దేశ విభజన విషవృక్షం-18

0
3

(భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గత సంవత్సరం ఆగస్ట్ 14ను దేశ విభజన భయానక జ్ఞాపకాల సంస్మరణ దినంగా ప్రకటించారు. ఆ పిలుపు ఆధారంగా సంచిక తెలుగు పాఠకుల కోసం అందిస్తున్న విశేష వ్యాస పరంపర ఇది. దేశ విభజనకు దారితీసిన కారణాలను మూలాలనుంచి పరిశోధించి, విశ్లేషిస్తూ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న వ్యాస పరంపర ఇది.)

[dropcap]భా[/dropcap]రతదేశ చరిత్రకు 20వ శతాబ్దంలో జరిగిన అన్యాయం గతంలో మరెన్నడూ జరుగలేదేమో. కమ్యూనలిస్టులు, పొలిటికల్ హిపోక్రాట్లు కలిసి ఈ దేశ చరిత్రను ఎంతగా ఏమార్చాలో.. అంతగా ఏమార్చారు. దేశభక్తుల (అనగానే ఏ బీజేపీ వారో.. ఆర్.ఎస్.ఎస్. వారో కాదు.. ఈ దేశాన్ని.. ఈ దేశ బిడ్డలుగా ప్రేమించేవారు అని అర్థం. దేశభక్తి బీజేపీ గుత్త సొత్తేం కాదు. ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డది. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్న శ్రీరామచంద్రుడి వారసులది.) రోదన అరణ్య రోదనే అయింది. వాళ్ల రాతలను పెద్దగా పట్టించుకొన్నవాళ్లే లేకుండా పోయారు. ఈ దేశంపై దాదాపు ఒక సహస్రాబ్ధికి పైగా అత్యాచారాలను, అరాచక పరిపాలనలను, ఇక్కడి ప్రజలపై జరిగిన చిత్రహింసలను విపరీతంగా గ్లోరిఫై చేసి చూపించే ప్రయత్నం చేశారు. వీళ్లకు చరిత్ర అంటే తెలియదు. చరిత్ర అంటే.. ఈ దేశ భూతకాలాన్ని యథాతథ కాలమానంలో జరిగిన వాస్తవాలను ఎలాంటి వ్యాఖ్యానాలు, విశ్లేషణలు, అంచనాలు, జడ్జిమెంట్లు లేకుండా జరిగింది జరిగినట్టుగా రికార్డు చేయటమే చరిత్ర. ఇది కాకుండా మరేదైనా నిర్వచనం ఉంటే పెద్దలైన వారు చెప్తే సరిచేసుకొంటాను. చరిత్రలో రాజకీయ, మతపరమైన మిథ్యావాదాలకు ఎటువంటి చోటు ఉండదు. ఉండటానికి వీలు లేదు. మన గత తరాలకు సంబంధించిన చరిత్రను ప్రాథమిక స్థాయి నుంచి బోధించడం అనేది అత్యంత ముఖ్యమైనది. మనకు ముందున్న తరాల్లో ప్రజలు ఎలా జీవించారు? వాళ్లు చేసిన తప్పులు ఏమిటి? ఒప్పులు ఏమిటి? ఆ తప్పులను పరిహరించుకొంటూ.. మనిషి పట్ల, మనిషితనం పట్ల మనం ఏ విధంగా వ్యవహరించాలో స్వయంగా తెలుసుకొని.. పూర్ణ వ్యక్తిత్వం పెంపొందించేందుకు చరిత్ర కచ్చితంగా దోహదపడుతుంది. మన దేశంలో చరిత్రకు సంబంధించిన ఈ లక్ష్యాన్ని పూర్తిగా విస్మరించాం. కలుషితం చేసిన చరిత్రను చదువుకొంటూ.. మనుషుల మధ్యన సామరస్యమనేదే లేకుండా.. ‘రాజకీయ నాగరికత’ లోనే మనం జీవితాలను వెళ్లమారుస్తున్నాం.

