[తెలుగు సాహిత్యం పట్ల కొన్ని తరాలలో ఆసక్తి రగిలించి, ఆధునిక తరానికి వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్తూ, యువతకు ఉత్తమ సాహిత్యం ద్వారా ఉత్తమ వ్యక్తిత్వాన్నివ్వాలని నిరంతరం తపించే యువభారతి సంస్థ స్థాపించి వచ్చే దసరాకు 60 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు సాహిత్యానికి, సమాజానికి యువభారతి చేసిన సేవను తెలుగు పాఠకులకు పరిచయం చేసే ఉద్దేశంతో ప్రతి ఆదివారం సంచికలో యువభారతి ప్రచురించిన పుస్తకాల పరిచయం వుంటుంది. ఈ శీర్షిక వచ్చే సంవత్సరం విజయదశమి వరకూ సాగుతుంది.]
కావ్య లహరి
[dropcap]ప్రా[/dropcap]చీనాంధ్ర సాహిత్యం గురించి లబ్దప్రతిష్ఠులైన సాహితీవేత్తలతో ఉపన్యాస మంజరీ కార్యక్రమాలను ఏర్పాటు చేయడమే కాక, వారి ఉపన్యాసాల సారాంశాన్ని ఒక పుస్తక రూపంలో ప్రచురించి, రసజ్ఞులైన భాషాభిమానులకు అందజేయడమే – యువభారతి నిర్వహిస్తున్న “లహరి” కార్యక్రమాల లక్ష్యం.
ఐదు దశాబ్దాల క్రితం అంటే 1971 సంవత్సరంలో ప్రారంభించిన ఈ లహరీ కార్యక్రమాలు, పూనికతో ఇప్పటివరకూ కొనసాగించబడుతున్నాయి. ఇప్పటివరకు నిర్వహించబడిన పదహారు లహరీ కార్యక్రమాలు:
- కావ్య లహరి
- చైతన్య లహరి
- వికాస లహరి
- ప్రతిభా లహరి
- కవితా లహరి
- రామాయణ సుధాలహరి
- నవోదయ లహరి
- ఆలోచనా లహరి
- ఇతిహాస లహరి
- సంస్కృత సాహితీ లహరి
- జగద్గురు సాహితీ లహరి
- నవ్య సాహితీ లహరి
- వివేకానంద లహరి
- హాస్య లహరి
- వేద విజ్ఞాన లహరి
- ఉపనిషత్సుధా లహరి
వచ్చే నెల అంటే డిసెంబర్ 24 వ తేదీ నుండి 31 వ తేదీ వరకు “మహాభారత ఉపన్యాస లహరి” కార్యక్రమం జరగబోతోంది.
యువభారతి అష్టమ వార్షికోత్సవాల సందర్భంగా ఈ “కావ్యలహరి” కార్యక్రమానికి శ్రీకారం చుట్టబడింది. విశ్వ సాహిత్యంలోనే నిత్య నూతన భావపుష్టికి, తాత్వికసృష్టికి, కవితాపారమ్యానికి, సౌందర్యానుభూతికి చెరగని గురుతులుగా చిరకాలం నిలిచి పోయే ఆనవాళ్ళు – మన కావ్యాలు.
మనకు గల అనేక కావ్యాల నుండి – సకల విద్యాసనాథ, కవిసార్వభౌమ శ్రీనాథుని “శృంగార నైషధం”, శిరీషకుసుమపేశల సుధామయోక్తుల అల్లసాని పెద్దనామాత్యుని “మను చరిత్రము”, ముక్కు తిమ్మనాచార్యుని ముద్దు పలుకు “పారిజాతాపహరణము”, సాహిత్య రసపోషణ రామరాజ భూషణుని “వసు చరిత్రము”, ప్రతిపద్య చమత్కృతి చేమకూర వెంకట కవి “విజయ విలాసము”, సాహితీ సమరాంగణ సార్వభౌముడు శ్రీ కృష్ణదేవరాయల “ఆముక్తమాల్యద” మహాంధ్రకవితా విద్యాబలప్రౌఢ తెనాలి రామకృష్ణుని “పాండురంగ మహత్యం” – ఈ కావ్యాలను ఎన్నుకుని, వీటి నుండి – “ఈ పద్యం ప్రతి తెలుగువాడికీ తెలిసి ఉండాలి” అనిపించే పద్యాలు, రసవత్తర సన్నివేశాల కూర్పుగా, సాధారణ పరిచయం ఉన్న సామాన్యుడిని దృష్టిలో పెట్టుకుని, ప్రత్యేకంగా వ్రాయబడినప్పుడే, తీరిక తక్కువగా ఉన్న నాటి తరానికి సాహిత్య పఠనాభిలాష ఏర్పడుతుందని యువభారతి భావించింది.
