దేశ విభజన విషవృక్షం-19

0
4

(భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గత సంవత్సరం ఆగస్ట్ 14ను దేశ విభజన భయానక జ్ఞాపకాల సంస్మరణ దినంగా ప్రకటించారు. ఆ పిలుపు ఆధారంగా సంచిక తెలుగు పాఠకుల కోసం అందిస్తున్న విశేష వ్యాస పరంపర ఇది. దేశ విభజనకు దారితీసిన కారణాలను మూలాలనుంచి పరిశోధించి, విశ్లేషిస్తూ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న వ్యాస పరంపర ఇది.)

[dropcap]హి[/dropcap]సామ్ ఖాన్ హత్య అనంతరం బహ్లుల్ అనుంగు అనుచరుడు హమీద్ ఖాన్ అధికారంలోకి వచ్చాడు. అటు బహ్లుల్ క్రమంగా తన లోఢీ కుటుంబానికి చెందిన బంధువులను ఒకరి తరువాత ఒకరుగా ఢిల్లీ ఆస్థానంలోకి చొప్పించాడు. బహ్లుల్ బంధువులంతా నెమ్మదిగా మహమ్మద్ సుల్తాన్ రాజ్యంలో ముఖ్యమైన స్థానాల్లో చేరుకొన్నారు. సయ్యద్ వంశానికి చెందిన సుల్తాన్‌కు దాదాపు ఊపిరి సలపనంత స్థితిలోకి ఒక్కొక్కరూ చేరారు. సంపద, అధికారం, ఆధిపత్యం ఎంత ఉన్నప్పటికీ సుల్తాన్‌కు సవాళ్లు ముప్పిరిగొనడం ప్రారంభమయ్యాయి. బహ్లుల్ నెమ్మదిగా విజృంభించడం మొదలైంది. ఢిల్లీకి చుట్టుపక్కల ఉన్న రాజ్యాలపైకి దండెత్తాడు. ఒక్కొక్కదాన్ని స్వాధీనం చేసుకోవడం మొదలుపెట్టారు. ముందుగా మల్వా రాజు హహమ్మద్ ఖిల్జీ పై దండెత్తాడు. మహమ్మద్ ఖిల్జీ హన్సీ, నాగోర్, హిసార్ ఫిరోజా ప్రాంతాలను కలుపుకొని పరిపాలించాడు. ముందుగా ఈ ఖిల్జీ బహ్లుల్ చేతిలో ఓడిపోయాడు. అరేబియానుంచి భారత్ దాకా జరిగిన ప్రతి ఇస్లాం దాడుల్లో మాదిరిగానే ఈ దాడిలోనూ యాజ్ యూజువల్‌గా అత్యాచారాలు, మానభంగాలు, పురుషుల హత్యలు, స్త్రీల అపహరణలు, బానిసలు.. వంటివి రొటీన్‌గా జరిగిపోయాయి. బహ్లుల్ విజృంభణను గమనించిన సుల్తాన్ అతడి దూకుడును తగ్గించడం కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. ఏదో నెపం పెట్టి అతడిని ప్రశంసించసాగాడు. ’ఖాన్ ఖన్నన్’ అని ఒక బిరుదు కూడా బహ్లుల్‌కు కట్టబెట్టాడు. కానీ.. బహ్లుల్ దృష్టి అంతా ఢిల్లీ పీఠం పైనే ఉన్నది. అప్పటికే ఢిల్లీలో పాతుకుపోయిన లోఢీలు ఎక్కడికక్కడ తమను తామే స్వతంత్రులుగా ప్రకటించుకోవడం మొదలుపెట్టారు. లాహోర్, దిల్పాల్ పూర్, సన్నాం, హిసార్ ఫిరోజా ఇట్లా ఒకదాని తరువాత ఒకటిగా సుల్తాన్ చేతుల్లోంచి లోఢీల చేతుల్లోకి వెళ్లసాగాయి. తాము స్ట్రాంగ్ అయ్యామని లోఢీలు ఒక తొందరపాటు నిర్ణయానికి వచ్చి సుల్తాన్‌పై తిరుగుబాటు చేశారు. ఢిల్లీ కోటను దిగ్బంధించారు. కానీ.. తొందరగానే కోటను విడిచి పెట్టాల్సివచ్చింది. బహ్లుల్ తిరిగి సర్హిండికి వెళ్లినప్పటికీ తనను తాను సుల్తాన్‌గా ప్రకటించేసుకొన్నాడు.