ఈ చరిత్రను కలుషితం చేసేవారికి నాదొక్కటే ప్రశ్న. ఈ తప్పుడు చరిత్ర రాయడానికి, వక్రీకరించడానికి ఒక పరిమితి కూడా లేదా? ఎందుకంటే.. ఛత్రపతి శివాజీ, రాణా ప్రతాప సింహుడి వంటి ఎందరెందరో పేర్లను వీళ్లు రాసిన చరిత్ర నుంచి ఏకంగా డిలీట్ చేశారు. దీనికి వీళ్లు ఏం జవాబు చెప్తారు? చరిత్రను ఇదే పనిగా కలుషితం చేస్తూ పోతే.. అక్బర్ గొప్ప సామరస్యవాది అయిపోతాడు. షాజహాన్, జహంగీర్ (సలీం) మరింత గొప్ప ప్రేమికులైపోతారు. వీళ్లను చూసి.. మనవాళ్లు.. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణులను, రావణుడిని, నరకాసురుడిని మంచివాళ్లుగా మహానుభావులుగా కీర్తిస్తూ సినిమాలు తీస్తారు. పూజలు చేస్తారు. అప్పుడు చరిత్ర చరిత్ర కాదు. ఒక కాల్పనిక నవలగా మిథ్యగా మారిపోతుంది. చివరకు ఈ దేశానికి చరిత్ర అన్నదే లేకుండా పోతుంది. రామాయణాన్ని, భారతాన్ని ఇలాగే చేశారు. భారతీయ రచనలన్నింటినీ మిథ్యగా మార్చివేశారు.

చరిత్ర రచనలో.. ఈ కమ్యూనలిస్టులను, పొలిటికల్ హిపోక్రాట్లను చేయి చేసుకోనివ్వడం వల్లనే ఈ పరిస్థితి నెలకొన్నది. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి. చరిత్ర అంటే నిజం. నిజం మాత్రమే. నిజం కానిదేదీ చరిత్ర కాదు. కానేరదు. చరిత్రను చరిత్రగా రక్షించటం అతి ముఖ్యమైన బాధ్యత. కానీ మన దేశంలో ప్రభుత్వాలకు కానీ, చరిత్ర రచయితలకు కానీ, ఈ ప్రాధాన్యం అక్కర్లేదు. ప్రభుత్వాల దగ్గరి నుంచి ప్రాజెక్టులు తీసుకోవాలి.. డబ్బులు దండుకోవాలి. తమ అనుకూల చరిత్రను లిఖించాలి.. పద్మ పురస్కారాలు అందుకొని ప్రముఖులు కావాలి. ఇంతకు మించి మరేమీ లేదు. దేశ చరిత్ర నాశనమైనా.. ఎవరికీ అక్కర్లేదు. చాలామంది ఈ తప్పుడు చరిత్రే నిజం కావాలని కూడా కోరుకుంటారు కూడా. ఎవరో ఒక తుగ్లక్ రాజు ఇక్కడ సంపదను దోచుకోవడమే కాకుండా.. ఇక్కడి గ్రంథాలను ఎత్తుకొని పోయి.. సంస్కృతం నుంచి పర్షియా లోకి అనువాదం చేసుకొని.. తన పేరుతో ఆయుర్వేద వైద్యాన్ని ప్రమోట్ చేసుకొంటే దిక్కులేదు. అర్థం కానిదేమిటంటే.. ఆ తుగ్లక్‌కు మన పుస్తకాల్లో కనిపించిన కొద్దో గొప్పో విషయం మన చరిత్రకారులకు ఎందుకు కనిపించటంలేదు?

