[తెలుగు సాహిత్య ప్రపంచంలో చారిత్రిక కాల్పనిక కథా రచనకు ఎంతో చరిత్ర వుంది. ఆ రచనా సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ సంచిక అందిస్తోంది ప్రముఖ రచయిత విహారి రచించిన చారిత్రిక కాల్పనిక నవల ‘జగన్నాథ పండితరాయలు’.]
[రాత్రి భోజనాల తర్వాత – జాతరకు సంబంధించిన విషయాలే నలుగురి మధ్యా నలుగుతాయి. అనంతపురం నుంచి కూరగాయలు తెచ్చే ఆమె ద్వారా అక్కడ పెద్ద చర్చ జరిగిందని తెలిసిందని కామేశ్వరి చెబుతుంది. తరతరాలుగా జనంలో పేరుకుపోయిన భయం వలన ఏర్పడిన మూఢవిశ్వాసాలు అంతత్వరగా మాసిపోవని అనుకుంటాడు జగన్నాథుడు. ఉమామహేశ్వరాలయం ప్రాంగణంలో భట్టోజీ శాస్త్రచర్చను ఏర్పాటు చేస్తాడు. కర్మానుసరణని తిరస్కరించేవారిని ఉపేక్షించకూడదని అంటాడు భట్టోజీ. కర్మానుసరణంకి తమ గురువులూ, తామూ కూడా వ్యతిరేకులం కాదని, దుష్కర్మలకి మాత్రమే వ్యతిరేకులమని దృఢంగా అంటాఅడు నాగేశుడు. తర్వాత జరిగిన శాస్త్రచర్చలో భట్టోజీ, కొండుభట్టు, వరదరాజపండితుడు మొదలైనవారిని ఓడిస్తాడు జగన్నాథుడు. సభ రసాభాసగా ముగుస్తుంది. మరో దఫా శశిభూషణుడనే పండితుడితో వాదిస్తాడు జగన్నాథుడు. భట్టోజీ ఒక పథకం ప్రకారం జగన్నాథుడు కర్మ విదూఱుడనీ, అనాచార పరాయణుడనీ – అతన్ని ఇలాగే వదిలేస్తే కాశీ పరువు ప్రతిష్ఠల్ని గంగలో కలుపుతాడనీ ప్రచారం చేయిస్తాడు. కానీ క్రమేపీ జగన్నాథునిలోని విద్వత్తు జనానికి తెలిసివస్తుంది. భట్టోజీ అసలు రంగు బయటపడుతున్నకొద్దీ – జనం ఆయన్ని తృణీకరించటం మొదలవుతుంది. ఢిల్లీ నుండి, జయపురం నుండి వచ్చిన పండితులతో జగన్నాథుని శిక్షించాలని ప్రయత్నిస్తాడు భట్టోజీ. కానీ వారి ముందు ఆ పాచిక పారదు. ఇక చదవండి.]
అధ్యాయం-11
[dropcap]ఇం[/dropcap]టిముందు కలకలంగా ఉన్నది.
జగన్నాథుడూ, శేషవీరేశ్వరుడూ, శిష్యులూ.. త్వరత్వరగా అడుగులతో దగ్గరికి వెళ్తే జరిగిందంతా తెలిసింది. ఒక గంట క్రితం ఎవరో బిచ్చగత్తె వంటి యువతి అతికష్టం మీద నడుస్తూ వచ్చి ఈ ఇంటి దగ్గర పడిపోయింది.
కామేశ్వరి చూసింది. తత్తరపడింది. నీళ్ళు తీసుకువెళ్ళి ఆమె ముఖం మీద చల్లి, ఆమెను పొదివిపట్టుకుని ముందు నీళ్ళు తాగించింది. ఆమె కొంత సేదతీరాక అరుగుమీద దుప్పటి పరచి ఆమెని లేవదీసి నెమ్మదిగా అరుగుమీద పడుకోబెట్టింది. మజ్జిగతో అన్న రసాన్ని తెచ్చిపెట్టింది. ఆ యువతి తేరుకుంది. కళ్లతోనే కృతజ్ఞతలు తెలుపుకుంది. పేరడిగితే ‘ఫరీదా’ అని నెమ్మదిగా తెలిపింది.