సుల్తాన్ మహమ్మద్ ఈ సమయంలోనే చనిపోయాడు. అతని కొడుకు అల్లావుద్దీన్‌కు కిరీటం లభించింది. కానీ అప్పటికి డిల్లీ అధికార పరిధి బాగా కుంచించుకుపోయింది. చాలా పరిమిత భౌగోళిక ప్రాంతానికే రాజ్యాధికారం కొనసాగింది. ఢిల్లీ చుట్టుపక్కల, దేశంలోని అనేక ప్రాంతాల్లోనూ వివిధ ముస్లిం గ్యాంగ్ లీడర్లు తమ బలమున్నంత మేర పరిపాలించసాగారు. కొన్ని కొన్ని చిన్న చిన్న ప్యాకెట్లలో మాత్రం హిందూ రాజులు అధికారంలో ఉన్నారు. భూల్గావ్, పాటియాలా, కాంపిల్ ప్రాంతాలు రాయ్ ప్రతాప్ చేతిలో ఉన్నాయి. కానీ భారత్‌పై ఎప్పుడైతే ఇస్లాం దాడులు పెరిగిపోయాయో.. అప్పట్నుంచి కూడా దేశంలో పరిపాలన అనేది అస్తవ్యస్తమైంది. అడ్మినిస్ట్రేషన్ పిచ్చోడి చేతిలో రాయిలా మారింది. అత్యంత క్రూరమైన అణచివేతలు, అంతులేని వేధింపులు, అత్యంత పాశవికమైన దాడులు, అడ్డూఆపూ లేని చొరబాట్లు.. ఎడతెగని రీతిలో అమానవీయ కార్యకలాపాలు. మునుపెన్నడూ.. ఎక్కడా.. కనీసం కలలో కూడా కనీవినీ ఎరుగని రీతిలో జనజీవనం.. ఏ రోజుకారోజు గడవటమే గగనం. ఇవాళ బతికున్నామా అంటే బతికి ఉన్నాం, అంతే. ఎప్పుడు ఎవడు ఇంటిమీదికి వస్తాడో.. ఆడవాళ్ల ఒంటిమీదకు దూకుతాడో.. ఎవరిని చంపుతాడో.. ఎవరిని బలాత్కరిస్తాడో.. ఎవరిని బానిసలుగా మారుస్తాడో తెలియని పరిస్థితి. ఇవాళ మనం సంపాదించుకొన్నది మనది అవుతుందో కాదో తెలియని దుస్థితి. అనార్కిజం, అటోక్రసీ, శాడిజం.. అన్నీ కలగలిపి పోతపోస్తే.. ఎంత భయంకరంగా ఉంటుందో.. ఆ నాటి భారత్ పరిస్థితి అలాగా ఉన్నది. జంతు న్యాయం అనేది ఒకటున్నదట. జంతువులకు తన పర భేదం లేదు. తనకు ఆహారం కనిపిస్తే వెంటాడి వేటాడటమే దాని పని. భారతదేశంలో ఇస్లాం రాజరిక వ్యవస్థలో ప్రతి అంకంలోనూ మనకు కనిపించేది ఇదే. వీళ్లకు నీతి నియమం లేదు. అధికారంలోకి రావడమొక్కటే లక్ష్యం. సంపదను అనుభవించడమే జీవితం. ఈ అనుభవానికి అడ్డొచ్చేవాళ్లను నిర్దాక్షిణ్యంగా తొలగించడం ఒక ప్రహసనంలా కొనసాగింది. ఈ పరిస్థితిలో.. బతుకటమే కష్టమైన దుస్థితిలో ఒక సామాన్య పౌరుడు ఏం చేయగలడు మతం మార్చుకోవడం తప్ప. తన బిడ్డలకు ముసుగు వేయక ఏం చేయగలడు? అతనికి వేరే ఆప్షన్ అంటూ ఏమున్నది? ఇంత ఘోరమైన దమనకాండ జరిగితే.. భారతదేశంలో శాంతి స్థాపనలో భాగంగా.. భారతీయుల్లో అగ్రవర్ణాల దాష్టీకాలనుంచి బయటపడటానికి మత మార్పిళ్లు జరిగాయని రాయడానికి హిస్టరీ హిపోక్రాట్లకు మనసెలా ఒప్పింది? ఏ ఇస్లాం రాజ్య వ్యవస్థనైనా తీసుకొండి.. ఎవరో రాసుకొన్న చరిత్రలను కూడా నమ్మనే నమ్మవద్దు. ఆయా రాజులు తమ గొప్పలు చెప్పుకొంటూ రాసుకొన్న బయోగ్రఫీలను, ఆటో బయోగ్రఫీలను చదవండి.. బాబర్ నామాలు, అక్బర్ నామాలు, ఘజ్నీనామాలు.. ఘోరీ నామాలు ఇలా చాలా ఉన్నాయి కదా.. పరిశీలించండి. ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తీసుకొండి. యథాతథంగా అర్థం చేసుకోండి. వాళ్ల కాలంలో వాళ్ల ఆస్థానాల్లో పనిచేసిన వాళ్లు రికార్డు చేసిన అంశాలను అధ్యయనం చేయండి. ఏ ఒక్క రాజైనా ఒక్కడంటే ఒక్క రాజైనా సవ్యంగా సుపరిపాలన చేశాడా? పేరుకు ఏర్పడే వ్యవస్థలు కూడా రాజ్యాన్ని, ప్రజల క్షేమం కోసం కాకుండా.. రాజు క్షేమమే పరమావధిగా పనిచేసే క్రూరమైన వ్యవస్థలవి.

