[ప్రముఖ రచయిత శ్రీ సిహెచ్. సియస్. శర్మ రచించిన ‘డాక్టర్ అన్నా బి.యస్.యస్.’ నవలని ధారావాహికంగా పాఠకులకు అందిస్తున్నాము.]
[విమానంలో ప్రయాణిస్తున్న నారాయణమూర్తి డా. అన్నాని గుర్తుపట్టి మాటల్లో పెడతాడు. అన్నా తల్లిదండ్రుల గురించి ఆరా తీస్తాడు. వారెవరో అప్పుడు గుర్తొస్తుంది అన్నాకు. నారాయణమూర్తి కుటుంబ సభ్యులను పరిచయం చేస్తాడు. వీళ్ళందరినీ పావని ఆసక్తిగా గమనిస్తుంది. తన కూతురు పార్వతి త్వరలో గుంటూరు జిల్లా కలెక్టర్‍గా రాబోతోందని చెప్తాడు నారాయణరావు. అన్నాని తమ ఇంటికి ఆహ్వానిస్తారు. యుపి దుండగులతో కలసి రుద్రయ్య – రాఘవయ్యని చంపేందుకు కుట్ర పన్నుతాడు. అన్నా భుజంగవర్మకి ఫోన్ చేసి ఒకసారి తన ఇంటికి రమ్మని పిలుస్తాడు. తను కడుతున్న హాస్పటల్ వద్దకు వెళ్ళి నిర్మాణం ఎలా జరుగుతోందో పరిశీలిస్తాడు. వస్తూ దారిలో కృష్ణయ్య గారి షాపు వద్ద ఆగి రాఘవయ్య బావామరిది చలపతి అడ్రసు తీసుకుని వాళ్ళింటికి వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కుతాడు. ఒక అమ్మాయి వచ్చి తలుపు తీస్తుంది. ఇక చదవండి.]
[dropcap]“అ[/dropcap]మ్మా.. నీ పేరు?..” మెల్లగా అడిగాడు.
“చిన్నీ..”
‘హాస్టల్లో వుండవలసిన అమ్మాయి ఇక్కడ ఎందుకున్నట్టు?’ అనుకొన్నాడు అన్నా..
“మీ మామయ్యగారు వున్నారా?..”
“లేరు.. వారు పని మీద వైజాగ్ వెళ్లారు..”
ఇంతలో చిన్నీ అత్తయ్య గోవిందమ్మగారు రంగప్రవేశం చేశారు.
“ఏయ్.. చిన్నీ!.. ఎవరే?..” అడిగింది గోవిందమ్మ.
“ఎవరో అత్తయ్యా!.. వచ్చి చూడండి..” అంది మెల్లగా చిన్ని.
గోవిందమ్మ ద్వారాన్ని సమీపించింది. చిన్ని ప్రక్కకు తప్పుకొంది.
గోవిందమ్మను చూచిన అన్నా.. ‘నూట ఇరవై కేజీల ఆకారం.. మధ్య వయస్సు.. బహుళ శూర్పణఖ ఇలాగే వుండేదేమో.. ఇక పాపం.. చిన్నీ ఈ ఇంటి పనిపిల్ల.. గోవిందమ్మ ఆ అమ్మాయితో తన ఇష్టం వచ్చినట్టు ఆడుకొంటూ వుంటుంది, తాను కదలకుండా!.. ఆమె రాజభోగానికి ఈ రోజుతో తెరపడిపోవాలి..’ అనుకొన్నాడు అన్నా..
“అమ్మా! అయ్యగారు లేరా?..”
“ఏ అయ్యగారు?..”
“అదేందమ్మా!.. అలా అడుగుతారు?..”
“అత్తయ్యా.. వారు అడిగేది మామయ్యను గురించి..”
“ఓహెూ.. ఆ చలపతిగాడిని గురించా!..” నిర్లక్ష్యంగా అనేసింది గోవిందమ్మ.
అన్నా.. ఆశ్చర్యపోయాడు.. ‘గోవిందమ్మకు.. పతిదేవుడంటే చాలా భక్తి.. గౌరవంలా వుంది. ఒక్క మాటలో తెలిసిపోయింది..’ అనుకొన్నాడు. ముఖంలో చిరునవ్వు..
“ఏమండీ..”
“ఏమిటి..” నిర్లక్ష్యంగా అడిగింది గోవిందమ్మ..
