ఆస్కార్ పందెంలో మొదటి మైలురాయి ఘనంగా దాటిన RRR

0
3

[dropcap]ఆ[/dropcap]స్కార్ పందెం ఇదివరకు ప్రజాదరణ మీద ఆధారపడి ఉండేది. గత రెండు దశాబ్దాలుగా ఇది మారింది. ప్రతి సంవత్సరం ఆగస్టు చివర్లో వెనిస్ చిత్రోత్సవంతో చిత్రోత్సవాల హడావిడి మొదలౌతుంది. దీంతోనే ఆస్కార్ పందెం కూడా మొదలవటం ఇప్పుడు ఆనవాయితీగా మారింది. కళాత్మక చిత్రాలు ఈ చిత్రోత్సవాలలో ప్రదర్శితమౌతాయి. ఈ చిత్రోత్సవాల్లో ముఖ్యమైనవి వెనిస్, టెల్యురైడ్, టొరంటో, న్యూయార్క్, లండన్ చిత్రోత్సవాలు. వీటిలో ‘టార్’, ‘ద ఫేబుల్ మెన్స్’, ‘ద బ్యాన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్’ చిత్రాలు ఈసారి పలు ప్రశంసలు దక్కించుకున్నాయి. అంతకు ముందే జరిగిన సౌత్ బై సౌత్ వెస్ట్ చిత్రోత్సవంలో ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ అట్ ఒన్స్’ చిత్రం కూడా విమర్శకులని ఆకట్టుకుంది.

ప్రతి సంవత్సరం డిసెంబర్ మొదట్లో సినీ విమర్శకుల సంఘాలు అవార్డులు ప్రకటించటం మొదలుపెడతాయి. వీటిలో ప్రతిష్ఠాత్మకమైనవి న్యూయార్క్ సినీ విమర్శకుల సంఘం, లాస్ ఆంజెల్స్ సినీ విమర్శకుల సంఘం. ఈ రెండు సంస్థలు ప్రకటించిన అవార్డులు కొన్ని చిత్రాలకు ఆస్కార్ పందెంలో ఊతమిస్తాయి. గత సంవత్సరం ఈ రెండు సంస్థలూ ‘డ్రైవ్ మై కార్’ అనే జపనీస్ చిత్రానికి ఉత్తమ చిత్రం అవార్డు ఇచ్చాయి. తర్వాత ఆ చిత్రానికి ఆస్కార్ పందెంలో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకత్వం నామినేషన్లు వచ్చాయి.

ఈసారి న్యూయార్క్ సినీ విమర్శకుల సంఘం డిసెంబర్ 2వ తేదీన తమ అవార్డులు ప్రకటించింది. లాస్ అంజెల్స్ సినీ విమర్శకుల సంఘం డిసెంబర్ 11వ తేదీన తమ అవార్డులు ప్రకటిస్తుంది. న్యూయార్క్ సంఘం ‘టార్’, ‘ద బ్యాన్షీస్..’, ‘ఎవ్రీథింగ్..’ చిత్రాలకు అవార్డులు ప్రకటిస్తుందని అందరూ అనుకున్నారు. అలాగే జరిగింది కూడా. అయితే ఉత్తమ దర్శకుడి అవార్డు RRR చిత్రానికి గాను ఎస్. ఎస్. రాజమౌళికి దక్కింది!! స్టీవెన్ స్పీల్బర్గ్ (‘ద ఫేబుల్ మెన్స్’), టాడ్ ఫీల్డ్ (‘టార్’) వంటి దిగ్గజ దర్శకులను పక్కకు నెట్టి రాజమౌళి ఈ పురస్కారం దక్కించుకున్నారు. నిజం చెప్పొద్దూ.. ఈ విషయం విని నేను షాక్‌కి గురయ్యాను. అసలు ఊహించలేదు. రాజమౌళి కూడా ఊహించి ఉండరు. ఇంటర్వ్యూలలో ఆయనే “ఈ చిత్రం పాశ్చాత్య ప్రేక్షకులకి, విమర్శకులకి, పరిశ్రమ వర్గాలకి ఇంతగా ఎందుకు నచ్చిందో నాకే అర్థం కావట్లేదు” అన్నారు.

