[dropcap]ఎ[/dropcap]వరదీ..
నేను,
నీ ఆత్మను,
నీ శరీరాన్ని వదిలేసి వెళ్లిపోతున్నాను. ఈ హాస్పిటల్‌లో బెడ్‌పై శరీరాన్ని కదల్చలేని పరిస్థితికొచ్చేసావు. ఇక నీలో వుండి ఏం చేయను. నేను వేరే శరీరాన్ని చూసుకుంటాను.
అదేంటి, నేను వట్టి శరీరాన్ని, నన్నిలా వదిలేసి వెళ్లిపోతావా ఆత్మా? నువ్వు నాలోనుంచి వెళ్లిన మరుక్షణం నన్నెవరు పట్టించుకుంటారు. నువ్వెళ్లిన తరువాత నన్ను కాల్చి బూడిద చేస్తారు.
మరేం చేయను, నీ శరీరంలో అన్ని అవయవాలు పాడైపోయాయి. ఏ ఒక్కటైనా సరిగా పనిచేస్తుందా.
నేనేం చెయ్యను చెప్పు, ఆ ‘చెడు’కు ఎన్నోసార్లు చెప్పి చూసాను. నా మాట వింటేగా. ఇష్టారాజ్యంగా చేసి నన్ను ఈ గతికి చేర్చాడు. పుట్టినప్పటి నుండి మనం నలుగురం (ఆత్మ-శరీరం-మంచి-చెడు) ఒక్కటిగా కలిసి వున్నాం. నువ్వు నన్నిలా అర్థాంతరంగా వదిలేసి నీ మానాన నువ్వు వెళ్లిపోతే నేనెమైపోతాను.
నడి వయసులో ఇన్ని వ్యసనాలకు నీ శరీరం బానిసైతే ఎలా చెప్పు
నన్నని ఏం లాభం. ఎంత మంచి శరీరం నాది. ఉక్కులా వుండేది. పద్దెనిమిదేళ్ళకే సిగరెట్టు మొదలెట్టాడు మనలో వున్న ఈ ‘చెడు’. ఆ కాడికి ‘మంచి’ చెప్తూనే వున్నాడు వద్దని.
నా కన్నీ తెలుసని ‘మంచి’ని బెదరగొట్టాడు. ‘మంచి’ ఎప్పుడు మెతకే, ‘చెడు’ను డామినేట్ చేయలేదు, దాంతో ‘చెడు’ రెచ్చిపోయాడు. తను ఆడింది ఆట పాడింది పాట అయింది. మొదటిసారి సిగరెట్ పీల్చినపుడు ఎంత గందరగోళం, లోపలంతా ఒకటే పొగ, మాకెవరికి ఊపిరాడలేదు. దాంతో సిగరెట్ తాగగానే కళ్ళని గిరా గిరా తిప్పాం. నాలుకపై రుచి మార్చేసి వికారం తెప్పించాం. ఆరోజు వరకు ఆగి మళ్లీ తెల్లవారి సిగరెట్ తాగడం మొదలుపెట్టాడు. ఎంతని వారించాం ఆ ‘చెడు’ని. విన్నాడా మాట.
సిగరెట్ తాగడం దొరల ఫ్యాషన్ అన్నాడు.
కావాలంటె గిరీశాన్ని గుర్తుచేసుకోమన్నాడు
ఈ వయసులో సిగరెట్ తాగడమే హీరోయిజానికి సింబాలిక్ అన్నాడు.
ఈ వ్యసనానికి నన్ను బానిసని చేసాడు. అదే నా పాలిట శాపమైంది. ఈ సిగరెట్లతో ఒళ్లంతా గుల్ల చేశాడు. ఊపిరితిత్తులు చూసావా పొగతో నిండిపోయాయి. లోపల అంతా కాలి పోయిన వాసన. దీనికి తోడు ఇరవై ఏళ్ళకే బారని బీరని తాగడం మొదలుపెట్టాడు. మొదటిసారి తాగినప్పుడు లోపలంతా ఒకటే పుల్లటి వాసన. నేనురుకున్నానా తాగిందంతా బయటికి తోసేసాను. ఆ రోజంతా నేను లేవలేదు. అలసిపోయి పడుకుండిపోయాను. తెల్లవారి ఈ ‘చెడు’
“ఈ ఒక్కసారికి సహకరించు తరువాత తాగను”
అని అలసిపోయివున్న నన్ను మళ్లీ బారుకు పట్టుకెళ్ళాడు. ఆ రోజు మొదలు బార్లు బీర్లు బ్రాందీలు పోయి ఇప్పుడు కిక్కు సరిపోవట్లేదని సారా తాగేదాక వచ్చింది వ్యవహారం. ఇక సిగరెట్ల పీల్చుడుకు లెక్కేలేదు. లేసింది మొదలు బాత్రూంలో సిగరెట్ మొదలుపెడితే రాత్రి పడుకునేదాక ఒకటే పీల్చుడు. ఇటు సిగరెట్లు అటు తాగుడు ఈ కిక్కు సరిపోవట్లేదని నా ప్రాణానికి తంబాకు ఒకటి వచ్చి చేరింది. అది పెదవి కింద పెట్టుకొని చప్పరించడం. ఇక నా బతుకు పొయ్యిలో కట్టెలాగ తయ్యారయ్యింది.
