నారాయణ.. నారాయణ

0
5

[dropcap]ఆ[/dropcap]కాశంలో హాహాకారాలు చాలా భయంకరంగా ఉన్నాయి. కానీ భూమి మీదకు వినపడటం లేదు!

ఆ భయంకర అరుపులు భూమిని సమీపించేస్తున్నాయి.. అయినా ఎవరికీ వినిపించడం లేదు!

రెండు ముళ్ళకొండలు లాంటి ఆకారాలు వికట నృత్యాలు.. చేస్తూ వస్తున్నాయి. వాళ్ల రెండు చేతులలో ఉన్న విచిత్ర శూలఖడ్గాలు రాపిడికే అగ్నిబండలు.. ఆ ప్రాంతమంతా వ్యాపిస్తున్నాయి. కానీ భూమ్మీద ఎవరికీ ఏ విషయమూ తెలియడం లేదు!

ఆ వచ్చే వాళ్ళు రాక్షస యమకింకరులు ప్రజృంభకాసురుడు.. విజృంభకాసురుడు!!

యమకింకరులు భూమ్మీద శరీర రహిత మానవులను యమలోకం తీసుకు వెళ్ళవలసి వచ్చిన ప్రతిసారి.. ఎక్కడికి వెళ్లాలో ఎవరిని తీసుకురావాలో వాళ్లకు చాలా ప్రస్ఫుటంగా మార్గం కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఎక్కడ దిగాలో ఎవరిని తీసుకువెళ్లాలో తెలియని.. విచిత్ర పరిస్థితి.. ఒక ఆత్మను తీసుకు రావలసి ఉంది.. అందుకు వాళ్లకు యమలోకంలోనే సంకేతాలు అందాయి.

భూలోకానికి ఎప్పటివలె బయలు దేరారు.. కొంత దూరం వరకూ చక్కగా కనిపించిన మార్గం ఎందుకు మూసుకుపోయిందో వాళ్లకు అర్థం కాలేదు.. పోనీ వెనక్కి వెళ్ళిపోదాం అంటే ఆ దారి కూడా కనిపించడం లేదు.. చిత్రగుప్తులవారి నుండి యమధర్మరాజుగారి నుండి ఏ విధమైన సంభాషణ వినిపించడంలేదు. మొత్తానికి భూమికి కొంచెం దూరంగా సమీపించేశారు.. ఖచ్చితంగా వాళ్లు దిగవలసిన ప్రాంతం అదే. పైగా అక్కడ చాలా మంది జనం మూగి రోదిస్తున్నట్టు ఉంది వాతావరణం. క్రింద మనుషులు చూచాయగా కనిపిస్తున్నారు కానీ శవం జాడలేదు. ..పోనీ.. దాని బాపతు ఆత్మ కదలికలు కూడా కనిపించడంలేదు. అలా గాలిలోనే తేలి తిరుగుతూ సమయం కోసం నిరీక్షిస్తున్నారు.. రాక్షస యమకింకరులు.

వాళ్లకు క్రిందనున్న పిచ్చిమొక్కలకొండ ప్రక్కన పెద్ద మర్రిచెట్టు దాని కింద రచ్చబండ.. ఊరి జనం అంతా అక్కడే ఉన్నారు. ఆ రచ్చబండ మీద కూర్చుని కొందరు వ్యక్తులు బాధగా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళందరి మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి.. గాలిలో తిరుగుతున్న రాక్షస యమకింకరులకు.

***

“గీ సెక్రధరం.. ఈ సరికి స్వర్గలోకం చేరిపోయి ఉంటాడు”.. అన్నాడు విశ్వనాధం.. ఆ రచ్చబండకు దగ్గరలో ఉన్న ఇంటిలో గంట క్రితమే సడన్‌గా చనిపోయిన.. చక్రధరాన్ని ఉద్దేశించి.

“ఖచ్చితంగా స్వర్గలోకం వెళ్తాడు.. ఎందుకంటే ఇతని ఆస్తి మొత్తం అన్నగారు కాజేసినా.. పోనీలే అని ఊరుకున్నాడు.. పుణ్యాత్ముడు..” అన్నాడు చందర్రావు.

“అంతేనా.. ఆ చలపతి.. మన సెక్రధరం మీన సరిహద్దు గోడ విషయంలో అనవసరంగా తప్పుడు కేసులు పెట్టి.. కోర్టు చుట్టూ మూడేళ్లు తిరిగేలా చేసి కొట్టులో వేయించాడు.. అయినా ‘ఎందుకులే వాడి తప్పు వాడే తెలుసుకుంటాడు’ అని సెమించేసాడు.. మన సెక్రధరం.. ధర్మాత్ముడు” అన్నాడు పైడిరాజు.

