ఇది.. గొప్ప అనుభవమే..!!
[dropcap]‘క[/dropcap]రోనా కాలం’ గుర్తు పెట్టుకోదగ్గ కాలం. యావత్ ప్రపంచదేశాలనే గడగడ లాడించిన ఒక ప్రత్యేక సమయం. ‘మమ్మల్ని మించిన వాళ్ళు లేరు’ అని గొప్పలు చెప్పుకున్న దేశాలు కూడా కరోనా.. ముందు తల వంచక తప్పలేదు. కరోనా కాలాన్ని, మనకు జరిగిన నష్టాన్ని బట్టి, అదొక దురదృష్టకరమైన కాలంగా చెప్పుకుంటారు గానీ, అది ఎంత చెడు చేసి ప్రాణ నష్టాన్ని కలిగించిందో, అంతకు మించి మనిషికి మంచి జ్ఞానోదయాన్నీ కూడా కలిగించింది అని చెప్పవచ్చు.
ప్రారంభ దశలో అది ఏమిటో తెలియక, దానికి సరైన వైద్యం తెలియక, భయబ్రాంతులకు గురి అయినవారు సైతం అనేక కష్టాలకు గురియై, పిదప ప్రాణాలు పోగొట్టుకున్నవారు వున్నారు. తర్వాత విషయాన్ని అన్నిరకాల అవగాహన చేసుకున్న కార్పొరేటు ఆసుపత్రులు, రోగుల భయానికి మరింత భయం జోడించి, సొమ్ము చేసుకోవడం కూడా మనం కళ్లారా చూసాము. మనది ఉష్ణ దేశం కాబట్టి, ఆ వేడికి వైరస్ తట్టుకోలేదు కనుక పెద్ద మందులు అవసరం లేదని ఒక్క ‘పేరాసిటిమాల్’ బిళ్ళ ఉంటే చాలని నీతులు చెప్పిన రాజకీయ పెద్దలు, తర్వాత చేసిన హడావిడి ఎలాంటిదో కూడా మనం చూసాం. తర్వాత వేక్సిన్, ఆ తర్వాత బూస్టర్ డోస్ అనేవి అన్నీ మనకు అనుభవాలే!
కరోనా వచ్చి వెళ్లిన తర్వాత చాలా విషయాల్లో మనకు జ్ఞానోదయం అయింది. శుభ్రంగా ఎలా ఉండాలో, జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో తరతమ భేదాలు లేకుండా అందరికీ అర్థమయింది. అందరి మనసుల్లోనూ ‘మాస్క్, శానిటైసర్’ అనే మాటలు బలంగా నాటుకుపోయాయి. దగ్గు – జలుబు నిర్లక్ష్యం చేయకూడదని అర్ధమయిపోయింది. జ్వరాన్ని అంత తేలిగ్గా తీసుకోకూడదన్న విషయం కూడా అవగాహనకు వచ్చింది. అలాగే మనిషిలో భయాన్ని, నిరుత్సాహాన్ని పెంచింది. జనాల్ని చైతన్య రహితుల్ని చేసి బద్ధకం పెంచింది. ప్రయాణాలకు ఆనకట్ట వేసింది. ఒకరినొకరు కలుసుకోలేని సన్నివేశాలని సృష్టించింది. ‘మా ఇంటికి మీరు రావద్దు – మీ ఇంటికి మేము రాము’ అనే నినాదానికి ఊపునిచ్చింది. ఈ నేపథ్యంలో నేను కూడా ఇలాంటి అనుభవాన్ని చవి చూడవలసి వచ్చింది. ఎక్కడికీ వెళ్లకుండా, బంధువులను – స్నేహితులను చూడకుండా నన్ను నేను కట్టడి చేసుకోవలసి వచ్చింది. ఇంకొన్నాళ్ళు ప్రాక్టీస్ చేయగల సత్తువ నాకున్న, పిల్లల ఒత్తిడితో (బ్రతికుంటే బలుసాకు తిని బ్రతకొచ్చు – అనే సామెత వాళ్లకి బాగా అవగాహనకు వచ్చినట్టు వుంది) క్లినిక్ మూసేసి, నా పరికరాలన్నీ స్థానిక క్రిస్టియన్ ఆసుపత్రికి విరాళంగా ఇచ్చేయడం జరిగింది. ఎవరు పిలిచినా దూరభారాలు, ప్రయాణం తగ్గించుకున్నాను. దీనివల్ల బద్ధకం పెరిగిపోవడమే కాక, శరీరం బరువు పెరగడం, సమయంతో పనిలేకుండా నిద్రపోవడం వంటి అలవాట్లకు అంకురార్పణ ఏర్పడింది.
