జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-23

0
3

[జోనరాజ విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన ద్వితీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

శివరాత్రితయోదశ్యాం వర్షే రాజా చత్తుర్దశే।
క్షమావాన్య క్షమామౌక్ఢేచ్చహ్మేర స్పర్శ దూషితామ్॥
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 263)

[dropcap]జో[/dropcap]నరాజు తన రాజతరంగిణి రచనలో పలుమార్లు పరస్పర విరుద్ధమైన విషయాలను ప్రస్తావిస్తూంటాడు. ఇప్పుడు గొప్పవాడు అన్నవాడిని మరునిమిషం చేతకానివాడు అంటాడు. పనికిరానివాడు, రాక్షసుడు అన్నవాడిని అతి గొప్ప దయాసముద్రుడు అంటాడు. ఇలాంటి వాటి నడుమ సమన్వయం సాధించి జోనరాజు మనస్సును అర్థం చేసుకోవాలంటే పదాల పై పై అర్థాలు చూస్తే సరిపోదు. పదాల వెనుక దాగి ఉన్న జోనరాజు మానసిక స్థితిని, పరిస్థితుల వల్ల కలిగిన బలహీనతలను గమనించాల్సి ఉంటుంది.

అచలుడు దాడి చేసినప్పుడు రాజు ఉదయన దేవుడు కశ్మీరు వదిలి పారిపోయాడు. కోటరాణి నిలచి పోరాడింది. ఈ సమయంలో షాహమీరు రాణికి సహాయంగా నిలిచాడో లేదో రాయలేదు జోనరాజు. కానీ అల్లాను నమ్మే షాహమీర్ ప్రజలను రక్షించటం, ఆశ్రయం ఇచ్చి కాపాడటం ఆశ్చర్యకరమైన విషయం అని రాశాడు జోనరాజు. దీనిలో విచిత్రం ఏముంది? అల్లాను నమ్మే షాహమీర్ ప్రజలను కాపాడటంలొ ఆశ్చర్యం, విచిత్రం ఏముంది? అని ఆలోచిస్తే జోనరాజు పైకి ధైర్యంగా చెప్పలేని చేదు నిజాన్ని ఊహించే వీలు కలుగుతుంది.

నరేంద్ర సెహగల్ రాసిన ‘Converted Kashmir’ అన్న పుస్తకంలో షాహమీర్ గురించి రాస్తూ “Shahmir had come to Kashmir as a religious preacher and had been appointed as minister by the King Suhdev. Rinchan was the first Muslim convert and Shahmir first Muslim religious preacher” అంటాడు. ఒక పద్ధతి ప్రకారం షాహమీర్ రింఛనుడి విశ్వాసాన్ని సంపాదించటం, పరిస్థితులను అంచనా వేసి, అవసరమైతే ఒక అడుగు వెనక్కి వేయటం, రాజు ఉదయన దేవుడు ఎన్నడూ ఆత్మవిశ్వాసాన్ని సాధించకుండా అతడిని బెదిరిస్తూ తనంటే భయపడుతూండేలా చేసుకోవటం, కోటరాణికి మద్దతిస్తూ కూడా రహస్యంగా తన శక్తిని పెంచుకుంతూ పోవటం వంటి షాహమీర్ చర్యలు, ఒక పద్ధతి ప్రకారం షాహమీర్, పటిష్టమైన ప్రణాళికతో, కశ్మీరుపై అధికారం సాధించే దిశగా సాగేడనిపిస్తుంది. ఇలా ముందుకు సాగటంలో ‘మతం’ కూడా ఒక ఆయుధం అన్న భావన కూడా షాహమీర్ చర్యలలో కనిపిస్తుంది. రింఛనుడు మతం మారటంలో షాహమీర్ ప్రధాన పాత్ర పోషించాడన్నది నిర్వివాదాంశం. రింఛనుడి సంతానం ‘హైదర్’ రింఛనుడి వారసుడు. కానీ కోటరాణి ఉదయన దేవుడిని రాజుగా నిలిపి, అతడిని వివాహమాడటం ద్వారా కశ్మీరు ఇస్లాం రాజ్యం కాకుండా తాత్కాలికంగా అడ్డుకట్ట వేసింది.

