సాహిత్య అకాడెమీ అవార్డులు – సామాన్య పాఠకురాలి ఆవేదన

12
4

[dropcap]డా[/dropcap]క్టర్ పి. భాస్కర యోగి రాసిన ‘కేంద్రసాహిత్య అకాడెమీకి ఎర్ర పక్షపాతం?’ అన్న వ్యాసం చదివాను. ఆ వ్యాసం చదివాక నాకు కలిగిన సందేహాలకు సమాధానం వచ్చినట్లు అనిపించి, ఆ నేపథ్యంలో  ఒక సామాన్య తెలుగు పాఠకురాలిగా, ఒక   భాషా ప్రేమికురాలిగా నాకు కలిగిన ఆవేదన  ఫలితం ఈ వ్యాసం. నేను గమనించిన విషయాలు ఈ వ్యాసానికి  ఆధారం. ఇది పరిశోధనాత్మక వ్యాసం కాదు.

కేంద్రీయ సాహిత్య అకాడమీ అవార్డు అనేది జాతీయ స్థాయిలో రచయితలకి ఇచ్చే గౌరవం. ఈ పురస్కారం పొందిన రచన పలు భారతీయ భాషలలోకి అనువదించబడుతుంది. అంతే కాదు అంతర్జాతీయంగా కూడా గుర్తింపు కలుగుతుంది.

అయితే ఇంత గొప్ప పురస్కారం పొందిన ఈ రచయితల రచనలు చదివినపుడు నాలాంటి సామాన్య పాఠకురాలికి రెండు ప్రశ్నలు కలిగాయి.

ఓ పక్షపాత ధోరణిలో ఒక భావజాలం (ఈ క్రింద పేరాలో విశిదీకరించాను) కలిగిన రచయిత్రులు/రచయితలకి మాత్రమే ఈ అవార్డులు ఇస్తున్నారా అన్నది ఒక ప్రశ్న.

ఈ రచనలు ఎంత వరకూ భారతీయ సంస్కృతిని చూపిస్తున్నాయి అన్నది ఇంకొక ప్రశ్న.

ఈ రకమైన భావజాలం ఉన్నవారు ప్రతీ వ్యవస్థలో పీడకుడు & పీడితుడు అన్న దృష్టికోణంలో చూస్తూ ఉంటారు. ఉదాహరణకి వివాహం అనేది భార్యాభర్తలు కలిసి జీవించే ఓ కుటుంబ అనుబంధంగా గుర్తించకుండా, పీడకుడు భర్త & పీడితురాలు భార్య అంటారు. భారతదేశం అన్ని మతాల సమాహారంలాగా కనిపించినా, వీరి ఉద్దేశంలో హిందూ మత వ్యవస్థ ఇతరమతాలని పీడించే వ్యవస్థ. ఇతరమతాల వారు పీడితులు. అంతే కాదు అందులో ఉన్న కుల వ్యవస్థలో పీడకులు బ్రాహ్మణులు & ఇతర సవర్ణులు. దళిత కులాలకు చెందిన వారు పీడితులు. అంతే కాదు. ఒక యాజమాన్య సంస్థ తీసుకున్నట్లయితే యజమాని పీడకుడు. కార్మికులు పీడితులు. వేల సంవత్సరాల చరిత్ర ఉన్న భారతదేశ వైదిక సంస్కృతి చెప్పే ‘వసుధైవ కుటుంబకం’  అన్న సారాంశానికి పూర్తి వ్యతిరేకమైనది పైన చెప్పిన భావజాలం.. ఈ భావజాలం సమాజంలో ఎదురయ్యే సమస్యలకి పరిష్కారం ఇవ్వకగపోగా, మనుష్యుల్ని అందరినీ కలిపి inclusion చేయకపోగా ఒకరంటే ఒకరికి ద్వేషం కలిగేలా,  పీడకుడు & పీడితుడు అంటూ exclusion చేస్తుంది.

ఉదాహరణకి రచయిత్రి ఓల్గా గారు వ్రాసిన విముక్త కథలు తీసుకుంటాను.

