మరుగునపడ్డ మాణిక్యాలు – 23: ద గ్రీన్ మైల్

2
3

[dropcap]మ[/dropcap]నిషికి అతీంద్రియశక్తులుంటే ఏం చేస్తాడు? వైరాగ్యం ఉన్నవాడైతే ఆ శక్తిని మంచి కోసం ఉపయోగిస్తాడు. సాయిబాబా అవతారం అలాంటిదే. ధనం కానీ, కీర్తి కానీ కావాలనుకునేవాడు ఆ శక్తిని అమ్మకానికి పెడతాడు. అమాయకుడైతే ఆ శక్తిని అర్థం చేసుకోలేక యాతన పడతాడు. ప్రపంచంలోని రాక్షసత్వం చూసి మనుషులెందుకిలా ఉన్నారని మథనపడతాడు. అలాంటి ఒక వ్యక్తి కథే ‘ద గ్రీన్ మైల్’ (1999). స్టీఫెన్ కింగ్ నవల ఆధారంగా రూపొందించిన చిత్రమిది. స్టీఫెన్ కింగ్ నవలల్లో అతీంద్రియ శక్తులు ఎక్కువగా కనపడతాయి. అదే పంథా ఈ చిత్రంలో అనుసరించారు. నెట్‌ఫ్లిక్స్‌లో లభ్యం.

1935లో పాల్ అమెరికాలోని ఒక కారాగారంలో ప్రధాన సంరక్షుకుడిగా పని చేస్తుంటాడు. పాల్‌కి భర్య, ఒక కొడుకు. కొడుకు వేరే ఊళ్ళో కాలేజీలో చదువుకుంటూ ఉంటాడు. కారాగారంలో పాల్ కింద నలుగురు సంరక్షకులు ఉంటారు. వీళ్ళు పని చేసే విభాగం మరణశిక్ష పడిన ఖైదీల విభాగం. మరణశిక్ష అమలు చేసే ముందు ఖైదీలు ప్రశాంతంగా ఉండేలా చూడాలని పాల్ అభిమతం. అతని కింద పనిచేసేవారు కూడా అలాగే భావిస్తారు. ఒక్కడు తప్ప. ఆ ఒక్కడి పేరు పెర్సీ. అతను గవర్నర్ భార్యకి మేనల్లుడు. సిఫారసు మీద కొత్తగా ఉద్యోగం వచ్చింది. మరణశిక్ష అమలు చేసేటపుడు దగ్గర నుంచి చూడాలని అతని దుర్మార్గపు కాంక్ష. అప్పట్లో మరణశిక్ష అమలు చేయటానికి నేరస్థుల శరీరంలోకి విద్యుత్తుప్రసారం చేసేవారు. వారు గిలగిలా కొట్టుకుని ప్రాణాలు విడుస్తుంటే చూడాలని పెర్సీ కోరిక.

ఆ జైలుకి జాన్ కాఫీ అనే ఖైదీ వస్తాడు. అతను భారీ శరీరం కలవాడు. నల్లజాతి వాడు. నిరక్షరాస్యుడు. ఒంటి మీద కత్తిగాయాలైనట్టు మచ్చలు ఉంటాయి. అయితే అతను నెమ్మదస్తుడు. పాల్ అతన్ని చూసి కాస్త జంకినా అతని మాటతీరు చూసి ఊపిరి పీల్చుకుంటాడు. అతని నేరమేమిటంటే ఇద్దరు బాలికల మీద అత్యాచారం చేసి చంపేశాడని. ఇదిలా ఉండగా ఒకరోజు ఒక ఎలుక జైలులోకి వస్తుంది. మామూలు ఎలుకల్లా బెదరదు. మనుషుల దగ్గరకి వస్తుంది. డెల్ అనే ఒక ఖైదీ దాన్ని మచ్చిక చేసుకుంటాడు. అది చిన్న చిన్న విన్యాసాలు చేస్తుంటుంది. అందరూ అది చూసి ముచ్చటపడతారు. పెర్సీ తప్ప.

