[dropcap]జీ[/dropcap]వులలో నిర్జీవులలోని అంతరాత్మను దర్శించి ప్రదర్శించే జె. శ్యామల గారి ‘అన్నింట అంతరాత్మ’ శీర్షికలో ఈ వారం ‘దారి’ అంతరంగం తెలుసుకుందాం.
***
‘నగరానికి లేవు రాత్రింబవళ్లు’ అంటారు, కానీ నిద్దురే ఎరుగని రహదారిని.. నన్ను గుర్తించరు ఈ మనుషులు. అందులోనూ జాతీయ రహదారినేమో వాహనాలు వేగంగా దూసుకెళుతూ నిరంతరం నా ఒంటిని హూనం చేస్తుంటాయి. నా బాధ ఎవరికి చెప్పుకోను. ఈ ‘కియా’ కారులో ప్రయాణిస్తున్న వాళ్లు తెగ కబుర్లు చెప్పుకుంటున్నారు. వాళ్ల మాటలు.. అదీ నా గురించే కావడంతో నా మనసు అక్కడే చిక్కుకుపోయింది. ‘ఇప్పుడైతే జీపీఎస్ సాయంతో ఎక్కడికంటే అక్కడికి అది దారి చూపుతూ, చెపుతూ ఉంటే హాయిగా వెళ్లిపోతున్నాం గానీ ఇదివరకు ఎంత కష్టంగా ఉండేదో’ బామ్మగారు అంది. ‘దారి చూపిన జీపిఎస్! నీ మేలు ఎన్నడు మరువను!’ కారు నడుపుతున్న వ్యక్తి రాగయుక్తంగా పాడాడు. అంతా నవ్వారు. ‘పార్థూ! సందర్భోచితంగా బాగుందిరా’ ఇంకో ఆయన మెచ్చుకున్నాడు. ‘థాంక్యూ మామయ్యా! నువ్వు పద్యాలు బాగా పాడుతావుగా.. ఓ పద్యం అందుకో’ అన్నాడు పార్థు. ‘ఏదో ఎందుకు? ‘దారి తప్పడం’ గురించిన పద్యమే ఉంది. ప్రవరాఖ్యుడు హిమాలయాల్లో దారి తప్పడం గురించి మనుచరిత్రలో అల్లసాని పెద్దన రాసిన పద్యం.. వినండి..’
ఎవ్వతె వీవు భీత హరిణేక్షణ యొంటి చరించెదోటలే
కివ్వనభూమి భూసురుడ నే ప్రవరాఖ్యుడ ద్రోవతప్పితిం
గ్రొవ్వున నిన్నగాగ్రమునకుం జనుదెంచి పురంబు జేర నిం
కెవ్విధి గాంతు దెల్పగదవే తెరువెద్ది శుభంబు నీకగున్
వింటుంటే నాకు సరదాగా అనిపించింది.
‘భలే మామయ్యా, బాగా పాడావు. పాపం ఆ ప్రవరుడు అలా అడిగి కొత్త కష్టాలు కొని తెచ్చుకున్నాడు’ నవ్వుతూ అన్నాడు పార్థు.
‘ఏం కష్టాలు, నాకర్థం కాలేదు’ పార్థు పక్కన ఉన్న అతడి భార్య అంది.
‘ఏం ఉంది.. వరూధిని అనే ఆ పిల్ల అతడు అందరిలాంటి వాడే అనుకొని, ‘ఏదో వంకతో నాతో మాట్లాడాలని కాకపోతే నువ్వు వచ్చిన తోవ నీకే తెలీదా? ఒంటరిగా ఉన్న అమ్మాయంటే అందరికీ అలుసే’ అంటూ క్లాసు పీకింది. దారి చెప్పకపోగా, అతడికి లైనేస్తూ.. అక్కడే, తనతోనే ఉండిపొమ్మని బలవంతం చేసింది’ చెప్పింది బామ్మ.
‘అత్తయ్యా! మీరు కూడా లైనేయడం లాంటి మాటలు వాడుతున్నారా?’ నీలిమ అనడంతో అంతా నవ్వారు.
‘టీవీ ప్రభావం’ అన్నాడు తాతయ్య.
‘ఆ తర్వాత ఏమైందీ?’ మనవడు కాబోలు అడిగాడు.
‘ఓర్నీ.. నువ్వు సస్పెన్స్ భరించలేకపోతున్నావా? సరే విను. చివరకు ప్రవరుడు దైవమే దిక్కని అగ్నిదేవుడిని ప్రార్థించి వాళ్ల ఊరు అరుణాస్పదపురం చేరాడు’ చెప్పింది బామ్మ.
‘అంతేనా’ నిరుత్సాహపడ్డాడు మనవడు.
