కాజాల్లాంటి బాజాలు-117: మా మంచి వదిన..

8
3

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

[dropcap]ఏ[/dropcap]విటో ఈ వదిన ఇన్నేళ్ళైనా అస్సలు అర్థం కాదు నాకు. మరి లేకపోతే ఏమనుకోవాలీ.. ఇవాళ పొద్దున్నే ఫోన్ చేసి “ఓ వారంరోజులకి సరిపడా బట్టలు సర్దుకుని రెడీగా ఉండు.. ఏ సమయానికైనా పిలుస్తాను. వెంటనే బయల్దేరాలి..” అంటూ హుకుం జారీ చేసేసింది. సంగతేవిటో అడుగు దామనుకుంటుండగానే ఫోన్ పెట్టేసింది. పొద్దున్నే పనివేళ కదా.. తీరుబడిగా మధ్యాహ్నం మాట్లాడదామని నేనూ ఫోన్ పెట్టేసేను.

ఇదిగో.. అందుకే ఇప్పుడు వదినకి ఫోన్ చేస్తే అసలు విషయం తెలిసింది.. ఏవిటా విషయం అంటారా.. నాకూ వదినకీ మధ్య జరిగిన సంభాషణ మొత్తం చదవండి.. మీకే తెలుస్తుంది….

నేను – ఏంటి వదినా.. వారం రోజులపాటు ఏదైనా తీర్థయాత్రల ప్రోగ్రాం పెట్టేవా!

వదిన – అంతే.. అంతే.. నీకంతకన్న గొప్ప ఆలోచన ఎక్కడొస్తుందిలే..

నేను (ఉడుకుమోత్తనంతో) – నీ కొచ్చిన అంత గొప్ప ఆలోచనేంటో.. మహా అయితే ఏ రిసార్ట్‌కో ప్లాన్ చేసుంటావ్.

వదిన – హూ.. ఈ వదినని ఎంత తక్కువగా అంచనా వేసేవ్! నా డబ్బులు పెట్టి నేను బైట కెడితే ఇంక నా గొప్పేముందీ!

నేను – అంటే.. ఎవరిదైనా పెళ్ళా.. వాళ్ళే చుట్టాలందరికీ బస్ అరేంజ్ చేసేసేరా!

వదిన – అబ్బా.. స్వర్ణా.. ఆ పాతకాలం ఆలోచనల్లోంచి ఇంక నువ్వసలు అప్డేట్ అవవా..

నేను – నన్ననకపోతే అసలు సంగతేంటో చెప్పొచ్చు కదా!

వదిన – మనం ఒక వారం రోజులపాటు ఫైవ్ స్టార్ హోటల్లో ఉండబోతున్నాం. రూమ్ లోకే బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్.. గంట గంటకీ కాఫీలూ, కూల్ డ్రింకులూ, బెల్లు కొడితే వచ్చే అటెండర్లూ, కాలు కదపకుండా, అలసటనేదే లేకుండా వారంరోజులపాటు హాయిగా ఎంజాయ్ చేస్తామన్న మాట.

నాకు మతి పోయింది.. అలా ఎలా! అదే అడిగేను వదినని.

వదిన – మనం ఒక సినిమాకి కథ రాయబోతున్నాం.. దానికోసం హోటల్లో డిస్కషన్స్ అన్న మాట..

ఇక్కడ మనం అంటే వదిన ‘రాయల్ వుయ్’ అని తననే అనుకుని ఉండాలి.. లేకపోతే నాకు కథలు రాయడమే రాదు.. ఇంక సినిమా కథ కూడానా!

నేను – హార్టీ కంగ్రాట్యులేషన్స్ వదినా.. సినిమాకి కథ రాసేస్తున్నావంటే ఎంత గొప్పా!

వదిన – థాంక్యూ… థాంక్యూ. ఆ సినిమా కథ రాయడానికే ప్రొడ్యూసరు హోటల్లో రూమ్ బుక్ చేసేడు. నీక్కూడా కాస్త చేంజ్ ఉంటుందని నిన్ను కూడా నాతో రమ్మంటున్నాను.

నేను – చాలా థాంక్స్ వదినా.. ఈ రొటీన్ నుంచి వారం రోజులు ఆటవిడుపన్న మాట.. ఇంతకీ ఎవరా గొప్ప నిర్మాత.. ఏమా కథ!

నాలో ఉత్సాహం తన్నుకుంటూ పైకొచ్చేస్తోంది.