పాల్‌కి మూత్రకోశానికి సంబంధించిన వ్యాధి వస్తుంది. మూత్రవిసర్జనలో చాలా బాధ అనుభవిస్తుంటాడు. అదే తగ్గిపోతుందనుకుంటాడు కానీ బాధ ఎక్కవవటంతో డాక్టరు దగ్గరకి వెళదామనుకుంటాడు. ఆరోజు పని అయిన తర్వాత వెళదామని అతని ఆలోచన. ఆరోజు బిల్ అనే కొత్త ఖైదీ వస్తాడు. అతనొక ఉన్మాది. ఒక గర్భవతితో సహా ముగ్గురిని చంపటంతో అతనికి శిక్ష పడింది. జైల్లోకి రాగానే అతను గార్డుల మీద దాడి చేస్తాడు. పాల్‌ని మర్మస్థానం మీద కొడతాడు. పాల్ బాధతో విలవిలలాడి నేల మీద పడిపోతాడు. పడి ఉన్న పాల్‌ని జాన్ తన జైలు గది దగ్గరకు రమ్మని అడుగుతాడు. ఎంత చెప్పినా అదే మాట అనటంతో పాల్ వెళతాడు. జాన్ కటకటాల మధ్యనుంచి పాల్ మర్మస్థానంపై చేయి వేసి తన అతీంద్రియ శక్తిని ఉపయోగించి పాల్ వ్యాధిని తన లోనికి తీసుకుంటాడు. తర్వాత తన నోటి ద్వారా ఆ వ్యాధిని ఎగిరే పురుగుల రూపంలో వదిలేస్తాడు. ఆ పురుగులు గాలిలోకి ఎగిరి మాయమైపోతాయి. ఇది జరిగినపుడు అక్కడ వేరెవరూ ఉండరు. పాల్ వ్యాధి నయమౌతుంది.

జాన్ మంచితనం, అతని శక్తి చూసి పాల్ అతను నిరపరాధి అని భావిస్తాడు. అతని లాయరు దగ్గరకి వెళతాడు. అతని లాయరు అతను అపరాధేనని అంటాడు. కొందరు మనుషులు చూడటానికి సాత్వికుల్లా ఉంటారు కానీ వారిలో రాక్షసత్వం ఉంటుందని అంటాడు. పాల్ ఏమీ చేయలేక తిరిగి వచ్చేస్తాడు. ఒకరోజు డెల్ దగ్గర ఉన్న ఎలుక బయటికి వచ్చినపుడు పెర్సీ దాన్ని తొక్కేస్తాడు. బిల్ తన మీద దాడి చేసినపుడు డెల్ తనని చూసి నవ్వాడని పెర్సీకి అక్కసు. జాన్ ఎలుకకి ఇంకా ప్రాణం ఉండే ఉంటుందని, తన దగ్గరకి తీసుకురమ్మని అంటాడు. దాన్ని బతికిస్తాడు. ఇది పెర్సీ తప్ప అందరూ చూస్తారు. జాన్ శక్తికి ఎంతో ఆశ్చర్యపడతారు. తర్వాత ఎలుక బతికి ఉండటం చూసి పెర్సీ డెల్ మీద ఇంకా పగ పెంచుకుంటాడు.

