(భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గత సంవత్సరం ఆగస్ట్ 14ను దేశ విభజన భయానక జ్ఞాపకాల సంస్మరణ దినంగా ప్రకటించారు. ఆ పిలుపు ఆధారంగా సంచిక తెలుగు పాఠకుల కోసం అందిస్తున్న విశేష వ్యాస పరంపర ఇది. దేశ విభజనకు దారితీసిన కారణాలను మూలాలనుంచి పరిశోధించి, విశ్లేషిస్తూ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న వ్యాస పరంపర ఇది.)
[dropcap]ఈ [/dropcap]దేశంలోకి పరాయి మతం వచ్చి పాదుకోవడానికి ఆ మతస్థులు ఇక్కడ చొరబడి ఇక్కడి జనజీవనాన్ని విధ్వంసం చేసి.. అత్యంత దౌష్ట్యంగా చేసిన మానవ హననమే కారణం అనడానికి చరిత్రే సాక్ష్యం. చరిత్రను చరిత్రగా చెప్తే సమస్య ఏమీ లేదు. మంచి జరిగితే మంచి జరిగిందని చెప్పవచ్చు. చెడు జరిగితే చెడు జరిగిందనీ చెప్పవచ్చు. మంచి చెడుల విశ్లేషణలు మనం చేయలేకపోతే.. చేయవద్దని భావించినట్టయితే.. జరిగిన ఘటనను అందుబాటులో ఉన్న వనరులను బట్టి తెలిసిన చరిత్రను యథాతథంగా చెప్పుకొంటూ పోయినా సరే.. ఆ చరిత్రను అధ్యయనం చేసిన వారు మంచి చెడులను బేరీజు వేసుకొంటారు. మన చరిత్ర, జీవన విధానం, నాగరికత కాల పరిణామ క్రమంలో ఎలా మార్పులకు గురవుతూ వచ్చిందో అంచనాకు రాగలుగుతారు. కానీ.. చరిత్రను వక్రీకరించి తమకు తోచినట్టుగా చెప్పడంతోనే మనల్ని మనం ఆత్మన్యూనతలో పడి కొట్టుమిట్టాడాల్సిన పరిస్థితి వచ్చింది.
ఉదాహరణకు.. మొఘలులు, లోధీలకు ముందు తుగ్లక్‌లు ఢిల్లీ రాజ్యాన్ని పాలించారు. అందులో ఫిరోజ్‌షా తుగ్లక్ అనే మహానుభావుడి రాజ్యం ఎంత గొప్పగా విలసిల్లిందో చూడండి..
మహమ్మద్ తుగ్లక్ చనిపోయిన మూడోరోజు అధికారంలోకి ఫిరోజ్‌షా తుగ్లక్ అధికారంలోకి వచ్చాడు. పిరోజ్‌షా మహ్మద్ తుగ్లక్ కొడుకు కాదు. అతను నపుంసకుడు. దీంతో అతనికి బంధువైన ఫిరోజ్‌షా తుగ్లక్ అధికారంలోకి వచ్చాడు. ఇతను ఫతూహత్ ఈ ఫిరోజ్‌షాహి.. పేరుతో తన ఆత్మకథను రాసుకొన్నాడు. ఇతను బాబర్ కంటే ముందుగానే ముస్లిం ముస్లిమేతర రాజ్యాంగాలను బలంగా అమలుచేసినవాడు. ముస్లింలు షరియాను అనుసరిస్తే.. షరియాను అనుసరించని వాళ్లపై జిజియా పన్నును బలవంతంగా అమలుచేశాడు. ఫతూహత్ ఈ ఫిరోజ్‌షాహీలో ఫిరోజ్‌షా తుగ్లక్ తాను చేసిన ఘనకార్యాలన్నింటినీ డిక్టేట్ చేసి మరీ రాయించాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ దగ్గర ముగ్గురు తుగ్లక్‌లు పనిచేశారు. జియాసుద్దీన్, రజబ్, అబూ బకర్. హిందూ రాజ్యమైన దీపల్‌పూర్ పైకి ఈ తుగ్లక్‌లను దాడికి పంపించాడు. దీపల్‌పూర్ రాజు రాణా మల్ భాటీకి అందమైన కూతుళ్లు ఉన్నారు. ముందుగా రాణాను లొంగదీసుకోవడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో వాళ్ల అహం దెబ్బ తిన్నది. అంతే దీపల్‌పూర్ రాజ్యంలోని గ్రామాలపై తెగబడ్డారు. కనపడ్డ చోట కనపడ్డదాన్ని దోచుకొన్నారు. ఆడవాళ్ల మాన ప్రాణాలు అత్యంత హీనంగా గాల్లో కలిసిపోయాయి. ఇండ్లు