కనుక అటు జనాన్ని ఆకట్టుకునే అనర్గళ వాక్చాతుర్యం, ఏ భావమూ జారిపోకుండా ప్రతి అందాన్నీ పొదివి పుచ్చుకునే పద్ధతిలో కలం నడుపగల్గిన పాండిత్యం– ఈ రెండు ప్రత్యేక ప్రతిభలూ సమపాళ్ళలో కలిగిన ఆచార్య దివాకర్ల వేంకటావధాని గారు, పై కావ్యాలపై వారం వారం ఇచ్చిన ఉపన్యాస పాఠాలను యథాతధం అచ్చు వేయించి, సహృదయులైన సాహిత్యాభిమానులకు అందించబడిన పుస్తకం – ఈ “కావ్య లహరి” .
‘కావ్యలహరి’ పై ప్రముఖుల అభిప్రాయాలు
*యువభారతి సభలకు వస్తున్న జనాన్ని చూస్తుంటే, క్రమబద్ధంగా, క్రమశిక్షణతో జరిగే ఇటువంటి సభలు ఇక మీదట ఫతేమైదాన్ స్టేడియం లో ఏర్పాటు చేస్తే తప్ప స్థలం చాలదేమో.
— మాజీ భారత ప్రధాని – దివంగత పి.వి.నరసింహారావు
* దివాకర్ల వారి ఉపన్యాసము ఒడిదుడుకులు లేక ఒడ్లనంటి ప్రవహించు, నిండైన నిర్మల గంగాప్రవాహము. వారి కొన్ని ఉపన్యాసముల సారమే ఈ కావ్యలహరి. దీనినఖిలాంధ్రజనమున కాస్వాదనీయముగా పంచిపోసిన యువభారతివారి అపార కృషినెట్లు పొగడవలెనో, మాటలు చాలవు. వారి కృషికి అఖిలాంధ్ర రసిక హృదయములు ఋణ పడియున్నవి.
— శ్రీ వానమామలై వరదాచార్యులు గారు
*సంప్రదాయంలోని సారాన్ని గ్రహించి సమకాలీన భావాద్వంలో ప్రస్తానించి భవిష్యత్ కాంతితీరాలను సందర్శించడానికి ఈ ఉపన్యాస సంపుటి సహకరిస్తుందని ఆశిస్తున్నాను.
— డాక్టర్ సి. నారాయణ రెడ్డి గారు
*యువభారతి సంస్థ కార్యకర్తలలో సభ్యత, సంస్కారం, వివేచన ఉన్నాయి. ఉత్తమ కార్యక్రమాలు నిర్వహించగల దీక్ష, దక్షతలు గల సంస్థగా చిరకాలం పెంపొందాలి.
— శ్రీ నార్ల వెంకటేశ్వరరావు గారు
* ఈ సాహిత్య సభలు ఒక చరిత్రనే సృష్టించాయి. సాహిత్యానుశీలనంతో నూతనాధ్యాయాన్నే తెరిచాయి. చోటు దొరకదనే భయంతో కార్యక్రమానికి రెండుగంటల ముందుగానే ప్రేక్షకులు వచ్చి కూర్చునేట్లుగా చేశాయి. ఈ రకంగా సాహిత్యవాడులలో అభినూతన చైతన్యాన్ని కలిగించాయి.
— శ్రీ పి ఎస్ ఆర్ ఆంజనేయ శాస్త్రి గారు
* ప్రాచీన కావ్యావలోకనం ద్వారా సాహిత్యాభిరుచి, ఉత్తమ సాహిత్య వివేచనా, కవితాహృదయం, అన్నిటికీ మంచి సాహిత్యసహనం పెంపొందించడానికి క్రమశిక్షనాత్మకంగా యువభారతి నిర్వహిస్తున్నా సాహిత్యోద్యమం – పెడదారులు త్రోక్కుతున్నా అరాజకవాదం నుంచి యువతరానికి మంచి మార్ఘం చూపగలదన్న ఆశాభావాన్ని సభకు హాజరైన పలువురు పరిశీలకులు వెల్లడించారు.
— ‘ఆంధ్ర జనత’ దిన పత్రిక (13.09.1971)
* యువభారతి వారి అష్టమ వార్షికోత్సవాల సందర్భంగా చేపట్టిన కావ్యలహరి ఉపన్యాసాల కార్యక్రమం అందరిచే ఔననిపించుకున్నది. కొన్ని ప్రమాణాలను రూపొందించింది. కార్యక్రమ నిర్వహణలో క్రోత్తబాతలు చూపించింది. సాహితీ సమావేశాలకు వేల సంఖ్యలో తెలుగువారు వస్తారని, గంటల తరబడి ప్రశాంతంగా ఉపన్యాసాలు వింటారని నిరూపించింది.
— ‘ఆంధ్ర జ్యోతి’ పత్రిక (24.1 0.1971)
ఇంత గొప్ప ప్రచురణ “కావ్య లహరి” ని, క్రింద ఇవ్వబడిన link ను క్లిక్ చేసి ఉచితంగానే చదువుకోండి.
https://archive.org/details/kavya-lahari-inner-pages-2
లేదా క్రింద ఇవ్వబడిన QR code ను scan చేసినా ఆ పుస్తకాన్ని ఉచితంగానే చదువుకోవచ్చు.