నియో రిచ్-28

0
3

[జయంతి, శ్రీ మాట్లాడుకుంటుంటారు. తనకీ కోడండపాణికి ఉన్న సంబంధం గురించి అడిగితే, నిర్మాతా నటీల సంబంధం అంటుంది. కోదండపాణి పరోక్షంగా శ్రీ గురించి వాళ్ళ గురించి ఎంత చెడుగా మాట్లాడుతున్నాడో చెప్తాడు జయంతి. పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు అని అడిగితే, ఇప్పుడే కాదంటుంది. తనకిష్టమైన దర్శకుడు కృష్ణవంశీ అని చెప్పి, ఎప్పటికైనా ఓ సినిమా తీయాలని ఉంది అంటుంది. డబ్బు గురించి ఆలోచించవద్దు, తతిమా ఏర్పాటు చేసుకోమంటాడు జయంతి. కబుర్లయ్యాకా శారద పెట్టిన టిఫిన్ తిని బయల్దేరుతుంది శ్రీ. రవిని ఇంటి దగ్గర దింపి, శివరాంతో – పెంచలయ్య పెడుతున్న స్కూటర్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడుతాడు జయంతి. పెంచలయ్యకి విపరీతంగా డబ్బు సంపాదించి పెట్టే ప్రాజెక్టని చెప్తాడు. అక్కడ నుంచి ఓ హోటల్‍కి వెళ్ళి అక్కడ 255 నెంబరు గది బెల్ నొక్కి తనకి కావల్సిన వ్యక్తి ఉన్నాడా అని అడుగుతాడు. అతనికింకా రాలేదని తెలిసి ఇంటికి చేరుతాడు జయంతి. ఇంటికి వచ్చి కాసేపు శారదతో గడుపుతాడు. తనకి మనసేం బాలేదని బయటకి వెళ్దామని అంటుంది శారద. బయట తిరిగి సినిమా చూసి ఇంటికి వచ్చి భోం చేసి పడుకుంటారు. మర్నాడు ఉదయం ఫోన్ మోగితే, సామంత్ ఊర్లోకి వచ్చాడని తెలుస్తుంది. సామంత్‍ని కలవడానికి వెళ్తాడు. పని ఆలస్యం అయిందని, ఇంకో రెండు రోజులలో పూర్తవుతుందని అంటాడు సామంత్. ఇక చదవండి.]

[dropcap]వా[/dropcap]తావరణం నిశ్శబ్దంగా ప్రశాంతంగా కూడా ఉంది. సామంత్ ఊపిరి పీల్చుకోవడం కూడా వినిపిస్తున్నది. జయంతి ఒక్క అడుగు ముందుకు నడచి చాచి లెంపకాయ ఇచ్చాడు.

దిమ్మెరపోయాడు సామంత్. తేరుకొని చెంపపై పడ్డ ఆరు వేళ్లను నెమ్మదిగా సర్దుకుంటూ “జయంతీ it is my last request” అని రెండు చేతులూ పట్టుకున్నాడు.

“It’s all my..” అని, “శీరీష్” అని పిలిచాడు.

పర్వతం లాంటి వాడు లోనికొచ్చాడు.

“సామంత్ ఇచ్చిన లగేజీను కారు డిక్కీలో వెయ్యి” అన్నాడు జయంతి.

సామంత్ వెంట వెళ్లాడు. నాలుగు నిముషాల తర్వాత ఇద్దరూ వచ్చారు.

“ఇక వెళ్తాను” అని సామంత్‌ను ఒకసారి చూసి కారెక్కాడు.

అక్కడ బయలు దేరిన కారు శివరాం ఇంటి దగ్గరే ఆగింది. శిరీష్‌ను మధ్య దింపాడు. లోనకొచ్చి store room తాళాలను తీసుకొని తెరిచి డిక్కీలోని సంచుల్ని దాంట్లో పడేసి తాళం చేతుల్ని పార్వతికిచ్చి చల్లటి నీళ్లు త్రాగి కారెక్కాడు.

లాయరు ముకుందం ఇంటి ముందాపాడు కారు.

సీదా ఆఫీసు రూం లోకి నడిచాడు. ముకుందం ఉన్నాడు.

వెళ్లి ఎదురుగా కూర్చుని “ఉన్నావో? లేదో? అన్నది తెలియక కొట్టుమిట్టాడుతున్నాను” అని నవ్వాడు.

“పని ఉందా? చెప్పు.”

