చరణం అందని పల్లవి
[dropcap]మ[/dropcap]హానగరంలో అందరూ శ్రీమంతులే నివసించే ప్రాంతంలో ఓ చిన్న కొండ మీద వెలసిన అత్యంత అధునాతమైన సౌధోపరి భాగంపై నిలబడి చుట్టూ ఉన్న రమణీయమైన ప్రకృతిని చూస్తున్నాను. తెలతెలవారుతోంది. వేల వేల కిరణాల వెలుగు హస్తాలను చాచి చిమ్మచీకట్లను చెరిపేసుకుంటూ వస్తున్న బాల భాస్కరునికి, పక్షులు తమ కిలకిలరావాలతో మంగళగీతాలను వినిపిస్తున్నయి. జాగృతమవుతున్న పరిసరాలు మంచుతెరల మేలిముసుగును లాగేస్తున్నాయి. చల్లనిగాలి కన్నతల్లి పలకరింపులాగా హాయిగా సృజిస్తోంది. ఉదయం పూట కనిపించే ఈ అందమైన దృశ్యాన్ని చూడడం అంటే నాకెంతో ఇష్టం.
దూరంగా గేటు దగ్గర కుక్క అరుస్తోంది. వాచ్‍మన్ యాదగిరి కూడా అరుస్తున్నాడు. ఏదో జరిగి ఉంటుంది.
నేను లోపలికి వెళ్ళి స్నానం చేసి వార్డ్‌రోబ్‍లో వేలాడుతున్న వందల చీరల్లోనుంచి ఒకదాన్ని తీసుకుని కట్టుకుని, డ్రెస్సింగ్ మిర్రర్ ముందు నిలబడి తల దువ్వుకుంటూ ఉండగా ఫోన్ మోగింది. నిద్ర పోతూనే, కళ్ళు తెరవకుండానే, ఆయన ఫోన్‍లో మాట్లాడాడు.
గబగబా లేచి అయిదు నిముషాల్లో తయారై కింద హాల్లోకి వచ్చి ఎవరెవరితోనో ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాడు. అప్పటికి డ్రైవరు సిద్ధంగా ఉన్నాడు.
“అయ్యా, మారుతి కారు రాత్రి దేనికో తగిలినట్లుందయ్యా, ముందు వైపు కొద్దిగా సొట్ట పోయింది” అని చెప్పాడు డ్రైవరు.
ఇంకో కారు తీయమన్నాడు. ఆయన హోదాకు, స్టేటస్‌కూ విలువనిచ్చే మనిషి. ప్రతిదీ అందంగా, నీట్‍గా ఉండాలి.
ఎనిమిది గంటల కల్లా కారులో ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇంకెప్పుడో రాత్రి పన్నెండు గంటలకు ఇంటికొస్తాడు. అప్పటిదాకా, నేను ఈ కోట లాంటి భవనానికి అధిపతిని. ఈ ఏకాంత సామ్రాజ్యానికి మహారాణిని. అందుకే మా బంధువులంతా అంటుంటారు – నేను అదృష్టవంతురాలిని అని.
అప్పట్లో బంగారు నగలు లేకపోయినా, బంగారు రంగులో మెరిసిపోయే మేనిచ్ఛాయను ఇచ్చినందుకు, సిరిసంపదలు లేకపోయినా యవ్వన వనంలోని సౌందర్యాన్ని అంతటినీ రాశి పోసి ఇచ్చినందుకు, భక్తితో, అనురక్తితో దేవునికి వినమ్రంగా పూజలు, పునస్కారాలు చేసేదాన్ని.
అమితమైన భక్తి శ్రద్ధలతో మొక్కినందుకే కాబోలు దేవుడు ప్రసన్నుడై నాకీ సంబంధాన్ని కుదిర్చాడు. కాంట్రాక్టరు కనకరాజుకు ద్వితీయ కళత్రంగా నేను ఈ భవంతిలో అడుగుపెట్టినప్పుడు, నా అంత అదృష్టవంతురాలు లేదని అందరూ అన్నారు.
