నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు-1

1
3

[కె.ఎం. మున్షీ రచించిన ‘ది ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా’ పుస్తకాన్ని ‘నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు’ పేరిట అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

ఈ అనువాదం ఎందుకు?

[dropcap]సె[/dropcap]ప్టెంబరు 17, 1948న నిజామ్ పాలిత ప్రాంతాలన్నీ భారతదేశంలో భాగం అయ్యాయి. స్వతంత్రంగా నిలవాలన్న నిజామ్ కల కలగానే మిగిలిపోయింది. ఆ కాలంలో ఏం జరిగిందన్న విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికీ. ఎవరెవరి రాజకీయ సిద్ధాంతాలను, దృష్టిని బట్టి ఆ సంఘటన గురించి వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. గమనిస్తే అందుబాటులో ఉన్న అనేక పుస్తకాలు – Tragedy of Hyderabad, Hyderabad 1948, An Avoidable Invasion, The Destruction of Hyderabad వంటి పుస్తకాలు దాదాపుగా ఒకే రకమైన దృక్కోణంలో రచించినవి. Tragedy of Hyderabad, V.P. Menon రచన Integration of the Indian States లో హైదరాబాద్‍కు సంబంధించిన అధ్యాయల తెలుగు అనువాదాలున్నాయి కానీ ఈ సంఘటనలకు ప్రత్యక్ష సాక్షి అయి, ఆనాటి సంఘటనల అలల నడుమ ఉన్న కె.ఎం. మున్షీ రచించిన ‘The End of an Era: Hyderabad Memories’ తెలుగులో అందుబాటులో లేదు. ఇతర పుస్తకాలు చదివి ఆవేశంగా వాదించే అధికులకు మున్షీ ఇలాంటి పుస్తకం ఒకటి రాశాడని తెలియదు. వారు చదివిన పుస్తకాలను బట్టి వారి దృష్టిలో మున్షీ కాంగ్రెస్ మనిషి, ఒక విలన్. ఆయన కావాలని అబద్ధాలు చెప్పాడనీ, ఆయన జరిపిన కుట్ర ఇదంతా అని పలువురు – అంతా తెలిసినట్లు – ఆవేశంగా వాదిస్తుంటే ఆశ్చర్యం అనిపించింది.

ఒకే సత్యాన్ని పలువురు పలు రకాలుగా దర్శిస్తారని చెప్పిన వైజ్ఞానిక సమన్వయ దృక్పథం గల సమాజంలో మేధావులుగా పరిగణనకు గురయ్యేవారు, ప్రజల భాగ్య విధాతలుగా మన్ననలందుకునేవారు ఇలా ఏక పక్ష దృక్కోణాన్ని ప్రదర్శించటం, ఏనుగు అయిదుగురు గుడ్డివారి కథలో గుడ్డివారిలా ప్రవర్తించటం బాధ కలిగించింది. ఫలితంగా కె.ఎం. మున్షీ రచించిన ‘ది ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా’ గురించి అందరికి తెలిసేట్టు చేయాలన్న ఆలోచన కలిగింది. ఒక విషయం గురించి పలు రకాల దృక్కోణాలలో వ్యక్తపరిచిన ఆలోచనలు ప్రజలకు అందుబాటులో ఉంచి, వాటి ఆధారంగా సత్యనిర్ధారణ ఎవరికి వారు చేసుకునే వీలు నివ్వటం ఉత్తమం అనిపించింది. ఫలితంగా ‘ది ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా’ పుస్తకాన్ని తెలుగులో అనువదించేందుకు భారతీయ విద్యా భవన్ నుంచి అనుమతిని అభ్యర్థించాను. సహృదయంతో వారు ఈ పుస్తకాన్ని అనువదించి సంచికలో సీరియల్‍గా ప్రచురించేందుకు అనుమతినిచ్చారు. అలా సాధ్యమయింది ‘ది ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా’ తెలుగు అనువాదం.

‘ది ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా’ను తెలుగులోకి అనువదించాలనుకోవడం వెనుక మరో కారణం ఉంది. ఈ పుస్తకం నేను పలుమార్లు చదివాను. ప్రస్తుతం సమాజంలో సంభవిస్తున్న అనేక పరిణామాలు, ప్రదర్శితమవుతున్న మనస్తత్వాలను అర్థం చేసుకునేందుకు ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుంది. చరిత్ర తెలియని వారు చరిత్రలో జరిగిన తప్పులను పదే పదే చేస్తుంటారు అన్న సూక్తి ఎంత నిజమో ఈ పుస్తకం నిరూపిస్తుంది.  ‘ది ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా’ చదువుతూంటే పలు సందర్భాలలో అప్పటికీ, ఇప్పటికీ పెద్దగా మార్పులేమీ రాలేదన్న భావన కలుగుతుంది. భాషలో మార్పు వచ్చినా, భావం అదే అనిపిస్తుంది.  అందుకని ఎప్పటి నుంచో ఈ పుస్తకంలోని అంశాలను పదిమందికీ తెలియ చెప్పాలన్న ఆలోచన ఉంది. ఇప్పుడు అది ఆచరణలోకి వచ్చింది.

‘ది ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా..’ను తెలుగులోకి అనువదించాలనుకోవటం వెనుక మరో ప్రధాన కారణం కె.ఎం. మున్షీ పట్ల నాకు ఉన్న అభిమానం. భారతీయ విద్యా భవన్ పుస్తకాలు, భవన్స్ జర్నల్ నేను జీవితం పట్ల, సంస్కృతి సంప్రదాయాల పట్ల, భారతీయ సమాజం పట్ల ఒక దృక్పథాన్ని ఏర్పర్చుకోవటానికి ఎంతగానో తోడ్పడ్డాయి. మున్షీ మహోన్నత వ్యక్తిత్వం గురించి తెలుసుకోకుండా, ఆయన గురించి ఏ మాత్రం పరిచయం లేకుండా చులకనగా పలువురు వ్యాఖ్యానించటం నన్ను ఎంతగానో బాధిస్తున్న అంశం. ఈ పుస్తకం అనువాదం ద్వారా మున్షీ వ్యక్తిత్వంలో ఒక చిన్న అంశాన్నయినా తెలుగు పాఠకులకు పరిచయం చేసే వీలు కలుగుతుందన్న ఆలోచన ఉంది. అందుకే పుస్తకం అనువాదాన్ని అందించే కన్నా ముందు వీలైనంత సంక్షిప్తంగా కె.ఎం. మున్షీ జీవితాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని పరిచయం చేస్తాను. తద్వారా ‘ది ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా’ పుస్తకం చదివే సమయంలో ఆయనపై ఉన్న అపోహలు, దురూహలు, చెడు అభిప్రాయాలు పక్కన పెట్టి చదివే వీలు లభిస్తుంది సామాన్య పాఠకుడికి.

(వచ్చేవారం మున్షీ సంక్షిప్త పరిచయం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here