ఈ అవార్డుతో ఈ చిత్రం హాలీవుడ్ సినీ పరిశ్రమ దృష్టిలో పడుతుంది. ఎక్కువ మంది చూస్తారు. జనవరిలో సినీపరిశ్రమ సంఘాలు తమ అవార్డులు ప్రకటిస్తాయి. వీటిలో రచయితల సంఘం, దర్శకుల సంఘం, నిర్మాతల సంఘం, నటీనటుల సంఘమే కాకుండా ఎడిటర్లు, ఛాయాగ్రాహకులు వంటి సంఘాలు కూడా ఉంటాయి. ఈ సంఘాలన్నీ చాలా మటుకు ఐదు చిత్రాలను నామినేట్ చేసి ఒకరికి అవార్డు ఇస్తాయి. నిర్మాతల సంఘం మాత్రం పది చిత్రాలను నామినేట్ చేస్తుంది. అందులో RRRకు స్థానం దక్కే అవకాశాలు మెరుగయ్యాయి. ఐదు చిత్రాలకే స్థానం ఉన్న చోట పోటీ ఎక్కువ ఉంటుంది. మరో విషయం – ఇంకా ‘అవతార్ – 2’ విడుదల కావలసి ఉంది. అబ్బురపరిచే దృశ్యాలు RRRలో ఉన్నాయి కాబట్టి అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు అనుకుంటే ‘అవతార్ – 2’లో అలాంటి దృశ్యాలు మెండుగా ఉంటాయి. అయితే ‘అవతార్ – 1’ లో ఆ ప్రపంచం అప్పుడే చూసేశాం కాబట్టి కొత్తదనం ఉండకపోవచ్చు.

RRR కి ఇంత ఆదరణ దక్కడానికి కారణం ఏమిటని ఆలోచిస్తే భావోద్వేగాలతో పెద్ద స్థాయిలో సినిమాలు నిర్మించటం హాలీవుడ్‌లో తగ్గిపోయింది. ‘అవెంజర్స్’, ‘స్పైడర్ మ్యాన్’ వంటి దృశ్యప్రధానమైన చిత్రాలు ప్రజాదరణ పొందుతున్నాయి. ప్రజాదరణ అంటే ఏమిటో అనుకునేరు, టీనేజర్లను ఆకట్టుకునే చిత్రాలివి. RRR లో అబ్బురపరిచే దృశ్యాల వెనక మనసుని ఉప్పొంగించే భావోద్వేగాలు ఉంటాయి. దానితో దృశ్యపరమైన అనుభూతియే కాక ఉద్వేగం కూడా కలుగుతుంది. గతంలో ‘బెన్-హర్’, ‘బ్రేవ్ హార్ట్’ వంటి చిత్రాలు ఈ పంథాలో ఉండేవి. 2000లో ‘గ్లాడియేటర్’ చిత్రం తర్వాత ‘అవతార్ – 1’ (2009) అలాంటి పంథా కనిపించింది. ‘గ్లాడియేటర్’ ఉత్తమ చిత్రం ఆస్కార్ గెలుచుకుంది. ‘అవతార్ – 1’ ఆ అవార్డు గెలుచుకోలేకపోయింది. చిన్న చిత్రాలకు అవార్డులు ఇచ్చే ట్రెండ్‌లో 2009లో ‘ద హర్ట్ లాకర్’ ఆ అవార్డు గెలుచుకుంది.

2000లోనే ‘క్రౌచింగ్ టైగర్ హిడెన్ డ్రాగన్’ అనే తైవాన్ చిత్రం ‘గ్లాడియేటర్’ కి పోటీగా నిలిచింది. వారి సంస్కృతిని ప్రతిబింబించిన జానపద చిత్రమది. ఆ చిత్రానికి దర్శకుల సంఘం ఉత్తమ దర్శకుడు అవార్డు ఇచ్చింది. అయితే ఉత్తమ దర్శకత్వం ఆస్కార్ దక్కలేదు. ఇప్పుడు ఆస్కార్ అకాడెమీ రూపురేఖలు మారిపోయాయి. ఎంతో మంది అంతర్జాతీయ నటులు, దర్శకులు, ఇతర విభాగాల వారిని అకాడెమీలో చేర్చుకున్నారు. శ్వేతజాతీయులకే ఎక్కువ ఆస్కార్లు వస్తున్నాయని నిరసనలు పెరగటంతో అకాడెమీ ఈ చర్య చేపట్టింది. వింతేమిటంటే శ్వేతజాతీయులకే RRR ఎక్కువ నచ్చుతోంది. ఆస్కార్లలో ఉత్తమ చిత్రం విభాగంలో పది నామినేషన్లు ఉంటాయి. ఉత్తమ దర్శకత్వం విభాగంలో ఐదే ఉంటాయి. RRR కి ఉత్తమ చిత్రం నామినేషన్ ఖాయమని అనిపిస్తోంది. ఉత్తమ దర్శకత్వం నామినేషన్ రావటం కష్టమే. ‘నాటు నాటు’ పాటకి ఉత్తమ గీతం నామినేషన్ దాదాపు ఖరారైనట్టే. ఉత్తమ గీతానికి రచయితకి, సంగీత దర్శకుడికి కలిపి నామినేషన్ ఇస్తారు. అంటే చంద్రబోస్ గారికి, కీరవాణి గారికి నామినేషన్ వస్తుందన్నమాట!

