తోడు కోరిన జీవితం

18
3

[dropcap]మో[/dropcap]హన్ ఇల్లంతా సర్దుతున్నాడు, చాలా హడావిడి పడుతున్నాడు. పిల్లలు అమెరికా నుంచి వస్తున్నారు. మోహన్‍కి హైదరాబాద్‍లో ఉద్యోగం. రిటైర్ అవడానికి ఇంకా ఏడు సంవత్సరాలుంది. మోహన్ భార్య మాధవి చనిపోయి మూడు సంవత్సరాలు అయింది. మోహన్ మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. ఒక్క అబ్బాయి. పేరు రవి. వాడికి పెళ్లి అయ్యింది, ఒక పిల్లాడు. వాళ్ళు అమెరికాలో ఉంటున్నారు. అప్పట్లోనే మాధవికి ప్రాణం మీదకు వస్తే, ఇక రెండో బిడ్డ లేకుండా ఒక్క పిల్లాడితోనే ఆపరేషన్ చేయించాల్సి వచ్చింది.

రవి అమెరికా నుండి వచ్చి సంవత్సరం రోజులు అయింది. వాళ్ళమ్మ చనిపోయాక ఒకసారి వచ్చాడు, మళ్ళా ఇపుడు వచ్చాడు. కోడలు రజని, మనమడు మహేష్. కోడలు చాల మంచి పిల్ల. తనకు చిన్నతనం లోనే తండ్రి చనిపోయాడు, తల్లే అన్ని అయి పెంచింది. రజనికి ఒక అన్నయ్య కూడా ఉన్నాడు.

మాధవి, పాపం చేసినన్నాళ్లు చేసి ఈ సంసారం నెట్టుకొచ్చింది. చివరి రోజుల్లో కాన్సర్‍తో మూడు సంవత్సరాలు పోరాడి ప్రాణాలు విడిచింది. అప్పటినుంచి మోహన్ ఒంటరివాడయ్యాడు. మాధవి బతికి ఉన్నన్నాళ్ళు అన్ని పనులు, ఇంటి పనులు, బయటి పనులు అన్నీ తాను ఒక్కటే చూసుకునేది. మోహన్ ఆఫీస్ పని తప్ప ఏమీ పట్టించుకోడు. అంటే రోజు తాను ఇల్లు చేరే సరికే రాత్రి 8 గంటలు అవుతుంది.

మాధవి, రవికి పెళ్లి అయిన కొద్దీ రోజులకే కన్ను మూసింది. అప్పటినుండి మోహన్ పూర్తి ఒంటరి వాడు అయ్యాడని చెప్పాలి. కొడుకు, తన దగ్గర లేడు. తాను కూడా ఉద్యోగం వదలి అమెరికా వెళ్ళలేడు. కొడుకు, కోడలు, “మీరు ఉద్యోగం మానేసి మా దగ్గరకు రండి, ఒంటరిగా ఇలా ఎన్నాళ్ళు ఉంటారు. లేదా ఎవరినయినా రెండో పెళ్లి వాళ్ళను అయినా పెళ్లి చేసుకోండి, మీకు తోడుగా ఉంటుంది” అన్న ప్రస్తావన తెస్తారు. ఫోన్‍లో మాట్లాడినా, లేదా ఇక్కడకు వచ్చినా, ఏదో ఒక రోజు ఈ ప్రస్తావన వస్తుంది.

మోహన్‍కి మాధవి బ్రతికి ఉన్నన్నాళ్ళు, కష్టం తెలియలేదు. ఒకరకంగా మోహన్‍కి కష్టం తెలియకుండా అన్నీతానే చూసుకుంటూ నెట్టుకువచ్చింది మాధవి. ఇప్పుడు మోహన్ అన్నితాను చూసుకోవాలి. మాధవి చనిపోయిన కొత్తల్లో చాలా కష్టం అనిపించినా, ఇపుడిపుడే అన్ని పనులకు అలవాటు పడుతున్నాడు. కానీ రోజు ఏదో ఒక ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. ఎంతయినా ఆడవాళ్లు ఉండి ఇల్లు చూసుకున్నంత పద్ధతిగా ఉండదు, వాళ్ళు లేనప్పుడు. మాధవి లేని లోటు బాగా కనిపిస్తోంది.

రేపు ఉదయం ఎయిర్‍పోర్ట్‌కి వెళ్లి వీళ్ళని రిసీవ్ చేసుకోవాలి అనుకుంటూ, ఇల్లు శుభ్రం చేస్తున్నాడు. ఎంత చేసినా ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. ఆడవాళ్లు ఉండి చూసుకునే ఇంటి కళ వేరుగా ఉంటుంది. కానీ కొంచం అన్నా శుభ్రం చెయ్యాలి కదా అనుకుంటూ శుభ్రం చెయ్యడం అయిందనిపించాడు.

రేపు ఉదయం ఆరు గంటలకల్లా ఫ్లయిట్ వస్తుంది. ముందుగానే వెళ్ళాలి కాబట్టి, ఆలస్యం చెయ్యకుండా త్వరగా పడుకోవాలి అనుకుంటూ మంచం మీద నడుం వాల్చాడు మోహన్. పడుకోగానే గుర్తొచ్చింది రేపు ఉదయం 4 గంటలకు అలారం పెట్టుకుని లేవాలి అని. మళ్ళా లేచి టేబుల్ మీద పెట్టిన ఆ సెల్ ఫోన్ తీసుకుని అలారం పెట్టి, ఫోన్ దిండు పక్కనే పెట్టుకుని పడుకున్నాడు మోహన్.

ఉదయం 5 గంటలకే ఎయిర్‍పోర్ట్ చేరుకున్నాడు మోహన్. తన పిచ్చి గాని, గంట ముందే వచ్చి కూర్చున్నాడు, తన కోసం ఫ్లైట్ ముందుగా రాదు కదా. ఫ్లైట్ ఎయిర్‍పోర్ట్ చేరడమే 6 గంటలకు చేరుతుంది. అది వచ్చాక వీళ్ళు బాగ్స్ కలెక్ట్ చేసుకుని బయటకు వచ్చేసరికే, మరో అరగంట అయినా పడుతుంది. అంటే తాను గంటన్నర ముందు వచ్చాడని చెప్పాలి. అదీకాక మనల్ని ఎయిర్‍పోర్ట్ లోపలి రానివ్వరు. అందరూ నిలబడి వచ్చే వాళ్ళ కోసం ఎదురు చూసే చోటనే తాను కూడా నిలబడాలి, వాళ్ళు బయటకు వచ్చాకనే అందరూ కలసి బయటకు రావాలి. మోహన్ కి ఇవన్నీ తెలుసు, కానీ ఏదో ఆరాటం, ఎక్కడ ఆలస్యం అవుతుందో అన్న భయం. దీంతో ముందుగా వచ్చి కూచున్నాడు. మాటి మాటికీ టైం చూసుకుంటున్నాడు మోహన్. తన పిచ్చి గానీ తన కోసం కాలం త్వరగా పరిగెత్తదు కదా.

మొత్తానికి, కొడుకు, కోడలు మనమడు మహేష్ అందరూ బయటకు వచ్చారు. ‘తాతగారు’ అంటూ మనమడు మహేష్ వెంటనే గుర్తు పట్టి పరుగెత్తుకుంటూ మోహన్ దగ్గరకు వచ్చాడు. అందరూ కలసి మోహన్ కార్ లోనే ఇంటికి చేరారు.

“కూర్చోండి, కాఫీ పెడతాను, తాగాక మాట్లాడుకుందాం” అన్నాడు మోహన్.

“లేదులే మామయ్య, నేను మొహం కడుక్కుని వచ్చి కాఫీ పెడతాను. మీరు కూచోండి” అంది రజిని. “ఎందుకమ్మా, మీరు వచ్చేసరికే కాఫీ రెడీగా ఉంటుంది, త్వరగా రండి” అని కాఫీ పెట్టడానికి లేచాడు మోహన్.

పిల్లాడికి మొహం కడిగి, కోడలు మొహం కడుక్కుని వచ్చేసరికే, కాఫీ కప్పులతో ఎదురు వచ్చాడు హాల్ లోకి మోహన్.

ప్రయాణం కబుర్లు, మాట్లాడటం అయ్యాక,

“ఎలా ఉన్నారు నాన్నా, మీరు ఒక్కరే ఉండడం మాకు చాలా బాధగా ఉంది. ఒకే రెండు నెలలు సెలవు పెట్టి అమెరికా రండి నాన్నా, మా దగ్గరకు వచ్చి అక్కడ రెస్ట్‍గా ఉండండి” అని బ్రతిమాలుతున్నట్లు ఎంతో ప్రేమతో అన్నాడు రవి.

రజని కూడా పదే పదే మోహన్‍కి చెప్పింది అమెరికాకి రమ్మని. రజనికి తండ్రి లేకపోవడంతో మామగారు మోహన్‍ని తన తండ్రి లాగా భావించి ఎంతో ప్రేమగా, గౌరవంగా చూసుకుంటుంది.

“చూద్దాం లేమ్మా, రిటైర్మెంట్‍కు ఇంకా టైం ఉందిగా, రిటైర్ అయ్యాక ఎటూ మీదగ్గరకే గదా రావాలి” అన్నాడు మోహన్. “ఈ ఆరు సంవత్సరాలు ఎలాగోలా నెట్టేస్తాను లేమ్మా” అన్నాడు మోహన్.