ఇంతలో డెల్‌కి మరణశిక్ష అమలు చేసే రోజు వస్తుంది. ఆ పని తనని చేయనిస్తే తాను వేరే ఉద్యోగం చూసుకుని వెళ్ళిపోతానని పెర్సీ పాల్‌తో అంటాడు. పెర్సీని ఎలాగినా వదిలించుకోవాలని పాల్ ఒప్పుకుంటాడు. డెల్ ఎలుకని తన వద్ద ఉంచుకుంటానని జాన్ తీసుకుంటాడు. మరణశిక్ష అమలు చేసేటపుడు తల పైభాగంలోకి విద్యుత్తు పంపిస్తారు. వైరుకి, తలకి మధ్య ఒక తడి స్పాంజ్ పెడతారు. దీని వల్ల త్వరగా విద్యుత్తు ప్రసారం జరిగి ప్రాణం తొందరగా పోతుంది. కారుణ్యంతో పెట్టిన పద్ధతి ఇది. అయితే పెర్సీ డెల్ తల మీద పొడి స్పాంజ్ పెడతాడు. దానితో మంటలు రేగి డెల్ కాలిన గాయాలతో మరణిస్తాడు. జైలు వార్డెన్ అయిన హాల్ అగ్గి మీద గుగ్గిలం అవుతాడు. పెర్సీ తాను తెలియక తప్పు చేశానంటాడు. పాల్ వార్డెన్‌ని సముదాయిస్తాడు. పెర్సీ వేరే ఉద్యోగానికి వెళ్ళిపోతున్నాడని తెలిసి హాల్ శాంతిస్తాడు. హాల్ భార్యకి మెదడులో కణితి ఉంటుంది. హాల్, పాల్ మంచి స్నేహితులు. జాన్‌ని హాల్ భార్య దగ్గరకి తీసుకెళ్ళి ఆమె వ్యాధి నయం చేయాలని పాల్ అనుకుంటాడు. హాల్‌కి తెలియకుండా జాన్‌ని బయటకు తీసుకెళ్ళాలని అతని కింది గార్డుల సహాయం అడుగుతాడు. అనుకోనిదేదైనా జరిగితే తమ ఉద్యోగాలు పోవటమే కాక తమకు జైలు శిక్ష పడవచ్చని తెలిసినా వారు ఒప్పుకుంటారు. ఇక్కడ కథ అనుకోని మలుపు తిరుగుతుంది.

మరణశిక్ష పడిన ఖైదీలుండే విభాగాన్ని ‘లాస్ట్ మైల్’ అనటం పరిపాటి. అంటే చివరి మజిలీ అని అనుకోవచ్చు. ఈ కారాగారంలో నేల మీద వేసిన గచ్చు లేత ఆకుపచ్చ (గ్రీన్) గా ఉండటంతో దాన్ని ‘ద గ్రీన్ మైల్’ అంటారు. అదే చిత్రం పేరు. జాన్ అతీంద్రియ శక్తులని చూసి పాల్ “దేవుడు ఇలాంటి శక్తి ఇచ్చాడంటే జాన్ మామూలు మనిషి కాదు. అలాంటివాడు నేరం చేయడు” అంటాడు. జాన్ భారీ కాయం ఉన్నా ఎంతో సౌమ్యంగా ఉంటాడు. అతన్ని కాపాడాలని పాల్ తాపత్రయం. అయితే అతను బాలికల శవాలని తన ఒళ్ళో పెట్టుకుని ఉండగా పోలీసులకి దొరికాడు. పైగా నల్లజాతి వాడు. ఆరోజుల్లో ఆ ఒక్క కారణం చాలు శిక్ష వేయటానికి. అతను నేరం చేయలేదని మనకి కూడా తెలుసు. అయితే అతను తనని తాను ఎందుకు కాపాడుకోడు? అతనికి ప్రపంచంలో జరిగే దారుణాలు చూసి విరక్తి కలిగింది. అందుకే మరణానికి వెనుకాడడు. అమాయకుడు కాబట్టి అతన్ని కాపాడాలని పాల్ అనుకుంటాడు. అతన్ని కాపాడటం మంచిదా లేక అతనికి మరణం ద్వారా విముక్తిని ప్రసాదించటం మంచిదా? యోగులైన వాళ్ళు మరణానికి సిద్ధంగా ఉంటారు. అయితే మరి వారి శక్తులు వృథా కావలసిందేనా? ఇలాంటి ప్రశ్నలు ఆలోచింపజేస్తాయి. జాన్ పూర్తి పేరు జాన్ కాఫీ. పొడి అక్షరాలలో JC. జీసస్ క్రైస్ట్ పేరులో పొడి అక్షరాలు కూడా అవే. క్రీస్తు కూడా తనకు పడిన మరణ శిక్షని ఆహ్వానించాడు. ఆ సామ్యం ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఒక వ్యత్యాసం ఉంటుంది. జాన్ దుర్మార్గులని శిక్షించాలనే అభిప్రాయంతో ఉంటాడు. ఎలా శిక్షించాడనేది మిగతా కథ.

