[సంచిక 2022 దీపావళి పోటీకి అందిన కథ.]
[dropcap]చ[/dropcap]ల్లని గాలి వీస్తూ ఈ ఉదయం చాలా హాయిగా ఉంది. చేతిలో కాఫీ కప్పుతో ఇంటి గుమ్మం మెట్ల మీద కూర్చున్నాను.
ఎదురుగా మందార చెట్టు బంగారు వర్ణ పూలతో విరబూస్తే, ఆ పక్కనే పెద్ద మల్లె తీగ ఆహ్లాదకరమైన సౌరభాన్ని వెదజల్లుతోంది. తన్మయత్వంతో ఆస్వాదిస్తున్నాను.
ఇంతలో మెల్లగా అడుగులో అడుగేస్తూ తనొచ్చింది. కొద్ది దూరంలో ఆగి నన్నే తదేకంగా చూడటం మొదలుపెట్టింది.
నా దృష్టి కూడా తన మీద పడింది.
“మళ్ళీ వచ్చావా? మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. ఇంకా నీ తప్పేమీ లేదన్నట్లు ఏమీ ఎరుగని దానిలా చూస్తున్నావు” అన్నాను కోపంగా పెద్ద కళ్ళేసుకుని.
ఐనా లాభం లేదు. నన్ను రెచ్చగొడుతూ ఒక కాలు విలాసంగా వెనక్కి జరిపి ముసి ముసిగా నవ్వుతోంది.
“ఏంటి ఎలా ఉంది? ఇదిగో వస్తున్నా నీ పని పడ్తా చూడు” అంటూ లేచాను.
అంతే, చటుక్కున వెనక్కి తిరిగి క్షణంలో మాయమైంది. తనైతే తప్పించుకుంది గానీ, నేను ఉదుటున లేవడంతో చేతిలోని కాఫీ ఒలికి నా పంచె మీద పడింది.
ఈ హడావిడికి మా ఆవిడ లోపల్నుంచి “ఏంటండీ ఈ పిల్ల చేష్టలు. ఈ వయస్సులో మీకెందుకండీ” అని అరిచింది.
నా వయస్సు గురించి గుర్తు చేసేసరికి నాకు ఉక్రోషం వచ్చింది. “ఏంటోయ్! నాకేం తక్కువ” అన్నాను.
“ఐతే వెంట పడండీ సరసంగా. ఏం పిల్లో ఎల్దమొస్తవా” అని నవ్వింది ఇప్పటికీ ‘కుమారి’ అని పిలవబడే నా శ్రీమతి.
కుమారికి వత్తాసుగా మా పుత్రికారత్నం సాగరిక కూడా పకపకా నవ్వుతూ “లేకపోతే ఏంటి నాన్నా మీకీ వయస్సులో దానితో సరసాలు. వీలు కానప్పుడు ఈ ఆయాస ప్రయాసెందుకు” అన్నది.
“ఔనా! ఐతే మానేస్తాలే. సరే ఇక నుంచి నేను పట్టించుకోను” అని పంచె మార్చుకోవడానికి లోపలికెళ్ళిపోయాను.
కొంచెం సేపటికే ఇంట్లో షెడ్డు దగ్గరనుంచి పెద్ద కేక వినిపించింది “నాన్నా, నాన్నా, చూడు నా స్కూటీ సీటు మొత్తం పాడైపోయింది” అని సాగరిక చిందులేస్తోంది. దగ్గరకెళ్ళి “అయ్యో! ఎవరు చేసారమ్మడూ” అన్నాను నేను అమాయకంగా నటిస్తూ.
“ఇంకెవరూ ఆ పిల్లే. దాని సంగతి చూడు” అన్నది సాగరిక కోపంగా.
“ఔనా! ఇప్పుడే చెప్పావుగా పట్టించుకోవద్దని. నాకేం సంబంధం లేదిక తనతో” అన్నాను నేను.
“ఓహో! నీకిప్పుడు అవకాశం దొరికిందన్న మాట నాన్నా. సర్లే ఐతే, నేనిప్పుడు నీ కోసం బజారు వెళ్లట్లేదు” అని నాకే తిరిగి ఎసరు పెట్టింది సాగరిక.
“హే హే! ఉత్తినే అన్నానే. ఇదిగో తన సంగతి ఇప్పుడే చూస్తానుగా” అని అమ్మాయిని బుజ్జగించి “ఏ పిల్లో! పరుగున పోతావా” అంటూ పాడుతూ ఇంటి వెనుక సందులోకి పరుగెత్తాను.
