsize=’16’] శ్రీమతి యలమర్తి అనూరాధ రచించిన ‘కాస్త ఆలోచించరూ’ అనే నాటికని పాఠకులకు అందిస్తున్నాము. [/box]
పాత్రలు:
- రాజశేఖరం: 50, మధురిమ తండ్రి
- మమత: 45, మధురిమ తల్లి
- మధురిమ: 18, హీరోయిన్
- ప్రేమేష్: 25, మధురిమ ప్రేమికుడు
- అచ్చయ్య: 40, మధురిమ పనివాడు
***
మధురిమ, ప్రేమేష్ ప్రేమలో పడ్డారు. వాళ్ళకు ఇక లోకం కనిపించటం లేదు. ప్రేమంటే అంతే కదా! మనమూ విందాం – వాళ్లేం మాట్లాడుకుంటున్నారో?
***
మధురిమ: ప్రేమ్! ఇన్నాళ్ళూ నేను మేజర్‌ని కానని మనం దూరంగా ఉన్నాం. ఇక ఆగలేను.
ప్రేమేష్: నీకేమిటి? నాకు మాత్రం లేదా? నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నా.
మధురిమ: మరి ఏం చేద్దాం?
ప్రేమేష్: అదే ఆలోచిస్తున్నా!
మధురిమ: ఇంకా ఎన్నాళ్ళు?
ప్రేమేష్: ఇంకా నువ్వు మేజర్ అవటానికి నెల ఉంది. అప్పడే మేజర్ వయిపోయినట్లు ఊహించేసుకుని మాట్లాడుతుంటే ఎలా చెప్పు?
మధురిమ: మీ ఇంట్లో ఒప్పేసుకున్నారు కాబట్టి ఎక్కడికన్నా వెళ్లి పెళ్ళి చేసేసుకుందాం.
ప్రేమేష్: అమ్మా నాన్నతో మాట్లాడి చెబుతా. మీ వాళ్ళు కూడా ఒప్పుకుంటే బాగుంటుంది కదా అని.
మధురిమ: అది జరిగే పనే కాదు. మా వాళ్ళు ఫారిన్ రిటర్న్‌ని, లేదా ఆమెరికాలో సెటిల్ అయినవాణ్ణో, లేదా డాక్టర్నో, ఇంజనీర్నో తెస్తారు కానీ నీ లాంటి బ్యాంకు ఉద్యోగం చేసుకొనే వాడికి ఇవ్వరు గాక ఇవ్వరు.
ప్రేమేష్: మేమూ ధనవంతులమైతే ఒప్పుకునేవారేమో!
మధురిమ: అదొక్కటేనా! కులం, మతం, పరువు, అంతస్తు. ఇలా ఒకటి కాదు, వంద ఆలోచిస్తారు. వాళ్ళను ఒప్పించటం మన వల్ల కాదు.
ప్రేమేష్: ప్రయత్నించాలిగా.
మధురిమ: ఏమిటి ప్రయత్నించేది. చూచాయిగా మన విషయం తెలిసినప్పటి నుంచీ అసలు నన్ను ఒక్కర్తినీ బయటకు పంపటం లేదు. చెప్పానుగా.
ప్రేమేష్: చెప్పావు అనుకో, చిన్నప్పటి నుంచీ అపురూపంగా నిన్ను పెంచారు. వాళ్ళకు తెలియకుండా పెళ్ళి చేసుకుంటే ఎంత బాధపడతారు?
మధురిమ: ఏమో! మొన్న ప్రణయ్‌ని చంపిచినట్లు మా నాన్న నిన్ను చంపిస్తే..(బాధగా ఏడుస్తూ) నేను మాత్రం నిన్ను విడిచి బ్రతకలేను.
ప్రేమేష్: అరె! అలా ఏడవకు. వాళ్ళకూ అవకాశమివ్వాలి. వాళ్ళు కాదన్నప్పుడు మన ప్రేమను మనం నిలబెట్టుకునే ప్రయత్నం చెయ్యాలి.