షాహమీర్ తొందర పడలేదు. నిరసన ప్రకటించలేదు. రాణికి మద్దతు నిస్తున్నట్లుగానే చేస్తూ, ఉదయన దేవుడిని భయపెడుతూ వచ్చాడు. అతడి ముందు ‘హైదర్’ అన్న నిజాన్ని స్పష్టం చేస్తూ, ఉదయన దేవుడిని స్తిమితంగా ఉండనీయలేదు. నిరంతరం అతడిని ఉద్విగ్నతకు గురిచేస్తూనే ఉన్నాడు. ముఖ్యంగా, అచలుడు దాడి చేసిన సందర్భంలో ఉదయన దేవుడు ప్రాణాలు అరచేత పట్టుకుని కశ్మీరు వదిలి పారిపోవటం ప్రజలకు ఉదయన దేవుడిపై గౌరవం తగ్గించే అంశం. అదే సమయంలో రాణి అచలుడితో పోరాడింది. షాహమీర్ ప్రజలకు ఆశ్రయం ఇచ్చి వారి మెప్పు పొందాడు. ఈ సందర్భంలో అల్లాను విశ్వసించే షాహమీర్ ప్రజలను రక్షించటం ఎంత విచిత్రం అన్నాడు జోనరాజు. జోనరాజు వాడిన ఉపమానం కూడా గమనించదగ్గది.

ఎండిన నది, ప్రజలు ఆవలి వైపుకు వెళ్లే వీలు కల్పించి, తన ఒడ్డున ఆశ్రయం ఇచ్చినట్టు షాహమీర్ ప్రజలకు ఆశ్రయం ఇచ్చాడట. ‘ఎండిన నది’ అన్న పోలికలోనే జోనరాజు ఉద్దేశం దాగి ఉంది. ‘షాహమీర్’ను ఎండిన నదిలో పోల్చటంలోనే షాహమీర్ ఎలాంటివాడో తెలుస్తుంది. ఈ రోజు నది ఎండి ఉంది. రేపు వర్షాలు రాగానే మళ్ళీ పొంగిపొర్లుతుంది. అంటే, షాహమీర్ ‘మంచితనం’ తాత్కాలికం! సమయం, సందర్భం పట్టి ప్రదర్శించిన మంచితనం అది! తాను ఆశ్రయం ఇచ్చిన వారందరినీ తన మతంలోకి మార్చేశాడు షాహమీర్ అన్న ఆలోచన నిస్తుంది.

ఇక్కడి నుంచి రాజ్యంలో శక్తిమంతుడయ్యేందుకు ఒక పద్ధతి ప్రకారం షాహమీర్ చేసిన ప్రయత్నాలను జోనరాజు వర్ణించాడు.

షాహమీర్‍కు ఇద్దరు మనుమలున్నారు. వారు వీరులు. షిర్‌షాటల్ ఖాన్, హిందూఖాన్‍లు. సూర్యచంద్రుల్లా ప్రపంచాన్ని సౌందర్యమయం చేసే వీరులు వీరు అంటాడు జోనరాజు.

ద్వారైశ్వర్యాత్ స్ఫురద్దర్పో రాజాజ్ఞాలంఘనోద్యతః।
షహ్మేరః స విపద్ ద్వారమ్ అబూద్ధూపతిసేవినామ్॥
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 249)

ద్వారాదేశపు రాజుతో తనకు ఉన్న సంబంధం వల్ల, తనకు ఎదురు లేదన్న గర్వంతో షాహమీర్ రాజాజ్ఞను లెక్క చేయటం మానేశాడు. రాజును సేవించే వారికి, అంటే, రాజు పట్ల విధేయత ప్రదర్శించేవారికి ప్రమాద ద్వారంలో నిలిచాడు షాహమీర్ అన్న మాట.

ఇక్కడే షాహమీర్ రాజకీయాలు అర్థం చేసుకోవచ్చు. తాను వీరుడని నిరూపించుకున్నాడు. కోటరానికి అండగా నిలిచాడు. కానీ రాజును మాత్రం లెక్క చేయటం లేదు. రాజుకు ‘హైదర్’ను చూపిస్తూ, అసలు వారసుడు ‘హైదర్’ అనీ, ఏదో ఒక రోజు రాజ్యం హైదర్‍దే అనీ బెదిరిస్తూ వచ్చాడు. మరో వైపు ప్రజలకు ఆశ్రయం ఇస్తూ, వారిని తన వైపుకు తిప్పుకున్నాడు. ఇంకో వైపు శక్తిమంతులతో సంబంధాలు పెంచుకుంటూ, రాజుకు విధేయులుగా ఉన్నవారిని బెదిరిస్తూ, వారికి ప్రమాదంగా పరిణమించాడు. అంటే, రాజుకు విధేయత ప్రదర్శిస్తే, వారు ప్రమాదంలో పడతారన్న మాట.