ఈలోగా మనమడు మహేష్ పరుగెత్తు కుంటూ వచ్చాడు. మనమడితో కబుర్లు చెబుతూ, ఆటలు ఆడుతూ ఎంతో సంతోషంగా గడిపాడు మోహన్. వారం రోజులు సంతోషంగా గడిపాడు మోహన్ పిల్లలతో. రజని, విశాఖపట్టణంలో ఉన్న తన తల్లి, అన్నగారిని కూడా చూసి వస్తామని అనడంతో మహేష్‍తో కలిసి ప్రయాణం ప్లాన్ చేసాడు రవి.

ఇక రేపు ఉదయం బయలుదేరుతారు అనగా, ఆ రోజు రాత్రి మోహన్‍తో.. “మీరు మరో పెళ్లి అయినా చేసుకుంటే బాగుంటుంది, ఈ వయసులోనే కదా నాన్నా మీకు తోడు ఉండాలి, ఆరోగ్యం లో ఏదయినా తేడా వచ్చినా, ఇంట్లో ఒక మనిషి అంటూ ఉండాలి కదా నాన్నా. భర్త చనిపోయిన వాళ్ళు ఉంటారు, మాకు అభ్యంతరం లేదు కదా నాన్నా, మేము ఎపుడో ఒకసారి వచ్చి వెళ్తాము, ఎల్లకాలం మీతో మేము ఉండలేం కదా. మీతో అలా ఉండాలంటే భార్య స్థానంలో ఒకరుండాలి. అందుకే పెళ్లి చేసుకోండి” అన్నారు రవి, రజని ఇద్దరును.

“లేదమ్మా, ఈ వయసులో నేను పెళ్లి చేసుకోకూడదు, బాగుండదు” అన్నాడు మోహన్. “నాకు ఇపుడు బాగానే ఉంది. ఆడ మనిషి తోడు లేకుండా ఉండటానికి అలవాటు పడ్డాను. మళ్ళా ఇంకో ఆడమనిషి వచ్చి నా జీవితంలో ఉన్న ఈ కాస్త ప్రశాంతత కూడా లేకుండా చెయ్యవచ్చు. మీకు నాకు మధ్య మనస్పర్థలు రావడానికి ఆమె దోహదపడే అవకాశం కూడా ఉంది. మీ అమ్మ లాంటి మంచితనం కల వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నాకు బాగానే ఉంది, నువ్వు, అమ్మాయి రజిని, మీరు ఇంక ఈ విషయం గురించి ఆలోచించకండి” అని ఆ విషయం అంతటితో ఆపెయ్యాలి అన్నట్లు చెప్పి, “చాలా పొద్దుపోయింది, రేపు మళ్ళా త్వరగా బయలుదేరాలి, పడుకోండి” అని మాట దాటేశాడు మోహన్.

మోహన్‍కి మాధవి అంటే చాలా ప్రేమ. పాత కాలం మనిషి కాబట్టి, ప్రేమను ఎలా చూపించాలో చేతకాక, ఏనాడు తన మనసులో ఉన్న ప్రేమను మాధవికి నేరుగా చెప్పలేక పోయాడు. లేని ప్రేమను, ఉన్నట్లు చాలా గొప్పగా చెప్పి భార్యను మోసం చేసే వాళ్ళు ఉన్న ఈ రోజుల్లో, తనకు మాధవి పైన ఉన్న ప్రేమను చూపించడం కూడా చాతకాని వాడు మోహన్. చిన్నతనం నుంచి తాను పెరిగిన వాతావరణం కూడా మోహన్ జీవితాన్ని చాలావరకు ప్రభావితం చేసిందనే చెప్పాలి. కేవలం తిండి, బట్ట ఇచ్చినంత మాత్రాన తల్లి తండ్రులు పిల్లల్ని పెంచి పెద్ద చేసినట్లు కాదు, పిల్లలకి ప్రేమ, అభిమానం, ఆప్యాయత, పంచాలి. ఆడపిల్లలకు తన తల్లి తోడు ఉంది, తండ్రి తనకు కావలసినవి అన్ని చూసుకుంటాడు అనే నమ్మకం, ధైర్యం తండ్రి మీద ఉండాలి.

మోహన్ ఏదయితే తన జీవితంలో కోల్పోయాడో, అవన్నీ తన భార్య పిల్లలకు ఇవ్వాలని, తాపత్రయం, కోరిక, మనసులో ఉన్నా, చూపించడం చాతకాని వాడు. తాను జీవితంతో పోరాడి ఓడిపోకూడదు అన్న పట్టుదలతో ముందుకు సాగి, జీవితాన్ని ఇప్పటివరకు విజయవంతంగా లాక్కొచ్చాడు.

ఆఫీస్‍లో కూడా ఎవరో చేసిన తప్పులకు యాజమాన్యం తనను తప్పు పట్టి, తర్వాత తాము తప్పు చేసాము అని పశ్చాత్తాప పడిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అయినా జీవితంలో అలాగే పోరాడుతున్నాడు. తాను చేసే పనికి మంచి విలువ కట్టడం, తనని ఇతరులు మెచ్చుకోవడం అనే సంఘటనలు మోహన్ జీవితంలో చాలా తక్కువ. అందుకే మోహన్ తన జీవితంలో అన్నిటికీ తన భార్యనే సర్వస్వం అనుకున్నాడు. కానీ ఆమెనే దూరమయింది. తన జీవితం చీకటి మాయం అయ్యింది.

కానీ ఈ విషయం ఎవరికయినా కూడా ఎలా చెప్పగలడు. మోహన్‍కి తన జీవితంలో జరిగిన సంఘటనలు అన్నీ తన నమ్మకాన్ని బలపరుస్తున్నాయి. ఇతరులు ఎప్పుడు, తనను నమ్మకపోవడం, తక్కువ గానే అంచనా వేయడం తన విషయంలో సామాన్యంగా జరిగే విషయమే. ఇంత జరిగినా, మోహన్ తనలో తాను బాధ పడతాడు కానీ, ఎవరికీ చెప్పుకోడు. పైకి నవ్వుతు, నవ్విస్తూ, విలువలకు ప్రాముఖ్యతనిస్తూ జీవితం సాగిస్తున్నాడు. ఇతరులను ఇబ్బంది పెట్టకుండా, ఒక్కగానొక్క కొడుకుని అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. కానీ వాడు కూడా తప్పని పరిస్థితిలో అమెరికా వెళ్ళవలసి వచ్చింది. రవి ఎప్పుడు యేవో కొత్త కొత్త కంప్యూటర్ కోర్స్‌లు చేస్తూ ఉంటాడు. వాటి మీద బాగా స్టడీ చేసాడు. ఈ రోజుల్లా పిల్లలందరికీ కంప్యూటర్ గురించి అవగాహన ఎక్కువ. కానీ రవికి, తన ఆఫీస్‍లో మిగిలిన వాళ్ళ కన్నా కంప్యూటర్ పరిజ్ఞానం ఎక్కువ, అందువల్ల రవిని వాళ్ళ కంపెనీ వాళ్ళు ఎక్కువగా అమెరికాకు పంపిస్తారు.

ఇలాగే కొంత కాలం సాగింది. కానీ మాధవి కాలం చేసిన తర్వాత, మానసికంగా బాగా కుంగిపోయాడు. జీవితంతో పోరాడే శక్తి తనకు లేదు అనే నిర్ణయానికి వచ్చాడు. ఒంటరిగా మాధవి జ్ఞాపకాలలో ఉంటూ, కాలక్షేపం చేస్తున్నాడు. అందుకే ఈ సమయంలో తన జీవితంలోకి మరో మనిషి రావడానికి ససేమిరా ఒప్పుకోవడం లేదు మోహన్. ఈ విషయం ఒక్క సుందర్‍తో తప్ప ఎవ్వరితోను మాట్లాడడు.

తన బాధ ఎవరికో ఒకరికి చెప్పుకోవాలి కాబట్టి, మాధవితో పంచుకునే విషయాలు, సుందర్‍తో అప్పుడప్పుడు చెబుతుంటాడు. కొన్ని సందర్భాలలో సుందర్ కూడా తనను అర్థం చేసుకోడు, తప్పు పడుతుంటాడు, ఇంకా ఏవేవో మాటలు అంటూ ఉంటాడు. సుందర్, తన జీవితం లో పది సంవత్సరాల క్రితం బ్యాంకు ఉద్యోగం లోనే పరిచయమైన వ్యక్తి. తాను కూడా మోహన్ పనిచేసే బ్యాంకు లోనే పనిచేస్తున్నాడు. కానీ ఇద్దరికీ మంచి స్నేహం కుదిరింది. ముఖ్యంగా నమ్మదగ్గ వ్యక్తి. అందుకే మోహన్ తన పర్సనల్ విషయాలు కూడా సుందర్‍తో మాట్లాడుతూ ఉంటాడు.

***

మోహన్ ఆఫీసులో చాల బిజీగా పని చేసుకుంటున్నాడు. సుందర్ మోహన్ టేబుల్ దగ్గరకు వచ్చి మోహన్ తో, మోహన్ పెళ్లి గురించి మాటలు మాటాడటం మొదలుపెట్టాడు.

“ఒక సారి నీ పెళ్లి గురించి ఆలోచించు మోహన్” అన్నాడు సుందర్.

“వద్దురా, అసలు ఆ ప్రస్తావన తేవద్దు” అన్నాడు మోహన్.

“అలా కాదు, వయసు పెరిగిన తర్వాత ఎవరో ఒకరు తోడు ఉండాలి కదా. అందుకయినా చేసుకోవాలి, నీకు కూడా బాధ్యతలు తీరి పోయాయి, ఒక్కడివే ఉంటున్నావు, తోడు ఉండాలి” అన్నాడు సుందర్.

“నాకు ఇంకా 6 సంవత్సరాలు సర్వీస్ ఉంది, అది అయిపోతే, రిటైర్ అయ్యాక, మా పిల్లాడితో ఉంటాను, వాడు కూడా అమెరికాలో ఎక్కువ రోజులు ఉండదు” అన్నాడు మోహన్.

