[dropcap]పె[/dropcap]ద్ద శబ్దంతో బస్ ఆగిపోయింది. ఒక్కసారిగా ఖంగుతిన్నారందరూ. డ్రైవర్ సీట్ పక్కనుండి పొగలు రావడం చూసి ఒక్క నిముషం ఏదో జరిగిందనే గందరగోళం. కండక్టర్ మధ్యలోకి వచ్చి “భయపడకండమ్మా.. కొంచెం నిదానించండి” అంటూ అందరినీ సమాధానపరిచే ప్రయత్నం చేస్తున్నాడు. బస్సు ఫేల్ అయిందని పెద్ద ప్రమాదమేమీ లేదని రిపేర్ చేయించుకుని బయలుదేరదాం అని చెప్పే డైవర్ మాటలు విని ఒకొక్కరూ ఒకోలా స్పందిస్తున్నారు.
అప్పటి దాకా ఆకలితో సతమతమవుతూ ఇబ్బంది పడుతున్న నాకు విపరీతంగా నీరసం ఆవహించింది. ఓ గంటన్నరలో ఊరు చేరతాం, అక్కడ భోజనం చేయవచ్చు అని ఆశపడుతూ ఎదురు చూస్తూ, కూర్చున్న నాకు కోపం కూడా వచ్చింది. బైటకి చూస్తే ఎక్కడా కాస్త తిండి దొరికే ఛాయలు కూడా లేవు. పొలాలే అన్నీ. నిన్నంతా కడుపులో ఇబ్బందిగా ఉందని చాలా తక్కువగా తిన్నాను. రాత్రి పూట భోజనం కూడా చేయలేదు. ప్రయాణంలో చాలా తక్కువ భోంచేయడం నా అలవాటు. పైగా ఇది మామూలు ప్రయాణం కాదుగా. ప్రొద్దున లేవగానే కడుపులో తిప్పుతుంటే, ఈ రోజు కాస్త కడుపు ఖాళీగా ఉంచితే మంచిదని, బస్‍లో రిస్క్ తీసుకోవడం ఎందుకని ఏమీ తినకుండానే బస్ ఎక్కాను. బస్ స్టాండ్‌లో అరటి పళ్ళు కనిపించినా కొనాలనిపించలేదు. మూడు గంటల ప్రయాణమే కదా, బస్సు దిగంగానే తినవచ్చని అనుకున్నాను. అదేంటో కాని బిస్కట్లు లాంటి పదార్దాలు కూడా నేను నాతో ఉంచుకోను. మూడు పూటలా తినవలసిన టైంలో ఫుల్ గా లాగించడం తప్ప ఎటువంటి చిరుతిళ్లపై నాకు మనసు పోదు. అకలి దహించుకుపోతుంది. కాని ఇక్కడ ఎంత సేపు ఆగాలో అర్ధం కావడం లేదు.
అందరూ తలో విధంగా మాట్లాడుతూ క్రిందకి దిగుతున్నారు. డ్రైవర్ క్రిందకి దిగి అక్కడ కనిపించిన వారితో ఏదో మాట్లాడుతున్నాడు. చుట్టూ పచ్చని పొలాల మధ్య సూర్యుడు పైకి వచ్చి అందంగా కనిపిస్తున్నాడు. కాని కడుపులో ఆకలితో దేన్నీ ఆస్వాదించే పరిస్థితిలో లేను. ఈలోగా డ్రైవర్ సంతోషంగా ఓ యువకుడిని వెంటపెట్టుకుని బస్ దగ్గర అయోమయంగా నిలిచి ఉన్న ప్రయాణికుల దగ్గరకు వచ్చి “ఈ సార్ నన్ను దగ్గరలో ఉన్న మెకానిక్ దగ్గరకు తీసుకువెళతానని చెప్పాడు. నేను వెళ్ళి మెకానిక్‍ని తీసుకుని వస్తాను. రిపేర్ చిన్నదే. నేను కూడా ఓ చేయి వేస్తే ఓ గంట గంటన్నరలో మనం బైలుదేరిపోవచ్చు. ఎవరైనా మరో బస్సులో వెళ్ళాలంటే మీతో పాటే ఉన్న కండెక్టర్ ఈ దారిలో వచ్చే బస్ ఎక్కిస్తాడు” అని చెప్పగానే, కొందరు అయితే మరో బస్సులో వెళ్ళిపోతాం అంటూ లగేజీ దించుకోవడం మొదలెట్టారు. నాకు ఆలోచన ముందుకు సాగలేదు. ముందు ఏదో ఒకటి తినాలి. ఇప్పుడు క్షుద్బాధ తీరితే కాని మెదడు పనిచేయదు అనిపించింది. పైగా తొందరగా గమ్యం చేరాలనే ఆతురత నాలో లేదు. కండక్టర్ దగ్గరకు వెళ్ళి “మీరు బస్ బాగయే దాకా ఉంటారు కదా” అని అడిగా. అతను “ఎందుకుండను మేడం. మీ అందరి బాధ్యత మాదే కదా అన్నాడు.” “నేను ఓ అరగంట కాస్త ఊర్లోకి వెళ్లి రానా” అడిగా.
“ఇప్పుడా?” అని ఆశ్చర్యంగా చూస్తున్న అతనితో “ప్రొద్దుటి నుండి ఏమీ తినలేదు. ఏదైనా దొరుకుతుందేమో అని” అంటూ ఇబ్బందిగా మొహం పెట్టా. డ్రైవర్‌తో పాటు అక్కడే ఉన్న ఆ ఊరి యువకుడు ఇది విన్నట్లున్నాడు. “దానికేం అండి, ఓ ఫర్లాంగు నేరుగా నడిచి వెళితే ఆ కుడి పక్క యశోదమ్మ హోటలుంది. ఏదో ఒకటి చేసి పెడుతుంది. ఎక్కువ దూరం కూడా లేదు, నేను తీసుకువెళ్ళనా?” అని అడిగాడు. “పర్లేదండి నేను వెళ్ళగలను. ఈ లోగా మీరు డ్రైవర్‌తో మెకానిక్ కోసం వెళ్ళండి. ఇక్కడ పని అయే లోపల నేను వచ్చేస్తాను” అన్నాను. ఆ అబ్బాయి మాత్రం “అక్కర్లేదు అండి. అక్కడి నుండే బస్ తిరిగి వెళ్ళాలి. ఇది బాగు కాగానే మేమే అక్కడకు వస్తాం. మీరు తిరిగి రావలసిన అవసరం లేదు. యశోదమ్మ కూడా చాలా మంచిది. మీరక్కడ కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు. ఆమెకు అప్పారావు బస్సుతో వెళ్ళాడని చెప్పండి, నేను తనకు సరుకులు తెచ్చి ఇస్తానని చెప్పాను. ఆలస్యం అవుతుందని నా కోసం ఎదురు చూడకుండా పని చేసుకుంటుంది.” అని చెబుతూ డ్రైవర్‌ని తన మోపెడ్ మీద ఎక్కుంచుకుని వెళ్ళిపోయాడు.
