దైవం మానవ రూపంలో..

0
4

[సంచిక 2022 దీపావళి పోటీకి అందిన కథ.]

[dropcap]దు[/dropcap]ష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంరక్షణ కోసం శ్రీమహావిష్ణువు ప్రతి యుగంలోనూ అవతరిస్తున్నాడు. వాలి, రావణుడు, కుంభకర్ణుడు వంటి అధర్మ వర్తనులను శిక్షించటానికి త్రేతాయుగంలో శ్రీరాముడుగానూ, శిశుపాల, దంతవక్త్ర ఆదిగాగల వారిని వధించటానికి ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు గానూ అవతరించాడు. అలాగే కలియుగంలో బుద్ధ భగవానుడిగా జన్మించాడు విష్ణువు.

ప్రేమ, కరుణ, మానవత్వం చూపించటానికి కాలంతో పనిలేదు. అవి సార్వజనీనమైనవి. బుద్ధ భగవానుడు అభిమానించినది మానవతను. ప్రేమించింది మానవత్వాన్ని. ఆరాధించింది హృదయ ధర్మాన్ని! వీటినే తన బోధనల ద్వారా ప్రపంచానికి చాటాడు బుద్ధుడు.

***

బుద్ధుడిగా మారక ముందు అతని పేరు సిద్దార్ధుడు. అందరూ గౌతముడు అని కూడా పిలిచేవారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లు సిద్ధార్ధుడు చిన్నతనం నుంచీ తన సౌజన్యం, మంచితనంతో రాజమందిరంలోని అందరి హృదయాలను చూరగొన్నాడు. సిద్దార్ధుడు సేవకులను, పరిచారికులను ఎప్పుడూ చిన్నచూపు చూడలేదు. తాను రాజకుమారుడననే దర్పం ప్రదర్శించలేదు. తోటి మానవులలాగే గౌరవించాడు. అందుకే రాజమందిరంలోనే కాదు, ప్రజలు కూడా సిద్దార్ధుడిని అందరూ అభిమానిస్తారు. ఇక తండ్రి శుద్దోధనుడి సంగతి చెప్పనక్కర లేదు. కుమారుడంటే పంచప్రాణాలు.

శుద్దోధనుడి తమ్ముడు ద్రోణ ధనరాజు కుమారుడు దేవదత్తుడు. చిన్నవయసు లోనే అన్నగారు సిద్ధార్ధుడు పొందుతున్న మర్యాదా మన్ననలు చూసి కన్నుకుట్టింది దేవదత్తుడికి. ధర్మరాజుని చూసిన దుర్యోధనుడిలా అసూయా మాత్సర్యాలతో ఉడికిపోతూ, అతన్ని అవమానించటానికి మార్గాలు అన్వేషించసాగాడు.

ఆరోజు సిద్ధార్ధుడు ఉద్యానవనంలో ఒక చలువరాతి తిన్నె మీద కుర్చుని చుట్టూ ప్రకృతి అందాలను వీక్షిస్తున్నాడు. అప్పటికి అతనికి పదేళ్ళ వయసు ఉంటుంది. చుట్టూ రకరకాల పూలు విచ్చుకుని, చిరుగాలికి తలలూపుతున్నాయి. వాటి పైన రకరకాల రంగుల్లో తుమ్మెదలు అవి కూడా పూలేనేమో అనిపించేటట్లు వాలుతున్నాయి. సరోవరంలో హంసలు ఈదులాడుతున్నాయి. ఉద్యానవనంలోని చెట్లన్నీ పచ్చగా కళకళ లాడుతున్నాయి. కొబ్బరిచెట్ల మీద కొంగలు వాలుతూ, ఎగురుతూ ఆడుకుంటున్నాయి. ప్రశాంతమైన మనసుతో ఈ ప్రకృతిని వీక్షిస్తే చాలా ఆనందంగా ఉంటుంది అనుకున్నాడు సిద్దార్ధుడు. ఇంతలో ఒక కొంగ బాణం గుచ్చుకుని విలవిల లాడుతూ నేలమీద పడింది.

