[చెప్పిన పని సకాలంలో చేయలేదని సామంత్‍ని చెంపదెబ్బ కొడతాడు జయంతి. సారీ చెబుతాడు సామంత్. శిరీష్‍ని పిలిచి సామంత్ ఇచ్చిన లగేజిని కారు డిక్కీలో పెట్టించి, శివరాం ఇంటికి వెళ్తాడు జయంతి. డిక్కీలోని లగేజిని శివరాం స్టోర్ రూమ్‍లో పెట్టి, తాళంచేతులు పార్వతికి ఇచ్చి బయల్దేరుతాడు. లాయర్ ముకుందాన్ని కల్సి అతని ప్రాక్టీసు గురించి ఆరా తీస్తాడు. ఒక కేసులో ఓ ఆవిడకి దక్కే ఆస్తి తమకే చెందాలని అంటాడు. అక్కడ్నించి అంజయ్య కొట్టుకు వెళ్ళి అతనితో మాట్లాడుతాడు. సిటివో తమ కార్యకలాపాలకి అడ్డొస్తున్నాడని చెప్తాడు అంజయ్య. ఓ లక్ష ఇవ్వమని, ఆయనతో తాను మాట్లాడతానని అంటాడు జయంతి. వ్యవస్థలోకి రాని డబ్బు గురించి ఆలోచిస్తూ ఇల్లు చేరతాడు జయంతి. మంచినీళ్ళు ఇస్తుంది శారద. ఇంతలో రవి వచ్చాడా అని అడగటానికి పార్వతి ఫోన్ చేస్తుంది. రాలేదంటుంది శారద. అప్పుడు కాలింగ్ బెల్ మోగుతుంది. హనుమంతప్ప వస్తాడు. శారదని చూసి, ‘అమ్మా నువ్వు శారదవా’ అని అడిగి సంతోషపడతాడు. హనుమంతప్ప ఇచ్చిన లగేజిని స్టోర్ రూమ్‍లో ఉంచి, తాళం వేసి వస్తాడు జయంతి. హనుమంతప్ప వెళ్లిపోతాడు. ఇంతలో హరేరామ్ వస్తాడు. జయంతికి నమస్కరిస్తాడు. జయంతి శారదని హరేరామ్‍కి, అతడిని శారదకి పరిచయం చేస్తాడు. నచ్చినవి తిని నిద్రకి ఉపక్రమిస్తాడు హరేరామ్. ఇక చదవండి.]
[dropcap]ఆ[/dropcap] మధ్యాహ్నం గానీ, రాత్రి గానీ హరేహమ్ లేచిన జాడ లేదు. మర్నాడు మధ్యాహ్నం ‘ఈ రోజు కూడా లేవలేదేంటి’ అనుకొని గది ముందుకెళ్లి చూసింది. అప్పుడే బయటకొస్తూ శారదను చూసి విష్ చేసాడు.
సీదా టేబుల్ దగ్గర కొచ్చి అక్కడ ఉన్న వాటిలో ఇష్టమైనవి పెట్టుకొని తిని బాత్‍రూంలో జొరబడ్డాడు. బయటకొచ్చి శారదను సమీపించి “సిస్టర్, మరీ తిండిబోతులా అనిపిస్తున్నానా?” అడిగాడు.
నవ్వింది శారద.
“నిద్ర వస్తున్నది.”
తల ఊపింది నవ్వుతూనే.
వెళ్లి పడుకున్నాడు.
ఇంతలో ఫోన్. తీసింది. “హనుమంతప్పను హత్య చేసారు, జయంతికి చెప్పండి” అని.
“ఎవరు మాటాడుతున్నది? ఎవరు? చెప్పమంటే ఏం చెప్పాలి? ఎక్కడ నుంచి ఫోన్ చేస్తున్నది?”
“మీరు చెప్పండి ప్లీజ్” అన్నాడు.
“ఎందుకు చెప్పాలి?” అంది పెద్దగా అరిచినట్టు కోపంగా.
“స్నేహితుడ్ని” అని పెట్టేసాడు.
జయంతి కారు దిగతూనే “ఏమిటి శారదా” అడిగాడు.