“చిన్నీ నాన్నగారు.. నా దగ్గర వున్నారు.. వారు చిన్నీని చూడాలనుకుంటున్నారు. నేను ఆమెను నాతో తీసుకెళతాను..”
అనునయంగా చెప్పాడు.
చిన్నీ ముఖంలో ఆనందం..
“ఆ హంతకుడు జైలు నుంచి బయట పడ్డాడా..!”
“జైలు నుంచి విడుదల అయ్యారు.. కానీ.. ఆయన హంతకుడు కాదు.. అమ్మా.. చిన్నీ.. నీవు నాతో రావాలి. ఆ చేతిలోని చీపురుకట్ట గోడకు ఆనించి బయలుదేరు!..”
చిన్నీ.. చీపురును గోడకు ఆనించి.. గోవిందమ్మ ముఖంలోకి చూసింది.. జాలిగా..
“నేను పంపను..” బిగ్గరగా అరిచింది గోవిందమ్మ.
“అయితే.. మీరూ .. పోలీస్ స్టేషన్‌కు చేరుతారు.. మీరు చిన్నీని ఏ రీతిగా చూస్తున్నారనేదీ.. ఆమెను చూడటంతోనే నాకు అర్ధం అయింది.” ఆవేశంగా చెప్పాడు అన్నా.
గోవిందమ్మ భయపడింది. చిన్నీ.. గడపదాటి అన్నా పక్కకు వచ్చింది.
అన్నా చిన్నీ చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. ఇరువురూ కారు వైపుకు నడిచారు.
“చిన్నీ!.. ఇక నీవు తిరిగి ఈ ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు. నిన్ను ఎవరూ ఏమీ అనరు.. ఎవ్వరూ ఏమీ చేయలేరు.. నువ్వు ఆనందంగా.. ధైర్యంగా.. ఫ్రీగా.. కూర్చో.. గంటలోపల నీవు మీ నాన్నగారిని కలుసుకుంటావు..” ఆప్యాయంగా చెప్పాడు అన్నా.. కారు స్టార్ట్ చేశాడు.
ఆరోజు.. వుదయాన్నే రాఘవయ్యను డిశ్చార్జి చేసి తన ఇంటికి తీసుకొని వెళ్లాడు. అతనికి ఒక రూమ్.. పడక.. అన్ని వసతులూ.. చూపించాడు.
రాఘవయ్యకు వంటమనిషి సింధ్యాను, పనిమనిషి లక్ష్మిని పరిచయం చేశాడు.
“ఇది మీ ఇల్లే అనుకోండి. నిర్భయంగా వుండండి. కొంతకాలం మీరు మందులు వేసుకొంటూ విశ్రాంతి తీసుకోవాలి. మీకు ఎవరూ లేరనే కారణంతో మిమ్మల్ని నా యింటికి తీసుకొని వచ్చాను. సాయంత్రం వెళ్లి మీ అమ్మాయిని తీసుకొని వస్తాను.” అభిమానంతో చెప్పాడు అన్నా..
రాఘవయ్య పరమానందంతో వారికి నమస్కరించాడు.
“బాబూ!.. మీరు నిండా నూరేళ్లు చక్కటి ఇల్లాలు.. బిడ్డా.. పాపలతో వర్థిల్లుతారు!..” ఆనంద భాష్పాలతో మనసారా దీవించాడు.
అన్నాకు ఆ గతం గుర్తుకు వచ్చింది. నవ్వుకొన్నాడు..
‘పాపం.. రాఘవయ్యగారు తన కూతురును చూచేదానికి ఎంతో ఆతృతలో ఉంటారు. ఏడు సంవత్సరాల తర్వాత కలవబోతున్నారు కదా!..’ అనుకొన్నాడు.
చిన్ని ముఖంలోకి చూచాడు.. కళ్లు మూసుకొని వుంది.
ఆమె కళ్లనుండి కన్నీరు.. చెక్కిళ్ల పైకి దిగజారాయి.
‘పాపం.. చిన్నీ.. గతాన్ని తలచుకొని బాధ పడుతూ వుంది’.. అనుకొంటూ.. రోడ్డుకు ఎడమవైపున ఉన్న బట్టల షాప్
చూచి కారు ఆపి..
“చిన్నీ!.. కూర్చొని వుండు.. పది నిముషాల్లో వస్తాను..” అంటూ కారు దిగి షాపు వైపుకు నడిచాడు అన్నా..