మొదటి భార్య చనిపోయిందని తెల్సు గానీ, ఎలా చనిపోయిందీ, ఎందుకు చనిపోయిందీ కూడా తెలియదు. ఎవరూ ఎన్నడూ చెప్పలేదు.
మావాళ్ళు ఈయన భోగభాగ్యాలను చూసి సంతోషిస్తే, ఈయన నా శారీరక సౌందర్యాన్ని చూసి సంతోషించారు. మా పెళ్ళి జరిగిపోయింది. క్రమంగా ఒక్కొక్క విషయమే అర్థమైంది.
విశాలమైన హాలు, రంగురంగుల కార్పెట్‍లు, సోఫాలు, ఇన్‍డోర్ ప్లాంట్ల్స్, అక్వేరియమ్‍లు, నాలుగు మూలలా నిలువెత్తు పాలరాతి బొమ్మలూ, ఆ పాలరాతి బొమ్మల మధ్య నిర్లిప్తంగా తిరుగుతుండే ప్రాణమున్న బంగారు బొమ్మను నేను.
మేడ మీద సువిశాలమైన పడకగదిలో యూఫోం పరుపు మీద పడుకొని ఈ వివాహం వల్ల ఏం పొందానో, ఏం పోగొట్టుకున్నానో తీరికగా ఆలోచించుకుంటాను. కుక్కపిల్లను పక్కన పెట్టుకుని ప్రేమగా నిమురుతుంటాను.
కారులూ, మేడలూ, ఆస్తులూ, నగలూ అన్నీ ఉన్నాయి. ఎన్ని ఉన్నా, చుట్టూ అలముకున్న భయంకరమైన నిశ్శబ్దం, ఎడతెగని ఒంటరితనం భయపెడుతుంటాయి. ఎప్పుడో నిద్దటి కళ్ళతో లేచి ఊరు మీద పడిన మనిషి, అర్ధరాత్రి దాటాకా మత్తులో తూలుకుంటూ వచ్చి పరుపుల మీద పడి గురక పెడతాడు.
పగటిపూట గుండెలు మండుతున్నప్పుడు మండే ఎండ వస్తుంది. రాత్రి పూట దిగులుతో కృశించిపోతున్నప్పుడు దశమినాటి వెన్నెల వస్తుంది. ఈ కొండకూ, కోటకూ నేను నిరంతరం కళ్ళింత చేసుకుని కాపలా కాస్తుంటాను – గేటు దగ్గర వాచ్‌మన్, సౌధోపరి భాగంలో నేనూ..
వాచ్‌మన్ భార్య రాములమ్మ నాకన్నా ఎన్నో రెట్లు నయం. మొగుడు ఇరవై నాలుగు గంటలూ కళ్ళ ఎదుటనే ఉంటాడు. ఔట్ హౌస్‍లో ఇద్దరూ ఒద్దికగా తిరుగుతుంటారు. వండుకున్నదేదో పంచుకుని తింటుంటారు. ఒకరి కౌగిలిలో మరొకరు ఒరిగి నిద్రపోతుంటారు. వాళ్ళు ఒకరిని విడిచి ఒంకొకరు క్షణమైనా ఉండరు. అనుకూల దాంపత్యానికి అంతకన్నా ఇంకేం కావాలి?
నేను కాలేజీలో చదివే రోజుల్లో కృష్ణమోహన్ పరిచయమైనాడు. అభిప్రాయాలూ, ప్రాయాలూ కల్సినందున స్నేహం ఏర్పడింది. సాన్నిహిత్యం ఇద్దరినీ మరింత చేరువ చేసింది. చెట్టాపట్టాలుగా సాగర తీరాల వెంట విహరించాం. వీధి దీపాల క్రింద క్రీనీడల్లా తిరిగాం. ఒకరి హృదయంలో మరొకరు తిష్ట వేసుకుని కూర్చున్నాం. కానీ ఈ సభ్య సమాజం ఎప్పుడూ ప్రేమికుల పట్ల అసభ్యంగానే ప్రవర్తించింది. ఏనాడూ ఎవరి ప్రేమనూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించలేదు.
