సామెత కథల ఆమెత-5

0
3

[తెలుగు సామెతల ఆధారంగా అల్లిన చిన్న కథల ఫీచర్ నిర్వహిస్తున్నారు శ్రీమతి మద్దూరి బిందుమాధవి.]

రోట్లో తలపెట్టి రోకటి పోటు అంటే కుదరదు

[dropcap]శ్ర[/dropcap]వణ్.. పల్లవి ఉద్యోగ రీత్యా లండన్‌లో ఉంటున్నారు.

ఆగస్ట్‌లో పిల్లలకి సెలవులిచ్చినప్పుడు వచ్చి పది రోజులు ఇండియాలో తల్లిదండ్రులతో గడిపి వెళతారు.

ఈసారి అలా వచ్చిన సందర్భంలో పక్క ఫ్లాట్‌లో రాజు.. మోహిని దంపతులతో స్నేహం కలిసింది. రాజు.. శ్రవణ్ లది ఒకే వయసు.

పరుగెత్తి పాలు తాగటం ఇష్టం లేని రాజు.. బయట దేశాల్లో అవకాశాలు వచ్చినా.. తల్లిదండ్రులకి అందుబాటులో ఉన్నట్టుంటుందని హైదరాబాద్‌లో ఉద్యోగం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు.

రాజుకి తగిన భార్య మోహిని. వారిద్దరిది చూడ ముచ్చటైన జంట. ఇద్దరూ ‘సరే అంటే మరే’ అని పరస్పర సహకారంతో సామరస్యంగా పనులు జరుపుకుంటూ ఉంటారు.

ఆఫీసుకి దగ్గరగా ఉంటుందనీ.. దోమల్‌గూడాలో తమ స్వంత ఇంట్లో ఉంటూ.. అది వదిలి రావటానికి ఇష్టపడని తల్లిదండ్రులని వారానికి రెండు సార్లు చూసి రావటానికి వీలుగా ఉంటుందని.. కుకట్‌పల్లికి దగ్గరలో ఉన్న ‘రెయిన్ బో విస్టాస్’ లో ఈ మధ్యనే ఫ్లాట్ కొనుక్కుని అక్కడ ఉంటున్నారు.

శ్రవణ్ కూడా ముందు అక్కడే ఉండేవాడు. అతని అనుభవానికి పెద్ద జీతంతో ఉన్నత పదవి ఆఫర్ వచ్చేసరికి లండన్‌కి షిఫ్ట్ అయ్యాడు.

కొడుకు దగ్గర ఉంటున్న శ్రవణ్ తల్లిదండ్రులు ఆ ఫ్లాట్స్‌లో అలాగే ఉండిపోయారు.

***

“రాజూ.. మేము రేపు బయలుదేరుతున్నాం. మా అమ్మా నాన్నగారిని కనిపెట్టి ఉండండి అని నేను వేరే చెప్పటం అవసరం లేదనుకుంటా. మీ స్నేహాన్ని, మీరు వాళ్ళకి చేసే సహాయాన్ని.. ఈ పది రోజుల్లో చూశాం. ఇంతకు ముందు మేము వచ్చి వెళ్ళేటప్పుడు పెద్ద వాళ్ళని వదిలి వెళుతున్నాం అని దిగులుగా ఉండేది. ఈ ట్రిప్పులో మిమ్మల్ని కలిశాక అది లేదు. అయినా లాంఛనంగా చెప్పటం నా ధర్మం” అన్నాడు శ్రవణ్.

“అయ్యో నువ్వంతగా చెప్పాలా శ్రవణ్. మా తల్లిదండ్రులెంతో వీళ్ళయినా అంతే! నువ్వేమి దిగులు పడక హాయిగా వెళ్ళిరా” అని సాగనంపాడు రాజు.

“అమ్మా-నాన్నా.. మన పక్క ఫ్లాట్ రాజు మంచి స్నేహశీలి. మీకు ఏ అవసరం వచ్చినా మొహమాట పడకుండా వాళ్ళనడగండి” అని చెప్పి వెళ్ళారు శ్రవణ్ దంపతులు.

***

“పెద్దమ్మగారూ.. కింద కూరలు, పండ్లు తేవటానికి వెళుతున్నాను. మీకేమైనా కావాలా” అంది రాజు భార్య మోహిని.

“ఓ పావు వంకాయలు, రెండు కట్టలు పాలకూర, అరకిలో టొమాటోలు, ఓ గుప్పెడు పచ్చి మిరపకాయలు తేమ్మా” అంది శ్రవణ్ తల్లి సరస్వతి.

“ఆఁ అన్నట్టు నిన్న తేవటం మరిచాను.. మెడికల్ షాపు నించి పెదనాన్నగారికి బీపి టాబ్లెట్స్ కూడా తెస్తావా” అని అడిగారు.