“అసలు విషయం మాట్లాడరా.. మన ఎమ్మెల్యే.. ఎలచ్చన్లలో.. తనకు అనుకూలంగా పని సేయ లేదని.. మన సెక్రధరం.. ఇంటిని మిషన్‍తో పడగొట్టిoచేశాడు.. నడిఈధిలో కాపురం పెట్టాడు పాపం మనోడు..” బాధగా అన్నాడు సుబ్బారావు.

“పెతీకారం.. పగ.. కసి.. నటించడం.. ద్వేషం.. అంతెందుకు మనసారా నవ్వడం.. ఇవేవీ తెలియవు.. దేవుడు లాంటోడు.. మనోడు ఇలా సడన్‌గా సచ్చిపోవడం.. అన్యాయం” బాధపడుతూ అన్నాడు వెంకటసుబ్బయ్య.

“అవున్రా.. ఆ మధ్య గీ సెక్రధరo కాడ.. నోటి మాటమీద నాలుగు లచ్చలు.. అప్పు తీసుకొని ‘నాకేo తెలియదు’.. అనేసాడు.. ఆ సుందర కేశవులు.. ఎంత అన్యాయం ఎంత మోసం?” అన్నాడు గంగరాజు.

“ఆ సుందరకేశవులు గాడు.. మన సెక్రధరానికి ప్రాణస్నేహితుడు.. అసలు ఇలా చేయొచ్చా?” కోపంగా అన్నాడు పెంచలయ్య.

“వాడు బాగానే ఉన్నాడు.. మన సెక్రధరo.. సచ్చిపోయాడు..” అన్నాడు ముత్యాలరావు.

“స్నేహితుడుని బాధ పెట్టడం దేనికని.. సమ్మగా ఊరుకున్నాడు.. మన సెక్రధరo. ఎంత అమాయకుడు.. సీమకు కూడా అపకారo సేయనోడు.. మనోడికి.. ఈ అకాలసావు.. ఎందుకొచ్చిందో.. దేవుడు అంత మంచోడు కాదు.”అన్నడు అప్పుడే వచ్చిన ఆదియ్య.

“మామ.. మన సెక్రధరo.. ఎన్నో దానధర్మాలు చేశాడు.. ఎందరికో తన డబ్బుతో పెళ్లిళ్లు కూడా చేయించాడు.. అనాథ ఆశ్రమం కట్టించాడు.. పెళ్లి చేసుకుంటే డబ్బులు ఖర్చవుతాయి అని పెళ్లి కూడా మానేశాడు.. ఆ డబ్బంతా అనాథలకు ఖర్చు పెట్టాడు. ఇట్లాంటి కుళ్ళుకపటం తెలియని మడిసి.. ఇలాంటి పాపపు మనుషులున్న నరలోకంలో బతకలేడు.. సచ్చిపోవడమే మంచిదేమో.. ఆ స్వర్గంలోనైనా హాయిగా ఉంటాడు..” అన్నాడు వెంకటసుబ్బయ్య.

“సరే నడండి.. సీకటి పడిపోతుంది.. ఆలస్యమైతే .. స్మశానంలో భయమేస్తుంది. చక్రధరం శవం మీద పడి ఏడ్చే వాళ్ళను దూరంగా పంపించండి.. మనకు అత్యంత ప్రీతిపాత్రుడైన మన చక్రధరాన్ని మన చేతులతో.. ఇలా ఇప్పుడు మట్టి చేయవలసి వస్తుందని మనం ఎవరం అనుకోలేదు. ఈ అకాల మరణం ఇతనికి ఎందుకు వచ్చిందో.. దేవుడు కూడా అంత మంచివాడు కాదు.”

“సరే చక్రధరం మహా పుణ్యాత్ముడు. మనవాడు చేరేది స్వర్గలోకం కదా.. మనందరం బాధ పడవలిసిన పని లేదు.. నడవండి నడవండి, శవాన్ని ఘనంగా సమాధి చేసే ఏర్పాట్లు చూడండి.”

***

అంతే ఇక్కడ భూమ్మీద చక్రధరం శవం ఘనమైన ఏర్పాట్ల మధ్య కదిలింది..

ఇదంతా పూర్తిగా విన్న రాక్షసయమకింకరులకు ఏమాత్రం అర్థం కాలేదు. తలలు విదిలించుకున్నారు..

“ఈ చక్రధరo.. స్వర్గం వెళ్తుంటే.. మరి మనం ఎవరి కోసం వచ్చినట్టు???”.. అని మనసులో అనుకుంటూ ముక్కులు రక్కుకుంటున్నారు.