1960వ దశకంలో మాట. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రీ రైటింగ్ ఇండియన్ హిస్టరీ సంస్థ అధ్యక్షుడు పీ ఎన్ ఓక్ తన ఏ హిస్టారికల్ బయోగ్రఫీలో రికార్డు చేసిన మాట. మదర్ ఇండియా మ్యాగజైన్లో 1968లో అచ్చయింది. 1960 మహారాష్ట్ర విద్యాశాఖ మాజీ మంత్రి ఒకరు విద్యా నిపుణులతో ఒక సదస్సు నిర్వహించారు. ప్రధాన అంశం చరిత్ర రచన. చరిత్ర రచనను ఏ పద్ధతిలో రాయాలన్న దానిపై ఈ సదస్సులో చర్చ జరిగింది. సదస్సును నిర్వహించిన మాజీ మంత్రి.. చరిత్ర రూపంలో ఉన్నప్పటికీ మతసామరస్యం పెంపొందించేలా రాయాలని సూచించారు. చాలామంది ప్రభుత్వ ఉపన్యాసకులు, ఉపాధ్యాయులు, ఇతర నిపుణులు మంత్రిగారి సూచనకు తెచ్చిపెట్టుకొన్న నవ్వుతో అంగీకారం తెలుపుతూ చప్పట్లు కొట్టారు. ఈ సమావేశానికి హాజరైన వారిలో ఇద్దరు చరిత్రకారులు మాత్రం ఎలాంటి జవాబు చెప్పకుండా రాళ్లమాదిరిగా మౌనంగా ఉండిపోయారు. మంత్రిగారు వారిని పలుకరించడంతో వారిలో ఒకరు కుండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడారు. చరిత్రను మార్చడం, ఏమార్చడం ఎంతమాత్రం సాధ్యం కాదని విస్పష్టం చేశారు. చరిత్రను తక్కువచేయడం, లేదా పలుచన చేయడం కలుషితం చేయడం సాధ్యం కాదన్నారు. దీంతో మంత్రిగారు మ్రాన్పడిపోయారు. చరిత్ర రచన విషయంలో అందరిమధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆయన వెనక్కి తగ్గారు. చరిత్రను మానవీయ కోణంలో రచించాలని మరో అభిప్రాయం వ్యక్తంచేశారు. అప్పటిదాకా మౌనంగా ఉన్న వ్యక్తుల్లో మరొకరు పెదవి విప్పారు. చరిత్ర ఎప్పుడూ కఠినమైనదేనని, ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు, లేనిదాన్ని ఉన్నట్టుగా, ఉన్నదాన్ని లేనట్టుగా చెప్పటం సాధ్యం కాదన్నారు. చరిత్ర అనేది నిజం మాత్రమేనని, కల్పితం ఎంతమాత్రం కాలేదని పునరుద్ఘాటించారు. ఆ ప్రొఫెసర్ మాటలకు అందరూ చప్పట్లతో మద్దతు పలికారు. దీంతో మంత్రిగారు చరిత్రను నేటి తరానికి ఏ విధంగా బోధించాలో సూచనలు ఇవ్వాలని ఆ ప్రొఫెసర్‌ను కోరారు. అప్పుడు ఆయన లేచి మాట్లాడుతూ.. ’సమాజంలో మతసామరస్యాన్ని పాదుకొల్పేలా చరిత్రను బోధించడం పెద్ద కష్టమేమీ కాదు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మీరు శివాజీ, అఫ్జల్ ఖాన్‌ను హతమార్చిన ఘటన గురించి చెప్పాలనుకొన్నారనుకొండి.. దానికి కాస్త ముందు వెనుక జరిగిన ఘటనలను కూడా వివరించండి. శివాజీ తండ్రి, అఫ్జల్ ఖాన్ తండ్రి ఇద్దరూ మంచి స్నేహితులు. పుణెలో బీజాపూర్ రాజ్యానికి శివాజీ తండ్రి షాహాజీ ప్రాతినిధ్యం వహించి పరిపాలించాడు.. కానీ వారిద్దరు కొడుకులు పెరిగిన వాతావరణం పూర్తిగా భిన్నమైంది. ఈస్ట్ ఇండియా కంపెనీ, ముస్లిం మత ఛాందసవాదం, దేశభక్తి మధ్య భారతీయత అల్లల్లాడిపోతున్న వాతావరణం. ఇద్దరు కూడా రెండు వేరు వేరు మతాలకు ప్రాతినిధ్యం వహించారు. ఇద్దరి మధ్య ఘర్షణ తీవ్రమైన నేపథ్యంలో సంధి ప్రయత్నాలు జరిగాయి. వారిద్దరూ కలిసినప్పుడు జరిగిన వాదోపవాదాల అనంతరం శివాజీ అఫ్జల్‌ను చంపేశాడు. ఈ ఘటనపై భిన్న భిన్న వాదాలు ఉన్నాయి. అఫ్జల్ చనిపోయిన తరువాత పూర్తి మత సంప్రదాయం ప్రకారం అతడి ఉత్తర క్రియలు జరిపించాడు శివాజీ. అతని సమాధి ఇప్పటికీ ఉన్నది. దేశంలో మనకు ఇవాళ కనిపించే ప్రతి ముస్లిం రాజు సమాధి కూడా భారతీయ రాజుల మత సామరస్యానికి ప్రబలమైన ప్రతీక’ అని అన్నారు. దీంతో మంత్రిగారు సమాధానమేమీ చెప్పకుండా సదస్సును అర్ధంతరంగా ముగించి వెళ్లిపోయారు. చరిత్రను అర్థం చేసుకొనే విధానాన్ని ఆ ప్రొఫెసర్ ఎంత చక్కగా చెప్పారో మనకు అవగతమవుతుంది.

