[సంచిక 2022 దీపావళి పోటీకి అందిన కథ.]
[dropcap]మ[/dropcap]నసంతా.. గందరగోళంగా ఉంది!!
ఆఫీసులో పని చేస్తున్నాను అన్న మాటే కానీ ధ్యాస నిలవడం లేదు. దానికి కారణం, నిన్న అంటే సోమవారం పొద్దున్న వచ్చిన ఫోన్ కాల్. ఊళ్లో ఉన్న నా బావమరిది నుండి వచ్చింది. “శంకర్.. మీ అమ్మకు ఆరోగ్యం అస్సలు బాగా లేదు.. ఇంట్లోనే కళ్ళు తిరిగి పడిపోయిందట.. మీ పక్కింటి వాళ్ళు ఫోన్ చేస్తే వెళ్ళి మా ఇంటికి తీసుకు వచ్చాను.. డాక్టర్‌కి చూపిస్తే మందులు వ్రాసి ఇచ్చారు. ఒకసారి నువ్వు వచ్చి చూసి పోకూడదా..” అని.
“అలాగే.. తప్పకుండా వస్తాను..” అని చెప్పి ఫోన్ పెట్టేసాను.
దేశ రక్షణ కోసం పని చేసే ఉద్యోగం నాది. ఊపిరి సలపని వర్క్ లోడ్ ఉంటుంది. ప్రోజెక్ట్ షెడ్యూల్స్ మీట్ అవడానికి ఒక్కోసారి రేయింబవళ్ళు పని చెయ్యాల్సి ఉంటుంది. నా ఖర్మ కాలి ప్రస్తుతం నేను అదే పరిస్థితిలో ఉన్నాను. ఇంటి దగ్గర పనులే సరిగ్గా పట్టించుకోవడం లేదు. అలాంటిది, మూలిగే నక్క మీద తాటిపండు పడినట్టు నా తల్లి ఆరోగ్య సమస్య ఒకటి! ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో ఉంటాను. నా తల్లి వైజాగ్ దగ్గర ఉన్న మా సొంత ఊరిలో ఒంటరిగా ఉంటుంది. మా నాన్న చనిపోయి రెండేళ్ళు అయింది. నా చెల్లీ, బావ పక్క ఊరిలో ఉంటారు. ఏదో నాకు కుదిరితే అప్పుడప్పుడు ఊరు వెళ్ళి మా అమ్మను చూసి వస్తుంటాను. ఆమె కూడా మా మీద ఆధారపడకుండా, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినా జాగ్రత్తగా నెట్టుకుంటూ బండి లాగించింది ఇప్పటి దాకా. కానీ ఇప్పుడు కళ్ళు తిరిగి పడిపోయిందంటే ఎవరో ఒకరు పక్కన ఉండి చూసుకోవాలి కదా! ఈ బాధ్యత నుండి నేను తప్పించుకోలేను కదా.. అదే నా అసహనానికి కారణం.
“సార్.. మిమ్మల్ని బాస్ మీటింగ్‌కి పిలుస్తున్నారు” అని ప్యూన్ వచ్చి చెప్పడంతో హడావిడిగా మీటింగ్ హాల్ వైపు కదిలాను.
***
శనివారం వచ్చేసింది. ఊరికి వెళ్ళడం మాత్రం కుదరలేదు నాకు. ఈ రోజుకి పని అయిపోవచ్చు అన్న అంచనా ఉండటంతో, ఇంటెర్నెట్ ఓపెన్‌చేసి మర్నాటికి అంటే ఆదివారానికి మా ఊరికి వెళ్ళి మా అమ్మ దగ్గర ఉండి సోమవారం పొద్దున్న వచ్చేసే విధంగా ఫ్లయిట్ టికెట్ బుక్ చేసుకున్నాను. రిలీఫ్‌గా అనిపించింది. తర్వాత పని మీద దృష్టి పెట్టాను. అసలు సమస్య ఏమిటంటే ఒక పెద్ద టెక్నికల్ ప్రోబ్లెం వచ్చింది. అది ఎంతకీ సాల్వ్ కావడం లేదు. మా ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాం. రాత్రిళ్ళు బాగా పొద్దు పోయే దాకా ఉండి మళ్ళీ తర్వాతి రోజు పొద్దున్నే వచ్చేస్తున్నాం. ఒక టీం లా ఏర్పడి గట్టిగానే ప్రయత్నిసున్నాం. కానీ ఎంతకీ అది తెగడం లేదు. మేము క్లియరెన్స్ ఇస్తే తప్ప పని ముందుకు కదలదు. విపరీతమైన ప్రెజర్! అవన్నీ తట్టుకుని వర్క్ మీద దృష్టి పెట్టాలి. పైగా మమ్మల్ని నిరంతరం గమనిస్తున్న టాప్ మేనేజ్‌మెంట్! అసలే నాకు ప్రమోషన్ ఇంటర్వ్యూ ఉంది ఈ సారి. బాగా పని చేసి పెద్ద వాళ్ళ దృష్టిలో పడితే ప్రమోషన్ గ్యారంటీ!
