[dropcap]యు[/dropcap]ద్ధం అంటే ధర్మం కోసం చేసే పోరాటం. మనుషులను ఎలా బడితే అలా చంపకూడదు. యుద్ధం చేయటానికి కూడా నీతి ఉంటుంది. మొదట రాయబారం పంపించి సంధి ప్రయత్నం చేయాలి. సంధి కుదిరితే జననష్టం, ఆస్తినష్టం తప్పుతుంది. రాయబారి చెప్పిన మాటలు ఎంత కోపం తెప్పించినా ఆ వ్యక్తిని చంపకూడదు. ఎందుకంటే అవి అతని మాటలు కాదు, యజమాని చెప్పమన్న మాటలు చెబుతున్నాడు. సంధి విఫలమైతే ఆఖరి ప్రయత్నం గానే యుద్ధం చేయాలి. యుద్ధానికి బయలుదేరేటప్పుడు రాజుతో పాటు పరిచారికలు, రాణివాసం, భటులు, వంటవారు, వైద్యులు కూడా వెంటే వస్తారు. యుద్దరంగానికి దూరంగా శిబిరాలు వేసుకుంటారు.
సూర్యోదయం నుంచీ సూర్యాస్తమయం వరకు యుద్ధం చేస్తారు. సూర్యుడు అస్తమించిన తర్వాత యుద్ధం ఆపేసి శిబిరాలకు తిరిగివచ్చి, శరీరానికి గుచ్చుకున్న బాణాలు తీసివేసి, వైద్యుల చేత వైద్యం చేయించుకుంటారు. భోజనాలు చేసి ఆ రాత్రి విశ్రాంతి తీసుకుని, మర్నాడు మళ్ళీ యుద్ధానికి సిద్ధం అవుతారు. ఎవరైనా యుద్ధరంగంలో ఉన్నవారితోనే యుద్ధం చేయాలి తప్ప, దూరంగా ఉన్న రక్షక భటులు, రాణివాసం, పరిచారకులు మొదలైన వారి మీద బాణాలు వేయకూడదు. నిద్రించేవారిని వధించకూడదు. యుద్ధంలో కూడా వేరొకరితో పోరుతున్నప్పుడు వెనక నుంచీ బాణాలు వేయకూడదు, వెన్నుపోటు పొడవకూడదు (రాముడు వెనక నుంచే వాలి మీద బాణం వేసాడు కదా! అనే సందేహం రావచ్చు. క్షత్రియులు క్రూర జంతువులను వెనక నుంచే బాణాలు వేసి వేటాడతారు. వాలి వానరుడైనా క్రూర జంతువులా ప్రవర్తించాడు. కనుక రాముడు అతడిని వేటాడాడు. యుద్ధం చేయలేదు. కాబట్టి వాలిని చెట్టుచాటు నుంచీ కొట్టటం ధర్మమే!). యుద్ధరంగంలో ఎదురుగా నిలబడి యుద్ధం చేయాలి, ఎదురునుంచీ ఎంత మందైనా పోరాడవచ్చు. ఒకడు అనేకమందితో యుద్ధం చేస్తే దానిని సంకీర్ణ యుద్ధం అంటారు. ఆయుధాలు లేకుండా ఇద్దరి మధ్య జరిగే పోరాటాన్ని ద్వంద్వ యుద్ధం అంటారు.