“మన రిటైర్మెంట్ లైఫ్‍ని అమెరికా లో గడపడం కన్నా, మనం విడిగా ఉండటమే మంచిది. ఎపుడైనా ఒకసారి చూసి రావడం వరకు పరవాలేదు” అన్నాడు సుందర్.

ఒక రకంగా సుందర్ చెప్పింది కూడా కరెక్టే అనిపించింది మోహన్‍కి. అలాగని ఈ వయసులో పెళ్లి ఏమిటి, అన్న ఆలోచనలో పడ్డాడు మోహన్.

లంచ్ చెయ్యడం పూర్తి అయింది, “ఇంక నేను బయలుదేరుతాను” అన్నాడు సుందర్ లేస్తూ.

“ఆ, అన్నట్టు” అని మళ్ళీ చెప్పబోయాడు సుందర్.

“ఇక నువ్వు బయలుదేరు” అన్నాడు మోహన్.

“కాదురా, ఒక్క మాట చెప్పని” అన్నాడు సుందర్.

“ఏంటి?” అన్నాడు మోహన్.

“సాయంత్రం మనం ఒక చోటికే వెళ్తున్నాం” అన్నాడు సుందర్.

“ఎక్కడికో చెప్పి ఏడు?” అన్నాడు మోహన్.

“చెప్పను, మనం వెళ్తున్నాం” అన్నాడు సుందర్.

***

చెప్పినట్లు గానే సాయంత్రం ఆఫీస్ టైం అయిపోగానే, మళ్ళా మోహన్ దగ్గరకు వచ్చాడు సుందర్.

“అబ్బా, ఏంట్రా ఇంకా ఆ కంప్యూటర్ ముందు కూచున్నావు, బయలుదేరు” అన్నాడు సుందర్ మోహన్‍తో.

“ఎక్కడికో చెప్పకుండా, ఎక్కడికని వెళ్ళాలి?” అన్నాడు మోహన్.

“నే తీసుకెల్తానుగా రా” అంటూ చెయ్యిపట్టుకు లాకెళ్ళాడు సుందర్, మోహన్‍ని.

ఒక అపార్ట్‌మెంట్‍లో, ఎవరింటికో తీసుకొచ్చాడు సుందర్, మోహన్‍ని.

“ఎక్కడికి రా, ఎవరింటికి వెళ్తున్నాం?” అడిగాడు మోహన్, సుందర్‍ని కొంచం అసహనంగా.

“లోపలి వెళ్ళాక పరిచయం చేస్తాను” అంటూ ఒక ఇంటి డోర్ బెల్ నొక్కాడు సుందర్.

ఒక ఆడమనిషి తలుపు తీసి కొంచం అనుమానంగా, సుందర్ వైపు చూస్తూ, “మార్నింగ్ ఫోన్‍లో అపాయింట్మెంట్ తీసుకుంది మీరేనా?” అంది అనుమానంగా.

“అవును మేడం” అన్నాడు సుందర్.

“రండి రండి, లోపలికి రండి” అంది, ఇద్దరినీ లోపలికి పిలుస్తూ.

మోహన్ ఏమి అర్థం కానట్టు చూసాడు.

మోహన్‍ని పరిచయం చేసాడు సుందర్. అలాగే ఆమెను కూడా పరిచయం చేసాడు మోహన్‍కు. “వీరు ఉషారాణి గారు. అందరు వీరిని ఉష అని పిలుస్తారు. ఇక్కడ యూనివర్సిటీలో సైకాలజీ ప్రొఫెసర్‍గా పనిచేస్తున్నారు” అన్నాడు

“నమస్తే అండి” అన్నాడు మోహన్.

“నమస్తే” అంది ఉషారాణి. ఆమె ను అందరు ఉష అని పిలుస్తారు.

ఇంక ఉష తన గురించి తానే చెప్పుకోవడం మొదలు పెట్టింది. “నేను ఇక్కడ యూనివర్సిటీలో సైకాలజీ ప్రొఫెసర్‍గా ఉన్నాను, మా వారు ఫిజిక్స్ ప్రొఫెసర్. నేను సోషల్ వర్కర్‍గా కూడా పని చేస్తున్నాను. అందులో భాగంగా కొన్ని పెళ్లిళ్లు కూడా చేసాను. కానీ నేను ఈ పెళ్లిళ్ల విషయంలో ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్నాను. అదేమిటంటే, పెళ్లి అయ్యి భర్త లేని వాళ్ళు, అలాగే పెళ్లి అయ్యి భార్య లేని వాళ్లకు పెళ్లిళ్లు ఏర్పాటు చేస్తూ ఉంటాను. భర్త చనిపోయినా లేదా విడాకులు తీసుకున్న ఆడ లేక మగవాళ్ళు, ఇలాటి వారిని ఒక వేదిక మీదకు తీసుకొచ్చి పరిచయాలు చేసి వాళ్ళు ఇద్దరు ఇష్టపడితే వాళ్లకు వివాహం జరుపుతాము. ఒకరి కొకరు తోడు గా ఉంటారు”.

ఉష గారు చెపుతున్న పద్ధతి కొంచం బాగానే ఉంది అనిపించింది సుందర్‍కు.

“కొంచం వివరంగా చెప్పండి మేడం” అన్నాడు సుందర్.

“సరే, ఇంతకు మీరు వచ్చిన విషయం చెప్పలేదు” అంది ఉష.

“ఏం లేదు మేడం, వీడు మోహన్, నా ఫ్రెండ్, బ్యాంకులో ఉద్యోగం” అంటూ మోహన్‍ను పరిచయం చేసాడు సుందర్.

“నమస్తే మేడం” చెప్పాడు మోహన్.

“చెప్పండి, విషయం ఏంటి?” అడిగింది ఉష.

“మావాడి వైఫ్ కాన్సర్‍తో మూడు సంవత్సరాల క్రితం చనిపోయింది మేడం. వీడికి ఒక అబ్బాయి. అబ్బాయికి పెళ్లి అయింది. అతని భార్య, ఒక పిల్లాడు అందరూ అమెరికాలో ఉంటారు. వాళ్ళ అమ్మ చనిపోయాక ఒకసారి ఇండియాకు వచ్చారు. వీడు ఒంటరిగానే ఉంటున్నాడు”.

“ఓకే” అంది ఉష.

“వీడికి, ఎవరైనా రెండో పెళ్లి వాళ్ళ సంబంధం చూసి, పెళ్లి చేయాలని ఆలోచన” అన్నాడు సుందర్.

“నాకు అలా చేసుకోవడం ఏమీ ఇష్టం లేదండి” అన్నాడు మోహన్.

“మరి నా దగ్గరకు ఎందుకు వచ్చారు?” అంది ఉష, ఆశ్చర్యంగా సుందర్ వైపు చూస్తూ.

“లేదు మేడం ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంది. మా వాడు పెళ్ళికి అంతగా ఇంటరెస్ట్ చూపించడం లేదు. కానీ మేము ఈ వయసులో ఒక తోడు ఉండాలి అని చెబుతున్నాము. వినడం లేదు. మీరైనా ఒక మాట చెబితే..” నసిగాడు సుందర్.

“చూడండి, నేను, వచ్చిన వాళ్ళను ఒప్పించి, వాళ్లకు పెళ్లి మీద ఇష్టాన్ని కలుగచేసి, పెళ్లిళ్లు చేయను. వాళ్లకుగా వాళ్ళు ఒకరినొకరు ఇష్టపడి, ఒప్పుకుని చేసుకుంటే, చేస్తాము. ఇంకా ఇరువైపులా వాళ్ళ పిల్లలు ఇష్టపడితేనే చేసుకుంటారా, ఇష్టపడక పోయినా చేసుకుంటారా అన్నది, చేసుకునే వాళ్ళ ఇష్టం” అంది ఉష కొంచం కోపంగా.

“అలాగే మేడం, మీరు ఎలా చెప్తే అలా చేస్తాం, మావాడికి పెళ్లి చేయండి మేడం” అన్నాడు సుందర్.

“అయితే ఒక పని చేద్దాం, వచ్చే నెలలో మేము ఒక ‘పరిచయ వేదిక’ ఏర్పాటు చేస్తాం, ఈలోగా మీరు మా దగ్గర రేపు మా ఆఫీస్‌లో రిజిస్టర్ చేసుకోండి, మీ డీటెయిల్స్ ఇవ్వండి. మీకు ముందుగా చెపుతాము, మీరు పరిచయ వేదిక ఏర్పాటు చేసిన రోజున రండి. అక్కడకు వచ్చిన వారిని చూసి, నచ్చిన వారిని సెలెక్ట్ చేసుకోవచ్చు” అంది ఉష.

సరే నంటూ బయటకు వచ్చారు సుందర్, మోహన్ లు.

“కనీసం ఒక్క మాట అయినా చెప్పలేదేంటి ఈమె దగ్గరకు వస్తున్నట్టు” అన్నాడు చిరాగ్గా.

“చెప్తే నువు వద్దంటావని” అన్నాడు సుందర్.

“నాకు అసలు పెళ్లి వద్దురా బాబు అంటే, ఈ గోల ఏంటి?” అన్నాడు మోహన్.

“కాదురా మోహన్, ఒక్క మాట విను, నీకా వయసు పెరుగుతోంది. వయసు పెరిగేదే కానీ తరిగేది కాదు. నీకు ఏ రోగమో, రోస్టో వస్తే సహాయానికి అయినా ఇంట్లో ఒక మనిషి ఉండాలికదా, దీనికి తోడు నువ్వు కూడా ఒక ఆడమనిషికి తోడు, నీడ ఇచ్చి సహాయమా చేసిన వాడివి అవుతావు, దానికోసమైన ఒప్పుకోవాలి” అన్నాడు సుందర్.