ధ్వంసమయ్యాయి. ఆస్తులు దోపిడీకి గురయ్యాయి. ఖిల్జీ సేనలు, తుగ్లక్‌లు కలిసి దీపల్‌పూర్‌లో బీభత్సాన్ని సృష్టించారు. రోజు రోజుకూ పరిస్థితి దిగజారుతుండటం చూసి రాణా తల్లి తీవ్ర వ్యాకులత చెందింది. దీంతో రాణా కూతురు నీల పరిస్థితిని గమనించి రాజ్యాన్ని, ప్రజలను కాపాడుకోవడానికి, బీభత్సకాండను ఆపడానికి తనను తాను తుగ్లక్‌లకు త్యాగం చేసుకొన్నది. ముగ్గురు తుగ్లక్‌లలో ఒకరైన రజాబ్ తన హారెమ్ (అనుభవించే స్త్రీ ల వాటిక) కు నీలను తీసుకెళ్లి పేరు, మతాన్ని మార్చాడు. నీల పేరు ఖద్‌బానుగా మారిపోయింది. వాళ్లిద్దరికీ పుట్టిన బిడ్డే ఫిరోజ్ షా తుగ్లక్ పుట్టాడు. అంటే.. ముస్లిం రాజు ఉంపుడుగత్తెగా మార్చి రేప్‌కు గురిచేసిన ఒక హిందూ రాజపుత్రికి పుట్టిన బిడ్డ ఫిరోజ్‌షా.
ఫిరోజ్‌షా పుట్టిన ఏడో ఏట రజబ్ చనిపోయాడు. ఆ తరువాత జియాసుద్దీన్, మహమ్మద్ తుగ్లక్‌లు కలిసి.. ఫిరోజ్‌షాను ఒక ఇస్లాం ఉగ్రవాదిగా, అతివాదిగా మార్చారు. ముస్లిమేతరులను ఎంత తీవ్రంగా హింసించవచ్చో ట్రైన్ చేశారు. మహమ్మద్ తుగ్లక్ చనిపోయిన తరువాత జియాసుద్దీన్ కూతురు తన కొడుక్కు రాజ్యం ఇవ్వాలని బెట్టు చేసినా.. ఫిరోజ్ షా ను అడ్డుకోవడం సాధ్యమే కాలేదు. మహమ్మద్ తుగ్లక్ చనిపోయాక (సింధ్ దగ్గర థాటా దగ్గర చనిపోయాడు).. తరువాత తుగ్లక్ శత్రువులు మంగోలులు, థాటాలు ఏకమై రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నించారు. తుగ్లక్ శిబిరాలపై దాడులు చేసి విధ్వంసకాండ సృష్టించి.. అక్కడ ఉన్న మహిళలను ఎత్తుకెళ్లి అత్యాచారంచేసి చంపేశారు. కానీ, ఫిరోజ్‌షా తేరుకొని.. సైన్యానికి నాయకత్వం వహించి వారికి దూరంగా తప్పించి సురక్షిత స్థావరానికి తరలించాడు. దీంతో సైన్యమంతా ఫిరోజ్‌షాకు విధేయంగా మారి.. అతను చెప్పినట్టల్లా వినడంతో అనంతర రాజ్యాధికారం అతనికి దక్కడంలో అడ్డంకి లేకుండాపోయింది. థాటా నుంచి ఓటమిని భరించలేని ఫిరోజ్‌షా తన సైన్యంతోనే.. దీపాల్‌పూర్‌పై దాడి చేశాడు. ముల్తాన్, ఢిల్లీ, సరస్వతి తదితర నగరాలపై దాడులు చేశాడు. ఒక విశృంఖల వీరవిహారం చేశాడు. ఏది పడితే అది దోచుకొన్నాడు. డబ్బు, ఆయుధాలను.. చివరకు సామాన్యుల ఇండ్లల్లోకి చొరబడి.. వాళ్ల ఆస్తులను కూడా దోచుకొన్నాడు. హిందువులపై పెద్ద ఎత్తున తెగబడి బలవంతంగా ఇస్లాంలోకి మతమార్పిడి చేయించాడు. ఇంకా దారుణమేమిటంటే.. తాను బలవంతంగా తన మతంలోకి మార్చిన హిందువులను ఇతర ముస్లిమేతరులపైకి పంపించి వాళ్లను భయంకరంగా హింసపెట్టి.. ఇస్లాంలోకి మతం మార్పించాడు. అత్యంత అరాచకం. అత్యంత హేయం.. అత్యంత నీచంగా ఫిరోజ్‌షా అరాచకం కొనసాగింది. అతనిలో మానవుడు అనేవాడు లేనేలేడు. రాక్షసత్వం అన్నదానికంటే.. పైశాచికమన్న ప్రవృత్తికి ఇది పరాకాష్ట. ఈ దేశంలో ఇస్లాం ఏ విధంగా వేళ్లూనుకుంటూ పోయిందో చెప్పడానికి ఇలాంటి ఉదాహరణలు ఎన్ని చెప్పినా సరిపోవేమో.