పాల్ మంచి మనసున్న మనిషి. అయితే ఉద్యోగరీత్యా మనుషుల్ని చంపాలి. తరచు నిద్రపట్టక బాధపడుతుంటాడు. అలాంటి ఉద్యోగంలో అది సహజమే. ఉద్యోగం కాబట్టి నిమిత్తమాత్రంగా చేస్తాడు. కారుణ్యంతో వ్యవహరిస్తాడు. “ఖైదీలని హాస్పటల్లో ఐసీయూలో ఉన్న పేషంట్లలాగా జాగ్రత్తగా చూసుకోవాలి” అంటాడు. ఒక ఖైదీ మరణశిక్షకి సిద్ధపడుతూ “చేసిన నేరానికి పశ్చాత్తాపపడితే మనిషి మరణించాక తన గతంలో అనుభవించిన ఆనందమయ క్షణాల్లోకి వెళతాడంటారా? అదే స్వర్గమంటారా?” అని పాల్‌ని అడుగుతాడు. మరణించే ముందు మనిషి ఆలోచనలు పరిపరివిధాలుగా ఉంటాయనటానికి ఇదో ఉదాహరణ. “స్వర్గమంటే అలాగే ఉంటుందని నా నమ్మకం” అంటాడు పాల్. స్వర్గనరకాలన్నవి మనసులోనే ఉంటాయి. మనసు స్వచ్ఛంగా ఉంటే అదే స్వర్గం. పశ్చాత్తాపపడి అయినా మనసుని స్వచ్ఛంగా చేసుకోవాలి.

పాల్ జాన్ తరఫున వాదించిన లాయరు ఇంటికి వెళ్ళినపుడు ఆ లాయరు తనకి ఒక కుక్క ఉండేదని, ఎంతో సౌమ్యంగా ఉండేదని, అయితే ఒకరోజు అకస్మాత్తుగా తన కొడుకు మీద దాడి చేసిందని చెప్తాడు. ఆ దాడి వల్ల అతని కొడుక్కి ఒక కన్ను పోతుంది. జాన్ కూడా ఆ కుక్క లాంటి వాడేనని అంటాడు. సౌమ్యంగా ఉన్నా కొందరు ఘోరమైన నేరాలు చేస్తారని అంటాడు. అయితే ఆ లాయరు మరచిపోయినదేమిటంటే జంతువులకి విచక్షణ బుద్ధి ఉండదు. మనిషికి ఉంటుంది. పైగా తనకి జరిగిన అన్యాయానికి తన దృష్టికోణాన్ని మార్చుకుని అదే అందరికీ వర్తిస్తుందని అనుకోవటం తప్పు. చెప్పటం తేలికే కానీ ఆచరణ కష్టం. అలాంటి లాయరు జాన్ తరఫున వాదించటం జాన్ దురదృష్టం. మనిషిని అతని స్వభావం ఆధారంగా అంచనా వేయాలి కానీ భారీ కాయం, జాతిని బట్టి కాదు. జాన్ కూడా నిర్వేదంలో సంజాయిషీ ఇచ్చుకోకపోవటంతో అతనికి శిక్షపడింది.

డెల్‌కి మరణశిక్ష అమలు చేసే ముందు అతను తన ఎలుక గురించి దిగులుపడుతూ ఉంటాడు. పాల్, అతని సహచరుడు ఆ ఎలుకని ఫ్లోరిడాలో ఉన్న ఎలుకల పార్కుకి తీసుకెళతామని చెబుతారు. ఫ్లోరిడాలో వినోదం అందించే పార్కులు ఎక్కువ. డిస్నీ పార్కు కూడా ఉంది. మిక్కీ మౌజ్ (కార్టూన్ ఎలుక) అక్కడ ప్రధాన ఆకర్షణ. ఈ చిత్ర కథ జరిగేటప్పటికి ఆ పార్క్ లేదు. ఎలుకలకి కూడా పార్క్ ఉంటుందా అంటే ఇప్పుడు ఉంది కదా! డెల్ పాల్ మాటల్ని నమ్ముతాడు. తన ఎలుక క్షేమంగా ఉంటుందని సాంత్వన పొందుతాడు. అయితే అతను చనిపోయే కొన్ని క్షణాల ముందు “నా ఎలుక గురించి మరచిపోవద్దు” అంటే పెర్సీ “పాల్ నీకు అబద్ధం చెప్పాడు. అలాంటి పార్కేం లేదు” అంటాడు కర్కశంగా. బాధ పెట్టే నిజం చెప్పటం కంటే సంతోషపెట్టే అబద్ధం చెప్పటమే గొప్ప. అది తెలియనివారు నిర్దయులే.