మధురిమ: నాకయితే మా వాళ్ళ మీద అస్సలు నమ్మకం లేదు.
ప్రేమేష్: నిన్ను కని పెంచిన వాళ్ళ గురించి నువ్వే ఆలోచించాలి.
మధురిమ: వాళ్ళు నా గురించి ఆలోచిస్తున్నారా చెప్పు. చిన్నప్పటి నుంచీ నేనేది అడిగితే అది నిముషాల్లో తెచ్చి ఇచ్చేవారు. మరి ఇప్పుడు.. నీకు దూరం చెయ్యాలని చూడటం లేదూ!
ప్రేమేష్: వాళ్ళకి ప్రేమ విలువ తెలియక కాదు. బాగా డబ్బున్న వాళ్ళకిచ్చి చేస్తే నిన్ను కార్లలో తిప్పుతారని.
మధురిమ: ప్రేమ ఉంటే అవన్నీ లేకపోయినా బ్రతికెయ్య వచ్చని ఈ పెద్దవాళ్ళు ఎప్పుడు అర్థం చేసుకుంటారో?
ప్రేమేష్: మనమూ వాళ్ళ వైపు నుంచీ ఆలోచించాలి. వాళ్ళూ మన వైపు నుంచీ ఆలోచించాలి. అప్పుడే ప్రేమ వివాహాలు అందరి సమక్షంలో జరగుతాయి.
మధురిమ: ఏమో ప్రేమ్! నీ అంత సహనం నాకు లేదు. నాకు అమ్మనాన్న అంటే ఇష్టమే! కానీ నిన్ను వదులుకోలేను.
ప్రేమేష్: మరి నా కోసం వాళ్ళను వదులుకుంటావా?
మధురిమ: ఊహూ! వాళ్ళనూ వదులుకోలేను.
ప్రేమేష్: అందుకే! ఆలోచించి చేద్దాం! పద వెళ్దాం, చీకటి పడుతుంది.
***
రాజశేఖరం: మమతా! అమ్మాయి కనిపించటం లేదే?
మమత: రాజీ పుట్టినరోజు ఫంక్షన్ అని వెళ్ళింది.
రాజశేఖరం: ఈ రోజుల్లో ప్రేమలూ, దోమలూ ఎక్కువైపోతున్నాయి. డబ్బున్న అమ్మాయిలను ట్రాప్‌లో పడేసే మగ పిల్లలూ ఉన్నారు. అమ్మాయి జాగ్రత్త. అదంటే నాకు ప్రాణం.
మమత: నాకు తెలియదా? దానికి చిన్న దెబ్బ తగిలితే మీరు గుండె పట్టుకుంటారు.
రాజశేఖరం: ఎవడో ప్రేమ్ అట. దీని వెనకల పడుతున్నాడు. ఆ అనుమానంతోనే దాన్ని ఒంటరిగా ఎక్కడికీ పంపనివ్వటం లేదు మనం.
మమత: నేనూ ఓ కంట కని పెడుతూనే ఉన్నా. ఈ వయసులో ప్రేమ ఏదో, ఆకర్షణ ఏదో తెలియనితనమే ఎక్కువ.
రాజశేఖరం: మంచీ చెడూ తెలిస్తే ఇలా తక్కువ ఆలోచనలు చెయ్యరుగా.
మమత: అనుభవం లేకుండా తీసుకుంటారు నిర్ణయాలు. రేపు ప్రొద్దున మూడు గదుల ఇంట్లో ఆరుగురు మనుషుల మధ్య ఉన్నప్పుడు గానీ తెలియదు
రాజశేఖరం: చిన్నప్పుడు తప్పటడుగులు వేస్తే మనం సరిదిద్దలేదా? అలాగే ఇప్పుడూ! పిల్లలు ఎంత పెద్దైనా మనకు చిన్న పిల్లలే!
