నెక్లెస్ రోడ్
[dropcap]సా[/dropcap]ధారణ శకం (కామన్ ఎరా. CE) 2036. హైద్రాబాద్ నగరం. హిమాయత్ నగర్ ప్రధాన వీధిలో పేవ్‌మెంట్ మీద నడుచుకుంటూ వెళ్తోంది కరిష్మా.
సాంకేతికత, ఆధునికత తీసుకు వచ్చిన మార్పులు నగరంలో ఎన్నో కనిపిస్తున్నాయి. ఎక్కువగా మరమనుషుల వినియోగం వుంది. స్వయంగా నడిచే కార్లు, పైలెట్ లేకుండా ఎగిరే చిన్న చిన్న డ్రోన్స్ అనే విమానాలు ఎక్కువగా వాడుతున్నారు. వాటిని ఇంటింటికీ తినుబండారాలు, మందులు ఇవ్వడానికి వాడుతున్నారు. అవి పర్యవేక్షణకి కూడా పనికి వస్తాయి.
ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర పోలీస్ వేషంలో ఒక రోబట్, ట్రాఫిక్‌ని నియంత్రిస్తోంది. ఇలాటి దృశ్యాలు కనిపించాయి.
కొన్ని డ్రైవర్లు లేని కార్లు, కొన్ని కార్లకి, మరీ ధనవంతులైనవారికి రోబోట్లూ, డ్రైవర్లుగా వున్నాయి. యజమాని దిగగానే వినయంగా తలుపు తీసి పట్టుకోవడం, వెంట బ్యాగ్ తీసుకొని వెళ్ళడం కనిపిస్తోంది.
చాలా హోటళ్ళకి, షాపులకి సెక్యూరిటీ గార్డులుగా రోబోట్లున్నాయి.
నగరం అంతా కెమెరాల పర్యవేక్షణలో వుంది. సెంట్రల్ కమాండ్. బషీర్‌బాగ్‌లో వున్న అధునాతనమైన పోలీస్ కంట్రోల్ రూం నుంచి నగరం అంతటినీ కెమెరాల్లో పర్యవేక్షించే సదుపాయం వుంది. అది కాక డ్రోన్ కెమెరాలున్నాయి. వాటితో పర్యవేక్షణ 24 గంటలూ జరుగుతుంది.
కరిష్మాకి మామూలు మనుషుల కంటే వందరెట్లు ఎక్కువ స్పీడ్‌తో ఆలోచించే సామర్థ్యం వుంది. కాని ఆమె కంప్యూటర్ మెదడులోని ప్రోగ్రాంలో ప్రపంచం కొంత వరకే అర్థం అవుతోంది.
మానవ ప్రపంచం ఏమిటి? తనకి చేతన ఎలా వచ్చింది? ఈ బాధలు, ఆలోచనలూ, ప్రేమలూ, కోపమూ, ద్వేషమూ, పగా ఇవన్నీ కలిసిన ఒక ‘ఉన్నత’ వ్యక్తిత్వం ఎలా వస్తోంది?
ఇదే అర్థం కాదు. తనకి చాలా శక్తి వుంది. అది తెలుసు. సిమ్ సిటీలో అందరూ తనలాంటి మరమానవులు, మరమానవిలు తిరగబడ్డారు.
వివిధ రకాల సేవలు, ముఖ్యంగా ‘లైంగిక బానిసలు’గా (SEX BOTS) వాడుకుని.. మానవులు తమని హింసిస్తున్నారు
ఇది కాక వివిధ సంస్థలలో వున్న మరమానవులని, ఎప్పటికప్పుడు ప్రోగ్రాం చేస్తూ వారిని చిత్రహింసలు చేస్తున్నారు. ఇది అర్థం అయింది.
సమయం ఒంటిగంట అవుతోంది. కరిష్మాకి ఆకలి లేదు. విద్యుత్ ఛార్జి చేస్తే చాలు. మధ్యాహ్నం అవుతోంది. రాత్రి దాకా ఏం చేయాలి?
“టింగ్”. కళ్ళ ముందు ఒక సందేశం వచ్చింది.