పాల్‌గా టామ్ హ్యాంక్స్, జాన్‌గా మైకెల్ క్లార్క్ డంకన్ నటించారు. మైకెల్‌కి ఉత్తమ సహాయనటుడిగా ఆస్కార్ నామినేషన్ వచ్చింది. ఫ్రాంక్ డారబాంట్ స్కీన్ ప్లే వ్రాసి దర్శకత్వం వహించాడు. ఆయన తీసిన ‘ద షాషాంక్ రిడెంప్షన్’ (1994) చిత్రం ఒక క్లాసిక్ చిత్రంగా నిలిచిపోయింది. ఈ చిత్రం కూడా అద్భుతంగా మలిచాడు. చిత్రం చాలా భాగం జైలు సెట్టులోనే జరుగుతుంది. అద్భుతమైన సెట్టు వేశారు. లైటింగ్, ఫొటోగ్రఫీ కూడా బాగా కుదిరింది. కథలో అన్ని విషయాలు ప్రేక్షకుడికి బాగా అర్థమయేలా స్క్రీన్ ప్లే ఉంటుంది. మూడు గంటలపైనే చిత్రం ఉన్నా ఒక్కడా బోరు కొట్టదు. స్క్రీన్ ప్లే కి ఆస్కార్ నామినేషన్ వచ్చింది. హాల్ భార్య గురించి పాల్ ఎందుకు అంతగా చింతిస్తాడనేదానికి కథలో అంతర్భాగంగా వారి కుటుంబాలు స్నేహితులని చెబుతూ సన్నివేశాలు ఉంటాయి. ఇలాంటి సన్నివేశాలు లేకపోతే చిత్రం అసంపూర్తిగా ఉండేది. అన్ని పాత్రల స్వభావాలు అద్భుతంగా ఆవిష్కరించారు. చిన్న పాత్రని కూడా శిల్పం చెక్కినట్టు చెక్కారు. ఇంకా ఈ చిత్రానికి ఉత్తమ చిత్రం, ఉత్తమ సౌండ్ నామినేషన్లు కూడా వచ్చాయి. డెల్ కి మరణశిక్ష అమలు చేసే సన్నివేశాల్లో సౌండ్ ప్రభావవంతంగా ఉండటంతో ప్రేక్షకులకి అదెంత దారుణమో అనుభూతికి వస్తుంది.

ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత క్రింది విశ్లేషణ చదవవచ్చు.

జాన్‌ని హాల్ భార్య దగ్గరకి తీసుకువెళ్ళటానికి పథకం వేస్తారు పాల్, అతని సహచరులు. పెర్సీని ఒక చిన్న గదిలో బంధిస్తారు. డెల్‌ని చిత్రహింసలకి గురిచేసి చంపినందుకు అతనికి అది శిక్ష అంటాడు పాల్. ఆ గది మితిమీరి ప్రవర్తించే ఖైదీలకు అదనపు శిక్ష కోసం ఉపయోగిస్తారు. బిల్‌కి అతని దుష్ప్రవర్తన కారణంగా ఆ శిక్ష రెండుసార్లు పడింది. అప్పటి నుంచి బిల్ ఆకతాయి పనులు చేయకుండా ఉంటాడు. జాన్‌ని బయటకి తీసుకెళ్ళాలంటే బిల్‌కి తెలియకూడదు. జాన్, బిల్ తప్ప గ్రీన్ మైల్‌లో ఖైదీలింకెవరూ ఉండరు. బిల్‌కి మత్తు మందు ఇస్తారు. అతను మత్తుగా పడి ఉంటాడు. రాత్రి పూట జాన్‌ని తీసుకెళుతుండగా బిల్ హఠాత్తుగా లేచి కటకటాల మధ్య నుంచి జాన్ చేయి పట్టుకుంటాడు. అందరూ ఖంగు తింటారు. బిల్ చేయి పట్టుకోవటంతో జాన్‌కి తన అతీంద్రియశక్తి ద్వారా బిల్ చేసిన నేరాలు కనిపిస్తాయి. బాధగా “నువ్వు చెడ్డవాడివి” అంటాడు. మత్తు ప్రభావంతో బిల్ జాన్ చేయి వదిలేసి పడిపోతాడు.