సోల్లేశ్వర సుతాం దత్త్యా లుస్తస్య తదధీశితుః॥
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 250)

అల్లేశ్వరుడి కూతురు ద్వారాధీశుడు లుస్తకు ఇచ్చి వివాహం చేయటం ద్వారా శంకరపురంపై ఆధిక్యం సాధించాడు. భాంగియాధిపతి ‘తెలాకశూర’కు జంషేర్ కూతురునిచ్చి వివాహం చేయటం వల్ల శక్తిని పెంచుకున్నాడు. జోనరాజు అల్లేశ్వరుడు అన్నాడు. అతని అసలు పేరు అలీ శౌర్. అతడు లక్షకుడి కూతురుని పెళ్ళి చేసుకున్నాడు. బారింగ అధీశుడు కోటరాజును, షాహమీరుడి కూతురు ‘గుహరా’ పెళ్ళి చేసుకుంది.  ఈ రకంగా శక్తిమంతమైన వ్యక్తులతో వివాహ సంబంధాల ద్వారా షాహమీర్ తన బలాన్ని పెంచుకుననడు. అదృష్ట దేవతను తన అదుపులోకి తెచ్చుకున్నాడు. ఎలగాయితే బహురూపాలు ధరించగల నరసింహుడు దానవులను అదుపులో పెట్టగలడో, అలా షాహమీర్ ‘షమాలా’ ప్రాంతాన్ని తన అదుపులోకి తెచ్చుకున్నాడు.  ‘కరాళ’ ప్రాంతంపై పన్నులు విధించి వారిని తన నియంత్రణలోకి తెచ్చుకున్నాడు షాహమీర్. ఒక అభిప్రాయం ప్రకారం, షాహమీర్ వివాహ సంబంధాల ద్వారానే కాదు, మత మార్పిళ్ళ ద్వారా కూడా తన శక్తిని పెంచుకున్నాడు. తన మాట వినని వారినీ, తనను వ్యతిరేకించిన వారినీ, పన్నుల విధింపు ద్వారా, బల ప్రదర్శన ద్వారా అదుపులో పెట్టాడు. ఓ వైపు ఇలా శక్తిమంతుడవుతున్నా షాహమీర్ ‘కోటరాణి’ అంటే భయపడుతూ వచ్చాడు. అందుకే చక్రధర కొండపై ఒక దుర్భేద్యమైన కోటను నిర్మించుకున్నాడు. తనను జయించటం అంత సులభం కాదన్న సందేశం పంపాడు.

షాహమీర్ రాజకీయ చతురత ఎలాంటిదంటే, ఒక్క వివాహంతో షాహమీర్ బంధుత్వాలు, బాంధవ్యాలు పెరిగిపోతూ అతడికి విధేయులుగా ఉండేవారి సంఖ్య పెరుగుతున్నా ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితిని కల్పించాడు. షాహమీర్ జిత్తులకు లొంగని కంపనకు విలువైన బహుమతులను, ధనాన్ని సమర్పించి అతడిని తన వైపుకు తిప్పుకున్నాడు. కోటరాజు కూతురుని వివాహం చేసుకున్నాడు. ఇలా సర్వశక్తిమంతుడవుతున్న షాహమీర్ లావణ్యులను కూడా నయానో భయానో తన వైపు తిప్పుకున్నాడు.

సామ్నః కేచిత్వరే భేదాద్ జనాదన్యే పరే భయాత్।
మాన్యతామన యద్ధన్యా లావణ్యాస్తస్య శాసనమ్॥
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 258)

లావణ్యుల నడుమ భేదాలు సృష్టించి, ధనం బహుమతిగా ఇచ్చి, భయపెట్టి తన అదుపులోకి తెచ్చుకున్నాడు షాహమీర్. లావణ్యులను వర్ణిస్తూ జోనరాజు వారిని మతపరమైన విశ్వాసాలు లేనివారుగా అభివర్ణిస్తాడు. అలాంటి లావణ్యులను షాహమీర్ భయపెట్టి, ధనం ఆశ చూపి, భేదాలు సృష్టించి తన వైపు తిప్పుకున్నాడు అన్న ఈ శ్లోకం షాహమీర్ మత ప్రచారకుడని, తన మతం లోకి వ్యక్తులను మార్చటం ద్వారా వారి విశ్వాసాన్ని పొందేవాడనేందుకు నిరూపణగా పలువురు భావిస్తారు. కానీ చరిత్ర రచయితలు ఇందులో మతం ప్రసక్తి లేదని, సామదానభేద దండోపాయాలు ఉపయోగించి లావణ్యులను అదుపులోకి తెచ్చుకున్నాడు తప్ప ‘మతం’ ప్రసక్తి లేదని వాదిస్తారు. కానీ తరువాతి శ్లోకం చరిత్ర రచయితల అవగాహన పొరపాటు అన్న భావనను కలిగిస్తుంది.