మా ఇంట్లో వాళ్ళు నన్ను గృహ నిర్బంధంలో పెట్టారు. గడప దాటితే కాళ్లు విరిచేస్తామని అన్నారు. ఈ అడ్డంకులన్నీ దాటుకొని, ఇంకెక్కడికైనా వెళ్ళిపోదాం రమ్మన్నాడు కృష్ణమోహన్. మబ్బుల చలువ పందిళ్ళ క్రింద లేళ్ళూ, నెమళ్ళూ యథేచ్ఛగా చరించే చోట, పారిజాత వృక్షాల పాదాల చెంత, పండుటాకుల మెరుగైన పరుపుల మీద నడిచి వెళ్దాం రమ్మన్నాడు. ఊహ బాగానే ఉంటుంది. కానీ ఈ కల నిజమవుతుందా? కాలం కాళ్ళూ చేతులు కట్టేసింది. అధైర్యం ముందుకు సాగనివ్వలేదు. మావాళ్లు నిఘా కట్టుదిట్టం చేశారు.
అప్పుడు అర్థమైంది, మనం కేవలం మన కోసమే బ్రతకటం లేదు. మన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం బ్రతుకుతున్నాం – అని.
అది పిరికితనం కావచ్చు, తలరాత కావచ్చు, ఏదైతేనేం? కాంట్రాక్టరు కనకరాజు ద్వితీయ కళత్రంగా మిగిలిపోయాను.
ప్రేమించిన వ్యక్తిని పెళ్ళి చేసుకోలేకపోవటం ఒక శిక్ష. ప్రేమించని వాడితో జీవితాంతం కల్సి బ్రతకాల్సి రావటం ఉరిశిక్ష.
నేను శిక్షనూ, ఉరిశిక్షనూ అనుభవిస్తున్నాను.
అసలు కథ ఇంతటితో అయిపోలేదు. ఇక్కడే మొదలైంది.
ఒక శ్రీమంతుడికి నన్ను కట్టబెడితే, ఆయన వల్ల నాకూ, నన్ను కన్నందుకు వల్ల నా వల్ల వాళ్ళకూ – దరిద్రం తీరుతుందని మావాళ్ళు ఆలోచించారు. వాళ్ళ ఆలోచన కొంత వరకే ఫలించింది. వాళ్ళ వ్యాపార ధోరణి నాకే నచ్చలేదు. అందుచేత ఇంక మా వాళ్ళను దగ్గరకు చేరనివ్వలేదు. అవసరం తీరిపోయింది గనకనూ, నా వాళ్ళు అనేవాళ్ళు ఇంకెవరూ నాకు మిగలనివ్వకూడదన్న దురుద్దేశంతోనూ, ఆయన వాళ్ళను గేటు లోపలికి కూడా రానివ్వలేదు. ఒక రకంగా తరిమికొట్టాడు.
మావాళ్ళు ఒకరకంగా నా ద్వారా సొమ్ము చేసుకుందామని చూశారు. ఈయన ఇంకొక రకంగా నా ద్వారా సొమ్ము చేసుకుందామని చూస్తున్నాడు. ఈ విషయాలన్నీ ఒక్కొక్కటిగా అర్థమైన కొద్దీ, నేను ఒక ప్రాణమున్న ప్రతిమలాగా మారిపోయాను. నిర్జీవంగా తిరుగుతూ, నా మనసులోని విషయాన్ని ఆయనకు అర్థమయ్యేలా చేస్తున్నాను. కానీ ఆయన ఈ చిన్న చిన్న విషయాలకు వేటికీ స్పందించే స్థితిలో లేడు.
ఆయనకు కాంట్రాక్టులు కావాలి. అంటే అధికారంలో నున్న వాళ్ళతో కాంటాక్ట్‌లు కావాలి. ఈ కాంట్రాక్టుల కోసం, కాంటాక్ట్‌ల కోసమే ఆయన రోజంతా క్షణం తీరిక లేకుండా తిరుగుతుంటాడు.
