[dropcap]ఎ[/dropcap]ప్పుడోకప్పుడు
సొంత ఇంటిలోనే
కల నేరమై
తల్లిదండ్రులు దోషులుగా
పిల్లలకు తీర్పుకు
పెద్దరికం ముక్కలై మర్యాద చిట్లినా
బంధాలకు దాసోహమంటూ
వరసలకు ఊడిగం చేస్తూ
ఊహకందని ఊబితో
కన్న ప్రేమ
చేతులు కట్టుకుని,
కోరికలకు శిరస్సు వంచి
కళ్లలో గాతము తీసి
గుండెలో పాదుచేసి
రక్తాన్ని పిండి పోసి
నిర్లక్ష్యపు నీడలో
నిలువుగా ఎండి
నిర్దాక్షిణ్యంగా మాడి
కానివారిగా కన్నవారు
కిక్కిరిన ఒంటరిలో
ఆలోచనల తొక్కిడిలో
చిట్లిన కళ్ళు
కడదాకా బాకీపడిన కలకు
ఆయువును తాకట్టు పెట్టె
సృష్టి కనికట్టు పేగుబంధం.