రాఘవయ్యగారికి.. చిన్నీకి ఐదారు జతల బట్టలు వారి వయస్సుకు తగ్గట్టు షాపువారికి చెప్పి.. తీసుకొని.. బిల్ చెల్లించి నాలుగు కవర్లతో కారును సమీపించి వెనక సీట్లో వుంచి.. తన స్థానంలో కూర్చుని కారును స్టార్ట్ చేశాడు అన్నా. ఆ కవర్లను చూచిన చిన్నీ ఆశ్చర్యపోయింది. చిన్నీ తెలివి కలది. ఆ కవర్లలో వుండేవి బట్టలని అవి తనకేనని
గ్రహించింది. మనస్సున ధైర్యం.. పెదవులపై చిరునవ్వు..
కారు అన్నా ఇంటి కార్ పోర్టికోలో ఆగింది.
ఇంటి తలుపులు బార్లా తెరచి వున్నాయి.
రుద్రయ్య.. మరొకడు.. రాఘవయ్యను రెక్కలు పట్టుకొని లాక్కొని వస్తూ హాల్లోకి ప్రవేశించారు.
అన్నాను చూడగానే రాఘవయ్యను వదిలి పెట్టి పరిగెత్తబోయారు.
అన్నా సింహద్వారాన్ని మూసి ఇరువురినీ ఎటూ కదలనీయకుండా చేశాడు. ఇరువురిని మార్చి మార్చి చితకబాది ప్రక్కనవున్న గది తలుపు తీసి వాళ్లను లోనికి త్రోసి తలుపులు బిగించాడు.
క్రిందపడివున్న రాఘవయ్యను లేపి అతని గదిలోని మంచంపైకి చేర్చి వేగంగా వచ్చి సింహద్వారాన్ని తెరిచాడు.
కూరగాయల సంచీతో సింధ్యా.. అతని ప్రక్కన.. చిన్నీ.. దిగాలుపడి నిలబడి వున్నారు.
“రండి.. లోపలికి..” అన్నాడు అన్నా..
ఇరువురూ లోనికి ప్రవేశించారు.
చిన్నీ కళ్లు తన తండ్రికోసం.. నాలుగువైపులా గాలిస్తున్నాయి.. ఆమె ఆతృతను.. కళ్లలోని ఆవేదనను చూచి చేయి పట్టుకొని రాఘవయ్యగారు వున్న గదిలోకి తీసుకెళ్ళాడు అన్నా..
తండ్రిని ఏడేళ్ల తర్వాత చూచిన చిన్నీ.. అయోమయ స్థితి..
ఏడూస్తూ తననే చూస్తున్న చిన్నీని “తల్లీ.. చిన్నీ.. రా అమ్మా..” అన్న రాఘవయ్యగారి పిలుపు వినగానే రోదిస్తూ తన చేతులతో తండ్రిని చుట్టుకొంది చిన్నీ..
ఆ గది తలుపులు మూసి అన్నా హాల్లోకి వచ్చాడు. సింధ్యాకు జరిగిన విషయం వివరించాడు. రుద్రయ్యను, మరో వ్యక్తిని వుంచిన గది ముందు సింధ్యాను కాపలా పెట్టి రెస్టురూం లోకి వెళ్లాడు అన్నా..
స్నానం చేసి డ్రస్ మార్చుకొని హాల్లోకి వచ్చాడు. హాలువైపుకు వున్న కిటికీ తలుపులు తెరచి రుద్ర మరో వ్యక్తి వున్న గదిలోకి చూచాడు. ఇరువురూ బుసలు కొడుతూ గదిలో పచార్లు చేస్తున్నారు.
అన్నాను చూడగానే “పెద్ద తప్పు చేశావ్!.. ముందు ముందు చాలా కష్టాలు ఎదుర్కొంటావ్..” అంటూ రుద్రయ్య పెద్దగా ఆవేశంతో అరిచాడు.. పక్కనోడు వంతపాడాడు.
అన్నా నవ్వుతూ.. సోఫాలో కూర్చున్నాడు.. డీ.యస్.పి. శివ గారికి ఫోన్ చేశాడు. రమ్మని కోరాడు.
ఆ ప్రాంతంలోనే వున్న డి.యస్.పి. శివ.. “పావుగంటలో మీ ముందుంటాను సార్!..” అన్నాడు.
తేలికబడిన మనస్సు.. కళ్లల్లో క్రొత్త కాంతితో.. గది నుండి బయటికి వచ్చింది చిన్ని. చిరునవ్వుతో అన్నా.. సింధ్యా ముఖాల్లోకి చూచింది.