జాన్‌ని జాగ్రత్తగా ఒక చిన్న ట్రక్కులో తీసుకెళతారు. హాల్ ఇంటికి చేరుకునేసరికి ట్రక్కు శబ్దం విని హాల్ తుపాకీ తీసుకుని బయటకు వస్తాడు. అతన్ని సముదాయించి జాన్‌ని లోపలికి తీసుకువెళతారు. జాన్ హాల్ భార్య వ్యాధిని తనలోకి తీసుకుంటాడు. ఆమె పూర్తిగా కోలుకుంటుంది. మామూలుగా జాన్ ఇతరుల వ్యాధిని తన నోటి ద్వారా పురుగుల రూపంలో వదిలేస్తాడు. అయితే ఈసారి అలా జరగదు. జాన్ గొంతుకి ఏదో అడ్డుపడినట్టు బాధపడుతూ ఉంటాడు. అతన్ని తీసుకుని తిరిగి జైలుకి వస్తారు పాల్ బృందం. అతన్ని అతని గదిలో బంధిస్తారు. పెర్సీని విడుదల చేస్తారు. అతను జాన్ గది పక్కగా వెళుతుంటే జాన్ పట్టుకుంటాడు. పాల్ బృందం ఎంత వారించినా వదలడు. తన నోటిని పెర్సీ నోటి దగ్గర పెట్టి తనలో అదిమి పెట్టుకున్న వ్యాధిని పురుగుల రూపంలో అతనిలోకి పంపిస్తాడు. పెర్సీ అచేతనంగా బిల్ గది వైపుకి వెళతాడు. బిల్ మత్తు నుంచి తేరుకుని ఉంటాడు. పెర్సీని దుర్భాషలాడతాడు. పెర్సీ తన గన్ తీసి బిల్‌ని కాల్చి చంపేస్తాడు. ఇదంతా రెప్పపాటులో జరిగిపోతుంది. పాల్ జాన్ దగ్గరకి వెళ్ళి ఎందుకలా చేశావు అని అడుగుతాడు. పెర్సీ, బిల్ ఇద్దరూ చెడ్డవారు కాబట్టి వారిని శిక్షించానంటాడు జాన్. బిల్ చేసిన తప్పేమిటి అని అడుగుతాడు పాల్. జాన్ పాల్ చేయి పట్టుకుని తన అతీంద్రియ శక్తి అతనికి బదిలీ చేస్తాడు. ఆ శక్తి ద్వారా జాన్ చంపాడని చెబుతున్న బాలికలని నిజానికి బిల్ చంపాడని పాల్‌కి కనపడుతుంది. జాన్ ఆ బాలికలని కాపాడటానికి ప్రయత్నించాడు కానీ అప్పటికే ప్రాణం పోవటంతో ఏమీ చేయలేకపోయాడు. ఆ పిల్లలు అతని ఒళ్ళో ఉండటం చూసి అందరూ అతనే వారిని చంపాడని అనుకున్నారు. “ఈ ప్రపంచం కుళ్ళిపోయింది” అంటూ జాన్ బాధపడతాడు. పెర్సీ మతిభ్రమించి ఉండిపోతాడు. హాల్ వచ్చి “ఇక్కడ జరిగినదానికి, మా ఇంట్లో జరిగినదానికి ఏమన్నా సంబంధం ఉందా?” అని అడుగుతాడు. లేదని అబద్ధం చెబుతాడు పాల్.