శనివారం అర్ధరాత్రి పన్నెండయింది. వర్క్ కంప్లీట్ కాలేదు. ఆదివారం కూడా పని కంటిన్యూ చెయ్యాల్సిన పరిస్థితి. అందరూ ఆదివారం ఆఫీసుకి రావాలని డిసైడ్ చేసాం. అయినా తర్వాతి రోజు ఊరు వెళుతున్నానని అందరికీ చెప్పేసాను. నేను ఉండను కాబట్టి నా సబార్డినేట్‌కి వర్క్ ఎలా మేనేజ్ చెయ్యాలో చెప్పాను. ఇంటికి వచ్చేసాను.
ఆశ్చర్యంగా, ఇంట్ళో నా భార్య బెడ్ మీద పడుకుని మూలుగుతూ ఉంది. నుదిటి మీద చెయ్యి పెట్టి చూస్తూ “ఏమైంది.. జ్వరం తగిలిందా..” అన్నాను.
“అవునండీ.. సాయంత్రం నుండి అలాగే ఉంది.. మీరు డిస్టర్బ్ అవుతారని ఫోన్ చెయ్యలేదు.”
“సరే.. హాస్పిటల్‌కి వెళదాం పద..” అని చెప్పి ఆమెను లేపి కూర్చోబెట్టాను. ఆమె డ్రెస్ చేసుకున్నాక దగ్గర్లో ఉన్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో ఉన్న ఎమర్జెన్సీ వార్డ్‌కి తీసుకెళ్ళి చూపించాను. చెక్‌చేసి మందులు వ్రాసాడు డ్యూటీ డాక్టర్. అవి తీసుకుని ఇంటికి వచ్చేసాం. నా భార్య బెడ్‌మీద వాలిపోయింది.
టైము తెల్లవారు జాము నాలుగైంది. ఊరికి వెళ్ళాలంటే ఒక గంట తర్వాత ఎయిర్‌పోర్ట్‌కి బయలుదేరాలి. అప్పుడే నేను బుక్‌చేసుకున్న ఎర్లీ మోర్నింగ్ ఫ్లయిట్ కేచ్ చెయ్యగలను. ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. అక్కడ మా ఊళ్ళో అమ్మకు బాగాలేదు, ఇక్కడ నా భార్యకు బాగా లేదు. ఇప్పుడు నేను ఊరు వెళిపోతే నా భార్యను ఎవరు చూస్తారు? అలాగని నేను ఊరు వెళ్ళకపోతే, కన్న తల్లిని చూడటానికి కూడా రాని కసాయి కొడుకుగా మిగిలిపోతాను. ఇదంతా నాలో బాహ్యంగా కనిపించే బాధ. అసలు నా మనసు పొరల్లో.. ఆఫీసులో పని గురించి టెన్షన్ నడుస్తోంది. నేను లేకుండా పని పూర్తయిపోతే ఆ క్రెడిట్ నా అసిస్టెంట్‌కి దక్కుతుందనే బాధ! ఎలా.. ఎలా.. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళాలా? ఇంటి దగ్గరే ఉండి నా భార్యను చూసుకోవాలా? ఆలోచనల ఉక్కిరిబిక్కిరి.. సందిగ్ధత! చాలా సేపు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను. ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళలేదు. అలాగని టికెట్ కేన్సిల్ కూడా చెయ్యలేదు. కేన్సిల్ చేస్తే పెద్దగా డబ్బులు వాపసు రావు. అందుకే లైట్ తీసుకున్నాను. తర్వాత నేను కూడా నిద్రకుపక్రమించాను!!!