గట్టిగా శరీరం గోళ్లతో బరుకుకొన్నారు. కాస్సేపటికి మగతతో అక్కడున్న పిచ్చిమొక్కలకొండమీద.. మత్తుగా పడిపోయారు.

***

అక్కడ స్వర్గలోకంలో శరీరంతో కూడిన ఆత్మచక్రధరం.. స్వర్గలోకపు ప్రధాన ద్వారం వరకు వెళ్ళిపోయింది. ఆత్మచక్రధరoని అక్కడి భటులు ఆహ్వానించారు.. లోపల్నుండి ప్రధాన భటులు మేళతాళాలతో బాజా భజంత్రీలతో.. డోలు సన్నాయిమేళాలతో.. వచ్చారు .. అప్సరసలు నాట్యమయూరిలు పూలదండలు పట్టుకొని రాగా నవరత్నాల పల్లకి తీసుకొని మరీ వచ్చారు.. నలుగురు బోయీలు.. అంతేకాదు వేదమంత్రాలు చదువుతున్నారు కొందరు గండపెండేర మహాపండితులు చక్రధరాన్ని లోపలకు తీసుకొని వెళ్ళడానికి.. మహదానంద పడిపోయాడు చక్రధరం.

ఇంతలో.. వెనకనుండి.. “ఏమోయ్ చక్రధరం ఇటు రా..” అన్న పిలుపు వినబడింది.. ఉలిక్కి పడి వెనక్కి తిరిగి చూసాడు చక్రధరం.

ఇంకెవరు నారద మహర్షివారు.. సమీపంలోని పెద్ద బంగారు పూలచెట్టు కింద వజ్రవైడూర్యముత్యపు బండపై.. విశ్రాంతిగా కూర్చున్న నారదమహర్షి వారిని.. సమీపించి..

“స్వామి నమస్కారం.. నా పేరు మీకు..” అన్నాడు చక్రధరం తల వంచి నమస్కారం పెడుతూ.

నారద మహర్షివారు “నీ పేరే కాదు.. నీ అష్ట కష్టాల జీవితమే నాకు తెలుసు..’సుఖీభవ భూలోక వాసి’..” అని అతనిని దీవిస్తూ..

“ఇక్కడ విధానాలూ నీకు తెలియవు.. వీళ్ళ కూడా వెళ్ళావ్ అనుకో.. నీకు సగం స్వర్గసుఖాలు మాత్రమే దక్కుతాయి.. అదే కాసేపు ఆగావనుకో.. నన్ను లోపలకి తీసుకు వెళ్ళడానికి సరాసరి ఇంద్రుడే దిగివస్తాడు. అప్పుడు నాతో పాటు నిన్ను కూడా చాలా ఘనంగా కాళ్లు కడిగి మరీ తీసుకు వెళతారు.. ఆ ఏర్పాటు నేను చేస్తాగా.. ఎందుకంటే నువ్వు చాలా ఉత్తముడు అన్న విషయం నాకు తెలుసు.

నేను నీ శ్రేయోభిలాషి అనుకో.. నీకు ఉపకారమే చేస్తాను.. ఇప్పుడు లోపల ఇంద్రుడుగారు గానా బజానాలతో రంభ ఊర్వశి మేనక తిలోత్తమ శృంగార రసకందాయంలో మునిగి తేలుతుంటాడయ్యా. అతను ఆ ఆనందం నుండి బయటపడడానికి ఒకపూట పడుతుంది. అంత వరకు మనం ఆగితే స్వయంగా ఇంద్రుడుగారు వస్తారు, నాతో పాటు నిన్ను కూడా ఆహ్వానిస్తారు. బంగారు పుష్పాలు సేవకులు చల్లుతుండగా మన ఇద్దరినీ లోపలకు తీసుకుపోతారు. అర్థమైందా? నేను కూడా ఆయన కోసమే ఆగాను అందాకా నాపక్కన కూర్చో.. రా” అంటూ అసలు రహస్యం వివరంగా చెప్పాడు నారద మహర్షివారు.. చక్రధరానికి.

చక్రధరం మరోసారి మహదానందపడ్డాడు. ఆ మహత్తర అవకాశం వదులుకోవడం దేనికని ఆ ముత్యపు బండపై నారద మహర్షులవారు పక్కగా కూర్చుని కబుర్లలో పడ్డాడు.

నారద మహర్షివారు.. చక్రధరo జీవితంలో జరిగిన సంఘటనలు మొత్తం అన్ని తన శక్తితో వివరించాడు.

