స్వాభిమానం

0
3

[సంచిక 2022 దీపావళి పోటీకి అందిన కథ.]

“బాబాయ్ , నేను గోపీని..”

“ఆ.. చెప్పరా గోపీ, ఎలా ఉన్నారు నువ్వూ, కోడలు..” అడిగాడు జనార్ధన్.

ఫోన్లో నరహరి పెద్దకొడుకు గోపి చెప్పిన వార్త విన్న జనార్ధన్‌కి కళ్ళు చీకట్లు కమ్మాయ్. మనసు మొద్దు బారినట్లయింది. స్తబ్ధుగా కూర్చుండి పోయాడు.

భార్య కరుణ “ఏమిటండీ ఎవరూ?” అని అడిగితే, కొన్ని క్షణాల తర్వాత అస్పష్టంగా చెప్పాడు జనార్ధన్ “గోపీ..” అని.

మాట్లాడలేక పోతున్న భర్తను చూసి గభాల్న అతని చేతిలో ఉన్న ఫోన్‌ని తీసుకుంది కరుణ.

గోపీ పేరు చూసి, తనే కాల్ చేసింది “ఏమిటి బాబూ విషయం?” అని.

“అవును పిన్నీ, నాన్నగారికి రాత్రి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, హాస్పిటల్‌కి.. తీసుకెళ్తుంటే.. మధ్యలోనే..” గోపీ గొంతు దుఃఖంతో నిండిపోయింది.

మారు మాట్లాడలేకపోయింది, ఫోన్ ఆఫ్ చేయటం కూడా మర్చిపోయి నట్లుండి పోయింది కరుణ.

తేరుకుని భర్త వైపు చూసింది.. రెండు శరీరాల్లో ఉన్నదీ ఒకటేప్రాణం అన్నంత ఆత్మీయ స్నేహితులు వాళ్లు జనార్ధన్, నరహరి.

భర్తకు దగ్గరగా వెళ్ళింది కరుణ. కనులునిండి తొణుకుతున్న అతని కన్నీటిని తుడుస్తూ, “నాకూ రావాలని ఉంది. నిన్నటి నుండి మన ప్రభకు జ్వరం కదా.. అమ్మాయిని వదిలేసి ఇద్దరం వెళితే ఎలా అనిపిస్తోందండీ.. ప్రదీప్ కూడా ఇంటి దగ్గర లేడాయే.. మీరు వెళ్లి రండి. మంచి వ్యక్తి, మనకు ఎంతో ఆత్మీయుడు, ఇంత తొందరగా దూరమైపోతారనుకోలేదు..” కన్నీళ్ళతో చెప్పింది కరుణ.

దోసిట్లో మొహం దాచుకుని రోదిస్తున్నాడు జనార్ధన్.

కరుణ ఒక జత బట్టలు, టూత్ బ్రష్, టవల్, టాబ్లెట్స్.. బ్యాగ్‍లో పెట్టింది. జేబులోడబ్బులు, మొబైల్ ఫోన్ పెట్టి “బయలుదేరండి.. బండి టైమౌతుంది.” అంది.

యాంత్రికంగా లేచాడు జనార్దన్.

విజయవాడ నుండి విశాఖపట్నంకు ట్రైన్లో కూర్చున్నాడే గానీ, కళ్లలోనూ మనసులో నరహరి రూపం, ఆతని మాటలు, అతనితో పరిచయం అన్నీ కళ్ళముందు కదలాడుతున్నాయ్..

***

హైస్కూల్ నుండి కాలేజీ వరకు ఇద్దరిదీ కలసి సాగిన మైత్రీయాత్ర!

విజయవాడ పరిసరాల్లోని చెరొక గ్రామం నుండి వచ్చి ఒకే హైస్కూల్‌లో చదివి.. తర్వాత ఒకే కాలేజీలోనే చేరి చదివారు. డిగ్రీతో తను ఆగిపోతే, యూనివర్సిటీని కూడా చూశాడు నరహరి.