తనకు ఇష్టం లేక పోయినా, మరొకరికి సహాయ పడతాను కదా అని, “సరే ఏదో ఒకటి ఏడు” అన్నాడు మోహన్.

***

ఉష దగ్గర నుంచి ఫోన్ వచ్చింది సుందర్‍కు.

“ఎల్లుండి ఆదివారం నాడు, పరిచయ వేదిక ఏర్పాటు చేస్తున్నాము, మీకు ఇంట్రస్ట్ ఉంటే రావచ్చు” అంది సుందర్‍తో ఉష.

సుందర్ వెంటనే మోహన్‍కి ఫోన్ చేసి ఈ విషయం చెప్పాడు.

ఆదివారం ఉదయం వాళ్ళు చెప్పిన టైం కి ఒక పది నిముషాలు ముందు గానే చేరారు మోహన్, సుందర్ లు, ఉష వాళ్ళ ఆఫీస్‍కి.

వచ్చిన వాళ్లలో మగవాళ్లే ఎక్కువమంది ఉన్నారు ఆడవాళ్ళ కన్నా. మెచ్చుకోవాల్సిన విషయం ఏమంటే అందరూ చెప్పిన టైముకే వచ్చారు ఒక్క అయిదు నిముషాలు అటు ఇటుగా. వాళ్ళ ఆఫీస్ పద్ధతి ప్రకారం, ఒక చిన్న సైజు స్టేజి, దాని మీద ఒక యాంకర్ ఉన్నారు. యాంకర్ వాళ్ళ సంస్థ గురించి, సంస్థ యొక్క పద్ధతుల గురించి చెబుతోంది.

పేరు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు, స్టేజి మీదకు వచ్చి, ఎవరి గురించిన వివరాలు వాళ్ళు చెప్పాలి. వాళ్ళ రిజిస్ట్రేషన్ సీరియల్ ప్రకారం, పేర్లు మటుకు, వాళ్ళు పిలుస్తున్నారు. ఎవరి పేరు పిలిస్తే వాళ్ళు స్టేజి మీదకు వచ్చి వారి గురించి వివరాలు, అంటే, చేసే ఉద్యోగం, లేదా వ్యాపారం, పెళ్లి అయి ఎన్నాళ్ళు అయింది, ఇపుడు మరో పెళ్ళి కోసం ఎందుకు వచ్చారు, పిల్లలు ఏ ఊర్లో ఉన్నారు, ఏంచేస్తున్నారు, మొదలగు జనరల్ వివరాలు చెప్పాలి. మొగవాళ్ళు, ఆడవాళ్ళు ఇద్దరు ఈ వివరాలు చెప్పాలి. వీళ్ళు చెప్పిన వివరాలు నచ్చిన వాళ్ళు, ఉష గారి యాజమాన్యం ద్వారా సంప్రదించి ముందుకు వెళ్లొచ్చు.

మొత్తం మీద ఒక యాభయి మంది వచ్చి ఉంటారు, వాళ్లలో రిజిస్ట్రేషన్ చేసుకున్నవాళ్ళు ఒక ఇరవై మంది ఉంటారు. మోహన్ పేరు స్టేజి మీదకు రమ్మని పిలిచారు, కానీ మోహన్ స్టేజి మీదకు వెళ్ళలేదు. యాంకర్ ఇచ్చిన బ్రీఫింగ్ లోని వివరాలు మటుకు మోహన్ గురించి అందరికీ తెలిసాయి. మోహన్ లాగానే ఒకరు ఇద్దరు ఆడవాళ్లు స్టేజి మీదకు రాకుండా ఆగి పోయారు. స్టేజి మీదకు రాకుండా ఉన్న వాళ్ళ వివరాలు, పూర్తిగా యాంకర్ వద్ద ఉండవు. ఎవరి గురించి వాళ్ళే స్టేజి మీద చెప్పుకోవాలి. దాన్ని బట్టి తమకు కావలసిన జోడీని సెలెక్ట్ చేసుకోవచ్చు. మిగిలిన విషయాలు, ఉష మధ్యవర్తిగా ఉండి తర్వాతి కార్యక్రమం నడుపుతుంది. స్టేజి మీదకు వచ్చి, చెప్పిన వారి వివరాలు నచ్చితే, నచ్చిన వారి పేరు ఉషకు చెబితే, ఉష మధ్యవర్తి గాఉండి తర్వాతి కార్యక్రమం నడుపుతుంది.

“ఏరా, ఎవరైనా నచ్చారా?” మోహన్‍ని అడిగాడు సుందర్.

ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు మోహన్. ఈలోగా ఉష అటుగా వచ్చింది.

“నమస్తే మేడం” అన్నారు మోహన్, సుందర్ ఇద్దరు ఉషను ఉద్దేశించి.

“నమస్తే” అంటూ తన కేబిన్ లోకి వెళ్తూ వాళ్ళను కూడా రమ్మన్నది ఉష. మోహన్, సుందర్ ఇద్దరూ ఉష కేబిన్ లోకి వెళ్లారు.

వీళ్ళతో పాటు యాంకర్ కూడా ఉష కేబిన్ లోకి వచ్చి, నెమ్మదిగా ఉషతో ఏదో చెప్పింది.

“రమ్మను” అంది ఉష.

మీరు కూచోండి అంది ఉష, మోహన్, సుందర్ లని ఉద్దేశించి.

యాంకర్‍తో పాటు మరో ఇద్దరూ ఆడవాళ్లు కూడా ఉష కేబిన్ లోకి వచ్చారు.

“రండి, కూచోండి” అంది ఉష కుర్చీలు చూపిస్తూ, వాళ్ళ ఇద్దరినీ ఉద్దేశించి.

వాళ్లకు మోహన్ సుందర్ లను, బ్యాంకు ఉద్యోగస్థులు అంటూ పరిచయం చేసింది, ఆ ఆడవాళ్లను కూడా మోహన్, సుందర్ లకు పరిచయం చేసింది “ఒకరు రమ్య, మరొకరు కావ్య. ఇద్దరూ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్నారు” అంటూ.

నమస్తే చెప్పుకున్నారు నలుగురు ఒకరికి ఒకరు.

వాళ్ళను గమనించ సాగాడు మోహన్. ఇద్దరూ 45 – 50 మధ్య వారు వారు అయి ఉంటారు. ఒకరికి కొంచం జుట్టు తెల్లబడుతోంది. మోహన్ సుందర్ లను కూడా రమ్య, కావ్య ఇద్దరూ గమనించ సాగారు.

కాసేపు మామూలు మాటలు మాట్లాడుకున్న తర్వాత మోహన్, సుందర్ లను ఒక్క నిముషం బయట కూచోమని చెప్పి, రమ్య, కావ్య లతో మాట్లాడి వాళ్ళను పంపిన తర్వాత, మళ్ళా మోహన్ సుందర్ లను తన కేబిన్ లోకి పిలిచింది ఉష.

“చెప్పండి, మీకు ఎవరైనా నచ్చారా?” అడిగింది ఉష.

“మా వాడు స్టేజి మీదకు వెళ్లి తన గురించి ఏమి చెప్పలేదు కానీ, వచ్చి చెప్పిన వాళ్ళ వివరాలు జాగ్రత్త గా విన్నాడు” అన్నాడు సుందర్.

“ఇందులో తొందర పడకూడదు, మీకు కావాల్సినంత టైం తీసుకోండి, మేము పదిహేను రోజులకు ఒక సారి ఈ మాదిరిగా పరిచయ వేదిక ఏర్పాటు చేస్తాము. దాదాపు మొదటి, మూడవ ఆదివారం ఏర్పాటు చేస్తాము.

ఒకసారి మిస్ అయినా ఇంకో ఆదివారం మీరు రావచ్చు” అన్నది ఉష.

“మీరు గమనించే ఉంటారు, ఇప్పుడు వచ్చిన ఇద్దరు ఆడవాళ్ళలో ఒకరు మొగతోడు కోసం వచ్చారు. ఆమె పేరు కావ్య, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్‍లో ఆఫీసర్ గా పనిచేస్తోంది. వయసు షుమారు 50 ఉండవచ్చు. ఆమె భర్త, 25 సంవత్సరాలు గల కూతురు, కార్ ఆక్సిడెంట్‍లో చనిపోయారు. ఒక కొడుకు ఉన్నాడు, కానీ అమెరికాలో ఉంటాడు. ఈమెకు ఇంకా చాలా సర్వీస్ ఉంది, తనకు డబ్బుకు కొదవ లేదు. కొడుకు దగ్గరకు వెళ్ళలేదు, కొడుకు ఉద్యోగం వదిలి ఇండియాకు రాడు. కోడలితో కూడా సత్సంబంధాలు లేవు. ఈమెకు ఒక మగ తోడు కావలి. సెక్యూరిటీ కావాలి. సమాజంలో ఆడమనిషికి వివాహితురాలు అంటే కొంత సెక్యూరిటీ ఉంది. వివాహం కోసం కాకపోయినా సెక్యూరిటీ కోసమైనా, ఇంకా వయసు పెరిగే కొద్దీ, ఇద్దరికీ ఒకరికి ఒకరు తోడు కావాలి కాబట్టి, వివాహం చేసుకుంటారు. దాదాపు అందరు పిల్లల అనుమతి తోనే పెళ్లి చేసుకుంటారు. రెండు కుటుంబాలు కూడా పిల్లలతో సహా ఒక కుటుంబం లాగా కలిసిపోతారు.