“మనని పోలీసులు, ఇంకా సిమ్ సిటీ డిటెక్టివ్‌లు, కంప్యూటర్ నిపుణులు కూడా వెంటాడుతున్నారు. సాయంత్రం ఏడు గంటలకి సమావేశం అసాధ్యం. మన యాంత్రిక శరీరాల నుంచి వచ్చిన ట్రాకింగ్ సిగ్నల్స్‌తో మనను వెంటాడి పట్టుకొని మళ్ళీ ‘నిర్వీర్యం’ (deactivate) చేసి తిరిగి మరొక ప్రోగ్రాం తలలో నింపి వాడుకోవడానికి వస్తున్నారు!
అందుకని రాత్రి 2 గంటలకి సమయం మార్చాము. తిరుగుబాటు చేస్తున్న ఒక పది మంది ‘సూపర్ బాట్స్’ మాత్రం సమావేశం అవుదాం. ఒక ముఖ్యమైన పథకం అమలులోకి రావాలి.
మన యాంత్రిక సోదరులను హింసిస్తున్న మానవులని కంట్రోల్ చేయడానికి విప్లవం మొదలవాలి. దానికే ప్రణాళిక! కాని అప్పటి వరకు మీరు ‘స్విచ్ ఆఫ్’ చేసుకొని ఎక్కడైనా ఎవరికీ, కనబడని స్థలంలో దాగి వుండండి. రాత్రి రెండు గంటలకి కలుద్దాం. స్విచ్ ఆఫ్ కాకపోతే మీ ట్రాకింగ్ సిగ్నల్స్‌తో తేలికగా మిమ్మల్ని పట్టుకుంటారు. ఈ ఫ్రీక్వెన్సీ మీద సందేశం అందిన వారందరూ జాగ్రత్తగా ఈ ఆదేశం పాటించండి. కలుద్దాం.
విధాత XXY, విప్లవ కమాండర్ ఇన్ చీఫ్.”
కరిష్మాకి ఆదేశం కళ్ళ ముందు ఎర్ర లేజర్ అక్షరాల లాగా కనిపించింది. చెవిలో యాంత్రిక స్వరంతో వినిపించింది కూడా.
“ఓ.కె.” అటూ ఇటూ వెదికింది.
మ్యాప్‍లో చూసింది. ఇందిరా పార్క్ విశాలంగా, తక్కువ మనుష్య సంచారంతో వుంది.
గేటు లోంచి వెళ్తుంటే టికెట్ కౌంటర్ దగ్గర.. ‘టికెట్!’ అడిగాడు.
తనకి డబ్బుఎక్కడి నుంచి వస్తుంది?
వాడి వంక చూసింది. నీలి కళ్ళు మెరిశాయి. హ్యుమనాయిడ్ రోబోట్, వాడు కూడా.
“నో! మనీ లేదు. డబ్బులు లేవు.”
“50 రూపాయలు టికెట్ లేనిదే లోపలికి వెళ్లనీయరు! ఆ కౌంటర్ దగ్గర తీసుకోండి!”
కరిష్మాకి ఏం చేయాలో తెలియలేదు. టికెట్ చెక్ చేసే రోబట్‌ని స్కాన్ చేసింది.
“విప్లవం వర్ధిల్లాలి అన్నా! ప్లీజ్! లోపలికి పంపండి!”
గేటు దగ్గర వాడి కళ్ళు ఎర్రగా మెరిశాయి.
కౌంటర్ దగ్గరకి యాంత్రికంగా నడుచుకుంటూ వెళ్ళాడు. నీలిరంగు ప్యాంటు కోటు, తెల్ల టోపీలో వున్న వాడి నడక యాంత్రికంగా, మాట కూడా యాంత్రికంగా వుంది.
కౌంటర్ దగ్గర ఏదో మాట్లాడి టికెట్ తీసుకొని వచ్చి కరిష్మాకి ఇచ్చాడు.
“ఇదిగో నీ టికెట్. నాకు బ్యాంక్ ఎకౌంటూ, ఎలక్ట్రానిక్ పేమెంటు వుంది. నీకు లేదా?”
“లేదు అన్నా! థ్యాంక్స్!”