కండక్టర్ కొందరు ప్రయాణికులను వెనుక వచ్చే బస్ ఎక్కించడానికి సిద్దం చేస్తున్నాడు. నాతో “మీరు వెళ్ళండి మేడం. మిమ్మలను అక్కడే ఎక్కించుకుంటాం. ఎందుకన్నామంచిది నా సెల్ నెంబర్ తీసుకోండి” అని చెప్పి తన నంబర్ ఇచ్చాడు. నా ఫోన్‌లో నంబర్ నోట్ చేసుకుని సూట్ కేస్ బస్ లోనే వదిలి పెట్టి, నా హాండ్ బాగ్ తీసుకుని నడక మొదలుపెట్టాను. పెద్ద కష్టపడకుండానే ఎదురుగా వస్తున్న ఓ ఇద్దరు పిల్లలు చెప్పిన గుర్తులను బట్టి ఓ పది నిముషాలు నడిచి ఆ హోటల్ చేరుకున్నా. అ పిల్లలు చెప్పకపోతే అక్కడో హోటల్ ఉన్నట్టుగా కనుక్కునేదాన్ని కానేమో. ఓ రెండు టేబిళ్లు రేకుల షేడ్డులో వేసి ఉన్నాయి. వాటి చుట్టూ కుర్చీలు. లోపల ఓ కుటుంబం ఉంటున్నట్లు కనిపిస్తుంది. షేడ్‌లో ఓ పక్క ఓ పెద్ద ఫ్రిజ్, ఓ వెట్ గ్రండర్ మరో పక్క వంట చేసుకునే స్థలం కాబోలు కాస్త చాటుగా ఓ కర్టెన్ వెనుక కనిపిస్తూనే ఉంది. ఎవరినన్నా ఎలా పిలవాలని సందేహిస్తున్న నాకు ఓ పదిహేను సంవత్సరాల అమ్మాయి లోపలనుండి వస్తూ కనిపించింది. చేతిలో ఏదో పుస్తకం. అటుపక్క టేబిల్ పై నీళ్ళ జగ్ కోసం వచ్చినట్లు ఉంది. నా నీడను గమనించి, వెనక్కు తిరిగి ఆశ్చర్యంగా చూస్తూ నిల్చుంది. నేనే ఏం అనాలో తెలియక “యశోదమ్మ హోటల్..” అంటూ ఆగిపోయాను. ఇంతలో లోపల నుండి ఓ స్త్రీ ఇటే వస్తూ కనిపించింది. “ఎవరూ?” అంటూ ఆ చిన్న పిల్ల ముఖం చూస్తున్న ఆమెను చూసి నేనే మళ్ళీ “యశోదమ్మ హోటల్ ఇది అని ఊర్లో వాళ్ళు చెబితే వచ్చానండీ” అన్నాను. ఆమె వింతగా నా ముఖం చూస్తూ “ఎక్కడినుండి వస్తున్నావమ్మా?” అని అడిగింది. “మా బస్ అక్కడ ఆగిపోయిందండి. మీకు తెలుసంటా అప్పారావు అని ఓ అబ్బాయి మా డ్రైవర్‌ని తీసుకుని మెకానిక్ కోసం వెళ్ళాడు. నేను ఏదైనా హోటల్ ఉంటుందేమో అని వెతుకుతుంటే మీ దగ్గరకు పంపించాడు” అన్నా.
ఆమె చిరునవ్వుతో “రా అమ్మా” అంటూ పక్కన ఉన్న కుర్చీ చూపించింది. “ప్రొద్దున తొమ్మిదింటి తరువాత టిఫెన్ల కోసం ఎవరూ రారు. అందుకే లోపలికి వెళ్ళా. కాస్త దోశల పిండి ఉంది. దోసె తింటావా” అంది. ప్రాణం లేచి వచ్చినట్లు అనిపించింది. “సరే అండి” అంటూ కూర్చున్నా. నా ముఖంలో రిలీఫ్ కనిపించిందేమో ఏదో అర్ధమయినట్లు చిరునవ్వు చిందిస్తూ ఆమె ఆ పాపతో “మంచినీళ్ళూ తెచ్చివు” అంటూ ఫ్రిజ్ దగ్గరక్ వెళ్ళింది. లోపలికి వెళ్ళబోతూ ఆ అమ్మాయి చేతిలో ఉన్న పుస్తకం టేబిల్ పై పెట్టింది. చేతిలో తీసుకుని చూసా. టెంత్ క్లాస్ ఫిజిక్స్ వర్క్ బుక్. పైన పావని అని అందంగా తెలుగులో రాసి ఉంది. బుక్ తిరగేస్తున్న నా దగ్గరకు జగ్ లో నీళ్ళు తీసుకుని వచ్చింది ఆ అమ్మాయి. నీళ్ళు గ్లాసులో పోసుకుని తాగుతూ “టెంత్ చదువుతున్నావా పావని” అన్నా. అమాయకంగా నవ్వుతూ “అవునండి” అంటూ తనూ అక్కడే నిలబడింది. ఫ్రిజ్ నుండి పిండి తీసి దోసల పెనంపై దోసలు వేస్తున్నట్లుంది ఆమె. “మీ అమ్మగారా”? అని అడిగా పావనిని. “అవునాంటి. మా అమ్మ యశోద”, అంటూ నా వైపు ఆసక్తిగా చూస్తూ నిలబడింది. “ఇక్కడే చదువుతున్నావా”? అని అడిగాను. అదేంటో కాని దోసలు పెనం మీద పడుతున్న చప్పుడికి ఆకలి ఇంకా ఎక్కువయినట్లు అనిపిస్తుంది. ఏదో ఒకటి మాట్లాడకపోతే నా ముఖంలో ఆకలి ఈ చిన్న పిల్లకి కూడా కనిపిస్తుందేమో అనే సందేహం మరో పక్కన కలుగుతుంది. “మా ఊరికి కాస్త దూరంలో హైస్కూల్ ఉంది ఆంటీ అక్కడ చదువుతున్నా” అంది పావని.
ఈ లోపల బైట ఎవరో వచ్చిన చప్పుడు. ఎవరో దగ్గుతున్నారు. పావని ముఖంలో ఆనందం. తుర్రుమని బైటికి పరుగెత్తింది. అంతే ఉత్సాహంతో పరుగెత్తుకుంటూ వచ్చి తల్లి దగ్గరకు వెళ్లింది. ఆ వచ్చిన వ్యక్తి ఓ ముస్లిం అని తెలుస్తూనే ఉంది. చాలా గంభీరంగా ఉంది ముఖం. ఆ గడ్డం, తలపై టోపి అతని మతాన్ని సూచిస్తున్నాయి. లోపలకివచ్చి నన్ను చూసి ఆశ్చర్యపోయి ఆగినట్లున్నాడు. పావని పక్కన రోడ్డు పై ఓ బస్సు చెడిపోయిందని, నేనో ప్రయాణికురాలినని టిఫన్ కోసం వచ్చానని గబ గబా అతనికి చెబుతూనే ఉంది. అంత సేపు అతను నిల్చునే ఉన్నాడు. పావని వైపు నవ్వుతూ చూస్తున్నాడు. అతని చేయి పట్టుకుని ఊపుతూ ఏదో చెబుతున్న పావనికి తల్లి పిలుపు వినిపించి లోపలికి మళ్ళీ తుర్రుమంది. క్షణకాలం నవ్వు కనిపించిన అతని మొహం తిరిగి గంభీరంగా మారిపోయింది. పావని ఓ స్టీల్ టిఫెన్ పట్టుకుని వచ్చింది. “రెహ్మాన్ అమ్మ ఇచ్చింది” అంటూ అతనికి టిఫెన్ అందించింది. అతను జేబులో నుండి ఓ జామెంట్రీ బాక్స్ తీసి పావనికిచ్చాడు. “అబ్బా తెచ్చావా” అంటూ పావని ఆ బాక్స్ తెరిచి చూసుకుంటూ నిలబడింది. ఆమెను నవ్వుతూ చూస్తూ ఆ వచ్చినతను టిఫెన్ తీసుకుని వెళ్ళిపోయాడు. అతను వెళుతున్నప్పుడే ఓ ఇద్దరు వ్యక్తులు గట్టిగా ఏదో మాట్లాడుకుంటూ అతనికి ఎదురుగా వచ్చి ఓ క్షణం బిక్క చచ్చిపోయినట్లు బిగుసుకుపోయారు. వారి వైపు చూడకుండా అతను మరో దిక్కుకు తిరిగి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ ఇద్దరు మాత్రం అతను వెళ్ళేదాకా భయం భయంగా అతన్నే చూస్తూ అక్కడే నిలుచుని లోపలికి తొంగి చూసారు. లోపల నేను కనిపించాననేమో ఇంకాస్త వంగి చూడబోతున్న వారికి లోపలి నుండి యశోద రావడం కనిపించి అదే స్పీడులో వెనుదిరిగి వడివడిగా అడుగులేసుకుంటూ వెళ్ళిపోయారు.
యశోద ప్లేటులో రెండు దోసలతో అల్లం చెట్నీ, పల్లీల పచ్చడి, పుట్నాల పొడి పక్కన వేసుకొచ్చి ఎదురుగా పెట్టింది. “తినమ్మా” అంటూ లోపలికి పోబోతూ పావని చేతిలో బాక్స్ చూసి ఆగిపోయింది. తల్లి చూసిన చూపుకి కాస్త భయంగా “రెహ్మాన్ ఇచ్చాడమ్మా” అని చెప్పి బాక్సుని వెనక్కు దాచి పెట్టుకుంది పావని. సీరియస్ గా చూస్తూ యశోద మళ్ళి వంటగదిలోకి వెళ్ళిపోయింది.