ఆ తర్వాత.. నరహరి ప్రభుత్వంలో ఉన్నతోద్యోగిగా విశాఖలో, తానేమో ఒక ప్రైవేటు సంస్థలో చిరుద్యోగిగా విజయవాడలోనే జీవితంలో స్థిరపడి పోయారు. ఐనా, ఆ హెచ్చుతగ్గులు గానీ, ఆర్థిక స్థితిగతులు కానీ, తామిద్దరి మధ్య ఏనాడు అడ్డు కాలేకపోయాయి.

వీలయినప్పుడు కలుసుకోవటం.. తరచూ ఫోన్లో కష్టసుఖాలు పంచుకో వటం చేస్తూనే ఉన్నారు.

నిన్న సాయంత్రం ఎప్పట్లానే ఫోన్లో మాట్లాడినప్పుడు ఆఖర్లో అన్నాడు – “రేపోసారి డాక్టర్ను కలవాలిరా!” అని.

“ఏరా.. ఆరోగ్యం బాగాలేదా?” ఆందోళనగా అడిగాడు తాను.

“బాగా లేదా.. అంటే.. అంత కాదు గానీ.. ఏదో అనీజీగా ఉంటోందిరా..”

ఆ మాటలకు, తాను చిరుకోపంతో అన్నాడు “రేయ్! మూడు రోజులుగా నువు ఇదే మాట చెప్తున్నావ్, రేపు నువు డాక్టర్ని కలువ్. డాక్టర్ని కలిశాకనే నాతో మాట్లాడు. లేకపోతే వద్దు” అని.

‘హరీ.. డాక్టర్ను కలవకపోతే, నాతో మాట్లాడ వద్దన్నాను కనుక.. ఇంక శాశ్వతంగా నాతో మాట్లాడకుండానే వెళ్ళిపోయావా? నాకింతటి శిక్ష వేశావేంటిరా..’ ధారాపాతంగా కారుతున్న కన్నీటిని తుడుచుకుంటూ, గుక్కపట్టి ఏడ్చే గుండెను పెదవుల బిగింపుతోనే నొక్కు కోసాగాడు జనార్దన్.

***

ఆత్మీయుల కన్నీటి వీడ్కోలుతో.. నరహరి భౌతిక ప్రస్థానం ముగిసింది. జనార్ధన్ మూగవాడిలా మౌనంగా యాంత్రికంగా నరహరి కొడుకులతో పాటు ప్రాణసఖుని అంతిమ యాత్రలో పాలుపంచుకున్నాడు. తిరిగి వెళ్ళటానికి సిద్ధపడుతున్న జనార్ధన్‍తో, నరహరి కొడుకులిద్దరు గోపి, రాజాలు వచ్చి చెప్పారు.

“బాబాయ్, మీరు అప్పుడే వెళ్ళద్దు. మీరిద్దరు శరీరాలు రెండైనా, ఒకే ప్రాణంలా ఉండేవారని తెలుసు. రేపు చిన్నకర్మ అయ్యేదాకా ఉండండి. మళ్లీ పెద్దకర్మకు ఒకరోజు ముందే రావాలి” అని.

జనార్ధన్ ఆగిపోయాడు.

ఎవరితో మాట్లాడాలనిపించట్లేదు. గడ్డకట్టిన మౌనంలా ఉన్నాడు.

***

మర్నాడు చిన్న కార్యక్రమం ఐపోయి.. ఏదో భోజనం అయిందనిపించాక, బయలుదేరబోతుంటే, రాజా అన్నాడు “బాబాయ్, ఒకసారి లోపలికి రండి”.

అతనితో పాటు లోనికి నడిచాడు.

