చిరుజల్లు-48

1
3

చంద్రకళ

[dropcap]చం[/dropcap]ద్రకళ లాడ్జిలో మెట్లెక్కి మొదటి అంతస్తులోని తన గది తలుపు తీయబోతే, అది రాక ఇబ్బంది పడుతుంటే ఎదురు గదిలోని వ్యక్తి వచ్చి ఆమెకు సాయం చేశాడు.

“కొంచెం ముందుకు లాగి తీయలండీ” అన్నాడు అతను.

“థాంక్స్” అన్నదామె. తలుపు తీసుకొని గదిలోకి వెళ్లి, ప్లాస్టిక్ బుట్ట టేబుల్ మీద పెట్టి, వెనక్కి తిరిగి చూసింది. అతను ఇంకా అక్కడే ఉన్నాడు.

“రూంలో ఒక్కరే ఉంటున్నారు. రోజూ ఎక్కడికో వెళ్లి వస్తున్నారు..” అన్నాడతను.

“నా భర్త హాస్పటల్‍లో ఉన్నాడు. రోజంతా అక్కడే ఆయన దగ్గరే ఉంటున్నాను. రాత్రిళ్లు వచ్చి ఇక్కడ పడుకుంటున్నాను..” అన్నది చంద్రకళ.

“అయ్యో, ఏమిటి సుస్తీ?” అని అడిగాడు అతను.

“కిడ్నీ ప్రాబ్లమ్. డయాలసిస్ చేయాలి..” అన్నది చంద్రకళ.

“కిడ్నీ సమస్యకు చెన్నైలో మంచి డాక్టరు, మా స్నేహితుడు ఒకడు ఉన్నాడమ్మా.. కావాలంటే అడ్రసు ఇస్తాను..” అన్నాడు.

“ఇప్పుడు ఆయన్ను మద్రాసు తరలిచే స్థితిలో లేము. డబ్బు సమస్య. ఒకటి కాదు అనేక సమస్యలు. ఆయన హాస్పటల్‍లో, నేను లాడ్జిలో, పిల్లలు మా ఊర్లో మా పేరెంట్స్ దగ్గర.. చేతిలో డబ్బు లేదు. తెల్సిన వాళ్లకు ఫోన్‌లు చేస్తున్నాను.. దిక్కుతోచటం లేదు..” అన్నది చంద్రకళ విచారంగా.

“అయ్యో. మీ పరిస్థితి చూస్తుంటే జాలి వేస్తోందమ్మా.. కొత్తవాడినని సందేహించకుండి. ఎప్పుడే సాయం కావల్సి వచ్చినా అడగండి.. అర్ధరాత్రి అయినా నిద్ర లేపండి..” అన్నాడుతను.

ఆమె థాంక్స్ చెప్పింది. అతను తన గదిలోకి వెళ్లాడు. ఆమె తలుపు వేసుకుంది.

స్నానం చేసి వచ్చి చీర కట్టుకుంది. బెల్ మోగింది. బాయ్ భోజనం తెచ్చి టేబుల్ మీద పెట్టాడు.

“ఎవరు తెమ్మన్నారు?” అని అడిగింది చంద్రకళ.

“నేనే తెప్పించాను. మీరు మీ భర్త గురించి బాధపడుతూ, సరిగా తింటున్నట్లు లేదు. మిమ్మల్ని చూస్తే చాలా నీరసంగా ఉన్నారు. మీరు ఆరోగ్యంగా ఉంటేనే కదా, వారికి సేవ చేయగలుగుతారు..” అన్నాడు ఎదురు గదిలో అతను.

“నాకు భోజనం కాదండీ ముఖ్యం. ఆయన కోలుకోవటం ముఖ్యం.” అన్నది చంద్రకళ. అయితే అది అనుకున్నంత తేలిక కాదని ఆమెకు తెల్సు.

“కిడ్నీ దాతలు ఎవరన్నా ఉంటారేమో.. పేపర్లో ప్రకటన ఇచ్చే ప్రయత్నం చేద్దాం. కాని బయట వాళ్లు ఇచ్చినా అది కుదరదనుకుంటా..” అని అతనే అన్నాడు, ఆమెకు ఏదో కొంత ధైర్యం చెప్పాలన్న అభిప్రాయంతో.

“నేను బ్రతుకుతున్నదే ఆయన కోసం. ఆయన లేని జీవితాన్ని ఊహించుకోలేను” అన్నది చంద్రకళ కన్నీరు కారుస్తూ.

