ఆదికావ్యంలోని ఆణిముత్యాలు-12

0
3

[వాల్మీకి రామాయణం ఆధారంగా శ్రీ వేదాంతం శ్రీపతిశర్మ రచించిన ‘ఆదికావ్యంలోని ఆణిముత్యాలు’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]

ఆదికావ్యంలోని ఆణిముత్యాలు

92. శ్లో.

కృతాంతస్త్వేవ సౌమిత్రే! ద్రష్టవ్యో మత్ప్రవాసనే।

రాజ్యస్య చ వితీర్ణస్య పునరేవ నివర్తనే॥

కైకేయ్యాః ప్రతిపత్తిర్హి కథం స్యాన్మమ పీడనే।

యది భావో న దైవోయం కృతాంత విహితో భవేత్॥

(అయోధ్యకాండ, 22. 15, 16)

శ్రీరాముడు లక్ష్మణునితో – రాజ్యాధికారము నా చేతికి చిక్కినట్లే చిక్కి జారిపోవుటకు, నా వనవాసప్రాప్తికిని దైవమే కారణము. ఇందు కైకేయి దోషము ఏ మాత్రమూ లేదు. ఇది ముమ్మాటికినీ విధి విలాసమే. అట్లు కానిచో నన్ను అడవులకు పంపవలననెడి బుద్ధి ఆమెకు ఎలా కలిగేది?

శ్లో.

కథం ప్రకృతి సంపన్నా రాజ పుత్రీ తథా గుణా।

బ్రూయాత్ సా ప్రాకృతేవ స్త్రీ మత్పీడాం భర్తృ సన్నిధౌ॥

(అయోధ్యకాండ, 22. 19)

ఉత్తమ రాజవంశమున జన్మించిన కైకేయి సాధు స్వభావం గలది. పతి సమక్షంలో ఒక ప్రాకృత స్త్రీ వలె పలుకటం.. విధి విలాసం!

శ్లో.

ఏతయా తత్త్వయా బుద్ధ్యా సంస్తభ్యాత్మానమాత్మనా।

వ్యాహతేప్యభిషేకే మే పరితాపో న విద్యతే॥

(అయోధ్యకాండ, 22. 25)

ఈ విధమైన తాత్త్విక దృష్టితో నా అంతఃకరణను నిగ్రహించుట వలన నాకు పట్టాభిషేకం ఆగిపోయినప్పటికీ ఎట్టి పరితాపమూ లేదు.

శ్లో.

న లక్ష్మణాస్మిన్ ఖలు కర్మ విఘ్నే

మాతా యవీయస్యతిశంకనీయా।

దైవాభిపన్నా హి వదత్యనిష్టం

జానాసి దైవం చ తథా ప్రభావమ్॥

(అయోధ్యకాండ, 22. 30)

శ్రీరాముడు: ఓ లక్ష్మణా! నా పట్టాభిషేకం ఆగిపోవుటకు పినతల్లి అయిన కైకేయియే కారణం అని అనుకోవద్దు! విధి ప్రేరణ చేతనే ఆమె అలా మాట్లాడినది. దైవశక్తి ఎంతటిదో నీకు తెలుసు కదా!

93. శ్లో.

అగ్నిర్వాయుస్తథా ధూమో మంత్రాశ్చర్షిముఖాచ్చ్యుతాః।

ఉపస్పర్శనకాలే తు పాంతు త్వాం రఘునందన॥

(అయోధ్యకాండ, 25. 24)

శ్రీరామునితో ఎంతో ఆవేదనతో సంభాషించిన తరువాత కౌసల్య వనవాసానికి అనుమతించి, శ్రీరామునితో – “అగ్ని, వాయువు, ధూమము, ఋషులు ప్రవచించిన మంత్రములు – స్నాన ఆచమన కాలములయందు నిన్ను కాపాడుచుండు గాక!” అని అంటుంది.

94. శ్లో.

భర్తుర్భాగ్యం తు భార్యైకా ప్రాప్నోతి పురుషర్షభ।

అతశ్చైవ అహ మాదిష్టా వనే వస్తవ్య మత్యపి॥

న పితా నాత్మజో నాత్మా న మాతా న సఖీ జనః।

ఇహ ప్రేత్య చ నారీణాం పతిరేకో గతిస్యదా॥

(అయోధ్యకాండ, 27. 5,6)

సీత: భార్య భర్తకు అర్థాంగి. కావున భర్త యొక్క భాగ్య ఫలములను పొందుటకు భార్యయు అర్హురాలు. అందువలన ‘వనములలో నివసింపుము’ అన్న ఆదేశము నాకు కూడా వర్తిస్తుంది.

ఇహలోకమున, పరలోకమున సతులకు పతియే గతి. తండ్రి గాని, తల్లి గాని, తనయులు గాని, సఖులు గాని, ఆఖరికి, శరీరము గాని తోడుగా యుండుట జరుగదు.

95. శ్లో.

