[box type=’note’ fontsize=’16’] కార్క్ చెట్టు విశిష్టతని వివరిస్తున్నారు ఆర్. లక్ష్మి ఈ వ్యాసంలో. [/box]
ప్రకృతితో చెట్టాపట్టాలుగా:
[dropcap]జీ[/dropcap]వవైవిధ్య పరంగా కార్క్ చెట్టు విశిష్టమైనది. ఈ చెట్ల బెరడు లోని కణజాలం యొక్క అద్భుతమైన అమరిక కారణంగా బెరడు స్థితిస్థాపక శక్తిని కలిగి ఉంటుంది. సంకోచ-వ్యాకోచాలకు అనుగుణమైన ఈ గుణం కారణంగా కార్క్ చెట్టు బెరడును శతాబ్దాలుగా గాజు సీసాలకు మూతలుగా వాడుతున్నారు. 17వ శతాబ్దం నుండీ ఈ బెరడు వైన్ సీసాలకు మూతగా వినియోగంలో ఉంది.
మధ్య యుగాల నుండి ఈ బెరడు వాడుకలో ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. కారణం అప్పటి నుండీ చెట్లకు చట్టపరమైన రక్షణ ఉంది. ఈ చెట్లను నరకటం నేరంగా పరిగణించేవారు. ఈజిప్ట్, గ్రీస్, రోమ్ వంటి దేశాలలో కార్క్‌ను – స్టాపర్స్ గానూ, సముద్ర ప్రయాణాలలో ఓడలను (దేనినైనా ఢీకొన్నప్పుడు) దెబ్బతినకుండా కాపాడేందుకు షాక్ అబ్బర్బర్స్ గానూ వినియోగించినట్లు ఆధారాలు ఉన్నాయి.
‘కార్క్’ ఓక్ జాతికి చెందిన వృక్షం. కొబ్బరి వలె ఇది కూడా కల్పతరువు లాంటిది. ఈ చెట్లు ఎక్కువ పొడవు పెరగవు. 45-50 అంగుళాల సగటు ఎత్తును మించని ఈ వృక్షాలు విస్తరించి ఉంటాయి. ఆ కారణంగా ఈ అరణ్యాలు దట్టంగా ఉండవు. వీటి జీవిత కాలం మాత్రం ఎక్కువ. 200 సంవత్సరాలకు పైగా జీవిస్తాయి. పోర్చుగీసు లోని కార్క్ ఓక్ 234 సంవత్సరాల నాటిది. ఈ చెట్లలోని ప్రతి భాగమూ వినియోగ యోగ్యమైనదే. క్రిమి సంహారకాలు, ఎరువులు వంటివి వాడని కారణంగా ఈ చెట్ల నుండి తీసిన రసాయనాలను సౌందర్య సాధనాలలోనూ వినియోగిస్తారు.
ఓక్ అరణ్యాలలోని అడవి ఆలివ్, పైన్ వంటి చెట్లు, పచ్చికబయళ్ళు వంటి వాటితో ఇక్కడి వైవిధ్యం వర్ణించనలవి కానిది.
చికిత్సలో ఉపయోగించేవి, సుగంధ జాతులు, ఆహార సంబంధమైనవి, ఇలా ఎన్నో రకాలు. ఒక చదరపు మీటరుకు 175 వరకు జాతుల మొక్కలు ఇక్కడ విస్తరించి ఉన్నాయని అంచనా. భూ ఉపరితలంతో పాటు భూమి లోపల పెరిగే బుడిపె జాతులు, మూలికలు మొదలగు వాటితో ఈ వనాల నేలలు సుసంపన్నమైన వైవిధ్యంతో అలరారుతూ ఉంటాయి. అనేక జాతుల శిలీంద్రాలకు ఈ వనాలు నెలవు.
అడవి పిల్లులు, సాలీళ్లు, ముంగీసలు, పలు రకాల తేళ్ళు వంటి జీవజాతులు ఇక్కడ నివసిస్తూ ఉంటాయి. లక్షల సంఖ్యలో పక్షులు ఇక్కడికి వలస వస్తూ ఉంటాయి. ‘కామన్ క్రేన్’లకైతే ఇక్కడే ఆశ్రయం. రాబందులు, అరుదైన గ్రద్ద జాతులు, బజ్జర్డ్ వంటి పక్షులు ఇక్కడ మజిలీ చేస్తూ ఉంటాయి.
ఆవరణ వ్యవస్థలు దెబ్బతినకుండా అభివృద్ధి పథంలో దూసుకుపోవగలగడంలో ఇక్కడ కనుపించే సమతౌల్యం ప్రపంచంలో మరెక్కడా కనిపించదు. వైవిధ్యభరితమైన జీవజాలానికి ఆలవాలమైన ప్రాంతాలలో ఐరోపాలోనే అత్యంత విలువైన ప్రాంతంగా EU.C.H.D లో ఈ వనాలు స్థానం సంపాదించుకొన్నాయి. కౌన్సిల్‌లో నమోదు చేయబడింది కూడా. కారణం బయోడైవర్సిటీ ఏ మాత్రం దెబ్బ తినకుండా జాగ్రత్త వహిస్తూనే – సాలీనా కార్క్ వనాలు ఉత్పత్తి చేస్తున్న 3 లక్షల టన్నుల కార్క్‌లో 60 శాతానికి పోర్చుగల్ దోహదం చేస్తోంది. ‘మెడిటరేనియన్ కార్క్’ సంబంధిత ఆర్థిక వ్యవస్థలో పోర్చుగల్‍ది కీలక పాత్ర. తరువాతి స్థానం స్పెయిన్‍ది. సింహభాగం కార్క్ వనాలు ఇక్కడే ఉన్నాయి.