“ఉంది” అని నవ్వి “ముకుందం ఇప్పుడు నీకున్న ఆస్తి (విలువ) ఎంత?” అని అడిగాడు.

“నీకు తెలియకుండా నయితే లేదు” అని నవ్వాడు.

“5 కోట్లుకు ఉండొచ్చునా? పెరిగిన ధరలతో.”

“ఉండొచ్చు. రూపాయి విలువ మరీ పడిపోయింది గదా. Because of inflation.”

“నువ్వు ప్రాక్టీసు ప్రారంభించి ఎన్ని సంవత్సరాలై ఉంటుందంటావు?”

“18-20”

“ముకుందం, BA, LLB అని బోర్డు వ్రాయించుకున్న నాడు నీకున్నదెంత?”

“ఒక పెంకుటిల్లు, దాని ముందున్న రెండు షట్టర్లు.”

“IT వాళ్లకు చూపేదెంత?”

“పాతిక.”

“అంటే కోట్లే మిగులుతున్నాయి” అని నవ్వాడు.

“మిగలమేంటి జయంతి. నీ ధోరణి వింతగా ఉంది. అసలేమైంది నీకు. Are you all right” అని తేరిపార చూసి “కాముడూ, చల్లటి నీళ్లు తీసుకురా” అని పెద్దగా చెప్పాడు. తెచ్చిన నీళ్లను పొట్ట నిండా త్రాగి “ముకుందం ఇంకా నువ్వు పేదోడివే అయితే అసలిక్కడ ‘ధనవాన్’ ఎవడంటావు? బియ్యమో, గోధుమలో, పప్పో తింటాము గానీ కరెన్సీని తినం గదా. దానికి రుచేముంది. నిర్వికారి. అది చేతికొచ్చి అన్నీ చాలని చెబుతాం” అని నవ్వి “ముకుందం సువర్చలాదేవి అదే.. ముండమోసినావిడ.. ఆ కేసేమయింది?”

“ఆస్తి మొత్తం ఆవిడకే దక్కింది.”

“అది మనదాక చేరేందుకు టైమెందుకు పడుతున్నది.”

“పాలు స్టాపులపైన తంతు ముగిసింది.”

“సువర్చలకు లగ్నం పెట్టారా?”

“ఎల్లుండే కుదింరింది తిథి. హుస్సేను సాగర్‍లో పడి చనిపోతుంది. పాపం” అని లేచి లోనకి వెళ్లి డాక్యుమెంట్లు ఉన్న కవరును తీసుకొచ్చి జయంతికిచ్చాడు.

“ఇక వెళ్లొస్తానేం” అంటూ కదిలాడు జయంతి. కారు అంజయ్య కొట్టు దగ్గర ఆగింది.

రాజారాం గబగబా కారు దగ్గరకొచ్చి నమస్కారం చెప్పి కేక వేసి అంజయ్యను పిలిచాడు.

ఇద్దరూ కలిసి మధ్య గదిలోకి తీసుకెళ్లారు. జయంతి కూర్చున్నాక “ఫోనులో కూడా దొరకడం లేదేందే?” అన్నాడు అంజయ్య.

“నా కారు రోడ్డెక్కగానే చేస్తున్నావా?” అన్నాడు నవ్వుతూ.

“ఉరితాడు మెడకేసినా గూడా నవ్వించగలవే, నువ్వు చానా అదృష్టవంతుడివి.”

 “మేము మాత్రం చేస్తున్న ఈ జానా బెత్త యాపారానికి I.T. వాళ్లతో తలమునకలుగా ఉండాది. బాధలో నవ్వు కొనగల్గటమంటే అంటే బ్రతుకును జయించడమే గదా” అని, “అది సరే గాని..”

“సంగతేంటి?”

“ఆ మురారి లేడూ వానితో మాలావు చెడ్డ చిక్కుగా ఉండాది.”

“C.T.O. నా?”

“లెక్క అయిందా? పంపిన సరుకెంత?”

“470 వ్యాగన్లు, వెయ్యిలోపు లారీలు.”

“వీటిలో ‘జీరో’ ఎంత?”

“సగం అనుకో.”

“ఒక్కలోడుకు TAX ఎంత?”

“పసుపయితే ఆరు వేలు. మిర్చి అయితే 2400.”

“అంటే బల్ల కదలకుండా టాక్సూ ఎంత మిగిలినట్టు? ఓర్నీ అసాద్యం గూలా, పైగా పాపం మురారి వెంటపడుతున్నాడా?” అని పెద్దగా నవ్వి “ఇంతకీ యాపారం ఎట్టా ఉంది?” అడిగాడు జయంతి.