నా దృష్టిలో చరిత్ర అన్నది అత్యంత వాస్తవంగా, ప్రాక్టికల్‌గా, సున్నితంగా, ప్రభావవంతంగా ఉండాలి. చరిత్రలో ఏ కాలంలోనైనా ఎవరైనా సరే ప్రజల పట్ల పైశాచికంగా, కిరాతకంగా ప్రవర్తించినట్టయితే.. దాన్ని యథాతథంగా తెలియజేయాలి. ఇలాంటి కిరాతకాలు భవిష్యత్తులో ఎట్టి పరిస్థితిలోనూ పునరావృతం కారాదని చెప్పాలి. స్కూల్ కరిక్యులమ్‌లో కూడా ఈ విధంగానే చరిత్రను బోధించాలి. అలా కాకుండా చరిత్రను కలుషితం చేసి.. మసిపూసి మారేడుకాయ చేస్తే అది చరిత్ర ఎందుకవుతుంది? ఏ అరేబియన్ నైట్స్ కథో, జాతక కథో అవుతుంది. కనీసం ప్రస్తుత పాలకులైనా.. చరిత్రకారులైనా ఈ దేశ చరిత్రను చరిత్రగానే అధ్యయనం చేయడానికి అవకాశం కల్పిస్తే బాగుంటుంది.

ఇప్పుడు మళ్లీ అసలు కథలోకి వద్దాం. ఢిల్లీ సాతాను రాజులలో లోడీలు తక్కువేం తినలేదు. వాళ్ల వంశాన్ని స్థాపించిన వాడు బాహ్లుల్ లోడీ. ఇతని అసలు పేరు మాలిక్ బహ్లుల్ లోడీ. సుల్తాన్ షా లోడీ అలియాస్ ఇస్లామ్ ఖాన్‌కు మేనల్లుడు. బహ్లుల్ తాతలు, తండ్రులు ఆఫ్గనిస్తాన్‌కు చెందిన వ్యాపారులు. దోపిడీదారులకు, దొంగలకు, హంతకులకు ఆయుధాలు, గుర్రాలు, ఇతర యుద్ధ సామగ్రిని అమ్మేవారు. ఇందుకు ప్రతిగా భారత దేశం నుంచి దోచుకొచ్చిన బానిసలను, మహిళలను, సంపదను తీసుకొనేవారు. ఈ గుర్రాల వ్యాపారమే తరువాతి కాలంలో బహ్లుల్ ఢిల్లీ గద్దె చేజిక్కించుకోవడానికి దారులు పరిచింది.