అది చూసి అంతా నవ్వారు. అదంతా నాక్కూడా సరదాగా అనిపించింది.
‘అసలు హిమాలయాలకు ఎలా వచ్చాడో చెప్పు. విమానంలోనా?’ మళ్లీ అడిగాడు అజయ్.
‘విమానంలో కాదు కానీ, ఆకాశ మార్గంలోనే. ప్రవరుడు, తమ ఇంటికి అతిథిగా వచ్చిన సిద్ధుడు ఇచ్చిన పాదలేపనం సాయంతో గాల్లో ఎగిరి చేరాడు’ వివరించాడు.
‘లేపనమా? అంటే’ అన్నాడు అజయ్.
‘క్రీమ్ అనుకో. నువ్వు మళ్లీ ఇంకో సందేహం అడుగుతావు. ఎందుకొచ్చింది, ముందే చెప్పేస్తా.. ఆ క్రీమ్ హిమాలయాల మంచుకు కరిగిపోవడంతో, తిరిగి వెళ్లడం సమస్య అయింది. సరేనా?’ అన్నాడు మామయ్య.
‘ఓ! అర్థమైంది’ అన్నాడు అజయ్.
‘అన్నా! ఈ కుందేలు, క్యారెట్లను చేరుకునే దారి నాకు సగం వరకే వచ్చింది. నువ్వు చూడు’ పజిల్స్ పుస్తకాన్ని అజయ్‌కి అందించింది పాప.
‘అనన్యా! ప్రయాణంలో కూడా పజిల్సేనా..’ అంటూనే క్షణంలో సరైన దారిని గుర్తించి చూపించాడు అజయ్.
‘భలే’ అంటూ మరో ‘దారి కనుక్కోండి’ పజిల్ చూడసాగింది అనన్య.
‘ఇలా దారులు కనుక్కునే ఆటలు కూడా ఉన్నాయన్న మాట’ అనుకున్నాను నేను.
అంతలో ‘మన కాశ్మీర్ యాత్ర గుర్తుందా?’ పార్థు భార్య అతడిని అడుగుతూనే ‘అక్కడ గుల్మార్గ్ చూసి తీరాలి. గుల్మార్గ్ అంటే పూలదారి అని అర్థం. అక్కడ ఉండే పుష్ప వైవిధ్యం మరెక్కడా ఉండదు. రకరకాల రంగులు, రకరకాల ఆకృతుల్లో అద్భుతంగా ఉంటాయి. మొగల్ చక్రవర్తి జహంగీర్, తన భార్యలకు బహుమతులుగా అందమైన పూలను ఇవ్వాలని, వాటికోసం గుల్మార్గ్ వచ్చాడట. ఒక్కొక్క భార్యకు, ఒక్కొక్క ప్రత్యేక పుష్పాన్ని ఎంపిక చేసుకున్నాడని చదివాను’ అంది.
‘నీలూ! చక్రవర్తి తలచుకుంటే పూలకు కొదవా?’ అన్నాడు పార్థు.
‘దారుల్లో కూడా రోడ్డు మార్గాలే కాక డొంక దారులు, కొండ దారులు, అడవి దారులు, సముద్ర దారులు, సొరంగ దారులు ఎన్ని ఉన్నాయో’ అన్నాడు మామయ్య.
‘అవునా’ అనుకున్నాను నేను.
‘వాస్కోడిగామా, ఇండియాకు సముద్ర మార్గాన్ని కనుగొన్నాడని చదివాను’ మనవడు అజయ్ అన్నాడు.
‘దానికి కారణం తెలుసా?’ అడిగాడు తాతయ్య.
‘తెలీదు తాతయ్యా’ అన్నాడు అజయ్.
‘ఒకప్పుడు అరబ్ దేశంలోని ముస్లిం రాజులు, ఆసియా ఖండంలోని వర్తక, వ్యాపారుల నుండి వచ్చే లాభాలు తామే పొందాలన్న ఉద్దేశంతో యూరోపియన్ దేశాలను, ఆసియా ఖండం వెళ్లకుండా అడ్డుకునే వారు. పోర్చుగీస్ వారికి అదొక పెద్ద అవరోధం అయింది. దాంతో ఆ దిశగా వారు ప్రయత్నాలు మొదలుపెట్టారు. పధ్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో వాస్కోడిగామా భారతదేశానికి సముద్ర మార్గం కనుగొనడంలో విజయం సాధించి, మన దేశానికి వచ్చిన తొలి యూరోపియన్ గా నిలిచాడు. అయితే అంతకు ముందు కూడా ఎందరో నావికులు ఈ ప్రయత్నం చేశారు. పధ్నాలుగు వందల తొంభై రెండులో కొలంబస్ సముద్ర ప్రయాణం సాగించి ఓ ద్వీపం చేరుకుని, అది ఇండియా సమీప ద్వీపంగా పొరబడి తమ జెండా ఎగురవేశాడు. కానీ తర్వాత తాను చేరుకున్నది ఉత్తర అమెరికా సమీప ద్వీపమని తెలుసుకున్నాడు. అలా అనుకున్నదొకటి, అయినది వేరొకటి అన్నట్లు కొలంబస్ భారత్‌కు బదులు అమెరికాను కనుగొనడం జరిగింది’ చెప్పాడు తాతయ్య.