“నీలాంటి నీతిమంతులు మానవుల్లో ఒక్కడు కూడా లేడయ్యా.. నీకు స్వర్గలోక ప్రాప్తి కలగడం అద్భుతం.. అత్యద్భుతం!!” అంటూ చక్రధరాన్ని పొగడ్తలతో ముంచేశాడు నారద మహర్షివారు.

నారద మహర్షి అంతటి వారు.. ముక్కు మొఖం తెలియని తనతో.. అంత చనువుగా ఉండటం.. ఒకింత సంభ్రమాశ్చర్యం, ఆనంద సంతోషదాయకం అనిపించింది.. చక్రధరానికి.

ఈసారి నారద మహర్షివారు.. చక్రధరానికి మరింత దగ్గరగా జరిగి అతని భుజంపై చేయి వేశాడు. చక్రధరం కూడా స్వర్గలోకంలో తనకు మంచి స్నేహితుడు దొరికినందుకు చాలా చాలా ఆనందించాడు.

ఎగిరి గంతు కూడా వేయాలి అనుకున్నాడు కానీ కాలు జారి మళ్లీ క్రింద భూలోకంలో పడతానేమో అని ఆగిపోయాడు.

నారద మహర్షివారు.. మాట్లాడుతూ..”ఇదిగో చక్రధర.. ఆత్మరూపంలో ఉన్న వారికి కొన్ని అద్భుత శక్తులు ఉంటాయి. అందుచేత ఈ పూట ఖాళీ సమయంలో.. నువ్వు మరోసారి మానవ లోకం వెళ్లి.. నువ్వు పూర్తి చేయాలనుకున్న పనులన్నీ పూర్తి చేసి రావచ్చుకదా.” అన్నాడు.

అయితే ఆత్మ రూపంలో కూడా తిరిగి మానవ లోకం వెళ్లడానికి అంగీకరించలేదు చక్రధరం.

“తననెవరూ అర్థం చేసుకోలేదని.. తనకు అందరూ అన్యాయం చేశారని.. తన మంచితనాన్ని లోకువగా తీసుకున్నారని” తెగ బాధపడి పోతూ చెప్పాడు నారద మహర్షివారికి.. చక్రధరం.

నారద మహర్షివారు.. అతని తల మీద చేతులు ఉంచి నిమురుతూ ఆప్యాయంగా ఓదార్చాడు. ‘నాకన్నీ తెలియదు అనుకుంటున్నావా..’ అంటూ అతను ఎవరెవరి వల్ల అష్ట కష్టాలు పడ్డాడో పేర్లతో సహా చెప్పి.. తన కంట్లో నుంచి వస్తున్న కన్నీళ్లను కూడా తన ఉత్తరీయంతో ఒత్తుకున్నాడు.. నారదమహర్షివారు.

“అయ్యయ్యో చక్రధరం.. నీ బాధ ఒకటి నా బాధ ఒకటీనా. ‘దేవరహస్యం’.. చెప్తా విను.. ఇప్పుడు నువ్వు భూలోకం వెళ్ళి ఖచ్చితంగా నీ శత్రువుల పని పట్టాలి.. అలా చేయలేదనుకో.. అక్కడే కాదు ఇక్కడ కూడా నువ్వు అమాయకుడవని నిన్ను చులకనగా చూస్తారు. అర్థం చేసుకో. నువ్వు వెళ్ళాక.. ఒకవేళ ఇంద్రుడు.. ద్వారం దగ్గరకు వచ్చి నువ్వు ఎక్కడ అని అడిగితే.. సాయంత్రానికి వచ్చేస్తావని నీ తరఫున నేను భరోసా ఇస్తాగా. నీలాగే నేను బ్రహ్మచారిని, నామాట నమ్మవయ్యా” అంటూ చేతిలో ఒట్టేసి మరీ చెప్పాడు నారద మహర్షివారు.

“స్వామి.. కేవలం మానవ లోకం నేను నా శత్రువులను ఎదుర్కోడానికి మాత్రమే వెళ్లాలి.. నేను వాళ్లను ఇప్పుడు అప్పుడు కూడా శత్రువులుగా భావించడం లేదు.. పాపం డబ్బు అవసరం కోసం నన్ను వంచించారు ప్రస్తుతం వాళ్లను కూడా నేను హితులే అనుకుంటున్నాను. పైగా నాకు ఇప్పుడు అక్కడ చాలా మంచి పేరు ఉంది.. భూలోకంలో.. నేను చచ్చిపోయాక అక్కడ నా స్నేహితులు.. హితులు నా పేరున భారీగా అన్నదానాలు చేసే ఏర్పాటులో ఉన్నారు. అంతేకాదు నా శిలావిగ్రహం కూడా ఏర్పాటు చేయబోయే ఆలోచన పెట్టుకున్నారు.. ఈ స్వర్గలోక మహత్యం వల్ల నాకన్నీ తెలుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులులో నా శత్రువుల అంతు చూడడం నాకు ముఖ్యం అంటారా..” అమాయకంగా అడిగాడు చక్రధరం.