బహ్లుల్ ఒక దోపిడీదారు. ఇస్లామ్ ఖాన్ చనిపోయిన తరువాత అతడి స్థానంలో సర్హిండి (పంజాబ్)కు గవర్నర్ అయ్యాడు. ఇస్లామ్ ఖాన్‌ను బహ్లుల్ చంపాడని కూడా అంటారు. ఎందుకంటే ఇస్లాం రాజరికంలో మొదట్నుంచీ ఈ సంప్రదాయం ఉన్నది. నిజానిజాలపై చరిత్రకారులకు స్పష్టత లేదు. ది క్రానికల్ తారీఖ్ ఈ ఖాన్ జహాన్ లోడీ గ్రంథ రచయిత నియామతుల్లా.. బహ్లుల్ గురించి రాశాడు. ఇతడేమీ మహా గొప్ప పాలకుడేమీ కాదు. అతి భయానకాన్ని సృష్టించి, చిత్రహింసలు పెట్టి మరీ అధికారంలోకి వచ్చాడు. చివరకు ఇస్లాంఖాన్ సొంత కొడుకు కుతాబ్ ఖాన్ ఢిల్లీకి పారిపోయాడు. తన తండ్రి రాజ్యాన్ని, అధికారాన్ని, ఆస్తులను తనకు తిరిగి ఇప్పించాలని ఢిల్లీ సుల్తాన్ కు మొరపెట్టుకొన్నాడు కూడా. బహ్లుల్ ఖాన్ లోని అధికారకాంక్షను, అత్యాశను గమనించిన సుల్తాన్ మహమ్మద్ అతని పైకి హిసామ్ ఖాన్ నేతృత్వంలో పెద్ద సైన్యాన్ని పంపించాడు. కారా దగ్గర సుల్తాన్ సైన్యాలు బహ్లుల్ సైన్యంతో తలపడ్డాయి. కానీ సుల్తాన్ సైన్యాలు ఓటమిని చవిచూశాయి. ఈ యుద్దం ఢిల్లీ సుల్తాన్ పీఠంపై బహ్లుల్ కన్ను పడిందని స్పష్టమైన సంకేతాలనిచ్చింది. ఈ యుద్ధం తరువాత బహ్లుల్ సుల్తాన్‌కు ఒక లేఖ రాశాడు. తన చేతిలో ఓడిపోయిన హిసామ్ ఖాన్ ద్రోహి అని పేర్కొన్నాడు. తనను తాను సుల్తాన్‌కు విధేయుడని ప్రమాణం చేశాడు. హిసామ్ ఖాన్‌ను ‘తొలిగించి‘.. హమీద్ ఖాన్‌ను ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేశాడు. సుల్తాన్ మహమ్మద్.. బహ్లుల్ కోరికను మన్నించి హాజీ హిసామ్ ఖాన్‌ను చంపించాడు. బహ్లుల్‌ను మంచి చేసుకోవడానికి కొద్ది రోజుల ముందు తన కోసం యుద్ధంలో పోరాడిన వ్యక్తిని నిర్దయగా చంపేశాడు. ఈ రకమైన ధోరణి ఒక్క సుల్తాన్ కాలంలో మాత్రమే జరుగలేదు. ముస్లిం రాచరిక వ్యవస్థ అంతా కూడా ఇదే అటోక్రసీని పుణికి పుచ్చుకొన్నదే. మధ్య యుగాల నాటి ప్రపంచ ముస్లిం రాజులు, వారి రాజరిక వ్యవస్థలన్నింటిలోనూ ఇదే రకమైన కూటనీతి వ్యవస్థ మాత్రమే రాజ్యమేలింది. నీతి లేదు, నియమం లేదు, విలువలు లేవు, దోపిడీలతో మొదలైన దండయాత్రలు రాజ్యాలు ఏలే దాకా వస్తే.. అందులోనూ దోపిడీదారుల లక్షణాలే కొనసాగుతాయి. తన ఆధిపత్యాన్ని నిలుపుకోవడం కోసం.. తన అధికారాన్ని కాపాడుకోవడం కోసం అన్నదమ్ములు, అక్కచెల్లెండ్లు, తండ్రీ కొడుకులు ఇలాంటి భేదాలేవీ లేవు. ఉండవు. అరేబియాలో మొదలైన దోపిడీ.. భారతదేశం దాకా కొనసాగిన ప్రస్థానంలో ఈ విధంగా సమిధలైన హిసామ్ ఖాన్‌లు ఎందరున్నారో లెక్కలు వేయటం సాధ్యమే కాదు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here