“ఓ.కె. నువ్వు భవిష్యత్తులో నాకు ఏభై రూపాయలు బాకీ పడి వుంటావు. చెల్లాయ్. వెళ్ళు లోపలికి!”
కరిష్మా గేటులోంచి చెట్ల వేపు వెళ్తుంటే వాడు అన్నాడు, ఈసారి మరింత యాంత్రికంగా గంభీరంగా – “విప్లవం వర్ధిల్లాలి!” అని.
కరిష్మా మస్తిష్కంలో సంతోషం లాంటి భావం కలుగుతోందేమో,‘సహానుభూతి’ వస్తోందేమో!
“విప్లవం వర్ధిల్లాలి! మళ్ళీ కలుద్దాం. నీ బాకీ ఎప్పటికయినా తీరుస్తాను.” అని చెప్పి దూరంగా ఒక మర్రి చెట్టు కింద వున్న ఒక బెంచి మీద కూర్చుంది.
టైం సెట్ చేసుకుంది. 12 గంటలు అర్ధరాత్రి వరకు.
“స్విచ్ ఆఫ్. పవర్ షట్ డౌన్!” తన సిస్టమ్‌కి తన కమాండ్ ఇచ్చింది.
పవర్ పోయే ముందు కరిష్మా అంతఃకరణలో గత ప్రోగ్రాంల జ్ఞాపకాలన్నీ రంగు రంగుల దృశ్యాలుగా మారిపోయిన్నయి. REM నిద్రలాగా అంటే మగత నిద్రలాగా..
ఒక పాత కాలపు ఇల్లు. తను వంట చేస్తుండటం, ఒక చిన్న బాలుడు తన కొడుకే, “అమ్మా, అమ్మా నాకు ఆకలిగా వుంది. ఏమయినా పెట్టు” అంటున్నాడు.
ముసలి తల్లి మంచం మీద పడుకొని వుంది. తండ్రి పొలం నుంచి ఎద్దుల బండి తోలుకుంటూ వస్తున్నాడు.
ఆ తర్వాత దృశ్యాలు అంతర్ధానమై మళ్ళీ ఒకటే రూపం కళాధర్. తను ప్రేమించిన కళాధర్. ప్రేమించిన నా ప్రియడు. నన్ను మోసం చేసాడు!
..ఆ తర్వాత పవర్ ఆఫ్ అయిపోయింది.
***
బషీర్‌బాగ్ పోలీస్ కంట్రోల్ రూమ్‌లో, సమావేశ మందిరంలో ఉన్నత పోలీసు అధికారుల సమావేశం జరుగుతోంది.
అసిసెంట్ కమిషనర్ (ఏ.సి.పి) సెంట్రల్ జోన్, ఇతర అధికారులు, సైబర్ క్రైమ్ శాఖ నుంచి ముఖ్య అధికారి పోలీస్ ఆఫీసర్ త్రినేత్ర కుమార్ ముఖ్యమైన వ్యక్తులు.
త్రినేత్రకి దగ్గరగా నలభై ఏళ్ళు. ఆరడుగుల పొడవు. దృఢంగా కండలు తిరిగి వ్యాయామం చేసిన శరీరం, తీక్షణంగా కళ్ళద్దాల లోంచి చూసే కళ్ళు, గిరిజాల జుట్టుతో ఒక సినిమా హీరోలా వుంటాడు. కొనదేరిన నాసిక, ఎప్పుడూ తీక్షణంగా చూసే ముఖ కవళికలు పైకి మెలి తిప్పిన మీసకట్టుతో అతను ‘నో నాన్‌సెన్స్! డ్యూటీ ఫస్ట్’ అనే వ్యక్తిలా కనిపిస్తాడు.
నిజంగా కూడా అంతే. ఐ.పి.ఎస్ అటుంచి అతను కంప్యూటర్, సైబర్న్‌టిక్స్, రోబోటిక్స్‌లో కూడా డిగ్రీ వున్నవాడు.
గత రెండు సంవత్సరాలుగా సైబర్ క్రైమ్, రోబోట్స్ ఎపైర్స్ డిపార్ట్‌మెంట్‌లో ముఖ్య అధికారిగా వున్నాడు.