రామాయణం అనేది ఆదికావ్యం. అది చరిత్ర లాగా కాకుండా, ‘ఒక కథ’ అనే దృష్టికోణంలో చూసినా శ్రీరాముడు ధర్మాన్ని అన్నీ విధాలా అనుసరించి మన చూపించిన ఒక ఆదర్శవంతమైన పాత్ర. భారతదేశంలో రామాయణం ప్రభావం అన్ని మూలల చూస్తాము. ఉత్తరాది వారు ఎవరినైనా పలుకరించేటపుడు ‘రాం రాం భయ్యా’ అంటే, దక్షిణాది వారి ఊతపదాలు ‘అయ్యో రామ’, ‘అరే రామ’, ‘రామ రామ’ అయ్యాయి. భారతదేశం నలుమూలల ప్రతీ పేరులో సీతారాములు ఉంటారు. రాములమ్మ, రామయ్య, రాంసింగ్, రామన్  వంటి పేర్లు కామన్! తెలుగు వారి ప్రతీ పెళ్లి పత్రికలో సీతారాముల బొమ్మ ఉండి తీరుతుంది. ఎందుకంటే ఆదర్శదాంపత్యం అంటే వారిదే. రామాయణం అనేది భారత దేశ సంస్కృతిలో ఓ భాగం. అటువంటి శ్రీరాముడిని ఓల్గా గారు ఎక్కడినుంచో వచ్చిన ఆర్యుడని, రాజ్యధికారం కోసమే రాజు అయినట్లుగా చెప్పారు. ముందుమాటలో కూడా ఆవిడ వ్రాసిన ఓ నృత్య రూపకం గురించిన ప్రస్తావనలో ఆర్య సామ్రాజ్య విస్తరణ కాంక్షఅన్నారు. ఆర్య ద్రావిడ సిద్ధాంతానికి ఎలాంటి ఆధారాలు లేవు. అసలు ఆర్యులు అనేవారు భారతదేశానికి ఎక్కడ నుండీ వలస వచ్చారో , ఎన్ని యుద్ధాలు జరిగాయో  అనేటువంటి ఆధారాలు  చరిత్రకారులే చెప్పలేకపోయారు. అటువంటి నిరూపణ కాని  సిద్ధాంతాన్ని  ఆధారం చేసుకుని భారతదేశమంతా  పూజించే శ్రీరాముడిని గురించి ఈవిడ వ్రాయడం, అందుకు సాహిత్య అకాడెమీ పురస్కారం ఇవ్వడం ఏ రకంగా సమంజసం?

సుందరాకాండలో సీతాదేవి గురించి చెబుతూ ‘తృణము కన్న రావణుడే హీనమ’ని అంటారు సుందరదాసు గారైన MS రామారావు గారు. తృణము అంటే గడ్డి పరక. ఎంత పెద్ద గాలివాన వచ్చినా తట్టుకుని నిలబడేది గడ్డిపరక. అందుకే soil erosion జరగకుండా Lawns పెంచే ముఖ్య ఉద్దేశం కూడా అదే. ఎంత పెద్ద వృక్షమైనా గాలివానకు కూకటివేర్లతో పడిపోతుంది. అంటే సీతాదేవి ఆలోచనాశక్తి అనేది ఎటువంటిదో చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. సీతాదేవి ఏడాదిపాటు లంకలో ఉన్నపుడు నిద్రాహారాలు మానేసి, కట్టుగుడ్డలతో ఉన్నది. అంటే వైభవం అంటే అలంకరణలో లేదు, భర్తతో ఉన్నపుడు మాత్రమే ఏ స్త్రీకైనా ఆనందం అని సీతాదేవి చెప్పకనే చెప్తుంది. సహజంగా స్త్రీ అయినందువల్ల ఉన్న భయం ఉన్నా ఎన్నో విధాలుగా ఆవిడ మానసికంగా ఎంత శక్తివంతురాలో మనకి అర్థమవుతుంది. అటువంటి సీతాదేవి ఓల్గా గారి విముక్త కథలోని ‘సమాగమం’ కథలో శూర్పణఖ ని చూసి ‘ముక్కూ, చెవులూ లేని ఆ కురూపిని ఇంకెవరు ప్రేమిస్తారు?’ అనుకుంటుంది. ఒక శక్తివంతమైన పాత్రని ఈ విధంగా చిత్రించడం ఎంతవరకూ సబబు?