‘భలే’ అన్నాడు అజయ్.
‘మనిషి ఎంత సాహసవంతుడో’ అనుకున్నాను నేను.
‘సముద్ర దారి’ అంటే నాకు రామాయణం గుర్తుకొస్తోంది. శ్రీరాముడు కూడా లంకపై దండెత్తే సందర్భంలో సముద్రాన్ని దాటడానికి దారి కోసం యోచించాడు. శ్రీరాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, హనుమంతుడు, అంగదుడు, నలుడు, నీలుడు.. ఇంకా ఎందరెందరో కలిసి దక్షిణ సముద్ర తీరాన్ని చేరారు. శ్రీరాముడు ముందు సాత్విక పద్ధతిలో ఉపవాస దీక్షతో సముద్రుడిని ఆరాధించి, దారి ఇవ్వమని ప్రార్థిస్తానని, అందుకు సముద్రుడు ఒప్పుకోకుంటే రాజస పద్ధతిలో తన బాణాగ్నితో సముద్ర జలాలను ఇంకింప చేస్తానని చెప్పాడు. అన్నతో పాటు లక్ష్మణుడు కూడా ఉపవాస దీక్ష చేపట్టాడు. దాంతో సముద్రుడు ప్రత్యక్షమై అందరికీ తెలిసే విధంగా దారి ఇవ్వడం సమంజసం కాదని, వానర సేనలోని నలుడు గొప్ప శిల్పి అని, అతడు సముద్రంలో కొండరాళ్లు, చెట్లు, చేమలు వేస్తే వారధి ఏర్పడుతుందని వివరించాడు. వెంటనే నలుడు, వానర వీరులు తెచ్చిన కొండలను సముద్రంలో వేసి వంద ఆమడల పొడవు, పది ఆమడల వెడల్పుతో గట్టి వారధిని నిర్మించాడు. అలా రామసేతు ఏర్పడింది’ అంది బామ్మ.
‘అవును, ఆ మహత్కార్యంలో ఆఖరికి చిన్న ప్రాణి ఉడుత కూడా తన వంతు సాయం చేసిందట. భారతంలో కూడా వసుదేవుడు, కంసుడి నుండి పసి కందైన చిన్ని కృష్ణుని రక్షించుకోవడం కోసం గంపలో బిడ్డని పెట్టుకుని నందుడి ఇంటికి, యశోద వద్దకు చేర్చబోయాడు. యమునా నదిని దాటితేనే అక్కడకు చేరగలడు. ఈ సందర్భంలో పోతన ఓ చక్కని పద్యం రాశాడు.
ఆ శౌరికి దెరు వొసగె బ్ర
కా శోద్ధత తుంగ భంగ కలిత ధరాశా
కాశ యగు యమున మును సీ
తేశునకు బయోధి త్రోవ యిచ్చిన భంగిన్
ఎగసిపడే పెద్ద అలలతో భూమి నుంచి ఆకాశం దాకా నలుదిక్కులను కమ్ముకుంటూ ప్రవహిస్తున్న యమున, పూర్వయుగంలో శ్రీరామునికి లంకాపురి వెళ్ళడానికి సముద్రుడు దారి ఇచ్చినట్లే, తాను కూడా శౌరికి అంటే శ్రీకృష్ణుడికి దారి ఇచ్చింది’ చెప్పాడు మామయ్య.
అది వింటుంటే దేవుడికైనా దారి అంటే నేను అవసరమే అనే సంతోషంతో కూడిన గర్వ భావన ఓ క్షణం నాలో తలెత్తింది. ఆ విధంగా నేనూ సాయపడ్డానని కూడా అనిపించింది.
‘సినిమాలలో యమునా నది మధ్యకు చీలి దారి ఇచ్చే దృశ్యం ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది. అదే వాస్తవం అయితే అది ఇంకెంత అద్భుతం’ అంది బామ్మ.
‘అన్నట్లు ఆ మధ్య ‘నాలుగు దారులు’ అనే ఆధ్యాత్మిక సంబంధ కథ చదివాను’ అన్నాడు తాతయ్య.
‘కథా, అయితే చెప్పు’ అన్నాడు పార్థు.