కూరలు, పండ్లు కొనుక్కొని అలాగే మందుల షాపుకెళ్ళి వస్తుంటే ఆ కాంప్లెక్స్ లోకి కొత్తగా వచ్చిన మోహిని చిన్న నాటి నేస్తం వాణి కలిసింది. వాళ్ళింటికి తీసుకెళ్ళింది. కబుర్లు చెప్పుకుంటూ టీ తాగి బయలుదేరేసరికి కొంత ఆలస్యమయింది.

మధ్యాహ్నం అన్నం తిని పడుకునే టైం.. వయసులో పెద్ద వాళ్ళు ఇప్పుడు తలుపు కొట్టటం ఎందుకు సాయంత్రం ఇవ్వచ్చు.. అని సరస్వతి వాళ్ళ కోసం తెచ్చిన కూరలతో సహా తన ఫ్లాట్‌లో కెళ్ళి తలుపేసుకుంది మోహిని.

సాయంత్రం కూరలు తీసుకెళ్ళి ఇస్తున్నప్పుడు.. “ఈ పూట కూరలు లేవు. నువ్వు తెస్తావని చూసీ చూసీ ఎంతకీ రాకపోయేసరికి మీ పెదనాన్నగారికి పప్పు-ఆవకాయ వేసి పెట్టానమ్మా. పెద్ద వయసు ఏం తేడా చేస్తుందో” అంటూ “బీపి టాబ్లెట్స్ తెచ్చావా.. రెండు రోజులయింది టాబ్లెట్స్ వేసుకోక” అన్నది.

“అయ్యో బీపి టాబ్లెట్స్ మానకూడదండి..” అన్నది మోహిని సహాయం చేసిన తనని కావాలనే ఆలస్యం చేసి తప్పు చేసినట్టు మాట్లాడుతున్న ఆవిడని చూస్తూ!

ఈ సందట్లో.. సరస్వతి కూరలకి, మందులకి ఎంతయిందని అడగనూ లేదు.. మోహిని చెప్పనూ లేదు.. ఇంటికొచ్చేసింది.

“అమ్మాయ్ ఇంట్లో కంది పప్పు అయిపోయింది. సాయంత్రం వస్తూ తెస్తావా” అని అడిగింది సరస్వతి.

“అలాగే పెద్దమ్మ గారూ” అన్న మోహిని సాయంత్రం తమ సరుకులతో పాటు సరస్వతి గారి కంది పప్పు తెచ్చింది.

రాజు.. మోహిని బయటికి వెళుతుంటే ఏదో ఒకటి తెమ్మని చెప్పటం.. తెచ్చిన వస్తువులని డబ్బు ఊసెత్తకుండా ఇంట్లోకి తీసుకెళ్ళటం అలవాటయిపోయింది ఆ దంపతులకి.

“అమ్మా ఈ రెండొందలు ఉంచు. మొన్నేవో సరుకులు, కూరలు తెచ్చావు. అంతకు ముందు మందులు తెచ్చావు. ఋణ శేషం ఉండకూడదమ్మా” అన్నది.

“అయ్యే ఖర్చు వేలల్లో. ఈవిడ ఇచ్చే ఈ డబ్బు తమకి ఇచ్చినట్టా? ఇవ్వనట్టా?” అనుకుంది మోహిని స్వగతంగా.

***

“నాయనా రాజూ మా వాళ్ళమ్మాయి యాదగిరిగుట్ట గుడికి వెళుతూ నన్నూ రమ్మన్నది. మీ పెదనాన్నగారికి మోకాళ్ళ నొప్పులు నడవలేరు. మీకేదో సెలవుట కదా ఇవ్వాళ్ళ. కాస్త ఆయన్ని చూస్తూ ఉండు, నేను గుడికెళ్ళొస్తాను. ఒక్కదాన్నే మళ్ళీ మళ్ళీ అంత దూరం వెళ్ళలేను.. గుట్ట నరసింహ స్వామి దర్శనం చేసుకోలేను. ఏదో తెలిసిన వారితో అయితే జాగ్రత్తగా తీసుకెళ్ళి తీసుకొస్తారు” అన్నది సరస్వతి.

“అలాగే పెద్దమ్మగారూ” అన్నాడు రాజు. ఆ రోజు కలుద్దామన్న ఫ్రెండ్‌కి ఫోన్ చేసి “నాకేదో పని పడింది. ఈ రోజు రాలేను” అని చెప్పి ఇంట్లో రంగారావు గారికి కాపలా ఉండిపోయాడు.