‘ఈ ఇంట్లో ఎంత చనువుగా, కలుపుగోలుగా, స్వంత ఇల్లులా సంచరించే వాడిని! ఒక్కరోజులోనే ఏమిటో… కొత్తగా, అపరిచితంగా ఉందేమిటి? హరీ.. నువ్వు వెళ్ళిపోయి, నన్ను ఒంటరివాడ్ని, పరాయివాడ్ని చేశావు గదరా..’ అనుకున్నాడు లోలోన.

“కూర్చోండి బాబాయ్” కుర్చీ చూపాడు గోపి. జనార్ధన్‌తో పాటు, రాజా కూడా కూర్చున్నాడు.

గోపీ తన ఒళ్ళోఉన్న ఒక డైరీలో పెట్టి ఉన్న రెండు కాగితాలను చూపుతూ “చూడండి బాబాయ్, నాన్నగారు ఎవరికైనా డబ్బులిచ్చినా, ఎవరివద్ద నైనా తీసుకున్నా, ముఖ్యమైన ప్రతి దాన్ని దీనిలో రాస్తారు. కానీ, ఈ రెండు కాగితాల ప్రసక్తి ఎక్కడా లేదు డైరీలో, పై పెచ్చు ఈ కాగితాలపై పెన్‍తో నిలువుగా ఇంటూ మార్క్ పెట్టారు.. మా సందేహం ఏమంటే.. ఇవి మీరు రాసినవే. అంటే.. మీరు డబ్బులు నాన్నగారికి తిరిగి ఇచ్చేశారా?” అడిగాడు గోపీ.

జనార్ధన్ ఆ కాగితాలు అందుకుని, చూడసాగాడు..

అన్న మాటలకు కొనసాగింపుగా రాజా అందుకుని “మీరు ఇచ్చేసి ఉంటే నాన్నగారు ఆ కాగితాలు చింపేసి పారేసి ఉండేవారు కదా. ఇంకెందుకు ఉంచుతారు బాబాయ్?” అని అడిగాడు.

“రూపాయి విషయంలో నాన్నగారికి ఏ మాత్రం జాగ్రత్త ఉండదు..” విసుగ్గా అన్నాడు గోపీ.

జనార్ధన్ ఆ కాగితాలను తిరిగిచ్చేస్తూ “రాజా అన్నమాటే నిజం గోపీ! నేను ఇవ్వలేదు. వాడేదో పరాగ్గా అలా గీతలు గీసి ఉంటాడు, ఇస్తాను” అన్నాడు.

“సరే బాబాయ్.. మీరు మాత్రం కాస్త ఒకటి రెండు రోజులు ముందుగానే రండి. మీకు తెలియంది కాదుకదా.. ఎన్ని అవసరాలుంటాయో..?” అన్నాడు గోపీ.

జనార్ధన్‍కి అర్థమైంది వాళ్ల భావం.

“అలాగే!” నంటూ లేచి, లోపలికి వెళ్ళి, నరహరి భార్యకు కనిపించి.. తిరుగు ప్రయాణమయ్యాడు.

***

“అదేంటి? ఆ కాగితాల గురించి జరిగిన అసలు సంభాషణను మీరు వాళ్లకు వివరించ లేదా?” ఆందోళనగా అడిగింది కరుణ.

భార్య వైపు చూసి నవ్వాడు జనార్ధన్. ఆ నవ్వులో వేదనో, రోదనో, విరక్తో.. ఏదెక్కువగా ఉందో.. తెలీలేదామెకు.

“చెప్పాలనిపించ లేదు” అన్నాడు.

“ఆ మాత్రం కూడా ఆలోచించలేక పోయారా వాళ్ళు?” దిగులుగా అందామె.

మౌనంగా ఉండి పోయాడు.

“కానీ.. ఇప్పటి మన పరిస్థితికి ఏభై వేలు అప్పుతెచ్చి.. దానికి నెల నెలా పదిహేనువందల వడ్డీకట్టడం అంటే, ఎంత..” అంటున్నదామె.