‘వినండి మరి.. ఒక జ్ఞానాన్వేషి మోక్షం పొందాలని ఎందరో పెద్దల బోధనలు విని, మరెన్నో అవరోధాలు దాటుకుంటూ చివరికి మోక్ష మార్గం చేరాడు. అక్కడ అతడికి నాలుగు రోడ్ల కూడలి కనిపించింది. అతను అది చూసి ఎటు వెళ్లాలా అని అయోమయంలో పడ్డాడు. మొదటి దారిలో నడుద్దామా అనుకున్నాడు. వెంటనే అక్కడ ఒక సౌందర్యరాశి ప్రత్యక్షమై ‘ఎక్కడికి వెళ్లాలి’ అని అడిగింది. ‘మోక్షానికి’ బదులిచ్చాడు. ‘అయితే ఈ రోజు హాయిగా నాతో గడుపు. అప్పుడు నిన్ను ఈ దారి నుంచి వెళ్లడానికి అనుమతిస్తాను’ అంది. అందుకతడు ‘నేను అటువంటి అధర్మపు పని చేయను’ అంటూ రెండో దారి వైపు వెళ్ళాడు. అక్కడ ఒకతను మేకను పట్టుకుని కనిపించి, ‘ఎక్కడికి వెళుతున్నావు?’ అని అడిగాడు. బదులు చెప్పాడతడు. వెంటనే ఆ వ్యక్తి, ‘ముందు ఈ మేకను చంపి, వండుకుని తృప్తిగా తిను. అప్పుడు ఈ దారి గుండా వెళ్ళవచ్చు’ చెప్పాడు. ‘జీవహింస చేయను. మరో దారిలో వెళతా’ అంటూ ఆ జ్ఞాని మూడో దారి వైపు అడుగేశాడు. అక్కడ ఓ వ్యక్తి పాచికలతో ప్రత్యక్షమై ‘ఎక్కడికి వెళుతున్నావు?’ అడిగాడు. జ్ఞాని బదులిచ్చాడు. అది విని ఆ వ్యక్తి ‘ముందు నాతో జూదమాడు. లేదంటే ఇటు వెళ్ళడం కుదరదు’ అన్నాడు. ‘జూదం చెడ్డ వ్యసనం. నేను ఆడను. నాలుగో దారిలో వెళతా’ అంటూ అటు నడిచాడు. తీరా చూస్తే అక్కడ ఓ మనిషి సారా కుండతో నిలబడి ఉన్నాడు. మిగిలిన ముగ్గురి మాదిరే ఎక్కడికని ప్రశ్నించి, జవాబు విని, ‘వెళ్దువులే, ఇప్పటికే చాలా అలిసిపోయావు. ఇదుగో ఈ మద్యం సేవించి విశ్రాంతి తీసుకుని వెళ్లు. లేదంటే నీకు ప్రవేశం లేదు’ అన్నాడు. జ్ఞాని ఆలోచించాడు. మద్యపానం చెడ్డది. కానీ ఎదురైన నాలుగు పాపపు పనుల్లో ఇతరులకు ఎక్కువ కీడు చేయనిది మద్యపానమే. అలా చేస్తే అయినా మోక్షం చేరుకోవచ్చు’ అనుకుని మద్యం సేవించాడు. వెంటనే మత్తు ఆవహించింది.. ఆపైన ఉన్మత్తతతో పక్కనున్న మేకను చంపి కడుపు నింపుకున్నాడు. ఆ తర్వాత మొదటి దారిలోని సుందరి కనపడడంతో ఆమెతో గడిపాడు. చివరకు జూదం కూడా ఆడాడు. అలా వెలుగు దారిని కోల్పోయి, చీకటి దారిలో చిక్కుకున్న ఆ జ్ఞాని ఐహిక ప్రపంచంలోనే ఉండిపోయాడు’ ముగించాడు తాతయ్య.
‘పాపం జ్ఞాని’ మనవడు అనడంతో అంతా నవ్వారు.
‘మా దారులు ఇలా పరీక్షలు కూడా పెడతాయన్న మాట’ అనుకున్నాను నేను.
‘ఆకాశంలో ‘మిల్కీ వే’ ఉంటుందని రఘు గాడు ఓ సారి చెప్పినట్టు గుర్తు’ అన్నాడు అజయ్.
‘అవును. ‘మిల్కీ వే’ని తెలుగులో పాలపుంత అంటారు’ చెప్పింది నీలిమ.
‘పుంత అంటే’ అడిగాడు అజయ్.