***
పొద్దున్న లేచి నన్ను చూసిన నా భార్య “ అదేంటి.. నువ్వు ఊరు వెళ్ళలేదా..” అంటూ తెల్లబోయింది.
నేను దీనంగా మొహం పెట్టి “..నీ పరిస్థితి ఇలా ఉంటే, నిన్ను వదిలి ఎలా వెళతాను” అన్నాను. చాలా అపనమ్మకంగా చూసింది నా వైపు. కారణం అది కాదని నిశ్చయంగా ఆమెకు తెలుసు.
“ఇప్పుడు ఎలా ఉంది.. జ్వరం తగ్గిందా..” అడిగాను ప్రేమగా
“ఆ.. ఇప్పుడు కొంచెం బాగానే ఉంది” అని చెప్పింది. బ్రేక్‌ఫాస్ట్ చేసి దాదాపు పదింటికి మళ్ళీ ఆఫీసుకి వచ్చేసాను. అందరూ నన్ను చూసి ఆశ్చర్యపోయారు. ‘ఊరు వెళ్ళలేదా’ అంటూ ఆశ్చర్యం ప్రకటించసాగారు. “ఆఫీసులో ఇంత పని ఉండగా వెళ్ళడానికి మనసు ఒప్పలేదు” అని కవరింగ్ ఇచ్చాను. ఆఫీసు పనికోసం అటు తల్లి పట్ల ప్రేమను, పది వేల టికెట్‌ను త్యాగం చేసినందుకు నన్ను అందరూ చాలా గొప్పగా చూడసాగారు. పని పట్ల నా అంకితభావానికి మా టాప్ మేనేజ్‌మెంట్ మెచ్చుకుంది నన్ను. అప్పుడే మా బావ ఫోన్‌చేసాడు. “శంకర్.. ఊరు వస్తానన్నావు.. బయలుదేరావా..” అని అడిగాడు. నేను దీనంగా స్వరం మార్చి “నీ చెల్లికి (అంటే నా భార్యకు) ఆరోగ్యం బాగాలేదు.. అందుకే ఫ్లయిట్ టికెట్ ఉన్నా కూడా బయలుదేరలేకపోయాను” అని చెప్పి పెట్టేసాను. అదృష్టవశాత్తు మా పని ఆరోజు రాత్రి దాదాపు పన్నెండు గంటలకి పూర్తయింది. అందరం చప్పట్లు కొట్టుకుని, ఒకరిని ఒకరం అభినందించుకుని సెలెబ్రేట్ చేసుకున్నాం. ఆ రాత్రి చాలా ఆనందంగా ఇంటికి వచ్చేసాను. నిద్రపోతున్న నా భార్య లేచి నన్ను సూటిగా అడిగింది “నువ్వు ఈ రోజు మీ అమ్మ కోసం ఊరు ఎందుకు వెళ్ళలేదు?” అని.
“అరె.. ఎన్ని సార్లు అడుగుతావు.. నీకు బాగా లేదు కదా.. ఎలా వెళతాను”
“మీ అమ్మ దగ్గరకు వెళ్ళలేదు.. కనీసం నా దగ్గర ఉన్నావా..”
“అదీ.. అదీ.. ఆఫీసులో ప్రెజర్ తెలుసు కదా.. అందుకే వెళ్ళాల్సి వచ్చింది” సంజాయిషీగా చెప్పాను.
“..అయినా నేను మిమ్మల్ని బాగా చూసుకోలేకపోతున్నందుకు చాలా బాధ పడుతున్నాను తెలుసా.. నిజం చెబుతున్నా.. నమ్ము” దెబ్బ తిన్నట్టు అన్నాను.
చిన్నగా నవ్వి అంది నా భార్య “..నువ్వో పెద్ద స్వార్థపరుడివి. నీకు నీ కెరీర్ ముఖ్యం.. తర్వాతే మేమందరం. ఆ విషయం ఒప్పుకో.. వెధవ వేషాలు వెయ్యకు” అని.
ఎవరో లాగిపెట్టి కొట్టినట్టుగా అనిపిస్తోంది నాకు.. ఎందుకో మరి!!!!