“సొమ్ములయితయి అమ్మేందుకు. ఎక్కడికక్కడికి ఉంటారు” అన్నాడు.

“నువ్వు చేస్తున్నది యాపారం. కనుక నువ్వు చెప్పే తీరు. అది గానీ మురారినేం చేద్దాం?”

“నువ్వు చెప్పిందే.”

మళ్లా పెద్దగా నవ్వి “నవ్వు లెక్క అంటే యాపారం అంటే నేను వానికి ఎంతియ్యాలో ఎట్టా అందించాలో చెప్పేది” అని, “నే చెప్తాలే గానీ ఓ లచ్చ కొట్టిపో, అంతా సరయితది. నువ్వెల్లు” అని నడిచాడు. కారు స్టార్ట్ అయింది.

ప్రభుత్వం దృష్టికి రాని పైకం అంతా ఎక్కడికెళ్తది? ఏ మేతారి వ్యాపారి ఇలా చేస్తే దాని ఆసరాలో ఉద్యోగి ఈ సంబంధం సజావుగా సాగినంత దాకా, అసలు దేశపు ఆర్థికస్థితి తెలీదుగదా. ఒక్కి దానిలోనే కష్టంగా ఉందనుకుంటే  NRIలు అతి తక్కువ వడ్డీకి inflow చేస్తున్న పైకం, స్మగ్లర్ల కరెన్సీ, బంగారం, వెండి, ప్లాటినమ్, బ్రాంజ్ ఉన్న వస్తువులూ.. ఇలా అన్నీ కొత్త డబ్బును సృష్టించుకుంటూ పోతే, ఇక్కడ మార్కెట్ల గతి ఏమిటి? Inflation ఎలా అరికట్టడడం? రూపాయి గాలిలో తేలాక ఈ దాచిన డబ్బు అంతా ఏమవుతుంది?

కారు ఇంటి ముందు ఆగింది.

ఆపాడే గాని కారు దిగలేదు జయంతి.

అసలు మొత్తం వ్యవస్థే కుప్పకూలిపోతుందేమో?

ఒకింత ఒళ్ళు జంకింది.

అసలు ఒక మనిషి బ్రతుకేందుకు కావాలిసినదెంత?

దాన్ని దొరక్కుండా చేస్తున్నదెవరు?

ఇది ఒక పజిల్. దీనిలో అంతా మనకు అర్థం కానక్కరలేదు.

ఏ పద్ధతిన విప్పితే మనకు పరిష్కారం దొరుకుతుంది అనుకొని కారు దిగాడు. ఆలోచిస్తూనే లోనకి నడిచాడు.

శారద చదువుకుంటూ కనిపించింది. లోనకెళ్లి కూర్చుని “శారదా” అని పిలిచాడు.

వెళ్లింది పుస్తకంతోనే.

“మంచి నీళ్లు కావాలి.”

“భోం చేయాలని లేదా?”

“మంచి నీళ్లు కావాలోయ్.”

తెచ్చిచ్చింది. త్రాగాడు. “ఇంకా కావాలా?”  తల ఊపాడు. మళ్లా ఇచ్చింది.

దేన్ని గురించి ఆలోచిస్తున్నాడో అంతు పట్టలేదు. కూర్చుని పుస్తకం తెరిచింది.

ఫోను మ్రోగింది. రిసీవర్ ఎత్తింది “శారద” అంటూ

“రవి వస్తానని వెళ్లాడు, చేరాడా?” అడిగింది పార్వతి.

“ఇంకా రాలేదు.”

“రాగానే మాటాడించు, అన్నయ్య ఉన్నాడా?”

“ఇప్పుడే వచ్చారు.”

..అని ఫోను పెట్టేస్తుండగా బజ్జర్ మ్రోగింది.

వెళ్లి తలుపు తీసింది. నలభై సంవత్సరాల వయస్సున్న ఖద్దరుదారి కనిపంచాడు.

“జయంతి కావాలి” అన్నాడు వినయంగా

“ఉన్నారు, మీ పేరు?”

“హనుమంతప్పదా వచ్చాననీ..”

అలాగే అని లోనకి నడిచింది.

“అమ్మా నువ్వుదా శారదవా?” అడిగాడు మొకమంతా కళ్లు చేసుకొని.

తల ఊపింది.

“లోనకు రావచ్చునా?”

“రండి..” అని జయంతి దాకా నడిచి “హనుమంతప్పట వచ్చాడు” అంది.