పైగా సీతాదేవి మాత్రమే కాదు. అహల్య, రేణుకా దేవి, ఊర్మిళ ఇలా అందరిని పీడితుల్లాగా చూపించి నేను పైన చెప్పిన ఆ భావజాలంలోకి తెచ్చే ప్రయత్నం చేసారు.

ముందుమాటలో ఈ కథలు వర్తమాన సమాజంలో స్త్రీల వేదనలకు ప్రాతినిధ్యం వహించే కథలు కూడా. ఇవాళ్టి సమాజంలో అనేక ఆంక్షలకూ అవమానాలకూ హింసలకూ గురై వాటినధిగమించి లేస్తున్న స్త్రీలు కొందరైతే, వాటిల్లోనే కూరుకుపోయి వాటిని దాటలేక, దాటాలని తెలియక, నానా యాతనలు పడుతున్న స్త్రీలెందరో – తమను హింసించే భర్తల నుండి విముక్తం కావాలనే స్పృహ లేకుండా వారిని ద్వేషిస్తూనే, అసహ్యించుకుంటూనే వారిని గట్టిగా పట్టుకునే స్త్రీలు – ద్వేషంతో తమను తాము హింసించుకోవటం అలవాటైన స్త్రీలు’.

ఆ స్త్రీల కోసం ఈ కథలు అని అంటారు ఓల్గా.

ఏ విదేశీయుడైనా ఈ కథలు చదివితే భారతదేశంలో పురుషులంతా పీడకులు, స్త్రీలంతా పీడితులు అనిపిస్తుంది.

ఇక్కడ సమస్య పరిష్కారం ఏమిటంటే స్త్రీకి భర్త నుంచి విముక్తి. చెప్పా కదా inclusion ఉండదు. Exclusion మాత్రమే.

కేంద్రీయ సాహిత్య అకాడమీ అవార్డులలో యువ పురస్కారం వచ్చిన వారిలో ఎండ్లూరి మానస, వేంపల్లె షరీఫ్, మెర్సీ మార్గరెట్, చైతన్య పింగళి గారి పేర్లు చూసి చాలా ఆశ్చర్యం వేసింది. వారి అవార్డు రచనలు నేను చదవలేదు. కానీ వారి ఇతర రచనలు, ముఖపుస్తకం టపాలు చదివాను. పైన చెప్పిన భావజాలంలో అనిపించాయి. ‘వారికి అవార్డు ఇచ్చిన రచనలు వేరు, భావజాలం వేరు అయివుండొచ్చు కదా’ అని ఎవరైనా అంటే, ‘ఏ రచన అయినా మనసు అంతరాళం నుంచి వచ్చే భావన నుంచే వస్తుంది’ అంటాను నేను.

ఎండ్లూరి మానస గారి కథలు రెండు చదివాను. రెండూ బొట్టు మీదే.  భారతీయ సంప్రదాయం బొట్టు పెట్టుకోవడం. బొట్టు పెట్టుకున్న వారు బొట్టు పెట్టుకొనని వారి మీద వివక్ష చూపించడం ఈ కథల్లో చదివాను. ఒక కథలో కాలేజీ  ప్రిన్సిపాల్ ఒక విద్యార్థిని   సర్టిఫికెట్ లో కులం చూసి ఆ అమ్మాయికి సీటు ఇవ్వలేము అని వివక్ష చూపిస్తుంది.  ఎందుకంటే ‘ఈ గరికపాటి ఆమె అనుకున్న ‘ఘనాపాటి’ కాదని తెలుసుకుంది.’ కాబట్టి.  ఇక్కడ బ్రాహ్మణ స్త్రీ పీడకురాలు. దళిత అమ్మాయి పీడితురాలు.

