ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ యాత్రా విశేషాలు-3

0
3

[dropcap]ముం[/dropcap]దుగా నేను ఈ పార్క్ గురించి ఏది తెలుసుకోలేదు. ఆ మ్యాప్ చూసిన తర్వాతనూ,.. లోపలకి ప్రవేశించాక అక్కడ ప్రకృతి అందాలు కనపడుతుంటేనూ.. ఇంకా ఇక్కడ వింతలు, విశేషాలు చూసి ఆశ్చర్యంతో నోరు తెరిచాను. నివ్వెరపోయాను.

గేటు దాటి కొంత దూరం లోపలికి వెడుతూండగా.. దారి వెంబడే Madison నది వయ్యారాలు పోతూ మాతో పాటే కొంత దూరం వచ్చింది. అసలు రహదారి నుండి ఆ నది పక్కన రోడ్డుపైనే వెళ్ళడానికి పక్కన రివర్ సైడ్ వే అని కనపడగానే మా కారును అటు మళ్ళించి.. నది ఒడ్డున కాసేపు గడిపాము. పెద్ద లోతు లేదు. సూర్య కిరణాలు నదీ జలాల్లో మిలమిల మెరుస్తూ ఆహ్లాదంగా అనిపించింది.

అక్కడే ఒక వ్యక్తి… కట్టె పుల్లలతో చిన్న పొయ్యి రాజేసి ఆ మంట మీద నీళ్ళ కెటిల్ పెట్టుకున్నాడు. బహుశా టీ పెట్టుకునే ప్రయత్నం కాబోలు అనుకున్నాను. తర్వాత ఆ నదిలో చేపలు పట్టే ప్రయత్నాలు మొదలెట్టాడు.

అక్కడ కొన్ని ఫోటోలు తీసుకుని మళ్లీ మేము మెయిన్ రహదారి మీదకి ఎక్కాము.

అలా రోడ్డుకి ఇరువైపులా పచ్చని చెట్లు చూసుకుంటూ కాస్త ముందుకి వెళ్ళేసరికి కొన్ని కార్లు ఆగి వుండడం, జనాలు దిగి ఆ నదీ పాయ వడ్డున వుండే పసుపు పచ్చని పూవుల మధ్యకి వెళ్ళడం కనపడి, మేమూ అటువైపు దారి తీసాము.. అరచేయంత పసుపు పచ్చని గడ్డి చామంతి పూవుల లాగా వున్నాయి. కంటికి కనపడినంత మేరా విరబూసి, పసుపు ఆరబోసినట్లుగా కనువిందు చేయసాగాయి. ఎల్లోస్టోన్ పార్క్ పేరుకి తగ్గట్టుగానే ఈ పూవులు కూడా వున్నాయి అనుకుని… వెంటనే గబగబా కెమెరా కంటికి బంధించేసాం. ఆ అందాలకి పరవశపడి అక్కడే వుండి పోతే ఎలా? చూడవలసినవి ఇంకా వున్నాయి అనుకుంటూ కారు ఎక్కాము.

అలా ఇంకాస్త ముందుకు వెడుతూంటే.. అంటూ ఇటూ చెట్లు మాయమయి విశాలమైన ఆకుపచ్చని తివాచీలు పరిచి నట్టున్న మైదానాలు  ప్రత్యక్షమయాయి. రెండు కళ్ళతోనూ చూసి అనుభవించడమే తప్ప వర్ణించడానికి వీలు లేనట్లు ఆ అందాలు ఊరించసాగాయి.

మేము సాగుతూ వుండే రోడ్డు కొద్దిగా ఎత్తు మీదనుంచి కిందకి దిగడం ఆరంభం అయేసరికి.. దూరంగా పైకి లేస్తూ పొగలు పొగలు కనిపించాయి. మేము వాటిని చూడగానే ఓ.. అంటూ ఒక్కసారిగా అరిచాము.

ఈ ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ ఒకానొకప్పుడు పెద్ద అగ్ని పర్వతమనీ, ఈ అడవి, పర్వత శ్రేణులు, విశాలమైన మైదానాలు, పెద్ద పెద్ద లోయలు, నదీ నదాలు, వందల అడుగుల ఎత్తు నుంచి దూకే జలపాతాలు ఇవన్నీ 22 లక్షల ఎకరాలలో వ్యాపించి వున్నాయని తెలుసుకున్నాను.

అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో 63 నేషనల్ పార్క్‌లు వున్నప్పటికీ.. ఈ ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ ప్రపంచంలోనే మొట్టమొదటి నేషనల్ పార్క్‌గా గుర్తింపు పొందింది. 1872వ సంవత్సరంలో దీనిని నేషనల్ పార్క్‌గా చేసారు. ఈ సంవత్సరం 150వ సంవత్సరం వేడుక జరుగుతోంది. అంతకు ముందు కూడా ఆ ప్రాంతంలో కొన్ని తెగల జనాలు నివసించినప్పటికీ, ఆ ప్రాంతం గురించి మాత్రం 1872వ సంవత్సరానికి ముందుగా సర్వేలు జరిగి, ఒక చిత్రకారుడు అక్కడ వున్న ప్రకృతి, పర్వతాలు ఇతరత్రా చిత్రీకరించడంలో ఈ విశాలమైన అటవీ ప్రాంతం, అక్కడ వున్న ఈ వేడి నీటి గీజర్లు, జంతు సంపద వెలుగులోకి వచ్చాయి. దాంతో ఈ పార్క్ పరిరక్షణ అప్పటి గవర్నమెంట్ ఆధీనంలోకి తీసుకురాబడి, నేషనల్ పార్క్ సర్వీస్ వారికి అప్పచెప్పబడింది.

వారి ఆధ్వర్యంలో పార్క్‌లో రోడ్లు, వసతి సౌకర్యాలు, ఇతరత్రా సదుపాయాలు ఏర్పడడంతో, పార్క్‌ను సందర్శించే వారు ఎక్కువ అయ్యారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఈ సందర్శకుల సంఖ్య గణనీయంగా తగ్గినప్పటికీ.. ఆ తర్వాత నుంచి చాలా మందే ప్రపంచ నలుమూలల నుంచి వస్తూనే వున్నారు. అయితే ప్రతి సంవత్సరంలోనూ మే నెల నుంచి అక్టోబర్ వరకే ఈ పార్క్ లోకి ప్రవేశం వుంటుంది. మిగతా కాలంలో మూసివేయబడి వుంటుంది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here