“లాన్‍లో కూర్చోమను” అన్నాడు.

అయిదారు నిముషాలలో కాఫీ పంపింది.

కాఫీ పూర్తవుతుండగా జయంతి వచ్చాడు. లేచి నమస్కారం చెప్పి కూర్చున్నాడు.

“ఇప్పుడేనా రావచ్చింది? అడిగాడు జయంతి. తల ఊపాడు హనుమంతప్ప.

“లగేజ్” అడిగాడు.

“బయట ఉండాది.”

“అటు రా” అని వెనకవైపు వున్న store తలుపు చూపాడు.

బ్యాగ్‍తో అక్కడికి రావడం, దాన్ని స్టోరు రూమ్‍లో వేసుకొని లాక్ చేయడం జరిగింది. “ఇక వెళ్లిరా, మూడో తేదీన రెడ్డి రాజాను కలువు” అన్నాడు.

శెలవు చెప్పి వెళ్లిపోయాడు హనుమంతప్ప.

ఇంతలో ‘హరేరామ్’ “జయంతి ఎక్కడ?” అంటూ వాలిపోయాడు. జయంతి కనిపించగానే వంగి పాదాలకు నమస్కరించి లేచి కౌగలించుకున్నాడు.

అతని తోనే లగేజ్ అవుట్ హవుస్‌లో పెట్టించాడు.

శారదా “హరేరామ్ అని స్నేహితుడు. ఇవ్వాళ మనతో భోంచేస్తాడు” అని చెప్పాడు.

ఆనక “she is my wife Sarada” అన్నాడు నవ్వుతూ.

నమస్కారం చేసాడు హరేరామ్. దగ్గరగా వచ్చి “నేను మిమ్మల్ని ‘సిస్టర్’ అని పిలుస్తాను” అన్నాడు.

“పిలవండి” అంది నవ్వి.

“అయితే సిస్టర్ నా పేరు హరేరామ్. న్యాయానికి ఈ రెండు వేరు కాదు. హరే, రామ్ ఏదో ఒక్కటి చాలు నన్ను గుర్తించేందుకు. మా వాళ్లు అలా ఎందుకు పెట్టారో నాకిప్పటికీ అర్థం కాలేదు. మీరు హరే అన్నా రామ్ అన్నా పలుకుతాను. కలిపి పిలిచినా O.K. బావగారికి మాత్రం ఏకలవ్య శిష్యుణ్ణి” అంటూనే శారద వెంట నడిచాడు.

తమషాగా అనిపించింది అతని తీరు.

“ఎక్కడా దిక్కు లేకుంటే అక్క మొగుడే దిక్కు అంటారు. నేనలా చేరిన వాణ్ణి  మాత్రం కాదు.” అన్నాడు.

“వేళ అయింది కదా భోజనానికి రండి” అంది.

“మంచిది” అని టేబులు దగ్గరకు నడిచి కూరల్ని చూసి “ఇది నాకు ఇష్టం అని ఎలా గ్రహించారు” అడిగాడు.

“అక్కను గదా” అంది.

“అవును yes” అని తినడం ప్రారంభించాడు. కావాలసినదల్లా మొహమాటం లేకుండా వేసుకొని తృప్తిగా తిన్నాడు. చేయి కడుక్కున్నాక “పడుకోవాలి” అన్నాడు. గది చూపింది.

ఆ సాయంత్రం లేవలేదు. మర్నాడు ఉదయం పదింటికి లేచాడు.

బయటకొచ్చి “తేదీ ఎంత?” అంటూ అడిగాడు శారదని.

చిత్రంగా చూసింది, తేదీ చెప్పింది.

“ఒహ్, ఇంతే గదా” అంటూ వెనక్కి మళ్లాడు.

“అంటే?” అంది.

“నేను పనిలో ఉన్నా నిద్రలో ఉన్నా కొన్ని తేదీలు దొర్లుతాయి. కంగారు పడొద్దు” అంటూ నడిచాడు.

అంతగా అర్థం కాలేదు శారదకు. బ్రష్ చేసుకొని వచ్చాడు.

“ఆకలిగా ఉన్నది” అన్నాడు వెనకొచ్చి.

“టేబులు పైన ఉంది”.

“అలాగే” అంటూ వెళ్లి కావాల్సిన మటుకు పెట్టుకుని తిని చల్లటి మజ్జిగ కడుపారా త్రాగి ప్రక్కమీదకు చేరుకున్నాడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here