యుద్ధం జరిగేటప్పుడు రథికుడిని జయించిన తర్వాతే సారథి మీద బాణం వేయాలి. రథికుడి జోలికి వెళ్ళకుండా సారథిని చంపటం అధర్మం. సారథి రథికుడి మనోభావాలను, యుద్ధం చేసే విధానాన్ని గమనిస్తూ రథం నడపాలి. కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రమే ఫలానా దిక్కుకు పోనివ్వమని రథికుడు చెబుతాడు. ఇతర సమయాలలో స్వయం నిర్ణయం తీసుకుంటాడు సారథి. అలా కైకేయి కూడా ఒకసారి దశరథుడికి సారథ్యం వహిస్తుంది. అదెలా జరిగిందంటే –
దండకారణ్యంలో దక్షిణం వైపు వైజయంతపురం అనే రాజ్యం ఉంది. దానికి రాజు తిమిధ్వజుడు అనే రాక్షసుడు. ఇతడికే శంబరాసురుడు అని పేరు. అతడు అమరావతి పైన దండెత్తాడు. దేవేంద్రుడు తన బలం చాలదు అనుకున్నప్పుడు అమిత పరాక్రమవంతులైన భూలోక రాజులను సాయం కోసం అర్థిస్తూ ఉంటాడు. అదే విధంగా దశరథుడి సాయం కోరతాడు (తర్వాత కాలంలో కూడా ఇలాగే దుష్యంతుడి సాయం కూడా తీసుకుంటాడు). దశరథుడు మహా పరాక్రమశాలి. దశరథుడు అంటే పదిమంది రథికుల బలం కలవాడు అని అర్ధం. అయన ఎంత పరాక్రమవంతుడంటే, అయన పేరు ప్రతిష్ఠలు విని రావణుడు అసూయతో “కప్పం చెల్లించమనీ, లేకపోతే యుద్ధం చేయమనీ” దూతల చేత వర్తమానం పంపిస్తాడు. దశరథుడు నవ్వి “ఈ బాణాలతో లంక ద్వారాలను మూసి వేస్తున్నాను. అక్కడ నుంచీ రావణుడు బయట పడగలిగితే కప్పం కడతానని చెప్పండి” అని బాణాలతో లంకాద్వారం మూసేసాడు. రావణుడు తన శక్తియుక్తులు మొత్తం ప్రయోగించినా ఆ ద్వారాలను తెరవలేకపోతాడు. పరాభవంతో ఓడిపోయానని మనసులో అనుకోగానే బాణాలు తిరిగి అయోధ్యకు వచ్చేస్తాయి. ద్వారాలు తెరుచుకుంటాయి. తర్వాత రావణుడు బ్రహ్మను గురించి తపస్సు చేయటం, వరాలు పొందటం అదంతా జరుగుతుంది.
దేవేంద్రుడు కూడా శంబరాసురుడితో యుద్ధం వచ్చినప్పుడు దశరథుడి సహాయం అర్థించాడు. పోరు ఘోరంగా జరిగింది. రాత్రి అయింది. ఎంతో మంది సైనికులు క్షతగాత్రులు అయ్యాయి. అందరూ నిద్రించే సమయంలో రాక్షసులు విరుచుకుపడ్డారు. దశరథ మహారాజుకు, రాక్షసులకు మధ్య భయంకరంగా యుద్ధం జరిగింది. ఆ సమయానికి సారథి అందుబాటులో లేక కైకేయి రథం నడిపించింది. యుద్ధంలో దశరథుడు అలసి మూర్చపోయాడు. ఎంతైనా శంబరాసురుడు బ్రహ్మవరప్రసాది. అతడి ధాటికి ఆగలేకపోయాడు. కైకేయి వెంటనే రణరంగం నుంచీ రథాన్ని దూరంగా తీసుకువెళ్ళి, భర్త ప్రాణం కాపాడింది. ఆ విధంగా రెండుసార్లు సురక్షిత ప్రదేశానికి తీసుకు వెళ్లి శైత్యోపచారాలు చేసి సేద తీరుస్తుంది. చివరకు ఎలాగైతేనేం శంబరాసుడు మరణిస్తాడు. దేవతలకు విజయం లభిస్తుంది.
కైక సమయస్ఫూర్తితో వ్యవహరించి రెండుసార్లు తనని రక్షించినందుకు దశరథుడు సంతోషించి రెండు వరాలు ఇస్తాను, కోరుకోమని అంటాడు. సమయం వచ్చినప్పుడు కోరుకుంటాను, అంతవరకు మీ దగ్గరే న్యాసము (కొంతకాలం పాటు దాచి ఉంచటం) గా ఉంచమని చెబుతుంది. తర్వాత వాటిని రాముడి పట్టాభిషేకం సమయానికి కోరుకోవటం జరుగుతుంది.
మంథర పూర్వజన్మలో దుందుభి అనే గంధర్వ కాంత. రావణుడు పెట్టే బాధలు పడలేక దేవతలు బ్రహ్మదేవుడికి మొరపెట్టుకాగా, రావణ సంహారం కోసం దుందుభిని కుబ్జ రూపంలో సృష్టిస్తాడు. ఈమె కారణంగా రావణ వధ జరుగుతుంది అని చెబుతాడు. మంథర మానవ స్త్రీగా పుట్టి కైకేయికి అరణపు దాసిగా వస్తుంది (పూర్వం మహారాజులు కుమార్తెను అత్తవారింటికి పంపేటప్పుడు పరిచారికలను కూడా కానుకలుగా పంపేవారు. దానిని అరణం అంటారు. శ్రీకృష్ణ దేవరాయల భార్య తిరుమల దేవి కూడా అత్తవారింటికి వచ్చేటప్పుడు నంది తిమ్మన అరణపు కవిగా వస్తాడు).