సిద్దార్ధుడు పరుగున వెళ్లి కొంగను చేతుల్లోకి తీసుకున్నాడు. బాణం గుచ్చుకున్న చోట రక్తం స్రవిస్తూంది. కొంగ మూగగా, దీనంగా అతని వంక చూసింది. సిద్ధార్ధుడు అంబు లాగివేసి, పక్కన ఉన్న పొదల్లో ఏవో ఆకులు తీసుకువచ్చి పిండి, గాయం ఉన్నచోట పసరు రాశాడు. ఉత్తరీయం చింపి కట్టుకట్టాడు. చలికి, బాధకి కొంగ వణుకుతూంది. తన పై పంచతో దానికి కప్పాడు. మంట దగ్గర చలి కాచాడు.

ఇంతలో దేవదత్తుడు అక్కడికి వచ్చాడు అతని చేతిలో విల్లు, అమ్ములు, ఉన్నాయి. “గౌతమా! ఇక్కడ కొంగ పడ్డది, నువ్వు చూసావా!” అని అడుగుతూ ఉండగానే, సిద్దార్ధుడి చేతిలో కొంగను చూసాడు. “అది నాది. నేను వేటాడాను. నాకు ఇవ్వు” అన్నాడు. “దీని ప్రాణం నేను రక్షించాను. ఇది నాకు చెందుతుంది. నేను ఇవ్వను” అన్నాడు సిద్దార్ధుడు.

“కొట్టింది నేను కదా! వేటాడిన వాడికే వేట చెందాలి” అన్నాడు దేవదత్తుడు పంతంగా. ఎంతసేపటికీ వివాదం తెగలేదు. ఆ మర్నాడు రాజాస్థానికి వచ్చారు ఇద్దరూ. ఎవరి వాదనలు వారు వినిపించారు. న్యాయమూర్తులు చాలాసేపు చర్చించారు. ఇద్దరూ రాజపుత్రులు. ఎవరివైపు తీర్పు చెబితే ఎవరికీ కోపం వస్తుందో!

చివరికి ఇలా అన్నారు. “కొంగను ఒకచోట ఉంచండి. ఇద్దరూ దూరంగా నిలబడి కొంగను పిలవండి. అది ఎవరి దగ్గరకు వస్తే వారిదే!” అన్నారు. ఈ మాటలకు ఇద్దరూ అంగీకరించారు. కొంగను ఒక పీఠంమీద కూర్చోబెట్టారు.

“వేటాడటం క్షత్రియ ధర్మం. వేటాడిన వాడికే ఆ వేట చెందాలి. నా దగ్గరకు రా!” చేతులు జాపి పిలిచాడు దేవదత్తుడు. కొంగ అతనివైపు కన్నెత్తి కూడా చూడలేదు.

“క్షత్రియులు వేటాడవలసింది మానవులకు అపకారం చేసే క్రూరమృగాలను కానీ, సాధుజంతువులను కాదు. గాలిలో స్వేచ్చగా విహరిస్తున్న నిన్ను బాణంతో కూల్చటం దారుణం. ప్రేమించే వారికే కలిసి జీవించే హక్కు ఉన్నది. నేను నిన్ను ప్రేమించాను. కనుకనే నీ ప్రాణం కాపాడాను. నీవు నాదానివి. నా దగ్గరకు రా నేస్తమా!” అని పిలిచాడు సిద్ధార్ధుడు.

కొంగ ఒకక్షణం సిద్దార్ధుడి వంక చూసి, రెక్కలు టపటప లాడించి ఒక్కసారిగా ఎగిరి అతడి చేతుల్లో వాలింది. దాన్ని సిద్ధార్ధుడు గుండెలకు హత్తుకున్నాడు. సభాస్థలి అంతా కరతాళధ్వనులతో మారుమ్రోగింది. దేవదత్తుది ముఖం కాలిన కాగితంలా నల్లగా అయింది.