వదిన – నిర్మాత కొత్తవాడు. మనవైపు బాగా పొలాలూ, తోటలూ ఉన్నవాడు. ఒక్కడే కొడుకు. ఇప్పుడు ఆ కొడుకుని హీరోగా పెట్టి సినిమా తియ్యాలని హైద్రాబాదు వచ్చాడు. మనం ఇప్పుడు ఆ కొడుక్కి తగ్గ కథ రాయాలన్న మాట.

వదిన చెప్పినదానికి నేను కింద పడకుండా ఉండడానికి చాలా ప్రయత్నించాల్సొచ్చింది. లోపల్నించి ఏదో అనుమానం పెనుభూతమై కూర్చుంది.

నేను – మనవైపు పొలాలూ, తోటలూ ఉన్నవాడంటే కొంపదీసి ఆ కొబ్బరిమట్టగాడు కాదు కదా!

మేవంతే.. మావైపు వాళ్ళెవర్నీ వాళ్ల వాళ్ల పేర్లు పెట్టి పిలవం.. వాళ్ల ఆకారాన్ని బట్టో, స్వభావాన్ని బట్టో కొబ్బరిమట్టగాడనో, కొత్తిమీరకట్టగాడనో ఏవో పేర్లు పెట్టేసి, ఆ పేర్లనే చలామణీ చేసేస్తుంటాం. ఒక్కొక్కసారి వాళ్ల అసలు పేరు చెప్పినా మేము గుర్తు పట్టకపోతే వాళ్ళే పాపం ‘నేనండీ కొబ్బరిమట్టని’ అని చెప్పుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ కొబ్బరిమట్ట కూడా అంతే.. వాడి తోటలో ఎన్ని కొబ్బరిచెట్లుండి, వాటి మట్టలు పడ్డా సరే..ఊళ్ళో ఇంకెవరి కొబ్బరిమట్టైనా కింద పడిందంటే చాలు.. పరిగెత్తుకెళ్ళిప్ళోయి దానిని తెచ్చేసుకుని, ఈనెలు తీసి చీపురు చేసేసుకుని, మట్ట పొయిలో పెట్టేసుకునే బాపతు. అందుకే వాడి నందరూ కొబ్బరుమట్టగాడని పిలుస్తారు. అలా కూడబెట్టిన డబ్బుతో ఇప్పుడు కొడుకుని హీరోగా పెట్టి సినిమా తియ్యాలనుకుంటున్నాడన్న మాట అనుకున్నాను.

వదిన – వాడి పేరేదైతేనేం.. మనకి ఛాన్స్ ఇస్తున్నాడు.. అంతగా కావాలంటే కథ ఇంకా డెవలప్ చెయ్యాలని హోటల్లో ఇంకో నాలుగురోజులు ఎక్కువ కూడా ఉండొచ్చు.

నేను – అదికాదు వదినా.. ఆ కొబ్బరిమట్టగాడే పగలు చూస్తే రాత్రి కల్లో కొస్తాడు. ఇంక వాడి కొడుకంటావా.. మరీ తాళంచెవిలా ఉంటాడు. గట్టిగా కొలిస్తే అయిదడుగులు కూడా ఉండడు. వంకరటింకర నడకా వాడూనూ.. తిన్నగా నిలబడను కూడా నిలబడ్లేడు. తతత మెమెమె అని చప్పరిస్తాడు తప్పితే నోరిప్పి గట్టిగా మాట్లాడలేడు. వాడు హీరో ఏంటీ!

వదిన – చూసే జనాల ఖర్మకానీ వాడెలా ఉంటే మనకెందుకూ.. మనకి కావల్సింది ఛాన్సంతే.. వదులుకుంటావా ఏంటీ! అయినా ఈ రోజుల్లో హీరోకి మాట రాకపోతే యేం.. డబ్బింగ్ చెప్పేవాళ్ళు బోల్డుమంది. హీరో ఎవడైనా పర్వాలేదు.. డబ్బు దండిగా పెట్టే నిర్మాత ఉంటే చాలు. ఒక్కసారి హీరో మొహం ఫ్రేమ్‌లో చూపిస్తారంతే.. తర్వాతంతా గ్రాఫిక్సే కదా. హీరో చిటికెనవేలు చూపించడం.. విలన్ గేంగ్‌లో ఉన్న అంతలావు మనిషీ అంతెత్తు ఎగిరిపడడం. హీరో కాలిగోరు చూపించడం.. విలన్ గేంగ్ లోని ఇంకో చుంచుమూతిగాడు సీలింగ్ వరకూ ఎగిరి అక్కడ అతుక్కుపోవడం. హీరో కన్రెప్పలు టపటపలాడించడం.. విలన్ గింగిరాలు తిరుగుతూ హీరో కాళ్లముందు కుప్పలా కూలడం.. ఇవన్నీ గ్రాఫిక్స్‌లో కవర్ చేసేస్తారు కదా!