లావణ్యలోకస్తత్రుత్రీర్మాలా ఇవ బభార తాః।
నాజానాద్ భుజగీర్ఘోర విషాః ప్రాణహరీః పునః॥
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 259)

షాహమీర్ కూతుళ్ళను లావణ్యులు మాలల ధరించారు. కానీ అతని కూతుళ్ళు ఘోర విషం కలిగి సర్వనాశనం చేయగల నాగినులు అన్న విషయం వారు గ్రహించలేకపోయారు అంటాడు జోనరాజు.

‘భుజగీర్ఘోర విషాః ప్రాణహరీః’ ప్రాణాలు హరించే ఘోర విషం కలిగిన పాములు అంటాడు జోనరాజు. ఓ వైపు లావణ్యులను షాహమీర్ అదుపులో పెట్టుకున్నాడనీ, మరో వైపు వారి ప్రాణలు హరించే విషనాగులు అతని పుత్రికలు అని లావణ్యులు గ్రహించలేదనటంలో జోనరాజు హృదయం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా మతపరమైన విశ్వాసాలు లేని లావణ్యులు అనటం కూడా షాహమీర్ లావణ్యులను మతపరంగా కూడా తన వైపు తిప్పుకున్నాడన్న భావన కలిగిస్తుంది. షాహమీర్ ప్రజలను రక్షించటం, అల్లాను విశ్వసించేవాడు ఇలా రక్షించటం ఆశ్చర్యం అనటం, షాహమీర్ కృపను ‘ఎండిన నది’తో పోల్చటం, అతని కూతుళ్ళను ప్రాణాలు హరించే విషనాగులతో పోల్చటం జోనరాజు బహిరంగంగా ప్రకటించలేని విషయాలను పరోక్షంగా ప్రదర్శిస్తుంది. ఏనుగులు సింహానికి తల వంచినట్టు లావణ్యులు రాజా విజికి లొంగిపోయారు అంటాడు జోనరాజు.

తనకు లొంగని బహురూప, శామిలా ప్రాంతాలపై దాడులు చేసి షాహమీర్ వారిని లొంగదీసుకున్నాడు. డామరులందరినీ తన వైపు తిప్పుకున్నాడు. పన్నులు చెల్లించేందుకు నిరాకరించిన విజయేశ నగరానికి నిప్పు పెట్టాడు షాహమీర్. ఈ రకంగా శ్రీనగరం తప్ప మిగతా అంశా షాహమీర్ వశమయింది. ఉదయన దేవుడు అంటే ఎవ్వరికీ లెక్క లేకుండా పోయింది. అతని పాలన కేవలం శ్రీనగరానికి పరిమితమయింది.

షహమేరాంబుపూరేణ కమలోల్లాపశాలినా।
ఆక్రాంతాః పరితో రాజా ముద్రా షిస్థద్రు మోపమః॥
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 261)

కమలాలతో నిండిన నీరు చెట్లను ముంచెత్తినట్టు, షాహమీర్ రాజుపై ఆధిక్యం సాధించాడు. కశ్మీరంలో అన్ని ప్రాంతాలపై అధికారం కోల్పోయిన రాజు తన ఖ్యాతితో పాటు తన ప్రాణాలపై పట్టును కూడా వదిలేశాడు.

జోనరాజు ప్రకారం తన భవనంలో తప్ప మరెక్కడా రాజు మాట చెల్లటం లేదు. దాంతో తన ఖ్యాతితో పాటు ప్రాణాలనూ వదిలేశాడట రాజు. ఈ రకంగా శుక్ల పక్షం 13వ రోజున, శివరాత్రి నాడు రాజు ఉదయన దేవుడు ప్రాణాలు విడిచాడు. క్రీ.శ. 1339వ సంవత్సరంలో కశ్మీరంలో ఉదయన దేవుడి పాలన అంతమయింది. ఉదయన దేవుడి అడ్దు తొలగటంతో కశ్మీరంలో రాజకీయాలు వేడెక్కాయి. ఇంతవరకూ కోటరాణి కానీ, షాహమీర్ కానీ పరోక్షంగా రాజకీయాలు చేశారు. కోటరాణి, రాజు వెనుక నిలిచి పరోక్షంగా అధికారం చేసింది. షాహమీర్, కశ్మీర రాజుకు విధేయత ప్రదర్శిస్తూ, తన అధికారాన్ని పెంచుకునే రాజకీయ కుట్రలు చేశాడు. ఉదయన దేవుడి మరణంతో అన్ని తెరలు తొలగిపోయాయి. ఇకపై నుంచీ అన్ని ముసుగులు తొలగి కశ్మీరుపై అధికారం కోసం పోరాటం ప్రత్యక్షంగా జరిగింది.

