జ్ఞాపకాల పందిరి-142

23
3

మళ్ళీ.. మరోసారి..!!

[dropcap]జీ[/dropcap]వితం అనే పుస్తకంలో, అన్ని అంకాలు ప్రధానమైనవే అయినప్పటికీ, దేనికది ప్రత్యేకతను సంతరించుకుని ఉంటుంది. అలా అని అందరికీ అన్ని దశలు ప్రత్యేకతను కలిగివుంటాయని అసలు చెప్పలేము. కొందరికి బాల్యదశ, కొందరికి విద్యార్థి దశ, ఇంకొందరికి వైవాహిక దశ, మరికొందరికి వృద్దాప్యపు దశ ప్రత్యేకతను కలిగి ఉండవచ్చు. అయితే అందరూ ముక్త కంఠంతో కోరుకునేది విద్యార్థి దశ మాత్రమే! ఒక తెలుగు సినీ గేయ రచయిత చెప్పినట్టు ‘భలే.. భలే మంచిరోజులులే.. మళ్ళీ.. మళ్ళీ ఇక రావులే, స్టూడెంట్ లైఫ్ సౌఖ్యములే.. చీకూ చింతకు దూరములే..!’ అన్నది అక్షర సత్యం అనడానికి ఎలాంటి సందేహమూ లేదు! అందుచేత బ్రతుకు పుస్తకంలో అంకములన్నింటి లోనూ ‘విద్యార్థి దశ’ ఘనమైన దశ అని చెప్పక తప్పదు.

దేశంలోని వివిధ ప్రాంతాల నుండి, విదేశాలనుండి, ఒకే చోట చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులు, ప్రాంతాలు వేరైనా, కులాలు మతాలూ వేరైనా, సంస్కృతీ సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు వేరైనా అందరు ఒకేచోట (ముఖ్యంగా – హాస్టల్ జీవితం) కలిసికట్టుగా, ఒకరినొకరు గౌరవించుకుంటూ, కుల,మత ప్రాంతాల పరంగా విభజనకు గురికాకుండా ఆనందంగా,హాయిగా గడిపేయ గల దశ విద్యార్థి దశ. అందుచేతనే చదువు పూర్తి అయినా తర్వాత, ఉద్యోగ రీత్యానూ, ఇతర సాంకేతిక కారణాల వల్ల పలు చోట్ల స్థిరపడిపోవడం సాధారణ విషయమే! అతి కొద్దిమంది మాత్రం, ఒక చోటనే పుట్టి పెరిగి, విద్యాభ్యాసం పూర్తి గావించి, వున్న ఊళ్ళోనే ఉద్యోగం సంపాదించి అక్కడే స్థిరపడి పోయి ఆనందంగా బ్రతికగలరు, వారు నిజంగా అదృష్టవంతులే! అయితే ఈ అవకాశం దొరికేది బహు కొద్దీ మందికే!

తబలా రెస్టారెంట్ (కూకట్ పల్లి)లో ఆత్మీయ సమ్మేళనం

గతంలో ఉత్సాహవంతులైన వారు ఉత్తరాల ద్వారా ఒకరి నుండి మరొకరు చిరునామాలు సేకరించి, ఒక గుంపుగా ఏర్పడి నిర్ణయించుకున్న రోజున, నిర్ణయించుకున్న ప్రదేశంలో కలిసేవారు. ఇది కొంచెం క్లిష్టమైన వ్యవహారంగానే ఉండేది. మన జీవితాల్లో మొబైల్ ఫోన్ ప్రవేశించిన తరువాత ఇలాంటి ప్రక్రియలు, అతి సులభంగా మారినాయి. ఫేస్‍బుక్ గ్రూపులు, వాట్స్ ఆప్ గ్రూపులు, టెలిగ్రామ్ గ్రూపులు ఇలా అనేక గ్రూపులు పెట్టుకుని అందరినీ ఒక చోటికి చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. సాహిత్య – సాంస్కృతిక రంగాల పరంగా, కుటుంబ పరంగా, స్నేహితుల పరంగా, కులాల పరంగా, మతాల పరంగా, రాజకీయ పరంగా అనేక గ్రూపులు వెలుస్తున్నాయి. అందరూ ఏదోరూపంలో ఆత్మీయ సమ్మేళనాలు పెట్టుకుని సరదాగా ఒకరినొకరు పరిచయం చేసుకోవడం, కబుర్ల సందడి, గతాన్ని సింహావలోకనం చేసుకోవడం, ఇలా పాత స్నేహితులు కలుసుకోవడం జరుగుతున్నది.