యది త్వం ప్రస్థితో దుర్గం వన మద్యైవ రాఘవ।

అగ్రతస్తే గమిష్యామి మృద్నంతీ కుశ కంటకాన్॥

(అయోధ్యకాండ, 27. 7)

ఇప్పుడే దుర్గమమైన అరణ్యములకు బయలుదేరినచో నేనూ వస్తాను. మీ ముందు నడుస్తూ దర్భలనూ, ముండ్లనూ తొలగిస్తూ మీ మార్గమును సులభము చేస్తాను.

96. శ్లో.

శ్రుతిర్హి శ్రూయతే పుణ్యా బ్రాహ్మణానాం యశస్వినామ్।

ఇహ లోకే చ పితృభిః యా స్త్రీ యస్య మహా మతే।

అద్భిర్దత్తా స్వధర్మేణ ప్రేత్య భావేపి తస్య సా॥

(అయోధ్యకాండ, 29. 18)

పెద్దలు చెప్పిన మాట కన్యాదాతచే దానఫల పూర్వకంగా వర్ణధర్మములను అనుసరించి అప్పగించిన వధువునకు ఈ లోకమునందే కాక, పరలోకమునందు కూడా చెందును.

97. శ్లో.

న మామసజ్జనేనార్యా సమానయితు మర్హతి।

ధర్మాద్విచలితుం నాహమ్ అలం చంద్రాదివ ప్రభా॥

నా తంత్రీ వాద్యతే వీణా నా చక్రో వర్తతే రథః।

నా పతిస్సుఖ మేధతే యా స్యాదపి శతాత్మజా॥

మితం దదాతి హి పితా మితం మాతా మితం సుతః।

అమితస్యహి దాతారం భర్తారం కా న పూజయేత్॥

(అయోధ్యకాండ, 39. 28, 29, 30)

సీత కౌసల్యతో చెప్పినది:

చంద్రుని నుండి వెన్నెల వేరు కానట్లు నేనును ధర్మపథమునకు దూరము కాబోను. తంత్రులు లేనిదే వీణ మ్రోగదు. చక్రములు లేనిదే రథము కదలదు. అలాగే వందలాది కుమారుల తల్లి అయినను ఆ పడతి పతికి దూరముగా నున్నచో నిజమైన సుఖములకు నోచుకొనదు. ఏ సతికైనను తండ్రి, పుత్రులు, మితంగానే ఇవ్వగలరు. కానీ భర్త మాత్రము ఐహికంగా, పారమార్థికంగా కూడా అపరిమితంగా పంచి ఇస్తాడు. అందుచేత ఏ సతి తన పతిని గౌరవింపదు?

శ్లో.

రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజామ్।

అయోధ్యమ్ అటవీం విద్ధి గచ్చ తాత! యథా సుఖమ్॥

(అయోధ్యకాండ, 40. 9)

సుమిత్ర లక్ష్మణునితో: లక్ష్మణా! శ్రీరాముని నీ తండ్రి యగు దశరథునిగా భావింపుము. సీతాదేవిని నన్నుగా (తల్లిగా) తలంపుము. అడవిని అయోధ్యగా భావింపుము. నీవు హాయిగా వెళ్ళి రమ్ము!

98. శ్లో.

కీర్తి భూతాం పతాకాం యో లోకే భ్రామయతి ప్రభుః।

దమ సత్య వ్రత ధనః కిం న ప్రాప్తస్తవాత్మజః॥

(అయోధ్యకాండ, 44. 7)

సుమిత్ర కౌసల్యతో: నీ సుతుడైన శ్రీరాముడు ధర్మాచరణము నందు, సత్యవ్రతమును పాటించుటలోనూ సాటి లేనివాడు. అవి ఆ మహాపురుషుని సహజ సంపదలు. అందుచేత ఆయన కీర్తి పతాక లోకమున ఎల్లప్పుడు ఎగురుచునే ఉంటుంది. అందుచేత బాధపడవలసిన అవసరం లేదు.

99. శ్లో.

యా ప్రీతిర్బహుమానశ్చ మయ్యయోధ్యా నివాసినామ్।

మత్ప్రియార్థం విశేషేణ భరతే సా నివేశ్యతాం॥

స హి కల్యాణ చారిత్రః కైకేయ్యానంద వర్ధనః।

కరిష్యతి యథావద్వః ప్రియాణి చ హితాని చ॥

జ్ఞాన వృద్ధో వయో బాలో మృదుర్వీర్య గుణాన్వితః।

అనురూపస్య వో భర్తా భవిష్యతి భయాపహః॥

(అయోధ్యకాండ, 45. 6, 7, 8)

శ్రీరాముడు అయోధ్యావాసులతో: మీరందరూ నాపై ఇంతటి గౌరవం, ప్రేమ, చూపుతున్నందుకు సంతోషం. కానీ ఇంతకంటే రెట్టింపు ఆదరాభిమానాలను భరతునిపై చూపండి. అప్పుడు నాకు ఇంకా ఆనందముగా ఉంటుంది.

భరతుడు ఉత్తముడు. మీ అందరికీ మేలు చేయగలడు. చిన్నవాడైనా జ్ఞానం గలవాడు. సాధు స్వభావం, పరాక్రమం, సద్గుణాలు గలవాడు. తగిన ప్రభువు కాగలడు. అతని పాలనలో నిర్భయంగా ఉండండి.