సిద్ధార్ధుడు దేవదత్తుడి భుజం మీద చేయి వేసి “తమ్ముడూ! కరుణ, ప్రేమ లేని కారణంగానే మనుషుల్లో ద్వేషం ప్రబలుతూంది. అందువల్లనే బలవంతులు బలహీనులను అణచి వేస్తుంటారు. ఈరోజున నా వాదనలో ధర్మం ఉన్నది కాబట్టే ఈ బకం నాకు స్వాధీనమైనది. ఇప్పటినుంచీ నువ్వు కూడా సాటి జీవులను ప్రేమించటం నేర్చుకో!” అన్నాడు.

ఆ కొంగ గాయం నయం అయినతర్వాత నాలుగు రోజులకి దాన్ని స్వేచ్ఛగా గాలిలో ఎగరేశాడు సిద్ధార్ధుడు.

***

ప్రపంచంలో ప్రజలు అందరూ రుజాగ్రస్తులై, జరా పీడితులై, చివరకు తనువు చాలించటానికి కారణం ఏమిటి? వీరంతా ఇలా దుఃఖించటానికి హేతువు ఏమిటి? సత్యం అన్వేషించాలి అనే సంకల్పంతో సిద్ధార్ధుడు రాజభవనంలో నుంచీ బయలుదేరాడు. అప్పటికి సిద్ధార్ధుడు ఒక బిడ్డకు తండ్రి. భార్యాబిడ్డలను వదిలి జనంలోకి వచ్చాడు. ప్రజలలో మమేకమైతే గానీ, వారి సమస్యలు అర్థం చేసుకోలేము అనుకున్నాడు. తన నల్లటి గిరజాల జుట్టుని కత్తిరించుకున్నాడు. పట్టుపీతాంబరాలు విడిచేసాడు. నగలు తీసేసాడు. సన్యాసిగా మారిపోయాడు.

క్రమక్రమంగా ప్రజల అశాంతికి కారణం తెలుసుకున్నాడు. ఫలాపేక్ష, సుఖలాలస, తృష్ణ – ఇవి దుఃఖానికి హేతువులు అని అర్థం చేసుకున్నాడు. ప్రతి మనిషిలోను కొన్ని బలహీనతలు ఉంటాయి. అవి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతూ ఉంటాయి. ప్రేమతో దుర్మార్గాన్ని జయించవచ్చు. ప్రేమించటానికి కావలసింది సదవగాహన. తను తెలుసుకున్న ఈ సత్యాలను లోకానికి చాటాలనుకున్నాడు. క్రమక్రమంగా అతని బోధనలు విని అనేకమంది శిష్యులుగా చేరారు. బౌద్ధ భిక్షువులందరూ ఉదయాన్నే శుచిగా స్నానంచేసి బిక్షాటనకు బయలు దేరుతారు. దొరికింది తిని ఊరూరూ తిరుగుతూ ధర్మబోధ చేస్తూ ఉంటారు.

ఒకనాటి ఉదయం బుద్ధుడు భిక్ష కోసం శ్రావస్తి నగరం ప్రవేశించాడు. వీధుల్లో ఒక్క మనిషీ కనిపించలేదు. నగరం మొత్తం నిర్మానుష్యంగా ఉన్నది. ఎప్పుడూ వెళ్ళే ఒక ఇంటిముందు నిలబడగా తలుపు తెరుచుకుంది. ఆ గృహస్థు బుద్ధుని చూసి “స్వామీ! ఈ రోజు బయట తిరగటం ప్రమాదం. సాధ్యమైనంత త్వరగా మీ ఆశ్రమానికి తిరిగిపొండి” అని చెప్పాడు.