రోజూ రాత్రి కాగానే ఎక్కడో ఒక చోట చేరుతారు. పార్టీలు చేసుకుంటారు. ఆ పార్టీలకు నన్నూ తీసుకెళ్తాడు. అక్కడికి వచ్చిన ప్రముఖులందరికీ నన్ను పరిచయం చేస్తాడు. వాళ్ళంతా నన్ను నమిలి మింగేసేలాగా, చూపులతోనే ఒళ్ళంతా తడిమి చూస్తుంటారు. నాకు నిలువునా దహించుకుపోతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఆ మనుషుల మధ్యకు నన్ను తీసుకువెళ్ళద్దని ఎన్నిసార్లు చెప్పినా ఆయనకు వినిపించదు.
ఒకరోజు ఎవరో ఇంజనీర్‍ను ఇంటికి తీసుకొచ్చాడు. రాత్రి పది గంటల వరకూ తాగుతూ కూర్చున్నారు. నేను నెమ్మదిగా వాళ్ళ ముందు నుంచి జారుకొని బెడ్ రూమ్ లోకి వెళ్ళి పడుకున్నాను. ఆ సమయంలో ఇంట్లో ఉన్న అతిథిని వదిలి ఆయన ఎక్కడికో వెళ్ళాడు. ఆ తాగుబోతు వెధవ ఏకంగా పడకగదిలోకే వచ్చి నిద్దర పోతున్న నా మీద చెయ్యి వేశాడు. త్రాచుపాము మీద పడినట్లు ఉలిక్కిపడి లేచాను. సినిమాల్లో విలన్ లాగా మీద పడబోయాడు. చెంప పగలకొట్టాను.
నిజానికి పరాయి మగవాడు భార్య మీద దురుద్దేశంతో చెయ్యి వేసినందుకు, ఇంకెవరన్నాయితే, ఆ మనిషిని అక్కడే నిలువునా చీరేసేవాడు.
నా భర్త విషయం వేరు. ఆయన నన్ను కొట్టాడు. “దరిద్రపు మొహమా, నీ మూలంగా వెయ్యి కోట్ల కాంట్రాక్ట్ చెయ్యి జారిపోయిందే, ముదనష్టపు దానా” అంటూ విరుచుకుపడ్డాడు.
భర్త అన్న గౌరవం ఏనాడూ లేదు. నలుగురి కోసం ఆయన భార్యగా నటించేదాన్ని. ఇప్పుడు గౌరవం లేకపోగా మనిషి మీద అసహ్యం కలుగుతోంది.
నేను నా అలోచనల్లోంచి తేరుకునే లోపల రాములమ్మ వచ్చి ఇల్లు తుడుస్తోంది.
“ఏమిటే, పొద్దున్నే నీ మొగుడు ఎందుకో అరుస్తున్నాడు?” అని అడిగాను.
“అదేనండమ్మా, పక్కింట్లో పని చేసే బాలయ్య గాడు లేడా? వాడు నన్ను చూసి ఈల వేశాడమ్మా. అందుకని నా మొగుడు బూతులు తిట్టాడమ్మా. ఈరోజుల్లో మెత్తగా ఉంటే, లాబం లేదమ్మా. ఎదురు తిరిగి నోరు చేసుకుంటే గాని ఊరుకోరమ్మా, ఎదవ సచ్చినోళ్ళు” అన్నది రాములమ్మ.
అందరూ నన్ను అదృష్టవంతురాలినని అంటారు గానీ, రాములమ్మ నా కన్నా ఎన్నో రెట్లు అదృష్టవంతురాలు.
సాయంత్రం ఆరు గంటలకు ఆయన ఫోన్ చేశాడు. “పార్టీ ఉంది, కారు పంపిస్తున్నాను” అంటూ రమ్మన్నాడు.
వెళితే ఏం జరుగుతుందో తెలుసు. వెళ్ళకపోతే ఏం జరుగుతుందో కూడా తెల్సు. మొన్న కొట్టిన దెబ్బలు మర్చిపోలేదు. అన్నిటికీ సిద్ధపడే వెళ్ళాను. పెంపుడు జంతువుకు స్వంతంగా ఇష్టాఇష్టాలు అంటూ ఉండవు.
