అలనాటి అపురూపాలు-148

0
4

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

తల్లిగా ఆశా భోస్లే:

గాయనిగా అందరికీ తెల్సిన ఆశా భోస్లే – ఓ తల్లిగా మాత్రం పెద్దగా తెలియరు.

ఆశా తన పిల్లలను ఒంటరి తల్లిలా పెంచారు. డబ్బు కోసమే పాటలు పాడిన సందర్భాలు ఉన్నాయి. “నెల వయసున్న బిడ్డను విడిచి పాడడానికి వెళ్ళాల్సి వచ్చింది” అని ఆమె చెప్పారొకసారి.

ఆశాకి గణపత్‍రావు భోస్లేతో వివాహం జరిగింది. ఆయనకీ, ఆమెకి ముగ్గురు పిల్లలు పుట్టారు. అప్పట్లో తన భర్త నెలకి కేవలం వంద రూపాయలు మాత్రమే సంపాదించేవారని, మొత్తం కుటుంబాన్ని నిర్వహించే బాధ్యత అంతా తన మీదే ఉండేదని ఆశా తెలిపారు. ఇంటి పనులు, పిల్లల పెంపకం అన్నీ ఒక్కచేతి మీదుగా చూసుకోవాల్సి వచ్చేదట.

1993లో సలీల్ చౌదరికి ఇచ్చిన – దూరదర్శన్ కొల్‍కతా కేంద్రం ద్వారా ప్రసారమయిన ఇంటర్వ్యూలో – ఆశా తన తొలినాటి పాటల రోజులను గుర్తు చేసుకున్నారు. అప్పట్లో తాము బొంబాయికి దూరంగా ఉండేవారమని, పాటలు పాడడానికి రోజూ బొంబాయికి రైల్లో వచ్చేదానినని చెప్పారు. 1949 లో  కుమారుడు హేమంత్ జన్మించినప్పుడు, డబ్బు కావల్సి ఉన్నందున, నెల వయసున్న కుమారుడిని ఇంట్లో వదిలి పాటలు పాడడానికి వచ్చానని చెప్పారు. “ఒక నెల వయసున్న పిల్లాడిని ఇంట్లో వదిలి వచ్చాను, పాడితే డబ్బులు వస్తాయని” అన్నారు. “ఆ కష్టమైన రోజులలో ఒక్కోసారి పాడేందుకు పాట దొరికేది, ఒక్కోసారి దొరికేది కాదు. పొద్దున్నే ఐదు గంటలకి నిద్ర లేచి, ఇంటిపనులు, పిల్లల పనులు పూర్తి చేసి బయటపడేదాన్ని” చెప్పారు.

తర్వాత కొన్నాళ్ళకి తాము బోరీవిలీకి మారిపోయామని, అప్పట్లో అది ఓ గ్రామమని ఆశా గుర్తు చేసుకున్నారు. గాయనిగా గుర్తింపు వస్తున్నా – ఆమె దినచర్యలో ఎలాంటి మార్పు ఉండేది కాదు. బావి నుండి నీరు తేవడం, వంట చేయడం, పిల్లలకి లంచ్ బాక్సులు సర్దడం, వాళ్ళని బడిలో దింపడం, అత్తమామల సంరక్షణ – ఇవీ ఆమె రోజూవారీ పనులు. ఇవన్నీ అయ్యాకా, గంటల కొద్దీ నిలబడి వెళ్ళి పాటలు పాడి వచ్చేవారు. ఒక్కోసారి పాటల రికార్డింగుకి ఎనిమిది గంటలు పట్టేది. ఓ పెద్దింటికి మారినా కూడా ఇంటి పనులన్నీ తానే చేయవలసి వచ్చిందని ఆమె గుర్తు చేసుకున్నారు. “దేవుడు నాకు ఎంతో శక్తినిచ్చాడు. గట్టి సంకల్పబలం ఇచ్చాడు. దేనికీ కాదు అనేదాన్ని కాదు. ఆరు – ఎనిమిది గంటలు పట్టినా, నిలుచుని ఉండి పాటలు పాడేదాన్ని.. ఒక్కోసారి రాత్రంతా ఉండాల్సి వచ్చేది” చెప్పారు. ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగైనా, రికార్డింగు స్టూడియోలకి కార్లతో వెళుతున్నా, రోజు మధ్యలో ఇంటికి వచ్చి పిల్లలకి అన్నం తినిపించి వెళ్ళేవారట.