అదిగో అప్పుడు మొదలైంది. అసలు కథ! అంతా చూస్తున్న చుట్టుపక్కల అమ్మలక్కలంతా బిలబిలమంటూ వచ్చి చేరారు.
‘తురక పిల్లని తాకి, పట్టుకుని, కావులించుకుని, ఆమెకు తిండిపెట్టి, పక్కలేసి సేవలు చేయడంతో భ్రష్టురాలివైపోయా’వని తిట్ల దండకాన్ని అందుకున్నారు. అదీ సంగతి!
దగ్గరకి వెళ్లి చూశారంతా. జగన్నాథుడికి పరిస్థితి అంతా అర్థమయింది. గడపవారగా తలవంచుకుని కూచుని ఉన్నది కామేశ్వరి.
అరుగుమీద పడుకుని ఉన్న యువతి అరమోడ్పు కనులతో ఉసురుసురంటోంది. దడిగట్టినట్టుగా చుట్టూ ఇరుగుపొరుగు స్త్రీలు.
మాటలు రువ్వుతున్న వారిలో కొందరు జగన్నాథుని చూసి ఆగిపోయారు. కానీ, తిరస్కార పర్వం ముగియలేదు.
ఒక పెద్దామె జరిగిన సంఘటనకి అసలైన నాటకీయతని అలడుతోంది, “ఇందుకనే భట్టోజీ మహాశయులు ఈ ఛండాలాన్ని మొదటి నుంచీ అసహ్యించుకుంటున్నారు. ఊరునీ వాడనీ పట్టించుకోకుండా – దేశాన్ని ఉద్ధరించే నాయకుల్లాగా ఆచారాల్ని మంటగలుపుతున్నారు.”
“అవునవును. ఈ విపరీతం ఎన్నడైనా ఎరుగుదుమా?”
“తురకల సంజాతానికి దిగినవాళ్లు మనల్నేం లక్ష్యపెడతారు?”
“కొంతమంది ఇంతే. నికృష్టప్పనులు చేస్తూ చుట్టుపక్కలవాళ్ళకే తలవంపులు తెస్తారు.”
“అయినా ఆ బిచ్చపు ముండని తాకటమేంటి? పూనుకుపూసుకు తిండి పెట్టటమేంటి?”
“అంటూ సొంటూ పాటించాల్సిన వాళ్లే ఇట్లాంటి ముదనష్టప్పనులు చేస్తుంటే చూస్తూ ఊరుకోకూడదు.”
మానవజాతి ప్రాథమిక దశావిశేషాన్ని ప్రతిబింబిస్తోంది అక్కడి వాతావరణం. జగన్నాథుడు మౌనశ్రోతగా, మౌన ప్రేక్షకుడుగా వెళ్లి కామేశ్వరి పక్కన కూచున్నాడు.
శాస్త్రి గొంతెత్తాడు, “అమ్మలారా! మీ పంచాయితీని ఆపండి. మీకు మీరే మన్సబుదారుల్లా తీర్మానాలు చేస్తున్నారు. ఒక నిస్సహాయురాలైన అభాగినికి ఆహారమిచ్చి మా గురుపత్ని చేసిన పనిని మనుషులుగా గౌరవించాలి. దానికి బదులు సూటిపోటి మాటలతో మనసుని వేధించి బాధించటం భావ్యంకాదు. మా గురువుగారి దృష్టిలో, మా అమ్మ దృష్టిలో మనుషులంతా ఒక్కటే.. ఆమె చేసినదేమీ అపరాధమూ, నేరమూ, ద్రోహమూ కాదు. నిజానికి ఉన్నతమైన మానవసేవే ఉత్తమమైన మాధవ సేవ” అని చేతులు జోడించాడు.
“దయచేసి వెళ్లండి. ఏమి చేయవచ్చో, ఏమి చేయకూడదో మాకు తెలుసు. అలాగే చేస్తాం కూడా” ఇది నాగేశుని మాట. నాగేశుని మాటలకు ప్రతి స్పందనగా, చేతులు తిప్పుతూ “అవును చేస్తారు. బరితెగించిన వాళ్లు ఏమైనా చేస్తారు” అంటూ మూతి విరుపుతో, కొంగు సవరించుకుంటూ బయటికి దారితీసిందొకావిడ. నిదానంగా ఒకరితర్వాత ఒకరుగా వెళ్లిపోయారు.