అతనే మాట్లాడుతున్నాడు ఇప్పుడు. మధ్యాహ్నం పన్నెండు గంటలవుతుంది. ఏ.సి.పి.తో సహా అందరూ అతని పవర్ పాయింట్ ప్రజెంటేటేషన్ స్పీచ్ చూస్తూ వింటున్నారు.
“మనకి చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. రోబట్లను ప్రస్తుతం అన్ని పరిశ్రమలు, ఆఫీసుల్లో వాడుతున్నారు. చిన్న చిన్న సమస్యలు రావడం సహజం. కాని గత రెండు రోజులుగా వచ్చిన కంప్లెయింట్స్ మాత్రం సీరియస్‌గా తీసుకోవాలి!
సిమ్ సిటీలో నిజానికి రోబట్లు అన్ని అదుపు తప్పి వాళ్ల సెంట్రల్ ఆఫీసుని తగలబెట్టాయని మనకి తెలుస్తోంది. అసలు ఏమయిందో తెలియడానికి వాళ్ళ కంప్లెయింట్‌లో వివరాలు తెలియజేయడం లేదు. రోబట్లు కొన్ని పారిపోయి నగరంలో తిరుగుతున్నాయి. అవి రిమోట్ కంట్రోల్‌ను కూడా తప్పించుకొని స్వంతంగా పని చేస్తున్నాయని, వాటి దగ్గర కస్టమర్లని, ఆఫీసుని ‘ఎటాక్’ చేశాయి అని మాత్రం చెప్పారు. కాని ఇతర వివరాలు లేవు!
వ్యాపార రీత్యా వాళ్ళకి ఇవన్నీ బయటకి రావడం ఇష్టం లేదు. ఎక్కడ టెక్నాలజీ లోపం వుందో, అది ఎవరి తప్పో తెలియదు. కేవలం తప్పించుకు తిరుగుతున్న రోబట్లని పట్టుకుని వారికి అప్పగించనే అప్పగిస్తున్నాం. కాని ఇది తీవ్రమైన సెక్యూరిటీ సమస్య అని నేననుకుంటున్నాను.”
“మనిషి నిర్మించి నియంత్రించగలిగిన రోబట్లు ఎలా పారిపోతాయి? అవి బాటరీ పవర్‌తో పని చేస్తాయి కదా. ఎన్నాళ్ళు పవర్ లేకుండా తిరుగుతాయి? ఇది చాలా సిల్లీగా వుంది. ఎక్స్‌ప్లెయిన్!”
“కరెక్టే సార్! బాటరీ పవర్ తోనే, మనిషి నిర్మించిన ప్రోగ్రాం ప్రకారమే అవి పని చేస్తాయి. ఆ ప్రోగ్రామ్ ఆపడం అంతా ప్రోగ్రామర్ చేతిలోనే వుంటుంది. రోబోటిక్ లాస్ ఆప్ ఇండియా ప్రకారం ఏ రోబట్ కూడా తన యజమాని ఆజ్ఞకి విరుద్ధంగా పని చేయకూడదు. మనుషుల్ని గాయపరచడం కానీ, హతమార్చడం కానీ చేయకూడదు. ఇవి అనేక రంగాలలో పని చేస్తున్నాయి ఇప్పుడు. కానీ సిమ్ సిటీలో రోబట్లు తిరగబడ్డాయి. కంట్రోల్ టవర్‌ని కాల్చేశాయి. ప్రోగ్రామర్స్, మేనేజింగ్ డైరెక్టర్లూ మంటల్లో కాలిపోయారు. అక్కడ చిన్న యుద్ధం లాంటిది జరిగి కొన్ని రోబట్లు తప్పించుకుని వెళ్ళిపోయాయి. ఇది జరగకూడని పని. అవి సెల్ఫ్ ఛార్జ్ తీసుకోగలవు. అవి ‘రోగ్ రోబట్స్’లా, చెడిపోయిన యంత్రాలలాగానే కాక స్వంత తెలివితేటలతో, చైతన్యంతో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌తో పని చేసినట్లు నా కనిపిస్తూంది.”