ఆశా తన భర్తతో 1960లో విడిపోయారు, ఆయన 1966లో చనిపోయారు. భర్త నుండి విడిపోయాకా, పిల్లల బాధ్యతను ఆమె తీసుకున్నారు. ఆమె అప్పుడు సింగిల్ పేరెంట్. బిడ్డల సంక్షేమం పూర్తి బాధ్యత ఆమెదే. 2007లో ఐటిఎంబి షో లో మాట్లాడుతూ – తాను ఎక్కడికి వెళ్ళినా – కేబరే పాటలు పాడే గాయని అనే ముద్ర – వెంటాడేదనీ, చాలామంది పెద్దవాళ్ళు అలాంటి పాటలు పాడవద్దని అభ్యంతరం చెప్పేవారని అన్నారు. “అలాంటి పాటలు ఎందుకు పాడతావు అని జనాలు అడిగేవారు. మరి వదిలేయాలా అని అడిగేదాన్ని. మరి నా పిల్లలని ఎవరు చూస్తారు? నేనేమైనా నా సంతోషం కోసం పాడుతున్నానా? అది నా అవసరం. నేను నా పిల్లల్ని పెంచి పెద్ద చేయాలి” అన్నారామె.

అప్పట్లో తనకి పిల్లల చదువులు, వారి భవిష్యత్తు మాత్రమే ముఖ్యమని ఈ దిగ్గజ గాయని అన్నారు. అయితే మన దేశంలో సింగిల్ పేరెంట్‍గా ఉండడం అంత సులభం కాదని అన్నారు. “ఒంటరి తల్లిని మన దేశంలో ఎలా చూస్తారో మీకు తెలుసు. అది భయంకరం. అయితే నేను వాటన్నింటినీ  అధిగమించాను” అన్నారు.

ఆశా భోస్లే దేశంలోని సుప్రసిద్ధ గాయనీమణుల్లో ఒకరన్నది వాస్తవం, అయితే తన వృత్తిలోని లోటుపాటులు ఆమెకి బాగా తెలుసు. అందుకే ఆమె తన పిల్లలను సినీరంగంలోకి ప్రవేశపెట్టకూడదనుకున్నారు. అయితే ఆమె పెద్ద కుమారుడు హేమంత్ (సింగర్ హేమంత్ కుమార్ పేరు పెట్టుకున్నారు కుమారుడికి ఆశా) కొన్నాళ్ళు సంగీత దర్శకుడిగా పని చేశారు. “పిల్లలు సినీ పరిశ్రమలోకి రావడం నాకు ఇష్టం లేదు. అయినా సరే, నా పెద్ద కొడుకు హేమంత్ భోస్లే సంగీత దర్శకుడు అయ్యాడు. అయితే వాళ్ళు సంగీత పరిశ్రమలోకి రావడం నాకిష్టం లేదు. ఎందుకంటే సినీ రంగంలో ఓ విషయం ఉంది. మీరు అదృష్టవంతులైతే, మీరు అందరితో బాగా ఉంటే, ప్రతీ ఒక్కరు మిమ్మల్ని అతిగా గౌరవిస్తారు, ఎప్పుడు పడిపోయామనే సంగతే మీరు గుర్తించరు. మీకు బాగా పని దొరుకుతుంది, కానీ ఒకరోజు.. చేయడానికి ఏమీ ఉండదు. కొత్తవాళ్ళు వచ్చిన మరుక్షణం పాతవారు తెరమరుగు అవుతారు” అన్నారామె. సినిమాలు కాకపోతే, పిల్లల పరిస్థితి ఏమిటని ఊహించుకోడానికి ఆమె భయపడ్డారు. “ఇలాంటిది ఏదైనా జరిగితే, అప్పుడు నా పిల్లలు ఏం చేస్తారు? అందుకే వద్దన్నాను. ఈ వృత్తిని ఎంచుకోవద్దన్నాను. వారిని అసలు అనుమతించలేదు” చెప్పారు ఆశా.