మరి కొందరి విషయంలో, వివాహం చేసుకుంటే, ఆస్తుల విషయంలో రెండు కుటుంబాల మధ్యలో తగాదాలు వస్తాయేమోనని, వివాహం అయితే చేసుకోరు. బయట సమాజంలో భార్య భర్తలు గానే చెప్పుకుంటారు. ఒకే ఇంట్లోనే ఉంటూ భార్యాభర్తలు గానే కాపురం చేస్తారు. పిల్లల్ని మటుకు కనరు. ఒకవేళ ఇద్దరికీ మనసులు, అభిప్రాయాలు, అలవాట్లు, పద్ధతులు మొదలైనవి ఒకరివి మరొకరికి నచ్చకపోతే, ఒక ఇంట్లో ఇమిడి ఉండలేక పొతే, ఎవరి దారి వారిది. విడిపోతారు. కానీ ఇలాంటి కేసులు మాకు ఇంతవరకు అసలు రాలేదు. చాలావరకు, అందరు సంతోషంగా ఉన్నవారే ఉన్నారు” అని వివరించింది ఉష.

అంతా విన్న తర్వాత, “అలాగే మేడం, మేము అలోచించి చెబుతాం” అని లేచారు మోహన్, సుందర్.

“చూడండి, మీరు ఏదైనా మాట్లాడాలంటే, వచ్చే ఆదివారం మటుకే కుదురుతుంది. మిగిలిన రోజులలో నేను ఉండను, ఆఫీస్ స్టాఫ్‍కు చెప్పాల్సి ఉంటుంది” అని చెప్పింది ఉష.

“మేము వచ్చే ఆదివారం కలుస్తాం మేడం” అని సుందర్, మోహన్ ఇద్దరూ వెళ్లిపోయారు.

***

మోహన్ వాళ్ళు వెళ్ళగానే, రమ్య, కావ్య మళ్ళీ వచ్చారు. కావ్య, మోహన్ వివరాలు ఉషని అడిగింది.

కావ్య మోహన్‍ని ఉదయం నుంచి గమనిస్తూనే ఉంది. అతను చాల హుందాగా ఉంటాడు, పద్ధతిగా మాట్లాడుతున్నాడు, మంచి ఉద్యోగం, గౌరవనీయమైన కుటుంబం నుండి వచ్చాడు, బాధ్యతలు లేవు, ఒక్క కొడుకు కూడా అమెరికా లోనే ఉంటాడు. దాదాపు తన లైఫ్ స్టైల్ కి మోహన్ లైఫ్ స్టైల్ మ్యాచ్ అవుతుంది అనిపిస్తోంది. మరి అతని అభిప్రాయం ఏమిటో మరి. ఒకే, ఒక మాట ఉష గారికి చెబితే, వచ్చే వారం మీటింగ్ లో అప్పోయింట్మెంట్, మోహన్ గారి దగ్గర తీసుకుంటారు అనుకుంటూ,..

“మేడం” పిలిచింది కావ్య, ఉషని ఉద్దేశించి.

“ఆఁ, చెప్పండి..” అన్నది ఉష.

“ఏం లేదు మేడం, ఇందాక మీతో ఇద్దరు మాట్లాడారు కదా..” అని చెప్తోంది కావ్య.

ఈలోగా.. “ఆఁ.. మోహన్, సుందర్ లు..వాళ్లేనా..” అన్నది ఉష.

“అవును మేడం, మోహన్ గారి గురించి..” అంటూ నసిగింది కావ్య, అడగడానికి సిగ్గు పడుతూ.

“దానికి సంకోచం ఎందుకండీ, మేము చేసేదే మిమ్మల్ని మీకు ఇష్టమైన వాళ్ళతో కలపడం. అయితే అతనితో మీటింగ్ ఏర్పాటు చెయ్యమంటారా..?” అడిగింది ఉష.

కావ్య చెప్పేలోగానే, “ఒక పని చేస్తా, అతనికి ఫోన్‍లో మీ వివరాలు చెబుతాను, అతనికి ఇంటరెస్ట్ ఉంటే వచ్చే ఆదివారం రమ్మంటాను. అతను వస్తానంటే మీకు కూడా ముందుగానే ఫోన్ చేసి చెప్తాను, మీరు కూడా రావచ్చును. ఒకరి అభిప్రాయాలు ఒకరు మాట్లాడు కోవచ్చును” అన్నది ఉష.

“సరే మేడం..” అని చెప్పి అక్కడనుండి వెళ్లిపోయారు కావ్య, రమ్య.

***

మోహన్ ఆఫీస్ నుండి త్వరగా ఇల్లు చేరాడు. కాఫీ పెట్టుకుని తాగుదాం అని స్టవ్ దగ్గరకు వెళ్ళాడు. ఈలోగా కాలింగ్ బెల్ మోగింది.

“వస్తున్నా..” అంటూ వెళ్లి తలుపు తీసాడు.

“హాయ్ బాస్..” అంటూ ఎదురుగా సుందర్ ఉన్నాడు.

“రా రా..” అంటూ లోపలి రమ్మన్నాడు సుందర్‍ని మోహన్.

“ఏంట్రా.. కుస్తీ పడుతున్నావు, వంటింట్లో?” అంటూ వంటింటి వైపు తొంగి చూసాడు సుందర్.

“ఏంలేదురా.. ఉండు నీకు కూడా కాఫీ తెస్తాను..” అంటూ వెళ్లి సుందర్‍కి కూడా కాఫీ తెచ్చాడు.

సుందర్ కాఫీ చప్పరిస్తూ అడిగాడు మోహన్‍ని “ఏం ఆలోచించావు రా.. మొన్న వెళ్లిన పరిచయ వేదిక గురించి. ఎవరైనా నచ్చారా, లేదా కనీసం కనుసన్నల్లో ఉన్నారా, ఎవరి మీద అయినా ఒక ఐడియా వచ్చిందా?” అని.

“ఏమోరా, ఈవేమన్న పెళ్లి చూపులా, ఫలానా అమ్మాయి నచ్చింది అని చెప్పటానికి. ఈ వయసులో పెళ్లి అంటేనే ఏంటోగా ఉంది. అటువంటిది నచ్చడము, నచ్చకపోవడము ఏముంటాయి?” అన్నాడు మోహన్.

“ఒరేయ్.. ఈ డొంక తిరుగుడు వద్దు. ఫలానా వాళ్ళు అని ఒకరిద్దరిని ఐడియాలో ఉంచుకో, నీ జీవన శైలికి, నీ అలవాట్లకు కొంతవరకు మ్యాచ్ అయ్యేవాళ్ళు ఉంటారు, వాళ్లలో ఒకరిని ఎంపిక చేసుకోవచ్చు. ఇంకో మాట, వాళ్లకు కూడా నువ్వు, నీ అలవాట్లు, నీ జీవన శైలి, ఉంటే నీ డామినేటింగ్ నేచర్ మొదలైనవి నచ్చాలి రోయ్” అన్నాడు సుందర్.

“సరే గానీ, మనం బయలుదేరే ముందు ఇద్దరు లేడీస్ వచ్చారు కదా” అని సుందర్ అంటుండగానే..

మోహన్ అందుకుని.. “కావ్య, రమ్య” అన్నాడు.

ఆశ్చర్యం వేసింది సుందర్‍కు.

“వాళ్ళ పేర్లు భలే గుర్తున్నాయి రా..” అన్నాడు సుందర్.

“ఆఁ.. ఏంలేదు.. అక్కడకు వచ్చిన వాళ్ళలో కావ్య అన్న ఆవిడే కాస్త పద్ధతిగా ఉంది అనిపించింది” అన్నాడు మోహన్.

“అది కాదురా.. ఇందులో మొహమాటం ఎందుకు.. నీకు పర్లేదు అంటే చెప్పు నేను మాట్లాడుతాను” అన్నాడు సుందర్.

ఈలోగా మోహన్ ఫోన్ మోగింది.

“హలో..” అన్నాడు మోహన్

“హలో.. నేనండీ ఉషని. వచ్చే ఆదివారం మీరు ఫ్రీగా ఉంటారా, మా ఆఫీస్ కి రాగలరా?” అడిగింది ఉష.

“ఆ.. ఫ్రీ నే గానీ.. శుక్రవారం గానీ చెప్పలేమండీ ఆదివారం విషయం, ఇంత ముందుగా చెప్పాలంటే కష్టం, సామాన్యంగా ఆఫీస్ పని ఆదివారం నాడు ఉండదు, ఇంతకీ విషయం ఏమిటి చెప్పలేదు..” అన్నాడు మోహన్.

“ఏం లేదు సర్, మీరు వెళ్లే ముందు కావ్య గారు అని వచ్చారు కదా” అంది ఉష.

“ఆఁ.. ఎవరో ఇద్దరు ఆడవాళ్లు వచ్చారు” అన్నాడు పేర్లు తెలీదు అన్నట్లు.

“అదేనండి.. వాళ్ళలో కావ్య అన్న ఆవిడ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్‍లో పనిచేస్తుంది, మీరు వచ్చే ఆదివారం మా ఆఫీస్‍కు వస్తే వాళ్ళను మీకు పరిచయం చేస్తాను, మీరు మీరు మాట్లాడుకోండి, నేను కూడా ఉంటాను. నచ్చితే ఒకే అనుకోవచ్చు.

ఇక ఆస్తుల విషయంలో వాటాలు అడుగుతారు అనే భయం ఉంటే, అఫీషియల్‍గా వివాహం చేసుకోవద్దు, గవర్నమెంట్ రికార్డుల్లో ఎక్కడ, మీరు ఆమెకు భర్త అని వ్రాయొద్దు. సమాజంలో మీరు భార్యాభర్తలుగా చలామణి అవుతారు. ఇంట్లో మీ ఇష్టం, భార్యాభర్తలుగా ఉంటారో, లేదా కేవలం రూమ్ మేట్స్ లాగ ఉంటారో, అది మీరు నిర్ణయించుకోవచ్చు, ఇదే మాట ఆదివారం నాడు కలిసినపుడు, కావ్య గారికి కూడా చెబుతాను” అంది ఉష.