ఆకలితో ఉన్నానేమో, ప్లేటులో దోసలు చూడగానే ఇక అన్ని మరిచిపోయా. గబ గబా తినడం మొదలెట్టాను. ఆకలితో ఉండడం వలనో లేక యశోద చేతి మహిమో కాని దోసెలు ఎప్పుడూ తిననంత రుచిగా ఉన్నాయి. ఐదు నిముషాలలో ప్లేటు ఖాళీ అయింది. ఇంతలో యశోద మరో రెండు దోసెలు పట్టుకుని వచ్చింది. మళ్ళీ అడగవచ్చునో లేదో అనుకుంటున్న నాకు ఆ భయం తీరిపోయింది. ఆ రెండు దోసెలు కూడా తినేసాను. యశోద పక్కనే నిలబడి ఉంది. ఆమెను చూస్తూ “మళ్ళీ వేస్తారేమో వద్దండి. ఇక చాలు అన్నాను”. చిరునవ్వుతో నా వైపు చూసిందామె. లోపల నుండి గ్లాసులో టీ తీసుకుని వచ్చి ఇచ్చింది. తనకీ మరో గ్లాసు తెచ్చుకుని అటు పక్కన కూర్చుని తాగుతుంది. ఆకలి తీరడంతో గ్లాసులో టీ తృప్తిగా ఆస్వాదిస్తూ ఆమెను గమనించడం మొదలెట్టాను. చామన ఛాయ, ముఖాన చిన్న బొట్టు. మధ్య పాపిటి తీసి ముడి వేసుకుంది. పొడవు చేతుల ఎర్ర జాకెట్టు, ఆకు పచ్చకు ఎర్ర బార్డర్ ఉన్న నేత చీర. మెడలో ఓ నల్ల దారం మాత్రమే ఉంది. చీర కుచ్చిళ్ళు పైకి దోపుకుంది. కాళ్ళకు వెండి పట్టాలు ఉన్నాయి. ఎంతైనా సగటు భారతీయ స్త్రీని కదా, కాళ్లకు మెట్టేలున్నాయేమో అని ఆసక్తిగా చూసా. లేవు. ఒకో చేతికి రెండు ఎర్రగాజులు, ముక్కుకి ఓ తెల్ల రాయి ముక్కెర ఇంకే అలంకరణలు లేవు. కాని ఆమె ముఖంలో ఏదో ఆకర్షించే గుణం ఉంది. గొప్ప అందగత్తె కూడా కాదు. కాని ఆమెను చూస్తూ ఉంటే మళ్ళీ చూడాలి అనిపించేలా ఉంది. ఆమెలో ఆ ఆకర్షణ నాకు వింతగా అనిపించింది.
తననే చూస్తునానని గమనించిందేమో యశోద నావైపుకి తిరిగి “ఎక్కడినుంఛి వస్తున్నారు” అంది “హైదరాబాద్” చెప్పాను. మళ్ళి నేనే, “బస్ బాగయ్యాక ఇక్కడికే వచ్చి తీసుకెళతాను అన్నారు మీ అప్పారావు గారు. నేనిక్కడ కూర్చోవచ్చు కదా అప్పటి దాకా” అన్నాను
“అయ్యో దానికేం అమ్మా కూర్చోండి. ఈ టైంలో భోజనం చేసే వాళ్లు కూడా ఎవరూ రారు. ఇక్కడ భోజనానికన్నా కూడా ప్రొద్దున, సాయంత్రం టిఫెన్లకు టీలకు వచ్చే వాళ్ళే ఎక్కువ. ఎవరైనా భోజనానికి వస్తామని కబురు చేస్తే తప్ప మధ్యాహ్నం వంట పని ఉండదు. ఒకరూ అరా వస్తే వారికి భోజనం పెద్ద సమస్య కాదు. అందుకని ఓ గంట నాకూ ఖాళీనే.” అంటూ ఉల్లిపాయలు తెచ్చుకుంది తరుక్కోవడానికి.
ఇందాక ఆ ముస్లిం వ్యక్తి వెళ్ళిపోతుంటే భయంగా చూస్తూ నిలబడ్డ ఆ ఇద్దరూ, వెళ్ళిన దారినే వస్తూ మళ్ళి లోపలికి తొంగి చూసారు. ఎదురుగా నేనే కనిపించేసరికి ఆరాగా నిలబడ్డారు. చప్పుడు విని వెనక్కి తిరిగి చూసింది యశోద. అంతే ఆ చూపులో ఏం ఉందో మరి వెంటనే వెనక్కు తిరిగారు ఆ ఇద్దరు. నాకెందుకో ఆ వాతావరణంలో ఏదో తేడా అనిపించింది. “ఎవరండి వాళ్లు?” అనడిగేశా యశోదని.
ఒక సారి పైకి చూసి ఏం అనుకుందో మరి “లోకం.. ఒంటరిగా బ్రతికే స్త్రీని ప్రతి నిమిషం గమనించడం దాని హక్కు” అంది.
“ఒంటరిగా..” అని ఆశ్చర్యంగా అడిగి సభ్యత మీరానేమో అని ఒక్క క్షణం ఇబ్బందిగా ఫీల్ అయ్యా.
నా ఇబ్బంది గమనించిందేమో యశోద, ఓ క్షణం నిశితంగా నన్ను పరిశీలిస్తూ “అవును ఒంటరిగానే, పైగా ముగ్గురు వయసు కొచ్చిన ఆడపిల్లల తల్లిని కూడా” అంది
ఆమె కంఠంలోని పదును విని ఏమీ బదులివ్వాలని అనిపించలేదు. ఆమెనే చూస్తూ కూర్చున్నా.
ఏదో ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయింది యశోద. ఇంతలో పావని లోపలి నుండి తిరిగి వచ్చింది. చేతిలో రెండు పుస్తకాలు ఉన్నాయి. బైటికి వెళ్ళబోతున్న ఆమెను ఆపి, “ఇప్పుడు ఎక్కడికి?..” అడిగింది తల్లి.
“నేను యమున దగ్గరకు వెళ్ళి వస్తానమ్మా” నసుగుతూ బదులిచ్చిది పావని.
“ఇప్పుడు అవసరం లేదు, లోపలికి వెళ్ళి చదువుకో. పరీక్షలు దగ్గరపడ్డాయి” అంది యశోద.
“చదువుకోవడానికే అమ్మా, యమున హిందీ బాగా చెబుతుంది” చెప్పింది పావని.
“ఏం? క్లాసులో నువ్వు పాఠం వినలేదా? టీచర్ చెబుతున్నప్పుడు నువ్వేం చేస్తున్నావ్?” అడిగింది తల్లి
ఆ లాజిక్‌కి నాకూ నవ్వు వచ్చింది. అంతలోనే ప్రేమగా అంతలోనే కఠినంగా మారే యశోదను చూస్తుంటే మా అమ్మ గుర్తుకు వచ్చింది. నవ్వుతూ “హిందీ కదా నేను చెప్పనా” అన్నా పావనితో.
పావని ముఖంలో కోపమో ఇష్టమో తెలియదు కాని ఓ పుస్తకం నా చేతికి ఇచ్చింది.
తీసుకుని ఆమె వైపుకు చూసా. ‘కబీర్’ అందీ గునుస్తూ.. పుస్తకం చేతిలో తీసుకుని అందులో ఉన్న నాలుగు కబీర్ దోహాలలో మొదటిదాన్ని చదివి వినిపించా. పావని ముఖంలోకి నవ్వు వచ్చింది. పక్కన కూర్చుంది. యశోద ముఖం మళ్ళీ మామూలుగా అయింది. ఉల్లిపాయలు ముక్కలు కోస్తూ నన్నే గమనిస్తుంది. కాస్త గర్వంగా అనిపించింది. అప్పటి దాకా ఆకలితో నకనకలాడుతూ బలహీనంగా ఆ ఇంటికి చేరిన నాకు, నాలోని మరో మనిషిని వెలికితీసి వారికి చూపించాలనిపించింది. ఆ దోహాలను విడమరిచి చెబుతున్నంత సేపు తల్లీ కూతుళ్ళిద్దరూ మౌనంగా వింటూ ఉన్నారు. ఇంతలో పావని నా వైపు చూసి “ఆంటీ మా టీచర్ కన్నా బాగా చెప్పారు” అంది. “మాకు హిందీ సరిగ్గా రాదు అంటీ. నాకు అస్సలు ఇష్టంలేని సబ్జెక్ట్ అది. కాని పాస్ అవ్వాలి కదా. అక్కకు అన్నీ ఎనభై పైగా మార్కులు కావాలి. అమ్మ ట్యూషన్ పెట్టదు బైటికి పంపదు. అక్క వచ్చినప్పుడే చెప్పించుకోవాలి. లేదా స్కూల్‍లో టీచర్‍ని అడిగి చెప్పించుకోవాలి. టీచర్లు పదే పదే చెప్పరు ఆంటీ” అంది.