వేంపల్లె షరీఫ్ గారి కథ ‘తలుగు ‘ అనే కథ చదివాను.  ఒక హిందూ భూస్వామి పూజలు చేస్తున్నా ఇంటిలోని పశువు మీద నిర్దయతో  ఉంటాడు.  కసాయి వాడైనా కూడా మహమ్మదీయుడు జంతువు మీద చాలా దయ కలిగి ఉంటాడు.  ఈ కథలో హిందువు  పీడకుడు. మైనారిటీ మతానికి సంబంధించిన వాడు పీడితుడు.   కథలో అవసరంలేని పూజ,  బొట్టు పెట్టుకోవడం గురించిన ప్రస్తావన ఉంటుంది కథలో. కథలోని కొన్ని వాక్యాలు :

‘‘సరే..కూచోండి. పూజలో ఉండాడు,’’ అని లోపలికెళ్లిందామె.

“అప్పుడే పూజ పూర్తయిన సూచికగా నుదుటిమీద నిలువునా కుంకుమ బొట్టు  పెట్టాడు.”

“ఊళ్లో మసీదులో ఉండే హజ్రత్‌ చాలా మంచోడు.”

“అందరూ ఆ అల్లాకు కృతజ్ఞతగా ఉండాంటాడు.”

మెర్సీ మార్గరెట్ గారి కవిత ‘ఆమె నిర్ణయం’ చాలా మంది చదివి ఉంటారు. ఆ కవితలో కవయిత్రి, సీతాదేవి రాముడిని వదిలేసి చర్చి దగ్గరికి వచ్చి క్రైస్తవ్యం స్వీకరించి ఏసుక్రీస్తుని ప్రార్థించినట్లు వ్రాసారు. కవిత చివరిలో ఈ విధంగా ఉంటుంది.

అనుమాన పడ్డానని అమ్మగారింటికిపోక

ఏమిటే నువు చేస్తున్నది

దిక్కుమొక్కు లేని బ్రహ్మచారి క్రీస్తు దగ్గరకొస్తావా” అన్నాడు

ఆమె ఏమీ మాట్లాడలేదు

యేసుకు స్తోత్రం చెబుతూ

ప్రభువు నిన్ను క్షమించుగాక అని వెళ్లిపోయింది

భార్యలకు అడవులేం కొత్తకాదు

అతడిప్పుడు

భార్యకోసం ఏ గొప్ప స్వర్గం నిర్మిస్తాడో??’

రామాయణం అనేది భారతీయులకి ఎంత ముఖ్యమైనదో సంస్కృతిలో ఎలా భాగమయిందో పైన విశదీకరించాను. మరి మెర్సీ గారి కవిత భారతీయ సంస్కృతిని అవమానిస్తున్నట్లే అనిపించింది. చెప్పా కదా ఈ కవితలో కూడా భావజాలం కనిపిస్తుంది. ఇక్కడ హిందూమతం స్త్రీ జాతిని హీనంగా చూసే మతము. క్రైస్తవ్యం మనుష్యులందరినీ దగ్గరకి తీసే ఎంతో ఉన్నతమైన మతము.

భిన్నమతాల కలయిక అయిన భారత సంస్కృతిని ఈ దృష్టితో చూసే వీరందరికీ  ఏ విధంగా పురస్కారం ఇచ్చారు? ఈనాడు భారత్ లో ఉన్న మైనారిటీ మతాలైన ఇస్లాము, క్రెస్తవం వారు భారతదేశాన్ని దాదాపు వెయ్యేళ్ళు పరిపాలించారు. మతం పేరు చెప్పి  వీరు ఆనాటి  భారతీయుల మీద చేసిన అకృత్యాలన్నీ సాక్ష్యాలతో సహా ఎన్నో ఉన్నాయివాటి ఊసే  ఎత్తకుండా  అన్నీ మరచి జీవించే భారతీయుల యొక్క సనాతన ధర్మం పైన ఇటువంటి కథలు వ్రాయడంలో అర్ధం లేదు అనిపిస్తుంది.

చైతన్య పింగళి గారి కథ ‘నామాలు’ కథ చదివాను. ఆ కథ సెప్టెంబర్ 2015లో సారంగ online పత్రికలో ప్రచురితం అయ్యింది. దళిత అమ్మాయి, బ్రాహ్మణ అబ్బాయిని పెళ్ళి చేసుకుంటుంది. ఆ ఇబ్బందులని కథలో చెప్పే ప్రయత్నం చేసారు రచయిత్రి. పైన చెప్పిన భావజాలం రీతిలో, ఆ కథ చాలా పక్షపాత ధోరణిలో అనిపించింది.