భార్యను వారిస్తూ.. అన్నాడు “నా మనసు బాగాలేదు, వదిలేయ్.”

కరుణ కాసేపు మౌనంగా కూర్చుని, మెల్లగా లేచి వెళ్ళిపోతుంటే, ఆమె చేయి పట్టి ఆపాడు. మళ్లీ కూర్చుని ఏంటన్నట్లు చూసిందామె.

“కరుణా! మన ఆర్థిక స్థితికి ఏభై వేల అప్పు, దానికి వడ్డీ కట్టటం ఎంత అశనిపాతం లాంటిదో నాకు మాత్రం తెలియదా?” అడిగాడు.

“……………”

“అయినా సరే.. హరికీ నాకు మధ్య ఉన్న అనుబంధాన్ని చూపి.. చెప్పి.. ఋణవిముక్తుడిని కావాలనుకోను. ఆ ఆలోచనే నాకు వెగటుగా ఉంది.. వాడే ఒకసారి అన్నట్లు రూపాయిలతో మామధ్య అనుబంధాన్ని కొల్చుకోలేను. మన పరిస్థితి అంటావా.. నీకో జోక్ చెప్పనా?”

“………………”

“నాలాంటి కుచేలచక్రవర్తి ఒకతను జ్యోతిష్కుని వద్దకెళ్లి తనకున్న ‘ఇన్ని కష్టాలు ఎప్పటికి తొలగిపోతాయ’ని అడిగాడట. ‘ఇంకో ఆరునెలలు ఓపిక పట్టమ’ని చెప్పాడా జ్యోతిష్కుడు. ‘తర్వాత నాకన్నీ మంచిరోజులేనా?’ ఆశగా అడిగాడతను. ‘కాదు బాబు! అప్పటికి నీవు బాగా కష్టాలకు అలవాటు పడిపోతావ్’ అన్నాడట.” చెప్పి నవ్వాడు జనార్ధన్.

భర్త నవ్వులోని భావం అర్ధమైన కరుణ నవ్వలేక పోయింది. నిశబ్దంగా లేచి వెళ్ళిపోయింది.

***

జనార్ధన్ జరిగిన సంఘటనలు మరోసారి మననం చేసుకోసాగాడు.

తన ఆర్థిక పరిస్థితి ఎప్పటికప్పుడు అత్తెసరు బాపతే. వచ్చే కొద్దిపాటి జీతంతోనే బతుకుబండి నడపాలి. ఇద్దరు పిల్లల చదువులు.. ఖర్చులు మధ్య మధ్యలో తొంగిచూసే అనారోగ్యాలతో, వచ్చే జీతం రాళ్ళ కెప్పుడూ తగులే కానీ, మిగులెప్పుడూ ఉండేది కాదు.

ఆ మధ్య కరుణ గర్భసంచిలో ఏదో ఇబ్బంది వచ్చి, ఆపరేషన్ చేపిస్తున్నానని తెలిసి.. అడగకనే ముప్పై వేల రూపాయిలు పంపాడు నరహరి.

మరోసారి.. “పిల్లలిద్దరూ కాలేజీ చదువులు కదా.. వాళ్ళ బుక్స్, బస్ చార్జీలకు వాడుకోమని.. ఇవ్వరా!” అంటూ ఇరవైవేలు పంపించాడు.

తానెప్పుడూ నోరు తెరచి అడగనే లేదు “డబ్బులు సర్దరా” అని.

మాటల సందర్భంలో విన్నవాటికే అవసరమనుకుని ఆదుకునేవాడు. అందుకే హరితో మాట్లాడేప్పుడు తను డబ్బు అవసరాలను సాధ్యమైనంత వరకు తమ సంభాషణలో దొర్లకుండా జాగ్రత్త పడేవాడు.