‘ఒక పదానికి అదే అర్థాన్నిచ్చే అనేక పదాలు ఉంటాయి. వాటిని పర్యాయ పదాలు అంటారు. ఇప్పుడు దారి అనే పదానికి తోవ, తెరువు, మార్గం, పథము, పుంత అనేవి పర్యాయ పదాలన్నమాట. చీకటి రాత్రి పొలాలలో లేదంటే డాబా పైన నిలుచుని ఆకాశంలోకి చూస్తే ఆ చివర నుంచి ఈ చివర వరకు ఒక నక్షత్ర సమూహం దారి పరుచుకున్నట్లు కనిపిస్తుంది. అదే పాలపుంత. నిత్యం సూర్యుడు తన గ్రహాలతో కలిసి పాలపుంత కేంద్రకం చుట్టూ అత్యంత వేగంగా తిరుగుతుంటాడు, ఇంకా కొన్ని కోట్ల నక్షత్రాలు కూడా పాలపుంత కేంద్రకం చుట్టూ తిరుగుతుంటాయి’ మామయ్య వివరించాడు.
‘అలాగా’ అన్నాడు అజయ్.
ఆ తర్వాత నీలిమ మాట్లాడుతూ ‘ప్రపంచంలో అతి పొడవైన నడక దారి గురించి తెలుసా?’ అడిగింది.
‘నువ్వు చెప్పందే’ నవ్వుతూ అన్నాడు పార్థు.
‘దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ నుంచి రష్యా లోని మగడాన్ వరకు ఉంటుందీ మార్గం. దీని పొడవు పధ్నాలుగు వేల మైళ్లు. సుమారు పదిహేడు దేశాల మీదుగా సాగే ఈ మార్గంలో కేవలం నడక లేదంటే సైకిల్‌పై ప్రయాణం చేయవచ్చు. మధ్యలో ఎన్నో ప్రకృతి సిద్ధ సుందర ప్రదేశాలు, అడవులు, ప్రపంచ వింతలు, ప్రమాదకర ప్రాంతాలు ఉంటాయి. అత్యంత వేడి, అత్యంత చలి.. ఇలా భిన్న వాతావరణాలు కూడా ఎదురవుతాయి. అన్ని విశేషాలను గమనిస్తూ ఈ దారిలో ప్రయాణించాలంటే మాత్రం రెండేళ్లకు పైనే పడుతుంది’ చెప్పింది నీలిమ.
‘బాగుంది. యాత్రలకే జీవితాన్ని అంకితం చేసేవారు వెళ్లగలరేమో’ మామయ్య అన్నాడు.
‘ఎంత పెద్ద మార్గమో’ అనుకున్నాను నేను.
‘ఒకప్పుడు ఎక్కడికైనా ప్రయాణాలంటే భయపడేవారు. తిరునాళ్లలో, పుణ్యక్షేత్రాలలో పిల్లలు తప్పిపోవడం జరిగేది’ అంది బామ్మ.
‘పూర్వం ఏమిటి? ఇప్పుడూ తప్పిపోతున్నారు, పెద్దలు కూడా. ఆమధ్య ఓ ముగ్గురు వ్యక్తులు డాక్యుమెంటరీ తీయాలని, నలుగురు పోర్టర్లతో కలిసి రుద్రప్రయాగ్ జిల్లాలోని ఎత్తైన కొండల్లో ఉన్న పాండవ్ షేరా ప్రాంతానికి ట్రెక్కింగ్‌కి వెళ్లారు. తీరా వెనక్కి తిరిగి వచ్చే దారి తెలియక అక్కడ చిక్కుకుపోయారు. వారి దగ్గర ఉన్న ఆహారం, మంచి నీళ్లు కూడా అయిపోవడంతో సహాయం కోసం ఎస్.ఓ.ఎస్.కు అత్యవసర సందేశం పంపారు. వెంటనే ఉత్తరాఖండ్ విపత్తు ప్రతిస్పందన దళం వారు హెలికాప్టర్‌లో వెళ్లారు. కానీ అంత ఎత్తుకు చేరుకోలేక పోయారు. చివరకు భారత వాయుసేన వారు చీతా హెలికాప్టర్‌లో వెళ్లి వారిని వెనక్కి తీసుకువచ్చారు’ చెప్పింది నీలిమ.
‘బాబోయ్’ అన్నాడు అజయ్.
‘మనుషులే కాదు, రైళ్లు కూడా దారి తప్పుతాయి’ అన్నాడు మామయ్య.
‘నువ్వు మరీ చెప్తావు. రైలు దారి తప్పడమేమిటి?’ అన్నాడు తాతయ్య.
‘అవును. ఆశ్చర్యంగా ఉంది’ అంది బామ్మ.