మమత: కానీ మాట వినే పరిస్థితుల్లో లేరు కదా ఇప్పటి పిల్లలు. అంతా తమకే తెలుసు అనే అహంభావం ఎక్కువ కనిపిస్తోందే?
రాజశేఖరం: యువ రక్తం అలాగే పొంగిపొర్లుతూ ఉంటుంది. ఇన్నాళ్ళూ అమ్మా నాన్నా అంటూ మన చుట్టూ తిరిగిన నీ కూతురు ఇప్పుడు అంటీ ముట్టనట్లు ఉండటంలా.
మమత: తప్పు చేస్తే నా కూతురు, మంచి చేస్తే మీ కూతురా ఏమిటి?
రాజశేఖరం: ఏది చేసినా మన కూతురేనే. ఏదో తమాషాగా అలా అంటూ ఉంటాను. అంతే!
మమత : ఏదోలేండి. దాని పుణ్యామా అని నాతో ఓ పది నిముషాలు మాట్లాడారు. లేకపోతే మీ వ్యాపారమే మీది. నాతో నాలుగు కబుర్లు చెప్పే సమయం కూడా ఉండదాయే.
రాజశేఖరం: ఎంత సంపాదించినా అవన్నీ నీ కోసం, మన అమ్మాయి కోసమే కదా! ఇన్ని వేల కోట్లు నేనేం చేసుకుంటాను చెప్పు?
మమత: అవుననుకోండి.
రాజశేఖరం: అదే నిజం.
మమత : ఏమండీ. మన అమ్మాయి ప్రేమించినవాడినే చేసుకుంటానంటే మీరేం చేస్తారు?
రాజశేఖరం: చంపేస్తాను. దాన్ని చంపి నేనూ చచ్చిపోతా. ఆస్తి అంతా ట్రస్టుకి రాసి పారేస్తా.
మమత: అంత కోపం ఎందుకు? రేపు అదేమైనా చేస్తే మీరేమయిపోతారో అని నా బెంగ. నా గురించి మీకేమీ అక్కర్లేదా?
రాజశేఖరం: మధు నన్ను కాదని ఏ నిర్ణయం తీసుకున్నా నేను భరించలేను. అన్నీ అది అడిగితేనే ఇచ్చామా? అలాగే దానికి తగ్గ భర్తను నేనే తెస్తాను.
మమత: అన్ని రోజులూ మనవి కావు కదండీ.
రాజశేఖరం: కులం, మతం వదిలేసి అది ఏ పరువు తక్కువ పనో చేస్తే నేను సహించలేను.
మమత: మన దేశంలోనే ఇవన్నీ. విదేశాలలో అసలు ఇలాంటివి ఎవరూ పట్టించుకోరట కదా.
రాజశేఖరం: అవును. వాళ్ళకు మనలా బంధాలను పెనవేసుకోవవటం రాదే పిచ్చిమొద్దూ. ఇక తెంపేసుకోవటం గురించి ఎందుకు ఆలోచిస్తారు?
మమత: బీద, గొప్ప అనే భేదాలు పోనీ ఎందుకు? మన కున్నదంతా అమ్మాయికే కదా? అబ్బాయికి లేకపోతే ఏం?
రాజశేఖరం: ఉద్ధరించటానికి మనం దేశోద్ధారకులమా? ఉన్నవాళ్ళు ఉన్న వాళ్ళనే చేసుకోవాలి. ఇంకా గొప్పగా బ్రతకటానికి అదో మార్గం.
(హు.. హ్హ.. హ్హ అని నవ్వుతూ)
మమత: ఏమో! నాకు అలా అనిపించదు. ఎంత ఉన్నా ఇంకా ఇంకా కావాలనే అనిపిస్తుంది. ఆశకు అంతు ఏముంది?
రాజశేఖరం: ఏమిటో వైరాగ్యపు కబుర్లు? కొంప తీసి నువ్వే నీ కూతురిని చెడగొట్టేస్తావా ఏమిటి?