జాన్‌కి మరణశిక్ష దగ్గరపడటంతో పాల్ అతని దగ్గరకి వెళ్ళి “నువ్వు పారిపోవటానికి సహాయం చేయమంటావా?” అంటాడు. “ఎందుకు?” అంటాడు జాన్. “దేవుడి ఎదుట నిల్చున్న రోజు ‘నా దూతని ఎందుకు చంపావు’ అని అడిగితే ఏం చెప్పాలి?” అంటాడు పాల్. “నా మీద దయతో చంపావని చెప్పు” అంటాడు జాన్. మళ్ళీ “ఈ ప్రపంచంలో నేను అలిసిపోయాను. ఈ క్రౌర్యాన్ని నేను చూడలేను” అంటాడు. మరణశిక్ష అమలు చేసే రోజు చనిపోయే ముందు ఏమైనా చెప్పదలుచుకున్నావా అని అడిగితే “నేను ఇలా ఉన్నందుకు బాధపడుతున్నాను” అంటాడు. మరణశిక్ష అమలు జరుగుతుంది. పాల్‌కి జాన్ తన శక్తి బదిలీ చేయటంతో పాల్ చాలాకాలం బతుకుతాడు. ఒక వృద్ధాశ్రమంలో ఉంటాడు. అతని వయసు 108 కి చేరుకుంటుంది. రోజూ అడవిలోకి వెళ్ళి వస్తుంటాడు. చివరికి తెలిసేదేమిటంటే డెల్ ఎలుక కూడా బతికే ఉంటుంది. దానికి తిండి పెట్టటానికి పాల్ రోజూ అడవిలోకి వెళుతుంటాడు. ఆ ఎలుకకి కూడా జాన్ తన శక్తిని ఇచ్చాడన్నమాట. అందుకే అన్ని రోజులు బతికింది.

తనకు లభించిన దీర్ఘాయువు దేవుని దూతని చంపినందుకు పడిన శిక్షగా పాల్ భావిస్తాడు. కళ్ళ ముందే భార్య, స్నేహితులు, చివరకు కొడుకు కూడా ఒక్కొక్కరుగా చనిపోతారు. తానెంత వరకు బతుకుతాడో తెలియదు. జాన్ మృత్యువుని ఆహ్వానించి విముక్తిని పొందాడు. పాల్‌కి దీర్ఘాయువు ఒక శాపంలా మారింది. జీవితమే ఒక గ్రీన్ మైల్ అని పాల్ అంటాడు. ఒక్కొక్కరు త్వరగా గ్రీన్ మైల్ దాటుకుని వెళ్ళిపోతారు. ఒక్కొక్కరికి గ్రీన్ మైల్ ఎంతకీ తరగదు. దేవుడి అభీష్టం ఇంతేనని సాగిపోవటమే.

ఇంతకీ జాన్ “నేను ఇలా ఉన్నందుకు బాధపడుతున్నాను” అని ఎందుకన్నాడు? తాను పిరికివాడినని జాన్ అభిప్రాయం. దేవుడు తనకి ఒక శక్తినిస్తే దానిని ఉపయోగించటానికి భయపడ్డాడు. దారుణాలు చూడలేకపోయాడు. అయితే ఆ శక్తిని పాల్ లాంటి మంచి వ్యక్తికి బదిలీ చేసి కాస్త ఊరట పొందాడు. కొన్ని శక్తులు కూడా ఒక్కోసారి శాపాలుగా మారిపోతాయి. అయితే దేవుడు జాన్ బాధని చూడలేక అతనికి విముక్తిని ప్రసాదించాడనే అనుకోవాలి. లేకపోతే జాన్‌కి శక్తిని ఇచ్చిన భగవంతుడు అతన్ని కాపాడలేడా? దేవుడి లీలలు అర్థం చేసుకోవటం కష్టం. జయవిజయులు మూడు జన్మలు ఎత్తి పాపాలు చేశారు. వారిని చంపి మహావిష్ణువు వారికి ముక్తిని ప్రసాదించాడు. ఇది వారు కోరుకున్నదే. పైకి మాత్రం వారి పాపాలు, శిక్షలు మాత్రమే కనపడతాయి. అన్నీ దేవుడి అభీష్టం మేరకే జరుగుతున్నాయి అనుకున్నాడు కాబట్టే జాన్ సంతోషంగా వెళ్ళిపోయాడు. తనకు అన్యాయం జరుగుతోందని అనుకోలేదు. ధర్మమార్గంలో ఉంటూ ఏం జరిగినా దేవుడి అభీష్టమే అనుకోవటం ఉత్తమం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here