ఫిరోజ్‌షా ఢిల్లీపైకి దండెత్తడానికి వెళ్తూ మార్గమధ్యంలో ఇఖ్‌దార్ ప్రాంతంలో బస చేసిన సందర్భంలో ఒక కొడుకును కన్నాడు. ఆ కొడుక్కు ఫతే ఖాన్ (విజయుడు) అని పేరు పెట్టుకొన్నాడు. ఆ ఊరు పేరును కూడా ఫతేహాబాద్ అని మార్చేశాడు. ఈ వివరాలు తారీఖ్ ఈ ఫిరోజ్ షాహీ అనే పేరుతో షమ్ ఈ షిరాజ్ అఫీఫ్ రాసిన రచనలో ప్రస్తావించాడు. ఈ రచనలో ఫిరోజ్ షా తుగ్లక్ చేసిన పనులను కొనియాడుతూ అనేక ఘటనలు రాశాడు. ఇవి చదివితే చాలు.. ఈ ఫిరోజ్‌షా అనేవాడు ఎంతటి ఘనుడో మనకు అర్థమవుతుంది. ఫిరోజ్‌షా ఈ ఒక్క ఊరికే కాదు.. అనేక నగరాలకు, భవనాలకు, ప్యాలెస్‌లకు, గార్డెన్‌లకు.. పేర్లు మార్చుకొంటూ పోయాడు. జనూన్‌పూర్, ఫిరోజ్‌పూర్, హిస్సార్, ఫిరోజాబాద్ ఇలా చాలా చాలా పేర్లు పెట్టాడు. దాదాపు 300 నగరాలు, పట్టణాలు, గ్రామాలు కొత్త పేర్లతో ఆవిర్భవించాయి. వీటిలో అధికభాగం యమునా నదీ తీరంలోనే ఉన్నాయి. ఆ పేర్లను పట్టుకొనే మన సూపర్ హిస్టారియన్లు ఆహా అని కొనియాడుతూ.. నెత్తిన పెట్టుకొని ఊరేగుతూ వచ్చారు. పేర్లు మార్చడానికి ముందు వాటికున్న చరిత్ర సహజంగానే వీరి నిర్వాకం వల్ల కనుమరుగైపోయింది.
ఢిల్లీ పైకి దండెత్తడానికి వెళ్లిన ఫిరోజ్‌షాకు ఖవాజ్ ఈ జహాన్ నుంచి ప్రతిఘటన ఎదురైంది. తీవ్రమైన పోరాటం తరువాత ఫిరోజ్‌షాను తట్టుకోలేక ఖవాజ్ సంధికోసం ఫిరోజ్‌షా దగ్గరకు వెళ్తే.. అతడిని బందీ చేశారు. అతడిని బలిపశువులా అలంకరించారు. అతడి తలపాగా తీసేశారు. బొట్టు పెట్టారు. మెడలో ఒక కత్తిని వేలాడదీసి తుగ్లక్ దగ్గరకు తీసుకొని వెళ్లారు. అతను కేవలం సంధి మాత్రమే ప్రతిపాదించాడు. కానీ తుగ్లక్‌కు అది నచ్చలేదు. వాజ్ నమాజు చేసుకోవడానికి ఉద్యుక్తుడై… మోకాళ్ల పై కూర్చొని ప్రార్థన చేస్తుండగా అతడి తలను వెనుకనుంచి నరికేశాడు. ఈ ఖవాజ్ వయసు 80 ఏండ్లు. ఈ ఒక్క ఘటన చాలు.. ఈ దేశంలోకి చొరబడ్డ ముస్లిం రాజులకు ఇస్లాంపై ఉన్న ప్రేమ, విశ్వాసం ఏపాటిదో చెప్పడానికి.