100. శ్లో.

పౌరా హ్యోత్మ కృతాద్దుఃఖాత్ విప్రమోచ్యా నృపాత్మజైః।

న తే ఖల్వాత్మనా యోజ్యా దుఃఖేన పురవాసినః॥

(అయోధ్యకాండ, 46. 23)

శ్రీరాముడు: ప్రజల దుఃఖములు తొలగించుట రాజకుమారుల ధర్మము. అంతే కాదు, తమ కారణముగా ప్రజలు ఎట్టి దుఃఖముల పాలు కాకుండా చూచుటయు వారి కర్తవ్యము.

101. శ్లో.

ఆపృచ్ఛే త్వాం పురీశ్రేష్ఠే కాకుత్స్థ పరిపాలితే।

దైవతాని చ యాని త్వాం పాలయంత్యావసంతి చ॥

(అయోధ్యకాండ, 50. 2)

కోసల దేశం పొలిమేరకు చేరి శ్రీరాముడు అయోధ్యా నగరాన్ని ఉద్దేశించి అంటాడు – కాకుత్స్థ వంశజులచే పరిపాలింపబడుతున్న ఓ అయోధ్య మహానగరమా! ఈ దేశమున సుప్రతిష్ఠితులై రక్షించుతున్న దేవతలను, నిన్ను నా వన ప్రాయణమునకై అనుజ్ఞ ఈయవలసిందిగా వినమ్రముగా వేడుకొనుచున్నాను.

శ్లో.

కుశ చీరాజిన ధరం ఫల మూలా శినం చ మామ్।

విద్ధి ప్రణిహితం ధర్మే తాపసం వన గోచరమ్॥

(అయోధ్యకాండ, 50. 44)

శ్రీరాముడు గుహునితో: నేను పితృవాక్య పరిపాలనలో ధర్మబద్ధుడనై కేవలం తాపసిగా వనములలో ఉన్నాను. అందుచేత ఫలమూలాదులే నాకు ఆహారం (గుహుడు ఇతర పదార్థాలను ముందుంచినప్పుడు).

శ్రీరాముడు గుర్రాలకు గ్రాసం ఒక్కటి ఇవ్వమని సెలవిచ్చాడు.

102. శ్లో.

పుత్రో దశరథస్యాయం మహా రాజస్య ధీమతః।

నిదేశం పారయిత్వేవాం గంగే! త్వదభిరక్షితః॥

చతుర్దశ హి వర్షాణి సమగ్రాణ్యుష్య కాననే।

భ్రాత్రా సహ మయా చైవ పునః ప్రత్యాగమిష్యతి॥

తతస్త్వాం దేవి! సుభగే! క్షేమేణ పునరాగతా।

యక్ష్యే ప్రముదితా గంగే సర్వ కామ సమృద్ధినీ॥

(అయోధ్యకాండ, 52. 83, 84, 85)

ఇదొక అద్భుతమైన సన్నివేశం. గుహుని వద్ద సెలవు తీసుకొని నావలో గంగను దాటు సమయంలో శ్రీ సీతారామలక్ష్మణులు గంగకు ప్రణమిల్లి పూజిస్తారు. సీతమ్మ గంగాదేవితో అంటుంది – ‘ఓ గంగాదేవీ! ఈయన ధీశాలియైన దశరథ మహారాజు యొక్క పుత్రుడు. తండ్రి ఆదేశాన్ని అనుసరించి వనవాస దీక్షితుడై యున్నాడు. నీ చేత సురక్షితుడైన ఈయన నా తోడను, తన తమ్ముడైన లక్ష్మణుని తోడను గూడి పూర్తిగా పదునాలుగు సంవత్సరములు వనములలో గడిపి తిరిగి రాగలడు. మహిమాన్వితురాలవైన ఓ గంగాదేవీ! మా వనవాస జీవితమును ప్రశాంతంగా ముగించుకొని, సఫల మనోరథనై క్షేమంగా తిరిగి వచ్చునప్పుడు సంతోషంతో నీకు పూజలందించగలను!’

103. శ్లో.

గతం తు గంగా పరపారమాశు

రామం సుమంత్రః ప్రతతం నిరీక్ష్య।

అధ్వ ప్రకర్షా ద్వినివృత్త దృష్టిః

ముమోచ బాష్పం వ్యథితస్తపస్వీ॥

(అయోధ్యకాండ, 52. 100)

వాల్మీకి మహర్షి ఏ పాత్రనీ విస్మరించ లేదు. శ్రీరాముడు తనవారితో గంగానది అవతలి తీరానికి వన ప్రయాణం చేయుచుండగా వారు కనబడువరకూ సుమంత్రుడు రెప్పలార్పక వారి చూస్తూ నిలబడ్డాడు. చూపులకు అందనంత దూరం వెళ్ళిపోయిన తరువాత అతడు తన దృష్టిని మరల్చి, పరితపిస్తూ, వ్యాకుల చిత్తుడై కన్నీరు రాల్చాడు..

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here