“ఏడవకండి. ప్రపంచంలో కష్టాలు లేని వాళ్లు ఎవరూ లేరు. మనిషి సుఖంగా ఉంటే, దేవుడ్ని గుర్తుంచుకోడు. అందుకని ఏవో సమస్యలు కల్పిస్తూనే ఉంటాడు..” అన్నాడతను.

ఈ ఓదార్పు మాటలేవీ ఆమె దగ్గర పనిచేయటం లేదు. కన్నీటితోనే కాలక్షేపం చేస్తోంది.

హాస్పటల్‍కి వెళ్లింది.

రిసెప్షన్ దగ్గర నర్స్ కనిపించింది.

“డాక్టర్ గారు రేపు పేషెంట్‌ను రెడీ చేయమన్నారు. ఇవాళ కౌంటర్‌లో డబ్బు కట్టి రసీదు తీసుకోండి” అన్నది.

చంద్రకళ మాట్లాడలేదు.

ఊళ్లో ఆమె తండ్రి డబ్బు కోసం ప్రయత్నం చేస్తున్నాడు. దొరికితే సాయంత్రానికి డబ్బు తీసుకొని వస్తాడు. డబ్బు దొరుకుతుందో లేదో అన్నదే అనుమానం.

భర్త ఉన్న రూంలోకి వెళ్లింది.

“నర్స్ నిన్ను రమ్మన్నది..” అన్నాడు ఆమె భర్త.

“కనిపించింది లెండి” అన్నది చంద్రకళ.

“దేనికట” అని అడిగాడు దేనికో తెల్సినా.

“ఏం లేదు లెండి.. మీరు రెస్ట్ తీసుకోండి.”

“రెస్ట్ తీసుకోవటం కాక ఇప్పుడు నేను చేస్తున్నది ఏముంది? ఇంక పూర్తిగా రెస్టే..” అన్నాడు తల తిప్పుకుంటూ.

చంద్రకళ ఆయనకు ఎదురుగా బల్ల మీద కూర్చున్నది.

జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందో తల్చుకుంటే ఆశ్చర్యం వేస్తుంది.

పదేళ్ల కిందట.

తను యవ్వనారంభ వేళలో ఉండేది. తూనీగలాగా చుట్టు పక్కల ఇళ్లకు పరుగులు తీస్తుండేది. అందరూ తనని నెత్తిన పెట్టుకుని చూసేవారు. కారణం ఆ ఊరిలో మిగిలిన వాళ్లకన్నా తనదే కాస్తంత వెసులుబాటు ఉన్న కుటుంబం. తన తండ్రి మాట అంటే, మిగిలిన వాళ్లందరికీ వేద వాక్కు. గౌరవ మర్యాదలకు లోటు లేని మనిషి.

తను హైస్కూలుకు వెళ్లింది. కాలేజీ చదువులకు వెళ్లాలంటే, పొరుగూరు వెళ్లాలి. రోజూ అంత దూరం వెళ్లి చదువుకుని రావాల్సినంత అవసరం అప్పట్లో కనిపించలేదు. పెద్ద చదువులు చదివి ఉద్యోగలు చెయ్యాలా, ఊళ్లు ఏలాలా – అన్నమాటే అందరి నోటా వినిపించేది.

సంబంధాలు చూడటం మొదలు పెట్టారు. ఆనందబాబు డిగ్రీ పూర్తి చేశాడు. ఓ మాదిరి ఆస్తిపాస్తులున్నయి. ఉన్న ఊల్లోనే బిజినెస్ చేస్తున్నాడు. ఆదాయమూ బాగానే ఉంది. ఇంకే కావాలి?

ఆనందబాబుతో వివాహం జరిగిపోయింది. అత్తారింట్లో అడుగు పెట్టాక, వాళ్ల ప్రేమలూ, అనుబంధాలూ, ఆప్యాయతలూ చూసి ఆశ్చర్యపోయింది.

ఆనందబాబుకు ఇద్దరు తమ్ముళ్లు, రాముడి మాట లక్ష్మణుడు, భరతుడూ అయినా కాదంటారేమో గానీ, ఇతని మాట తమ్ముళ్లు జవదాటరు. గీసిన గీత దాటరు. అన్న కోసం తమ్ముళ్లు, తమ్ముళ్ల కోసం అన్న ఎంతటి త్యాగానికైనా వెనుదిరిగేవారు కాదు. అన్న కోసం తమ్ముళ్లు ప్రాణం ఇవ్వటానికైనా సిద్ధంగా ఉండేవారు.