మమత: ఛ! ఛ! అవేం మాటలండీ? అలా పెళ్ళిళ్ళు చేసుకుంటే బీద, గొప్ప అనేదే తుడిచిపెట్టుకుపోతుంది కదా అని అన్నానంతే!
రాజశేఖరం: అవన్నీ కథల్లో, సినిమాల్లో బాగుంటాయి. నిజ జీవితంలో కాదు.
మమత: ఓ రాజకుమారుడు సేల్స్ గరల్‌ని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడా లేదా?
రాజశేఖరం: చెప్పాగా! అవన్నీ ఇక్కడ జరగవు. మన దగ్గిర అలాంటివి విన్నావా చెప్పు?
మమత: అదే.. అది మనం ఎందుకు కాకుడదూ అనే.
రాజశేఖరం: బాబోయ్. దాని కంటే ముందు నిన్ను బాగు చేయాలనిపిస్తోంది. నేను పని ఆపుకుని నీతో మాట్లాడుతోంది నా గారాల కూతురు ‘మధు’ కోసం.
మమత: అది మీరేం చెప్పక్కర్లేదు. నాకు తెలియకపోతే కదా!
రాజశేఖరం: మరింకేం? చాలా నీతులు చెప్పి అలిసిపోయావు ఇక వెళ్ళి నిద్రపో.
మమత: సరే.
రాజశేఖరం: నాకు చెప్పినట్లు దానికి చెప్పకు. అదే చేసేస్తుంది.
మమత: మరే.. తండ్రీ కూతుళ్ళు ఇద్దరూ తెలివి తక్కువ వాళ్ళు కదా.
రాజశేఖరం: మేము ఒకరిని మించిన వారం ఒకరం. అందుకే నా బాధంతా.
మమత: పిల్లల్ని కనగలం గానీ వాళ్ళ రాతలను కనలేం అని ఊరికే అన్నారా?
రాజశేఖరం: నా కూతురు జాతకం నా చేతుల్లోనే ఉంది.
మమత: ఆయన ఏం అనుకుంటున్నాడో?
రాజశేఖరం: హఁ హఁ హఁ భగవంతుడా? ఆయన తన దర్శనానికి కూడా టిక్కెట్టు పెట్టుకుంటున్నాడు. ఆయనా మనలాంటివాడే.
మమత: రామ రామ. మీతో మాట్లాడలేం. నే పోతున్నా!
***
సెల్ రింగవుతున్న శబ్దం.
ప్రేమేష్: హలో!
మధురిమ: ప్రేమ్! నేను అనుకున్నట్లే అయింది.
ప్రేమేష్: ఏమయింది? కొంప తీసి నిన్ను అమెరికా పంపించేస్తున్నారా మీ డాడీ?
మధురిమ: అన్నీ నీకు జోకులే.
ప్రేమేష్: సరే! విషయం చెప్పు.
మధురిమ: ఇందాక నేను ఇంటికి వచ్చేటప్పటికి అమ్మా, నాన్నా మాట్లాడుకుంటున్నారు.
ప్రేమేష్: ఏమని?
మధురిమ: డాడీ చెప్పిన వాణ్ణి కాకుండా ఎవరిని చేసుకుంటానన్నా నన్ను చంపేసి తను కూడా చచ్చిపోతారట.
ప్రేమేష్: అయితే మీ డాడీ తెచ్చినతన్నే చేసుకో.
మధురిమ: సరే! అయితే ఫోను పెట్టేయ్, అలాగే చేస్తాను.
ప్రేమేష్: అంత కోపం ఎందుకు మధూ! సావిత్రి యమధర్మరాజును ఎదిరించి భర్తను కాపాడుకున్నట్లు నేను నిన్ను మీ నాన్న నుంచీ రక్షించుకుంటాను.
మధురిమ: ముందు విషయం తెలిస్తే నిన్ను నువ్వు కాపాడుకోగలగాలి. అది ఆలోచించు.