“నీకో అక్క ఉందా పావని” అని అడిగా.. పావని ముఖంలో మెరుపు. “నాకు ఇద్దరు అక్కలు ఆంటీ. పెద్ద అక్క దుబాయ్‌లో ఉంది. అక్కడ పెద్ద హాస్పిటల్‍లో నర్సుగా పని చేస్తోంది. రెండో అక్క హిందూపూర్‍లో టీచర్ ట్రైనింగ్ చేస్తుంది. తనకీ లెక్కలు బాగా వచ్చు. హిందీ రాదు” అంది.
చాలా అశ్చర్యంగా అనిపించింది. ఈ మారుమూల పల్లెటూరిలో నిండా రెండు వందల కుటుంబాలు కూడా ఉన్నట్లు కనిపించని ఈ ఊర్లో ఓ చిన్న హోటల్ నడుపుకునే స్త్రీ తన ముగ్గులు ఆడపిల్లలను ఇంత బాగా చదివించడమా.. యశోదను ఆశ్చర్యంగా చూసాను.
“మా రెహ్మాన్‍కు కూడా హిందీ సరిగ్గా రాదు. హిందీ మాట్లాడతాను అంటాడు కాని మా టీచర్ హిందికీ అతని హిందీకి అస్సలు పోలిక ఉండదు. రాయడమే రాదు అతనికి ఇంక నాకేం చెబుతాడు” అంది పావని.
“రెహ్మానా?..” అని పావని వైపుకి తిరిగా…
“పావనీ!” అని గట్టిగా తల్లి అదిలించడంతో నోరు మూసేసింది ఆ పిల్ల. మళ్ళి తనే “ఆంటీ ఇంక ఒక్క దోహా చెప్పరా.. దానితో పద్యభాగం అయిపోతుంది. నేను మిగతావి చదువుకుంటాను” అంది. సరే ఏ దోహా చెప్పాలో చూపించు అని అడిగా..
“మాన్ సహిత్ విష్ ఖాయికె షంభు భయే జగదీశ్
బినా మాన్ అమృత్ పియొ రాహు కటాయో షీశ్”
అని గట్టిగా అప్పజెప్పింది ఆ అమ్మాయి. నవ్వుతూ ఇది రహీం రాసింది. దోహా అంత చక్కగా అప్పజెప్పేసావ్ ఇంక నేను చెప్పేదేంటీ అని అడిగా… దానికి పావని “అమ్మ నిద్రలేపి గట్టిగా చదవమని కూర్చోబెడితే బట్టీ పట్టా కాని అర్ధం తెలీదు ఆంటీ మా టీచర్ చెప్పింది కాని నాకు అర్ధం కాలేదు” అని అమాయకంగా అడిగింది.
“అప్పటి దాకా శంభు అని సామాన్యులతో పిలిపించుకునే శివుడు లోక కళ్యాణం కోసం విషాన్ని తాగినందుకు జగదీశ్వరుడయ్యాడు. విషం తాగడం వలన అతని గౌరవం పెరిగిందే కాని తగ్గలేదు. అమృతాన్ని తాగాక కూడా గౌరవాన్ని పోగొట్టుకున్న రాహువు తన తల తెగ్గొట్టుకున్నాడు” అని చెప్పి శివుడు గరళాన్ని మింగిన వైనాన్ని, రాహువు తల తెగిన కథను విడమరిచి చెబుతూ మనిషి జీవితంలో అత్మ గౌరవం ఎంత అవసరమో ఆ చిన్న మనసుకు అర్ధం అయేలా చెప్పాను. “ఇన్ని కథలున్నాయా అంటీ”, అంటూ పుస్తకంలో ఏవో రాసుకుని “థాంక్స్ ఆంటీ ఇంక నేను తెలుగు చదువుకుంటాను” అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది పావని. వెళుతూ “నాకు డౌట్శ్ వచ్చినప్పుడు అక్క సెల్ నుండి మీకు ఫోన్ చేస్తాను మీరు చెపితే అక్క కన్నా నాకు మంచి మార్కులు వస్తాయి అంటీ” అంది.
నవ్వుతూ యశోద వైపుకి తిరిగాను. మనిషి ఏదో ఆలోచిస్తూ ఉండిపోయింది. చూపు ఎక్కడో ఉంది. పెదాలు అదురుతున్నాయి. ఓ నిముషం నేనేమన్నా తప్పుగా అన్నానా అనిపించింది. యశోద చేస్తున్న పని ఆపి నావైపు గాజు కళ్ళతో చూస్తూ ఉండిపోయింది. మళ్ళీ తానే “ఇవన్నీ పుస్తకాల్లో ఉంటాయా” అని అడిగింది. “ఏవి” అన్నాను అర్ధం కాక. “మీరు చెప్పినవి” అంది. “ఎందుకుండవు, తెలుగులో వేమన పద్యలు ఉండవా అలాగే హిందీలో ఇవి” అన్నాను. “మీరు ఎంత వరకు”.. అంటూ ఆమె చదువు గురించి అడిగితే ఏమన్నా అనుకుంటుందేమో అని ఆగిపోయా…
“నాకు చదువు అంటే చాలా ఇష్టం. ఐదు చదువుతున్నప్పుడే “కోడలుకు చదువు ఎందుకు” అని ఆపేయించింది మా ఆత్త. “అత్తనా?” అని అడిగిన నాతో “అవును నేను పుట్టినప్పటికే మా మేనత్త భర్తను పోగొట్టుకుని మా ఇల్లు చేరింది. నేను పుట్టిన రోజు నుండే తనకు కోడలిని అని నిశ్చయించేసుకుంది. మా బావ నాకన్నా పన్నెండేండ్లు పెద్ద. నాకు పదమూడేళ్ళు వచ్చేసరికే నేను పెద్దమనిషినయ్యాను. మా నాన్నకు నన్ను బాగా చదివించాలని ఉండేది. అత్తగారి తరుపు పొలాన్ని తీసుకుని వచ్చింది మా అత్త. నాన్నకున్న ఆస్తి చాలా తక్కువ. పైగా అన్నీ మెట్ట పొలాలే. అత్త పొలాలలో సేద్యమే మాకు దిక్కయింది. అందుకే ఇంటి పెత్తనమంతా అత్త చేతుల్లోకి వెళ్ళింది. బావకు చిన్నతనం నుండే అత్త గారాబంతో చెడు స్నేహాలు అబ్బాయి. కాని అతన్ని ఎవరూ ఏం అడిగే ధైర్యం చేయలేకపోయేవాళ్ళు. చివరకు ఇష్టం లేకపోయినా అతనికే ఇచ్చి మా నాన్న నాకు పద్నాలుగేళ్ల వయసులోనే పెళ్ళి చేసేసాడు.”
“ఇక తరువాత నా జీవితం నా చేతుల్లో లేదు. పెళ్ళయి నాలుగేళ్ళయినా పిల్లలు లేరని మా అత్త ప్రతి రోజు సాధించేది. పైగా కొడుకుకు మళ్లీ పెళ్లి చేస్తానని గొడవ చేసేది. నాన్న ఆ దిగులుతోనే చనిపోయాడు. పెళ్ళి తరువాత నాలుగేళ్ళకు వచ్చిన కడుపును చూసుకుని నాన్నే మళ్లీ పుడతాడని అమ్మ సంతోషించింది. కాని రమ పుట్టింది”.