శేషవీరేశ్వరుడు తన ఇంట్లోకి నడిచాడు. ఆయన వెనగ్గా పర్వత వర్థనీ వెళ్లింది. జగన్నాథుడు శిష్యులవైపు చూస్తూ “మీరూ వెళ్లిరండి” అన్నాడు. వాళ్లు కదిలారు. తాను సాభిప్రాయంగా భార్య భుజం తట్టాడు. ఆమె లేచి నిలబడింది. ఇద్దరూ లోనికి వెళ్లారు.
కొద్దిసేపటి తర్వాత జగన్నాథుడు బయటికి వచ్చి తన చేతిలోని దుప్పటిని అరుగుమీది యువతిపైన కప్పి సరిచేశాడు.
రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు కామేశ్వరి ఆ యువతి దగ్గరికి వచ్చింది. ఆమె కళ్లు తెరిచి చూస్తూ ఏదో ఆలోచనలో వుంది.
“ఆకలవుతోందా? ఏమన్నా తింటావా?” అడిగింది కామేశ్వరి. ఆమె వద్దన్నట్టు తల తిప్పింది. “లోపలికి వచ్చి పడుకో, బల్లమీద దుప్పటి పరిచాను” అన్నది.
రానన్నట్టు తలతిప్పి, చేతులతో దణ్ణం పెట్టింది. ఆమె కంటినిండా నీరు ఉబికింది. కామేశ్వరికీ మనసు కరిగింది. “సరే.. సరే.. ఇక్కడే పడుకో” అంటూ, చెమర్చిన కళ్లని తుడుచుకుంటూ లోపలికి వెళ్లింది.
కొద్ది క్షణాల తర్వాత గ్లాసుతో వేడిపాలు తెచ్చి అందించింది. ఆ యువతి నిదానంగా లేచి కూర్చుని గ్లాసు తీసుకుని పాలు తాగింది. కృతజ్ఞతా భావాన్ని చూపుల్లో నిలిపి చేతులు జోడించింది.
చిరునవ్వుతో లోపలికి కదిలింది కామేశ్వరి.
– ఒక రాత్రివేళ
-అరుపులూ.. కేకలూ..
హడావిడికి లేచి ఆత్రుతగా ఇంట్లోంచీ బయటికి వచ్చారు- ఇటు నుంచీ జగన్నాథ కామేశ్వరీలూ, అటు పక్క నుంచీ శేషవీరేశ్వరులూ పర్వతవర్థనీ.
ఆ యువతిని బలవంతాన లాగి జుట్టుపట్టుకు వంచి కొడుతున్నాడు – ఒక నడివయస్కుడు. ఆకారం, వాలకం ముస్లిం అని తెలుపుతూనే ఉన్నై. అతని వెనగ్గా పది పదిహేనుమంది స్త్రీ పురుషులు ఉన్నారు. అంతా ముస్లిములే. ఆమె మీద పడి రక్కుతూ కుమ్ముతున్నారు.
చూశాడు జగన్నాథుడు. కోపం బుగ్గ పొంగింది. ఉర్దూలోనే ‘రోకో.. ఠైరో” అని కంచుకంఠం మోగింది.
అందరూ ఠక్కున ఆగిపోయారు. నిశ్చేష్టులైనారు. “ఏం జరిగిందని ఆమెనలా హింసిస్తున్నారు? ఎవరీమె?” అని ఆమె జుట్టు పట్టుకున్న మనిషి చేతిమీద బలంగా గట్టిగా వేటు వేశాడు. ఆ దెబ్బకి ఆతని చెయ్యి పట్టు వదిలింది. నాలుగు అడుగులు వెనక్కు వేసి గ్రుడ్లురుముతూ నిలబడ్డాడు.
వెనక నుంచీ ఎవరో చెప్పారు. “ఆమె అతని భార్యే” అని. “హాఁ.. ఏ మేరా బహూ హై” ఆ నడివయస్కుడి పక్కనున్న ఆవిడ ఖంగున చెప్పింది. “అయితే?” అని గద్దించాడు జగన్నాథుడు.