సింధ్యా తాను కారునుంచి తెచ్చి టీపాయ్‌పై పెట్టిన కవర్లను చిన్నీకి చూపుతూ..
“అమ్మా!.. ఈ బట్టలు నీకు.. మీ నాన్నగారికి.. ఆ గదిలోకి తీసుకెళ్లు.. ముఖం జిడ్డు కారుతోంది.. హాయిగా స్నానం చేసి బట్టలు మార్చుకో అమ్మా!..” అభిమానంతో చెప్పాడు సింధ్యా.
చిన్నీ “అలాగే అంకుల్!..” ఆ కవర్లను చేతుల్లోకి తీసుకొని తండ్రి వున్న గదిలోకి వెళ్లింది.
వాకిట్లో పోలీస్ జీప్ వచ్చి ఆగింది.
డీ.యస్.పి. శివ దిగి ఇంటివైపుకు హుందాగా నడవసాగాడు.
జీప్ సవ్వడి విని అన్నా వరండాలోకి వచ్చి మెట్లు దిగి.. శివను సమీపించి కరచాలనం చేసి.. చిరునవ్వుతో.. “ప్లీజ్.. వెల్‍కమ్ సార్!.. గుడ్ ఈవినింగ్!..”
“గుడ్ ఈవినింగ్.. డాక్టర్ అన్నా!.. ఏమిటి విషయం.. అర్జంటుగా రమ్మన్నారు..” అడిగాడు డి.యస్.పి. శివ.
“యస్ సార్!.. రండి..”
ఇరువురూ ఇంటి హాల్లో ప్రవేశించారు. “కూర్చొండి సార్!..”
డి.యస్.పి., శివ సోఫాలో కూర్చున్నారు.
వారికి ఎదురు సోఫాలో అన్నా కూర్చున్నాడు. సింధ్యా టీ కప్పులను ఇరువురికి అందించాడు. “ఎంతవరకూ వచ్చింది మీ హాస్పిటల్ నిర్మాణం?..”
“మరో ఐదారు మాసాల్లో ముగుస్తుంది..”
“ఆ.. నన్ను అర్జంటుగా రమ్మన్న విషయం?..”
“టీ త్రాగండి సార్!..” చిరునవ్వుతో చెప్పాడు అన్నా..
ఇరువురు టీ త్రాగారు. కప్పులు టీపాయ్ పైన వుంచారు.
“సార్!.. మీకు భుజంగవర్మగారు బాగా తెలుసుగా!..”
“బాగా కాదు.. నేను ఇక్కడికి వచ్చి ఆరు నెలలయింది. నేను ముందు మీరు తర్వాత వచ్చారు. చాలా గొప్ప వ్యక్తి అని వారిని గురించి విన్నాను..”.
“అలాగా..”
“అవును.. ఏం..?”
“ఏం లేదు సార్!.. నాతో రండి..”
అన్నా ముందు.. వెనుక శివ నడిచి రాఘవయ్య గారి గదిలో ప్రవేశించారు.
“వీరి పేరు రాఘవయ్య గారు..!”
ఆ సమయంలో చిన్నీ రెస్టురూమ్‌లో వుంది.
రాఘవయ్యగారు పడుకొని .. కళ్లు మూసుకొని వున్నాడు.
“రండి.. వారిని చూచారుగా!.. కూర్చొని మాట్లాడుకొందాం..” అన్నాడు అన్నా.
ఇరువురూ హాల్లోకి వచ్చారు. సోఫాల్లో కూర్చున్నారు.
డీ.యస్.పి. శివాతో అన్నా.. భుజంగవర్మకు రాఘవయ్యకు ఉన్న సంబంధం.. భుజంగరావు చేసిన నేరాన్ని గురించి.. దాన్ని రాఘవయ్య పైకి నెట్టి అతన్ని ఏడు సంవత్సరాలు జైలుపాలు చేసిన కథనాన్ని.. సవివరంగా చెప్పాడు.
చివరగా అతని ప్రేరణతో.. రాఘవయ్యను చంపడానికి వచ్చి గదిలో బంధింపబడిన రుద్రయ్య.. మరో రౌడీని గురించి చెప్పి .. కిటికీగుండా వారిని చూపించాడు.
శివ ఫోను చేశాడు.
జీప్ కూర్చుని వున్న నలుగురు పోలీసులు సంకెళ్లు తీసుకొని హాల్లోకి వచ్చారు. అన్నా గది తలుపులు తెరిచాడు..