పైగా వైష్ణవ సాంప్రదాయం స్వామి వారిని ఒకరిని దృష్టిలో పెట్టుకుని వ్రాసినట్లు అనిపించింది. ఆ కథలో స్వామి వారి ప్రస్తావన ఇలా ఉంటుంది. అప్పుడు జరిగిన మాటల్లోనే స్వామివారు ఆశీర్వదిస్తే మాకేం ఇబ్బంది లేదని సుధీర్ తల్లి చెప్పింది. పెళ్ళికి ముందు శైలుని ఆ స్వామివారి దగ్గరకి తీసుకెళ్ళింది. ఆయన రెండు రాష్ట్రాల్లో చాలా ప్రసిద్ధుడు. స్వయానా ముఖ్యమంత్రులే ఆయన్ని హెలికాఫ్టర్లు ఎక్కించుకుని తిరుగుతారు. వాళ్ళేంటి.. ఈ దేశ ప్రధాని కూడా ఆయన కాళ్ళ మీద పడతాడు. తిరుపతి దేవస్థానాల్లో ఆయనది పెద్ద హోదా కూడా. అంతటి ప్రఖ్యాత స్వామివారికి శైలును చూపించినప్పుడు .. ఆయన దీవించాడు. హరికి ఇష్టులైన వారంతా హరిజనులే.. ఈ అమ్మాయ్కి నామాలు వేయండి..అని చెప్పాడు. శైలు చాలా సంతోషపడింది, ఆయన ఆశీర్వాదం పొందినందుకు.

కథలో మామగారు కోడలిని గొడ్డు మాంసం తిని తిని.. ఒళ్ళు మందం అయిపోయిందిఅని తిడతాడు. ఆ మాట విని కోడలు ‘‘ఇఫ్లూ లో బీఫ్ ఫెస్టివల్ జరుగుతోంది.. అక్కడికి..అని బండి స్టార్ట్ చేసి, వెళ్ళిపొయింది. అంటూ కథకి ముగింపు ఇస్తారు రచయిత్రి.

పైగా కథ పైన వ్యాఖ్యలలో రచయిత్రి స్పష్టంగా “బ్రాహ్మల, కోమట్ల ఇళ్ళల్లో ఇంకా నెలసరి సమయంలో ఉండే ఇబ్బందులు.. తెలియాలని, అందులోను ఒక దళిత మహిళ వాళ్ళ ఇంట్లో అడుగుపెడితే.. ఆ సమయంలో ఎదుర్కోవలసిన బాధ గురించి.. తెలియాలని.. ఇందులోనే రాసా” అంటూ చెప్పారు.

భారత దేశం ‘ఆజాది కి అమృత్ మహోత్సవ్’ చేసుకుంటున్న సమయంలో ‘దేశభక్తి’ గురించి ఆవిడ వ్రాసిన ముఖపుస్తకం టపా ఒకటి చదివాను. వారి కుటుంబంలో దేశభక్తి ఎలా ఉంటుందో వివరిస్తూనే, భారత సైన్యం వారు స్త్రీలని అత్యాచారాలు చేసేవారిలాగా  అన్న అర్ధంలో చెప్పి , ఈ విధంగా ముగించారు ‘‘నా దేశం, శాంతి సందేశం అని నమ్మిన నేను.. ఇండియా ఈస్‌ అప్రెసర్‌అని అర్థం చేసుకున్నాను. రెండు వాక్యాల్లో రాసిన ఈ మాటలు.. నాకు జీర్ణం కావడానికి సంవత్సరాలు పట్టింది. నేను ఆ ప్రాంతాల నుండి వెనక్కి వచ్చిన తర్వాత, కొన్ని రోజుల వరకు నిద్ర పట్టేది కాదు.వేడుకలు జరుపుకుంటున్న సమయంలో  India is oppressor అని అంత స్పష్టంగా భారత దేశ సైన్యం పైన ఆరోపిస్తున్న ఈవిడ రచనని సాహిత్య అకాడమీ వారు ఏ విధంగా సత్కరించారు అనిపించింది నాకు.