తనోసారి నరహరి దగ్గరకు వెళ్లినపుడు మాటల్లో అడిగాడు తనని “ఏరా.. ఏమైనా ఇబ్బందిగా ఉందా, అత్యవసరపు ఖర్చులేమైనా ఉంటే, మొహమాట పడక చెప్తూ ఉండు.” అని.

తను నవ్వుతూనే అన్నాడు “రేయ్! నన్ను మరీ యాచకుడుగా మార్చబోకురా” అని.

“నోర్ముయ్ వెధవా, పెద్ద డైలాగు లేస్తున్నావ్. అవసరంలో ఉన్నవాళ్లంతా యాచకులు అవుతారా? మరయితే నాకు బైపాస్ సర్జరీ చేసేప్పుడు రక్తం ఎక్కించాలంటే, నువ్ ఎందుకురా ఇచ్చావ్? కొనుక్కునే స్తోమతు నాకు లేదనా?” అడిగాడు నరహరి.

“దానికీ దీనికీ పొత్తు పెట్టకురొరేయ్” తేల్చేశాడు తను.

“డబ్బులదేముందిరా.. వస్తుంటాయి పోతుంటాయి.. చేతిలో ఉండబట్టేగా సర్దగలుగుతున్నాను. నాకు నువ్వూ, నీకు నేనూ ఉన్నామనే భరోసా ఉండాలిరా.” అని ధైర్యం చెప్పాడు.

తనేమీ మాట్లాడలేక పోయాడు

“నాకు బైపాస్ ఆపరేషన్ చేసినపుడు నా కొడుకులు, మిగతా కుటుంబ సభ్యులంతా ఉన్నా, నువ్వెందుకురా లాసాఫ్ పే సెలవు పెట్టీ, నేను ఇంటి కొచ్చేవరకు అంటి పెట్టుకుని సేవలు చేశావ్?” అడిగాడు హరి.

“అబ్బ.. అవన్నిపుడు ఎందుకురా?” ఇబ్బందిగా అన్నాడు తను.

“మన మైత్రి రూపాయలు లెక్కేసుకు చూసుకునేంత బలహీనమైందేరా నీ దృష్టిలో?” ప్రశ్నించాడు హరి.

“ఈసారి పెద్ద డవిలాగు నీది కానీ, నేనో మాట చెప్తాను ఒప్పుకోవాలిరా” అన్నాడు తను నవ్వుతూ.

“ఏంటది?” అడిగాడు హరి.

“తప్పని స్థితిలో నువ్విచ్చేవి నేను తీసుకోవాలంటే.. నువ్విచ్చిన వాటికి నేను కాగితం రాసిస్తుంటాను. మొన్నీ మధ్య నువు రెండు సార్లుగా ముప్పై, ఇరవైవేలు కలిపి మొత్తం ఏభై వేలు ఇచ్చావ్. వాటికి కాగితం రాసిస్తాను.” అని తనన్నాడు.

“వద్దులే.. డబ్బులే ఇటు పారెయ్” కోపంగా అన్నాడు హరి.

“పారేసేటన్ని ఉంటే.. లేనిదేం ఉంది.. నాకు సిగ్గుగా ఉంటోంది రా.. నేను రాసిస్తాననేది నిజంగా నీకు తిరిగిచ్చేయటానిక్కాదు. నువు కర్ణుడివే, నేను ఒప్పుకుంటాను నేను కుచేలుడినే.. కాదనలేను. కానీ.. నాకు నేనే యాచకుడులా సిగ్గుగా ఉంది. కాదని నన్ను నేను సముదాయించుకోవటానికి మాత్రమే నేను కాగితాలు రాస్తానంటున్నాను..” స్వాభిమానం నీటి తెరలా తన కళ్ళను కప్పేసింది అప్పుడు.

నరహరి కాసేపు మౌనంగా చూసి, పక్కన టేబుల్ మీదున్న డైరీలో నించి ఒక కాగితం తీసిచ్చాడు.