“హనుమంతప్పను చంపారట, ఫోను.”
“ఎక్కడు నుంచి?”
“చెప్పలేదు.”
“మరి ఎక్కడికని పోవాలి.”
“నేనేం చేయను” అని లోనకెళ్లింది.
జయంతి కారెక్కాడు. రెండు గంటల తరువాత ఆసుపత్రిలో దొరికింది శవం.
దాన్ని చూసాక ఒళ్లు వణికింది. అంత బీభత్సంగా చంపారు.
కీచక వధ గుర్తొచ్చింది. పోస్టుమార్టం తరువాత దహనం పూర్తి చేయించి ఇంటికి చేరాడు జయంతి. నళినీ, పెంచలయ్య ఎదురుపడ్డారు ఒకే కారులో. గమనించలేదు జయంతిని. ఇది నల్గురుంటున్న సమాజం. బరి తెగించడం వాళ్లకే గాదు, సమాజానికి మంచిది కాదు గదా! అనుకున్నాడు. అదే రాత్రి హనుమంతప్ప తెచ్చిన సూటుకేసును కారులో వేసుకొని కొత్త అడ్రసుకు చేరుకున్నాడు. టైం చూసుకొని తలుపు నెట్టాడు. ఓ సూట్ కేసు డిక్కీలో కొచ్చింది. ఇది వాళ్లకు చేరింది. కారు మరలా లాన్‍లో కొచ్చి ఆగింది. సూట్ కేసు store లో కెళ్లిపడింది. గదిలో కొచ్చాడు. దాదాపు మూడయింది. శారద మంచి నిద్రలో ఉంది. మరో గదిలోకెళ్లి పడుకున్నాడు.
నిద్రలోకెళ్లడానికి చాలా టైం పట్టింది.
తెల్లవారింది. తెల్లవారి చాలా పొద్దెక్కింది. పది కావస్తుంది. అయినా ఆహ్లాదంగా అనిపించింది. నిద్ర సరిపోయినట్టుంది. లేచి బాత్ రూంలో జొరబడి. బయటకొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గరకు చేరాడు. హరేరామ్ కనిపించాడక్కడ. వీడింకా ఇక్కడ ఉన్నాడా అనుకొని “రాత్రికి నువ్వు వెళ్తున్నావా?” అనడిగాడు.
తల ఊపాడు హరేరామ్.
“ఇద్దరు మనుషులు కావాలన్నావు.”
“ఆఁ! నేనే చూసుకుంటాను, దొరికారు కూడా!”
“అయితే రేపు ఉదయం..”
“నేనే ఫోను చేస్తాను” అన్నాడు హరేరామ్..
***
“తెల్లవారి నుంచి హరేరామ్ కనిపించడం లేదు” అంది శారద జయంతితో.
“వెళ్లిపోయడేమో?”
“చెప్పకుండానే?” అని ఆగి “అసలెవరతను?” అంది.
“వదినా అని పిలిపించుకున్నావు గదా.”
“అంటే.”
“అదే నాకు తమ్ముడు, నీకు మరిది”
“నాకు మాత్రం పోలీసులా అనిపించాడు” అంది.
“ఎవరు హరేరామా?”
తల ఊపింది.
ఇల్లు విగిరిపోయేలా నవ్వాడు. నిజానికి అంత పెద్దగా అలా జయంతి నవ్వడం లోగడ చూడలేదు. అట్లాగే చూస్తూ ఉండిపోయింది. నవ్వడం ఆపాడు.
“ఎందుకు నవ్వినట్లు?” అని సీరియస్‍గా అడిగింది.
“నువ్వు వాన్ని పోలీసు అంటుంటే, నవ్వక ఏడ్వమంటావా?” అని మళ్లా నవ్వాడు. ఆ మోతాదున కాదు.
“నాకు అలా అనిపించింది, అన్నాను తప్పా” అంది ఉక్రోషంగా.
“సర్లే కానీ పోలీసు జూతి వాడు మాత్రం కాదు” అన్నాడు.
“ఎంత కాలంగా తెల్సు?”
“చాలా రోజులుగా.”