అధ షహమేరీభీత్యా శ్రీకోటా చత్వార్యహాని సా।
గూఢేంగి తానయద్ గుప్తిం భూపాల ప్రమయాదికమ్॥
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 264)

ఉదయన రాజు మరణించిన వార్త బహిరంగమయితే, షాహమీర్‍కు అడ్దు అదుపూ ఉండదని గ్రహించిన శ్రీకోటరాణి తన మనసులో చెలరేగే భావనలను, దుఃఖాన్ని అదుపులో పెట్టుకుంటూ, రాజు మరణవార్తను నాలుగు రోజుల వరకూ బయటకు పొక్కకుండా, గూఢంగా ఉంచింది. ఇక్కడి నుంచీ కశ్మీర సింహాసనాన్ని ఇస్లామీయులకు దక్కకుండా కాపాడాలన్న కోటరాణి విఫల ప్రయత్నాలను జోనరాజు వర్ణించాడు. ఒక వ్యక్తికి ఎంతగా రాజకీయ చతురత ఉన్నా, ఎంతగా పట్టుదల దీక్షలు ఉన్నా విధి వ్యతిరేకమయితే ఆ వ్యక్తి నిస్సహాయుడని కోటరాణి జీవితం నిరూపిస్తుంది. భారతదేశ చరిత్రలో ఇలాంటి నిస్సహాయ పరాజితులు అనేకులు కనిపిస్తారు. వీరి పరాజయం ఆయా ప్రాంతాల చరిత్రను సంపూర్ణంగా రూపాంతరం చెందించటం గమనిస్తే, విధి భారతదేశంతో ఆడిన విచిత్రమైన ఆట అర్థమవుతుంది.

ఢిల్లీపై అధికారం కోసం ముఘలులు, ఆఫ్ఘన్లు పోరాడుతున్న సమయంలో ‘హేము’గా ప్రసిద్ధి పొందిన హేమచంద్రుడు పరాజయం అన్నది ఎరుగని వీరుడిగా ప్రసిద్ధి పొందాడు. 22 యుద్ధాలలో పాల్గొని గెలిచాడు. 7 అక్టోబర్ 1556 న ఢిల్లీపై అధికారం కోసం జరిగిన యుద్ధంలో ముఘలుల సైన్యాన్ని ఓడించి ఢిల్లీపై  భగవాధ్వజాన్ని ఎగుర వేశాడు. ఢిల్లీపై విదేశీయుల పాలనను అంతం చేసి మళ్ళీ భారతీయుల పాలనను ఆరంభించాడు. హేమచంద్రుడు, హేమచంద్ర విక్రమాదిత్యుడు అయ్యాడు. ఓ నెల తర్వాత మళ్ళీ విరుచుకు పడ్డ ముఘలుల సేనలతో పోరాడుతూంటే, దాదాపుగా గెలుపు తథ్యం అనుకున్న సమయంలో ఎటో పోతున్న బాణం దారిలోకి వచ్చాడు. బాణం అతని కంట్లో గుచ్చుకుంది. తమ రాజు క్రింద పడడం చూసిన భారతీయ సేనలు రాజు మరణించాడని భయంతో కకావికలయ్యాయి. విజయం ముఘలులను వరించింది. శత్రువులకు పట్టుబడ్డ హేమచంద్రుడి తలను 13 ఏళ్ళ ముఘల్ రాజు నరికి వేశాడు. ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించాడు. చరిత్రలో ‘అక్బర్ ది గ్రేట్’గా మన్ననలందుకున్నాడు. 22 యుద్ధాలు గెలిచిన హేమచంద్రుడు కీలకమైన యుద్ధంలో విధివశాత్తు గాయపడ్డాడు. భారతదేశ చరిత్ర మారిపోయింది. కశ్మీర చరిత్రలో కోటరాణి గాథ కూడా ఇలాంటిదే.

(ఇంకా ఉంది)