నేనలా ఇంటి వెనుక సందులోకి వెళ్ళానో లేదో, మూడంగల్లో తను గోడ దూకి పక్కింట్లోకి వెళ్లి ‘ఇప్పుడు పట్టుకో చూస్తా’ అన్నట్లు సవాలు చేసింది.
ఈ గలాటకి పక్కింటి యజమానురాలు రోజా వెంటనే వాళ్ళమ్మాయిని పిలుస్తూ “ఏయ్ బిల్లీ యాడున్నవ్? ఏందా సప్పుడు చూడు” అని ఒక అరుపు అరిచింది.
మా పక్కింటి వాళ్ళొచ్చిన మొదట్లో, నేను కుమారితో “ఎంత ముద్దైతే మాత్రం ఆ అమ్మాయికా పిల్లి పేరేంటీ” అంటే, మా ఆవిడ అలా కాదని ఆ బిల్లీ పేరు చరిత్ర వివరించింది.
పురాణాల్లో మునులు చెప్పినట్లు ఆ కతని నేను కూడా మా అల్లుడు గారికి మా ఇంటికొచ్చిన క్రొత్తలో ఇలా వివరించాను.
“కర్నూల్ నుంచొచ్చిన రోజా వాళ్లప్ప మునిరెడ్డి ఫ్రంట్ లైన్లో తుపాకెప్పుడూ పట్టకపొయినా, అకౌంట్స్ ఆఫీసులో పద్దులే చూసి రిటైరైనా, చివరికి కర్నల్ హోదా దక్కించుకున్నాడు. మిగతా ఆఫీసర్స్‌ని చూసి మునిరెడ్డి టెన్నిస్ ఆట కూడా ఆడటం మొదలు పెట్టిన రోజుల్లో, అప్పటి ప్రఖ్యాత టెన్నిస్ బ్యూటీ బిల్లీ జీను కింగుని గురించి తెలుసుకుని తన వీరాభిమాని ఐపోయాడు. బిల్లీ జీను కింగుని మర్చిపోలేని మునిరెడ్డి తన మనుమరాలికి బిల్లీ అని ముద్దు పేరు పెట్టి తన చిరకాల అభిమానాన్ని చాటుకున్నాడు. ఆ పిల్ల అసలు పేరేంటో తెలీదు కానీ బిల్లీ గానే మా అందరికీ తెలుసు. బిల్లీ మా ప్రాంతంలోనే కొత్తగా పెట్టిన కో-ఎడ్యుకేషన్ స్కూల్ బిళ్లా బొంగు లో చదువుతోంది.”
ఇదంతా వింటున్న మా అమ్మాయి “ఓహ్ గాష్! నాన్నా, బిల్లీ చదువుతున్న ఆ స్కూల్ పేరు బిళ్లా బొంగు కాదు. అదొక ఆస్ట్రేలియన్ ఇంటర్నేషనల్ స్కూల్ పేరు. దాన్ని బిల్లబొంగ్ అనాలి. ఇంకోటి, ఆ టెన్నిస్ ఆటగత్తె పేరులో జీనుని జాన్ అని పలకాలి. నీకు తెలుగంటే ఎంత అభిమానం ఉన్నా, వేరే భాషా పదాలు కూడా అర్థం మారకుండా సరిగ్గా పలకడం నేర్చుకోవాలి. చూడు అమితాబ్ బచ్చన్ కేబీసీ లో ఎలా చక్కగా విదేశీ పదాలు పలుకుతారో” అని ఇప్పటి తరం ఊతపదంలా క్లాసు పీకింది.
నేనూరుకుంటానా? “ఔనమ్మా! ఆయన ఎంతో కష్టపడి స్కాండినేవియన్ భాషా పదాలని కూడా చక్కగా పలుకుతారు. కానీ సులభమైన మన పేర్లు మాత్రం, వెంకట్ రమయ్యా… అబ్బో ఇలా చాలా పదాలు అవస్థ పడి భలేగా పలుకుతారు” అని గడ గడా, వ్యంగ్యంగా అన్నాను.
“అబ్బో నాన్నని తట్టుకోలేము. దురంతో ట్రైన్ లాగా దడ దడలాడించేస్తారు” అన్నది సాగరిక.
