గూడెం – ఒక దశాబ్దకాల పరిచయం!

3
5

[dropcap]2[/dropcap]023!

కొత్త సంవత్సరం కొద్ది దూరంలో ఉంది. ఎప్పటిలాగే కొత్త సంవత్సరం అంటే ఒక ఉత్సాహం. రేపటిలోకి తొంగిచూసేద్దామన్న ఒక తొందర మనసంతా. ఒక దశాబ్ద కాలం ఎలా గడిచిపోయిందో అని ఆలోచించుకుంటే నా జీవితంలోనే ఒక అతి ముఖ్యమైన సందర్భం ఇప్పుడే, ఇక్కడే జరిగిందని తోచి భలే సంతోషం వేసింది. వెంటనే అదంతా రాసి పెట్టుకోవాలన్న ఆలోచనే ఈ రచన..

అవును, ఒక పదేళ్ల క్రితం ఇప్పుడుంటున్నఈ ప్రాంతానికి వచ్చాం.

ఒక టీనేజర్‌గా ఉన్నప్పటినుంచీ, స్మితాపాటిల్, షబానా ఆజ్మీల సినిమాలు చూసి జీవితం ఇలా ఉండాలి, నేను పెద్దయ్యాక సమాజానికి అవసరమైన పనులు చేసి, ఆదర్శవంతమైన జీవితాన్ని గడపాలి అని నిర్ణయాలు చేసేసుకుంటూ ఉండే రోజులు. స్వంతదైన నిమిత్తమేదీ లేకుండానే జీవితంలో చాలా చాలా జరిగిపోతూ ఉంటాయని కొన్ని సంవత్సరాలకి, అదీ ఊపిరి తీసుకునే వ్యవధి వచ్చేక అర్థమైంది. అయితే ఇదీ బాగానే ఉంది. కానీ చిన్నప్పటి ఆశ అలా గుండెలో గూడు కట్టుకుని నావైపు చూస్తూనే ఉంది. అంతలో నేనొక టీచర్నవాలనుకుని అయిపోయాను. మరి మామూలు టీచర్ కాదు, నేను కోరుకున్నట్టు అవకాశాలు అందుబాటులో లేని వాళ్ల దగ్గరకి వెళ్లాలని అనుకున్నాను.

కానీ నాకంటూ ఒక కుటుంబం, కొన్ని బాధ్యతలు నన్ను నిలబెట్టేశాయి. ఫర్వాలేదు, బాధ్యతలను ఎప్పుడూ ఇష్టంగా, గర్వంగా తలకెత్తుకోవటం అలవాటే. మెల్లిగా నా చుట్టూ ఉన్న పిల్లల్ని, అవసరం ఉన్న పిల్లల్ని దగ్గరకు తీసుకుని పాఠాలు చెప్పటం మొదలెట్టాను. అయితే ఒకచోట పట్టుమని రెండు మూడేళ్లైనా గట్టిగా ఉండనివ్వని జీవన సహచరుడి ఉద్యోగ బాధ్యతలు, తన వెంట నేను. అందుకే ఒక ఒప్పందం. గట్టిగా ఏదైనా చెయ్యాలంటే మరిన్ని సంవత్సరాలు ఆగాల్సిందే అని అర్థమైంది.

పూణేలో ఉండగా ‘ఆకాంక్ష’ కి వెళ్ళాను. ముంబైలోనూ, పూణేలోనూ ఆ స్వచ్ఛంద సంస్థ చాలా నిజాయితీగా పనిచేస్తోంది. పూణేలో ఆ సంస్థ పనిచేసే ఒక సెంటరుకి వెళ్లటం మొదలెట్టాను. అది ఆడపిల్లల కోసం నడుపుతున్నారు. ఆ పిల్లలు ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన తరగతుల నుండి వచ్చినవాళ్లు. ఆ పిల్లల చురుకుదనం, వాళ్లు మాట్లాడే ఇంగ్లీషు నన్ను ఆశ్చర్యపరిచాయి. మనవైపు యూనివర్సిటీల్లో చదివే పిల్లలు కూడా అంత చక్కని భాష మాట్లాడరేమో!