నారద మహర్షివారు.. పెద్దగా నవ్వాడు

“పిచ్చి అమాయకుడా.. చాలా పెద్ద తెలివి తక్కువవాడివి నువ్వు.. నీ పగ తీర్చుకునేది నీకోసం కాదయ్యా బాబు.. నీ వెనుకనున్న నీ భూలోక వాసులు.. అంటే నీ వాళ్ళందరూ.. నువ్వు చచ్చాక కూడా.. తీర్చుకున్న పగ, ప్రతీకార చర్యలను.. తలచుకుంటూ తెగ నవ్వుకుంటూ విజయ గర్వంతో తల పైకెత్తుకుని తిరగడానికి అన్నమాట!.

నీకు ఎంత చెప్పినా అర్థం కావడం లేదు.. అమాయకుడు అసమర్థుడు పిరికిపంద మన చక్రధరం.. అని నీ మీద పడిన ముద్ర మీ వంశంలో అలా ఉండిపోకూడదయ్యా బాబు. అలా ఉండిపోతే నీ వంశంలో ఎవరికీ పెళ్లిళ్లు కూడా కావు.. నేను నీ శ్రేయోభిలాషిని అని చెప్తుంటే వినవే.. చచ్చిసాధించాడన్న కీర్తి నీకు దక్కాలిగా. ‘బ్రతికుండగా ఏమీ చేయలేకపోయినా చచ్చి సాధించాడు చాలా ఘనుడు’.. అని అందరూ నిన్ను కీర్తించటం ఎంత గొప్ప విషయమో నీకు పిసరంత కూడా అర్థం అయ్యి చావడంలేదు.. చాలా విచిత్రమైనమనిషివి నువ్వు ఎక్కడ దొరికావయ్యా బాబు.. ఇదిగో మనిద్దరం స్నేహితులమయ్యాం కనుక చివరగా చెప్తున్నా.. ఇది బంగారంలాంటి సమయం.. ఇప్పుడైతే.. సాయంత్రం లోపున ఎవరికీ కనబడకుండా పగ తీర్చుకునే శక్తి కూడా నీకు ఉంటుంది.. భూమ్మీద నీ వెనకాల ఉన్న వాళ్లకు పవర్ పెరగాలంటే నువ్వు మానవలోకం వెళ్ళి నీ తడాఖా చూపించక తప్పదుగాక తప్పదు. సమయం దాటితే నువ్వు అరిచి గీ పెట్టినా నీకు ఆ అవకాశం ఉండదు.. తర్వాత నీ ఇష్టం”.. అంటూ హితబోధ చేశాడు నారద మహర్షివారు.

చిట్టచివరికి చక్రధరం ఆలోచించి ఆలోచించి.. సాయంత్రం లోపల వాళ్లందరి అంతు చూసి వచ్చేలా ప్లాన్ సెట్ చేసుకుని అక్కడ పగ ప్రతీ కారం తీర్చుకుని తిరిగి ‘సమయం’ లోపున స్వర్గలోకం చేరటం గురించిన.. మరిన్ని క్లూ పాయింట్స్.. నారద మహర్షివారు ద్వారా సేకరించి.. నారద మహర్షివారు వద్ద తాత్కాలికంగా సెలవు తీసుకుని మానవలోకం బయలు దేరాడు.. వీరగంధం పూసుకున్న జైత్రయాత్ర చక్రవర్తిలా.

అలా వెళుతున్న చక్రధరానికి.. దారిలో స్వర్గ భటులు కనిపించారు.

“స్వామి.. చక్రధరం గారు.. అయ్యా.. ఎక్కడికి వెళ్తున్నారు.. మీరిలా వెనుతిరిగి వెళ్ళకూడదు” అoటూ అడ్డుపడ్డారు.

చక్రధరం వాళ్ళ మాట విననట్టుగా.. “ఇప్పుడే వస్తా”.. అంటూ క్షణం ఆగకుండా వాళ్ళ వైపు చూడకుండా వాళ్ళు చెప్పేది వినకుండా వెళ్ళిపోయాడు.

అతను అదృష్టవంతుడో.. దురదృష్టవంతుడో తెలియక తలలు బాదుకున్నారు స్వర్గభటులు.

***

ఇప్పుడు శరీరం కోల్పోయిన ఆత్మ చక్రధరం భూలోకంలో ప్రవేశించాడు స్వర్గలోకం నుండి.