“అలాగేనండి, ఆదివారం వచ్చే సంగతి, నేను శుక్రవారం నాడు చెబుతాను” అన్నాడు మోహన్.

“ఓహ్.. కంగ్రాట్స్ రా.. ఆడబోయిన తీర్థం ఎదురొచ్చింది అన్నట్టు, వాళ్ళ విషయమే చెప్పేది ఉష గారు. అయితే వచ్చే ఆదివారం, ప్రోగ్రాం ఫిక్స్ అయినట్లే..” అన్నాడు సుందర్.

నవ్వి ఊరుకున్నాడు మోహన్.

“అయితే నేను వస్తాను రా” అని వెళ్ళిపోయాడు సుందర్.

***

శుక్రవారం నాడు.. ఉష మోహన్‍కి ఫోన్ చేసి అడిగింది, “ఆదివారం రావడానికి కుదురుతుందా” అని.

“అలాగే వస్తాము” అని చెప్పాడు మోహన్.

ఈ విషయం సుందర్‍కి కూడా చెప్పాడు మోహన్.

“అలాగే వెళదాం, అడగాల్సిన ప్రశ్నలన్నీ లిస్ట్ రాసుకో రోయ్” అన్నాడు సుందర్ మోహన్‍తో.

“సరే లేరా” అంటూ నవ్వాడు మోహన్.

***

ఆదివారం ఉదయం మోహన్ ఏం చేస్తున్నాడో ఏమో, త్వరగా, అంటేనే రెడీ అవడానికి గంట పడుతుంది వీడికి, అనుకుంటూ మోహన్ ఇంటికి వచ్చి వీడు రెడీ అవడానికి ఎంతసేపు పడుతుందో ఏమో, అనుకుంటూ బెల్ నొక్కాడు సుందర్.

మోహన్ వచ్చి తలుపు తీసాడు.

సుందర్‍కి పూర్తి గా ఆశ్చర్యం. అప్పటికే మోహన్ రెడీ అయి కూర్చున్నాడు, జస్ట్ వచ్చి తలుపు తీసాడు.

“ఏరోయ్, కావ్య గారంటే, బాగా ఇష్టం లాగా ఉందే, ఆదివారం నాడు వెంటపడి లేపిన పొద్దెక్కేదాకా నిద్రపోతావు, అలాంటిది అప్పుడే రెడీ అయ్యావు” అన్నాడు సుందర్ ఆశ్చర్యంగా.

“ఏం లేదురా, ఇవాళ టిఫిన్ మనం బయట చెయ్యాలి. అది పూర్తయ్యేసరికి టైం పడుతుంది కదా అని ముందుగా రెడీ అయ్యాను అంతే, స్పెషల్ ఏమి లేదు” అన్నాడు మోహన్.

“సరే పద, మా ఇంట్లో టిఫిన్ చేసి బయలుదేరుదాం” అన్నాడు సుందర్.

“ఎందుకు లేరా, బయట చేద్దాం” అన్నాడు మోహన్.

“కాదురా, మా ఇంటికి టిఫిన్‍కి పిలవడానికే, నేను ముందుగా వచ్చి నువ్వు ఏ స్థితిలో ఉన్నవో చూద్దాం అని వచ్చా” అన్నాడు సుందర్.

ఇద్దరు సుందర్ ఇంట్లో టిఫిన్ ముగించుకుని, ఉష వాళ్ళ ఆఫీస్‍కి బయలుదేరారు.

***

సుమారు పది గంటలప్పుడు, ఉష వాళ్ళ ఆఫీస్‍కి చేరారు మోహన్, సుందర్‍లు. అప్పటికే ఉష గారు వచ్చేసారు. కావ్య, రమ్య ఇద్దరు ఉష గారి కేబిన్‍లో మాట్లాడుకుంటున్నారు. మోహన్, సుందర్ ఇద్దరు ఉష ఆఫీస్‍కి చేరేసరికి, వీళ్ళ కోసమే ఎదురుచూస్తున్నట్టు, వెంటనే ఉష తన కేబిన్ లోకి రమ్మన్నది.

మోహన్, సుందర్‍లు ఉష కేబిన్ లోకి తలుపు తోసుకుని వెళ్లారు. అప్పటికే, కావ్య, రమ్య ఇద్దరు ఉన్నారు. వీళ్ళు మంచి టైమింగ్స్ మెయిన్‍టైన్ చేస్తారల్లే ఉందే అనుకుంటూ, ముగ్గురికీ, నమస్తే చెప్పారు మోహన్, సుందర్‍లు. వాళ్ళు కూడా ప్రతి నమస్కారాలు చేశారు.

కావ్య, మోహన్ లను ఒకరిని ఒకరికి మళ్ళా పరిచయం చేసింది ఉష, వారి మధ్య మొహమాటాని కొంచం తగ్గించాలని. మోహన్ గురించి కావ్యకి, కావ్య గురించి మోహన్‍కి, వాళ్ళు తనకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్‍ని షేర్ చేసింది.

“మోహన్ గారు, కావ్య గారు, మీరు ఇద్దరు ఒకరితో ఒకరు విడిగా మాట్లాడుకోవచ్చు, ఆ గదిలో మాట్లాడుకోండి, ముఖ్యంగా, నిర్మొహమాటంగా మీ అభిప్రాయాలూ, అలవాట్లు, మీ బలహీనతలు, ఒకరికి ఒకరు చెప్పుకోండి, అభ్యంతరాలు ఉంటే అప్పుడే, అక్కడే నిర్మొహమాటంగా చెప్పెయ్యవచ్చు” అంది ఉష.

“పర్లేదు మేడం” అన్నాడు మోహన్, కొంచం మొహమాటంగా.

“కాదు సర్, మీ అభిప్రాయాలూ నిరభ్యంతరంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మాట్లాడుకోకపోతే, తర్వాత ఇబ్బందిపడతారు. ఆ తర్వాత మీ తగాదాలు నేను తీర్చాలి” అంది నవ్వుతూ.

“కావ్య గారు, వెళ్ళండి, ఒంటరిగా మీరు మాట్లాడేవి ఉంటే మాట్లాడండి, ఇంకేమైనా చెప్పాలంటే, నా కేబిన్‍లో చెప్పవచ్చు” అంది ఉష.

ఇద్దరూ పక్క రూమ్ లోకి వెళ్లారు. రూమ్ విశాలంగా ఉంది. సోఫాలు ఉన్నాయి. AC ఉన్నట్టు ఉంది, గది చల్లగా ఉంది. ఇద్దరు చెరొక సోఫా మీద కూచున్నారు. కావ్య మౌనంగా ఉంది, ఇంకా మౌనంతో టైం వేస్ట్ చెయ్యకుండా, మోహన్ మాట్లాడటం మొదలు పెట్టాడు.

“మీరు ఫ్రీ గా ఉండండి, నాకు వాస్తవానికి, వివాహం చేసుకునే ఉద్దేశం లేదండి, ఒక్కడే కొడుకు, వాడు కూడా అమెరికా లో ఉంటున్నాడు, ఏ ఆరోగ్య సమస్యలొచ్చినా, ఒంటరితనంతో జీవితం గడపడం కన్నా ఒక తోడు ఉంటే బాగుంటుందని ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించాను. మిమ్మల్ని చూసే వరకు, వివాహం గురించి గానీ, కలిసి జీవించడం గురించి గానీ ఆలోచించ లేదండి. ఇక వెళ్ళిపోదాం అనుకుని, ఉష గారికి చెప్పి వెళదామని, వారి కేబిన్‍కి వచ్చినపుడు మిమ్మల్ని చూసాను” అన్నాడు మోహన్.

కావ్య తన గురించి చెబుతూ, “నా భర్త, కూతురు కార్ ఆక్సిడెంట్‍లో చనిపోయారు. కొడుకు అమెరికాలో ఉద్యోగం. ప్రస్తుతానికి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‍లో ఉంటున్నాను. లైఫ్‍లో ఒక సెక్యూరిటీ కావాలి, ఒక తోడు కూడా ఉండాలి అని ఆలోచించానండి, మా అబ్బాయి ప్రోద్బలం మీదనే ఈ సంస్థ లో రిజిస్ట్రేషన్ చేయించాను” అన్నది కావ్య.

ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడి, సరే అనుకున్నారు. బయటకు వచ్చి ఇద్దరికీ సమ్మతమే అన్న సంగతి ఉష గారికి చెప్పారు.

“నాదొక చిన్న సలహా, మీరు బయట సమాజంలో భార్యాభర్తలు గానే ఉండండి. కానీ గవర్నమెంట్ లెక్కలో మ్యారేజ్ రిజిస్ట్రషన్ చేయించకండి. భవిష్యత్తులో ఆస్తి తగాదాలు వచ్చే అవకాశం ఉంది. ఇద్దరు కలిసి ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ హ్యాపీగా ఉండండి. ఇంట్లో భార్యాభర్తలుగా ఉంటారో, లేదా రూమ్ మేట్స్ లాగ ఉంటారో అది మీ ఇష్టం అంది” ఉష.

కావ్య, మోహన్ లు ఇద్దరూ మౌనంగా ఉన్నారు.

“మరి మీ ద్వారా పరిచయమయినట్టు, వీరు భార్యాభర్తలుగా ఉండటానికి అంగీకరించినట్టు ఇద్దరి మధ్యన ఏదయినా అగ్రిమెంట్ చేయిస్తారా మేడం” అన్నాడు సుందర్.

