[తెలుగు సాహిత్యం పట్ల కొన్ని తరాలలో ఆసక్తి రగిలించి, ఆధునిక తరానికి వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్తూ, యువతకు ఉత్తమ సాహిత్యం ద్వారా ఉత్తమ వ్యక్తిత్వాన్నివ్వాలని నిరంతరం తపించే యువభారతి సంస్థ స్థాపించి వచ్చే దసరాకు 60 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు సాహిత్యానికి, సమాజానికి యువభారతి చేసిన సేవను తెలుగు పాఠకులకు పరిచయం చేసే ఉద్దేశంతో ప్రతి ఆదివారం సంచికలో యువభారతి ప్రచురించిన పుస్తకాల పరిచయం వుంటుంది. ఈ శీర్షిక వచ్చే సంవత్సరం విజయదశమి వరకూ సాగుతుంది.]
అమృత భారతి
[dropcap]భా[/dropcap]రత స్వాతంత్ర్య రజతోత్సవాల సందర్భంగా 1947 నుండి 1972 సంవత్సరం వరకు – ఈ పాతికేళ్లలో తెలుగు సాహిత్య ప్రస్థానంపై లబ్ద ప్రతిష్ట కవి, పండిత, విమర్శక, పరిశోధకుల చేత వ్యాసాలను సేకరించి ‘మహతి’ ప్రచురణను తీసుకువచ్చింది. అది ఆనాటినుండి ఈనాటి వరకు బృహత్తరమైన అద్భుత గ్రంథంగా సాహితీ ప్రియుల మన్ననలను అందుకొంటూనే ఉంది.
యాభై ఏళ్ళ తరువాత, ఇప్పుడు భారత స్వాతంత్ర్య అమృతోత్సవాల సందర్భంగా – 1972 నుండి 2022 వరకు ఈ ఐదు దశాబ్దాలలో దేశంలో చోటు చేసుకున్న సామాజిక రాజకీయ పరిణామాలతో పాటు, తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియలు, ఇతర నూతన అంశాల గురించి ఈనాటి ప్రసిద్ధ కవి, పండిత, విమర్శక, పరిశోధకుల చేత వ్యాసాలను వ్రాయించి మీకు అందించిన వ్యాస సంకలనమే ఈ ‘అమృత భారతి’.
ఈ గ్రంథంలో సుప్రసిద్ధ సామాజిక వేత్త, ‘లోక్ సత్తా’ అధినేత శ్రీ జయప్రకాశ్ నారాయణ గారు కడచిన ఏబదేండ్లలో దేశ సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిణామాలను విశ్లేషిస్తూ విశిష్టమైన వ్యాసాన్ని అందించారు. సాహిత్య ప్రక్రియలలో భాగంగా, పద్యకవిత ప్రస్థానంపై శ్రీ బులుసు వేంకటేశ్వర్లు గార్లు, గేయ కవిత్వ ప్రస్థానంపై డా. వడ్డేపల్లి కృష్ణ గారు చక్కని వ్యాసాలను అందించారు. వచన కవిత్వంపై డా. ఎస్ రఘు గారు విస్తారమైన విశ్లేషణతో వివిధ కవితా రీతులను వివరించారు.
కడచిన ఐదు దశాబ్దాలలో పుంఖానుపుంఖాలుగా వెలువడి పాఠకులకు చేరువైన కథలు, నవలల గురించి డా. ముక్తేవి భారతి గారు, శ్రీ కస్తూరి మురళీకృష్ణ గారు బహు విధాంశాలను ప్రస్తావిస్తూ విస్తృతమైన వ్యాసాలను రచించి అందించారు.
సుప్రసిద్ధ విమర్శకులు ఆచార్య ఎస్.వి.రామారావు గారు తెలుగు సాహిత్య విమర్శన ప్రస్థానాన్ని విశదీకరించారు. జాతీయవాద సాహిత్యంపై సుప్రసిద్ధ కవి, విమర్శకులు, ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు, బాల సాహిత్యంపై ఆ రంగంలో విశేష కృషి సల్పిన డా. పత్తిపాక మోహన్ గారు సాధికారమైన వ్యాసాలను అందించడం ముదావహం. ప్రముఖ కవి శ్రీ సబ్బని లక్ష్మీనారాయణ గారు రచించిన వ్యాసంలో తెలుగు సాహిత్యంలో గత మూడు నాలుగు దశాబ్దాలలో విరివిగా వెలువడిన మినీ కవితా రూపాలను గూర్చి వివరించబడింది.
ఈ ‘అమృతభారతి’ నేటి తెలుగు సారస్వత విద్యార్థులకు అదునాతనామ్శాల ప్రస్థానాల పరిశోధన, అధ్యయనాలకు పట్టుగొమ్మగానే గాక, రాబోయే తరాల యువతకు, సాహితీ ప్రియులకు అత్యంత ప్రీతి పాత్రమౌతుందని యువభారతి విశ్వాసం.
క్రింద ఇవ్వబడిన link ను క్లిక్ చేసి ఈ పుస్తకాన్ని ఉచితంగానే చదువుకోండి.
https://archive.org/details/amruthabharathi-12.8.2022-1
లేదా క్రింద ఇవ్వబడిన QR code ను scan చేసినా ఆ పుస్తకాన్ని ఉచితంగానే చదువుకోవచ్చు.