అతి పెద్ద మర్రిచెట్టు మీద కూర్చుని తన శత్రువు రాకకోసం ఎదురు చూస్తున్నాడు..

కాసేపటికి తన అన్నగారు.. అదే దారి నుండి మోటార్ సైకిల్ మీద రావడం గమనించాడు.. ఉమ్మడిలో తనకు రావలసిన ఆస్తంతా భయ పెట్టి లాగేసుకుని తనను రోడ్డు పాలు చేసిన అతని మీద ముందుగా కక్ష తీర్చుకోవాలి. అవును.. అతడిని ఒక్కసారిగా చంపకూడదు. కళ్ళు రెండు పీకేయడం ద్వారా అతన్ని కురూపిని చేయాలి. తమ్ముడిని ఏడిపించినందుకు ప్రతిఫలం అనుభవిస్తున్నా.. అని కుళ్ళికుళ్ళి కుళ్ళి పోవాలి. బతికి ఉన్నన్నాళ్లూ కర్మ అనుభవించాలి.

అంతే.. మోటార్ సైకిల్ మీద వస్తున్న అన్నగారి మోటార్ సైకిల్ ఎదురుగా వస్తున్న ఎడ్లబండిని గుద్దేసిoది.. చక్రధరం అన్నగారు ఆ దెబ్బకు పైకి ఎగిరి క్రింద ఉన్న ఎద్దు కొమ్ములు మీద పడ్డాడు. దాంతో అతని 2 కనుగుడ్లు బయటకు ఊడిపడ్డాయి. నేలమీద పడ్డ 2 కనుగుడ్లతో.. కాసేపు బంతి ఆట ఆడుకుని ‘ఇ హే హే..ఇ హే హే..’ అంటూ ఆనందంతో పిచ్చిగా కేరింతలు కొడుతూ నవ్వుకున్నాడు ఆత్మచక్రధరo.

క్షణం ఆగకుండా మరొక ప్రతీకార చర్య కోసం రైలు పట్టాల దగ్గరకొచ్చాడు ఆత్మచక్రధరం.

అడుగో.. తనమీద తప్పుడు కేసులు పెట్టిన చలపతి.. ఇప్పుడు వాడి అంతo చూడాలి..

రైలు డోరు పట్టుకుని ప్రయాణిస్తున్నాడు చలపతి.

దుర్మార్గుడు.. ఇప్పుడు అతనిమీద కసి తీర్చుకోవాలి.. అంతే చలపతి చేయి జారి పోయింది.. రాడ్ నుండి చేయి పట్టుతప్పింది.. కాలు కూడా పట్టు తప్పిపోయింది. స్పీడుగా వెళుతున్న రైలు నుండి జారి.. దాని కింద పడి నుజ్జునుజ్జయి పోయాడు.. చలపతి..!!

“అ హ హ హ.. అ హ హ హ”.. వికటంగా, భీకరంగా.. నవ్వుకున్నాడు ఆత్మచక్రధరం. ఆ మహదానందంతో ఊరి చివర వాటర్ ట్యాంక్ సమీపించాడు.

అది కొత్త వాటర్ ట్యాంక్. ఆ రోజే ప్రారంభం. ఎమ్మెల్యే గారు వచ్చి 105 మెట్లు ఎక్కి వాటర్ ట్యాంక్ బటన్ నొక్కి ప్రారంభోత్సవం చేశాడు. ఆత్మచక్రంధరం తన పంజా విప్పాడు. ఎమ్మెల్యే గారికి ఒక్కసారిగా బీపీ పెరిగి కళ్ళు తిరిగాయి.. 105 మెట్లపై నుంచి నేలమీద పడ్డాడు.. బాడీ లెక్కలేనన్ని ముక్కచెక్కలు అయిపోయింది!!!

ఈసారి ఆత్మచక్రధరం గాలిలోనే సంతోషంగా గెంతులు వేశాడు. నారద మహర్షివారిని మనసులోనే వేనోళ్ళ కీర్తించాడు. స్వర్గలోకం చేరిన వెంటనే.. ముందుగా ఇంద్రునితో మాట్లాడి అతనికి భారీ ఎత్తున సన్మానం చేయాలని నిశ్చయించుకున్నాడు. నారద మహర్షివారు తనకు చేసిన ఉపకారం అంతా ఇంతా కాదు. స్వర్గలోకంలో కూడా తనకు ఒక మంచి స్నేహితుడు దొరుకుతాడు అని అసలు ఊహించలేక పోయాడు.