ఆత్మీయ సమ్మేళనంలో లంచ్ టైం

ముఖ్యంగా పాఠశాలల్లో, కళాశాలల్లో సంవత్సరాల వారీగా (10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, వగైరా) అప్పుడప్పుడూ ఆత్మీయ సమ్మేళనాలు జరుపుకుంటూ గురువులను గౌరవించుకుంటూ గొప్ప ఆనందాన్ని పొందగలుగుతున్నారు. ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువైనాయి. ఇది మంచి పరిణామమే అని నా ఉద్దేశం.

అందరికి మాదిరిగానే మాకూ ఒక వాట్స్ ఆప్ గ్రూప్ వుంది. అంటే 1975 బి. డి. ఎస్. గ్రూప్ (ప్రభుత్వ దంత వైద్య కళాశాల,హైదరాబాద్) అన్నమాట. మా క్లాస్ అంతా గ్రూపు సభ్యులే గాని, హైదరాబాద్ కేంద్రంగా కలుసుకునేది మాత్రం బహుకొద్ది మంది. కారణం, అనేకమంది హైదరాబాద్‍కు దూరంగా ఉండడమే! కొద్దీ మంది ఇతర రాష్ట్రాలలో, విదేశాలలో స్థిరపడిపోయి ఉండడం మూలాన అందరమూ అన్నిసార్లు కలుసుకునే అవకాశం రావడం లేదు.

డా.పాలేశ్వరన్, రచయిత, డా.అరుణ, డా.మంజుల.

ఈ మధ్య మా సహాధ్యాయి డా. పాలేశ్వరన్, మలేషియా నుండి రావడంతో హైదరాబాద్‍లో వున్నవాళ్లు కలిసి ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవాలనే ఆలోచన కార్యరూపం దాల్చింది, అది 12, డిశంబర్, 2022న. అనుకోకుండా మా కార్యక్రమాలన్నింటికీ ముందుండి, అందరిని ఉత్సాహపరిచే మా గ్రూపు ప్రధాన సభ్యురాలు డా. జె. క్రాంతి తప్పనిసరిగా కుమార్తె దగ్గరకు అమెరికా వెళ్ళవలసి వచ్చింది. అందరినీ కలుపుకుని పోయే మనస్తత్వం ఆవిడది.

అందుకే మా గ్రూపు సభ్యులందరూ డా. క్రాంతి మాటకు విలువ, గౌరవం ఇస్తుంటారు. ఈసారి ఆవిడ లేకపోవడంతో ఈ కార్య భారాన్ని మిత్రులు డా శంకర్ లాల్, డా. హరనాథ్ తీసుకుని, కూకట్‍పల్లి లోని, ‘తబలా’ రెస్టారెంట్‌ను వేదికగా నిర్ణయించారు. మధ్యాహ్న భోజన సమయానికి అక్కడికి చేరుకోవాలని అనుకున్నాము.

డా.జి.ఎన్.రావ్ (కుడి), డా. దత్త ప్రసాద్ (ఎడమ), డా.హరనాథ్ (మధ్యలో)

నేను చందానగర్ లోని మిత్రుడు డా. శంకర్ లాల్ దగ్గరకు వెళ్ళాను. నేను డా. శంకర్ లాల్, డా. పాలేశ్వరన్ తో కలిసి కూకట్‍పల్లి రెస్టారెంట్‌కు చేరుకున్నాము. అప్పటికే మా సీనియర్, అందరికీ కావలసిన సహృదయ మిత్రుడు, డా. జి. ఎన్. రావు, డా హరనాథ్, డా. దత్త ప్రసాద్, డా. ఝాన్సీ, డా. మంజుల, డా. అరుణ వేదికా స్థలికి వచ్చి వున్నారు. రెస్టారెంట్ పెద్ద గొప్పగా లేకున్నా, వేదిక మార్చి అక్కడికి చేరుకునే సమయం లేక, ‘తబలా’ రెస్టారెంట్ లోనే, ఒక ప్రత్యేక గదిలో మాకు సరిపడా కుర్చీలు వున్న రౌండ్ టేబుల్ సమకూర్చుకుని కూర్చున్నాం. అనుకోని రీతిలో మొత్తం ఖర్చును మా సీనియర్ మిత్రుడు డా. జి. ఎన్. రావు స్పాన్సర్ చేసి మమ్ములను అందరినీ ఆశ్చర్య పరిచారు. మా అందరితో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉండడమే దీనికి ప్రధాన కారణం. లంచ్ చేస్తూనే ఎన్నో ముచ్చట్లు ముచ్చటగా మా మధ్య చోటు చేసుకున్నాయి. కళాశాల జీవితానికి సంబంధించిన గత స్మృతులను సింహావలోకనం చేసుకున్నాం. ఒక్కొక్కరి అనుభవాలను చక్కగా పంచుకున్నాం. ఎవరు ఎక్కడ స్థిరపడింది, ఏమి చేస్తున్నదీ ఒకసారి గుర్తు చేసుకున్నాం. మేమందరం ఈ స్థితికి రావడం వెనుక బాధ్యులైన మా గురువులను తలచుకున్నాము. చాలామంది మా గురువులు ఈ నాడు మా మధ్య లేకపోవడం బాధాకరం.