‘నిజంగానే జరిగింది. కొంత కాలం కిందట దేశవ్యాప్తంగా రైతులు ‘కిసాన్ యాత్ర’ పేరుతో నిరసన ర్యాలీ నిర్వహించారు. దానికి మహారాష్ట్ర నుంచి పదిహేను వందల మంది రైతులు వచ్చారు. వారు తిరిగి వెళ్ళేటప్పుడు రైలు దారి తప్పి, నూట అరవై కి.మీ. వేరు దారిలో ప్రయాణించి, మధ్యప్రదేశ్ లోని బాన్మోర్ చేరుకుంది. రైతులు ఆందోళన చెందారు. ఎందుకలా జరిగిందని ఆరా తీస్తే మధుర స్టేషన్ వద్ద రైల్వే అధికారులు తప్పుడు సిగ్నల్ ఇవ్వడం వల్లే అని తెలిసింది’ చెప్పాడు మామయ్య.
‘ఇలా అయితే కష్టమే’ అంది బామ్మ.
‘ఇలా కూడా జరుగుతుందన్నమాట’ అనుకున్నాను నేను.
‘ప్రదేశాల మధ్య కొండలు అడ్డుగా ఉండి, దారి లేక దూరాలు పెరిగిపోవడం కూడా పెద్ద ఇబ్బందే. బీహార్‌లో దశరథ్ మాంఝీ అనే ఆయన తానొక్కడే ఇరవై రెండేళ్ల పాటు కొండను తొలిచి తమ గ్రామానికి రహదారి నిర్మించాడు. గతంలో ఆ దారి లేకే అతడి భార్య కొండ ఎక్కి దిగుతూ పడిపోయి గాయాలపాలైంది. ప్రమాదంలో చిక్కుకున్న భార్యను పట్నానికి సకాలంలో తీసుకెళ్ళలేక పోవడంతో భార్య కన్నుమూసింది. ఆ విషాద అనుభవమే దశరథ్‌ను కొండను తొలిచేందుకు ప్రేరేపించింది. బీహార్‌కే చెందిన మరో వ్యక్తి లౌంగీ బూయియా, గయ ప్రాంతంలోని కోటీల్వా గ్రామానికి చెందినవాడు. వర్షాకాలంలో ఆ ఊరి సమీప కొండలపై కురిసిన వాన నీరు వృధాగా పోవడం గమనించి, ముప్ఫై ఏళ్లపాటు కాలువ తవ్వి కొండనుంచి నీరు ఊరి చెరువుకు చేరే దారి ఏర్పాటుచేశాడు’ చెప్పాడు పార్థు.
‘అందరి కోసం ఒక్కడు’ అనే మాట ఇలాంటి వారికి సరిగ్గా సరిపోతుంది’ అంది నీలిమ.
మనిషి జీవనంలో దారుల ప్రాముఖ్యత ఇంత ఉందని తెలిసి నాకు ఆశ్చర్యానందాలు కలిగాయి.
‘దారుల్లో సొరంగ దారులు ప్రత్యేకమైనవి. గతంలో విజయవాడ శివారు ప్రాంతాలయిన భవానీపురం, విద్యాధరపురం పరిసర ప్రాంతాల వారు అతి తక్కువ సమయంలో నగరంలోకి రావాలంటే ఉన్న ఏకైక మార్గం సొరంగమే. అరవయ్యవ దశకంలో నిర్మితమైంది ఈ మార్గం. అప్పట్లో చుట్టుపక్కల గ్రామీణులు సొరంగాన్ని బెజ్జంగా వ్యవహరించేవారని, బెజ్జం ఉన్న ఊరు కాబట్టి బెజ్జంవాడ అయిందని, కాలక్రమంలో బెజవాడగా మారిందని కొందరంటారు. అయితే వేసవిలో ఇక్కడి అధిక ఉష్ణోగ్రతలు చూసి బ్రిటిష్ వారు విజయవాడను, బ్లేజ్‌వాడ అన్నారని, అదే క్రమంగా బెజవాడ అయిందని కూడా అంటారు. అది వేరు సంగతి’ అన్నాడు తాతయ్య.
‘బాగుంది. మన దేశంలో సొరంగ మార్గాలకు కొదువలేదు. రాజుల పాలనా కాలంలో కోటలలో ఈ సొరంగ మార్గాలు పరిపాటిగా ఉండేవి. ఆమధ్య ఢిల్లీలో కూడా వీటిని గుర్తించారు. సొరంగ మార్గ నిర్మాణంతోనే బ్రహ్మపుత్ర నదిలో తొలి రైలు మార్గాన్ని ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందుకోసం అసోంలోని బ్రహ్మపుత్ర అడుగున మూడు సమాంతర సొరంగ మార్గాలను.. ఒకటి రోడ్డు ట్రాఫిక్ కోసం, మరొకటి రైలు ట్రాఫిక్ కోసం, ఇంకొకటి అత్యవసర రవాణా కోసం నిర్మింప తలపెట్టారు. పూర్తి కావడానికి మూడేళ్లు పడుతుందట’ చెప్పాడు పార్థు.