చక్రధరం ఈసారి తనకు గుర్తు వచ్చిన చాలా మంది మీద పగ తీర్చుకొని.. చివరగా.. తన దగ్గర నాలుగు లక్షలు అప్పు తీసుకుని.. తన కేమీ తెలియదని అబద్ధమాడిన ఆ సుందర కేశవులు పని పట్టాలి.. తన చావుకు పూర్తిగా కారణమైన మిత్ర ద్రోహి బ్రతికుండకూడదు.. ఆ సుందర కేశవులు మీద ద్వేషం.. ఉక్రోషం.. తీర్చుకోవాలి.. అని నిర్ణయించుకున్నాడు.

హోరున కురుస్తున్న వర్షంలో తాగి మారుతీ కారు మీద ఇంటికి వస్తున్నాడు సుందర కేశవులు. భలే సమయం.. ఆత్మచక్రధరం అది గమనించాడు. అంతే.. పెనుగాలి వచ్చింది.. అతిపెద్ద ఊడల చెట్టు.. బలమైనవేర్లతో సహా మొదలంటూ పైకి పెకలింపబడింది.. కారు మీద పడిపోయింది. ఆ కారు దొర్లి దొర్లి.. పెకలింపబడిన చెట్టు బాపతు అతి పెద్ద లోయ లాంటి గుంటలో.. పడి భూస్థాపితం అయిపోయింది!!!

ఆత్మ చక్రధరం పరవశించి పోయాడు. వంద బంగారు కుండల అమృతం తాగేసినoత సంబరపడిపోయాడు.

పగ పగ.. కసి కసి.. ద్వేషం ద్వేషం.. ప్రతీకారం మొత్తం తీరిపోయిన ఆనందంతో అతని ఆత్మ హృదయం శతకోటి స్వర్గ వెలుగులతో వెలిగి పోతున్నట్టుంది.

***

సాయంత్రం సమయం ఆసన్నం అవుతున్న కిరణాలు నారద మహర్షివారి నుండి రావడంతో.. ఆత్మ చక్రధరం ఆకాశమార్గాన స్వర్గపురం చేరుకోవడానికి ప్రయాణమయ్యాడు.

కొంచెం దూరం వెళ్ళాక ‘అతని అడుగులు’.. స్వర్గం దారివైపు పడే సత్తువ కోల్పోయినట్లు అయిపోయింది. అతనికి దారి కనిపించకుండా పోయింది. రెండు భయంకర ఆకారాలు మాత్రము వికటాట్టహాసంతో కనిపిస్తున్నాయి.

“ఎవరు మీరు..” అడిగాడు ఆత్మ చక్రధరం.

“యమభటులం.. రాక్షసయమకింకరులo.. నా పేరు ప్రజృంభకాసురుడు.. వీడి పేరు విజృంభకాసురుడు!!”.. చెప్పారు ఆ ఇద్దరు.

“నా పేరు చక్రధరం.. నేను యమలోకానికి కాదు వెళ్ళేది. స్వర్గలోకానికి. నేను ఇంద్రుని పక్కనే బంగారు సింహాసనం మీద కూర్చుని.. అతనితో ప్రత్యేకంగా మాట్లాడాలి. అతని చేత సన్మానం పొందాలి. రంభ ఊర్వశి మేనక తిలోత్తమలతో ఆడుకోవాలి.. బిందెలతో అమృతం తాగేయాలి. నాకు అడ్డు తొలగoడి.” అరిచాడు ఆత్మ చక్రధరం.

“నీ పేరే కాదు నీ జీవిత చరిత్ర ఇప్పుడే మాకు గాలి వర్తమానం ద్వారా ప్రభువుల నుండి చేరింది. నీ ఆచూకీ తెలియక మేము అష్టకష్టాలుపడి.. పిచ్చిమొక్కల ఆ కొండమీద అలా పడి ఉన్నాం ఇంత సేపు.. మమ్మల్ని నరక యమయాతనలు పెట్టావు నువ్వు.. స్వర్గానికి వెళ్లే ఛాన్సు నువ్వు పూర్తిగా కావాలని పోగొట్టుకున్నావు..” కోపంగా అన్నారు ఆ రాక్షసయమకింకరులు.

“అన్యాయం.. అన్యాయం.. నేను చాలా చాలా ఉత్తముడిని. చాలా దానాలు చేశాను. పుణ్యాలు చేశాను. పరోపకారాలు చేశాను. శత్రువులని క్షమించి వదిలివేశాను.. మా గాంధీగారు కన్నా ఉత్తముడుగా బ్రతికాను.”..అరిచినట్టు అన్నాడు ఆత్మచక్రధరం.