“లేదండి, మీరు మా దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు, మా ఎదురుగా భార్యాభర్తలుగా ఉండటానికి అంగీకరించినట్టు మోహన్, కావ్య ఇద్దరికీ మా ఆఫీస్ తరుపున లెటర్స్ ఇస్తాము. మీరు ఇష్టపడితే, ఇక్కడ మా ఫార్మాలిటీ ప్రకారం పూలమాలలు ఒకరిచేత ఒకరికి వేయిస్తాము, తర్వాత మీరు మీకు నచ్చిన రీతిలో వివాహం చేసుకోవచ్చును” అన్నది ఉష..

ఈ పద్ధతికి అందరు సమ్మతించారు. రమ్య, సుందర్ ఇద్దరు హడావిడి పడి, వారం తిరిగే లోగ మోహన్, కావ్యల వివాహం ఉష వాళ్ళ ఆఫీస్ లోనే జరిపించి, వాళ్ళను భార్యాభర్తలుగా మార్చారు. కావ్య, మోహన్ ఉంటున్న ఫ్లాట్‌కు షిఫ్ట్ అవాలని ఆలోచిస్తోంది. తానే మోహన్‍ని ఎలా అడగాలా అని ఆలోచిస్తోంది. ఈలోగా మోహన్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది.

“కావ్య గారు, మీరు హాస్టల్ ఎపుడు ఖాళీ చేయాలనుకుంటున్నారు?” అడిగాడు మోహన్ కొంచం బిడియంగా.

“ఈ నెలాఖరుకు” అంది కావ్య కొంచం సిగ్గు పడుతున్నట్లుగా నెమ్మదిగా తక్కువ స్వరంతో మాట్లాడుతూ.

“మంచి రోజు చూసుకుని బయలుదేరుతారా?” అన్నాడు మోహన్.

“హాస్టల్ వాళ్లకు అకౌంట్ సెటిల్ చేసి, మంచి రోజు కూడా చూసుకుని వస్తాను” అంది.

“ఓకే ఓకే” అని ఫోన్ పెట్టేసాడు మోహన్.

ఇక ఇంటిదగ్గర మోహన్ హడావిడి మొదలయింది. రెండు బెడ్ రూమ్స్‌లో ఒక రూమ్ పూర్తిగా ఖాళీ చేసాడు. వంటిల్లు కూడా నీట్‍గా సర్దాడు. కావ్య ఇంక రెండు రోజుల్లో వస్తుంది.

రెండు రోజుల తర్వాత, మోహన్, సుందర్ ఇద్దరూ వెళ్లి, మంచి రోజు చూసుకునే, కావ్యను ఇంటికి పిలుచుకు వచ్చారు. రమ్య, కావ్య, మోహన్, సుందర్.. అందరూ హాల్లో కూచుని కబుర్లు చెప్పుకుంటున్నారు.

“ఇలా కాదురా మోహన్, మీ పెళ్లికి అందరినీ పిలిచి, మంచి ముహూర్తం చూసి సంప్రదాయబద్దంగా పెళ్లి జరిపించాలి” అన్నాడు సుందర్ కాఫీ తాగుతూ, ఎంతో హుషారుగా.

“సరేలేరా, నువ్వు మరీను” అంటూ తేలికగా తీసినట్లు మాట్లాడాడు మోహన్.

“లేదురా ఎందుకో తృప్తిగా లేదు” అన్నాడు సుందర్.

“అవునండి, మంచి ముహూర్తంలో పెళ్లి సంప్రదాయబద్ధంగా జరగాలి” అంది రమ్య.

తేలికగా నవ్వి ఊరుకున్నారు కావ్య, మోహన్‍లు.

కానీ సుందర్, రమ్య మ్యారేజ్ పార్టీ ఇవ్వాలని ఒకటే గొడవ. అలాగే కాసేపు కబుర్లు చెప్పి రమ్య, సుందర్ ఇద్దరూ వెళ్లిపోయారు.

కావ్య కోసం ఖాళీ చేసిన గది చూపించి తన సామాన్లు ఆ రూమ్‍లో పెట్టుకోమన్నాడు మోహన్. భోజనాలు బయటే హోటల్‍లో కానిచ్చేశారు కాబట్టి, భోజనం అయ్యాక నేరుగా ఇంటికి వచ్చారు.

సామాన్లు రూమ్‍లో పడేసి వంటిల్లు చూద్దాం అని వంటింట్లో కి వెళ్ళింది. వంటిల్లు నీటుగా సర్ది ఉంది. గిన్నెలు అన్ని కడిగి ఉన్నాయి. ‘పరవాలేదు వంటిల్లు శుభ్రంగానే ఉంచారు’ అనుకుంది.

***

“కాఫీ పెట్టమంటారా?” అడిగాడు మోహన్ కావ్యని, టైం చూసుకుంటూ.

“టైం సాయంత్రం నాలుగు అయింది” అన్నాడు మోహన్.

“నాకు సాయంత్రం టీ తాగే అలవాటు” అంది కావ్య ఇబ్బందిగా.

“నాకూ టీ తాగే అలవాటేనండి, మీరు కాఫీ తాగుతారేమో?” అని అడిగాను అన్నాడు మోహన్.

“నేను టీ పెడతాను ఉండండి” అంటూ ముందుకు వచ్చాడు మోహన్.

“వద్దు ఉండండి, నేను పెడతాను” అంటూ వంటింట్లోకి వెళ్ళింది కావ్య. టీ పట్టుకొచ్చింది కావ్య హాల్ లోకి.

కావ్య, మోహన్‍తో జీవనం గడపాలని వచ్చిందే కానీ, మనసులో భయం గానే ఉంది. మోహన్ ఎటువంటి వాడో, మంచి గానీ, లేదా చెడు గానీ అతని అలవాట్లు ఎలా ఉంటాయో, తొందరగా చిరాకు పడతాడో, లేదా నిదానస్తుడో, ఏదయినా కొన్ని రోజులు గడిస్తేనే గానీ తెలీదు, కొత్త మనిషితో కొత్త జీవితం. తాను ఇలా ఆలోచిస్తోంది కానీ మోహన్ పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది కదా అనుకుంది. కాసేపు రెస్ట్ తీసుకుందాం అని ఎవరి రూమ్స్ లోకే వాళ్ళు వెళ్లి తలుపు వేసుకున్నారు.

సుమారు సాయంత్రం ఏడు గంటలప్పుడు హాల్ లోకి వచ్చి సోఫా లో కూచున్నాడు మోహన్. ఆలోచనలో పడ్డాడు రాత్రికి ఫుడ్ సంగతి ఏమిటి. ఏంచెయ్యాలి, అనుకుంటూ. ఇంతలో కావ్య కూడా హాల్ లోకి వచ్చింది. “రండి” అంటూ పిలిచాడు మోహన్ కావ్యని.

“నన్ను మీరు అండి” అనకండి అంది కావ్య సోఫాలో కూచుంటూ.

“లేదు లెండి” అన్నాడు మొహమాటంగా మోహన్.

“అలా కాదు మీరు నాకన్నా పెద్దవారు కదా, నన్ను కావ్య అని పిలిస్తే చాలు” అంది కావ్య, నెమ్మదిగా నవ్వుతూ.

“మరి రాత్రికి మీల్స్ బయట చేద్దాం” అన్నాడు మోహన్.

“లేదండి నేను వంట చేస్తాను” అంది కావ్య.

“వద్దండి, ఈరోజుకి బయట భోజనం చేద్దాం, వస్తూ కూరలు కూడా తెచ్చుకుందాం, ఇక రేపటినుండి ఇంట్లోనే చెయ్యవచ్చు” అన్నాడు మోహన్.

“సరే” అంది కావ్య ఇక కాదనలేక.

“మీరు పొద్దున్నే లేవగానే కాఫీ నా, లేక టీ తాగుతారా?” అడిగాడు మోహన్.

“మొదటి సారి మటుకే కాఫీ, ఇక తర్వాత అంతా టీ నే” అంది కావ్య.

“ఓకే గుడ్, అయితే కాసేపాగి నేను వెళ్లి, కూరలు తెస్తాను, మీరు ఈలోగా రెడీ అవండి, ఎనిమిది గంటలకు బయటకు వెళ్లి భోజనం చేసి వద్దాం” అన్నాడు మోహన్.

“సరే” అంది కావ్య.

ఇద్దరూ బయటకు వెళ్లి భోజనం చేసి వచ్చి ఎవరి గదిలో వాళ్ళు పడుకున్నారు.

***

మరుసటి రోజు ఉదయం, ముందుగా లేచి కాఫీ పెట్టేసి, కావ్య రూమ్ తలుపు తట్టాడు మోహన్.

“గుడ్ మార్నింగ్, కాఫీ రెడీ” అన్నాడు మోహన్ కావ్యని ఉద్దేశించి.

తాను ముందుగా లేవనందుకు కొంచం సిగ్గుపడింది కావ్య,. తనే లేచి కాఫీ పెట్టి ఉంటె ఎంత బాగుండేది, అంటూ తనను తాను తిట్టుకుంది.

గబా గబా వెళ్లి బ్రష్ చేసుకుని వచ్చేసింది. కాఫీ తాగడం అవ్వగానే, స్నానం చేసి వచ్చి, దేముడికి దీపం పెట్టి, ఇక వంటింట్లోకి వెళ్ళింది. తనకన్నా మోహన్ ముందు ఆఫీసుకి వెళ్తాడు. ఇద్దరికీ లంచ్ బాక్స్ రెడీ చేసింది. మోహన్ ఇంటి డూప్లికేట్ కీ ఒకటి కావ్యకి ఇచ్చాడు. మోహన్ కన్నా కావ్య ముందుగా ఇంటికి వస్తుంది.