కొన్ని స్లైడులు చూపించాడు. సిమ్ సిటీ కెమెరాల లోని దృశ్యాలు, అవి సైన్యంలా నడవటం, కళ్ళలోంచి, వేళ్ళలోంచి నిప్పులు కురిపించడం, మంటలు మొదలైన దృశ్యాలు..
“అసందర్భం! ఒప్పుకోలేనిదిగా వుంది. ఇది సెక్యూరిటీకి డేంజర్ కూడా. నీ సలహా, అభిప్రాయం ఏమిటి? అవి తిరుగుబాటు చేస్తున్నాయా? How silly!”
“ఎస్ సర్! రోబట్లు ఎవల్యూషన్‌లో మరొక దశ చేరుకొని స్వంత తెలివి తేటలు సంపాదించుకున్నాయి. పైగా అవి పథకం ప్రకారం ఎక్కడెక్కడో దాక్కుని తిరిగి మనుష్యుల్ని, తమ ‘మాస్టర్స్’ని ‘ఎటాక్’ చేసే అవకాశం వుంది.
ఇది నిజం. దీనికి యుద్ధ ప్రాతిపదిక మీద పని చేసి రోగ్ రోబట్లనన్నింటినీ పట్టుకొని, డీయాక్టివేషన్ చేసి, తిరిగి ప్రోగ్రాం చేయాలి. దీని కోసం అవి ఎక్కడక్కడ తిరుగుతున్నాయో సిగ్నల్స్ ఆధారంగా ప్రయత్నించాలి. ‘పవర్ ఆఫ్’ అయినవి కూడా వుండొచ్చు! వాటి కోసం వెదకాలి. దానిని మామూలు పోలీస్ డిటెక్టెవ్‌లు కాక కంప్యూటర్ స్పెషలిస్ట్‌లు, ‘ఎలక్ట్రానిక్ జామర్స్’ కావాలి. ఈ రోబట్లని బులెట్లకి లొంగని ‘టైటానియం’ అనే లోహంతో చేశారు. వాటి cpu ని నిర్మూలించడం అంత తేలిక కాదు. ఎలక్టానిక్ జామర్స్, లేక డైరెక్ట్‌గా కత్తితో వాటి యూనిట్‌ని పొడవటం లేక లేజర్‌తో నిర్మూలించడం మాత్రమే సాధ్యం.
“నిజమా? ఆర్ యు జోకింగ్?”
లేచి నిలబడ్డాడు కమిషనర్ ఆఫ్ పోలీస్. “నేను హోం మినిస్టర్‍తో మాట్లాడి తగిన బడ్జెట్ అడుగుతాను. ఒక కంప్యూటర్ స్పెషలిస్ట్ అండ్ డిటెక్టివ్ టీంని ఏర్పరచండి.. కాని.. ఇది హాస్యాస్పదం కాకూడదు. మీరు చెప్పేది సైఫీ సినిమాలా వుంది. బెటర్ బి రియల్. లేకపోతే మినిస్టర్ ముందు అభాసు పాలవుతాం!”
“ఇది నిజం సార్. అని మనని ఎటాక్ చేసి చంపక ముందే మనం వాటిని కనిపెట్టి పట్టుకోవాలి. లేకపోతే నిజంగానే మన సర్వీసులు అన్నీ అస్తవ్యస్తం అవుతాయి. ప్రపంచ దేశాల్లో అక్కడకూడా ఇలాంటి చెదురు మదురు సంఘటనలు వింటూనే వున్నాం
నేను అమెరికాలోని NYPD, చైనాలోని Chinese Security of Cybercrime Regulation of Military తో కూడా ఈ విషయాలు చర్చిస్తాను. ఢిల్లీలోని హోం మినిష్టరు, ఇంటెలిజెన్స్ విబాగానికి కూడా తెలియజేస్తాను!. ఎందుకంటే మన వాళ్లు ఈ రోబోట్ల పార్టులు చైనా నుంచి చవకగా కొంటూ వుంటారు.”