పార్టీకి వెళ్ళాను. ఎక్కువ మంది లేరు. ముగ్గురే ఉన్నారు. ముగ్గురూ అప్పటికే మంచి పట్టులో ఉన్నారు. వాళ్ళల్లో కృష్ణమోహన్ కూడా ఉండడం చూసి నేను షాక్ తిన్నాను. నన్ను చూసిన వెంటనే కృష్ణమోహన్‍కు మత్తు దిగినట్లు కనిపించాడు.
వాళ్ళు ఏవో కాంట్రాక్టులు, కమీషన్లు, షేర్లు గురించి మాట్లాడుకుంటున్నారు. ఉన్నట్టుండి పక్కన కూర్చున్న వాడెవడో ఎవరికీ కనిపించకుండా భుజం మీద చెయ్యి వేశాడు. భర్త ఎదురుగానే ఉన్నాడు. నిండు సభలో పాంచాలికి అవమానం జరిగింది. భర్తలు అరివీర భయంకరులై ఉండీ, చేష్టలు ఉడిగి చూస్తున్న సన్నివేశం నాకు గుర్తుకొచ్చింది – వాళ్ళతో పోలిక లేకపోయినా.
నేను నెమ్మదిగా లేచి వెళ్ళి పిట్టగోడ దగ్గర నిలబడి బయటకు చీకట్లోకి చూస్తున్నాను.
వాళ్ళు తాగటం అయినట్లుంది. భోజనాలకు లేచారు. చెయ్యి కడుక్కునే నెపంతో కృష్ణమోహన్ నా దగ్గరకు వచ్చాడు.
“బావున్నావా అని అడిగాల్సిన పని లేదనుకుంటాను. నువ్వు గొప్పదానివి అయినందుకు సంతోషం. కనకరాజుకు వందల, వేల కోట్ల కాంట్రాక్టులన్నీ నీవల్లనే వస్తున్నాయని విన్నాను” అనేసి ఏమీ ఎరగనట్లు, నేనెవరో తెలియనట్లు వెళ్ళిపోయాడు.
నాకు పెద్దగా ఎలుగెత్తి బావురుమని ఏడవాలని పించింది. ఈ లోకం నా గురించి ఏమనుకున్నా ఫరవాలేదు. కానీ నన్ను వలచి, వలపింప చేసుకున్న కృష్ణమోహన్ ఇలా మాట్లాడితే, విని తట్టుకోవటం నా వల్ల కాలేదు. మేడ మీద నుంచి దూకి చావాలనుకున్న బలమైన ఫీలింగ్‍ను బలవంతాన ఆపుకున్నాను.
ఇంటికి బయల్దేరాం. కారులో మధ్యలో నేను. ఇటువైపు ఆయన. అటువైపు ఇంకెవడో. కారు వెళ్తోంది. పక్కనున్న వాడి చెయ్యి ఊరుకోవటం లేదు. ఎక్కడెక్కడో తడుముతున్నాడు. ఒళ్ళంతా తేళ్ళూ జెర్రులూ పాకినట్లు ఒకటే గగుర్పాటు.
ఆ రాత్రి నాకూ, కనకరాజుకీ పెద్ద యుద్ధం జరిగింది. జరగరానిది జరిగిపోయింది. మర్నాడు పోలీసులు వచ్చారు. భర్తను హత్య చేసినందుకు నన్ను జైల్లో ఉంచారు.
జైలు నాకు కొత్త ఏమీ కాదు. ఈ కొత్త జైలు బావుంది – ఆ పాలరాతి మేడ కన్నా.
ఇంతకీ జీవితం అంటే ఏమిటీ? కొండత కష్టం, రవ్వంత సుఖం. ఒక వంతు నిద్రా, మూడు వంతుల మెలకువ. అందులో మళ్ళీ మూడు వంతులు వెరపు, ఒక వంతు మరపు.
గుప్పెడు ఆశ. గంపెడు నిరాశ.
జీవన రాగంలో కొందరికి అంతే. చరణం అందని పల్లవి.