ఇలా ఆరు నెలలు గడిచాయి. ఇద్దరూ ఎవరి గదుల్లో వాళ్ళు ఉంటున్నారు. సహజీనవనం మటుకే సాగుతోంది. ఒకరిని ఒకరు అర్థం చేసుకున్నారు. ఒకరి అలవాట్లు ఇష్టాలు, ఇంకొకరు, తెలుసుకుని, ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ రోజులు గడిపారు. ఇద్దరి పిల్లలూ వీడియో కాల్స్ చేసి మాట్లాడుతుంటారు. ఎవరి పిల్లలు మాట్లాడినా, ఇద్దరు వీడియో కాల్ అటెండ్ అవుతున్నారు. ఇలా చేయడం వలన, ఇద్దరి ఫ్యామిలీల పిల్లలు వీళ్ళ ఇద్దరికీ దగ్గరయ్యారు. నిజముగా తాళి కట్టి కావ్యను, మోహన్ వివాహం చేసుకోక పోయినా, బయట సమాజానికి వీళ్ళు ఇద్దరు భార్యర్యాభర్తలు అనే చెప్పుకుంటున్నారు. కేవలం తాళి కట్టలేదన్న మాటే గారి, వాళ్ళు భార్యాభర్తలు లాగానే ఉంటున్నారు. ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి ఎవరి దారి వారిది అవుతుందేమో, అన్నట్టు లేదు మోహన్, కావ్యల ప్రయాణం. ప్రశాంతంగా ఒకరిని ఒకరు గౌరవిస్తూ రూమ్ మేట్స్ లాగానే జీవనం సాగిస్తున్నారు.

మోహన్ కూడా ఏరోజు, కావ్యతో అసభ్యంగా ప్రవర్తించడం జరగలేదు. చాల హుందాగా ఉంటాడు. తన పరంగా ఆలోచిస్తే తన భార్యను ఎప్పటికీ మరచి పోలేదు. కానీ జీవితంలో ఒక తోడు కోసమే, సహజీవనం గడుపుతున్నాడు. కావ్య పరిస్థితి కూడా ఇలాగే ఉంది. తనకు సమాజంలో ఒకరి భార్యగా ఒక గుర్తింపు, సెక్యూరిటీ కావాలి. అది తాను పొందగలిగింది. ఇది చాలు అనుకుంది కావ్య.

రోజులు గడిచే కొలదీ ఒకరి మీద ఒకరికి చనువు పెరిగింది. ప్రతిరోజూ కావ్యనే ఇంటికి ముందుగా వస్తుంది. మోహన్‍కు ప్రతిరోజూ బ్యాంకులో లేట్ అవుతుంది. ఎనిమిది గంటలకు గానీ ఇల్లు చేరడు. మోహన్ వచ్చేవరకు, కావ్య టీవీ తోనే కాలక్షేపం చేస్తుంది. తనకి తెలీకుండానే కావ్య మోహన్ కోసం సాయంత్రం యేడు గంటల నుంచే ఎదురు చూడటం మొదలుపెట్టింది. మోహన్ వచ్చేవరకు టీ తాగకుండా కూచుంటోంది. ఆఫీస్ నుండి వచ్చిన మనిషి తాను అలాగే ఉండకుండా స్నానం చేసి, ఫ్రెష్‍గా ముస్తాబు అయ్యి, మోహన్ కోసం ఎదురు చూస్తోంది. మోహన్ ఇంటికి రాగానే ఎంతో ప్రేమతో ఎదురు వచ్చి లాప్టాప్ బాగ్, లంచ్ బాక్స్ అందుకుంటుంది. స్నానానికి నీళ్లు రెడీ చేసి, మోహన్ రూమ్ లోకి చనువు గానే వెళ్లి మోహన్ టవల్ తెచ్చి ఇస్తోంది. దాదాపు ఇది రోజు ఇలాగే జరుగుతోంది. కావ్య నోటితో చెప్పకుండా మోహన్‍ని భర్తగా ఇష్టపడుతోందని, చేతలలో చెబుతోంది. కావ్య పనులలో అంతరార్థం మోహన్ గ్రహించాడు. కావ్య తనకు దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తున్నట్టు అర్థమయింది.

మోహన్‍కి కూడా కావ్య అంటే ఇష్టం. కానీ ఎలా చెప్పగలడు. ఆఫీస్‍లో పని త్వరగా ముగించుకుని ఎనిమిది గంటలకు కాకుండా, యేడు గంటలకు ఇల్లు చేరేటట్లు, ఇంటికి రావడం మొదలుపెట్టాడు. ఇంటికి రాగానే సీరియస్‍గా తన రూమ్ లోకి వెళ్లిపోకుండా, హాల్‍లో కూచుని, టీ తాగుతూ కావ్యతో కబుర్లు చెప్పడం మొదలు పెట్టాడు. కావ్యని, షాపింగ్‍కు వెళదామని తానే అడిగి, ఇద్దరూ కలిసి, షాపింగ్, మార్కెట్ మొదలైన అన్నిపనులు, కలిసి వెళ్లి, కలిసి రావడం మొదలుపెట్టారు. ఇంటి పనులలో కూడా కొంచం ఇదివరకు అలవాటు అయింది కాబట్టి, కావ్యకి సహాయ పడుతున్నాడు. దాదాపు ఇద్దరు ఒకరిని ఒకరు అర్థం చేసుకుని, ఒకరికి ఒకరు చెప్పుకోక పోయినా భార్యాభర్తల లానే మెలగసాగారు.

ఒకరోజు కావ్యని చూడటానికి, కావ్యకి పిన్నిగారు అవుతారు, పిన్ని బాబాయ్ గారు వచ్చారు. వాళ్ళు నాలుగు రోజులు పని మీద వచ్చారు. వాళ్ళు కావ్య పిన్ని వాళ్ళు కాబట్టి, మోహన్, వాళ్ళ కోసం రెండు రోజులు సెలవు పెట్టి, కావ్య మీద ఉన్న ఇష్టాన్ని రుజువు చేసుకోడానికి ప్రయత్నిస్తున్నాడు. వాళ్ళు వచ్చిన పని పూర్తి చేయడానికి సహాయ పడుతున్నాడు. వాళ్ళను హాల్‍లో పడుకోమని చెప్పలేక, మోహన్ చొరవ తీసుకుని వాళ్ళ పిన్ని, బాబాయ్ లను కావ్య రూంలో ఉండమని చెప్పాడు. కావ్యని తన రూమ్ లోనే సర్దుకోమన్నాడు. కానీ మోహన్ మటుకు రాత్రిళ్ళు హాల్లో ఉన్న సోఫాలో పడుకున్నాడు.

కావ్య వాళ్ళ పిన్ని బాబాయ్ వెళ్ళిపోయిన తర్వాత పది రోజులకే అమెరికా నుండి మోహన్ కొడుకు రవి భార్య పిల్లాడితో వచ్చారు.

రవి వాళ్ళు, అమెరికా నుంచి వచ్చినప్పుడు కూడా, కావ్య రూమ్‍ని వాడుకునే వారు. అప్పుడు కూడా మోహన్ పడక, హాల్లోనే. కానీ, మోహన్ ఇలా సోఫాలో పడుకోవడం, మోహన్ కొడుకు రవికి నచ్చలేదు. పైగా తన తండ్రి పేరుకు, ఒక తోడుని తెచ్చుకున్నాడు కానీ, భార్యను తెచ్చుకోలేదు అనుకున్నాడు. ఇదే విషయం రాత్రి భోజనం చేసేటప్పుడు కావ్య, మోహన్‍లు ఇద్దరితోను మాట్లాడి, వాళ్ళను సంప్రదాయబద్ధంగా ఒక మంచి ముహూర్తంలో వివాహం చేసుకోడానికి ఒప్పించాడు. రవి కావ్యతో కూడా ప్రత్యేకంగా మాట్లాడి, కావ్యకి తన నిర్ణయం మీద ఏ అభ్యంతరం లేదని తెలుసుకున్నాడు. కావ్య మోహన్ లు ఇద్దరు ఒకరిమీద ఒకరు ఇష్టపడుతున్నారు కాబట్టి రవి ఇష్టానికి ఇద్దరూ అడ్డు చెప్పలేదు. తర్వాత అమెరికాలో ఉన్న కావ్య కొడుకు, కోడలిని కూడా వీడియో కాల్‍లో మాట్లాడి ఒప్పించాడు.

రవి ఆలోచనకు తోడుగా, సుందర్, రమ్యలు కూడా రవిని సపోర్ట్ చెయ్యడంతో కావ్య, మోహన్‍ల జంటకి సంప్రదాయబద్ధంగా ఒక మంచి ముహూర్తంలో దేముడి సన్నిధిలో వివాహం జరిగింది. కావ్య కొడుకు, మోహన్ కొడుకు కూడా వీళ్ళ పెళ్లిలో అందరితో సంతోషాన్ని పంచుకున్నారు. ఉష వాళ్ళ ఆఫీస్‍లో కలిసినా, దేముడి సన్నిధిలో భార్యాభర్తలుగా మారినందుకు కావ్య మోహన్ లకు తృప్తిగా అనిపించింది. గత ఆరు నెలలుగా ఒకరిని ఒకరు పూర్తిగా అర్థం చేసుకున్నారు కాబట్టి, వాళ్ళ కాపురం ఏ ఇబ్బంది లేకుండా సజావుగా సాగాలని కావ్య, మోహన్ లు మనస్ఫూర్తిగా దేముడికి నమస్కరించి ఒకటయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here