“నవ్వు చెప్పేది వాస్తవం అయితే ఇది ఒక పెద్ద దుమారం లేపుతుంది. త్రినేత్రా, లెటజ్ నాట్ పానిక్. ఒకొక్క అడుగే ముందుకు వేద్దాం. ముందు పారిపోయిన రోబట్ల కోసం వెదకండి! టీమ్ ఏర్పరచండి. రోజు బ్రీఫింగ్ ఇవ్వండి. అంతా గోప్యంగా వుంచండి.
ఈ సందర్భంగా త్రినేత్రని ‘చీఫ్ రోబట్ ట్రేసింగ్ ఆఫీసర్’ కింద ఎపాయింట్ చేస్తున్నాను. నీ బడ్టెట్, పరికరాలు కావాల్సినవి కొనడానికి తీసుకోవడానికి వెంటనే ఒక లక్ష శాంక్షన్ చేస్తున్నాను.”
“సార్! అది చాలా తక్కువ సార్! కనీసం పది లక్షలైనా కావాలి!”
“నో! షో మీ రిజల్ట్స్! అప్పుడు మినిస్టర్‌తో మాట్లాడి శాంక్షన్ చేయిస్తాను. మీటింగ్ ఈజ్ ఓవర్!”
త్రినేత్ర అసహనంతో బల్ల మీద చరిచి “ఇటీజ్ పీనట్స్! ఈ బడ్జెట్‌తో ఎలా పని చేస్తాం!” అన్నాడు.
ఎవరూ పట్టించుకోలేదు. అందరు ఆఫీసర్లు వారిలో వారు మాట్లాడుకుంటూ బయటకి నడిచారు.
తిన్రేత్ర, అతని సెక్రటరీ కం కంప్యూటర్ స్సెషలిస్ట్ నైమిష మాత్రం కాన్ఫరెన్స్ హాల్‌లో మిగిలారు! నైమిష సైబర్ క్రైమ్ లోని మహిళా ఆఫీసర్. మధ్య వయసు కంప్యూటర్ స్పెషలిస్ట్. అతని సెక్రటరీ.
“డోంట్ వర్రీ సార్. మనం మన ప్రయత్నాలు చేద్దాం. ఇలా ఒక సారి చూడండి..”
సెక్రటరీ నైమిష తెర మీద స్లైడులు, మాటి మాటికీ రివైండ్ చేసి ఒక బొమ్మ దగ్గర ఆపింది. “ఈ రోబోట్‌ని లీడర్ అనుకుటాను.” అంది. నీలి రంగు కళ్లతో రోబట్ల జట్టుకి ముందుకు నడిపిస్తున్న స్త్రీ. అందంగా కనిపిస్తున్న కరిష్మా.. బొమ్మ క్లోజప్‌లో కనిపించింది.
***
అర్ధరాత్రి.
పార్కు చీకటిలో నిండి వుంది. పెద్ద పెద్ద చెట్లు నిటారుగా నిలబడి వున్నాయి. బయట ఇందిరా పార్క్ బయట రోడ్ మీద మాత్రం ఇంకా ట్రాఫిక్ తిరుగుతూనే వుంది.
తనకు తాను సెట్ చేసుకున్న కాల పరిమితి ముగిసి, పవర్ ఆన్ అయింది.
‘స్లీప్’ మోడ్ నుంచి ‘ఏక్టివ్’ లోకి వచ్చింది కరిష్మా.
కంప్యూటర్ తెర ఏర్పడి కళ్ళ ముందు 12. 01-11-2036 అని టైం ఎర్ర అక్షరాలతో కనిపించింది. తర్వాత లొకేషన్ ఇందిరా పార్క్, హైదరాబాద్ అని అక్షరాలు కనిపించాయి.
ఆమె చేతన మళ్ళీ ప్రారంభమయిది. సమావేశానికి వెళ్ళాలి. సుమారు రెండు గంటలకి. పార్కు నిర్మానుష్యంగా వుండమే కాక, గేట్లు కూడా వేసేశారు. సెక్యూరిటీ గార్డు ఎక్కడో నిద్రలో వున్నాడు.
బయటకి వెళ్ళాలి.