ఒకరోజు మంథర యాదృచ్చికంగా అటూఇటూ తిరుగుతూ రాజ ప్రాసాదం పైకి వచ్చింది. అక్కడ నుంచీ చూస్తే అయోధ్యానగరం అంతా శోభాయమానంగా అలంకరించి కనబడింది. పక్కనే ఉన్న మేడ మీద మరో దాసిని అడిగింది విశేషం ఏమిటి అని. ఆమె శ్రీరాముడి పట్టాభిషేకం అని పట్టరాని ఆనందంతో చెప్పింది. అది వినగానే మంథర మనసు అసూయతో భగ్గుమంది. గబగబా కిందికి దిగివచ్చి కైకయికి ఈ వార్త వినిపించింది. మొదట కైక చాల సంతోషించి, నాకు రాముడైనా భరతుడైనా ఒకటే అంటుంది. కానీ మంథర దుర్బోధల వల్ల ఆమె మనసు మారిపోతుంది. శంబరాసురుడితో యుద్ధం సమయంలో ఇచ్చిన రెండు వరాలు ఇప్పుడు ఇవ్వమని భర్తని అడుగుతుంది. భరతుడికి రాజ్యం ఇస్తాను కానీ రాముడిని మాత్రం అడవులకు పంపవద్దు, రాముడిని విడిచి నేను బ్రతకలేను అని దశరథుడు ఎంత బ్రతిమిలాడుకున్నా ససేమిరా అంటుంది. తర్వాత మంత్రి సుమంత్రుడు కైకని నిందిస్తూ ఒక సంఘటన గురించి చెబుతాడు.
అదేమిటంటే, కైక తండ్రికి సృష్టి లోని సమస్త ప్రాణుల అరుపులను, వాటి భావాలను అర్ధం చేసుకునే వరం ఇస్తాడు ఒక యోగి. ఈ రహస్యం ఎవరికైనా చెబితే తల పగిలి మరణిస్తావు అని చెబుతాడు ఆ యోగి. ఒకరోజు కేకయ రాజు పాన్పు మీద పడుకుని ఉండగా గవాక్షం పక్కనే ఉన్న ఉద్యానవనంలోని చెట్టు మీద పక్షులు రెండు మాట్లాడుకోవటం వినిపిస్తుంది. అది విని నవ్వుకుంటాడు. నవ్వుకోవటానికి కారణం ఏమిటి అని అడుగుతుంది భార్య. యోగి ఇచ్చిన వరం గురించి చెప్పి, ఈ విషయం ఎవరితోనైనా చెబితే తాను చనిపోతాను అని అంటాడు రాజు. “నువ్వు జీవిస్తావో, మరణిస్తావో నాకు అనవసరం. రహస్యం మాత్రం చెప్పాల్సిందే!” అని పట్టుబడుతుంది. భర్త చనిపోయినా ఫర్వాలేదు అనే ఆమె మొండి పట్టుదలకు కోపం వచ్చి ఆమెను రాజ్యంలో నుంచీ గెంటివేస్తాడు. సుమంత్రుడు ఈ కధ చెప్పి “నీకు కూడా తల్లి పోలికే వచ్చింది” అని కైకను నిందిస్తాడు.
ఒక్క సుమంత్రుడే కాదు, రాజ్యంలోని వారంతా నిందించినా రాముడు మాత్రం ఒక్కమాట కూడా అనడు. “కైకను ఎవరైనా ఏమైనా అంటే నన్ను అన్నట్లే!” అని చెబుతాడు చిత్రకూటంలో, భరతుడు వచ్చినప్పుడు. చివరలో రావణ సంహారం ముగిసి పట్టాభిషేకం అయిన తర్వాత సీతతో ఏకాంత సల్లాపాలు ఆడేటప్పుడు కైక ప్రసక్తి వస్తే “ఆమె నన్ను అరణ్యాలకు పంపటం వల్లనే రావణ కుంభకర్ణుల వంటి మహావీరులను జయించే అవకాశం వచ్చింది. అసుర సంహారకుడు అనే కీర్తి నాకు వచ్చేటట్లు చేసింది. అసూయాపరురాలనే నింద ఆమె భరించింది” అని చెబుతాడు. అందుకే సుగుణాభిరాముడు అని పేరు పొందాడు.