డా.జయంతి (ఎడమ), డా.ఝాన్సీ (కుడి)

లంచ్ పూర్తి అయిన తర్వాత పాటలు పాడాలనే అంశం నేనే లేవనెత్తాను, దానికి కారణం డా. జయంతి, డా. జి. ఎన్.రావు గతంలో పాటలు పాడేవారు. నాది కేవలం హమ్మింగ్ కేటగిరి. పదిమందిలో పాడిన అనుభవం లేదు. వాళ్లిద్దరూ ఎంత బ్రతిమాలినా పాడడానికి ముందుకు రాలేదు. మిత్రుడు డా. పాలేశ్వరన్, మలేషియా నుండి వచ్చిన సందర్భంగా నేను పాట పాడే సాహసం చేయక తప్పలేదు.

పాట పాడుతున్న రచయిత

పాట ఎట్లా వున్నా చప్పట్లు మాత్రం మారుమోగాయి. ఇది నాకు మొదటి అనుభవం. నా తర్వాత ఏమనుకున్నారోఏమో గాని ఒక పాట సగం పాడి సమావేశాన్ని రక్తి కట్టించారు. అందరం ఆ ఆనందాన్ని పంచుకున్నాము. ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలకి ఎక్కువగా హాజరుకాని డా. దత్త ప్రసాద్, ఈ సమావేశానికి రావడం ఒక ప్రత్యేకత. దీనిని సఫలీకృతం చేసిన డా. హరనాథ్ నిజంగా అభినందనీయుడు.

చివర మలేషియా మిత్రుడు డా. పాలేశ్వరన్, మా కోసం తెచ్చిన గిఫ్ట్స్ అందరికీ పంచి ఆశ్చర్య పరిచాడు. తర్వాత ముగింపు మాటలు మాట్లాడుకుని ఎవరి దారిన వాళ్ళు అక్కడి నుండి నిష్క్రమించాం.

తిరుగు ప్రయాణం – డా.శంకర్ లాల్(ఎ), డా.జి.ఎన్.రావ్ (కుడి) డా.పాలే శ్వరన్ (మ)

చాలా మందిమి హైదరాబాద్ లోను, సమీప ప్రాంతాల్లోనూ ఉంటున్నా, కలుసుకునేది బహుతక్కువ. ఏవో శుభకార్యాలలో అరుదుగా కలుసుకున్నా మనసు విప్పి మాట్లాడుకునే సమయం ఏది? వృత్తి ద్వారా ఎంత డబ్బు సంపాదించినా, డబ్బుతో సంతోషాన్ని, తృప్తిని కొనుక్కోలేము కదా! అందుకే ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు అప్పుడప్పుడూ ఏదో రూపంలో ఏర్పాటు చేసుకోవడం చాలా అవసరం. మానసిక ప్రశాంతతకు, మానసిక వికాసానికి ఇలాంటి కలయికలు ఉత్ప్రేరకాలుగా మారి, మనిషి జీవన శైలికి, జీవితానికి చెప్పలేనంత శక్తిని అందించి ఆరోగ్య వంతుడిగా నిలబెడతాయి. మా అందరికీ గొప్ప ఉత్ప్రేరకంగా పనిచేసి, అందరిని ఒకే త్రాటిపై నిలిపే, మా సహాధ్యాయిని, సహృదయిని డా. క్రాంతి, ఈ సమావేశంలో లేకపోవడం పెద్ద లోటుగానే చెప్పుకోవాలి.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here