“మళ్ళీ అదే కూత! దురంతో ఏంటే దిక్కుమాలిన భయానక పలుకు? దూర్ అంత్ లేకపోతే తురంత్ అని హిందీలో తగలడు. అంతే కానీ దురంతమేంటి? ఇదెక్కడి చోద్యమే” అని వాపోయాను నేను.
“వా నాన్నో! ఎవ్వరినీ వదలవు కదా. ఇక అసలు విషయానికి రా నాన్నా, ప్లీజ్” అని వేడుకుంది సాగరిక.
సరే, ఇక ఇప్పటి విషయానికొస్తే, ఆ బిల్లీ నుంచి ఏమీ సమాధానం రాకపోయే సరికి, రోజాకి చిరాకేసి “ఏ షేషూ! ఇంట్ల సప్పుడౌతుంటే బయట యాం చేస్తున్నవాడ?” అని మళ్ళీ అరిచింది.
అంతే! గంభీర కంఠంతో ఎవరితోనో బయట మాట్లాడుతున్న ఆవిడ భర్త ఆరడుగుల భారీ షేషూ వెంటనే లోపలికొచ్చి చూసి, “అరే! పిల్లొచ్చింది గంతనే గద రోజీ” అన్నాడు ధైర్యం చేసుకుని సాధ్యమైనంత మెల్లగా.
అది చాలు మా పక్కింటావిడకి తిక్క రేగడానికి. “నోర్మూసుకో. ఓవర్ యాక్షన్ చెయ్యాకు” అని రోజా గదమాయించేసరికి, బడా షేర్ షేషూ కాస్తా మ్యావ్ అని తోక ముడిచి వెంటనే తదుపరి చర్యలు మొదలుపెట్టాడు.
ఇక దబ దబమన్న షేషూ భారీ అడుగుల చప్పుడు విని, చటుక్కున తిరిగి మా ఇంట్లోకి దూకి, కొంత దూరంలో ఆగి నా ప్రతి చర్య కోసం వేచి చూస్తోంది తను.
ఇంతలో “ఏంటండీ? దానితో మీ వ్యవహారం ముగిసిందా లేదా?” అన్న నా శ్రీమతి హెచ్చరికతో అప్రమత్తమైన నేను, తనతో ‘నీ సంగతి తర్వాత తేలుస్తా ఉండక్కడే’ అన్నాను.
‘చూసావులే పో’ అని కళ్ళు చిట్లించి చూస్తున్న తనని అలాగే వదిలేసి ఇంటి లోపలికొచ్చేసాను. అలా రాగానే నన్నెప్పుడు ఆట పట్టిద్దామని ఉన్న సాగరిక “ఏమైంది నాన్నా, ఎందాకా వచ్చిందీ” అని ఎగతాళి చేసింది.
ఇదేమీ తెలియని మా అల్లుడు గారు తన లాప్‌టాప్ లోంచి తల తీయకుండానే “ఏంటి మాయ్య గారూ పొద్దున్నే గరిక టాప్ లేపుతోంది” అన్నాడు.
“బాబూ మీకో దండం. అసలే పొద్దున్నే దాని స్కూటీ సీటు పాడయ్యిందని కోపంగా ఉంది. ఇప్పుడు మళ్ళీ దాన్ని గరిక అంటూ పిలిస్తే నా రోజెలా గడవాలి. దయ చేసి వదిలేయండి” అన్నాను.
“గరిక అంటే ఏమీ ఫర్లేదు నాన్నా. ఒక మాట చెప్పనా. ప్రీతి పాత్రమైన గరిక లేకుండా ఆది దేవత పూజ సంపూర్ణం కాదు. అలాగే, ఆయనకి నేనే మాత్రం తూగను కానీ గురువు గారు గరికపాటి వారి ప్రవచనం వినకుండా మీకు కూడా రోజు గడవదు” అన్నది సాగరిక.
ఏ రూటుకా రూటే చెప్పుకోవాలి. మా అమ్మాయికి వాళ్ళ మాయ్య పోలిక రాలేదు (ఇదేంటి! నాకు కూడా మా అల్లుడు గారి పిలుపే వస్తోంది).
“సాగరికకి వాళ్ళ మావయ్య పోలిక రాలేదు. మాటలు పొదుపు చెయ్యదు. మా అమ్మాయి తన పేరుకి తగ్గట్లు ఎంత భావ గర్భితంగా, లోతుగా మాట్లాడుతుందో చూసారా” అని అల్లుడుగారితో అన్నాను.