లోఢీలు బలపడిన కొద్దీ అల్లావుద్దీన్‌కు ముప్పు పెరిగిపోయింది. తన తండ్రి మాదిరిగానే బహ్లుల్ అల్లావుద్దీన్ మీద కూడా విరుచుకుపడ్డాడు. కానీ అల్లావుద్దీన్ బహ్లుల్‌ను నిలువరించడంలో సక్సెస్ అయ్యాడు. తండ్రి మాదిరిగానే.. కొడుకునూ ఓడించలేక బహ్లుల్ తిరిగి సర్హిండికి వెళ్లిపోయాడు. కానీ.. అల్లావుద్దీన్ మాత్రం ఈ దాడితో వణికిపోయాడు. బహ్లుల్‌ను వెనక్కి పంపించాడే తప్ప సుల్తాన్ సింహాసనం పట్ల అవిధేయత అన్నది అతడికి నిద్ర పట్టకుండా చేసింది. కిరీటంతో కూడిన తన మస్తకాన్ని ఖడ్గంతో తెగ్గొట్టేసినట్టుగా ఫీలయ్యాడు. వెంటనే రాయ్ ప్రతాప్‌ను పిలిపించాడు. కుత్బ్ ఖాన్ లోఢీని పిలిపించాడు. ఇద్దరితో సుదీర్ఘంగా మంతనాలు సాగించాడు. వాళ్లు మొట్ట మొదట ఇచ్చిన సలహా ఏమిటంటే.. ముఖ్యమంత్రి హమీద్ ఖాన్‌ను తొలగించడం. జైల్లో పెట్టించడం. అల్లావుద్దీన్ వెంటనే వాళ్ల సలహా పాటించాడు. ఢిల్లీకి దగ్గరలో ఉన్న బుర్హానాబాద్‌లో హమీద్ ఖాన్‌ను చెరలో పెట్టాడు. రాయ్ ప్రతాప్ మాత్రం హమీద్ ఖాన్‌ను హతమారుస్తానని పట్టుబట్టాడు. ఎందుకంటే ఈ హమీద్ ఖాన్ తండ్రి రాయ్ ప్రతాప్ రాజ్యాన్ని ధ్వంసం చేసి.. అతని భార్యను కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. హమీద్ ఖాన్‌ను హతమార్చడానికి ఉత్తర్వులు జారీ అయ్యాయి. కానీ, అతని సోదరులు.. గార్డులకు లంచమిచ్చి హమీద్ ఖాన్‌ను తప్పించారు. అప్పటివరకు మాలిక్ మహమ్మద్ జమాల్ కస్టడీలో ఉన్న హమీద్ ఖాన్ తప్పించుకోవడంతోనే జమాల్ పట్టు సడలింది. అతడి ఇంటిపై దాడి జరిగింది. ఈ దాడిలో అతడు చనిపోయాడు. అతని అనుచరులు చాలామంది హమీద్ ఖాన్‌కు విధేయులుగా మారిపోయారు.