మా క్వార్టర్స్‌లో ఉండే వాచ్‌మన్ ‘ప్రేమ్’ ఒక నేపాలీ. అతనికి నలుగురు పిల్లలు. పెద్ద పిల్లవాడు మనీష్. వాడిని ఇంగ్లీషు మీడియంకి పంపేవారు. మిగిలిన ఇద్దరు ఆడపిల్లలు మరాఠీ మీడియంలో చదువుతుండేవారు. నాలుగో వాడు మరీ పసివాడు. మనీష్‌ని చదివించగలరా అని ప్రేమ్ అడిగాడు మేము వెళ్లిన కొత్తలో. రోజూ మనీష్ స్కూలు ముగిశాక వచ్చి హోం వర్క్ చేసుకుని, కాసేపు అన్ని సబ్జెక్ట్లూ చదువుకుని వెళ్లేవాడు. ప్రేమ్ చెపుతుండేవాడు, తను, భార్య ఏమీ చదువుకోలేదని, ఇంగ్లీషు అసలే తెలియదని, కొడుకును ఇంగ్లీషు మీడియంలో చదివించి పెద్ద ఉద్యోగస్థుణ్ణి చెయ్యాలని ఆశగా ఉందని. చదువులో పెద్ద చురుకు కాకపోయినా క్రికెట్ ఆడటంలోనూ, మిగిలిన విషయాల్లో మనీష్ చురుకైన పిల్లాడే! వాడి ఇంగ్లీషు మీడియం చదువు పట్ల ఇంటిల్లపాదీ ఎంతో నిబద్ధతతో ఉండేవారు.

ఆరోజు సాయంత్రం నాకు బాగా గుర్తు ఉంది. మాకు అక్కణ్ణించీ దిల్లీ బదిలీ అయిందన్న వార్త. అయ్యో అనుకున్నాను. ఈ అందమైన నగరాన్ని ఇంకా తేరిపార చూడనైనాలేదు. అప్పుడే వెళ్లిపోవాలా అని బెంగ. ప్రేమ్ పరుగెత్తుకుంటూ వచ్చాడు. మాకు బదిలీ అయినందుకు దుఃఖపడ్డాడు. చివరగా అంటాడు కదా, “క్వార్టర్స్‌లో ఇరవై మంది ఉంటే మీకే ఎందుకు బదిలీ రావాలి మేడమ్‌జీ? కల్ సే మనీష్ కో కౌన్ పఢాయేగా?”

ఇంకా చాలా మాట్లాడాడు. అప్పటికప్పుడే పక్క కాంప్లెక్స్‌లో ట్యూషన్ చెప్పే మేడం దగ్గరకి వెళ్లి తన కొడుకుని చదివించాలని, ట్యూషన్‌కి ఎంత అవుతుందని కూడా కనుక్కుని వచ్చాడట. వెళ్తూ వెళ్తూ ఆఖరిగా చెప్పేడు, వచ్చే నెల నుంచి మనీష్ ట్యూషన్ ఫీజు ఏడువందలు కట్టాలంటే తను దాచుకునేందుకు ఏమీ మిగలనే మిగలదని. మనసంతా స్తబ్దుగా అయిపోయింది. పూణే వెళ్లినప్పుడల్లా ఆ కుటుంబాన్ని చూసే వస్తాను. ఇప్పుడు మనీష్ పెద్దవాడయ్యాడు. చదువు గొడవ లేకుండా సినిమాల్లో డాన్సర్‌గా ప్రయత్నిస్తున్నాడని విన్నాను.

అవసరమున్న పిల్లలకి పాఠాలు బోధించాలన్న ఆశ మరింతగా పెరిగిపోయింది. సరే ఇదంతా ఎందుకు చెపుతున్నాననుకుంటున్నారేమో కదూ, చెప్తాను.

2012లో ఇక్కడికొచ్చాక ఈ గ్రామ పంచాయితీ వాతావరణం, ముఖ్యంగా ఇంటికి సమీపంలో ఉన్న జడ్పీ హైస్కూల్ నన్ను బాగా ఆకర్షించాయి. ఆ విశాలమైన పాఠశాల ఆవరణ, ఆ తరగతి గదుల ముందున్న వరండాలు మరీ నచ్చాయి. ఒకరోజు ఆ పాఠశాల హెడ్ మాస్టర్‌ని కల్సుకుని నేనొక క్వాలిఫైడ్ టీచర్నని, సాయంకాలాలు బడి వదిలాక ఇంటి దగ్గర చదివించే వెసులుబాటు లేని పిల్లల్ని ఈ వరండాల్లో కూర్చోబెట్టి చదివిస్తానని అడిగాను. ఆయన అలాటి అవకాశం ఉంటే కబురంపుతానని నా ఫోన్ నంబరు తీసుకున్నారు. సంతోషపడిపోయాను. కొన్నాళ్లు ఎదురుచూసాను. కబురు రానేలేదు.

ఆ తర్వాత గ్రామ పంచాయితీకి వెళ్లి సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన పిల్లల్ని చదివిస్తాను అని చెప్పాను. ఫ్రీగా చెప్తారా అని అడిగారు. అక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గూడెం వెళ్లగలిగితే వెళ్లి చెప్పమన్నారు. గ్రామ సేవిక ఒకరు వచ్చి గూడెంలో నన్ను పరిచయం చేసారు. ఆ ప్రాంతానికి రోడ్డు లేదు. లైట్లు లేవు. ఉన్న ఒకటీ అరా లైట్లు కూడా పవర్ కట్ మూలంగా వెలిగేవి కావు. కానీ నేను వెళ్లవలసింది ఇదే అనుకున్నాను. చేతిలో టార్చి లైట్ తోనే రాత్రి ఇంటికి వచ్చేదాన్ని. పాములు తిరుగుతుండేవి. పరిసరాలు అస్తవ్యస్తంగా ఉండేవి.