యశోద నా వైపుకు తిరిగి చెప్పింది “రమ మా పెద్దది. అది పుట్టినప్పుడు ఎవరో ఒకరులే గొడ్రాలన్న నింద పోతుందని సంతోషించింది అమ్మ. కాని మా అత్తకు మనవడే కావాలని కోరిక. రమను చూసి దాని తండ్రి సంతోషించినా మరుసటి నెల నుంచే వారసుడి కోసం తపన మొదలయింది. అది కడుపున పడ్డ రెండు సంవత్సరలకు కాని ఉమ కడుపున పడలేదు. ఇక పుట్టేది కొడుకే అని అందరూ అనడం, కాకపోతే నా పరిస్థితి ఏమవుతుందో అని అమ్మ భయపడడం, చివరకు ఉమ పుట్టింది. రమకు కనీసం తండ్రి ప్రేమ కొంత వరకైనా దొరికింది. కాని ఉమను తండ్రి ఎత్తుకున్నది కూడా లేదు. పైగా మా అత్త గొడవ అంతా ఇంతా కాదు. చివరకు విషయం పెద్ద మనుషుల దాకా వెళ్లింది. అందరూ నచ్చచెప్పి మరో మారు కొడుకు పుడతాడు లేమ్మా అని ఇంటికి పంపించారు. చివరకు ఆ బాధలు తాళలేక అమ్మ కూడా చచ్చిపోయింది. ఇద్దరు పిల్లలు, తాగి తందనాలాడుతూ రోజూ పక్కలోకి చేరే భర్త. ప్రతి సారి మళ్లీ కూతురు పుడితే అనుకుంటూ వణికిపోవడం. ఇద్దరు బిడ్డలు చాలు అన్నందుకు గొడ్డును బాదినట్లు అత్త ఎదురుగానే బాదిన భర్తతో చేసిన సంసారం, చివరకు మళ్లీ ఆడపిల్లే పుట్టింది. పావని పుట్టిన తరువాత దాన్ని ఎక్కడ చంపేస్తారో అని నిద్రకూడా పోయేదాన్ని కాదు. పావనికి ఉమకి మధ్య ఏడు సంవత్సరాల ఎడం. ఆ మధ్యలో రెండు సార్లు కడుపు పోయింది. దానికి కారణం నా భర్త అలవాట్లు అని తెలిసినా ఏమీ అడగలేని పరిస్థితి నాది.”
“పావని తరువాత మా అత్త అందరి ఎదురుగానే కొడుక్కి రెండో పెళ్ళి చేస్తానని బెదిరించేది. చివరకు నేనే తెగించి ఏ ఆధారంతో మళ్లీ పెళ్ళి చేస్తావు. అది చెల్లదు. నాకేమన్న చెడు తిరుగుళ్ళు ఉన్నాయా నీ కొడుకులాగా? ఏ ఆధారం చూపించి విడాకులు ఇప్పిస్తావు అని గట్టిగానే ఎదురు తిరిగాను. కాని అదే ఆ మాటే నా జీవితాన్నిమార్చేస్తుందని నేను ఊహించలేదు.”
“ఏం జరిగింది” అడిగాను నేను మెల్లగా…
యశోద మళ్ళీ చెప్పడం మొదలెట్టింది “మా యింటికి రెండు వీధుల అవతల ఓ ముస్లిం కుటుంబానికి చెందిన ఓ చిన్న ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవ జరిగి పెద్దవాడైన సులేమాన్‌ను చిన్నవాడైన రెహ్మాన్ హత్య చేసి జైలుకు వెళ్ళాడు. అతను మంచివాడే కాని ఏదో ఆవేశంలో ఈ హత్య జరిగిందని కొందరు అనేవాళ్ళు. జైలు నుండి తిరిగి వచ్చిన రెహ్మాన్ ఊర్లో తన ఇంటికి వచ్చినప్పుడు, అతన్ని అక్కడి నుండి గెంటేయించాలని పెద్ద మనుష్యులు ప్రయత్నించారు. అప్పుడు రెహ్మాన్ తల్లి బ్రతికే ఉంది. రెహ్మాన్ ఆమెను వదిలి మరో ఊరికి వెళ్ళలేడు. అతను ఊరి వారందరికీ ఎదురు తిరిగాడు. పైగా ఎవరయినా తనకు అడ్డు వచ్చినా, తన తల్లికి ఇబ్బంది కలుగజేసినా ఊరుకోనని, వారినీ హత్య చేసి మళ్ళి జైలుకి వెళతానని బెదిరించాడు. ఓ రోజు చాటుగా ఆ ఇంట్లో దూరిన వారికి అలాగే బుద్ది చెప్పాడు కూడా. ప్రాణం పోకపోయినా రక్తం ఓడేటట్లు అతని చేతిలో తన్నులు తిన్నాడు పెద్దమనుష్యులు పంపిన వస్తాదు. ఇక ఊరిలోఅందరూ రెహ్మాన్‌కి భయపడేవారు. తల్లిని చూసుకుంటూ ఉన్న కాస్త పొలం దున్నుకుంటూ బ్రతుకుతూ ఉండే రెహ్మాన్ రాత్రి పూట మాత్రం తాగకుండా ఉండలేకపోయేవాడు. ఇక అతను తాగితే రాక్షసుడే, ఈ చుట్టూ పక్క ఊరిలో అతనికి రౌడీ అని పేరు పడిపోయింది. అతని తల్లి చనిపోయిన తరువాత రెహ్మాన్ అక్కడ ఏదో వ్యాపారం చేయలనే ప్రయత్నంలో ఉన్నాడని విని ఊరంతా అతన్ని అక్కడి నుండి ఎలా పంపేయాలా అని ఆలోచించేవాళ్ళు. పైగా ఈ ఊర్లో ముసల్మాన్ల కుటుంబాలు ఓ పది కన్నా ఎక్కువ లేవు. అందులో రెహ్మన్ ఒక్కడే ఎవరితో కలవకుండా విడిగా ఉండేవాడు.”
“రమను ఊరి చివర స్కూలులో చేర్పించాల్సిన పరిస్థితి. చిన్నప్పటి నుండి అది బాగా చదివేది. ఊర్లో స్కూల్ ఉంది కాని ఐదవ తరగతి దాకానే. ఇక ఆ పై చదవడానికి ఊరిబైట స్కూలికి వెళ్ళక తప్పదు. నేను ఆ స్కూల్ లో రమను చేర్పించాలని చాలా ప్రయత్నించాను. కాని తండ్రి ఒప్పుకోలేదు. అప్పటికే నేను ఇంట్లో వాళ్లకి ఎదురు తిరగడం మొదలెట్టాను. ఎవరెన్ని అన్నా లెక్క చేయకుండా రమను ఊరి బైట స్కూల్‍లో వేసాను. చిన్నది రోజూ ఒక్కతే అంత దూరం నడుచుకుంటూ వెళ్ళేది.”
“పక్క ఊరిలోని ఓ అమ్మాయితో నా భర్తకు సంబంధం ఉందని, ఆమె ఇంటికి చాటుగా వెళ్ళి వస్తున్నాడని ఊరందరికీ తెలుసు. మా అత్త కూడా ఈ విషయం తెలియనట్లు ఉండేది. క్రమంగా నాలుగు ప్రాణాలను సాకడం వారికి కష్టమనిపించి ఉండవచ్చు. నన్ను ఎలా ఒదిలించుకోవాలా అని ఆలోచించడం మొదలుపెట్టారు. అప్పటికే వారు కొట్టే దెబ్బలకు, అనే మాటలకు రాటు దేలిపోయాను నేను. నా పిల్లలను బ్రతికించుకోవాలి, బాగా చదివించుకోవాలి అనే ఆలోచనే తప్ప మరో ఆలోచన నాలో లేదు. ఊరిలో ఎవరెక్కడుంటారో కూడా నాకు తెలియని పరిస్థితి. నా పిల్లలు, నేను ఇదే నా ప్రపంచం అయిపోయింది.”