అల్లావుద్దీన్ ఢిల్లీ నుంచి బదౌన్ సందర్శనకు వెళ్లిన సమయాన్ని అవకాశంగా తీసుకొన్న హమీద్ ఖాన్ సుల్తాన్ అంతఃపురం నుంచి అతడి భార్యలను, కొడుకులను, కూతుళ్లను బయటకు తీసుకొచ్చి.. ఎర్రకోట ఎదుట గుండు చేయించి నిలబెట్టాడు. రాజుగారి ఖజానాను దోచుకొన్నాడు. ఢిల్లీ కోటను దిగ్బంధించాడు. ఈ అవమానాన్ని అల్లావుద్దీన్ తట్టుకోలేకపోయాడు. వర్షాకాలం అయిపోయేదాకా వేచిచూసి.. హమీద్ ఖాన్ పైకి దాడికి సైన్యాన్ని పంపించాడు. ఈ విషయాలన్నింటినీ గమనించిన బహ్లుల్.. అందివచ్చిన అవకాశాన్ని చేజార్చుకోలేదు. రెండు ప్రత్యక్ష యుద్ధాల్లో ఓడిపోయిన తాను.. ఈసారి హమీద్ ఖాన్‌ను ముందు పెట్టుకొని ఢిల్లీలోకి చొరబడ్డాడు. హమీద్ ఖాన్ అనుమతి తీసుకొని.. ఢిల్లీలోని పలు ప్రదేశాలలో తన ఆఫ్గనిస్తాన్ వీరులను మోహరించి పెట్టాడు. ఇప్పుడు అమెరికా ప్రపంచ మంతటా తన సైనిక బేస్ లను ఏర్పాటు చేసుకొన్నదే.. అచ్చం అలాగే. అమెరికా ఎలాగైతే తన అవసరాన్ని బట్టి సైనిక బేస్ లను వాడుకొంటుందో.. బహ్లుల్ కూడా అలాగే రెడీ చేసి కాచుకొని కూచున్నాడు. తాను బాగా పాపులర్ కావాలన్న ఉద్దేశంతోపాటు.. తన పొజిషన్‌ను మరింత బలోపేతం చేసుకోవాలన్న లక్ష్యంతో హమీద్ ఖాన్ ఒకరోజు బహ్లుల్ అతని ఆఫ్గన్ సైనికులను మందుపార్టీకి పిలిచాడు. బహ్లుల్ ఈ పార్టీని మంచి అవకాశంగా మలచుకొన్నాడు. తన అనుచరులకు ఎప్పుడు ఏం చేయాలో.. ఎలా ప్రవర్తించాలో అంతా పక్కాగా ట్రైన్ చేశాడు. అనుకొన్నట్టుగానే పార్టీ ధూంధాంగా మొదలైంది. ముషాయిరా నడుస్తున్నది. రౌండ్ ట్రేలలో మందు గ్లాసులను బానిసలు ఒక్కొక్కరి దగ్గరకు వచ్చి అందిస్తున్నారు. ఉన్నట్టుండి దావత్‌లో కలకలం రేగింది. ఇద్దరు ఆఫ్గన్ వీరులు హమీద్ ఖాన్ ముందు వచ్చి పిచ్చివాళ్లలాగా, మూర్ఖుల్లాగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. బట్టలు చించుకోసాగారు.. పిచ్చి పిచ్చిగా అరవసాగారు. వాళ్లలో ఒకడు తన బూటు తీసి హమీద్ ఖాన్ పైకి విసిరాడు. దీంతో ఒక్కసారిగా కంగారు పడ్డ హమీద్ ఖాన్ ఏం జరుగుతోందని లేచి నిలబడ్డాడు. దీంతో శాంతించిన ఆ ఇద్దరు ఆఫ్గన్ వీరులు.. ‘ఏమీ లేదు.. దొంగలు దోపిడీ చేయకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకొంటున్నాం’  అన్నారు. అంతే కాదు. అక్కడ ఉన్న రెడ్ కార్పెట్‌ను చూపించి ఈ కార్పెట్ చాలా బాగున్నది. దీన్ని మాకు ప్రసాదించండి.. మేం మా ఊరికి తీసుకొనిపోయి మా పిల్లలకు టోపీలు కుట్టించుకొంటాం అని అడిగారు. దాంతో సంతోషించిన హమీద్ వారికి అనేక కానుకలిస్తానని హామీ ఇచ్చాడు.