ఈ రచనలు చదివిన భావితరాల వారికి ఇవి  ఒక మార్గాన్ని చూపించాల్సింది పోయి, వారి పూర్వీకులను వారే అసహ్యించుకునే వారీగా  తయారుచేస్తాయి.  వివేకానందుల వారు చెప్పినట్లు ఎన్నో సంస్కృతులను tolerate చేయడం కాదు accept  చేస్తుంది భారతీయ సంస్కృతి.  అందుకే ప్రపంచంలో ఎక్కడ ఉన్నా భారత జాతికి చెందిన వారు అందరితో కలిసిమెలిసి ఆనందంగా జీవించగలుగుతున్నారు.

తెలుగు సాహిత్యాన్ని దూరంగా వుండి పరిశీలిస్తున్న నాకు కలిగిన ఆలోచనలివి. ఇలా, ఒక ప్రభుత్వ సంస్థ, ప్రభుత్వ వ్యతిరేక, ధర్మ వ్యతిరేక రచనలను ప్రోత్సహిస్తూండటం ఏ రకంగా సమంజసం? అన్న ఆవేదన ఈ వ్యాసాన్ని నాతో రాయించింది. నేను రాసిన దాన్లో పొరపాట్లుంటే, నాకు ఎత్తి చూపిస్తే, నా అభిప్రాయాలను సవరించుకుంటాను.

ఓ సామాన్య తెలుగు పాఠకురాలిగా నా ఆవేదన భారత కేంద్ర సాహిత్య అకాడమీ వారికి చేరుతుందనే ఆశిస్తాను.

References :

https://kathaalayam.com/2017/03/03/%E0%B0%A4%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81/

http://saarangabooks.com/retired/2015/07/02/%e0%b0%ac%e0%b1%8a%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b1%81/

http://saarangabooks.com/retired/2016/07/27/%e0%b0%ac%e0%b1%8a%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b1%81-%e0%b0%97%e0%b1%81%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a4%e0%b1%81/

http://saarangabooks.com/retired/2015/09/03/%e0%b0%a8%e0%b0%be%e0%b0%ae%e0%b0%be%e0%b0%b2%e0%b1%81/#comments

https://oktelugu.com/it-would-be-good-if-antidote-vaccine-was-given-to-patriotism-chaithanya-pingali/

ఆమె నిర్ణయం
………….
ఆదివారం
చర్చీ బయట
రామున్ని అటూ ఈటూ తచ్చాడుతూ
తిరగటం చూసాను
రాముడు
తను పారేసుకున్న హృదయాన్ని
తన చేజారిపోయిన జీవితాన్ని వెతుకుతూ
చర్చీ ముందే
చర్చీ ముందే
చెమటలు కక్కుతున్న రైలుబండిలా
తిరగటం చూసాను
చర్చీలోకి రమ్మని
తనకి కావలసిందేదో లోపలే ఉందని
క్రీస్తు ప్రేమగా చేతులు చాచి పిలుస్తున్నాడు
ఎలా వెళ్లాలో తెలియని రాముడు
చర్చీ గుమ్మం దగ్గరే వేలాడుతున్నాడు
చర్చీ ప్రార్థనలు ముగిసాయి
రాముడి భార్య
చర్చిలోంచి ముసుగుతో బయటికొచ్చింది
“అనుమాన పడ్డానని అమ్మగారింటికిపోక
ఏమిటే నువు చేస్తున్నది
దిక్కుమొక్కు లేని బ్రహ్మచారి క్రీస్తు దగ్గరకొస్తావా” అన్నాడు
ఆమె ఏమీ మాట్లాడలేదు
యేసుకు స్తోత్రం చెబుతూ
ప్రభువు నిన్ను క్షమించుగాక అని వెళ్లిపోయింది
భార్యలకు అడవులేం కొత్తకాదు
అతడిప్పుడు
భార్యకోసం ఏ గొప్ప స్వర్గం నిర్మిస్తాడో??
…..
మెర్సీ మార్గరెట్
3.3.2019

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here