అక్కడ ఒక అంగన్ వాడీ పాఠశాల తాలూకు చిన్న వరండా సాయంత్రాలు ఖాళీగా ఉండేది. కానీ.. అక్కడ సిగరెట్ వగైరాలు తాగి పడేసేవాళ్లు. కోళ్లు ఆ వరండా అంతా మురికి చేసేసేవి. పిల్లలు సాయంత్రాలు వస్తూనే ఒక చీపురు తెచ్చుకుని శుభ్రం చేసుకుని కూర్చునేవారు. పంచాయితీ వాళ్లు మా క్లాసులకోసం ఏదైనా కావాలా అని అడిగినపుడు ఒక బ్లాక్ బోర్డ్, రెండు, మూడు చాపలు అడిగాను. అలా ఆ వరండాలో ఏడాదిన్నర క్లాసులు జరిగాయి. ఇంతలో గూడెంలో నిర్మాణం పూర్తైన ఒక కమ్యూనిటీ హాలు ఖాళీగా ఉండటంతో పంచాయితీ వాళ్లు లైట్లు, ఫ్యాన్లు పెట్టించి దాన్ని మా పిల్లలకోసం ఇచ్చారు. విశాలమైన హాలు, లైట్లు, ఫ్యాన్లు! పిల్లల ఆనందానికి అంతేలేదు.

అయితే రోజూ కొందరు పిల్లలు బయట నుంచి క్లాసులోకి రాళ్లు, మట్టి విసరటం, కిటికీ తలుపులకున్న అద్దాల్ని పగలకొట్టటం జరిగింది. ఆఖరికి కిటికీ తలుపుల్ని కూడా విరిచిపారేసారు. ఎవరు చేస్తున్నారో, ఎందుకో తెలియదు. అందరి కళ్లముందు జరుగుతున్న ఈ పనిని ఆపేవారు లేరు, అడిగేవారూ లేరక్కడ. ఆ పిల్లల్ని పిల్చేదాన్ని మాట్లాడాలని. అసలు కంటికి కనిపించకుండా పారిపోయేవారు. ఇవేవీ నన్ను భయపెట్టలేదు. పట్టుదల పెరిగింది. అంతే. సాయంత్రం హాలు తాళం తీసేసరికి లోపల విరిగిన గాజుసీసాలు, రకరకాల చెత్త పదార్థాలు ఉండేవి. మా పిల్లలు ఓర్పుగా అన్నింటినీ తుడిచి శుభ్రం చేసుకుని చాపలు పరుచుకునేవారు. నెమ్మదిగా మమ్మల్ని విసిగించే జనాలు మాయమయ్యారు.

స్కూలు నుంచి వచ్చి స్నానం చేసి, ఉతికిన బట్టలు వేసుకుని, తల దువ్వుకుని రావాలన్న నియమం పిల్లలకి అర్థమైంది. ఆచరించారు. రోజూ ఐదున్నరకి చదువుకోసం కూర్చోవటం అలవాటైంది. పిల్లలు ఎంత మంచివాళ్లో కదా. మనం పెద్దలం వాళ్లకి చెప్పవలసింది చెప్పట్లేదు అనిపిస్తుంది.

ఈ పిల్లల్లో తెలివి, చురుకుదనం చూస్తే ఆనందం. దాన్ని నిష్ప్రయోజనం చేసుకుంటున్న వారి అజ్ఞానం పట్ల దిగులు. చదువు విలువ ప్రతిరోజూ చెప్పే తొలిపాఠం అయింది క్లాసులో. ఈ చిన్న ప్రయత్నంలో ఒక్క పాప, ఒక్క బాబు చదువు విలువ తెలుసుకుని విజయం సాధిస్తే చాలనుకునేదాన్ని. ముందు ఏ ఒక్క పిల్లవాడికీ, పిల్లకీ అక్షరం గుర్తు పట్టడం రాదు అనేది అర్థమైంది. వాళ్లు హై స్కూల్ పిల్లలైన సరే. ఎందరో తల్లిదండ్రులు వచ్చి “టీచరుగారూ మాకు అక్షరాలు రావు. పిల్లల్ని చదివించాలని ఆశ.” అని చెప్పేవారు. ప్రైవేటు స్కూళ్ల పట్ల ఆకర్షణ చాలా ఉంది. బూటు, టై, స్కూలు బస్.. ఇలా. కానీ ఒక టెర్మ్ ఫీజు కడితే మరో టెర్మ్‌కి వాళ్లకి కష్టం అయిపోతుండేది. చక్కగా ప్రభుత్వం నడిపే స్కూల్లో చదివించమని నేను పదే పదే చెప్తూనే ఉండేదాన్ని. నెమ్మదిగా వాళ్లకి అర్థమైంది.