ఈ డ్రామా ఇంతటితో ముగియలేదు. బహ్లుల్ అనుచరులైన ఆఫ్గన్లు.. పాన్ (తాంబూలం)లను నమిలి ఎక్కడ పడితే అక్కడ ఉమ్మివేయడం మొదలుపెట్టారు. ట్రేలలో మందు తెస్తున్న సీసాలపైన, గ్లాసుల్లోనూ.. చివరకు మందులోనూ ఉమ్మివేయసాగారు. ఏమవుతుందో అర్థం కాని హమీద్ బహ్లుల్‌ను నిలదీశాడు. బహ్లుల్ చాలా కూల్‌గా నువ్వేం వర్రీ కాకు.. వాళ్లు తినడం, చనిపోవడం తప్ప ఇంకేం తెలియని వాళ్లు అని కొట్టిపారేశాడు. కొద్ది సేపటి తరువాత హమీద్ ఖాన్‌ను తరచూ లోపలికి రమ్మని బహ్లుల్ పిలువసాగాడు. ఒకానొక మంచి సమయంలో బయట వేచి ఉన్న ఆఫ్గన్‌లు పెద్ద ఎత్తున అరవడం.. హమీద్ గార్డులను కొట్టడం.. గొడవ చేయడం మొదలుపెట్టారు. హమీద్ ఒక్కసారి బయటకు వచ్చి ఏం జరుగుతోందని గట్టిగా అరిచాడు. ముందుగా అనుకొన్న ప్లాన్ ప్రకారం ఆఫ్గన్‌లు, బహ్లుల్‌ను తిట్టడం మొదలుపెట్టారు. అతని సేవకులుగా ఉండలేమని తమను లోపలికి వచ్చేందుకు అనుమతించాలని కోరారు. విషయం అర్థం చేసుకోలేని హమీద్ వాళ్లందరినీ లోపలికి రానిచ్చాడు. అంతే సంగతులు.. హమీద్ ఖాన్ చుట్టూ ఆఫ్గన్ వీరులు నిలబడ్డారు. అతిథులు భోజనాలు చేసిన వెంటనే.. హమీద్ ఖాన్ అనుచరులను బయటకు పంపించేశారు.

‘kutb khan lodi drew forth a chain from his bosom and laid it before hamid khan saying “the best thing for you will be to retire from public life. As I have eaten your salt I do not intend to put you to death” after this he caused hamid khan to be seized and gave him incharge to his officers’ (nia matulla’s Tarikh I Khan Jahan Lodi)

కుత్బ్ ఖాన్ లోఢీ హమీద్ ఖాన్ దగ్గరకు వచ్చి.. అతడి మెడలోని హారాన్ని తీసి అతని ముందుంచి.. కింద కూర్చొని.. ‘ఇక నీవు ప్రజా జీవితం నుంచి రిటైర్ కావడం మంచిది. నేను నీ ఉప్పు తిన్నవాడిని కాబట్టి నిన్ను మృత్యు కుహరంలోకి తోయలేను’ అని అన్నాడు. ఆ తరువాత హమీద్ ఖాన్‌ను అరెస్టు చేయాలని.. సంబంధింత అధికారులకు అప్పగించాలని ఆదేశించాడు.

రాజ్యం కోసం ఇంత సినిమాటిక్‌గా జరిగిన డ్రామాను అదీ ఎర్రకోట సాక్షిగా జరిగిన అరాచకీయ నాటకాన్ని ఎవరూ ఇంత వరకూ సినిమాగా ఎందుకు తీయలేదో మరి..

సీన్ కట్ చేస్తే.. ఏప్రిల్ 19, 1451 బహ్లుల్ ఢిల్లీ సుల్తాన్‌గా పట్టాభిషక్తుడయ్యాడు.

లోడీ వంశ పరిపాలన మొదలైంది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here