“ఏం! ఏం జరిగింది?” అడిగాడు బుద్ధుడు.

“ఏం చెప్పమంటారు స్వామీ, మా రాజ్యం చేసుకున్న గ్రహచారం. అంగుళీమాలుడు అనే నరరూప రాక్షసుడు మా నగరంలో ప్రవేశించాడు. అతడు ఎందరినో చంపి, హతుల చేతివేళ్ళను మాలగా చేసుకుని మెడలో వేసుకుని తిరుగుతూ ఉంటాడు. కనిపించినవారిని పట్టుకుని చంపుతూ ఉంటాడు. మా మహారాజు వాడిని బంధించటానికి ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు కానీ సాధ్యం కావటంలేదు” అని చెప్పాడు గృహస్థు.

“ఒక్కడిని బంధించటానికి అంతమంది సైనికులు అవసరమా!”

“స్వామీ! వాడు మహా క్రూరుడు. క్షుద్రవిద్యలు తెలిసిన మాంత్రికుడు. ఒకసారి నలబైమంది సైనికులు కలసి గొలుసులతో బంధిస్తే, తెంచుకుని పారిపోయాడు. ఇప్పుడు వాడు నగరంలోనే ఉన్నాడు. అందుకే ఎవరూ బయటకు రావటంలేదు” చెప్పాడు గృహస్థు.

“సరే! నేను బయటకు వెళ్లి భిక్ష అర్ధిస్తాను” అని బుద్ధుడు వెళ్ళిపోయాడు.

వీధిలో కొంతదూరం నడిచేసరికి వెనకనుంచీ ఎవరో వస్తున్నట్లు అడుగుల సవ్వడి వినిపించింది. అది అగుళీమాలుడు అయిఉంటాడని గ్రహించాడు బుద్ధుడు. అయినా వెనుదిరిగి చూడలేదు.

“ఎవరది? నేను వస్తున్నానని తెలిసి కూడా అంత నిర్భయంగా తిరుగుతున్నారు! ఆగు” వెనకనుంచీ అరిచాడు అంగుళీమాలుడు.

బుద్ధుడు ఆగలేదు. అడుగులు తడబడలేదు. అతడి నిర్లక్ష్యానికి అంగుళీమాలుడుకి ఒళ్ళు మండిపోయింది. గబగబా నడిచి, బుద్దుడికి ఎదురువచ్చి, దారికి అడ్డంగా నిలబడ్డాడు. “ఆగమంటే వెళ్లిపోతావే? ఆగు..” అన్నాడు. బుద్ధుడు అతడి కళ్ళల్లోకి సూటిగా చూశాడు. ఆయన కళ్ళు రెండు సూర్యుల లాగా వెలిగిపోతున్నాయి. ఆ కళ్ళలలోని వెలుగు భరించలేకపోయాడు అంగుళీ మాలుడు.

“నేను ఆగిపోయి చాలా కాలమైంది. ఆగవలసినది నువ్వే!” అన్నాడు బుద్ధుడు. ఈ సన్యాసికి తానెవరో తెలిసే ఉంటుంది. అయినా తన ముందు నిర్భయంగా నిలబడి మాట్లాడుతున్నాడంటే సామాన్యుడు అయిఉండదు. “ఎప్పుడో ఆగిపోయానన్నావు. మరి నడుస్తూనే ఉన్నావే!” అతడి కంఠం అప్రయత్నంగా వణికింది.

“అంగుళీమాలా! నేను కర్మలు చేయడం ఎప్పుడో ఆపివేసానయ్యా! ఎవరికీ అపకారం చేయను. అన్ని జీవులని రక్షిస్తాను. జీవకారుణ్యం నాది. ప్రేమతో, కరుణతో జీవులకి మృత్యుభయం తొలగిస్తాను” అన్నాడు.