ఫిరోజ్‌షా ఎంత అటోక్రాటో చెప్పడానికి మరో ఉదాహరణ.. తన పెద్దనాన్న జియాసుద్దీన్ కూతురు.. ఖుస్రూ మాలిక్ భార్య ఖుదావండ్ జాదాపై మోజుపడి కోరిక తీర్చుకొనేవాడు. ఈ వావివరుసలు లేకపోవడానికి వీళ్ల విచ్చలవిడి కాముకత్వమే కారణం. పిరోజ్‌షా పోకడలు నచ్చక ఖుస్రూ మాలిక్ అతడిని చంపించడానికి కిరాయి హంతకులకు పురమాయించాడు. ఒక రోజు ఖుదావండ్ దగ్గరికి ఫిరోజ్‌షా వచ్చాడు. అతడిని చంపడానికి కిరాయి హంతకులు ఒక్కుమ్మడిగా దాడిచేశారు. అప్పుడు ఇతడిని హిందూ రాజ్‌పుత్ అయిన రాయ్‌బీరుబట్టి కాపాడాడు. అతను ఫిరోజ్‌షా తల్లి నీ కుటుంబానికి చెందిన వ్యక్తి. ఇతడిని కాపాడటానికి రాయ్ పోరాడుతుండగానే ఫిరోజ్‌షా పారిపోయి అజ్ఞాతంలోకి వెళ్లిపోయి దాక్కున్నాడు. చాలాకాలం పాటు అతను బయటకు రానే లేదు. చుట్టూ బలమైన సెక్యూరిటీ పెట్టుకొన్నాడు. తన సొంత హారెమ్‌కు కూడా వెళ్లలేకపోయాడు. మొత్తం మీద మళ్లీ పుంజుకొని ఢిల్లీ చేరుకొన్నాడు.
ఢిల్లీ రాజ్యాధికారంలోకి వచ్చిన తరువాత బెంగాల్, గుజరాత్‌తో పాటు దక్షిణాన ఉన్న కాకతీయ సామ్రాజ్యంపైనా ఇతను విరుచుకుపడ్డాడు. 1353, 1358 లలో బెంగాల్‌పై దాడి చేశాడు. కటక్‌ను స్వాధీనం చేసుకున్నాడు. పూరీ జగన్నాథుడి అతి పవిత్ర దేవాలయాన్ని అపవిత్రం చేశాడు. ఒడిశాలోని జాజ్‌నగర్ రాజును ఓడించాడు. 1361లో నాగర్‌కోట్‌పై దాడిచేశాడు. అక్కడ జాంబా బనియాలపై యుద్ధం చేశాడు. దాదాపు ఆరు నెలలపాటు ఎడారిలో తీవ్రంగా యుద్ధం జరిగింది. చివరకు జాంబా బనియాలు ఫిరోజ్‌షాకు లొంగిపోయి.. ఏడాదికి కప్పం కట్టేలా ఒప్పందం చేసుకొన్నారు. 14 శతాబ్దంలో చౌహాన్ రాజ్‌పుత్‌లను ఇస్లాంలోకి బలవంతంగా మార్చిన వాడు ఫిరోజ్‌షా తుగ్లక్. వాళ్లను ఈరోజు రాజస్థాన్‌లో ఖ్వాయిమ్ ఖాన్‌లు అని పిలుస్తారు. కాంగ్రా కోట, నాగర్‌కోట్ లాంటివాటిని స్వాధీనం చేసుకొన్నాడు. గ్రేటర్ ఖోరాసన్‌ను స్వాధీనం చేసుకొని అక్కడి రాజైన తటార్‌ఖాన్ ముఖాన్ని తన ఖడ్గంతో దారుణంగా చెక్కేశాడు. మావ్ పైఠాన్‌కు చెందిన రాజా కైలాష్‌పాల్‌కు తన కూతురును ఇచ్చి పెండ్లి చేశాడు. అతడిని ఇస్లాంలోకి మతం మార్పించి.. దంపతులకు గ్రేటర్ ఖోరసన్‌ను ఏలుకోవాలని గిఫ్ట్ ఇచ్చాడు. వీరికి 11 మంది కొడుకులు పుట్టారు. వీరు ఆ తరువాత బాడ్‌పగే కులం పేరుతో చెలామణి అయ్యారు.