నా ఈ విషయాన్ని గమనించిన మిత్రుడు,శ్యామ్ కుమార్ చాగల్ (ఇంటర్ -మిత్రుడు) నాకు కొన్ని ఆరోగ్య వ్యాయామాలు చెప్పడమే కాక తన స్వంత ఖర్చులతో, నాలో చలనం కలుగజేసి నన్ను అనేక ప్రాంతాలకు తిప్పాడు/తిప్పుతున్నాడు. అందులో ఒకటి గత నెల (26, 27, 28 నవంబర్, 2022) మేము వెళ్లిన గుంటూరు ప్రయాణం. శ్యామ్ కారు లోనే, అతనితో పాటు, అతని భార్య శ్రీమతి లీల, నేను గుంటూరుకు ప్రయాణం.
మేము ప్రయాణం పెట్టుకోవడానికి అసలు కారణం శ్రీమతి సిహెచ్. సుశీలమ్మ గారి పుస్తక ఆవిష్కరణ, దానితో పాటు ప్రతి యేటా ఆవిడ తండ్రిగారి పేరు మీద ఇచ్చే పురస్కార కార్యక్రమం. అయితే ఎట్లాగూ గుంటూరు వెళుతున్నాం కనుక, అక్కడ మా స్నేహితులను, బంధువులను, శ్రేయోభిలాషులను కలవాలని ప్లాన్ చేసుకున్నాం.
26-11-2022, మధ్యాహ్నం గుంటూరుకు చేరుకున్నాము. మాకు ఏర్పాటు చేసిన బసలో దిగి, కాస్త విశ్రాంతి అనంతరం 3.30కి సభాస్థలికి చేరుకోవాలని తయారవుతున్న సమయంలో ఉమా మహేశ్వర రావు (ఈయన నాగార్జున సాగర్‍లో మా కుటుంబ మిత్రులు శ్రీ ఉప్పే సూర్యరావు గారి కనిష్ట కుమారుడు. గుంటూరు కేంద్రంగా ఎగ్జిక్యుటివ్ ఇంజనీర్‌గా, మూడు జిల్లాలకు ప్రతినిధిగా, ఇరిగేషన్ శాఖలో పని చేస్తున్నాడు) కనిపించడం ఎంతో ఆనందం అనిపించింది. అతను మా అక్క శిష్యుడు కూడాను. చాలాసేపు కబుర్లు చెప్పుకున్నాక ఆయన ఆఫీసుకు వెళ్ళిపోయాడు. గుంటూరులో కలవవలసిన ఇద్దరినీ (క్లాసుమేట్ డి. రాజ్యలక్ష్మి గారిని, అక్క సహోద్యోగి శేషారత్నం గారినీ) మరునాడు కలవాలని నిశ్చయించుకున్నాము. ఈ లోగా ‘సాగర్ గ్రూపు’ అడ్మిన్ జూనియర్ ఇంజనీర్ రామ్మూర్తి గారు కూడా మరునాడు కలుస్తామని ఫోన్ చేశారు. ఈ ట్రిప్పులో ఎక్కువమంది పాత మిత్రులను పెద్దలను కలుస్తున్నామన్న ఆనందం వెల్లివిరిసింది.