వయసు మళ్లిన మరో స్త్రీ ముందుకొచ్చి చెప్పింది, “ఈ ముండ మసీదు దగ్గర డబ్బులడుక్కుని మొగుడికివ్వకుండా సోకులు పోతోంది”.
అర్థమైందాయనకు. ఆ భర్త ఆమెని డబ్బు తెచ్చిచ్చే యంత్రాన్ని చేశాడన్న మాట! వాడికి తల్లీ, కులపోళ్లు వత్తాసు!
ఆ క్షణంలో ఆ యువతి గొంతు పెకల్చుకుని “నాలుగు రోజుల్నుంచీ పైసా రాలేదు. ఇంటికి పోతే తిండి పెట్టమని కొట్టి తరిమేశారు” అంటూ ఏడవడం మొదలెట్టింది.
శేషవీరేశ్వరుడు వాళ్లందరికీ హితవు చెప్పి శాంతపరచసాగేడు. జగన్నాథుడు మాత్రం తన ఉచ్చైస్వరాన్ని తగ్గించకుండా, “ఆ పిల్లని కొట్టి, తిట్టి, తిండిపెట్టకుండా మాడ్చి చంపేద్దామనుకుంటున్నారా? యే అన్యాయ్ నహీ చలేగా” అని, గొంతుని ఇంకా పెద్దది చేసి “ఛలో ముఖద్దమ్ కే పాస్, నైతో కొత్వాల్ సాబ్, కాజీ భీ హైనా? ఆప్ కా కహానీ దేఖేంగే’ అని గట్టిగా చెప్పాడు.
“హాఁ-హమ్ కో క్యాహోగా….?” బీరంగా అన్నాడు ఆ యువతి భర్త.
ముఖద్దమ్ పంచాయతీ పెద్ద. కొత్వాలేమో నగరంలో శాంతి భద్రతల అధికారి. కాజీయేమో ముస్లిం న్యాయాధికారి. కొత్వాల్, కాజీమాటలు యెత్తగానే ఆడవాళ్లంతా తగ్గి మొగమొహాలు చూసుకుంటూ నిలబడ్డారు. కొందరైతే ఆ యువతి తప్పులేదని-భర్తనీ, అత్తనీ దూషించసాగేరు. ఒక పెద్దతను ముందుకొచ్చి జగన్నాథ దంపతుల ఆదరణనీ, మానవీయ గుణాన్నీ మెచ్చుకున్నాడు.
మరొకరెవరో “ఆడకూతురికి ఇట్లాంటి అన్యాయాలు జరుగుతున్నాయని జహంగీర్ జహాపనా వారికి తెలిస్తే తోలు తీసి ఆరేస్తారు” గట్టిగానే అన్నారు.
ఆ మాటలకి కొనసాగింపుగా అన్నాడు జగన్నాథుడు, “అవును న్యాయపరిరక్షణకు కాంచనఘంటామాలని ఏర్పాటు చేసిన ప్రభువు జహంగీర్ పాలనలో ఇట్టాంటి దురన్యాయాలూ, ఘోరాలూ జరగకూడదు- ఒకవేళ ఏదైనా వారి దృష్టికి వస్తే కఠినశిక్ష తప్పదు.”
ఆడవాళ్లల్లో ఒకరిద్దరు “ఈ ముసల్దీ, దాని కొడుకూ ఫరీదా గురించి చెడుగా చెబితే వచ్చాంగానీ, తప్పులేని ఆ పిల్లని కొట్టే పాపం మాకెందుకు?” అంటూ తప్పుకున్నారు.
ఎంత స్వతంత్రమైన ఆలోచనా, వాంఛనీయమైన కార్యాచరణా అయినా, పదిమందిని భాగస్వాముల్ని చేస్తేనే ఫలితం అనుకూలంగా వుంటుంది. ఆ భావనతో ఇదే అదనుగా భావించి జంతుబలి ప్రసక్తి తెచ్చాడు జగన్నాథుడు. “అందుకే జంతుబలి అనాచారం గురించి కూడా మేము అమాయక ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాము.”
ఆ మాటలకు కొనసాగింపుగా శేషవీరేశ్వరుడు కూడా అనంతపురం, రామాపురం ఘటన గురించి టూకీగా వివరించాడు.