ఆశా పెద్ద కుమారుడు హేమంత్ సుదీర్ఘ కాలం పాటు కాన్సర్‍తో పోరాడి 2015లో కన్నుమూశారు. ఆమె కూతురు వర్షా 2012లో ఆత్మహత్య చేసుకున్నారు. ఆశా చిన్న కొడుకు ఆనంద్ కొన్ని సినిమాలను నిర్మించారు. ఏప్రిల్ 2022లో ఆయన దుబాయ్‍లో ఉండగా అనారోగ్యం పాలయ్యారు.

ఇదీ తల్లిగా ఆశా భోస్లే అంతరంగం!


బాలీవుడ్‍లో తొలినాటి నర్తకీమణులు – ముగ్గురు అక్కచెల్లెళ్లు:

ముగ్గురు సోదరీమణులుగా (త్రీ సిస్టర్స్) పేరుగాంచిన తార, సితార, అలకనంద – బాలీవుడ్‍లో తొలి నాటి నర్తకీమణులు.

ప్రముఖ  తబలా విద్వాంసుడు, సంస్కృత పండితులు అయిన శ్రీ పండిత్ సుఖ్‍దేవ్ మహరాజ్, మత్స్యదేవి దంపతులు ఈ అక్కచెల్లెళ్ళ తల్లిదండ్రులు. వీరికి చౌబే, పాండే అనే సోదరులు కూడా ఉన్నారు. తార, సితార, అలకనంద ప్రఖ్యాతి చెందని కాలంలో – వారు బెనారస్, బాంబే, బెంగాల్ వంటి వేరు వేరు ప్రాంతాలలో పెరిగేటట్టు చేసింది విధి. సితార బెంగాల్‍లో జన్మించినప్పటికీ (8 నవంబరు 1920 నాడు), ఆమె ఎక్కువ కాలం బొంబాయిలోనే ఉన్నారు, అతి కొద్ది కాలం బెనారస్‍లో ఉన్నారు. ఆమె అక్క తార మరో కథక్ డాన్సర్, నటుడు అయిన గోపికృష్ణకి తల్లి.

సితార – 1934లో సాగర్ మూవీటోన్ బ్యానర్‍పై మహబూబ్ ఖాన్ దర్శకత్వం వహించిన ‘జడ్జిమెంట్ ఆఫ్ అల్లా’ అనే చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశారు. తార కూడా అదే ఏడాది త్రిలోక్ కపూర్ గారి ‘షాహీ లక్కర్‍హర’ చిత్రం ద్వారా సినీ పరిశ్రమకి పరిచయం అయ్యారు. అలకనంద విజయ్ భట్ గారి ‘ద యాక్ట్రెస్’ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు. ఈ ముగ్గురు గొప్ప నర్తకీమణులే కాకుండా, చక్కని గాయనీమణులు కూడా.

భారతదేశంలో పితృస్వామ్య వ్యవస్థ బలంగా ఉన్న అలనాటి రోజుల్లో, ‘కథక్’ నాట్యాన్ని కొద్ది మంది మాత్రమే ప్రదర్శించేవారు. రాజాస్థానాలోని మహిళలను వినోదాన్ని అందించేవారుగా, మగ గురువులను నాట్యకళను ఇతరులకు అందించేవారుగా పరిగణించేవారు.

అయితే, స్వయంగా కథక్ గురువైన సుఖ్‍దేవ్ మహారాజ్ తన కూతుళ్ళని ఇంటికే పరిమితం చేయకుండా కళారంగంలో ప్రవేశపెట్టి సాహసం చేశారు.

అమ్మాయిలు కథక్ నేర్చుకోవడాన్ని సమాజం ఓర్పలేని కాలంలో సుఖ్‍దేవ్ – తన కుమార్తెలకు స్వయంగా నృత్యం నేర్పారు. అక్కాచెల్లెళ్ళల్లో – సితార నృత్యంలో విశేష ప్రావీణ్యం సంపాదించి ‘Empress of Dance’ (నాట్యరాణి)గా పేరుపొందారు.

కానీ ఆమె తండ్రి సుఖ్‍దేవ్ మాత్రం సమాజపు అభిశంసనకి గురయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here