నామినేషన్ల సంగతి ఎలా ఉన్నా అవార్డులు రావటం మాత్రం కష్టమే. ఉత్తమ అంతర్జాతీయ చిత్రం విభాగంలో ఇండియా RRR ని పంపించి వుంటే ఆ అవార్డు తప్పక వచ్చేది. అయితే ఆ ఎంపిక కమిటీ తప్పు పట్టాల్సిన అవసరం లేదు. వారికి నచ్చిన చిత్రాన్ని వారు పంపించారు. అకాడెమీలో మార్పులు జరిగినట్టే ఆ కమిటీలో కూడా మార్పులు జరగాల్సిన అవసరం ఉందనిపిస్తోంది. జూన్‌లో RRR నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన తర్వాత కేవలం నోటిమాట ద్వారానే అమెరికాలో అంచెలంచెలుగా ఎదిగింది. అలాంటి పరిణామాలు గమనించి చిత్రాల్ని ఎంపిక చేసే విధంగా కమిటీ కూర్పు ఉండాలి. RRR చిత్రబృందం ఈ పరిణామాల్ని గమనించింది. ఎంతో చాకచక్యంగా ప్రచారం సాగించింది. ఫలితంగా ఆస్కార్ వేదికకి చేరువయింది. అవార్డు రాకపోయినా కుంగిపోనక్కరలేదు. త్వరలోనే ఆరోజు వస్తుంది.

ఇంతకీ RRR నాకు నచ్చిందా అంటే నాకు అంత గొప్పగా అనిపించలేదనే చెప్పాలి. కానీ అందరికీ అన్ని చిత్రాలూ నచ్చాలని లేదు. అన్ని రకాల చిత్రాలు రావాలి. అధిక శాతం ప్రేక్షకులని కదిలించగలిగితే అది మంచి చిత్రమే. రాజమౌళి “గ్రాఫిక్స్ అనేది కథకి అవసరమైనంత ఉండాలి కానీ గ్రాఫిక్సే కథ కాకూడదు” అన్నారు. గ్రాఫిక్స్‌లో జంతువులను చూపించినపుడు మామూలుగా జంతువులు లేకుండా నటులతో షూటింగ్ చేసి తర్వాత జంతువుల గ్రాఫిక్స్‌ని జోడిస్తారు. కానీ RRR లో ముందు గ్రాఫిక్స్ చేసి తర్వాత దానికి అనుగుణంగా నటుల చేత నటింపజేశారు. ఈ ఆలోచన వచ్చిన మొదటివారు రాజమౌళియేనేమో.

ప్రస్తుతానికి డిసెంబర్ 11న లాస్ ఆంజెల్స్ సంఘం ప్రకటన మీదే నా దృష్టంతా! లాస్ ఆంజెల్స్ అంటే హాలీవుడ్ పరిశ్రమ నెలకొన్న నగరం. న్యూయార్క్ సంఘానికి RRR నచ్చిందంటే లాస్ ఆంజెల్స్ సంఘానికి నచ్చుతుందనే నా అభిప్రాయం. చూద్దాం!

న్యూయార్క్ సంఘం ప్రకటించిన అవార్డులు:

  • ఉత్తమ చిత్రం: టార్
  • ఉత్తమ దర్శకుడు: ఎస్. ఎస్. రాజమౌళి (RRR)
  • ఉత్తమ నటి: కేట్ బ్లాంచెట్ (‘టార్’)
  • ఉత్తమ నటుడు: కోలిన్ ఫారెల్ (‘ఆఫ్టర్ యాంగ్’ మరియు ‘ద బ్యాన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్’)
  • ఉత్తమ సహాయనటుడు: కె హుయ్ క్వాన్ (‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ అట్ ఒన్స్’)
  • ఉత్తమ సహాయనటి: కికి పామర్ (‘నోప్’)
  • ఉత్తమ స్క్రీన్ ప్లే: మార్టిన్ మెక్ డొనా (‘ద బ్యాన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్’)
  • ఉత్తమ ఛాయాదర్శకుడు: క్లాడియో మిరాండా (‘టాప్ గన్: మ్యావెరిక్’)
  • ఉత్తమ అంతర్జాతీయ చిత్రం: ఈఓ (పోలండ్)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here