వచ్చినవాళ్లంతా వాళ్లల్లో వాళ్లు మాట్లాడుకున్నారు. కొన్ని నిముషాల తర్వాత ఆ సద్దుమణిగింది. వాళ్లలో పెద్దమనుషులు “మేమూ ఆ వూళ్లకు పోయి వాళ్లకి నచ్చజెప్పి వస్తాము. మంచి పని ఏదైనా అందరమూ చెయ్యాల్సిందే” అని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జగన్నాథుడూ శేషవీరేశ్వరుడూ సంతోషించారు.
అప్పుడు ఆ యువతి అత్త అపరాధ భావంతో, “తప్పయిపోయింది. మాఫీ జియే భయ్యా..” అంటూ కోడల్ని సమీపించి ఆమె చెయ్యందుకుని “రా పోదాం’ అంటూ లేవదీసింది. ఫరీదా భర్త కూడా వారిని సమీపించాడు.
అప్పుడే ఏదో స్ఫురించిన దానిలా కామేశ్వరి చప్పున లోపలికి వెళ్లి వచ్చి ఫరీదా భర్త పేరూ, నివాసం వివరాలూ అడిగి తెలుసుకుని రాసుకుంది.
“షుక్రియా.. షుక్రియా “ అంటూ అందరూ వెళ్లిపోయారు.
శేషవీరేశ్వరుడు “ఇదీ మన మంచికే జరిగింది. వీళ్లు మన ఆదర్శాల్ని పదిమందికీ చెబుతారు” అన్నాడు.
“ఆదర్శాలే కాదు. మనవాళ్ల మంచి మనసుల్నీ చెప్పుకుంటారు”. అన్నది. పర్వతవర్థని.
అధ్యాయం-12
జగన్నాథుడు – అటు శాస్త్రచర్చల్లో దిట్ట అనీ, భాషా వైశారద్యంలో ఏకసంథాగ్రాహి అనీ కవి పండిత వర్గానికి క్రమేపీ అర్థం కాసాగింది.
తులసీదాస్ ప్రభావమూ ఆయా ఆధ్యాత్మికవాదుల్లో, భక్తుల్లో, సాధారణ పౌరుల్లో నెలకొని వున్నది. తులసీదాస్ రామచరిత మానస్ గురించి సాగే ప్రసంగాల్లో జగన్నాథుని ప్రసక్తి వస్తోంది. జగన్నాథుని ప్రతిభావిశేషాలు-ప్రత్యేకించి ఆయనకున్న మానవత్వం, సాంఘికంగా అభ్యుదయ వాంఛితం ప్రశంసల్ని పొందుతున్నాయి.
కాశీలోనూ, చుట్టుపక్కల ఊళ్లల్లోనూ జగన్నాథుని తెలివిడి, ఎఱుక జనం నోళ్లల్లో బాగానే ప్రచారానికొచ్చాయి.
ఈ పరిస్థితుల్లోనే అనంతపురం రామాపురం జాతర వచ్చింది. శేషవీరేశ్వరుడి బృందం మొదట్లో అనుకున్నా – జగన్నాథుడే పునరాలోచన చేశాడు. తాము చెప్పిన విధానం, నాయకులకూ జనానికీ అనుసరణీయమనే అనిపించినా, అప్పటి వారి ప్రతిస్పందన తమకు అనుకూలంగానే వున్నా, తీరా జాతర సమయంలో ఉద్రేకోత్సాహాలూ, ఆవేశాలూ ఎలా ఉంటాయో తెలీదు. తాము వెళితే, పరిస్థితులు మారితే, ఘర్షణ అనివార్యమౌతుంది. పట్టుదలలూ, కక్షలూ హఠాత్తుగా పైకెగసే అవకాశమూ వుంది. మనుషుల మాటలు మీరి చేతులూ కలవవచ్చు. కొట్టుకుచావొచ్చు. చివరికి జంతుబలి అంశం కాస్తా నరమేధంగా పరిణమించే ప్రమాదమూ వుంది.