‘బాగుంది. సొరంగ మార్గాలు అంటే మనం వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌కి ఎక్కిన అటల్ టన్నెల్ గురించి చెప్పుకోవాలి. హిమాచల్ ప్రదేశ్ లోని ఈ సొరంగ మార్గాన్ని దాదాపు పద్దెనిమిది సంవత్సరాల పాటు కొండలను తొలుస్తూ నిర్మించారు. గతంలో రోహ్ తంగ్ నుంచి లేహ్ వెళ్ళాలంటే కురిసే మంచుతో ఏడాదిలో ఆరు నెలలు రోడ్డు మార్గం మూసుకుపోయేది. ఇప్పుడు అటల్ టనెల్‌తో ఆ సమస్య తీరింది. ఇది మనాలి, స్పీతి లోయలను కలిపింది. ఈ రెండు లైన్ల సొరంగమార్గంలో ఇరువైపులా విద్యుద్దీపాలు, ప్రతి ఐదొందల మీ. దూరానికి ఒక అత్యవసర ద్వారం, ప్రతి రెండొందల యాభై మీ. దూరానికి ఒక మైకు, సిసి టీవీ ఏర్పాటుచేశారు’ వివరించింది నీలిమ.
అవన్నీ వింటూ ఆ గొప్ప దారిని ఊహించుకున్నాను.
‘మనిషి తలచుకోవాలే కానీ అన్నీ సుసాధ్యాలే’ అన్నాడు మామయ్య.
‘టీ తాగాలనిపిస్తోంది. అదుగో టీ బడ్డీ.. ఓ ఐదు నిముషాలు ఇక్కడ ఆగుదాం. టీ తాగితే కాసింత హుషారొస్తుంది.. పదండి’ అంటూ కారాపాడు పార్థు.
‘పదండి.. పదండి’ అంటూ అంతా కారు దిగారు.
‘అనన్య దారి వెతికే పజిల్ చేస్తూనే నిద్రలోకి జారింది’ నవ్వుకుంటూ పాప చేతిలోని పుస్తకం తీసి అవతల పెట్టి, పాపను సరిగా పడుకోబెట్టి, కారు దిగింది నీలిమ.
వేడి వేడి టీని ఆస్వాదిస్తూ, ‘బతుకు తెరువు కోసమే అయినా ఇలా ఏమీ లేని చోట టీ కొట్టు నడపడం వల్ల ప్రయాణికులకు ఎంతటి సౌకర్యమో కదా’ అంది నీలిమ.
‘అవును. బతుకు కొందరికే పూలదారి.. ఎందరికో ముళ్ల దారి. నిజాయితీగా ఉండడానికి కష్టపడే దారుల్లో బతకడానికి సిద్ధపడే వారు కొందరైతే, దారి దోపిడీలకు పాల్పడే వారు మరికొందరు’ మామయ్య అన్నాడు.
‘కష్టపడకుండా, త్వరగా కోరుకున్నది పొందాలనే స్వార్థంతో అసలు దారిని వదిలి దొడ్డి దారులను ఎంచుకునే వారు ఈ కాలంలో ఎక్కువైపోతున్నారు’ తాతయ్య అన్నాడు.
టీ తాగడం అయింది.
‘ముందు దారి అంత బాగుండదు. జాగ్రత్తగా వెళ్లండి’ చెప్పాడు టీ ఇచ్చినతను.
‘అవునా.. థాంక్యూ’ అంటూ కారెక్కారు.
కొంత దూరం వెళ్లాక ‘దారి మళ్లింపు’ బోర్డ్ కనిపించింది.
‘మార్గాయాసం తెలియకుండా ఏదో ఒకటి మాట్లాడండి’ అన్నాడు పార్థు.
‘ఇప్పుడు జరుగుతోంది మార్గశిర మాసం. ‘మాసానాం మార్గ శీర్షోహం’ అన్నాడు శ్రీ కృష్ణ భగవానుడు. అంటే మాసాలన్నింటిలో మార్గశిరం శ్రేష్ఠమైనదన్నమాట’ అంది బామ్మ.
‘ఇలాంటి విషయాలలో నువ్వే మాకు మార్గదర్శివి’ అన్నాడు మామయ్య.
అంతా నవ్వారు. నాక్కూడా ఓ కొత్తమాట తెలిసింది.
‘చక్కని రాజమార్గములుండగ
సందుల దూరనేల ఓ మనసా!’ అన్నారు త్యాగరాజస్వామి. శ్రీహరిని చేరడానికి భక్తి అనే రాజ మార్గం ఉండగా, వక్ర మార్గాలెందుకని ఎంత బాగా చెప్పాడో. అంతేకాదు,
‘సంగీత మార్గము భక్తి వినా
సన్మార్గము కలదే మనసా’ అన్నారు’ చెప్పాడు తాతయ్య.