హర్యానా, యూపీలోని తోప్రా, మీరట్ ప్రాంతాలనుంచి రెండు అశోక స్తంభాలను పెకిలించుకొని ఢిల్లీలోని తన ప్యాలెస్‌కు తీసుకొచ్చాడు. అందులో ఒకదాన్ని నైపుణ్యంగా కట్ చేయించి తన ఫిరోజ్‌షా కోట్లా ప్యాలెస్‌పై పెట్టించుకొన్నాడు. ఫిరోజ్‌షా కోట్లా ఆట మైదానం మనకు ఇప్పటికీ ఢిల్లీలో ఉన్న విషయం అందరికీ తెలియందేమీ కాదు. ఢిల్లీలో ఫిరోజ్‌షా తుగ్లక్‌కు ఇష్టమైన లాడ్జ్‌లలో ముఖ్యమైంది ఏమిటో తెలుసా.. షికార్‌గహ్ అలియాస్ కుషాక్ మహల్. ఇది మనం ఇప్పుడు ఢిల్లీలో చూసే తీన్‌మూర్తి భవన్ కాంప్లెక్స్‌లో ఉన్నది. మన ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ చనిపోయే దాకా నివాసం ఉన్న భవనం ఇది. ఈ ప్యాలెస్ ఉన్న రోడ్డుకు మొదట్లో కుషాక్ రోడ్డు అని పేరు ఉండేది. తరువాత తుగ్లక్ రోడ్డుగా పేరు మార్చారు.
ముందుగానే చెప్పుకొన్నట్టు ఈ తుగ్లక్ భయంకరమైన ఛాందసవాది. షరియా విధానాలను తుచ తప్పకుండా అమలుచేసినవాడు. షరియాను అనుసరించని వాళ్లపైన జిజియా పన్నును వసూలుచేశాడు. అంతేకాదు. ముస్లిమేతర సంప్రదాయాలను పూర్తిగా తన రాజ్యంలో నిషేధించాడు. మత పెద్దలు, సాధువుల సమాధుల దగ్గరకు ముస్లిం మహిళలు వెళ్లి ప్రార్థనలు చేయడాన్ని సైతం నిషేధించాడు. ముస్లిం సిద్ధాంత కర్తలు మతోన్మాద జాతులని ముద్ర వేసిన ముస్లిమేతర వర్గాలను అత్యంత దారుణంగా పీడించాడు. ఫిరోజ్‌షా తుగ్లక్ దాదాపు 1,80,000 మంది దాసులను (బానిసలు) లేదా పనివాళ్లను మెయింటెయిన్ చేశాడు. వీళ్లలో ఎక్కువ మంది హిందువులు.. మహిళలే. వీళ్లకోసం ప్రత్యేకమైన వ్యవస్థే ఉండేది. ఎంతటి నేరం చేసినా ముస్లింలకు మృత్యు దండన విధించరాదని న్యాయసూత్రాలను రచించాడు. హిందువులను జిమ్మీలుగా పిలిచేవాడు. పాలనావ్యవహారాల్లో మతపెద్దలైన ఉలేమాలకు పెద్దపీట వేయడంతో మతోన్మాదం అన్ని రంగాల్లోకి కూడా విశృంఖలంగా విస్తరించింది. ‘ఈ యుగంలో సికిందర్ లోధీ, ఔరంగజేబ్‌లను మించిన మతోన్మాది ఫిరోజ్‌షా తుగ్లక్’ అని ప్రఖ్యాత చరిత్రకారుడు ఆర్‌సీ మజుందార్ అభివర్ణించారు. హిందువుల జ్వాలాముఖి దేవాలయం లోని గ్రంథాలయం నుంచి 1300 గ్రంథాలను ఫిరోజ్‌షా ఎత్తుకెళ్లాడు. అందులో తమకు అవసరమైన ఆయుర్వేదం.. వంటి గ్రంథాలను సంస్కృతం నుంచి పర్షియాలోకి అజ్ఞాత వ్యక్తులతో అనువదింపజేసుకొన్నాడు. ఈ గ్రంథాలే.. పర్షియాకు, అరేబియాకు ఎక్స్‌పోర్ట్ అయ్యాయి. వాళ్ల వైద్యానికి ఇవే ఆధారభూతమయ్యాయి. ఈ ఆయుర్వేద గ్రంథానికి ‘దలాయతే ఫిరోజ్‌షాహీ’ అని పేరు పెట్టుకొని చెలామణి చేసుకొన్నాడు.
(సశేషం)