ప్రేమేష్: పెద్ద వాళ్ళ సమ్మతితో చేసుకుంటే బాగుంటుందని ఆలోచించా. అంతే. మన వయసువారు చేసే తప్పు నేను చేయకూడదనుకున్నా.
మధురిమ: నీలాంటి వాడిని నేను ఎక్కడా చూళ్లేదు.
ప్రేమేష్: అవును మధూ! ప్రేమ కోసం పేరెంట్స్‌కు అబద్ధాలు చెప్పటం, మోసం చెయ్యటం ఈనాటి యువతరానికి అలవాటు అయిపోయింది. అది నాకు నచ్చదు.
మధురిమ: అయితే మా డాడీకి నిజం చెప్పేయ్.
ప్రేమేష్: అబద్ధం చెప్పవద్దన్నాను కానీ..
మధురిమ: బాబోయ్! నీలాంటి సత్యహరిశ్చంద్రుడితో జీవితాంతం ఎలా వేగాలో ఏమో!
ప్రేమేష్: అంతా నేను చూసుకుంటాగా! హాపీగా నిద్రపో! గుడ్ నైట్ – అంటూ ఫోన్ పెట్టేసాడు.
***
ప్రేమ్, మధూ నవ వధూవరులుగా మెడలో పూల దండలతో గుమ్మం ముందు నిలబడ్డారు.
***
కాలింగ్ బెల్ మ్రోగింది
అచ్చయ్య(అరిచినట్లే!): అమ్మగారూ! అమ్మగారూ!
మమత: ఎందుకురా అచ్చయ్యా అలా అరుస్తున్నావ్?
అచ్చయ్య(కంగారుగా): పాపగారు.. పాపగారు..
మమత(దగ్గరికి వస్తూ): మధూ! ఎంత పని చేసావే?
మధురిమ (నసుగుతూ): డాడీ మా పెళ్ళికి ఒప్పుకోరని..
మమత: దూరంగా వెళ్ళిపోయి హాయిగా బ్రతకండి.
మధురిమ: డాడీ ఆశీర్వచనాలు కావాలి అమ్మా!
మమత: వద్దు మధూ! నా మాట విను. మీరెంత త్వరగా వెళ్లిపోతే అంత మంచిది.
ప్రేమేష్: లేదు అత్తయ్యగారు! మేము పిరికి వాళ్ళం కాదు. మామయ్యగారిని కలిసే వెళ్తాం.
మమత(కంగారుగా): అర్థం చేసుకోరేం?
రాజశేఖరం: మనమే అర్థం చేసుకుందాం.
మమత (ఆశ్చర్యంగా): ఏమండీ..!
రాజశేఖరం: అవును. మమతా నేను నిజమే చెబుతున్నాను.
మమత(మనసులో): పైకి ప్రేమ నటించి వీళ్ళిద్దరినీ ఏమైనా చేసేయ్యారు కదా!
రాజశేఖరం: ఇలా ఇద్దరూ నా దగ్గరకు రండి. మమతా.. అలా చూస్తూ నిలబడతావేం అక్షింతలు తీసుకురా..
అచ్చయ్య(ఆనందంగా): ఇదుగోండి అయ్యగారూ. నేను తెచ్చేసాను.
రాజశేఖరం(నవ్వుతూ): నువ్వు రా సరైనోడివి, నన్ను బాగా అర్థం చేసుకున్నావు.
మధురిమ: డాడీ!
రాజేశేఖరం: ఎందుకురా ఆశ్చర్యపోతావ్? నువ్వేది అడిగితే అది ఇచ్చే నేను నువ్వు జీవితాంతం కోరుకునే తోడును నీడగా ఇవ్వనని ఎలా అనుకున్నావ్?
ప్రేమేష్: క్షమించండి మామయ్యా! మధూ మాటలు విని మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను.
రాజశేఖరం: నిన్ను ముందు నేను అలానే అనుకున్నాను. కానీ నువ్వు మాట్లాడిన మాటలు అమ్మాయి తన స్నేహితురాలితో ఫోనులో చెబుతుంటే విన్నాను. అంత బుద్ధిమంతుడి వనుకోకపోవటం నా పొరపాటే.