27 న మిత్రులను పెద్దలను కలిసే పని ప్రారంభం అయింది. ముందు మా సహాధ్యాయిని (ఇంటర్మీడియెట్) డి. రాజ్యలక్ష్మి గారి ఇల్లు వెదుక్కుంటూ, బ్రేక్‍ఫాస్ట్ సమయానికి (ఇది ముందే ఫిక్స్ అయింది) చేరుకున్నాము. ఇంటర్మీడియెట్ తర్వాత రాజ్యలక్ష్మిని చూడడం ఇదే మొదటిసారి. అంటే సుమారు నలభై సంవత్సరాల తర్వాత! ఈ వయస్సులో మార్పులు సహజం. కానీ గుర్తుపట్టలేనంత మార్పులు ఏమీ జరగలేదు. కొద్దీ సంవత్సరాల క్రితం రాజ్యలక్ష్మి, లీల, శ్యామ్ కుమార్ ఏదో సందర్భంలో కలుసుకున్నారు. నేను మాత్రం ఇదే చూడ్డం. ఆమె ఉన్నత విద్యాభ్యాసం చేసినా గృహిణి గానే వుండి పోయింది. భర్త పేరున్న లాయరు కనుక ఆవిడకు ఉద్యోగం చేయవలసిన అవసరం రాలేదనుకుంటా. అందరం కబుర్లు చెప్పుకుంటూ అల్పాహారం ముగించాం. తర్వాత కాస్సేపు అక్కడే వుండి, వసుంధర పెండ్యాల (శ్రీ రాఘవయ్య – శేషారత్నం గార్ల పెద్ద కుమార్తె) గారి ఇంటికి బయలుదేరి వెళ్లాం. అప్పటికే అక్కడికి నేను చూడాలనుకుంటున్న శేషారత్నం టీచర్ గారు వచ్చి మా కోసం ఎదురు చూస్తున్నారు. మా పెద్దక్క దక్షిణ విజయపురి హైస్కూల్‍లో ఉద్యోగం లో చేరిన మొదటి రోజుల్లో శేషారత్నం గారు, రాఘవయ్య గారూ ఎంతో ప్రేమగా చూసుకునేవారు. మొదటినుండీ అక్కకు మార్గదర్శకులు, శ్రేయోభిలాషులు వారే! మమ్ములను కూడా స్వంత తమ్ముళ్ళలా చూసేవారు.
దురదృష్టావశాత్తు ఇప్పుడు మా అక్క లేదు, అక్కడ గుంటూరులో మాస్టారూ లేరు. అందుకే టీచర్ గారిని చూడగానే దుఃఖం ఆగింది కాదు. మిత్రుడు శ్యామ్‍కు, ఆయన లీల భార్యకు, వసుంధర కుటుంబం పూర్తిగా కొత్త. వసుంధర భర్త నాగేశ్వర రావు గారు నాకు కొత్త. అయినా ఎప్పటినుండో పరిచయం వున్నవాళ్ళలా కలిసి పోయి మాట్లాడుకున్నాము. ఇది అసలైన ఆత్మీయ కలయిక అనిపించింది నాకు. నాగేశ్వర రావు గారు ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న కళాశాల చూపించిన తర్వాత విజయవాడ వైపు బయలుదేరాం. అక్కడ మరో సహాధ్యాయని శ్రీమతి కామేశ్వరి మా కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నది. ఎన్నో సంవత్సరాల క్రితం నేను చూసిన గుంటూరు పూర్తిగా మారిపోయింది, వెడల్పైన రహదారులు ఆనందంగా ప్రయాణం చేయాలనిపించేలా వున్నాయి.
కామేశ్వరిని కూడా నేను 40 సంవత్సరాల తర్వాత చూసినట్లే. కబుర్లతో సమయం యిట్టే గడిచిపోయింది. కామేశ్వరి ‘లేబర్ ఆఫీసర్’గా పదవీ విరమణ చేసింది. కోడలు తయారు చేసిన రుచికరమైన భోజనం ఆరగించి సాయంత్రం సమయానికి విజయవాడలోని మా పెద్ద బావమరిది ఇంటికి చేరుకున్నాం. రాత్రికి అక్కడ బసచేసి ఉదయం హైదరాబాద్‌కు బయలుదేరాం. హైదరాబాద్ రింగ్ రోడ్ చేరుకున్నాక మిత్రుడు శ్యామ్ కారును కొంపల్లి వైపు మళ్ళించాడు. చిన్న స్వంత పని చూసుకున్నాక కొమ్మేపల్లి ప్రాంతంలో వున్న మా మరో మిత్రుడు టి. వరప్రసాద్‌ను (పారిశ్రామికవేత్త) కలుసుకున్నాం. గంటసేపు సరదా ముచ్చట్లతో గడిచిపోయింది.
ఇలాంటి ప్రయాణం చేయడం ఇంతమంది ముఖ్యులను కలుసుకోవడం నాకైతే బహుశః ఇదే మొదటిసారి. ఎంతో తృప్తిని, ఆనందాన్ని మిగిల్చిన గొప్ప ప్రయాణం ఇది. కేవలం ఇంటికే అంటిపెట్టుకుని ఉంటున్న నన్ను చైతన్యవంతుడిని చేసి ఇలా నన్ను తిప్పుతున్న శ్యామ్ కుమార్ తోనే ఇలాంటివి సాధ్యం అవుతాయి. మిత్రుడు శ్యామ్‌కు, శ్రీమతి లీలకు నా హృదయ పూర్వక కృతజ్ఞతలు చెప్పక తప్పదు మరి!
(మళ్ళీ కలుద్దాం)