మొదట్లోనే ‘మంచి’ తోనైన ఓసారి గట్టిగా ‘చెడుకు’ చెప్పిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదేమో.
అదీ జరిగింది, ‘మంచి’ మాట వింటేగా. నీకేం తెలీదని వాడి మీదకే వెళ్లాడు. నావల్ల కాదని ఆ ‘మంచి’ కూడా చేతులెత్తేసాడు. నడి వయసుకు వచ్చాం కదా ఇన్నాళ్లు తాగావు తిన్నావు అన్ని చేసావు ఇకనైనా జాగ్రత్తగా ఉండరా నాయనా అంటే వినడే. చేతిలో డబ్బులేకపోతే కామ్‌గా వుంటాడు. రూపాయి కళ్లపడిందా ఎవ్వరి మాట లెక్కలేదు. ముందు తాగాలి మందు. ఇదే పని.
ఈ సిగరెట్లను తాగుడును ఇన్నాళ్లు ఓపిగ్గా భరించాం ఇక మావల్ల కాదంటు అన్ని అవయవాలు ఒక్కొక్కటిగా పట్టు తప్పాయి. ఆ లివర్ ఒకటే గోల ఆ మందును ఎంతకని వడపోయను, ఇక నావల్ల కాదని, ఊపిరితిత్తులైతే ఒకటే ఏడుపు, గుర్తుపట్టలేని విధంగా మసిబొగ్గులా తయారయ్యామని.
ఇలా కాదని అన్ని అవయవాలకు ఒకటే చెప్పాను, మందు తాగినప్పుడల్లా కడుపులోకి ఏది వస్తే అది బయటికి తోసెయ్యమని. సిగరెట్ తాగినప్పుడల్లా దగ్గు ద్వారా ఆ పొగంతా బయటికి పంపమని. మమ్మల్ని మేం కాపాడుకోవడానికి తోచింది చేసాం.
ఈ వాంతులను దగ్గును భరించలేక ‘మంచి’ – ‘చెడు’ని బతిమిలాడుకొని హాస్పిటల్ పట్టుకెళ్లాడు. వాళ్లు రెండ్రోజులు హాస్పిటల్‌లో వుంచుకొని ఇంజక్షన్లు గ్లూకోస్‌లు ఎక్కించి మమ్మల్ని ఆ మందులతో సముదాయించి, ఇంటికి పంపారు. నాలుగు రోజులు మాములుగా వుండి మళ్ళీ మొదలుపెట్టాడు సిగరెట్లు మందు.
నువ్వింత శిథిలమైతే నీలో నేను ఎలా వుండగలను చెప్పు. నాకు ఆధారం నీ శరీరమే. అది వుంటేనే నేను నీలో వుండగలను. ఇకనైనా ‘చెడు’ ను కంట్రోల్ లో పెట్టకపోతే ఎవరిదారి వారిదే.
‘చెడు’ను కంట్రోల్ చేసే పరిస్థితి లేదు ఆత్మా. సిగరెట్లు మందుకు పూర్తిగా బానిసయ్యాడు. ఈమధ్య రోజు తాగడమే పని. దీంతో అన్ని అవయవాలు సహకరించడం మానేసాయి. లేవలేని పరిస్థితికొచ్చేసాను. అందుకే ఈ హాస్పిటల్‌లో పడేసారు.
ఇప్పుడు ఎలా వుంది
ఏముంది చెప్పడానికి, అన్ని అవయవాలు చేసే పనులు ఆపేసాయి. ఏ అవయవము పని చేయడానికి సిద్ధంగా లేదు. అన్ని అపస్మారకంలోకి వెళ్లిపోయాయి.
మరి ఇక్కడ వుండి నేను చేసేదేముంది, నేను పోతున్నాను..
నీ శరీరంలో నుండి వెళ్ళి పోతున్నాను.. పో..తు..న్నా..ను..
అయ్యో. ఆత్మా వుండు, నన్నోదిలేసి వెళ్లకు, ఆ..త్మా.. వె..ళ్ల..కు..