“ఏతంతాను? అంతా మీ ముల్లంగే, అదే మీ రూటే కదా మాయ గారు” అన్నాడు అల్లుడు గారు.
ఈ డబల్ ధమాకాకి ఢమాలైన నేను తేరుకునేలోగా, అల్లుడు గారు మళ్ళీ “ఇంతకీ ఎవరా పిల్లండీ? మీకెందుకు తన మీదంత కోపం” అని అడిగాడు.
అయ్య బాబోయ్! ఇదేంటీ వ్యవహారం దారి తప్పుతోందని, నేనతనితో “ఇంతకీ తనెవరనుకున్నారు? మొన్న మీకు ఎదురొచ్చిన ఆ పిల్లే. ఇప్పుడు చెప్పండి ఏం చెయ్యాలో” అన్నాను.
వెంటనే అల్లుడు గారు “అయ్యో మాయ్య గారు మీరస్సలు దాన్ని వదిలిపెట్టే ఆలోచనే కూడదు” అని ఆవేశ పడ్డాడు.
పాపం అతని అవేశానికీ కారణముంది. మొన్న అల్లుడు గారు మా ఇంటికొచ్చినప్పుడు, కారు లోపల పెడదామని గేట్లు బార్లా తెరుస్తున్న సమయంలో, చటుక్కున తనూ లోపలికొచ్చేసింది. ఆ వెనుకే నాలుగు కుక్కలు కూడా తనని వెంబడిస్తూ ఇంటి లొపలికొచ్చేసాయి. ఇక ఆ కుక్కలన్నిటినీ తిరిగి బయటకి తోలటానికి మా ఇంటి చుట్టూ ఆరు ప్రదక్షిణలు చేయాల్సి వచ్చింది అల్లుడు గారికి.
అందుకే ఆ రోజు జరిగిన డాగ్ ఛేజ్ మర్చిపోని అల్లుడు గారు “మాయ్య గారూ ఇక లాభం లేదు. మీరిక దాన్ని ఎలాగైనా ఈ ఇంట్లోంచి తరమాల్సిందే” అన్నాడు.
“ఔనండీ! చాలా తిప్పలు పెడుతోంది. ప్రొద్దున పాలవాడు వచ్చి పాల ప్యాకెట్లు గేటుకున్న డబ్బాలో గిరాటేయగానే, ఇదొచ్చి వాటి భరతం పడుతోంది. నానా రచ్చ చేస్తోంది. దీని అంతు తేల్చాల్సిందే” అని నేను అల్లుడు గారికి భరోసా కల్గిస్తుంటే, మధ్యలో సాగరిక కల్పించుకుని “పిల్లిని వదిలించుకోవడమంటే ఆషామాషీ కాదు. ఎంతో ఓపిక కావాలి, ఎంతో ప్లానింగ్ ఉండాలి” అని అదేదో సినిమాలో తనికెళ్ళ భరణి చెప్పినట్లు వర్ణించింది.
దీనికి నేనూ, అల్లుడు గారూ “అంతేగా! అంతేగా” అంటూ ఊఁ కొట్టాము.
అంతటితో నేనూరుకోకుండా “ఔనమ్మా. పిల్లనైతే వదిలించుకున్నాను కానీ, పిల్లితో మాత్రం తల ప్రాణం తోకలోకొస్తోంది” అన్నాను.
వెంటనే మా కుమారికి కోపం వచ్చేసింది “ఏంటీ విడ్డూరం. నా పిల్లని పిల్లితో పోలుస్తున్నారు. ఇంతకీ మీ తోక బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు” అని గడ్డి పెట్టింది.
ఆ రోజు రాత్రి మా భోజనాలయ్యి హాల్లో కబుర్లు చెప్పుకుంటుంటే, ఇంటి వెనుక వైపు ఏవో ఏడుపుల్లాంటి శబ్దాలు విని మా మనవడు తారక్ పరుగెత్తుకుంటూ వెళ్లి చూసొచ్చి “తాతా ఆ పిల్లీ, దాని ఫ్రెండూ పోట్లాడుకుని ఏడుస్తున్నాయి” అని చెప్పాడు.
తర్వాత సాగరిక దగ్గరకెళ్ళి “అవి దెబ్బలాడుకుని బాగా అలిసిపోయాయేమో. వాటికి పాపం బాగా ఆకలేస్తోందేమో. వాటికేదైనా పెట్టమ్మా” అని తారక్ కుదిపేసాడు.