ప్రమేష్: ఇది తెలియక మధు గొడవ పడలేక, నా ప్రేమను నిలబెట్టుకోవాలనే తపనలో నిన్ననే తిరుపతి వెళ్లి తిరుమల శ్రీ వేంకటేశ్వరుని సన్నిధిలో పెళ్ళి చేసుకున్నాము.
రాజశేఖరం: చట్టపరంగా ఇబ్బంది రాకూడదని మా మధూ మేజర్ అయిన రోజే ముహుర్తం పెట్టుకున్నావన్నమాట. తెలివైన వాడివే. శభాష్ అల్లుడూ!
ప్రేమేష్: అమ్మా, నాన్నా, మా బంధువులు అందరి సమక్షంలో పెళ్ళి జరిగింది. మీరిద్దరూ లేరనే లోటు తప్ప. అంత సంతోషంలో కూడా మీ మధూ కన్నీళ్ళు పెట్టకుంది.
రాజశేఖరం: ఏం ఫరవాలేదు. పెళ్ళి కంటే ఘనంగా ‘రిసెప్షన్’ జరిపిస్తాను. అప్పుడు నీ కోరికా తీరుతుంది.
ప్రేమేష్: సంతోషం మామయ్యా! మీ నుంచీ మీ గారాలపట్టిని దూరం చేస్తున్నామోనని ఎంత తల్లడిల్లిపోయానో!
రాజశేఖరం: ఈ కాలంలో తప్ప పుట్టావు అల్లూడూ.
ప్రేమేష్: అదేం లేదు మామయ్యగారూ! పెద్దలంతా ఎప్పుడూ పిల్లల భవిష్యత్తు, మంచి చెడ్డలు గురించే ఆలోచిస్తారు కదా! అలాగే పిల్లలం మేము కూడా మీ గురించి ఆలోచించాలని.
రాజేశేఖరం: ఇంకా మామయ్యగారు ఏమిటి చక్కగా మామయ్యా అని పిలువు. ఇక నుంచీ ఈ ఆస్తీ, పాస్తీ అంతా నీదే!
ప్రేమేష్: వద్దు మామయ్యా! అందరినీ వదులుకుని మా ఇంటికి వస్తున్న మధూనే నాకు బంగారం. మీ నుంచీ నాకు ఒక్క రూపాయి కూడా వద్దు.
రాజశేఖరం: అదేమిటి? ఇదంతా మా అమ్మాయిదే గదా!
ప్రేమేష్: మీరలా అనుకుంటే బీదవారికి చదువు చెప్పించండి. ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు జరిపించండి.
మమత (సంతోషంతో): కబుర్లతోనే కడుపు నింపేసుకుంటారా ఏంటి? రండి. అందరూ టిఫిన్ చేద్దురుగానీ.
రాజశేఖరం: ఇంకేం టిఫిన్ మమతా! నువ్వు చెప్పిందే అక్షరాలా నిజం. నా అల్లుడు మంచివాడు. అతని మాటలు విని నా కడుపు నిండిపోయింది.
అచ్చయ్య: అలా అంటే నా నొప్పుకోనండీ.
మధురిమ: డాడీ! మీ గురించి నేనెంత బెంగ పెట్టుకున్నానో. అడ్డుపడతారని చెప్పలేదు.
రాజశేఖరం: తెలుసురా నాన్నా. ఇప్పుడు బెంగా, గింగా తీరిపోయిందిగా.
హఁ హఁ హఁ అందరూ కలిసి నవ్వుతారు.
***
అవునండీ. పిల్లల మనసులను పెద్దలు గ్రహించాలి. పెద్దల మనసులను నొప్పించకుండా పిల్లలు ప్రవర్తించాలి. అప్పుడు పెళ్లిళ్ళు స్వర్గంలో కాదు ఇలలోనే నిశ్చయింపబడతాయి.
(సమాప్తం)