మరింక నడకంటావా.. ఈ రోజుల్లో హీరో ఎంత వంకరటింకరగా కుంటుతున్నట్టు నడిస్తే అంత హిట్టైపోతున్నాయి సినిమాలు. అయినా ఈ రోజుల్లో హీరో అందచందాలు ఎవరి క్కావాలి! కాశ్మీర్ అందాలనుంచి కన్యాకుమారి వివేకానంద్ రాక్ వరకూ ఇండియాలో లొకేషన్సే కాదు ప్రపంచంలో ఉన్న అందమైన చూడదగ్గ ప్రదేశాలన్నీ చూపించేస్తే చాలు. హీరో పుట్టింది ఫక్తు పల్లెటూర్లో కొబ్బరితోటలో ఉన్న గుడిసెలో అయినా సరే ప్రపంచమంతా తిరిగేస్తాడన్న మాట.

వాడు చదువులోనూ, ఆటల్లోనూ, కుంగ్ ఫూ, కరాటే లాంటివాటిల్లోనూ, కర్రసాము, కత్తియుధ్ధం, విలువిద్యలాంటివాటి అన్నింటిలో ఆరితేరినవాడన్న మాట.

ఇటు సాంప్రదాయ సంగీతంలో హేమాహేమీల నోడించేస్తుంటాడు. అటు వెస్టర్న్ మ్యూజిక్ అదరగొట్టేస్తుంటాడు.

క్లాసికల్ డాన్సునుంచి, వెస్టర్న్ డాన్సెసే కాదు అక్రొబేట్, జుంబాలాంటి వాటన్నింటిలో వీడే ఫస్టొచ్చేస్తుంటాడు.

ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎంతమందున్నా, ఎలాంటివారైనా అందర్నీ ఓడించేసేస్తున్నట్టు చూపించేసి మన హీరో ఇమేజ్‌ని ఆకాశమంతెత్తు పెంచేస్తామన్న మాట..

ఆ హీరోకి ఒకటో క్లాసు నించీ పి.హెచ్.డి వరకూ అన్నీ గోల్డ్ మెడల్సే.. స్వర్ణా, నువ్వు ఇక్కడ ఒకటో క్లాసుకి గోల్డ్ మెడల్ ఎవరిస్తారని అడగొద్దు.. ఇక్కడే కాదు అసలెక్కడా లాజికల్ క్వశ్చన్స్ అడగొద్దంతే. మరింక కథలో కెడితే – ఆ హీరో వాళ్ళమ్మ ఆ మెడల్స్ అన్నీ కలిపి ఓ పేద్ద తాడుకి వరసగా పేర్చుకుని ముళ్ళేసుకుని, కాసులపేరులా మెళ్ళో వేసుకుని ఆ ఊళ్ళో జరిగే ప్రతి పేరంటానికీ వెడుతుంటుందన్న మాట.. అవిడియా ఎంత గొప్పగా ఉందో చూడు!

పరవశించిపోతూ చెప్పుకుపోతున్న వదినని మధ్యలోనే ఆపేసి వెటకారంగా అడిగేను.

నేను – పేరంటం నించొచ్చి ఆ కాసులపేరుని మెళ్ళోంచి తీసేక ఆ గుడిసెలో మేకుకి తగిలిస్తుందేమోలే..!