కాలం కాళ్ల మందు వెన్నెల పరచిన కాలమది. ప్రతి నెలా ఎవరో ఒకరిది పుట్టిన రోజులు, పరీక్షలు నెగ్గిన రోజులు, అంటూ ఏదో ఒక సందర్భాన్ని పురస్కరించుకొని విందులు, వినోదాలు జరుపుతుండేవాడు ఆనందబాబు. ఎప్పుడు దేనికి ఎంత ఖర్చు అవుతోందో, అదంతా ఎక్కడి నుంచి వస్తోందో ఆనందబాబుకి తప్ప ఇంకెవరికీ తెలియదు. తెలియవల్సిన అవసరమూ లేదు.

తమ్ముళ్లు ఇద్దరికీ పెళ్లిళ్లు చేశాడు. కట్నాలు తీసుకోవటం తమకు ఇష్టం లేదన్నారు. కానీ హంగులూ, ఆర్భాటాలకు మాత్రం లోటు రానివ్వలేదు. ఆనందబాబు ఎక్కడి నుంచి డబ్బు తెచ్చాడో ఎవరూ అడగలేదు. ఆయనా చెప్పలేదు.

అప్పడలా జరిగిపోయింది.

తమ్ముళ్లకు కుటుంబాలు ఏర్పడినయి. వాళ్ల బరువు బాధ్యతలు వాళ్లకు ఏర్పడినయి. బాగానే నిలదొక్కుకున్నారు. జీవితంలో స్థిరపడ్డారు.

ఆనందబాబుకే రోజులు కల్సి రాలేదు. వ్యాపారం బాగా దెబ్బతిన్నది. నష్టాలు రావటం మొదలైంది. అప్పులు చేయక తప్పలేదు. తలకు మించిన భారం అయింది. మరింతగా రుణ భారంలో కూరుకుపోయాడు. అలా ఉన్నదనుకున్న సంపద కాస్తా కరిమింగిన వెలగపండుగా మారింది. భార్యా, ఇద్దరు పిల్లలు.. జీవనయానం కష్టతరమైంది.

తను పుట్టింటి వైపు చూస్తే అక్కడా పరిస్థితులు పూర్తిగా మారిపోయినయి. తల్లీ తండ్రీ మాటకు ఇప్పుడు విలువ లేదు. వృద్ధాప్యం ముంచుకొచ్చింది. కొడుకులు, కోడళ్ల మీద ఆధారపడ్డారు. వాళ్లు తమ స్వంత గొడవలేగాని, తోడబుట్టిన వారి గురించి ఆలోచించే స్థితిలో లేరు.

రోజులు ఎలా వెళ్లదీయాలా అన్న పరిస్థితుల్లో ఈయనకు ఈ జబ్బు పట్టుకుంది. రక్త సంబంధీకులు ఎవరైనా కిడ్నీ ఇస్తే కొంత కాలం జీవించగలుగుతాడు. తముళ్లను అడిగితే, తమ ఆరోగ్యమే అంతంత మాత్రంగా ఉందని భార్యల చేత చెప్పించారు.

డయాలసిస్ కోసం ప్రతి సారీ సిటీకి రావటం, ఆయన హాస్పటల్లో, తను హోటల్లో ఉండవల్సి రావటం – డబ్బు మంచి నీళ్లలాగా ఖర్చు చేయాల్సి వస్తోంది.

ఎంత కాలం ఇలా సాగుతుందన్నదానికి సమాధానం దొరకటం లేదు.

డబ్బు దొరికితే తీసుకొని వస్తానని తండ్రి ఫోన్ చేశాడు. కానీ డబ్బు దొరకుతుందన్న ఆశ లేదు. రోజంతా చూసినా తండ్రి రాలేదు. డబ్బు కడితే గాని వైద్యం ముందుకు సాగదు..

దిక్కు తోచని స్థితిలో ఉన్నది.

చంద్రకళ మళ్లీ లాడ్జికి వచ్చింది. ఎదురు గదిలోని వ్యక్తి పరామర్శకు వచ్చాడు. “ఎలా ఉంది” అని అడిగాడు. ఆమె తన పరిస్థితి చెప్పింది.

అప్పుడాయన ఒక చిన్న విషయం చెప్పాడు.