‘దుర్మార్గంలోకి మళ్లకుండా, సన్మార్గంలో నడిపించదానికి భక్తి ఎంతో తోడ్పడుతుంది’ అన్నాడు మామయ్య.
‘భక్తిలో కూడా ‘అడ్డదారులు తొక్కడం’ చూస్తూనే ఉన్నాం’ అంది నీలిమ.
‘మా టీచర్, పిల్లలు సినిమాలు చూసి పక్కదారి పడుతున్నారు అంది’ చెప్పాడు అజయ్.
‘అవును. టీవీ, మొబైల్, ఇంటర్‌నెట్ వచ్చాక వాటి ప్రభావంతో పిల్లలు పక్కదారులు అంటే చెడు మార్గాలలో నడుస్తోంది నిజమే’ అన్నాడు మామయ్య.
‘విద్యార్థులు ఎప్పుడూ ఉన్నత లక్ష్యాలు ఏర్పరచుకుని, కృషి, పట్టుదలతో విజయపథంలో సాగాలి. గుర్తుంచుకో అజయ్’ అన్నాడు తాతయ్య.
‘అలాగే తాతయ్యా. కానీ చాలా కష్టం కదా’ అన్నాడు అజయ్.
‘ఇష్టమైతే కష్టమేమీ కాదు. మనసుంటే మార్గం ఉంటుంది. అదే ఇంగ్లీషులో ‘వేర్ దేర్ ఈజ్ ఎ విల్ దేర్ ఈజ్ ఎ వే’ అని చదువుతుంటావుగా’ అన్నాడు మామయ్య.
‘ఊరు వచ్చేశాం. కొద్ది నిమిషాల్లో ఇంటి ముందు ఉంటాం’ అన్నాడు పార్థు.
‘చుట్టాలంతా వచ్చే ఉంటారు. రాత్రికే కదా పెళ్లి’ అంది బామ్మ.
‘అవును. రాము బాబాయ్ వాళ్లు, విశ్వం మామయ్య వాళ్లు అంతా వచ్చే ఉంటారు. సందడే సందడి..’ ఇంకా ఏవో పెళ్లి కబుర్లు చెప్పుకుంటున్నారు..
నేను మాత్రం నా దారిలోనే ఉండిపోయా.. అదే నా ఆలోచనలోనే ఉండిపోయా. ‘నా దారిలో ఎంత మందిని చూశానో, ఎంతమంది మాటలు విన్నానో.. ప్రయాణ దారులు నిర్మించుకోవడంలో చూపే శ్రద్ధ ప్రవర్తనలో చూపరెందుకో. ప్రయాణ మార్గాల మీదా పూర్తి శ్రద్ధ లేదు. రోజు ఎన్ని రోడ్డు ప్రమాదాలో! నిరంతరం నా మీద ప్రయాణిస్తూ నేను దెబ్బ తింటే, బాగు చేయకుండా, ప్రమాదాల పాలై.. ‘అక్కడ రోడ్డు ఎన్ని ప్రాణాలను బలి తీసుకుందో’ అంటూ నన్ను నిందిస్తుంటారు. తాగి, నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే వారు, రేసులంటూ విపరీత వేగంతో వెళ్లే వారు ఎందరో. ఇంకొందరు రాజకీయ, సంఘ విద్రోహ కుట్రలతో, ప్రేమోన్మాదంతో.. వాహనాలనే ఆయుధాలుగా చేసుకుని హత్యలు చేస్తుంటారు. ఆ హత్యలకు నేను వేదిక కావడం నాకు ఎంత వేదన కలిగిస్తుందో. దొంగతనాలు, దోపిడీలు, అక్రమ రవాణా, అవినీతి, అత్యాచారాలు.. ఇలా ఎన్నెన్నో అకృత్యాలు నిత్యం.. నిరంతరం.. నేను గమ్యం చేర్చే దారినే కానీ, వారిని సరైన దారిలో పెట్టే శక్తి నాకేది? నా అంతరంగం వారు అర్థం చేసుకునే దారేది?’ అనుకుంటుండగానే పార్థు వాళ్లు కారు దిగి వెళ్లిపోయారు. అంతలో పెళ్లి ఊరేగింపు ఒకటి కోలాహలంగా నా పైకి వచ్చింది. బ్యాండ్ బాజాలు అదరగొడుతూ, నా ఆలోచనలను తరిమేశాయి. అంతే! నేనూ ఉత్సాహంగా, ఉల్లాసంగా ఆ ఉత్సవంలో..