బకాసురుని సోదరుడు ‘కిర్మీరుడు’

0
3

[dropcap]మ[/dropcap]హాభారతములో హీరోలతో పాటు విలన్లు కూడా ఉంటారు. విచిత్రం ఏమిటంటే వారు కూడా యోధానుయోధులే. అటువంటి విలన్లలో కిర్మీరుడు ఒకడు. కిర్మీరుని ప్రస్తావన మహాభారతంలోని అరణ్య పర్వంలో వస్తుంది. హస్తినలో ధృతరాష్ట్రుడు విదురునితో పాండవుల గురించి అడుగుతాడు. దానికి విదురుడు ధృతరాష్ట్రునికి హితబోధ చేస్తాడు. అన్నదమ్ముల మధ్య వైరం పనికిరాదని, ఇప్పటికైనా నా మాట విని పాండవులను పిలిపించి వారికి అర్ధరాజ్యము ఇచ్చి ధర్మము నిలబెట్టమని కురువంశ నాశనాన్ని నివారించమని హితవచనాలు చెపుతాడు. అంతే కాకుండా ద్రౌపదికి భీమునికి దుశ్శాశనునితో క్షమాపణలు చెప్పించి సమస్యను పరిష్కరించుకోమని చెపుతాడు. కానీ హితవచనాలు, ధర్మము చెప్పిన విదురునిపై ఆగ్రహము చెందిన ధృతరాష్ట్రుడు విదురునితో “నీకు ఇష్టమైన పాండవుల వద్దకే వెళ్ళు” అని విదురుని తూలనాడుతాడు

విదురుడు అప్పుడు ధృతరాష్ట్రుని వీడి కామాఖ్య వనములో అరణ్యవాసము గడుపుతున్న పాండవుల దగ్గరకు వస్తాడు. ధర్మరాజు తన పెదనాన్న ధృతరాష్ట్రుని యోగక్షేమాలు అడుగుతాడు. విదురుడు జరిగిన విషయము చెపుతాడు. కొంతకాలానికి ధృతరాష్ట్రుడు తానూ విదురుని విడిచి ఉండలేనని తెలుసుకున్నవాడై సంజయుని కామాఖ్య వనానికి వెళ్లి విదురునికి నచ్చజెప్పి హస్తినకు రప్పించే బాధ్యతను అప్పగిస్తాడు. సంజయుడు కామాఖ్య వనానికి వచ్చి పాండవులతో ఉన్న విదురునికి ధృతరాష్ట్రుని సందేశము చెప్పి విదురుడు హస్తినకు వచ్చే విధముగా విదురుని అంగీకరింపచేస్తాడు. హస్తినకు వచ్చిన విదురుడు మళ్లా ధృతరాష్ట్రునితో “నీకు ధర్మము చెప్పటం నా విధి” అని అంటాడు

ధృతరాష్ట్రుడు కూడా విదురునితో “నీవు నీతిమంతుడివి అని నాకు తెలుసు. కానీ నీవు పాండవపక్షపాతిగా వ్యవహరిస్తున్నావని కోపంతో నిన్ను తూలనాడను, నేను తప్పు చేసాను” అని అంటాడు. విదురుడు, “నీ కొడుకులు తప్పు చేస్తున్నప్పుడు నీకు నీ ధర్మము చెప్పటం నా విధి కాబట్టి నేను చెపుతాను” అని అంటాడు. విదురుని రాక దుర్యోధనునికి నచ్చదు. కానీ శకుని “పాండవులు సత్యసంధులు కాబట్టి, అరణ్యవాసము అజ్ఞాత వాసము పూర్తి కానిదే రారు. కాబట్టి నీవు భయపడనవసరము లేదు” అని చెపుతాడు. అదను చూసి వారిపై యుద్ధానికి వెళ్లి వారిని హతమారుద్దామన్న కర్ణుని సలహాపై దుర్యోధనుడు సేనలను సమీకరిస్తూ పాండవులపై యుద్ధానికి సన్నద్ధం అవుతూ ఉంటాడు

వ్యాసుడు వచ్చి పాండవుల అరణ్య, అజ్ఞాతవాసములు పూర్తి అయినాక యుద్ధము తప్పదు ఇప్పటినుంచే దుర్యోధనుడు తొందరపడటం ఎందుకని ధృతరాష్ట్రునితో అంటే ధృతరాష్ట్రుడు తన కొడుకు దుర్యోధనుడు తన మాట వినటం లేదు కాబట్టి వ్యాసుడినే దుర్యోధనుడికి నచ్చచెప్పమని అంటాడు. దానికి సర్వము తెలిసిన వ్యాసుడు ఆ పనికి  మైత్రేయ మహర్షి సరి అయినవాడు అని చెప్పి వెళ్ళిపోతాడు.