“రాజూ దీపావళికి ఇక్కడికి రండి. మనది ఇండిపెండెంట్ హౌస్ కదా.. టపాకాయలు కాల్చుకోవటానికి బావుంటుంది” అన్నది రాజు తల్లి అన్నపూర్ణమ్మగారు.

“సరస్వతమ్మగారూ వాళ్ళు ఒక్కళ్ళే ఉంటారమ్మా. మొన్ననే ఆ పెద్దాయనకి స్టెంట్ కూడా వేశారు. ఆవిడకి ఇంకా ఆ కంగారు తగ్గలేదు. పోనీ ఈ సారికి మీరే రండి. అందరం కలిసి పండగ ఇక్కడే చేసుకుందాం” అన్నాడు రాజు.

“ఇరుగు పొరుగు అన్నాక ఆ మాత్రం సాయం చెయ్యచ్చు. తప్పు లేదు. మొన్నటికి మొన్న అర్ధరాత్రి ఎమర్జెన్సీ అయితే మనవాడే హాస్పిటల్లో చేర్చటం.. ఆపరేషన్ అయిన ఆయనకి రాత్రింబవళ్ళు సేవ చేసి ఇంటికి తీసుకు రావటంతో మనింట్లో పూజకి కూడా రాలేకపోయాడు. మీ పుట్టిన రోజుకి వాడు లేక పోవటం ఎప్పుడైనా జరిగిందా?”

“కాలికి సంకెల తగిలించుకున్నట్టు వీళ్ళు అనవసరంగా రోట్లో తల పెట్టారు. ఇప్పుడు రోకటి పోటు అనుకుంటే ఏం ప్రయోజనం!”

“అయినా వాళ్ళ అమ్మాయి బెంగుళూరులోనేగా ఉండేది. మొన్న సర్జరీ జరిగినప్పుడు కూడా ‘రాజన్నయ్య ఉన్నాడని ధైర్యం’ అని సర్జరీ అయిన మూడో రోజుకి గానీ రాలేదు. ఆ అమ్మాయిని చూసుకునే కదా వీళ్ళు కొడుకు దగ్గరకి వెళ్ళట్లేదు.”

“హార్ట్ ప్రాబ్లెం వచ్చిన తండ్రిని ఓ నెల తీసుకెళ్ళి ఆ అమ్మాయి అట్టిపెట్టుకోదా? వీళ్ళు ఉండరా? ఇతరులకి ఇబ్బంది కలిగిస్తున్నామని వీళ్ళు ఆలోచించరా? ఏదో మాట వరసకి పొరుగింట్లో వాళ్ళకి ‘మేమున్నాం లెండి. మీరు ధైర్యంగా ఉండండి’ అని వేరే దేశంలో ఉన్న వాళ్ళ పిల్లలకి చెప్పినంత మాత్రాన మరీ ఇలా వాలిపోవటమేనా” అన్నది అన్నపూర్ణమ్మగారు అసహనంగా భర్త నరసింగ రావు గారితో.

“నువ్వన్నది నిజమే కానీ నెమ్మదిగా మన వాళ్ళకే అర్ధమవుతుందిలే! అప్పుడే ప్రత్యామ్నాయం ఆలోచిస్తారు. ఈ లోపు తొందర పడకు” అన్నారు నరసింగ రావు గారు అనునయంగా, భార్యతో.

తమ కొడుకుని వదులుకోలేని అన్నపూర్ణమ్మ.. నరసింగ రావు గారు ఆ మధ్యాహ్నం రాజు దగ్గరకి వచ్చి, భోజనం చేసి “సాయంత్రం దీపాలు పెట్టాలి నాయనా” అని అసంతృప్తిగా తమ ఇంటికి బయలుదేరి వెళ్ళారు.

[మనలో కొంతమందికి ఇలాంటి అనుభవాలు ఎదురయ్యే ఉంటాయి. మారిన జీవన శైలి.. పిల్లలు దూరదేశాల్లో ఉండటం.. ఉమ్మడి కుటుంబాలు అంతరించిపోవటం ఈ సమస్యకి కొంతవరకు కారణమైతే.. సహాయం చెయ్యటానికి ముందుకొచ్చినవారిని అపరిమితంగా వాడుకుంటూ వారిని విసిగించటం మరి కొంత!

ఇక డబ్బు విషయంలో కొందరు విచిత్రమైన లోభత్వాన్ని ప్రదర్శిస్తారు. ఎదుటి వారు మొహమాటస్థులైతే ఇక చెప్పక్కరలేదు.

ఇలాంటి మానవ దౌర్బల్యాలని ప్రయత్న పూర్వకంగా ఎవరికి వారు స్వయంగా తగ్గించుకుంటే తప్ప.. సహాయం చేసేవారు ముందుకి రాకపోయే ప్రమాదముంది]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here