ఈ పిల్లలు ఇంత చురుకు, తెలివితేటలతో ఉంటే తల్లిదండ్రులు ఎంత అమాయకంగా ఉండేవారంటే, ఒక తల్లి రెగ్యులర్‌గా వచ్చి తమకు ఒక్కడే పిల్లవాడని, మంచి కాన్వెంట్‌లో చదివిస్తున్నామని, కొంచెం చూస్తుండమని చెప్తుండేది. పిల్లవాడు రెండవ తరగతిలో ఉన్నాడు. ఒక్క ఇంగ్లీషు అక్షరం కానీ, ఒక్క తెలుగు అక్షరం కానీ రాయలేడు. నేను ఆ తల్లితో చెప్పాను. ఇంతంత హోం వర్క్ వాడు చెయ్యలేడు. ముందు అక్షరాలు నేర్పుతాను అంటే ఆమె నన్ను అపనమ్మకంగా చూసింది. వాడి మార్కులు, ప్రోగ్రెస్ కార్డ్ తెచ్చి చూపించింది. అన్నీ తొంభైలు, వందలే. ఆమెకు అక్షరజ్ఞానం లేదన్నది సరే, కానీ ఎవరు ఎవరిని మోసం చేస్తున్నారు? ఆ పేద తల్లి ఎంతో నమ్మకంతో తన శక్యంకాని ఫీజుల్ని భరిస్తూ పిల్లవాడిని కాన్వెంటు చదువుకి పంపుతోంది. ఆమె నమ్మకం మీద ఎవరు దెబ్బ తీస్తున్నారు? ఏదో ఒక కాన్వెంట్‌నో, ఏ ఒక్కరి స్వార్థాన్నో అనటం లేదు. కానీ ఇదంతా ఒక సమస్య, కానీ ఈ పసివాళ్లు ఏమై పోతారు? మన వ్యవస్థ ఎందుకిలా ఉంది? మనిషికి మనిషికి మధ్యన ఉండవలసింది మొట్టమొదటగా నమ్మకమే కదా. దానికెందుకింతగా పగుళ్ళున్నాయి?!

అలా గూడెం నాదైంది. నేను వాళ్ల టీచర్నయ్యాను. ఆ పిల్లలు పెద్దవాళ్లవుతున్నారు. హై స్కూల్ కూడా దాటేస్తున్నారు. మరో స్వచ్ఛంద సంస్థ తరఫున మా జడ్పీ హైస్కూల్ కి కూడా వారానికి ఒకరోజు వెళ్తాను. అక్కడి పిల్లలు ఎక్కువగా నా గూడెం పిల్లలే.

ఈ పది సంవత్సరాల ప్రయాణం ఎంతో బావుంది. నిజం చెప్పాలంటే అమ్మాయిలే బాగా చదువుకుని ఉద్యోగాల్లోకి కూడా వెళ్లారు మా గూడెం నుంచి. ఈ పిల్లలు, ఈ గూడెం నా లైఫ్ లైన్ అనిపిస్తుంది. నేను పెద్దగా చెప్పిందేమీ లేదు. కనీసం అక్షరాలు గుర్తుపట్టి చదవగలగడం, రాయగలగడం, ప్రాథమికమైన లెక్కలు నేర్చుకోవటం వాళ్లకి తెలియాలి. అదే మొదటి ఆశయం ఇక్కడ. అప్పుడే 2023 వచ్చేస్తోంది. గూడెం నిండా బోలెడు మంది చిన్నారులు రేపటి కోసం కలలు కంటూ ఆశగా ఎదుగుతున్నారు. వీళ్లని చూడండి ఈ ఫోటోల్లో. మీకూ తెలుస్తుంది వీళ్లంటే నాకెందుకు అంత ఇష్టమో!

ఈ పిల్లలతో నా అనుభవాల్ని ‘గూడెం చెప్పిన కథలు’గా రాసి పత్రికల్లోనూ, ఆపైన పుస్తకంగానూ అచ్చువేసాను. ఎందరో వాటి గురించి మాట్లాడారు. నా చిన్నారుల గురించి సమస్తం తెలుసుకున్నారు. గూడెం చెప్పిన కథలకు కొనసాగింపుగా ‘బడి బయటి పాఠాలు’ కూడా పత్రికలకు పంపాను. అవీ ఆదరం పొందాయి. ఆ పిల్లలు, అనుభవాలు సహజమైనవి కదా మరి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here