దానికి సాగరిక “ఏం మాయ రోగం వాటికి. పొద్దున్న పాల ప్యాకెట్లు చించింది చాలదా? ఇప్పుడు ఆకలేస్తే ఏడవనీ, చావనీ” అని కసిగా తిట్టింది.
నాకు నవ్వాగలేదు. “సిటీ పిల్లలతో ఇదే బాధ. ఇంటర్నెట్లో చదివేవరకూ ఏ విషయమూ తెలియదు. ఆ పిల్లి ఏడ్పులకర్థం మీకెలా చెప్పాలో తెలియట్లేదు” అన్నాను.
దీనితో అల్లుడుగారు “మాయ్య గారూ మీకు పిల్లి ఏడ్పులు కూడా అర్థమౌతాయా” అని సాగరికని చూస్తూ అన్నాడు.
“ఎలా కొట్టాను దెబ్బ” అన్నట్లు పోజ్ ఇస్తున్న అల్లుడు గారితో “యా మై డియర్ సన్ ఇన్‌లా! ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ అవి ఏడవట్లేదు. దే అర్ మేకింగ్ విగరస్ మేటింగ్ కాల్స్” అన్నాను నేను.
“ఓహ్ సో సిల్లీ! మాకిది ఇంతవరకూ తెలియనే లేదూ” అన్నాడు కింద పడ్డా తానొక్కడినే కాదన్నట్లు, అల్లుడుగారు వాళ్ళావిడ సాగరికని కూడా కలుపుకుని.
“ఓహ్ మై గాడ్! ఈ పిల్లి రచ్చతో చావొస్తోంది. బాబోయ్ ఇప్పుడిలా పగ తీర్చుకుంటోంది ఇంకొక దాన్ని కూడా తీసుకొచ్చి. అది చాలక మీ వెటకారమేంటి” అని తల పట్టుకుంది సాగరిక.
ఇదంతా వింటున్న మనవడు తారక్ ఏదో అర్థమైనట్లు “ఐతే అవి ఏడవట్లేదా? ఆన్ కాల్ మీటింగ్స్ ఎక్కువయ్యాయని మీలాగా గొడవ పడ్తున్నాయా” అని వాళ్ళమ్మతో అన్నాడు. వాడి మాటలకు అందరం నవ్వాపుకోలేకపోయాము.
“ఏ ఫ్రూటుకా ఫ్రూటే చెప్పుకోవాలి. అల్లుడుగారు మిరప పండైతే, మనమ్మాయి నిమ్మ పండు. రెండూ భలే, రుచికి కావాల్సినవే కదోయ్” అని నేనన్నాను శ్రీమతితో మురిపెంగా.
“ఐతే ఇంకేం! వాటికి తోడు ఘాటుగా ఆవ పిండిలా మనవడు తారక్. ఎంజాయ్ ఫరెవర్!” అని టక్కున ఉప్పేసింది మాయావిడ కుమారి.
మా మాటలిలా కొనసాగుతుంటే, ఇంకో వైపు ఎంతసేపైనా ఆ పిల్లుల రచ్చ ఆగకపోయేసరికి, నేనో కర్ర తీసుకుని వాటివైపు వెళ్లబోయాను.
“జాగ్రత్త శ్రీ! ఇప్పుడున్న మూడ్లో వాటిని డిస్టర్బ్ చేస్తే మామూలుగుండదు” అన్నది కుమారి తనకిష్టమైన హీరోయిన్లాగా ఒత్తి పలుకుతూ.
“ఇదెక్కడి గొడవే. ఈ మార్జాలం కూడా మారజాలనని మీలా మితి మీరితే నేనెక్కడ వేగేదే” అని నేను కూడా ఎమ్మెస్ నారాయణ లాగా ఊగిపోయాను.
తారక్ నన్ను సముదాయిస్తూ “కూల్ తాతా! కూల్. మనం ఈ పిల్లిని ఎలా వెళ్ళగొట్టాలో గూగుల్ చేద్దాం పద” అన్నాడు.
“ఔన్రా మనవడా. అందుకే దశ చిట్కామ్ గూగులోసేతమ్ అన్నారు” అన్నాను నేను.
వెంటనే “ఎవడు? పట్టుకు తన్నండి” అనో స్వరం వినిపించింది.