“ఓ రోజు రమ స్కూలు నుండి వస్తూ ఓ ఇంటి ముందు పడిపోయిందని ఆమె క్లాసు పిల్ల వచ్చి చెప్పింది. రమ తండ్రి ఇది విన్నాడే తప్ప అటువైపు వెళ్ళాలని బిడ్డను తీసుకురావాలని ప్రయత్నించలేదు. ఉమ అప్పుడే పక్కింటికి వెళ్ళింది. పావని నిద్రపోతుంది. నేను పరుగెత్తుతూ పిల్లలు చెప్పిన గుర్తుల అధారంగా ఆ ఇంటికి వెళ్ళాను. అదో పెద్ద రేకుల షేడ్డు. ఏదో కొత్తగా కడుతున్నారు. రమ కోసం వెతుకుతూ లోపలికి వచ్చిన నాకు రమ ఆ షెడ్డు లోపల మంచంపై నిద్రపోతూ కనిపించింది. పైగా తలకి కట్టు కట్టి ఉంది. రమను లేపాలని ప్రయత్నించాను కాని మత్తులో ఉన్నట్లు పడుకునే ఉంది. ఈ లోపల అక్కడే ఉన్న రెహ్మాన్ నన్ను చూసి లేచి నిలబడ్డాడు. రమ దేని వెంటో పరుగెత్తుతూ అక్కడకు వచ్చి నేల మీద పరిచి ఉన్న కొత్త రేకుల మధ్య పడిపోయిందని, నుదురు చిట్లిందని అందుకని తానే రక్తం కారుతున్న పిల్లను చూసి ఎవరో అర్ధం కాక పక్క వీధిలో ఉన్న ప్రైమరీ సెంటర్ కు వెళ్ళి కట్టు కట్టించి సూది మందేయించుకుని తీసుకువచ్చానని చెప్పాడు. మనిషి సగం తూలుతున్నాడు. ఇల్లు ఎక్కడో చెబితే తానే రమను ఎత్తుకుని ఇంటికి తీసుకువస్తానని చెప్పాడు. రమ లేచే స్థితిలో లేదు. అక్కడే కొంచేం సేపు ఉండిపోయాను. రెహ్మాన్ బైట పనివాళ్ళతో పనిచేయిస్తూ ఉన్నాడు. ఇంతలో బైట గొడవ, నా భర్త, అత్తలు అక్కడకు వచ్చి ఉన్నారు. బిడ్డ కోసం వచ్చారని నేను సంతోషించాను. కాని వాళ్ళనే మాటలు నన్ను అయోమయంలో పడేశాయి.”
“అది రెహ్మాన్ కట్టుకుంటున్న ఇల్లు అట. అతనికొచ్చిన భాగం పొలంలో ఆ షెడ్డు కట్టుకుంటున్నాడు. ఆ ఇంట్లోకి అప్పటి దాకా ఎవరూ అంత ధైర్యంగా వెళ్ళలేదట. నేను అక్కడకు వెళ్ళడం, తాగి ఉన్న రెహ్మాన్ నాతో అంత మంచిగా సొంత భార్యతో మాట్లాడినట్లు ప్రేమగా మాట్ళాడడం చూసిన వాళ్ళు వాళ్ళకు ఏవో చెప్పారట. దానితో వారికి చాలా విషయాలు అర్థం అయ్యాయట. పైగా రమ పడిపోయినప్పుడు తాగిన మత్తులో ఉన్న రెహ్మాన్ బిడ్డను తీసుకుని ప్రైమరీ సెంటర్‍కి వెళితే అక్కడ వాళ్ళు ఎవరి బిడ్డో అని రెహ్మాన్ చేతుల్లో ఉన్న రమను పరిక్షించడానికి ముందుక రాకపోతే, వాళ్ళను బెదిరించి నా బిడ్డే ఇది ముందు మందు వేసి కట్టు వేయి, అని అందరి ముందు అరిచాడట రెహ్మాన్. తాగినవాడి నోటి వెంట నిజాలే వస్తాయని, రెహ్మాన్‍తో నాకు అక్రమ సంబంధం ఉందని, అందుకోసం విడాకులు కావాలని రమ తండ్రి అక్కడే నానా రచ్చ చేసాడు. ఇదే సాకుతో పంచాయితీ పెట్టించాలని నిశ్చయించాడు. పంచాయితీ తేలేదాకా నేను ఇంటికి రాకూడదని అంక్ష విధించాడు.”
“నాకు అప్పుడు ఆ పరిస్థితిలో కూడా ఇంట్లో వదిలి వచ్చిన నా ఇద్దరు బిడ్డలు గుర్తుకు వచ్చారు. ముఖ్యంగా పావని అంటే మా అత్తకు, ఆమె కొడుక్కి ఇద్దరికీ కూడా విపరీతమైన ద్వేషం. చిన్నది వారిద్దరూ ఉంటే ఆ దరిదాపులకు కూడా రాదు. ఈ రాత్రి ఆ ఇంట్లో నా బిడ్డలను ఎలా నేను లేకుండా వారి వద్ద ఉంచాలి. ఆ రాత్రి బిడ్డలను ఏమన్నా చేస్తే? అందుకే నేను వెళ్తున్న ఊరివారితో రమ నా భర్తకు పుట్టలేదని అనుమానిస్తే, ఆ తరువాత పుట్టిన అ ఇద్దరు బిడ్డల పట్ల కూడా అదే అనుమానం ఉండాలి కదా. మరి అప్పుడు వారి ఇంట నేను లేకుండా ఆ బిడ్డలు ఉండడం ఎందుకు? వాళ్ళు నా దగ్గర ఉండడమే సరి కాదా అని ప్రశ్నించాను. భర్త అంత పెద్ద నింద వేసినా, వెనుక రెహ్మాన్ మత్తు దిగి ఆశ్చర్యంగా చూస్తున్నా నేను నెత్తీ నోరు కొట్టుకోకుండా నా ఇద్దరు బిడ్డలను ఇప్పించమని అక్కడే ఆ నిముషమే ఊరివాళ్లందరినీ అడగడం, కనీసం భర్త కాళ్లపై పడి ఏడవకుండా నిలబడడం, నేను చెడిపోయిన ఆడదాన్నని ఊరందరూ ఓ నిశ్చయానికి రావడానికి కారణం అయింది. ఊరంతా నన్ను ఎంత అసహ్యంతో చూసారంటే అప్పటి దాకా నోరు లేని పతివ్రత అని అన్న వాళ్ళే కళ్ళ నిండా ద్వేషంతో నిలబడిపోయి చూస్తుంటే ఇదే అదనని మా అత్త ఏడుస్తూ, గోల చేస్తూ నా ఇద్దరు బిడ్డలను నాకు తెచ్చి అప్పగించింది. నా బిడ్డలు నా చేతికి వచ్చేదాకా నేను ఏం చేస్తున్నానో నాకే అర్ధం కాని అయోమయంలో ఉండిపోయాను.”
“నా కన్నా అయోమయంలో ఉండిపోయిన వాడు రెహ్మాన్. ఊరందరికీ అతనంటే భయం అన్న సంగతి కూడా మర్చిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఓ వారం దాకా ఆ ఇంటి మొహం చూడలేదు. ఇంకెక్కడికో వెళ్లాలంటే నాకు ఎవరున్నారని. ఇక్కడే ముగ్గురు పిల్లలతో ఉండిపోయాను” అంది యశోద ఆ హోటల్ ని చూపిస్తూ. ఆ రోజు రమ కోసం ఆమె వచ్చిన ఇల్లు అదే అని అర్ధం అయింది నాకు.
