యాంత్రికతను విడనాడాలి

0
3

[dropcap]స[/dropcap]నాతన మహర్షులు తమ అమోఘమైన తపః శక్తి వలన ఆలోచనా స్థాయిని ఊర్ధ్వ కేంద్రాలకు అభివృద్ధి చేసుకొని సర్వజ్ఞులై, సర్వ శక్తిమంతులై చరించారు. భూత, వర్తమాన కాలాలతో పాటు భవిష్యత్‌లో సంభవించు సంఘటనలను సైతం చూడగలిగే అద్భుతమైన దివ్యదృష్టి వారికి వుండేది. కాలక్రమేణా కలిప్రభావం వలన అధర్మం పెచ్చు పెరిగి, మాయ మోహావేశాలు మానవాళిని తీవ్రంగా లోబరుచుకొని వారిని ఇంద్రియ లాలసులను చేసింది. ధనార్జనే ప్రధమ కర్తవ్యంగా సాగే జీవితంలో సాధన, అనుష్ఠానం కుంటుపడ్డాయి. ధర్మం నాలుగు పాదాల నుండి ఒక పాదం మీద నడువసాగింది. తత్ఫలితంగా మానవులు దిగువ స్థాయి శక్తి కేంద్రాల నుంది ఆలోచించసాగారు. ఆనందం, సుఖ శాంతుల స్థానే అలజడి, దుఃఖం, మనో వైకల్యం, అసూయా ద్వేషాలు మానవ జీవితంలో ప్రవేశించాయి. అనుక్షణం భావోద్వేగాలతో సహవాసం చేస్తున్నారు. గౌతమ బుద్ధుడు పుట్టిన ఈ పవిత్ర భారతావనిలో హింస విశృంఖలంగా రాజ్యమేలుతోంది.

మానవాళిని ఇటీవలి కాలంలో పట్టి పీడిస్తున్న మరొక సమస్య యాంత్రికత. తన సహజత్వానికి ముసుగు వేసుకొని జీవిస్తున్న మానవుడు సంకుచిత భావాలతో యాంత్రికంగా జీవించడం అలవాటు చేసుకున్నాడు. పున్నమి వెన్నెలను, ఆకాశంలో మిల మిల మెరిసే నక్షత్రాలను, మంచు బిందువులను, అందంగా అరవిరిసే గులాబీలను, సువాసన లందించే మల్లె మొగ్గలను, చిట్టి చిన్నారుల నవ్వులను చూసి మనస్ఫూర్తిగా స్పందించే హృదయం గల మానవులు నేడు లక్షల్లో ఒకరు కూడా కనిపించడం లేదు. కళ్ళెం లేని గుర్రాల వలె పరుగులు తీస్తున్న కోరికలను తీర్చుకునే క్రమంలో వేగవంతమైన జీవితాన్ని గడపడం అలవాటు చేసుకున్న మానవుడు మర బొమ్మల వలే అధ్వాహ్నంగా జీవిస్తున్నాడు. జీవితపు మకరందాన్ని ఆస్వాదించడం మరిచిపోయాడు. మనిషి అనుభవిస్తున్న కష్ట, నష్టాలకు, అశాంతికి, యాంత్రికతే ముఖ్య కారణమని మనో వైజ్ఞనికులందరూ స్పష్టం చేస్తున్నారు.

చీమను చూసి వెంటనే స్పందించే భావుకత కల్గిన మహా కవులు పుట్టిన దేశం మనది. క్రమంగా రోబోలతో నిండిపోవడం శోచనీయం. మనిషి ఆలోచనా స్థాయి కూడా అధమపు శక్తి కేంద్రాలకు దిగజారిపోయింది. ప్రస్తుత పరిస్థితులలో ఉన్నత శక్తి కేంద్రాల నుండి ఆలోచించగలగాలంటే కొన్ని జన్మలు పట్టవచ్చు. సూర్యోదయం ఒకప్పుడు రమణీయ దృశ్యం, ఒక కొత్త జీవితానికి నాందీ వాక్యం.  ఎన్నో క్రొత్త ఆశలతో, ఆశయాలతో వచ్చే రోజు నేడు తమ నిద్రకు ఆటంకంగా భావిస్తున్నారు. ఒకప్పుడు నిషేధింపబడిన ఆహార పదార్థాలను నేడు వివిధ పేరులతో అందంగా ప్యాక్ చేసి ఇస్తే రుచికరంగా అస్వాదిస్తున్నారు. భగవంతుడు సృష్టించిన ఈ అద్భుతమైన ప్రపంచాన్ని చూసి ఆనందించే మనోనేత్రాలు యాంత్రికత ముసుగులో మూసుకుపోయాయి. శాశ్వత ఆనందానికి చిరునామా అయిన మానవుడు అలజడులు, అశాంతికి లోనై, వ్యతిరేక ఆలోచనా విధానంతో సతమవుతూ ఎన్నో రోగాలను ఏరి కోరి తెచ్చుకుంటున్నాడు. ఈ పరిస్థితి మారాలి. మానవాళి ఆలోచనా విధానం మారాలి. శాశ్వత, అశాశ్వత విషయల మధ్య వ్యత్యాసం గమమించగల వివేకం ఉదయించాలి. మన సనాతన మహర్షుల జీవన విధానాన్ని అలవర్చుకోవాలి. ఆచరణలో మిక్కిలి కష్ట సాధ్యమైనా ప్రయత్నించడంలో దోషమేమీ లేదు కదా! ప్రశాంత చిత్తంతో జీవించడం, పరుగులు తీసే కోరికల గుర్రానికి కళ్ళెం వేయడం, మృదు భాషణం, సాత్వికమైన ఆహారాన్ని స్వీకరించడం, సద్గ్రంథ పఠన, వీలైనంతగా నామ సంకీర్తన లేదా నామస్మరణ, పరులకు తమ శక్తి సామర్థ్యాల సారం సహాయ సహకారాలను అందించడం, శక్తిని బట్టి దాన ధర్మాలను చేయడం ఇత్యాది సత్కార్యాలను విధిగా చేయాలి. ధ్యానం, యోగా వలన తామస, రజో గుణాలు నశించి సత్వ గుణం వృద్ధి చెందుతుంది. అప్పుడు క్రమేపీ అలోచనా స్థాయి దిగువ స్థాయి శక్తి కేంద్రాల నుంది వృద్ధి చెంది ఊర్ధ్వ కేంద్రాలకు పెరుగుతుంది. దుఃఖం, అశాంతి, అలజడి, మనో వికారాలు వాటికవే మాయమౌతాయి. అప్పుడు శాశ్వతమైన, నిత్యమైన ఆనందానికి మానవుల జీవితం నెలవు అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here