“మీకు అతను అంతు పట్టలేదు” అంది.
మళ్లా నవ్వబోయి శారదను చూసి ఆగాడు.
అది అర్ధమయ్యే సరికి “ఆలస్యమెందుకనిపిస్తుంది” అని పుస్తకం పట్టుకొని లోనకెళ్లింది. సగంలో ఆగి “పాలు కాగి ఉన్నాయి, త్రాగుతారా?” అడిగింది.
“అలాగే.”
రెండు నిముషాల్లో పాలు బిస్కట్‍లూ వరుసగా ఉంచింది.
“నువ్వు” అనడిగాడు.
“తెచ్చుకున్నాను, త్రాగుతాను” అంది.
ఆనక లేచి వెళ్లబోతుంటే పక్కలోకి లాక్కున్నాడు.
అభ్యంతరం చెప్పలేదు శారద. పూర్తి ఆనందాన్ని పంచుకుంది.
తెల్లవారుఝామున జయింతికి మెలకవ వచ్చింది.
ప్రక్కన శారద కనిపంచలేదు. లేచి బయటకు నడచాడు. లేదు.
శారద గదిలోకి చూసాడు, ఉంది.
వెళ్లి నిద్రపోయాడు.
తెల్లగా తెల్లారింది.
స్నానం ముగించుకొని డైనింగ్ టేబుల్ దగ్గర కొచ్చాడు జయంతి.
ఇడ్లీలూ వడలూ పొగలు గక్కుతూ కనిపించాయి.
వాటిని చూసాక బాగా ఆకలవుతున్నట్లుగా కూడా అనిపించింది.
కూర్చుండిపోయడు.
శారద వస్తుందేమోనని చూసి పిలిచి తనుగా ప్లేటులో వడ్డించుకున్నాడు.
సాంబారు తెచ్చి అక్కడ పెట్టింది శారద.
“వెరీ గుడ్” అంటూ లాగించాడు.
కాఫీ కూడా పూర్తి చేసి గదిలోకి వెళ్లి బట్టలు కూర్చుకున్నాడు. బయటకొచ్చి కారు స్టార్ట్ చేసాడు. నళీనీ రెడ్డి కలిస్తే బాగు అనుకున్నాడు తోవన.
ఢిల్లీ వెళ్లి నాల్గు రోజులవుతుందని విన్నాడు.
సారంగపాణి దగ్గర ఆగాడు.
భానుమూర్తి కలిసాడు. ఆప్యాయంగా దగ్గరకొచ్చి “మనం కలిసి చాలా కాలమైంది” అంటూ “ఇప్పుడెక్కడ?” అడిగాడు.
“సింగపూర్.”
“పాత ఏజంట్లే ఉన్నట్లున్నారు.”
“కొందరున్నారు.”
“మరి.”
“ప్రస్తుతం కప్పలూ పాములు చర్మాలూ కమిషన్‍కు చేస్తున్నాను.”
“స్థిరపడ్డావు గదా?”
“ఫర్వాలేదు” అని నవ్వి “ఈ మాటకు హద్దు ఎక్కడ” అన్నాడు.
“ఇంకా?” అడిగాడు జయంతి
“నళినీ రెడ్డితో పని ఉండి వచ్చాను. ఢిల్లీలో ఉందన్నారు. స్కూటర్ల ప్రాజక్టులో షేర్సు తీసుకున్నాను.”
“మంచిది. శాంతి ఎక్కడ?”
“శాంతా? చనిపోయి అయిదారేళయ్యింది గద” అన్నాడు. భాను ముఖంలో విచారం కనిపించిది.
“కారణం.”