జగన్నాథుడిది సరళమైన ఆలోచన, స్పష్టమైన భాషణం. ఖచ్చితమైన ప్రవర్తనావిధానం. తన శక్తియుక్తులూ, వాటి పరిమితులూ కూడా ఆయనకు తెలుసు. ఏ ఊగులాటా, తత్తరా, అనిశ్చితీ ఉండవు. తన ఆలోచనంతా వివరించి, తాము జాతరకు వెళ్లే ప్రయత్నాన్ని విరమింపజేశాడు జగన్నాథుడు. పరిణామాలు ఎలా వుంటాయో వేచిచూద్దాం అనుకుని ఆగిపోయారు.
ఈ నిర్ణయం తీసుకున్న రాత్రి తొమ్మిది గంటలకు కామేశ్వరికి పురిటినొప్పులు మొదలయినాయి. ఆ సమయంలో కావలసిన అవసరాలన్నిటినీ జాగ్రత్తగా చూసుకుంటోంది పర్వతవర్థని. అర్ధరాత్రి సమయానికి అయిదారు నిముషాలున్నదనగా శీర్షోదయమైంది. సుఖ ప్రసవమయి పిల్లవాడికి జన్మనిచ్చింది కామేశ్వరి. తెల్లవారితే మాసశివరాత్రి.
శేషవీరేశ్వరుడూ, పర్వతవర్థనీ సంతోషంతో జగన్నాథుని అభినందించారు. జగన్నాథునిలో మాత్రం ఏ కారణం వల్లనో మొహంలో ఏ ఆనందమూ కనిపించలేదు. పుత్రోత్సాహపు గర్వరేఖలూ స్ఫురించలేదు. మనసు విప్పి ఏమీ మాట్లాడనూ లేదు. పెదవులపై పేలవమైన చిరునవ్వు విరిసింది. తల్లీ పిల్లవాడూ కులాసాగా వున్నారు.
అధ్యాయం-13
అనంతపురం, రామాపురంలో జాతర జరిగింది. ఘర్షణలూ బాగానే జరిగాయి. పశువుని బలి ఇవ్వాలని కొందరూ, ఇవ్వవద్దని మరికొందరూ వాదనలతో, వాదాలతో-ముందు మనుషుల తలలు పగిలాయి. కొందరి కాళ్లూ చేతులూ విరిగాయి. జనం అలజడి, ఆందోళన, ఉత్సాహం, ఉద్రేకాల మధ్య జంతుబలి జరిగిపోయింది.
పరశురాముడి వర్గంలో ఒక యువకుడు హఠాత్తుగా బలి ప్రదేశానికి పరిగెత్తుకుంటూ గుంపును తోసుకుంటూపోయి, మెరుపు వేగంతో తెగిపడి వున్న పశువు తలను ఒక చేత్తో, బోనాన్ని మరో చేత్తో పట్టుకుని జనంలోకి మాయమయ్యాడు. దూరంగాపోయి నిల్చుని అక్కడి నుంచీ గొంతెత్తి “నేనీ పొలిని పొలిమేర దాటించేస్తా. పండితులోరు చెప్పినట్టినుకోలేదు-మీరు. పందెం కాస్తుండా. ఇక మీదట ఇట్టాంటి జాతరలు జరగకూడదు. ఇది నా ఆన” అని అంటుండగానే, జనంలోంచి కొంతమంది బిరబిరాన పరుగున అతనివైపు వెళ్లారు.
“అరేయ్.. చిన్నోడా. నే చెప్పే మాట విను. పొలిని పొలిమేర దాటించమాకు. అట్లా సేస్తే ఊరికి కరువొస్తది రోయ్” అని ఒకరూ, “ఓరి వెధవా, పొలి ఊరు దాటితే రోగాలు వచ్చి జనం చస్తార్రోయ్,” అని మరొకరూ, “ముందు వాణ్ణి పట్టుకోండి.. పట్టుకోండి..” అని కొందరూ అతని వెంట పడ్డారు.
అతను అందకుండా తిరిగి చూడకుండా ‘ఓ బలి’ ఓ బలి’ అని అరుస్తూ ముందుకే పరిగెత్తుతున్నాడు. అతని పరుగు వేగానికి ఊరి పొలిమేర ఎప్పుడో వెనకబడి కూలబడిపోయింది. జనం ఉరుకులూ, పరుగులూ, తిట్లూ, ఏడుపులూ, పెడబొబ్బలూ.. పొలిమేరలో దిక్కులు మూర్ఛపోయినై!!
(సశేషం)