దాన్ని రెండుచేసి ముప్పై, ఇరవై వేలు అప్పు తీసుకున్నట్లు, రెండు కాగితాలపై విడివిడిగా రాసి, నరహరికిస్తూ.. “నిజంగా ఇస్తానని భయపడకు రా! నేనేం ఊరికే కాదు, అప్పు తీసుకున్నానని నా జబ్బలు నేను చరుచుకోవడం కోసం మాత్రమే ఈ కాగితాలు!” జీవంలేని నవ్వుతో అన్నాడు తను.

“ఇచ్చావుగా, నీ పని ఐపోయింది” వాటిని చించబోయాడు నరహరి.

“ఆగాగు. నా స్వహస్తాలతో రాసినవి చించేయటానికి నీకు చేతులు ఎట్లా వస్తున్నాయి రా?” అడిగాడు తాను నవ్వుతూ..

“వెధవ సెంటిమెంట్స్ అడ్డేస్తావ్” విసుగ్గా అంటూ పుస్తకంలో పెట్టేసి దాన్ని పక్కన పడేశాడు నరహరి ఆ రోజు..

..తను రాసిన ఆ కాగితాలనే చూపి, ఇప్పుడు నరహరి కొడుకులు ఆ ఏభై వేల రూపాయిలు అడుగుతున్నారు.

నిట్టూర్చాడు జనార్ధన్.

***

నరహరి పెద్దకర్మ రేపనగా.. భార్య చెవుల దుద్దులు, కూతురి చెవులకని చిన్నప్పుడు చేయించిన చిన్ని చిన్ని బంగారు లోలకులను తెగనమ్మినా చాలక, కొంత అప్పుచేసి ఏభైవేలు తీసుకెళ్లి నరహరి కొడుకులిద్దరికీ ఇచ్చాడు జనార్ధన్.

“నిజంగా స్నేహం అంటే మీ ఇద్దరిదీ బాబాయ్. వట్టి రూళ్ళ కాగితం పైనే నాన్నగారు రాయించుకున్నా, మీరు నిజాయితీగా తెచ్చివ్వటం..”

“ఔను బాబాయ్! మీరు ‘ఇచ్చేశాను’ అన్నా మేం నమ్మాల్సి వచ్చేది. ఆ అడ్డుగీతల వలన.”

జనార్ధన్ సత్యశీలతను, వాళ్ళిద్దరికీ ఉన్న నిజమైన స్నేహాన్ని పొగిడారు గోపీ, రాజాలు.

ఆత్మీయుని ఆఖరి కార్యక్రమం ముగిసింది.

నరహరి కుటుంబ సభ్యుల దగ్గర సెలవు తీసుకోవటానికి వెళ్లినపుడు “బాబాయ్, ఇవిగో మీరు వ్రాసిచ్చిన కాగితాలు” డైరీలో నించి తీసిచ్చాడు గోపీ.

జనార్ధన్ కాగితాలతో పాటు డైరీని కూడా అందుకున్నాడు.

రెండు క్షణాలలాగే చూశాడు. అతని కళ్ళు మసకబారుతున్నాయ్ .

కాగితాలను మళ్లీ డైరీలో పెట్టేస్తూ ”డైరీలో వాడి వ్రాత ఉంది, కాగితాల్లో నాది.. వీటినిలాగే ఉంచండి గోపీ..” కళ్ళూ, గొంతూ దుఃఖంతో పూడుకు పోతుంటే, డైరీ వాళ్ళ చేతుల్లో పెట్టేసి, వడివడిగా వెలుపలకు నడిచాడు.

స్టేషన్‍కి వెళ్లి.. బండెక్కి కూర్చున్నాడు.

మరపురాని, ప్రియమిత్రుని యొక్క స్మృతులతో జనార్ధన్ మనసు లాగే భారంగా ముందుకు సాగిపోతోంది రైలుబండి. కదిలిపోతున్న కాలంలా*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here