వదిన (వెంటనే) – ఇలా చెప్తే అలా పట్టేస్తావ్. అందుకే అన్నింటికీ నిన్నే పిలుస్తాను. అవునూ.. ఆక్కడిలాంటి సీన్ పెడితే ఎలా ఉంటుందంటావ్.. హీరో చిరిగిపోయిన తన చొక్కాని నెమ్మదిగా విప్పి గోడకున్న మేకుకి తగిలిస్తూ, ఖాళీగా ఉన్న ఆ మేకుని చూసి “అమ్మా..” అంటూ గట్టిగా అరుస్తాడు. అప్పుడు అక్కడే ఓ మూలన కుక్కిమంచంలో పడుకుని ఎముకలు కనిపిస్తున్నట్టున్న అతని తాత.. ‘ఎందుకురా.. అరుస్తావూ.. మీ అమ్మ పేరంటానికి వెళ్ళింది.’ అంటాడు. అప్పుడు హీరో ‘ఇక్కడి నా మెడల్సేవీ!’ అంటూండగానే హీరో తల్లి వెలిసిపోయిన చీరతో, మాసికలు వేసిన జాకెట్టుతో, చింపిరిజుట్టుని వెనక్కి లాగి గట్టిగా వేసుకున్న ముడితో.. ఒక తాడుకి మెడల్సన్నీ వరసగా గొలుసులా ముడివేసిన మెడలో వేసుకున్న గొలుసుతో ‘బాబూ..’ అంటూ వస్తుంది.

తల్లిని అలా చూసి హీరో కుళ్ళి కుళ్ళి ఏడుస్తాడు.. ‘అమ్మా, నీ ఒళ్ళంతా బంగారం తాపడం చేయిస్తానమ్మా..’ అంటూ తలెగరేసి బైటకి వెళ్ళిపోతాడు.

కళ్ళు తిరిగి కింద పడిపోతానేమోనని భయం వేసి పక్కనున్న కుర్చీని గట్టిగా పట్టుకున్నాను.

వదిన – సీన్ అదిరిపోయింది కదూ! అందుకే నీకు నోటమ్మట మాట కూడా రావట్లేదు.. నా కర్థమైందిలే..

ఓహ్.. వదినకి అలా అర్థమైందన్న మాట అనుకున్నాను.

నేను(వెటకారంగా) – కథని బాగానే వండుతున్నావు వదినా..

వదిన – మరేమనుకున్నావ్ మీ వదినంటే.. వంటలు కూడా ఇదివరకులా లేవు కదా ఇప్పుడు.. ఇదివరకయితే వంకాయకూరని రకరకాలుగా చెయ్యాలంటే మెంతికారంపెట్టీ, కొత్తిమీరకారం పెట్టీ, ఉల్లికారం పెట్టీ.. ఇలాగ ఒక్కొక్కరకం ఒక్కొక్కలా చేసేవారు.. హూ.. కానీ ఇప్పుడలా కాదు.. ఏ కూరైనా సరే మరిగే నూనెలో ఉప్పూ, పసుపూ వేసేసి, ఇంత అల్లంవెల్లుల్లి నూరిన ముద్ద వేసేసి, ఈ కూరందులో పడేసి, మగ్గబెట్టేక, దాని మొహాన్న ధనియాలపొడీ, జీలకర్రపొడీ, గరంమసాలాపొడీ, కారం.. ఇలా చేతికందిన పొడులన్నీ జల్లేసి, సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని దాని మొహాన్న సన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చెయ్యడవే కదా! ఇప్పటి సినిమా కథలు కూడా అంతే.. తాళంచెవంత కాదు గుండుసూదంత హీరో అయినా సరే వాడి దగ్గర డబ్బు తెచ్చుకునే సత్తా ఉంటే చాలు వాడిని హిమాలయమంత ఎత్తు పెంచెయ్యడమే.. గ్రాఫిక్స్ ఎందుకింత పాప్యులర్ అయ్యేయనుకుంటున్నావూ.. ఇందుకే మరి..

నాకు నోట మాట రాలేదు. వదిన ఇంకా చెప్పుకుపోతోంది.

వదిన – అవునూ.. ఆ మధ్య నీకు తెలిసున్న కుర్రాడెవరో సినిమాల్లో వేషంకోసం ఈ ఊరొచ్చేడన్నావు కదూ! అతనికి ఫోన్ చేసి రమ్మను.. వేషం ఇచ్చేద్దాం పాపం..

నాకు షాక్ కొట్టినట్టయింది.

నేను – అతనా..అతను నాలుగడుగులకన్న ఉండడు వదినా.. అతనికి వేషమేం ఇస్తాం!

వదిన – హయ్యో స్వర్ణా.. నీకెలా చెప్తే అర్థమౌతుందీ! హీరో చుట్టూ నలుగురు ఫ్రెండ్స్ ఉండాలి కదా. కానీ వాళ్ళు హీరో కన్న పొట్టిగా, వికారంగా, వంకర్లుపోతూ ఉండాలి. అప్పుడే హీరో ఎలివేట్ అవుతాడు. లేకపోతే మామూలుగా ఉన్నవాళ్లని ఫ్రెండ్స్‌లా పెడితే హీరో కన్న అందంగా కనిపించరూ! అందుకే ఆ కుర్రాణ్ణి పిలు. ఇంకా అలాంటి వాళ్ళెవరైనా ఉంటే తిసుకురమ్మను.. ఛాన్సిచ్చేద్దాం పాపం..