పోలీసులు ఆ ఇరువురికీ సంకెళ్లు తగిలించారు. లాక్కొని పోయి జీపులో త్రోశారు. శివ చిరునవ్వుతో అన్నా ముఖంలోకి చూచాడు.
“డియర్ బ్రదర్!.. ‘మానవ సేవే.. మాధవ సేవ..’ పెద్దల మాటను మీరు తూ..చా.. తప్పకుండా పాటిస్తున్నారు.. నాలాగే!.. విత్ ప్రవుడ్ ఐ విల్ సెల్యూట్ యు సార్!..” వారి పద్ధతిలో శివ.. అన్నాకు సెల్యూట్ చేశాడు.
అన్నా.. చిరునవ్వుతో శివ చేతిని తన చేతిలోనికి తీసుకొన్నాడు. ఇరువురూ వీధి గేటును సమీపించారు. అన్నాకు బై చెప్పి.. శివ జీప్‌లో కూర్చున్నాడు. డ్రైవర్ స్టార్ట్ చేశాడు.
***
సమయం.. సాయంత్రం ఆరున్నర.. అన్నా హాల్లో కూర్చొని భుజంగవర్మ రాక కోసం ఎదురు చూస్తున్నాడు.
‘చాలా పెద్ద మనిషి.. తన ఇంటికి రమ్మని చెప్పి వుంచి.. నేనే వారి ఇంటికి వెళ్లి వుండేవాణ్ణి.. వస్తారో!.. రారో!..’ అనుకున్నాడు అన్నా.
భుజంగవర్మగారి ఆడి కారు వచ్చి వాకిటముందు ఆగింది. అన్నా లేచి వరండాలోకి వచ్చాడు. గేటు తెరుచుకొని భజంగవర్మ లోనికి వచ్చి వరండాను సమీపించారు.
“ప్లీజ్ కమ్!.. గుడ్ ఈవినింగ్!..” చిరునవ్వుతో చెప్పాడు అన్నా!..
అన్నా ముఖంలోకి క్షణం సేపు పరీక్షగా చూసి.. వ్యంగ్యంగా నవ్వుతూ.. మెట్లెక్కి వరండాలోకి ప్రవేశించాడు భుజంగవర్మ. “రండి!..” హాలు వైపుకు నడవబోయాడు అన్నా..
“బాగుంది.. ఇక్కడే కూర్చుందాం!..”
వరండాలోని ఒక కుర్చీలో కూర్చున్నాడు భుజంగవర్మ.. సాలోచనగా వీధివైపు చూడసాగాడు.
‘వీడు నన్ను రమ్మన్నది ఎందుకు?.. రాఘవయ్యను గురించి మాట్లాడటానికేనా!.. రుద్రయ్య.. పాండూలను గురించా!.. ఇతని చేతికి చిక్కిన పాండుగాడు ప్రాణభయంతో నా పేరును చెప్పేసుంటాడా..
ఏదిఏమైనా డిప్లమేటిక్‌గా మాట్లాడి వీడిని నా వైపుకు త్రిప్పుకోవాలి.. సామ.. దాన.. బేధోపాయలను అవసరాన్ని బట్టి ప్రయోగించాల్సివుంటుంది’ అనుకున్నాడు భుజంగవర్మ.
“సింధ్యా!..” పిలిచాడు అన్నా .. కుర్చీలో కూర్చుంటూ..
“సాబ్..” గొంతును వినిపించాడు సింధ్యా..
“ఏం తీసుకొంటారు.. కాఫీ.. టీ.. గ్రీన్ టీ..” చిరునవ్వుతో అడిగాడు అన్నా..
“ఏమీ వద్దు!..”
“గ్రీన్ టీ తీసుకోండీ.. ఆరోగ్యానికి మంచిది..”
సింధ్యా వచ్చాడు.
“దో గ్రీన్ ఛాయ్.. లావ్”
తల ఆడించి సింధ్యా లోనికి వెళ్లిపోయాడు.
“సార్!.. మీ వంశానికి ఈ ప్రాంతంలో చాలా గొప్ప పేరు వుందని విన్నాను. నా వుద్దేశంలో మన చర్యల వలన సమాజంలో మన పెద్దలకు ఉన్న మంచిపేరుకు మలినం ఆపాదించకూడదని నా అభిప్రాయం. ఈ విషయంలో మీ అభిప్రాయం?..” చిరునవ్వుతో సూటిగా భుజంగవర్మ కళ్లల్లోకి చూస్తూ అడిగాడు అన్నా..
(ఇంకా ఉంది)