[dropcap]ను[/dropcap]వ్వు నిన్న విడిచిపెట్టేసావు.
చేప మళ్ళీ చెరువుని చేరింది.
కథకి దయని తెచ్చి పెట్టి దైవాన్ననుకోకు.
కాగితం అలిగిందని కవిత్వానికి సాకులు వెతకకు.
ఏ కలమూ కదలదని నీకూ తెలుసు.
ఎప్పుడో నువ్వు భావుకతకి దూరమయిపోయావ్.
అప్పుతెచ్చి ఉదయాలను లేపడం పక్షులకు బరువైపోయింది.
రెక్కల టపటపలు ఏ చెవినీ చేరడం లేదు.
నువ్వు అనుకుంటావ్, ఇప్పుడు మనమెక్కడా అని.
ఏ కాలంలో తప్పిపోయామో
ఏ ఋతువులో మారిపోయామో
మనకి ఎలా తెలుసూ.
దారంతా, వాళ్ళు వాక్యాలు చల్లుకుంటూపోయారు.
ఆఖరున, ప్రార్థన ముగిసి చెక్కపెట్టెకి
దేహం పోయి ఎవరిదారి వారు చూసుకున్నారు.
ఇప్పుడు నువ్వూనేనూ దుఃఖపడినా,
ఎవరూ చూడరు.