“ఆడపిల్లల్ని ఇతర దేశాలకు పంపే ఫారూక్ గ్యాంగ్ ఉంది గదా, వాళ్లు ఎత్తుకెళ్లారు శాంతిని. గాలించాక అర్థంగాక పోలీసు కంప్లయింటూ ఇచ్చాను. నా వెతుకులాటలో ఓ అడ్రసు దొరికింది. కానీ చాలా పకడ్బందీగా దాడి చేసారు. ఆడపిల్లలు దొరకలేదు గానీ ఊహించని రీతిలో కొందరు ప్రముఖులు దొరికారు. అందులో చిన్నా అనే వాణ్ణి నేను పూర్తిగా గుర్తించడంతో అందరూ నేరస్థులు గానే బోనెక్కారు. దానికి ప్రతికారంగా శాంతను ముక్కులుగా నరికి నాకే పంపారు. అది విప్పి చూసుకొని కుప్పకూలిపోయాను. నా భార్య స్పృహ కోల్పోయింది. ఆనక మతి భ్రమించింది. ఎంత వైద్యం చేయించినా తిరిగి ఆవిడ మనిషి కాలేదు. విశాఖ ఆసుపత్రిలో చేర్పించాను. మా పెద్దమ్మగారి అమ్మాయి (భర్త పోయాడని) అక్కడ ఉంచాను. నా భార్యను ఆవిడే చూసుకుంటున్నది. ఏడు సంవత్సరాలు గడిపోయినయి. కొంతలో కొంత మార్పు రాలేదు ఆవిడలో. డాక్టర్లు ఏమీ చెప్పిలేకపోతున్నారు.” అన్నాడు.
“నీకు మళ్లీ పిల్లలా”
“ఆఁ”
“అంటే.”
“అక్కడ పిల్లనే పెళ్లాడాను. ఆవిడకు నాతో వివాహానికి ముందే ఒక కూతురు వుంది. అయితే ఆ పిల్లను కన్నతండ్రి వెంట తీసుకొని వెళ్లాడు. నాకిప్పుడు ఇద్దరు పిల్లలు. కుటుంబపరంగా నాకు ఇప్పుడు బాధలు లేవు. కానీ, ఆ ముఠా ఇంకా దొరకలేదు” అన్నాడు వేదనగా. ప్రతీకారం తీర్చుకోవాలన్న భావన మాత్రం స్పష్టంగా కనిపించింది.
“ఎన్ని రోజులుంటున్నావు?”
“రేపు బొంబై వెళ్తాను, అక్కడ నుంచి” అని నవ్వాడు.
“నేనిక వెళ్తాను” అంటూ లేచాడు జయంతి. ఒకనాడు జయంతికి శాంతి నిచ్చి వివాహం చేయాలని భానుమూర్తి బాగా ముచ్చటపడ్డాడు. శాంతి రూపం జయంతి గుర్తులోకి వచ్చింది. మనస్సంతా పిండినట్లయింది. కారెక్కాడు. ఇంటికి మలిపాడు.
డైనింగ్ టేబుల్ దగ్గరకి వెళ్లకనే పడక్కగదిలోకెళ్లాడు.
నడుం వాల్చుతుండగా బెల్ మ్రోగింది.
చికాకుగానే బయటకెళ్లి చూసాడు.
రామలింగం.
“అరె నువ్వా, ఇట్లా ఊడిపడ్డావేంటి” అడిగాడు.
“నన్ను నువ్వు కాపాడగలవు” అన్నాడు దగ్గరగా జరిగి. అతని మొఖంలో ప్రాణభయం కనిపించింది.
“ఏమయింది?”
“పట్టుకున్నారు.”
“నిన్ను అనుమానించేదెవరు?”
“తెలీదు. కానీ దుకాణాన్ని సీజ్ చేసారు. నా ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్నారు.”
“నేనుగా కనిపిస్తే బెయిలు కూడా దొరకని స్థితి. అందుకే బెనారెస్ నుంచి పారిపోయి వచ్చాను. ఎలా రక్షిస్తావో ఏమో?”
“నువ్వు ముందు లోపలికి రా, వివరాలు తరువాత మాటాడుకుందాం.”
వచ్చాడు.
కూర్చొమని కుర్చీ చూపినా కూర్చునే స్థితిలో లేడు.
మంచి నీళ్లిచ్చాడు చల్లటివి. త్రాగాడు.
“స్తిమితంగా కూర్చుని చెప్పు. జరిగిందేమో జరిగింది. భయపడితే ఆగుతుందా? ధైర్యంగా ఎదుర్కోవాలిగాని” అని కేకలేసాడు.
(ఇంకా ఉంది)