నాకర్థమైంది. ఇలా నా మీద తనకి వీలైనప్పుడల్లా థర్డ్ పార్టీ, థర్డ్ ఫ్రంట్ ఇంకా వీలు కానీ థర్డ్ డిగ్రీ మార్గాల ద్వారా సేద దీరుతుంది మా యావిడ కుమారి.
“సరే లేరా. మీ అమ్మమ్మ ఏదో అంటుంది కానీ, నువ్వా సంగతి చూడరా తారకా”అన్నాను నేను.
“ఔను తాతా. అదే మన తక్షణ కర్తవ్యం” అని వెంటనే ఇంటర్నెట్లో, ఇంట్లోంచి పిల్లిని ఎలా తరమచ్చో బోలెడన్ని చిట్కాలు చక చకా దొరకబట్టాడు తారక్.
“ఇక చెప్పరా మనవడా ఒక దాని తరువాత ఇంకోటి ఏం చెయ్యాలో” అన్నాను నేను.
“సరే తాతా నువ్వెళ్ళి ఒక స్ప్రే బాటిల్, కిలో నిమ్మ కాయలు ఇంకా పెద్ద బ్రూ కాఫీ ప్యాకెట్ తీసుకురా” అన్నాడు తారక్.
“క్షుద్ర పూజలకు బ్రూ కాఫీ పొడి వాడరేమోరా” అన్నాను నేను.
“ఎహె! పూజలంటావేమిటి తాతా. పిల్లులకు కొన్ని ఘాటు వాసనలు పడవు. అందుకే మనం కిలో నిమ్మ కాయలు కోసి, వాటి రసం పిండి అది తిరిగే చోట్ల స్ప్రే చెయ్యాలి. ఇది పని చెయ్యకపోతే, మనం రెండు లీటర్ల స్ట్రాంగ్ బ్రూ కాఫీ డికాక్షన్ తయారు చేసి అది తిరిగే చోట్ల ఒలక బొయ్యాలి” అన్నాడు శ్రద్ధగా తారక్.
“అయ్య బాబోయ్! అంత ఖర్చా? నా వల్ల కాదు. ఇంకో మార్గం చెప్పరా బాబూ” అన్నాను నేను.
“సరే ఐతే ఇంకో మార్గం చెబుతా. పిల్లిని తరమటానికి ఒక కుక్కని పెంచు తాతా” అన్నాడు చిలిపిగా తారక్.
“ఒరేయ్ ఇంట్లో ఉన్న ప్రాణులనే భరించలేక పోతున్నాను. ఇక దాని ఆలనా పాలనా కూడానా? ఏదైనా చక్కటి పరిష్కారం వెతకరా డింభకా” అన్నాను నేను.
బాగా బుర్ర చించి “తాతా నీకొక టాప్ సొల్యూషన్ చెబుతాను. అమలు పరచు” అన్నాడు తారకుడు.
“నాన్నోయ్ మా వాడు కూడా తెలుగు బాగా పరుస్తున్నాడుగా” అన్నది మురిసిపోతూ సాగరిక.
“అమ్మడూ నువ్వుండవే! ఒరేయ్, అదేదో త్వరగా చెప్పరా పోరగా”అన్నాను నేను.
“వెరీ సింపుల్ తాతా! ఆ పిల్లికి ఏదిష్టమో తెలుసుకుని అది లేకుండా చేయండి” అన్న బ్రహ్మాండమైన సలహా ఇచ్చాడు మా టక్కరుడు.
“ఇది గదరా సులభం తారక్. ఇందులో మీ తాతగారు నిష్ణాతులు. నాతో ముప్ఫైదేళ్లు అదే పని చేస్తున్నారు” అని పొద్దున్నే పాల ప్యాకెట్లు చించి విజృంభిస్తున్న మా గృహ పిల్లిలా అవకాశం చేజిక్కుంచుకుంది నా శ్రీమతి.
ఈ నిందారోపణతో నాకేడుపొచ్చేసింది. నోట మాటల్లేవ్. గూబ గుయ్యిమంటోంది. గూగుల్లో మిగిలిన చిట్కాలు తెలుసుకునే ధైర్యమూ, శక్తీ లేదు.
ఏం చెప్పను? పిదపైనా మా ఇంటి పిల్లి బైలెల్లినాదో లేదో చెప్పాలంటే గళమూ, కలమూ రెండూ జారిపోతున్నాయి. కాబట్టి, ప్రస్తుతానికి మరిక సెలవే.
కథైతే సంచిక కొచ్చేసింది, మరి పిల్లెక్కడకంటారు?!