“మనుషులంతా మోసగాళ్ళు, క్రూరులు. వాళ్లందరినీ చంపనిదే నాకు తృప్తి లేదు”

“సరే! వారందరూ నీకు కష్టం కలిగించారని అనుకుందాం. వారి ప్రవర్తనకు కారణం, ద్వేషం, అసూయ, అజ్ఞానం. అయినా మనుషులందరిలో ప్రేమించే గుణం ఉన్నది. మనం ప్రయత్నిస్తే మనిషి క్రూర స్వభావాన్ని ప్రేమగా మార్చవచ్చు. ప్రస్తుతం నీది ద్వేషించే మార్గం. అది ఆగిపోవాలి. కొత్త మార్గం లోకి రా! జాలి, దయ, కరుణ వీటిని ఆశ్రయించు”

బుద్ధుడి మాటలకు అంగుళీమాలుడి తల తిరిగిపోయింది. ఇన్నాళ్ళూ తను బ్రతికిన బ్రతుకంతా అర్థహీనంగా అనిపించింది. అందరూ తనని ద్వేషించే వాళ్ళే! తనకు ఆకలిగా ఉన్నప్పుడు ఒక ముద్ద పెట్టేవారు కానీ, తన దాహం తీర్చి గుక్కెడు నీళ్ళు పోసేవారు గానీ, ఆఖరికి తను మరణిస్తే ‘అయ్యో పాపం’ అనే వారు గానీ ఎవరూ లేరు. తను చస్తే అందరూ సంతోషించేవారే! ఈ మహానుభావుడు బుద్ధుడు కాదు కదా!

“స్వామీ! మీరు ప్రేమమూర్తి అయిన బుద్ధ భగవానులవారేనా!” సందేహంగా అడిగాడు అంగుళీమాలుడు. అతని కంఠంలోకి మార్దవం వచ్చింది. అవునన్నట్లు తలాడించాడు బుద్ధుడు.

“అయ్యా! ఇంతకాలం మిమ్మల్ని కలవలేకపోవడం నా దురదృష్టం. నేను చాలా దుర్మార్గుడిగా పేరుబడ్డాను. ఇప్పుడు నేను మారినా జనం నమ్మరు. నన్ను బ్రతకనీయరు” అన్నాడు కన్నీళ్ళతో.

“నేను నమ్ముతున్నాను. నీకేమీ అపకారం జరగదు. నా వెంట రా!” చెప్పాడు బుద్ధుడు. అంగుళీమాలుడు బుద్ధుడి పాదాలపై పడ్డాడు. మొలలో ఉన్న కత్తి తీసి నేలమీద పెట్టి “ఇక నుంచీ చెడ్డపనులు చేయను స్వామీ! మీ మీద ప్రమాణం చేస్తున్నాను. నేనూ మీ వెంట వస్తాను. నన్ను కరుణించండి” అన్నాడు.

అంతలో బుద్ధుని వెతుకుతూ ఆయన శిష్యులంతా వచ్చేశారు. అంగుళీమాలుడిని అక్కడ చూసి కంగుతిన్నారు.

“మన సంఘంలో కొత్తవ్యక్తి చేరాడు” బుద్ధుడు అతడిని శిష్యులకి పరిచయం చేసాడు. అందరూ కలసి ఆశ్రమానికి తిరిగివచ్చారు. బుద్ధుడు అంగుళీమాలుడికి దీక్ష ఇచ్చాడు. పదిరోజుల్లో అతనికి ధ్యానం నేర్పాడు. బుద్ధుడి సాంగత్యంలో అతడు మంచిమనిషిగా మారిపోయాడు.

ఆలోచన వచ్చిన తర్వాత శరీరం పాపానికి సిద్ధం అవుతుంది. అన్నిటికీ మూలం మనసు. కనుక మనసులోని చెడును రూపుమాపాలి. మనిషిని చంపకూడదు. ఇదీ ఆ అహింసామూర్తి మార్గం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here