కొంత కాలానికి వ్యాసుడు చెప్పినట్లుగా మైత్రేయుడు ముందుగా పాండవులను చూసి హస్తినకు వస్తాడు. ధృతరాష్ట్రుడు మైత్రేయునికి అర్ఘ్యపాదాలు ఇచ్చి పాండవులను కలిసి వచ్చానని చెప్పగా వారి క్షేమ సమాచారాలు అడుగుతాడు. కామాఖ్యా వనములో వారు కందమూలాలు తింటూ జీవనము సాగిస్తున్నారని చెపుతాడు. పాండవులు ధర్మబుద్ధి కలవారు కాబట్టి వారికి మహర్షుల దీవెనలు ఉన్నాయి కాబట్టి అరణ్యములో కూడా వారు సుఖముగా ఉన్నారు అని తెలియజేస్తాడు. పాండవులతో వైరము మాని సఖ్యముగా ఉండి కురువంశ నాశనాన్ని నివారింపమని ధృతరాష్ట్రునికి హితవు చెపుతాడు. “పాండవులు వజ్రశరీరులు, భీముడు ఇప్పటికే హిడింబాసురుని, జరాసంధుడిని, బకాసురుడిని, కిర్మీరుడిని సంహరించాడు. అటువంటి బలాఢ్యుడితో తలపెడితే నష్టమే తప్ప లాభము ఉండదు” అని చెపుతాడు. అన్నిటికన్నా మిన్న వారికి శ్రీకృష్ణుని ఆశీస్సులు అండదండలు ఉన్నాయి అట్టి వారితో వైరము తగదు అని మైత్రేయ మహర్షి ధృతరాష్టాదులకు వివరిస్తాడు

హితవచనలు తలకెక్కని దుర్యోధనుడు తన తొడలు చరిచి మైత్రేయ మహర్షిని అవమానిస్తాడు. ఆగ్రహించిన మహర్షి “జరగబోయే కురుక్షేత్ర సంగ్రామములో భీముడి గదా ఘాతముతో నీ తొడలు విరవగలవు” అని హెచ్చరిస్తాడు. ధృతరాష్ట్రుడు మహర్షి వచనాలకు భయపడి మహర్షిని ఆగ్రహించవద్దని వేడుకుంటాడు. శాంతించిన మహర్షి ఇప్పటికైనా దుర్యోధనుడు మంచి బుద్ధితో పాండవులతో సఖ్యముగా వుంటే ఏమి ప్రమాదం జరగదు అని చెప్పగా  భీముడు కామాఖ్యా వనములో కిర్మీరుడనే రాక్షకుడిని ఎలా సంహరించాడో వివరించామని ధృతరాష్ట్రుడు మైత్రేయ మహర్షిని అడుగుతాడు

మైత్రేయుడు “నా మాటను నీ కొడుకే వినలేదు. నేనెందుకు చెప్పాలి? విదురుని అడిగి తెలుసుకో” అని చెప్పి వెళ్ళి పోయాడు.

విదురుడు కిర్మీరుని వృత్తాంతాన్ని ధృతరాష్ట్రునికి ఇలా వివరించసాగాడు. “పాండవులు ఒకరోజు అడవిలో విశ్రమించవలసి వచ్చింది. వికృతాకారుడైన రాక్షసుడు పాండవుల దారికి అడ్డంగా నిలిచాడు. ఆ రాక్షసుని చూసి ద్రౌపది భయంతో కళ్ళు మూసుకుంది. ఇంతలో ధర్మరాజు పరివారము లోని ధౌమ్యుడు అనే ఋషి  తన మంత్రశక్తితో ఆ రాక్షసుని మాయను భగ్నం చేసాడు. ఆ రాక్షసుని చూసి ధర్మరాజు “నీ వెవరు ఈ అడవిలో ఎందుకు ఉన్నావు?” అని ఆడుగుతాడు. దానికి ఆ రాక్షసుడు “నేను బకాసురుడు అనే రాక్షసుని తమ్ముడిని. నా పేరు కిర్మీరుడు. మనుష్యులను చంపి తింటూ ఉంటాను. నాకు భయపడి ఎవరూ ఈ అరణ్యానికి రారు. మీరు ఎవరు? ఈ అరణ్యానికి ఎందుకు వచ్చారు?” అని అడుగుతాడు. ధర్మరాజు “నా పేరు ధర్మరాజు. వీరు నా సోదరులు. మేము వనవాసం చేస్తూ ఇక్కడకు వచ్చాము” అని వరుసగా తన తమ్ములను పరిచయం చేస్తూ మొదటగా భీముని పేరు చెప్పగానే భీముని పేరు విన్న కిర్మీరుడు ఆగ్రహముతో “నా అన్న బకాసురుడిని చంపిన  భీముడు వీడేనా?వీడిని చంపి నా ఆకలి తీర్చుకుంటాను. నేను వీడి కోసమే వెతుకుతున్నాను” అని వికటాట్టహాసం చేసాడు. ఇది విని అర్జునుడు గాండీవం ఎక్కుపెట్టాడు. కానీ ఈలోగా భీముడు అర్జునిడిని వారించి కిర్మీరుని ఎదుర్కొన్నాడు. ఇద్దరూ ఘోరంగా యుద్ధం చేసారు. చెట్లతోనూ రాళ్ళతోనూ కొట్టుకున్నారు. చివరకు భీముడు కిర్మీరుని అతని అన్న బకాసురుడిని చంపినట్లుగానే అతని దేహాన్ని విరగదీసి చంపాడు. ఈ విధంగా భీముడు కామ్యఖ్యా వనంలో రాక్షస భయం లేకుండా చేసాడు” అని విదురుడు ధృతరాష్ట్రునికి కిర్మీరుని వద్ద ద్వారా భీముని బల పరాక్రమాలను తెలియజేస్తాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here