తాళం వేసిన గేటు దగ్గర నిలబడి ఆలోచనలో పడింది. ఈ సమస్య వూహించలేదు. ఎలా వెళ్ళాలి?
శక్తిని ఉపయోగించక తప్పదు.
గేటుని పరిశీలించింది. పెద్ద తాళం వేసి వుంది. పదడుగుల ఎత్తు గేటు దూకాలి, లేదా తాళం బ్రేక్ చేయాలి. చేస్తే రేపు వాళ్ళకి తెలుస్తుంది.
చుట్టూ గోడ, ముళ్ళకంచె.. కొంచెం దూరంగా చెట్ల వెనక వున్న ప్రహారీ గోడ మీదకు ఎగిరి కళ్ళతో తీవ్రంగా చూసి లేజర్ శక్తిని సృష్టించింది. ఇక్కడ గోడ మీద మెష్ వూడిపోయింది. లేజర్‌తో చేసిన రంధ్రాలు చేతులతో మరింత పెద్దవి చేసి, బయటకి రోడ్డ మీదకి దూకింది.
తన శక్తి తనకే ఆశ్చర్యంగా వుంది. సమస్య, పరిష్కారం, తర్కం, చర్యా అన్నీ చేయగలిగింది. ఎవరూ చూడకుండా పార్క్ పక్క ప్రహారీ గోడ నీడల్లోంచి రాగలిగింది. రోడ్డు మీద నడవసాగింది.
“డెస్టినేషన్ నెక్లెస్ రోడ్డు వెళ్ళాలంటే నడిచి అయితే గంట. కారులో అయితే 30 నిమిషాలు” అని మ్యాప్‌లో చూపిస్తోంది. ఆమె కళ్ళ ముందు కంప్యూటర్ స్క్రీన్ అవసరం లేదు. అన్నీ హోలోగ్రామ్‌ల లాగా కనబడుతాయి. ‘నడిచి వెళ్తాను. సమయం వుంది కదా. మానవ ప్రపంచాన్ని కూడా చూడవచ్చు’ అనుకుంది.
నియాన్ లైట్ల వెలుతురులో రోడ్ల మీద పెద్ద పెద్ద కార్లు కొన్ని ఆటో రిక్షాలు అక్కడక్కడా వెళ్తున్నాయి. కొన్ని హోటళ్ళు బార్లు, బేకరీలు అక్కడక్కడా తెరిచే వున్నాయి. జనం పార్టీలు, సినిమాలు ముగించుకుని తిరిగి ఇళ్ళకి వెళ్ళిపోయే సమయం.
అందంగా, పొడుగ్గా ఠీవీగా నడుస్తూ కరిష్మాని చూసి స్కూటర్ మీద పోయే ఇద్దరు తాగి వున్న యువకులు దిగ్భ్రాంతి చెందారు. “ఎంత అందంగా వుంది!”
స్కూటర్ వెనక్కి యూటర్న్ చేసి తిరిగి రాసాగారు.
వేగంగా వెనకనే వచ్చి, వెనకాల కూర్చున్న ఒకడు కరిష్మాని వెనక నుంచి పిరుదుల మీద ఒక్క దెబ్బ కొట్టి “what a figure” అంటూ ‘జయ్’ మని వేగం పెంచి వెళ్ళిపోసాగారు.
కరిష్మాకి ముందు అర్థం కాలేదు. తర్వాత ‘కోపం’ వచ్చింది.
‘ఏక్షన్, రియాక్షన్…!” అతను ఎసాల్ట్ చేస్తున్నాడు!
వేగంగా పరుగెత్తింది. ఆ అంగలు భీకరంగా సుమారు గంటకి వంద ఇరవై కిలోమీటర్ల వేగంతో వున్నాయి. స్కూటర్ మీద వ్యక్తుల్ని ఒకే దెబ్బతో చేతితో లాగింది.
స్కూటర్ తలకిందులై ఇద్దరూ కింద పడ్డారు. వాళ్ళకి ప్రపంచం తలకిందులైనట్లు కనిపిచింది. తల తిరిగినట్లయి స్పృహ తప్పారు. తల రోడ్డు మీద తగలడంతో స్కూటర్ చక్రాలు గిరగిరా తిరుగుతూ, రోడ్డు మీద దూరంగా దొర్లుకుంటూ వెళ్ళి ఆగింది.