“ఈ కార్పోరేటు హాస్పటల్ వాళ్లు లక్షలు లక్షలు గుంజుతూ, జలగల్లా రక్తం పీల్చేస్తున్నారు. కానీ ఎవరికీ తెలియని విషయం ఒకటి ఉంది. ఈ హాస్పటల్ వాళ్లకు పర్మిషన్ ఇచ్చేటప్పుడు గవర్నమెంటు ఒక రూలు పెడుతుంది. అది ఏమిటంటే, ప్రతి హాస్పటల్ కూడా తాము చికిత్స చేసే వారిలో పది శాతం మంది పేదవారికి ఉచితంగా వైద్యం చేయాలి. అన్ని రూల్సు మాదిరిగానే దీన్నీ ఎవరూ పట్టించుకోరు. ఏదో ఒక ఆదివారం నాడు, ఏదో ఒక కాలనీలో నామ మాత్రంగా కొద్ది మందికి బి.పి, షుగర్ టెస్ట్ చేసి చూసి, ఆ రూలు ప్రకారం పది శాతం మందికి చికిత్స చేసినట్లు చూపిస్తారు. మరి కొన్ని హాస్పిటల్స్ అవీ చేయవు. అడిగే వారు ఎవరూ ఉండరు. అసలా రూలు ఉందన్న విషయం తెల్సిన వారూ ఉండరు..” అన్నాడు అతను.

చంద్రకళకు వరదలో కొట్టుకుపోతున్న వాడికి, గడ్డిపోచ దొరికినట్లు అయింది. అతను చెప్పిన విషయమే ఆమె మనసులో నాటుకుపోయింది.

మర్నాడు ఉదయమే డాక్టరు దగ్గరకు వెళ్లింది. అయనకు తన పరిస్థితి వివరించింది.

“సర్ నేను పెద్దగా చదువుకోలేదు. అలా అని మరీ అక్షరం ముక్క తెలియని దాన్ని కాదు. ఇంత పెద్ద హాస్పటల్‍లో లిఫ్ట్ బాయ్ దగ్గర నుంచీ, పెద్ద సర్జన్ దాకా వంద మంది పని చేస్తున్నారు. నేను ఏదో ఒక పని చేస్తాను. నాకు ఇచ్చే జీతం నుంచి, ఆయన వైద్యానికి అయ్యే ఖర్చు జమ చేసుకోండి” అన్నది చంద్రకళ.

ఆయన హేళనగా నవ్వాడు. “ఒక వేళ నీకు ఏదైనా ఒక చిన్న ఉద్యోగం ఇచ్చినా, నీకు మేము ఇచ్చే జీతం ఎంత? మీ ఆయన చికిత్సకు అయ్యే హస్పటల్ బిల్లు ఎంత? రెండింటికీ ఏమన్నా పొంతన ఉంటుందా?” అని అన్నాడు.

“నిజమే. లక్షల్లో నాకు జీతం ఇవ్వరు. నాకు ఆ సంగతి తెల్సు. కానీ ప్రతి కార్పోరేట్ హాస్పటల్ కూడ పేదవారికి పది శాతం మందికి ఉచితంగా వైద్యం చేయాలన్న రూలు ఉంది గదా.. దాని కింద ఆయనకు చికిత్స చేయండి” అన్నది చంద్రకళ.

“అలాంటి రూలు ఉన్నదని నీకు ఎవరు చెప్పారు?” అని అడిగాడు డాక్టర్.

“ఎప్పుడో పేపర్లో చదివాను.. ఇప్పుడు మీరు లక్ష రూపాయలు ఫీజు కడితేగాని ట్రీట్‌మెంట్ చేయం అని అంటే, అదే పేపరుకి, అదే టి.వికి నేను వెళ్లి చెబుతాను. సాయంత్రం వార్తల్లో ఇదే ముఖ్యాంశం అవుతుంది..” అన్నది చంద్రకళ.

“సరే, నీ మొహం చూసి జాలిపడి ట్రీట్ చేస్తాం. నీకు భయపడి కాదు. కానీ ఈ విషయం ఎక్కడా, ఎవరితోనూ అనకు..” అన్నాడు డాక్టర్.

చంద్రకళ అందుకు ఒప్పుకుంది. ఆయనకు కృతజ్ఞతా పూర్వకంగా నమస్కరించింది.

ఆనందబాబును వీల్ చైర్‍లో తీసుకు వెళ్తునప్పుడు అతను భార్య వంక చూశాడు.

అతనికి ఆమె, యముడితో పోరాడి భర్త ప్రాణాలు రక్షించుకున్న సతీ సావిత్రిలా కనిపించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here