[dropcap]వీ[/dropcap]స్తున్న చల్లటి ఈదురు గాలికి
కళ్ళు కోసుకుపోతున్నై
చీకటితో మసకబారుతున్న దారి
కన్నీళ్ళతో ఇంకొంచెం నల్లబడుతోంది
ఇల్లు చేరితేనే కనులు తేటపడతాయి
ఊపిరి ఇంకాస్త బలం పుంజుకుంటుంది
ఎంత ఆకసాన్ని ఈదాను
ఎన్ని చెట్లను వాలాను
ఎన్ని ఎండమావులను చూశాను
ఈ ప్రయాణంలో ఈసారెందుకో
ఇన్ని ఉరుములు మెరుపులు
ఉండి ఉండి వాన జల్లులు
ప్రతి చిన్న మెరుపుకీ జడుసుకోవద్దని
ప్రతి ఉరుముకీ ఉలికిపడద్దని
ప్రతి ఘడియా నేర్పుతునే వుంది
కారుమబ్బు పట్టి వర్షం ముంచుకొచ్చేలా వుంది
ఇంటిని తొందరగా చేరుకోవాలి
గూడెంత పదిలం
చుట్టూ చేరి రెక్కలతో కౌగలించుకొని
కువకువలతో వూరడించే
నా గువ్వలెంత మురిపెం
ఇల్లంటే చుట్టూ పుల్లలు పేర్చి అల్లుకున్న గూడే కాదు
ఎన్నో వర్షాల నుంచీ కాపాడే గొడుగు
దుఃఖాన్ని తుడిచేసి
గుండెకు హత్తుకునే మమతల మడుగు
అందుకే
త్వరగా
త్వర త్వరగా
రెక్కలను అలల పరవళ్ళను చేసి
ఇంటిని చేరుకోవాలి