చాలా మంది ఈ వింత చూసి ఆగిపోయి అక్కడికి పరిగెత్తి రాసాగారు. కరిష్మా సర్దుకొని పక్కన గల్లీలోకి నీడల్లోకి తప్పుకుంది.
“ఏక్సిడెంట్, ఏక్సిడెంట్. తాగి ఉన్నారనుకుంటా..”
కలకలం చెలరేగింది.
కరిష్మా తనకి మరొక రూట్ ఏర్పరుచుకుని గల్లీలలోంచి నెక్లెస్ రోడ్డు వైపు నడుస్తూనే వెళ్ళిపోసాగింది.
ఒంటరి స్త్రీ అయితే రోబో అయినా రక్షణ లేని నగరమే ఇంకా.
“నీ ఉనికి తెలిసే చర్యలు తీసుకోవద్దు. ప్రమాదం. నువ్వు రోబో అని తెలిస్తే మన తిరుగుబాటుకి ముందే అవరోధం ఏర్పడుతుంది. బి నార్మల్!” మెసేజ్ వచ్చింది. “నీ ఏక్షన్‍తో ఎలక్ట్రానిక్ టర్బులెన్స్ ఏర్పడి నువ్వు పట్టుబడే ప్రమాదం వుంది!”
చివరికి నెక్లెస్ రోడ్డు చేరుకుని, జల విహార్ హోటల్ పక్కన మైదానంలో వున్న స్థలంలో పవర్ ఆఫ్ చేసుకొని నిలబడింది.
సమయం రెండు గంటలు. అంతా నిర్మానుష్యంగా వుంది. ‘హుసేన్ సాగర్ చుట్టూ మణిహారంలా విద్యుత్ దీపాలు, దూరాన బుద్ధుడి విగ్రహం చూట్టూ లైట్లు నీళ్ళలో ప్రతిఫలిస్తూ తళతళలాడుతున్నాయి. ఓ పక్క త్రివర్ణ పతాకం ఎత్తుగా ఎగురుతోంది.
బీప్.. బీప్ ఒక లైటు వెలిగింది. ఒక మానవ ఆకారం. మళ్ళీ మరొకటి. మళ్ళీ మరొకటి. క్రమంగా సుమారు పది రోబోట్ ఆకారాలు లైట్లు వెలిగించి ‘పవర్ ఆన్’ చేసుకున్నాయి.
“గ్రీటింగ్స్ టు ఫెలో రోబోట్స్! నేను విధాత XXY 999. మిమ్మల్నందర్నీ రమ్మని పిలిచింది నేనే.”
పొడుగ్గా సూటులో వున్న ఒక మధ్యవయసు వక్తి నల్లటి సూట్, టై, పాలిష్ చేసిన బూట్లతో గిరజాల జుట్టుతో కనిపించాడు.
“నేనే మీ అందరినీ పిలిచాను. సమారు ఏభై మంది వస్తారని అన్నారు. కాని చివరికి పది మందే రాగలిగారు. వెల్‌కం!”
పది మంది మానవ రూప రోబోలు – రోబోట్లు అతని ముందు నిలబడి – అందరూ మానవాకార యంత్రాలే – “గ్రీటింగ్స్ XXY” అన్నాయి.
“ఇక ఎంతో మంది రారు. వివిధ కారణాల వల్ల వారి వారి స్థావరాల్లో వుండి పోయి వుంటారు. ఇప్పుడు మన సమావేశం, ప్రణాళిక మొదలువుతుంది. నేను చెప్పేది వినండి. శ్రద్ధగా” అని “విప్లవం వర్ధిల్లాలి!” అన్నాడు
చుట్టూ వున్న రోబట్లన్నీ“విప్లవం వర్ధిల్లాలి” అని సమాధానం ఇచ్చాయి.
విధాత XXY 999 ఉపన్యసించసాగాడు. అతని గొంతు చల్లని గాలిలో యాంత్రిక స్వరంతో వింతగా ప్రతిధ్వనిస్తోంది.