“అది నిజమే కాదన్నదెవరు?.. కానీ అది ఇందాకటి వరకు.. ఇంతకు ముందు నువ్వు స్వర్గలోకం వెళ్లేవరకే. ఇప్పుడు మళ్ళీ నువ్వు భూలోకం వచ్చి ఇక్కడ చేసిన పాపాల జాబితా ఇందాకటి పుణ్యాల జాబితాను మించిపోయింది. ఇప్పుడు తూకం వేస్తే పుణ్యాలు పది పాళ్ళు.. పాపాలు 90 పాళ్లు..!!!! మా చిత్రగుప్తుల వారు ద్వారా గాలివర్తమానం నుండి అన్ని విషయాలు వివరంగా తెలుసుకొని చూసుకుని లెక్కలు వేసుకుని మరీ మేము వచ్చాం.. నడు .. యమలోకానికి..”.. భయంకరంగా కేకబెట్టారు.. ఆ వచ్చిన రాక్షస యమకింకరులు..తమ భుజాలపై ఉన్న బలమైన ఇనుపముళ్ల గదాదండాలను.. చూపిస్తూ.

“ఉండండి.. ఇదంతా నారద మహర్షులవారికి పూర్తిగా తెలుసు. ఆయన చెప్పినట్టే తు.చ.తప్పకుండా చేశాను ఏడాయన??”.. అంటూ చుట్టూరా వెదికాడు చక్రధరం.. ఎక్కడా కనిపించలేదు నారద మహర్షివారు.

“ఇది అన్యాయం.. ఇది అన్యాయం.. స్వామి నారదమహర్షి..” గట్టిగా అరిచాడు ఆత్మచక్రధరం.

“ఏమోయ్.. చక్రధరం.. భూలోకంలో ఎవరైనా చెడు మాటలు చెబితే వినేవాడివి కానీ ఆచరించే వాడివి కాదు. నీ ఆత్మబోధను బట్టి నడుచుకునేవాడివి. ఆ రకంగా అక్కడ పుణ్యాత్ముడు అయ్యావు. కానీ స్వర్గంలోకం వెళ్ళాక పూర్తిగా పప్పులో కాలు వేసావు. ఈ లోకాల్లో రహస్యం ఏమీ ఉండదు కనుక అన్ని విషయాలు అందరికీ తెలుస్తాయి.. ఆ స్పృహ తోనే చెప్తున్నాం. ఆ నారద మహర్షివారు.. పనిపాటలేని వ్యక్తి అయ్యా.. ఆ విషయం నీకే కాదు అన్ని లోకాల్లో అందరికీ తెలుసు. ఆ మహానుభావుడు రెచ్చగొడితే నువ్వు రెచ్చిపోవాలా?? నీ మనసాక్షి ఏమైందయ్యా.. నీ ఇంగిత జ్ఞానం ఏమైందయ్యా చక్రధరం????”.. గట్టిగా బుద్ధి చెప్పినట్టు అన్నారు ఆ రాక్షసయమకింకరులు.

చక్రధరానికి జరిగింది అర్థం అయింది. తనకు జరిగిన అన్యాయానికి లబోదిబోమన్నాడు. వెక్కి వెక్కి ఏడ్చాడు.

“ఇకనైనా అనవసరపు ఆలోచనలు మానుకొని మాతో మర్యాదగా యమలోకం వచ్చేయి. నడిపించుకు తీసుకువెళతాం.. లేదంటే ఒక్కతోపు తోచాం అంటే.. యమలోకపు మొదటి ముళ్ళ మెట్టు మీద పడతావు.” భయపెట్టారు.. రాక్షస యమకింకరులు.

ఆకాశంలో మబ్బులు చాటునుండి ఇదంతా గమనిస్తున్న నారద మహర్షివారు.. కడుపు నిండిన ఆనందంతో తన చిరుబొజ్జను రెండు చేతులతో నిమురుకుంటూ.. మళ్లీ మబ్బుల చాటుకి మాయమైపోయాడు.

కాసేపటికి.. చక్రధరం యమలోకంలో సలసల కాగే నూనెమూకుడులో మలమల మరిగి పోతున్నాడు. చాలామంది యమభటులు.. అతను మూకుడు నుండి బయటకు వచ్చాక త్రికోణపు పళ్ళు ఉన్న రంపపుకత్తులతో.. పరపరా, కరకర ముక్కలుగా కొయ్యడానికి సిద్ధంగా ఉన్నారు.

ప్రతి యుగంలోనూ.. ప్రతి లోకంలోనూ, ప్రతి ఊరిలోనూ, ప్రతి వీధిలోనూ.. నారద మహర్షి కాకపోయినా అలాంటి మహానుభావులు..  ఉంటూనే ఉంటారు.. అలాంటి వాళ్ళ నుండి తప్పించుకున్న వాడి బ్రతుకు మాత్రమే స్వర్గతుల్యం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here