“పంచాయితీ పెట్టి నేను తప్పుడు దాన్నని నిర్ణయించాడు నా పిల్లల తండ్రి. మా పెళ్లి చెల్లదని పెద్ద మనుషులతో చెప్పించాడు. నేను మౌనంగా ఉండిపోయాను. ఆ షెడ్డులోనే ఓ వారం రోజులు ఉండిపోవడంతో నేను చెడిపోయాననే నిర్ణయించేశారు ఊరి వాళ్ళు. ఆ ఊరిలో పెద్ద మనుషులకు రెహ్మాన్ ఊరు నుండి వెళ్ళిపోవడం కావాలి. దానికి నన్ను పావును చేస్తున్నారని అర్థం అవడానికి ఎక్కువ సమయం పట్టలేదు నాకు. నా భర్తకు నన్ను వదిలించుకోలన్న ఆలోచన ఎన్నో రోజుల నుంచి ఉంది. అందరూ ఈ సంఘటనను తమకు అనుకూలంగా మార్చుకున్నారు”
వారం దాకా ఊరు మొహం చూడని రెహ్మాన్ ఓ రాత్రి తాగి ఆ ఇంటికి వచ్చాడు. లోపల ముగ్గురు పిల్లల మధ్య బిక్కు బిక్కుమంటూ ఉన్న నన్ను చూడగానే అతను ఆశ్చర్యంగా నిలబడిపోయాడు. తల వంచుకుని పిల్లలను పట్టుకుని కూర్చున్న నన్ను అలా చూస్తూ కాసేపు ఉండిపోయి ఆ రాత్రి ఊర్లో అతని తల్లి ఉండిన ఇంటికి వెళ్ళి పడుకున్నాడని ఆ తరువాత నాకు తెలిసింది. ఆ మరుసటి రోజు ఊరంతా తిరిగి అందరి మాటలను మౌనంగా విన్నాడు. ఆ సాయంత్రం ఊరి చివర పెద్ద చెరువు దగ్గర ఎవరో పోకిరి వాళ్ళు రెహ్మాన్ వెళుతుంటే అతన్ని నన్ను కలిపి ఏదో అన్నారట. ముందుకు వెళ్ళబోతూ రెహ్మాన్ ఒక్క క్షణం ఆగి వెనక్కు చూసాడు. ఆ అన్నవాడిని ఎగిరి తన్నాడు. పక్క నున్న వారి ఎముకలు పిండి చేశాడు. పైగా అక్కడే గట్టిగా ఇంకెవరన్నా నోరు ఎత్తితే చంపేస్తానని బెదిరించాడు. అడ్డు రాబోయిన కొందరితో వెళ్లి మీ పెద్ద మనుషులకు చెప్పండి నా జోలికి వస్తే ఎవరినీ వదిలేది లేదు అని అరుస్తూ పక్క వీధిలో ఉన్న పచారి కొట్టుకి వెళ్ళి ఇంటికి కావల్సిన సామానులు పట్టుకు వచ్చాడు. అవి తలుపు దగ్గర పెట్టి మళ్లీ తన పాత ఇంటికి వెళ్ళిపోయాడు”
“మరుసటి రోజు ప్రొద్దున్నే వచ్చి రమను, ఉమను స్కూలుకు తీసుకువెళ్లడానికి వచ్చానని ఇంటిబైట నుంచున్నాడు. పిల్లలు అప్పటికి బైటి ఊరు ముఖం చూసి పది రోజులయింది. ఇద్దరూ పరుగెత్తుకుంటూ వెళ్లి రెహ్మాన్ చేయి పట్టుకున్నారు. అందులో రమకి స్కూలు మానడం అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఆ రోజు నుంచి కొన్ని వారాలు ప్రతి రోజు ఉదయానే వచ్చి స్కూలుకి స్వయంగా పిల్లలను తీసుకుని వెళ్ళేవాడు. రెహ్మాన్ అంటే ఉన్న భయంతో ఎవరూ పిల్లల జోలికి వచ్చేవాళ్ళు కాదు. వారం, వారం సరుకులు వచ్చేవి. షెడ్డు పని నేను ఇక్కడకు వచ్చి చేరడంతో ఆగిపోయింది. మళ్లీ పని వాళ్లు ప్రొద్దుటే రావడం మొదలయింది. రెహ్మాన్ పర్యవేక్షణలో షెడ్డు వెనకాల ఓ రెండు గదులు లేచాయి. అవసరమైన సామాన్లు సమకూరాయి. పని వాళ్ళతో పాటు పొలంలో కౌలుకు పని చేయడానికి బైటి ఊరు వాళ్ళూ వచ్చేవాళ్ళు. వాళ్ళకి టీ చేసి ఇస్తూ డబ్బులు తీసుకోవడం మొదలు పెట్టాను. మెల్లిగా ఇక్కడే టిఫెన్లు, చేయడం మొదలయింది. పక్క ఊరి వాళ్ళు నన్ను చూడాలని వచ్చి ఇక్కడే తినేవాళ్ళు. గుమ్మం దగ్గర రెహ్మాన్ అప్పుడప్పుడూ కనిపించడం అప్పటికే అతను కొందరిని చితకతన్ని ఉండడం వలన ఎవరూ మాట్లాడేవాళ్లు కాదు. ఈ ఇల్లు కోసం, రెహ్మాన్ వెనుక స్థలంలో కొంత భాగాన్ని అమ్మేసాడని తరువాత తెలిసింది. రాత్రి పూట ఈ వైపు ఎవరు రావాలన్నా ఎప్పుడు ఎక్కడ రెహ్మాన్ ఉంటాడో అని భయంతో వచ్చేవారు కాదు. ఒకటి రెండు సార్లు ఎవరినో ఇక్కడ రాత్రి తచ్చాడుతుంటే రెహ్మాన్ కొట్టడం కూడా జరిగింది. ఇక దానితో ఇక్కడకు రాత్రిళ్లు రావడానికి అందరూ భయపడేవాళ్ళు.”
“రమ ఇక్కడకు వచ్చినప్పుడు పదకొండేళ్ళ పిల్ల. ఉమకు తొమ్మిది, పావని రెండున్నర సంవత్సరాల పాప. పిల్లలను చదివించుకోవాలన్నదే నా పట్టుదల. అందుకోసం ఎన్నో పనులు చేసాను. హోటల్‍తో పాటు ఇళ్ళకు కూరలు చేసి పంపడం, బస్సు లారీ డ్రైవర్లకు టిఫెన్లు చేసి ఇవ్వడం లాంటివి కూడా చేసేదాన్ని. రమ స్కూలులో బాగా చదివేది. ఎవరేమన్నా ఇంటికి ఏ విషయం తీసుకువచ్చేది కాదు. రెహ్మాన్ చిల్లర గొడవలలో ఏదో సంపాదించేవాడు. ఓ రెండు మూడు రోజులు కనిపించేవాడు కాదు. కాని అతను ఊర్లోకి వచ్చాడంటే పిల్లలకు తెలిసిపోయేది. అతనింటికి ఏం తీసుకొచ్చినా నాకు ఇష్టం ఉండేది కాదు. కాని కాదనలేని పరిస్థితి. ఇక్కడకు వచ్చిన ఓ రెండు సంవత్సరాలకు ఇంటికి సరుకులు వద్దని నేనే రమతో రెహ్మాన్‍కి చెప్పించాను. అతను నవ్వి ఊరుకున్నాడు. అప్పటి నుండి ఇంటికి సరుకులు వచ్చేవి కావు కాని ఇంటికి కావలసిన ఏదో ఓ వస్తువు కొన్ని నెలలకు ఎవరో తెచ్చి పెట్టి పోయేవాళ్లు. రమకు స్కూల్ వాళ్ళే కాలేజీలో చదవడానికి సహాయం చేసారు. దానికి డాక్టర్ కావాలని ఉండేది. కాని ఇంటర్లో ఉన్నప్పుడు ఎవరేం చెప్పారో తెలీదు నర్సు ట్రైనింగ్ చేస్తానని చెప్పింది. బైట ఊరు పోతానంది. నేను ఒప్పుకోలేదు. కాని రెహ్మన్‍తో మాట్లాడి అదే నిర్ణయం తీసుకుంది. రెహ్మాన్ ఓ రోజు రమను పట్నం తీసుకువెళతానని చెప్పినప్పుడు భయపడ్డాను. కాని రమను చూపిస్తూ భయం వద్దని పట్నం పంపించమని రెహ్మాన్ చెప్పినప్పుడు కాదనలేకపోయాను. రమ పట్నం వెళ్ళిన దగ్గర నుంచి అదే పని చేస్తూ చదువుకుంది. కొంత డబ్బురెహ్మాన్ సర్దాడని నాకు అనిపిస్తుంది. చదువు అవగానే రమ ఓ నాలుగు నెలలు ఏదో హాస్పిటల్‍లో పని చేసింది. తరువాత దుబాయ్ వెళుతున్నానని చెప్పింది. అది పట్నం వెళ్లినప్పటినుంచి చెల్లెళ్ళ చదువు విషయాలే మాట్లాడేది. ఉమ, రమ అంత చురుకు కాదు. కాని అక్క ప్రోద్బలంతో ఇక్కడే ఇంటర్ పూర్తి చేసి ఏదో ట్రైనింగ్ చేసింది. డిగ్రీ చేస్తూ ఓ రెండు సంవత్సరాల నుండి ఓ స్కూల్ లో పని చేస్తుంది. అదింకో రెండు సంవత్సరాలు చదువుకొని ఇంకేవో పరీక్షలు రాయాలని చెప్పింది. రెండు నెలల నుండి హిందూపూర్‍లో హాస్టల్‍లో ఉంటుంది. శనీ ఆదివారాలు ఇంటికి వస్తుంది. ఇది చిన్నది పది చదువుతుంది. దీని విషయం తాను చూసుకుంటానని రమ చెప్పింది. రమకు దుబాయ్‍లో జీతం బానే వస్తుంది. అది ప్రతి నెల డబ్బు పంపిస్తోంది. కాని ఇంకో మూడు సంవత్సరాల దాకా ఇక్కడకు రానని చెపుతుంది.”