వదిన అపర దయామయిలా మాట్లాడేస్తోంది. వదిన చెప్పినవన్ని తల్చుకుంటుంటే నాకు కడుపులోంచి దుఃఖం తన్నుకుంటూ పైకొచ్చేస్తోంది. హూ.. ఇప్పుడన్నిచోట్లా డబ్బే రాజ్యమేలుతోంది. రచనలకు ఇప్పుడు జరుగుతున్న అపచారం చూస్తుంటే నాకు ఒక్కసారి మహానుభావులు పోతనగారి పద్యం గుర్తు కొచ్చింది.

కాటుక కంటి నీరు చనుకట్టు పయింబడ నేల యేడ్చెదో
కైటభదైత్యమర్దనుని గాదిలి కోడల! యో మదంబ! యో
హాటకగర్భురాణి! నిను నాకటికిం గొనిపోయి యల్ల క
ర్ణాట కిరాట కీచకుల కమ్మ త్రిశుద్ధిగ నమ్ము భారతీ!

నీవు కంటికి పెట్టుకున్న కాటుక, కన్నీటికి కరిగి రవికపై పడేలా ఎందుకు ఏడుస్తావు! ఆ మహా విష్ణువునకు ఇష్టమైన కోడలా! ఓ మా తల్లీ! బ్రహ్మదేవునికి సాక్షాత్తు ఇల్లాలా! నిన్నుతీసుకుపోయి అంగట్లో పెట్టినట్లు ఆ కర్ణాట కిరాట కీచకులకు అమ్మివేయను. త్రికరణ శుద్ధిగా ఒట్టు వేస్తున్నాను. నన్ను నమ్ము సరస్వతీదేవి!

ఎంత గొప్పగా చెప్పారాయన.. నాకు తెలీకుండానే నా కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి.

ఇదంతా చూస్తుంటే ఒక వారంరోజులు ఫైవ్ స్టార్ హోటల్లో ఫ్రీగా ఉండడానికి వదినలాంటివాళ్ళు ఆ తల్లికి చేస్తున్న ద్రోహం చూస్తుంటే నాకు దుఃఖం తన్నుకు వచ్చేసింది.

నేను – నేను రాను వదినా.. అయినా డబ్బుకోసం నువ్వు ఇలాంటి పన్లు చేస్తావని నేను కల్లో కూడా అనుకోలేదు. దీనికోసం అయితే ఇంకోసారి నాకు ఫోన్ చెయ్యకు.

గట్టిగా అరిచేసేను.

వదిన – వచ్చిందా.. కోపం వచ్చిందా! ఇంకా నీకు కోపం రాలేదేంటా అని అనుకుంటున్నాను. నేనూ, మీ అన్నయ్యా కూడా సరిగ్గా ఇలాగే అనుకున్నాం. నిన్న ఆ కొబ్బరిమట్టగాడొచ్చి ఇలా కొడుకుని హీరోగా పెట్టి సినిమా తీస్తున్నాననీ, కథ కావాలనీ, ఎంత కావలిస్తే అంత ఇస్తాననీ అన్నాడు. నాకు కుదరదని చెప్పి అతన్ని పంపేసేం. ఒకవేళ అలా నేను ఆ కొబ్బరిమట్టగాడి కొడుకుకోసం, డబ్బులకి ఆశపడి కథ రాస్తే నలుగురూ ఏమనుకుంటారా అని ఆలోచించి, నీమీద ప్రయోగం చేసేనన్న మాట. హ హ.. నమ్మేసేవా! అయినా ఈ వదిన గురించి నీకూ తెలీదూ!

వదిన నవ్వుతూ ఫోన్ పెట్టేసింది.

వదినన్న మాటలకి నా మనసంతా నిండిపోయింది. ఎప్పుడూ ఇలా సరదాగా మాట్లాడుతూ, ఎదుటి మనిషిని ఓడించేస్తూ, తను నవ్వుతూ, ఎదుటివాళ్లని నవ్వించే ఇలాంటి వదిన ఉండడం ఎంత అదృష్టం!.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here