“మరి వీళ్ళ నాన్న” అడిగాను నసుగుతూ
యశోద నా వైపు ఓ సారి చూసి “పక్క ఊరిలో ఆతను సంబంధం పెట్టుకున్న అమ్మాయికి, ఈ గొడవ జరగబోయే రెండు సంవత్సరాల ముందే ఇతనితో ఓ కొడుకు పుట్టాడట. ఆ అమ్మాయినే అతను పెళ్ళి చేసుకున్నాడు. మనవడిని చూసి కొన్నాళ్ళు మా ఆత్త మురిసిపోయింది. కాని మెల్లగా అత్తా కోడళ్లకు పడేది కాదు. అత్త వేరేగా ఉండేది. పోయిన సంవత్సరమే చనిపోయింది. చనిపోయేముందు అప్పుడప్పుడు ఈ హోటల్‍కి వచ్చేది. తిండి కోసమే తచ్చాడుతుందని నాకు తెలుసు. అందుకే వచ్చిన ప్రతి సారి మౌనంగా ఏదో పెట్టేదాన్ని. తిని వెళ్లిపోయేది. మొదటి సారి వచ్చినప్పుడు డబ్బు ఇవ్వబోయింది. కాని ఎంతయినా నన్ను పెంచినదే కదా ఆమె దగ్గర డబ్బు తీసుకోలేకపోయాను. కొడుకుపై ఆమెకు పిచ్చి ప్రేమ. నాకు నా కూతుళ్ల పై ఉన్నట్లు. నేను నా పిల్లల కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడ్డాను. ఆమె కొడుకు కోసం నన్ను వదిలించుకోవడానికి సిద్ధపడింది. ఆమెను నడిపిందీ ఆ పేగు తీపే కదా. అందుకే ఆమెకు తిండి పెట్టడం బాధ అనిపించలేదు. ఆమె చనిపోయిన తరువాత ఆమె కొడుకు ఇక్కడకు రావడం మొదలెట్టాడు. భార్యతో పడట్లేదని, ఆమె ఇంట్లో సరిగ్గా వండదని, కొడుకు కూడా తల్లి మాటే వింటాడని అందుకని అతనికి తిండికి ఇబ్బంది అవుతుందని అందరూ చెప్పుకుంటారు. అతను మాత్రం వారంలో నాలుగైదు సార్లు ఇక్కడకు వచ్చి తిని వెళతాడు”
“పిల్లలకు తెలుసా” అడిగా
“ఏమో మరి. మొదటి సారి వచ్చినప్పుడు డబ్బులు ఇవ్వట్లేదని చిన్నదే ఆపి ఆడిగింది. నేను అక్కడే ఉన్నా. అతను నన్ను చూస్తూ నించున్నాడు. ఇరవై అయిందని చెప్పి నేను లోపలికి వెళ్ళిపోయా. జేబులో డబ్బు తీసి ఉమ చేతిలో పెట్టి వెళ్ళాడు. మళ్ళీ రాడేమో అనుకున్నా కాని అప్పుడప్పుడూ వస్తూనే ఉన్నాడు. డబ్బులు ఇచ్చి తినిపోతాడు.”
“అత్త దగ్గర డబ్బు తీసుకోని మీరు అతని దగ్గర..” అంటూ ఆగిపోయా
మౌనంగా నా ముఖం కేసి చూస్తూ ఉండిపోయింది యశోద.
ఇంతలో హార్న్ మోగుతూ బస్ వచ్చి ఆగింది. నవ్వుతూ కండక్టర్‍తో కలిసి అప్పారావు కూడా లోపలికి వచ్చాడు. నేను లేచి నిల్చున్నా. “మేడం టీ తాగి వెళదాం” అన్నాడు డ్రైవర్ కూడా. బస్ లోపల నలుగురు మాత్రమే ఉన్నారు. అందరూ వెనుక వచ్చిన రెండు బస్సులలో వెళ్లిపోయారని అప్పారావు చెప్పాడు. అందరికీ టీ పెట్టడానికి యశోద లోపలికి వెళ్ళింది.
టీ తీసుకుని నా దగ్గరకు వచ్చిన యశోదకు డబ్బులిచ్చి అటు తిరిగి నిల్చున్నా. అందరికీ టీలు ఇచ్చి యశోద లోపలికి వెళ్ళిపోయింది. టీ తాగి అందరూ బస్ వైపుకి కదిలారు. అటు నుండి దిక్కులు చూస్తూ లోపలికి ఓ బలహీనంగా ఉన్న మనిషి వస్తూ కనిపించాడు. ఇతను యశోద భర్తా ఏమో.. యశోద కోసం లోపలికి చూసా ఆమె అక్కడ లేదు. పావని నవ్వుతూ బైటకు వచ్చింది. నేను చేయి ఊపా. దగ్గరకు వచ్చిన ఆమె చేతిపై నా దగ్గరన్న పెన్నుతో నా ఫోన్ నంబర్ రాసి “ఫోన్ చేయి” అని చెప్పి బస్సు ఎక్కేశా.
నా సీట్లోకి వచ్చి కూర్చున్నా. బస్సు కదిలింది. ఆ ఊరికి దూరంగా నా గమ్యం వైపుకు. తన కథ చెపుతున్నంత సేపు కూడా యశోద ఎక్కడా తన భర్తను భర్తగా సంబోధించలేదని నాకు అప్పుడు తట్టింది. ఏదో విషయం మనసులో చికాకు కలిగిస్తుంది. అన్నట్లు రెహ్మాన్‍తో యశోదకున్న సంబంధం ఏంటి? రెహ్మాన్ నా ముందున్నంత సేపు ఆమె బైటకు రాలేదు. టిఫిన్ కూడా పావనితోనే పంపించింది. ఆమె వైపు రెహ్మాన్ కనీసం చూడను కూడా చూడలేదు. కాని వాళిద్దరి మధ్య ఉన్న బంధం ఏంటీ? ఎవరు చెబుతారు? ఎలా తెలుస్తుంది. ఏదో అలజడి.
ఓ బంధం తెంచుకోకుండా మరో స్త్రీతో జీవించే పురుషుడిని ఈ లోకం ఏ ప్రశ్నలను అడగి ఇబ్బంది పెట్టదే. కాని, ఒంటరిగా జీవించవలసి వచ్చిన సమయంలో, నిస్సహాయ స్థితిలో, తనకు అందిన ఓ స్నేహ హస్తం ఆసరాతో, ముందుకు సాగిన స్త్రీ నుండి ప్రతి ప్రశ్నకు సమాధానం ఎందుకు కోరుతుంది ఈ సమాజం? ఆమె జీవితం గురించి తెలుసుకోవాలనే అత్యుత్సాహం ఎందుకు అందరికీ? అసలు ఓ ఒంటరి స్త్రీ చుట్టూ ఏర్పడే బంధాలపై అంత అత్యుత్సాహం ఎందుకు.. వెయిట్ ఏ మినిట్.. ఏం ఆలోచిస్తున్నాను.
మరి ఇప్పటి దాకా యశోదకు రెహ్మాన్‍కు మధ్య ఉన్న బంధం ఏంటని తల బద్దలు కొట్టూకునేంతగా ఆలోచించి, అది స్పష్టంగా తెలియనందుకు బాధపడిందీ నేనే కదా.. ఓ స్త్రీగా ఇదే స్థితిలో జీవిస్తున్న నేను కూడా, మరో స్త్రీ బంధాల పట్ల ఉత్సాహాన్ని ప్రదర్శించానే తప్ప ఆమె జీవితంలోని సంఘర్షణను, ఆమె చూపిన అత్మవిశ్వాసాన్ని చూడలేకపోయాను. ఆమెలోని నిబ్బరాన్ని ప్రశంసించవలసింది పోయి, ఆమె రెహ్మాన్‍తో శారీరిక సంబంధం కలిగి ఉందా లేదా, అన్న దృష్టీతోనే యశోదను ఎంచే ప్రయత్నం చేసానే. నేను ఈ లోకంలో ఓ మనిషిగానే ప్రవర్తించాను కదా..
ఆలోచనలలోపడి గమనించలేదు.. నేను బస్ దిగాల్సిన స్టాప్ వఛ్చేసింది. బస్సును కంగారుగా ఆపాను. బస్సుదిగి ఇంటివైపు అడుగులు వేస్తూంటే యశోద మళ్లీ గుర్తుకు వచ్చింది.
అన్నట్లు ‘రెహ్మాన్‍తో యశోదకున్న సంబంధం ఎటువంటిదీ?’.. ఎందుకని ఈ ప్రశ్నే నన్ను వెంటాడుతోంది????